Jump to content

అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం

వికీసోర్స్ నుండి

పీవీ శతజయంతి ప్రత్యేకం

డా. గంధం సుబ్బారావు 791093537


పీవీ గారి సాహిత్యాభినివేశం

(గత సంచిక తరువాయి...)


అనువాదకుడుగా పీవీ

14 భాషలపై పట్టు కలిగిన పీవీ, వివిధ భాషలలోని సాహిత్యాన్ని తెలుగులోకి, హిందీలోకి, ఇంగ్లీషులోకి అనువదించారు. ఒక భాష నుంచి మరొక భాషలోకి ఆయన చేసిన అనువాదం నేరుగా రాసిన సాహిత్యం వలెనే ఉన్నదంటే, వివిధ భాషలపై ఆయన పట్టు ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

సహస్ర ఫణ్‌

విశ్వనాథ సత్యనారాయణగారి ప్రఖ్యాత నవల “వేయిపడగలు” ను “సహస్ర ఫణ్‌” పేరుతో హిందీలోకి పీవీ గారు చేసిన అనువాదం అనువాద ప్రక్రియకే తలమానికమని మెప్పు పొందింది.

స్వయంగా ఒక ఉత్తమ నవలను రచించడం వేరు, ఒక ఉత్తమమైన నవలను మరొక భాషలోకి అనువదించి, ఆ అనువాదం మూల రచనకు సమాన స్థాయిలో ఉందని భాషా ప్రేమికుల, విశ్లేషకుల ప్రశంసలు పొందటం వేరు. ఈ అరుదైన గౌరవం పీవీ గారికి దక్కడం ఆయన అనువాద ప్రతిభకు తార్మాణం.

“వేయిపడగలు” వంటి నవలను అనువదించడం కష్టతరం. ఎందుకంటే ఏ భాషారీతికైనా తేలిగ్గా ఒదిగిపోయే గ్రాంధికభాషా రచనలకు నుడికారం ప్రసక్తి ఉండదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు అట్లా వుండవు. తెలుగు దేశంలోని గ్రామసీమల్లో వుండే అతి సహజమైన తెలుగు నుడికారానికీ, శోభకు ఏతమెత్తినట్లు ఉంటాయి ఆయన రచనలు. తెలుగు సంస్కృతి, నుడికారం, పలుకుబడుల సంగమం “వేయిపడగలు”. అట్లాంటి రచనను సంప్రదాయ హిందీ భాషా రచయితలు, పాఠకులు ఆహా! అని ఆనందించేటట్లు అనువాదం చేయడం తేలికైన పని కాదు.

ఆ విధంగా “సహస్ర ఫణ్‌” అటు విశ్వనాథ వారికీ ఇటు పీవీ గారికి హిందీ సాహిత్య ప్రపంచంలో ప్రఖ్యాతిని, ప్రచారాన్ని సముపార్షించి పెట్టింది. ఎంతగా అంటే అచ్చయిన రెండు వేల ప్రతులు నాలుగైదు నెలల్లోనే అమ్ముడు పోగా, 1972 ఫిబ్రవరి లో ద్వితీయ ముద్రణ వెలువడింది. అంతేకాక “సహస్ర ఫణ్‌” ను మరాఠీ, గుజరాతీ భాషలలోకి అనువదించడానికి అనుమతులు కోరబడ్డాయి. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద సాహిత్యానికిచ్చే అవార్డు పీవీ గారికి లభించింది.

ఆ సందర్భంలో సుప్రసిద్ద పాత్రికేయులు కీ. శే. జి. కృష్ణ గారు విశ్వనాథ వద్దకు వెళ్ళి, “సహస్ర ఫణ్” గురించి ప్రశ్నలు అడిగారు. అందుకు బదులుగా ఆయన “నాకు ఆ హిందీ నడవదు. మీరు చదివారు కదా! ఎట్లా వుంది? అని కృష్ణ గారిని అడిగారట. అందుకు ఆయన మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను. పీవీ నరసింహారావు అనే రచయిత “సహస్ర ఫణ్‌” అనే నవల రాస్తే, దానిని విశ్వనాథ సత్యనారాయణ తెలుగులోకి అనువదించారని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు. దానికి విశ్వనాథ పొంగిపోయారని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉడయవర్లు గారు 25-12-2004 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో రాశారు.

