అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అక్షరాలతో ఆటలు - 1
చదువు-ఆటలు
సి.వి. క్రిష్ణయ్య 93965 14554
అక్షరాలతో ఆటలు - 1
అక్షరాలతో ఆటల్లోకి వెళ్లేముందు భాష మనిషి ఆలోచలను ఎలా ప్రభావితం చేసిందో, జ్ఞానసంపాదనకు ఎలా దోహదపడిందో, బాల్యంలో ఆటలకున్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలుసుకోవడం అవసరం. ఇక్కడ సంక్షిప్తంగా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
మెదడు - భాష - జ్ఞానం
తొలిదశలో మనిషి మెదడు ఆలోచించే ఆలోచనలకు పరిమితి ఉండేది. భాష అనే పరికరాన్ని కనుగొన్న తర్వాత మెదడు చేసే ఆలోచనలకు పరిమితి లేకుండా పోయింది. అంతులేని జ్ఞాపకాలను, అపరిమితమైన జ్ఞానాన్ని నిల్వచేసుకోడానికి వీలైంది. ఆ తర్వాత లిపి కనుగొని (తన మాటలకు భౌతిక రూపాన్నిఇచ్చి) తన ఆలోచనలను జ్ఞానాన్ని బయట దాచుకోవడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా కంప్యూటర్‌ను, అంతర్జాలాన్ని సృష్టించుకొని ప్రపంచంలోని అన్ని మెదళ్లను ఏకం చేసింది. ఈ సృష్టిలో మనిషి మెదడుకన్నా అద్భుతమైనది ఏముంది?
భాష పుట్టిన తర్వాతనే మెదడు తర్కబద్ధంగా ఆలోచించడానికి వీలైంది. సందేహం వచ్చినా, ప్రశ్న ఎదురైనా, సమస్య వచ్చినా, పరిష్మారం దొరికే వరకు మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది. అన్వేషిస్తూనే ఉంటుంది. దాని తలా తోకా పట్టుకొని ఆనందిస్తుంది.
మెదడు నేర్చుకొనే పద్ధతి
ఆలోచించడం, అర్ధంచేసుకోవడం నేర్చుకోవడం మెదడుకు శ్రమకాదు. ఆనందం. మరి బడిలో పిల్లలు ఆనందంగా ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు విసిగిపోతున్నారు? బడికి శలవులంటే ఎందుకు ఎగిరి గంతులేస్తున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు అత్మహత్యలు చేసుకొంటున్నారు?
నేర్చుకోడానికి మెదడుకు ఒక సహజమైన పద్ధతి ఉంది.మెదడు స్వేచ్చాపూరిత వాతావరణంలో భయం లేకుండా ఎలాంటి వత్తిడి లేకుండా, ఇష్టమైన విషయం ఇష్టమొచ్చినపుడు నేర్చుకోవడమే జీవితం.
బడిలో పరిస్ఠితి ఇలా ఉండదు. ఈ క్షణంలో ఇది నేర్చుకోవాలనే నియమం ఉంటుంది. ఆజ్ఞ ఉంటుంది. నిర్భంథం ఉంటుంది. మెదడు దీన్ని అంగీకరించదు. ప్రతిఘటిస్తుంది. నేర్చుకోవాడాన్ని పక్కనబెట్టి నేర్చుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. స్వేచ్చకోసం పోరాటం మొదలుపెడుతుంది. ఇదంతా మనస్సులో జరిగే సంఘర్షణ. తమలోపల జరుగుతున్న సంఘర్షణ పిల్లలకు అర్ధంగాదు. పాపం పిల్లలు నేర్చుకోలేకపోతున్నామని బాధపడ్తారు. బలవంతంగా శరీరంతో పనిచేయించగలంగాని మెదడుతో పని చేయించలేం. గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకొని వెళ్లగలంకాని, నీళ్లు తాగించలేం.
బడిలో ఈ అశాస్త్రీయ పద్దతులు ఎప్పుడు ప్రారంభమయ్యాయో అప్పటి నుండి నేర్చుకోలేకపోవడం,'ఫెయిల్‌గావడం, నిరాసక్తంగా తయారుగావడం అనే మానసిక జబ్బులు మనిషి మెదడులో ప్రవేశించాయి.
