అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-6

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఈమని శివనాగిరెడ్డి 98485 98446

అడుగుజాడలూ ఆనవాళ్లు-6

విప్పర్ల - చేజర్ల యాత్ర

ఎప్పట్నించో అనుకుంటున్నట్లుగా విప్పర్ల వెళ్లాలని ఒకపక్క కాదు చేజర్ల వెళదామని మరోపక్క - ఇవేవీ కాదు, మాచర్ల వెళదామని మూడోపక్క- ఇలానా మనసు నిలకడ తప్పింది. రేనాటి చోళవంశీయుడైన ఎరికల్‌ముతురాజు ధనుంజయుడు కలమళ్లలో క్రీ.శ. 575వ సం॥లో తొలిసారిగా ఒక తెలుగు శాసనాన్ని వేయించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు 75ఏళ్ల తరువాత, వేంగీచాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జవిష్ణువర్ధనుని కుమారుడు, మొదటి జయసింహుడు క్రీ.శ 649వ సం॥లో విప్పర్లలో ఒక తెలుగు శాసనాన్ని వేయించి, శాసన పరిశోధకులు, చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాడు. సంస్కృతభాషా తుపాను తాకిడికి విలవిలలాడుతున్న తెలుగు భాషకు ఊపిరులూదిన జయసింహుని శాసనాన్ని తడిమి మొక్కాలనిపించింది. అది బలమైన కోరికగామారి, తీరికలేకపోయినా, మాచర్ల చేజర్లలను పక్కనబెట్టి, విప్పర్లవెళ్లటమే మేలనిపించింది. ఒకవారంపాటు ఆగింతర్వాతగాని ఈ ప్రయాణం కుదిరి, నా మనసు కుదుటపడింది. పల్నాటివైపు అడుగుపడింది.

ఎలాగైనా ప్రియుణ్జి కలుసుకోవాల్సిందేనని నిశ్చయించుకొన్న ఓ ప్రేయసి, గండుమీనులున్న గంగానదిని దాటటానికి, ఆహారపు ముద్దల్ని సవ్యసాచిలా విసురుతుంటే చేపలు ఉబలాటంతో అటూఇటూ మళ్లగా చాకచక్యంగా నదిని దాటిన ఆ విరహోత్మంఠలా, నేను నాపనుల్ని పక్కనబెట్టి, పయనంకట్టి, పల్నాటిబాట పట్టాను. మామూలుగానే తెల్లవారురూమున బయలుదేరిన నేను నర్సరావుపేట, నకరికల్లుమీదుగా విప్పర్ల అడ్డరోడ్డు చేరుకొనే సరికి సరిగ్గా ఉదయం ఆరైంది. అప్పుడప్పుడే తెల్లవారుతుంది.


అడ్డరోడ్డు మీద అలికిడి పుంజుకుంది. కారులో నన్ను తీసుకొచ్చిన, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్‌, ఇక్కడ టీతాగి పోదామన్నాడు. అప్పటిదాకా కార్లో కాళ్లుమడుచుకొని కూర్చున్న నాకాళ్లు సంకెళ్లు తెంచుకాన్నంత ఆనందంతో ఉప్పొంగి పోయాయి. టీ తాగి బయలుదేరామోలేదో, విప్పర్ల చేరుకొన్నాం. కొత్తగా నిర్మించుకొన్న ఆనందంలో మునిగిపోతున్న శ్రీనివాస్‌గారితో కొత్తదనం పేరిట చరిత్రను చెరిపేస్తున్నామని వాఫోయాను. తెలుగుభాషాచరిత్ర గ్రంథాలన్నిటిలో చోటుదక్కించుకొన్న విప్పర్తి ముఖచిత్రం మసకబారిందన్న నా బాధనువెళ్లగక్మాను. మావూరికి అంతచరిత్ర ఉందా అనిఅడిగాడు శ్రీనివాస్‌ అమాయకంగా. నాతోపాటు ఆయన్ను చెరువుకట్టపైకి తీసుకెళ్లి తూర్పు చాళుక్య మొదటి జయసింహుని శాసనాన్ని చూపించాలనుకొన్న శాసనం దొరకలేదు. కొద్దిదూరంలో వక్షస్థలం వరకూ కూరుకుపోయిన క్రీ.శ.9వ శతాబ్ధి శిల్పాన్ని చూపించాను.