“విశ్వనాథ మనకూ, ప్రపంచానికీ ఇస్తున్న విభూతిని ప్రతి ఒక్కరూ సవిమర్శగా అర్ధం చేసుకోవాలి. ఆయన సాహిత్య సేవ ఎడతెగకుండా పారే జీవనది వంటిది. ఓ మహాస్రవంతి. దివ్యంగా, ధారావాహికంగా ప్రవహించే పరమపావనియైన జాహ్నవి వంటిది. ఎక్కడ దోసిలి పట్టి త్రాగినా, త్రాగవచ్చు” అని విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషించారు పీవీ గారు (ఆంధ్రప్రభ 30-08-1971).

తెలుగులో తన రచనా వ్యాసాంగానికి ప్రేరణ విశ్వనాథ సత్యనారాయణ రచనలేనని పీవీ తెలిపారు. విశ్వనాథ వారంటే పీవీకి అమితమైన గౌరవం. ప్రత్యేకంగా విశ్వనాథ వారిని చూడటానికి ముఖ్యమంత్రిగా పీవీ గారు విజయవాడకు వెళ్ళిన రోజులున్నాయి.

పీవీ గారి అనువాద ప్రతిభకు మరో తార్మాణం “అబలా జీవితం”. మరాఠీ సాహిత్యంలో ఆణిముత్యంగా భావించే “పన్‌ లక్షత్‌ కోన్‌ ఘొతో” (ఎవరికి పట్టింది!) నవలకు ఇది అనువాదం. బహుభాషా కోవిదులైన పీవీ కి మరాఠీ భాషలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అది ఈ అనువాదంతో జగద్విదితమైంది. ఈ నవల మూల రచయిత (శీ హరినారాయణ్‌ ఆప్టే మరాఠీ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత. గోపాలకృష్ణ గోఖలే వంటి జాతీయ నాయకులకు ఆత్మీయుడు. ఆయన రచించిన 18 నవలల్లో ఇది ప్రసిద్ధమైంది.

ఇది తెలుగు నవలే అన్నంత సాఫీగా సాగింది ఆ అనువాదం. అనూహ్యమైన వర్ణనలతో సాగే ఈ రచనను సరళమైన తెలుగులోకి అనువదించారు పీవీ. దీని ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక అరుదైన జోడింవు లభించింది. ప్రదానంగా రెండు కుటుంబాలను కేంద్రీకరించుకుని సాగిన ఈ నవల 19వ శతాబ్దంలో స్త్రీల స్థితిగతులకు, పరిస్థితులకు అద్దం పదుతుంది.

ప్రసిద్ధ రచయిత్రి శీమతి జయప్రభ తన తెలుగు కవితా సంకలనం పుస్తకాన్ని ఇవ్వడానికి ఆమె ఒకసారి పీవీ గారినీ కలిశారు.ఆ పుస్తకాన్ని అందుకున్న పీవీ అందులోని కొన్ని కవితలు చదివి, మీ కవితలు చాలా బాగున్నాయి. ఎవరైనా ఇంగ్లీష్‌ బాగా వారితో ఇంగ్లీషులోకి అనువదింవ జేయకపోయారా? అంతర్జాతీయంగా మీకు మంచి పేరు వచ్చేది అని అన్నారట. ఆమె అలాగే అంటే ఆయన కొంచెం ఆలోచించి ఎవరో ఎందుకు? నేనే ఇంగ్లీష్‌ లోకి అనువాదం చేసి పెడతాను లెండి అన్నారట. ఆమెకు గుండెల్లో రాయి పడిందట. పీవీ గారు వచనం అనువదించడంలో ప్రసిద్దులు. ఆయన తన తెలుగు కవితలను ఆంగ్లంలోకి అనువదించగలరా అనుకున్నారట. అయితే కొన్ని రోజుల తరువాత ఆమెను పిలిచి, ఆమె కవితల ఆంగ్ల అనువాద ప్రతిని ఇచ్చారట. ఆ అనువాదాలు చదివి ఆమె ఆశ్చర్యసోయారట. అవి అనువాదాలు వలె కాక, ఆంగ్ల దేశాలకు చెందిన చేయి తిరిగిన ప్రసిద్ద కవి సహజ కవితల్లాగా ఉన్నాయట. అంతకన్నా బాగా ఆంగ్లంలోకి మరెవ్వరూ అనువదించలేరు అనుకున్నారట ఆమె. పీవీ గారి ప్రతిభను తక్కువగా అంచనా వేసినందుకు ఆమె బాధపడ్డారట. తన కవితలు పీవీ గారికి అంతగా నచ్చినందుకు ఆమె హృదయం ఉప్పాంగిపోయిందట.