బాల్యం - ఆటలు
బాల్యంలో ప్రతీ పని ఆటలాగే ఉంటుంది. లేచినిలబడి నడవడం పరుగులుదీయడం కూడా ఆటలే. చివరకు దొంగిలించడం, దాచిపెట్టుకోవడం, అబద్దాలు ఆడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్నేహం, శత్రుత్వం సర్వం వారికి ఆటల్లా తమాషాలుగా ఉంటాయి. అందుకే పిల్లల తగువులను, కొట్టుకోవడాన్ని తగువులాటలు, కోట్లాటలు అన్నారు.
ఆటల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎంతో మెలకువతో ఉండాలి. అంటే వేగంగా శరీర అవయవాలు స్పందించి పనిచేయాలి. మెదడుకు శరీరావయవాలను అనుసంధానం చేసే నాడీవ్యవస్థ మరింత చురుగ్గా ఉండాలి. ఇదంతా బాల్యంలో ఆటలవల్లే సాధ్యమవుతుంది. ఆటల్లో అనేక నియమాలు ఉంటాయి.జయాపజయాలుంటాయి. ఇవన్నీ భావిజీవితానికి శిక్షణలాంటివి.
ఆటలు జీవనోపాధీకో, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికో, పోటీ పందేలలో పాల్గొనడానికో కాదు. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా చురుగ్గా ఉండడానికి. జీవిత పోరాటానికి కావలసిన శక్తిసామర్థ్యాలు సమకూర్చుకోడానికి. తల్లిదండ్రులూ టీచర్లూ ఈ విషయం గ్రహించాలి.
ఈ ఆటలు రెండు రకాలుగా ఉంటాయి. 1.శారీరక క్రీడలు. 2. మేధో (క్రీడలు. మేధో క్రీడలు రెండురకాలు. విజ్ఞాన సంబంధ విషయాలకు సంబంధించినవి. 2.భాషాక్రీడలు. ప్రస్తుతం మనం భాషాక్రీడలకు పరిమితం అవుదాం.
భాషాక్రీడలు
భాషాక్రీడలు అంటే ఏమిటి?
ఒక్కమాటలో చెప్పాలంటే భాషతో ఆనందించడం. అక్షరాలతో, పదాలతో, వాక్యాలతో, భావాలతో, భావోద్రేకాలతో ఆనందించడం. దీన్నే భాషా సాహిత్యాలు అంటున్నాం. పాట, పద్యం, సంగీతం, కవిత్వం, కథ నాటిక, నవల, సినిమా, టీవీ, జోక్స్ - ఇలా నిరంతరం ఆనందిస్తూ ఉంటాం. చివరకు ఒక విషాదకావ్యం చదివి, సినిమా చూసి ఏడ్చి ఆనందిస్తాం.
భాష అంటే పొడి అక్షరాల సమాహారం కాదు. భాష అంటే గుణింతాలు చూచిరాత డిక్టేషన్ కానేకాదు. భాష నేర్చడం అంటే సంధులు సమాసాలు నేర్చడంకాడు. మనం భాషలో ఉన్న ప్రాణాన్ని తీసేసి కదలికలేని శరీరాన్నిచూపి పిల్లల్ని భయకంపితుల్ని చేస్తున్నాం.
మనం పిల్లల్ని ఏ స్పందనలులేని రోబోట్లుగా తయారు చేస్తున్నామా? స్పందించే మానవులుగా తయారుచేస్తున్నామా? ఏడాదికి ఒక్క కథలపుస్తకం కూడా చదవని, చదవలేని పిల్లలు చదువుకొన్నవాళ్లు ఎలా అవుతారు? భాషాసాహిత్యాలకు మన చదువుల్లో ఎప్పుడు ప్రాధాన్యత తగ్గిందో అప్పటినుండి తయారైన మనుషుల ప్రవర్తన ముఖ్యంగా చదువుకొని బయటకొచ్చిన వారి నడవడికల్లో తేడాలు కనిపించడం లేదా?