చెరువు కట్డ దిగి కొత్తగా కట్టుకాన్న గుళ్లదగ్గరకెళ్ళి, పడమరవైపు కాంపౌండుగోడకు ఆనించి వాలుగా నిలబెట్టిన జయసింహుని శాసనాన్ని చూచి ఊపిరిపీల్చుకున్నాను. ఆశాసన పలకను పట్టుకొని అక్షరాల్ని ఆలింగనం చేసుకొన్నాను. ఈ శాసనంలోని తెలుగు పదాల్ని నా పెదవులపై పలికించుకొన్నాను. తెలుగుభాషకు పట్టంగట్టిన జయసింహునికి చేతులెత్తిమొక్కాను. ఎక్కడో, కర్ణాటక రాష్ట్రంనుంచివచ్చిన అతని తండ్రి కుబ్జవర్జనుడు ఇక్కడే స్థిరపడి, స్థానిక ప్రజల మన్ననలు పొందగా, ఆయన కుమారుడైన జయసింహుడు మరో అడుగుముందుకేసి, తన అమ్మనుడి కన్నడభాషను, సామాన్య ప్రజలకు తెలియకపోయినా, దేశమంతటా రాజ్యమేలుతున్న సంస్కృత భాషను పక్కనబెట్టి, తెలుగుభాషకు పట్టంగట్టిన తీరును వివరిస్తుంటే- శ్రీనివాస్‌ విస్తుబోయాడు. ఈ శాసనంలో సంవత్సరంబుళ్‌, ఎడుంబొది(ఎనిమిది), పుణ్జమనాణ్డు (పున్నమినాడు) పులోంబున(పొలాన) ఆడ్డపట్టుసేను (వడ్డు పండే భూమి) తాళుతోంటి (తాటితోపు) పాఱపడువారము (పండుగకు బ్రాహ్మణులకిచ్చే కానుక) యిఱకారు (రెండు కార్ల పంట) విత్పర్తి గాణంబు (విష్పర్తిపొాలం) కవుల ఆయం......... (పొలాన్ని కవులుకివ్వగా వచ్చే ఆదాయంతో)పాఱ (బ్రాహ్మణుడు) అన్న అచ్చతెలుగు పదాల్ని వినిపిస్తుంటే శ్రీనివాస్‌ కళ్లల్లో కాంతులు వెల్లివిరిచి వళ్లంతా పులకింతకు గురికావటం చూచి ఆనందించాను.


యుద్దభూమిలో రెక్కలుతెగిపడిపోయిన యోధుల్లా, అక్కడే ఉన్న మరోమూడు శాసనాలు పట్టించుకొనే


వాళ్లకోసం పరితవిస్తున్నాయి. ఒకటి క్రి.శ. 1074 నాటి తూర్పుచాళుక్య విష్ణువర్ధన మహారాజుల శాసనం, రెండోది క్రీ.శ 1125 నాటి మహామండలేశ్వర కీర్తిరాజు మల్లిదేవచోడమహారాజు శాసనం, మూడొది క్రీ.శ 1264 నాటి మహామండలేశ్వర అల్లాడ పెమ్మయ దేవమహారాజుల శాసనం. ఆ శాసనాలను చూస్తున్నంత సేవు తాతముత్తాతలను చూస్తున్నంత ముచ్చట పడిపోయాను. విప్పర్తిని, విత్సత్తి, _ విత్పత్తి, పెదవిప్పత్తి అని పిలిచేవారని, ఆలయంలోని శివుణ్ణి మహామల్లేశ్వరుడ నేవారని, శ్రీనివాస్‌కు వివరించాను. శాసనాల్లో పాఱ అన్న శబ్దం బ్రాహ్మణులను సూచిస్తుందని, కడపజిల్లా కొర్రపాడు, రామాపురం (క్రీ.శ. 8వ శతాబ్టి) క్రీ.శ. 10వ శతాబ్దినాటి అరకటవేముల శాసనాల్లో కూడా కనిపిస్తుందని చెప్పాను. అంతేకాదు ఈనాడు మనం రాయబారిగా పిలుచుకొంటున్న పదానికి రాయపాఱ అన్న పదం మూలమని, అనగా, ఒకరాజు మరో రాజుకు తన ప్రతినిధిగా పంపే పాఱ (బ్రాహ్మణుడు) ను రాయపాఱ అని పిలిచేవారని చెప్పాను.