ఒక భాష నుంచి సాహిత్యాన్ని మరొక భాషలోకి అనువదించడం వల్ల ఆయా సంస్కృతులు ఇతరులకు తెలుస్తాయి. దీని వల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చని పీవీ నరసింహారావు గారు చెప్పారు. దేశకాల పరిస్థితుల దృష్ట్వా అది ఈనాటి అవసరమని, ప్రపంచ భాషలలోని మహాకావ్వ్యాలన్నింటినీ రష్యన్‌ భాషలోకి అనువదించడానికి దోహదం చేసిన పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హోమ్‌ కార్యాచరణ పద్దతి అందరికీ అనుసరణనీయమైనదని, తెలుగులో ఎంతో విలువైన సాహిత్యం విస్తారంగా వున్నదని, దానిని బయటి ప్రపంచానికి తెలియజెప్పి తెలుగు సాహిత్యం గొప్పదనాన్ని దశదిశలా చాటాలని పీవీ గారు ఎప్పుడూ ఆరాటపడేవారు.

రాష్ట్ర సాంస్కృతిక మండలి, తెలుగు విశ్వవిద్యాలయం వంటి ప్రభుత్వ నిధులున్న సంస్థలు పాఠకులు ఉన్నారా, లేరా? అన్న మీమాంసకు వెళ్ళకుండా గ్రంథాలను ప్రచురించి, మన సంస్కృతిని పరిరక్షించాలని ఆయన అనేవారు.

“పీవీ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా ఉండగానే ఆ శాఖలో అనువాద విభాగం ఏర్పాటైంది. అంతకు ముందే భారత రాజ్యాంగాన్నీ “భారత సంవిధాన” మనే పేరిట నరసింహారావు గారే తెలుగులోకి అనువదించి వున్నారు. 1963లో కేంద్రం చేసిన అధికార భాషా శాసనంలోనూ, 1966లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన చట్టంలోనూ ఇంగ్లీష్‌ లో వున్న ఏ చట్టాన్నయినా అనువదించి రాష్ట్ర గవర్నరు ఆమోదం పొందిన తరువాతనే అది అధికార పాఠమవుకుంది. దానికి తప్ప న్యాయశాస్త్ర రీత్యా ఇతర విధాన అనువాదాలకు గుర్తింపు లేదు - రాదు. అందువల్ల అనువాద విధానాలను నిర్దేశించవలసిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వున్నాయి. అప్పటికీ భాషలను గురించి, అనువాద విధానాలను గురించి రకరకాల సిద్దాంతాలు, చర్చలు వున్నాయి. వాటన్నిటినీ సమన్వయము చేయడం సాధ్యం కాదు. అలాగని నిర్ణయాధికారాన్ని కాలానికి వదిలేస్తే ఎన్ని దశాబ్దాల తరువాత, ఎన్ని శతాబ్దాల తరువాత ఏక రూపత, ఆమోద యోగ్యత, ఏక ఐక్యత వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందువల్ల ఎదో ఒక విధమైన నిర్దేశం, లక్షణ నిరూపణ చేయవలసిన బాధ్యత న్యాయశాఖ మంత్రి మీద వుంది. ఆ బాధ్యతను నెరవేర్చే సదుద్దేశంతో, తెలుగులో శ్వేత పత్రాన్ని (వైట్‌ పేపర్‌), పరిశీలన పత్రాలను (వర్మింగ్‌ పేపర్స్‌) 1968, 1969 సంవత్సరాలలో (ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రిగా పీవీ గారే తయారు చేసి శాసనసభలో వాటిని చర్చకు పెట్టారు. విస్తృత పరిశీలన కోసం, చర్చా గోష్టులకు తేదీలను కూడా నిర్ణయించారు కానీ 'ప్రత్వేక తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకున్నందువల్ల బహిరంగ సమావేశాలు జరగలేదు”.