నియంతలుగా, క్రూరులుగా, అజ్ఞానులుగా తయారవుతున్నారు. ఎదుటి వారి ఏడ్చునుచూసి నవ్వుకొనే మనుషులుగా ఎందుకు తయారయ్యారు?
నాగరికత పెరిగేకొద్దీ, కాలంగడిచేకొద్దీ మనుషులు మరింత విజ్ఞానులుగా, మరింత ప్రజాసామ్యవాదులుగా, మరింత ప్రేమాస్పదులుగా, తయారు కావాలిగదా! ఎందుకు కాలం వెనక్కి నడుస్తూ ఉంది. కథలు, కావ్యాలు, పుస్తకాలు చదివేవాళ్లు ఇలా -వెనక్కినడవరు. వాళ్లు ఎదుటివారి కష్టసుఖాలను చూసి స్పందిస్తారు. సున్నితమనస్ములుగా హృదయమున్న మనుషులుగా తయారవుతారు. ఈలోకం మంచి మనుషులతో నిండాలంటే భాషాసాహిత్యాలకు మన చదువుల్లో ప్రాధాన్యత పెరగాలి. బాల్యం నుండి భాషను నేర్చించేటప్పుడు అక్షరాలు నేర్చించేటప్పుడు వాటిని క్రీడాభ్యాసాలుగా మార్చాలి.
కవులు అక్షరాలతో గణయతి ప్రాసలతో అలంకారాలతో కవిత్వమల్లి ఎలా ఆనందిస్తారో ఓ పిల్లలుకూడా అక్షరాలతో పదాలతో వాక్యాలతో ఆడుకోవాలి. ఆనందించాలి.
ఈ అటలు ఎలా ఉంటాయో వాటితో ఎలా ఆనంధించాలో వివరంగా ఇక్కడ చెప్పడం సాధ్యంగాడు. కాని పత్రికల్లో పిల్లలకోసం నిర్వహించే పేజిల్లో ఇలాంటి అంశాలుచూసి కొంత అర్ధంచేసుకోవడానికి అవకాశం ఉంది. సాహిత్యం మీద మక్కువ ఉన్నవారికి ఇలాంటి వాటితో పరిచయం ఉండవచ్చు. ఐతే అవన్నీ అక్షరాలు వచ్చిన పిల్లలకు కొంతరాయడం చదవడం తెలిసిన పిల్లలకు. అసలు ఏమీరాని పిల్లలకు ఎలా చెప్పాలి? ఎలా నేర్చించాలి.
బడికి రాగానే మనం పిల్లలకు రాతతో లిపి నేర్చడానికి ప్రయత్నిస్తాం. మొదట పిల్లలకు రాత జోలికి పోకుండా వివిధ రకాల పదాలను ప్రశ్నలద్వారా పరిచయం చేయాలి. ఆ పదాల్లో అక్షరాలను పరిచయం చేయాలి. పదాల వర్గీకరణ పిల్లలు అర్ధం చేసుకోవాలి.
- 1. తియ్యటిపండు. తొక్కతీసి దిగమింగేస్తాం. ఏమిటది?
- అరటి -
- 2. అరటి - ఈ పదంలో ఏఏ అక్షరాలు ఉన్నాయి.
- అ-ర-టి.
- 3. తియ్యగా ఉండేవి ఏవో మరికొన్ని పేర్లు చెప్పండి.
- చాక్లెట్స్ ఐస్‌క్రీం, బెల్లం, చెక్కెర, మామిడిపండు.
- 4. ఇందులో చెట్లకు కాసినది ఏది?
- మామిడి పండు.
ఇలా ప్రశ్చిస్తూ పిల్లల దగ్గరనుండి సమాధానాలు రాబట్టాలి. పిల్లలు చెప్పలేకపోతే మనమే చెప్పాలి. పిల్లలు చెప్పగలవి మాత్రం మనం చెబితే పిల్లలు నిరాశపడతారు. వారికి అవకాశమివ్వాలి. చిన్న చిన్న కథలు, జోక్స్ చెబుతూ పిల్లలు మాట్లాడుతూ ఉంటే వింటూ, చాలా ఓపిగ్గా ఉపాధ్యాయులు వ్యవహరించాలి. ఐదేండ్లులోపు పిల్లలకు పదాలలో అక్షరాలు ఉంటాయని తెలియదు. చెప్పలేకపోతే నిరాశపడకూడదు. నీకురాదు, నీకు తెలియదు, అనే మాటలు పిల్లల్తొ ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు.