విప్పర్లలోని క్రీ.శ1195 నాటి శాసనంలోని మల్లిదేవచోళమహారాజు ప్రస్తుత ప్రకాశంజిల్లా కొణిదెన నుంచి పాలించాడు. అతడు ఇక్కడి మల్లేశ్వరస్వామి దేవాలయంలో పుణ్యక్షేతాల సందర్శకులకోసం ఒక చలివేంద్రాన్ని రోజూ వెయ్యమందికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆకాలంలో విప్పర్ల ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ఎంతగా వెలుగొందిందో తెలుస్తుంది. ఇక తూర్పుచాళుక్యుల కాలపు ఈ శివాలయం లింగంపైన “శివశివ " అన్న క్రీ.శ.8 వ శతాబ్ధి తెలుగు-కన్నడ అక్షరాలున్నాయి.. చండి, వినాయక, మహిషాసురమర్దిని, భైరవ శిల్పాలు వేంగీచాళుక్య శిల్చకళకు అద్దంపడుకున్నాయి. పల్లవ బాదామీ చాళుక్య (రెండోపులకేశికొప్పరం) శాసనాల్లో కూడా విప్పర్ల ను విఱిపఱగా పేర్మాన్న సంగతి విని- శ్రీనివాస్‌ మురిసిపోయాడు. నేలమీద పడుకోబెట్టిన, గోడకు ఏటవాలుగా అనించిపెట్టిన వెయ్యేళ్లకుపైగా చరిత్రగల శాసనాలు, శిల్పాలను పీఠాలపై నిలబెట్టి, వాటి వివరాలు రాసిన పేరు పలకల్ని ఏర్పాటుచేయమని శ్రీనివాస్‌కు చెప్పాను. తరువాత శాసనాల్లో పేర్మొన్న మ్లావిండ్ల చెరువును ఒకసారి కలియజూచి, కట్టమీద చండికను పైకిలేపమని చెప్పి, విప్పర్ల, రెడ్డిపాలెం మీదుగా చేజర్లకు బయలుదేరాం.

చేజర్లకు వెళుతూ కుంకలగుంట చేరిన మమ్మల్ని బాపతు సత్యనారాయణ రెడ్డిగారు వాళ్లింటికి ఆహ్వానించి, అతిథి మర్యాదల నందించారు. ఆయనే స్వయంగా, కుంకలగుంటలో పునర్నిర్మించబడిన వీరభద్రాలయం, ఖోగేశ్వర, కేదారేశ్వర, చెన్నకేశవాలయాల్ని చూపించారు. భొగేశ్వరాలయంలోని క్రీ.శ. 1347నాటి కొండవీటి ప్రోలయ వేమారెడ్డి శాసనంలో, క్రుంకలకుంటలోని వల్లభేశ్వరుని ఉపహారాలకు, గుడ్డపల్లి, ముప్పాళ్ల చెరువులక్రింద ఇచ్చిన భూముల వివరాలు, పూజారుల పేర్లను ఒకసారి జ్ఞాపకం చేసుకొన్నాను. స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయంలోని క్రీ.శ. 1275 నాటి కాకతీయ రుద్రమదేవి అంగరక్షకుడు చేసిన భూదాన శాసనం, వీరభద్రాలయంలోని క్రీ.శ. 1321 నాటి కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా మోట్టపల్లి భాస్మరదేవుని మంత్రి మల్లయగారు కుంకలకుంట్ట మూలస్థాన కేదారదేవునికి భూమి, గానుగ, వీసం ధనం, పెట్టిన వివరాలున్న శాసనాలను పరిశీలించాను. చేజర్లకు బయలుదేరుతుంటే భోజనం పెట్టిన బాపతు సత్యనారాయణరెడ్డి గారు నన్నొక ప్రశ్నవేశారు. మావూరు పేరు కుంకలగుంటకు అర్ధం చెబుతారా అని. క్రుంకలగుంట/కుంకలగుంట అంటే క్రుంక =మునుగు అని, కుంక =బాలవితంతువని శబ్ధరత్నాకరంలో ఉందనీ, బహుశా, చేజర్ల పుణ్యక్షేత్రాన్ని సందర్శించటానికి వెళ్లేవాళ్లు ఇక్కడున్న గుంటలో మునిగి పవిత్రస్నానమాచరించే వారేమోననీ ఒక వివరణ ఇచ్చాను. మరో అర్ధం ప్రకారం, బాలవితంతువు లెక్కువగా ఉన్న వూరుగానీ, లేక బాలవితంతువుల పునరావాస కేంద్రంగానీ, ఆరోజుల్లో ఉండి ఉండవచ్చన్న రెండో వివరణ కూడా ఇచ్చాను. ఆయన ఎందుకో మొదటి వివరణవైపే మొగ్గుచూపాడు. ఇక నేను శ్రీనివాస్‌తో కలిసి చేజర్లకు పయనమైనాను.