(డా. బూదరాజు రాధాకృష్ణ “భాషా సేవకులుగా శ్రీ పీవీ నరసింహారావు గారు” వ్యాసం.

విమర్శకుడుగా పీవీ

ఏది చదివినా వ్రద్దగా చదవడం, చదివిన రచనను లోతుగా విశ్లేషించి, ఆ రచనను విమర్శనాత్మకంగా పరిశీలించడం పీవీ గారికి అలవాటు. విమర్శ విషయంలో ఎంతటి వారైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో ఏనాడూ ఆయన వెనుకాడలేదు. తెలుగు సాహిత్యంలో హిమాలయ శృంగ సద్భశ్యుడైన విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆయన ఒకసారి విమర్శలో ఢీకొన్నారు.

1956 మర్చి 31 , ఏప్రిల్‌ 1 తేదీల్లో, రెండు రోజులపాటు కరీంనగర్‌ లో విశ్వనాథ షష్టిపూర్తి ఉత్సవాలు జువ్వాది చౌొక్కారావు,గౌతమ్‌ రావు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. దివాకర్ల వెంకటావధానిగారు, నాయని సుబ్బారావు గారు, ధూళిపాళ శ్రీరామమూర్తి గారు, కాళోజి నారాయణరావు గారు - వంటి ప్రముఖులు ఆ సభల్లో పాల్గొన్నారు. వరంగల్‌ నుంచి కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య కూడా ఈ సభలకు వెళ్ళారు.

“ఆ సందర్భంగా సత్యనారాయణ గారి నవలా సాహిత్యాన్ని గురించి పీవీ గారు తొలి రోజున చదివిన ప్రసంగ వ్యాసం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. సభాసదుల్ని ఆలోచించమని బలవంత పెట్టింది. ఆ సుదీర్ధ వ్యాసాన్నీ విన్నవారు కొందరు సంతోషించారు. కొందరు చికాకుపద్దారు. ఈ రెండు తీరులకూ కారణం, పీవీ ఆ ప్రసంగంలో సత్యనారాయణ గారి నవలల్లో ప్రధానంగా ప్రవేశపెట్టిన కొన్ని పాత్రలు, వాటి చిత్రణలో లోపాల వంటి కొన్ని కొన్నింటిని సందేహాల రూపంలో వేలెత్తి చూపడమే.కొంత ఘాటుగా విస్తరించడమే. ఆ ప్రసంగ వ్యాసం ఆయన ముఖతః ఆ రోజున విన్నప్పుడు శ్రీ పీవీ దృష్టి నైశిత్యం, విశ్లేషణ, వివేచనలోని గాంభీర్యం మొదటిసారిగా నాకు అవగతమైంది” అని డా. కోవెల సంపత్ముమారాచార్య తమ “పీవీ సాహిత్య వ్యక్తిత్వం” వ్యాసంలో పేర్కొన్నారు.

పీవీ తరువాత మరొకరిద్దరు ప్రసంగించిన అనంతరం, చివరకు మాట్లాడిన విశ్వనాథ వారు తమ ప్రసంగంలో పీవీ ప్రస్తావించిన అంశాలకు తమ సాహిత్య జీవితంలో నుంచి, లోకంలో నుంచి పలువురు మహానుభావువైన దేశ విదేశ మహాకవుల, రచయితల రచనల నుంచీ “వేయిపడగలు” మొదలైన నవలలు తాను రచించిన కాల పరిస్థితుల నుంచీ రకరకాల ఉదాహరణలు ఇస్తూ, ఆయా పాత్రలను ఆయా విధాలుగా చిత్రించడానికి కారణాలను, ఔచిత్యాన్ని వివరిస్తూ సుదీర్హంగా ఉపన్యసించారు.