మనుషులందరికీ మాట్లాడటం చాలా ఇష్టం. పిల్లలకు మరింత ఇష్టం. ఎదుటివారు వింటున్నారా లేదా అనే దాంతో సంబంథం లేకుండా తమకు తోచిన విషయాలు గుర్తుకొచ్చినవన్నీ పొంతనలేకుండా చెబుతూనే ఉంటారు. ఎందుకని? వాళ్లు భాషను వినోద సాధనంగా ఉపయోగిస్తూ దాంతో ఆనందిస్తూ ఉంటారు. భాషతో ఆనందించడమంటే వారికి తెలిసింది మాట్లాడడమేకదా! ఇప్పుడు వారికి వినేవాళ్లు కావాలి. టీచర్ వినాలి. ఎదుటి పిల్లలు వినాలి. ఒక్కొసారి పిల్లలు కొన్ని మాటలు చెప్పి నవ్వుతూ ఉంటారు. అందులో నవ్వించే అంశం లేకపోయినా ఆమాటలే వారి లోపల ప్రత్యేక ధ్వనులుగా గిలిగింతలు పెడతాయి. గలగలా, జరజరా, తళతళా వంటి ధ్వన్యనుకరణ పదాలు పిల్లల్ని ఎంతగానో అలరిస్తాయి. తొలిరోజుల్లో భాషతో ఇంతగా ఆనందించిన పిల్లలు ఆతరువాతి రోజుల్లో మాట్లాడలేని మూగమొద్దుల్లా ప్రశ్నించడం చాతకానివారుగా, ఒక విషయాన్ని అర్థం చేసుకోలేని బట్టీరాయుళ్లుగా ఎందుకు మారుతున్నారు? చదువుల్లో భాషా సాహిత్యాలను పక్కనపెట్టిన తరువాత అర్థం చేనుకొనే శక్తి ఎక్కడనుండి వస్తుంది? అందుకే పాఠాలను అర్ధంచేసుకొవడం పక్కనబెట్టి ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేసుకొని గట్టెక్కిపోతున్నారు. పుస్తకంలో పాఠం అర్ధం చేసుకోలేనివాళ్లు ఎదుటివారిని ఎందుకు ఎలా అర్ధం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో మిగిలిన ప్రాణులను ఏమి అర్ధం చేసుకుంటారు? జరుగుతున్న పరిణామాలను రాబోయే ప్రమాదాలను ఏమీ అర్థం చేసుకుంటారు? మన చదువులవల్లే మనుషులు ఇలా తయారయ్యారంటే కాదనగలమా?
మన చదువుల్లో భాషాసాహిత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్యంలో భాషను క్రీడాభ్యాసాలుగా నేర్చాలని ఈ వ్యాసంలో చెప్పడానికి ప్రయత్నించాను. తరువాతి భాగంలో క్లాసురూంలో మూడవ తరగతినుండి భాషను క్రీడాభ్యాసాలుగా మార్చి ఎలా చెప్పవచ్చో వివరిస్తాను.
(రె౦డో భాగం వచ్చే సంచికలో...)
మాతృభాషల వాడకం భాషా వ్యవహర్తలను ఒక్క చోటికి తీసుకురావడమేకాక, అందరి భాగస్వామ్యంలో సమాజం అభివృద్ది చెందడానికి వీలు కలిగించి సామజంలో కలివిడినీ సృజనశీలతకూ సరికొత్త ఆలోచనలకూ ఊపిరులూదుతాయి. అవి సాంస్కృతిక వైవిధ్య భరితమైన జీవనానికి ప్రాణం పోయడమేగాక, శాంతి సాధనాలుగా ఉపయోగపడతాయి - యునెస్కో