గుంటూరుజిల్లాలో మంచికల్లు, గురజాల, గోలి, కంభంపాడు, కోటనెమలిపురం లాంటి బౌద్దక్షేత్రాల నడుమ శాతవాహన కాలంలో విలసిల్లిన బౌద్దారామాల సరసన చేరిన చేజర్ల ఇక్ష్వాకుల కాలంలో ఎందరో


బౌద్ధభిక్షువులకు నిలయమై, ఉపాసక, ఉపాసికల సందర్శనతో నిత్యం కళకళలాడింది. రానురాను అదరణ కోల్పోయిన బౌద్దచేజర్త, అనుకోకుండా బ్రాహ్మణీయ చేజర్లగా మారిపోయింది. 1917-18 సం॥లో,ఏ. హెచ్‌. లాంగ్‌హరిస్ట్‌, చేజర్ల పురాతన కట్టడాలను పరిశీలించి, క్రీ.శ 7వ శతాబ్ధిలో బౌద్దచైత్యాలయం, శివాలయంగా మార్చబడిందని తెలియజేశాడు. ముందున్న విజయనగర కాలపు ప్రవేశ (ద్వార) గోపురమండపంనుంచి లోనికెళ్లి కపోతేశ్వరాలయాన్ని చూశాను. ఒక్కసారి చుట్టూతిరిగొచ్చాను. ఆలయ సముదాయంలో, 78చారిత్రక ఆనవాళ్లున్నాయి.

వీటిలో 25 దేవాలయాలు, 26లింగపీఠాలు, 4 నాగస్థంభాలు, 18చిన్నరాతి శిల్పాలు, 5 శాసన స్థంభాలు,కొత్తగా బయల్పడిన 4 ఇటుకరాతి ఆలయాలు కనిపించాయి. శాసనాల్లో చేజర్ల, కందరపురమని, కపోతపురమని, కందరకపోతపురమని, చెరుంజెర్ల అని పిలువబడింది.