ఆనాటి పీవీ ప్రసంగాన్ని ఆ తరువాత సత్యనారాయణ గారి ఉపన్వాసాన్ని విన్నవారిలో కొందరు పీవీ సత్యనారాయణ గార్ల సంబంధాన్ని గురించి రకరకాలుగా చెప్పుకుని వారిద్దరికీ చెడిందని ప్రచారం చేశారట. అప్పటికే విశ్వనాథ వారి వేయిపడగలు నవలను పీవీ హిందీలోకి అనువదిస్తున్నారనే వార్త వ్యాప్తిలో వుంది. అయితే ఆనాటి ఆ సన్నీవేశంతో ఆ అనువాద కార్యక్రమం ఆగిపోతుందని, సత్యనారాయణ గారు హిందీ సాహిత్య రంగానికి పరిచయమయ్యే అవకాశం, దాన్ని బట్టి అఖిల భారత స్థాయిలో ఆయనకు పేరొచ్చే అవకాశం దానంతట అదే తప్పిపోయిందనీ చాలా మంది బ్రమపడ్డారు. కానీ వారి ఊహలు అన్నీ అపోవాలుగానే మిగిలిపోయాయి. ఆనాటి నుంచీ సత్యనారాయణ గారు - పీవీ గారు మరింత సన్నిహితులయ్యారు. “వేయిపడగలు” ను పీవీ “సహస్ర ఫణ్‌” గా అనువదించడంలో తమ రాజకీయ కార్యకలాపాల వత్తిడి వల్ల కొంత ఆలస్యం జరిగినా, ఇది 1971లో భారతీయ జ్ఞానపీఠ్‌ వారి ద్వారా వెలువడి, వారిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది.

జర్నలిస్టుగా పీవీ

1945-46 సంవత్సరాలలో దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్ర సారస్వత పరిషత్‌ పక్షాన “శోభ " అనే మాసపత్రికను నడిపారు. ఆ సమయంలోనే పీవీ తన మిత్రబ్బందంతో కలిసి “కాకతీయ సారస్వత సంకలనములు” పేర ఒక వార్తాపత్రికను ప్రారంభించారు.

పోలీస్‌ చర్య తరువాత తెలంగాణాలో ఒక వినూత్న రాజకీయ సంచలనం ప్రారంభమైంది. ప్రజాతంత్రశీలత అనే కొత్త సంస్కృతికి, సంప్రదాయానికి బీజాలు పడ్డాయి. కాలానుగుణంగా 1948 నుంచి కాకతీయ పత్రిక ఉద్ధృతిని పెంచింది. గార్లపాటి రాఘవరెడ్డి గారి పరిదేవన కావ్యం ఈ పత్రికలోనే మొదటిసారి అచ్చయింది. ఈ పత్రికలో పీవీ గారి పలు రచనలు, “మానావమానాలు” అనే నవల ప్రచురించబడ్డాయి. ప్రసిద్ద హిందీ కవి మహాదేవవర్మ కవితలపై సుదీర్ఘ నమీక్షను కూడా పీవీ ఈ పత్రికలో ప్రచురించారు.మతకలహాలు ఇతివృత్తంగా “యెదవ నాగన్న” కథను, మహాకవి “గ్రే " ఎలిజీకి తెలుగు అనువాదాన్ని కూడా పీవీ ఈ పత్రిక ద్వారానే పరిచయం చేశారు. పీవీ గారి “గొల్లరామవ్వ” కథ, “బ్లూ సిల్క్‌ శారీ " మొదట ఈ పత్రికలోనే ప్రచురితమైయ్యాయి.

పత్రిక సామాన్య ప్రజల ఆదరాన్ని సాహితీ వేత్తల ఆమోదాన్ని పోందింది. రాజకీయంగా ప్రజాస్వామ్య, సామ్యవాద సిద్దాంత వ్యాప్తికి కృషి చేసింది. అనేక ప్రత్యేక సంచికల ద్వారా వ్యవసాయ, సహకార, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, పీడిత ప్రజానీకం ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించింది. అసంఖ్యాక హాస్య వ్యంగ్య రచనల ద్వారా అభివృద్ది నిరోధక శక్తుల కుట్రలు, కుతంత్రాలను బయట పెట్టింది. నైతిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసాలకు పాటు పడింది. జాతీయ, అంతర్జాతీయ సమస్యలను కూడా నిస్పాక్షికంగా విశ్లేషించింది.

పత్రిక నిర్వహణలో పీవీ చందాదారులను చేర్పించడం, రచనలు సమకూర్చడం, ప్రకటనలు సేకరించడం, ప్రూఫ్‌ లు దిద్దడం వంటి అన్ని పనులూ చేసేవారు. అన్నిరకాల బాధ్యతలను నిర్వహించేవారు. ఈ పత్రికకు పీవీ ఆప్తమిత్రులు పాములపర్తి సదాశివరావు గారు సంపాదకులు. గార్లపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ నారాయణరావు గారు పత్రిక నిర్వహణలో సాయపడేవారు.

అయితే, నిర్వాహకులలో వ్యాపార దృక్పథం లేనందున కాకతీయ పత్రికకు ఆర్ధిక పుష్టి సమకూరలేదు. కేవలం నిస్వార్థ సేవా దృక్పథంతో పత్రికను నడిపారు. అందువల్ల రానురాను పత్రిక మనుగడ కష్టతరమై, అనుకోని రీతిలో పత్రిక ప్రచురణ నిలిచిపోయింది.

కాకతీయ పత్రిక నిలిచిపోయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా పీవీ లో మంచి సాహిత్య పత్రిక ఉండాలన్న కోరిక మాత్రం సజీవంగానే ఉండిపోయింది. పీవీ గారికి తెలుగు జర్నలిజం పై గాడమైన అఖి'ప్రాయాలున్నాయని పీవీ గారి ఆంగ్ల నవల “ఇ” ను తెలుగులోకి అనువదించిన సీనీయర్‌ జర్చలిస్ట్‌ శ్రీ కల్లూరి భాస్మరం గారు “ప్రతిబా వైజయంతి 2002” లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఆయన పుస్తకం అనువాదం విషయమై పీవీ గారి వద్దకు తరచూ వెళ్తుండేవారు. అలా ఒకసారి వెళ్తూ, తన మిత్రుడు ఒకరిని వెంట తీసుకుని పోయారట. పీవీ గారు మాటల సందర్భంలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు, కవులు, రచయితల గురించి మాట్లాదుతూ “తెలుగులో పత్రికలేవండీ, భారతి లాంటి పత్రికలేమైపోయాయి? మిగతా భారతీయ భాషలలో చూస్తుంటాను, భారతి లాంటి స్థాయి గల పత్రికలు ఎన్నో కనిపిస్తుంటాయి. తెలుగులోనే ఏమి లేని పరిస్థితి ఎందుకొచ్చింది?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. అప్పుడు పక్శనే వున్న భాస్మరం గారి మిత్రుడు “తెలుగువాళ్ళు చదవరండీ!” అనేశారట. ఆ మాటకు ఆయన చాలా నొచ్చుకున్నట్లు కనిపించారట. “తెలుగు వాళ్ళ గురించీ అలా అనకండి. తప్పక చదువుతారు” అన్నారట. ఆ మరునాడు మళ్ళీ భాస్కరం గారు కలుసుకున్నప్పుడు కూడా పీవీ గారు ఆ ప్రస్తావన తెచ్చి, “మీ మిత్రుడి అభిప్రాయం చాలా తప్పు. మీరే ఒక మంచి పత్రిక ప్రారంభించండి. నా సహకారం కూడా ఉంటుంది” అన్నారట. తెలుగులో భారతి, త్రివేణి లాంటి పత్రికల అవసరం ఈనాడు ఎంతగానో వుంది. భారతి ఈ శతాబ్దపు తెలుగు వారి ఆస్తి. దాన్ని పునరుద్దరిస్తే మేలు జరుగుతుంది అన్నారట.

పీవీ గారు మారు పేర్లతో ముఖ్యంగా “కాంగ్రెస్ వర్కర్", “కాంగ్రెస్‌ మాన్‌” పేర్లతో సమకాలీన రాజకీయాలపై, నాయకులపై ఎన్నో వ్యాసాలను ప్రముఖ పత్రికలలో రాశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ, ఆయన ప్రభుత్వం పడిపోయిన తరువాత రాజీవ్‌ గాంధీ తప్పిదాలను, ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోడానీకి గల కారణాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసాన్ని“కాంగ్రెస్‌ వర్కర్‌” పేరుతో 1990 జనవరి నెలలో “మెయిన్‌ స్త్రీమ్” పత్రికలో రాశారు.