ఒక్కో చారిత్రక ఆనవాలూ, ఒక్కో రాజవంశాన్ని ఒక్కో రాజును, ఒక్కో సందర్భాన్ని గుర్తుకుతెస్తున్నాయి. ఇక్ష్వాకుల అనంతరం చేజర్లను రాజధానిగా జేసుకొని పాలించిన ఆనంద గోత్రిస రాజుల్లో, క్రీ.శ.310-15మధ్య పాలించిన దామోదరవర్మ శాసనాల్లో తాను బౌద్దోపాసకుణ్ణని, సంయక్సంబుద్ధస్య పాదానుద్వాతుడనని చెప్పుకొన్నాడు. శాతవాహన కాలంనాటి రెండువందల ఏళ్ల తరువాత వుంది. చేజర్ల చైత్యానికి మరమ్మత్తులు చేయించాడు. గత వైభవాన్ని పునరుద్ధరించాడు. తరువాత వచ్చిన పల్లవులు శైవంవైపు మొగ్గుజూపగా చేత్యాలయం కాస్తా కఫోతేశ్వరాలయంగా మారింది. ఒకవైవు పల్లవులూ, మరోవైపు విష్ణుకుండినులు, బౌద్దంకుత్తుకపై కత్తినుంచి, త్యాగశీలాన్ని ప్రబోధించిన శిబిజాతక మహోన్నతాశయాన్ని అపహాస్యంచేస్తూ, బౌద్దజాతక కథను స్థలపురాణంతో కప్పి, బుద్ధభగవానుని నీడలో ఈశ్వరుణ్ణి ప్రతిష్టించినవైనం నా మనసును కలచివేసింది. పరమబౌద్దుడైన అశోకుడుకూడా ఇతర మతాలను గౌరవించి సమాదరించమని తన శాసనాల్లో చెప్పుకున్నాడు. ఇక్కడ మాత్రం ఆధిపత్యధోరణికి బౌద్ధం మౌనాంగీకారాన్ని తెలపటం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆనందగోత్రినుల చివరిరోజుల్లో జాతకంమారిన చేజర్ల, విష్ణుకుండిన, తొాలీపల్లవ, తూర్పుచాళుక్య, యాదవ, కాకతీయ, రెడ్డి గజపతి, విజయనగర రాజుల కాలంలో శైవక్షేత్రంగా విరాజిల్లింది. ఆలయం వెనుక, లోపలి మరో మండపంలోనూ ప్రవేశద్వారం దగ్గర ఉన్న బౌద్దఆనవాళ్లను చూస్తూ నిర్లిప్తంగా ఉన్న నన్ను శ్రీనివాస్‌ పలకరించాడు. సార్‌ నిజంగా చేజర్ల బౌద్దక్షేత్రమా అని అడిగాడు. ఆలయంపేరు కపోతేశ్వరుడుకదా మీరు అలా అంటారేమిటన్నాడు. అతనికి జరిగిన చరిత్ర చెప్పాను. మతమార్పిడి మనకు కొత్తకాదన్నాను.

నిజమే చేజర్ల శివలింగంపేరు కపోతేశ్వరుడు. బౌద్ద జాతక కథల్లో కిరాతుని నుంచి పావురాన్ని రక్షించి తూనికలో శిబిచక్రవర్తి తన తొాడనుకోసి, పావురమంత మాంసాన్ని దానం చేయటానికి పూనుకాన్న ఇతివృత్తంగా బోధిసత్వుని త్వాగనిరతిని అనుకరిస్తూ ఈ శివాలయం రూరుదిద్దుకుంది. అయినా ఏనుగు వెనుకభాగాన్నీ గుర్తుకుతెచ్చే విధంగా నిర్మించిన చైత్యాలయం బౌద్దధమ్మవీచికలను వెదజల్లుతూనే ఉంది.ఆలయంలోపలి మహామండపంలోనున్నబౌద్ద శిలామండప స్తంభాలు, బౌద్దానికి మూలస్తంభాలైన శీల సమాధి, ప్రజ్జల్లో శీలానికి ప్రతీకలుగా ఇంకా నిలచి,బౌద్దాన్ని పూర్తిగా మార్చాలనుకున్న వారి అవివేకం పట్ల జాలిపడుకునే ఉన్నాయి.

ఆలయం వెనుక, బౌద్దారామ ఆనవాళ్లతోపాటు పల్నాటి సున్నపురాతి స్తంభం, దానిపైన ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనంలోని అందమైన అక్షరాలు, మళ్లీ ఇక్కడ బౌద్దం పల్లవిస్తుందన్న ఆశను ఊరిస్తున్నాయి. భారత వురావస్తు సంస్థ రక్షిత కట్టడాల జాబితాలో చేరిన ఈ సముదాయంలో, చాళుక్యుల నమూనా ఆలయాలు, పల్నాటి సున్నపురాతి రెండుచేతుల గణేశుడు, సూర్యుడు, రాష్ట్రంలోని మొదటిదైన వేయిలింగాల శిలాఫలకం, చాళుక్య సంప్రదాయంతో తీర్చిదిద్దిన నంది, సహజసిద్ధ మాతృత్వానికి ప్రతీకలైన సప్తమాతలు, రకరకాల శివలింగాలు, ఒకటేమిటి తరతరాల వాస్తుశిల్ప ప్రదర్శన శాలను తలపించింది- చేజర్ల.

అన్నీ బాగానే ఉన్నాయి గానీ, వంచనకుగురైన పంచశీల గుర్తుకొచ్చి చరిత్రకు జరిగిన హాని నా గుండెల్లో గునపంలా గుచ్చుకుంది.

చేజర్లలో ఇక్ష్వాకుల కాలపు ప్రాకృత శాసనంకాక, ఉన్న తొమ్మిది శాసనాల్లో తూర్పుచాళుక్యరాజైన విషమసిద్ధి క్రీ.శ. 7వ

శతాబ్ది తెలుగుశాసనం, తేదీలేని రెండు కన్షరపుర వరజనపదపతి శాసనాలు, క్రీ.శ 9వ శతాబ్ధి తెలుగుశాసనం,క్రీ.శ 1140 నాటి బఱయనాయకుని గొట్టెల దానశాసనం, క్రీ.శ. 1163, 1165, 1174 నాటి తాడూ కేతిరెడ్డి శాసనాలు, క్రీశ 1247 నాటి నాలుగు


సహస్రలింగాల శాసనాల్తో, తెలుగు భాష చరిత్రకుపకరించే రెండు శాసనాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

విజయనగర సామాట్టు శ్రీరాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీకృష్ణదేవమహారాయల ప్రసక్తిగల క్రీ.శ 1517, జూన్‌ 19 వతేదీనాటి శాసనం ఆలయ మండపందగ్గర ఉంది. 97 పంక్తులున్న ఈ తెలుగు శాసనంలో,శ్రీకృష్ణదేవరాయని రాజ్యంపై శ్రీసాళ్వతిమ్మరు సయ్యంగారు, శ్రీకపోతేశ్వరానికి చెందిన (చేజర్ల) శ్రీకరణ నమశ్రవారుల / నమశ్శివాయ గారు శ్రీకపోతేశ్వరస్వామికి ఇంకా ఇతర శివాలయాలకు ఇచ్చిన వివరాలు ఉన్నాయి.

తెలుగుశాసనమున్న దేవాలయాన్ని చూడబోతున్నామని చెబుతూ విజయవాడలో బయలుదేరి విష్పర్లకు చేరిన నాకు నిర్తక్ష్యంగా పడిఉన్న శాసనాలు నిరాశను మిగిల్చాయి. ఉన్నపళంగా మత మార్పిడికి గురైన చేజర్ల బౌద్ద ఆరామంలోని స్తంభాలు, శివాలయ మండప భారాన్ని మోస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాయి.

ఒకప్పుడు బౌద్దధర్మ నిలయాలైన చైత్య, విహార శిధిలాలు -మరో అశోకుని కోసం ఎదురుచూస్తున్నాయి. త్యాగనిరతికి, బౌద్ద ధార్మిక జెన్నత్యానికి ప్రతీక అయిన శిబిజాతకం మరో-మత ఘాతుకానికి బలైంది బౌద్దభిక్షువుల వర్షావాసాలుగా, ధ్యానం చేసి సమాధి స్థితిలో(2) నిర్వాణానందాన్ని చవిచూపించిన గుహలు, కల్పిత మేఘాల మల్లయ్య నివాసాలుగా మారిపోయాయి. ఏదిఏమైతేనేం, విప్పర్లలో తొంగి చూచిన తెలుగు, అటు తరువాత వెలుగును కోల్పోయింది. వెయ్యేళ్లపాటు వెలుగొందిన బౌద్దం నిషిద్దగీతమైందని, ఒక కొత్తమతం ప్రజల అఖిమతాన్ని కాదని, మౌడ్యాన్ని నూరిపోసింది. శాంతిని కాంక్షించిన బౌద్దం, రెక్కలు తెగిన పావురమైంది. గతాన్ని తలచుకుంటూ అనాగత్వాన్ని ఆహ్వానిస్తూ తిరుగు ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. విప్పర్ల శాసనం, చేజర్ల చైత్యాలయం నన్ను ముసురుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. చరిత్రకు, చారిత్రక ఆనవాళ్లకు మళ్లీ మంచిరోజులు రాకపోతాయా అనుకునేలోపు కంటికి కునుకు పట్టింది.