ఈ వ్యాసంలో ఆయన అయోధ్య సమన్యను పరిష్కరించే విషయంలో రాజీవ్‌ గాంధీ చేతకానితనాన్ని ఎండగట్టారనీ, బోఫోర్స్‌ కుంభకోణం విషయంలో రాజీవ్‌ గాంధీ డబ్బుకు కక్కుర్తి పడివుండకపోవచ్చు. కానీ, ఏవో కాన్ని నిజాల్ని లేదా బాధ్యులైన వారిని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని, పదునైన వ్యాఖ్యలు చేశారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు వందలకు పైగా స్థానాలు సాధించింది. కాంగ్రెస్‌ చరిత్రలోనే ఇది అసాధారణ విజయం. దేశ చరిత్రలో మరే పార్టీ ఇంతవరకు ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. ఇందిరా గాంధీ హత్యానంతరం సానుభూతి పవనాలు వీయడం వల్ల లఖించిన విజయమిది. ఇందులో రాజీవ్‌ గాంధీ గొప్పతనమేమీ లేదు. అయితే, ఈ విజయంతో కళ్ళు మూసుకుపోయిన అసమర్ధ నాయకుడు రాజీవ్‌గాంధీ అని ఆ వ్యాసంలో పీవీ వ్యాఖ్యానిస్తూ, అంతటి భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు ఐదేళ్ళలో ఎందుకంత బలహీన పడిపోయాడని, 1989 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని, ఈ ఐదేళ్ళలోనే ఇంత తేడా రావడానికి గల కారణాలను ఈ వ్యాసంలో పీవీ విశ్లేషించారు.

అకాడమిక్‌ దృష్టితో రాసిన వ్యాసమిది. మెయిన్‌ స్త్రీమ్‌ పత్రికలలో “ది గ్రేట్‌ సూసైడ్” అనే పేరుతో ప్రచురితమైంది. ఆ తరువాత కాలంలో “ఫ్రంట్‌ లైన్‌” పత్రిక దీనిని పీవీ వ్యాసమని పునర్ముద్రించింది.

రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై జాతీయ, అంతర్జాతీయ వేదికల నుంచి పీవీ నరసింహారావు గారు చేసిన అసంఖ్యాకమైన ఉపన్యాసాలు అన్నీ ఆయనకు ఆయా విషయాలపై గల సాధికారికతను సూచిస్తాయి.

పీవీ గారి హాస్యం

గంభీరసాగరుడు, మౌనముద్రాంకితుడుగా పేరు పడ్డ పీవీ నరసింహారావు గారిలో హాస్యచతురత అపారం. నోరు తెరిస్తే, సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, ఛలోక్తులు తొణికిసలాడేవి. తరచిచూస్తే, ఇవి ఆయన ప్రతి రచనలోనూ మనకు దర్శనమిస్తాయి. “ఇన్సైడర్‌” నవల ఒక వ్యంగ్య, హాస్య రసాత్మకమైన రచన. కాళోజీ నారాయణరావు గారి షష్టిపూర్తికి పీవీ రాసిన కవితలో కూడా ఈ హాస్యం కాట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

కుంటిదే అయినా ఇంటిది

ఐక్యరాజ్యసమితి పాత్రపైనా, దానీ వైఫల్యాలపైనా ఒకసారి పీవీ వ్యాఖ్యానిస్తూ, ఆ సంస్థకు ఎన్ని వైఫల్యాలున్నా, అదే మానవజాతికి ప్రస్తుతం అందుబాటులో వున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ అని చెప్పారు. “కుంటిదే అయినా ఇంటిది” అన్న సామెత ఐక్యరాజ్యసమితికి బాగా సరిపోతుందని, ఎప్పటికైనా దాని ఉపయోగం ఉంటుందని నేను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

కాపీ ఇవ్వలేను కానీ కాఫీ ఇస్తాను

పీవీ గారు ప్రధానమంత్రి కావడానికి కొద్దిరోజుల ముందు సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ బి. నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయనకు నివాళి అర్పించేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని జర్నలిస్ట్‌ కాలనీకి వచ్చిన పీవీ తిరిగి ఢిల్లీకి పయనమవుతుండగా, అక్కడే వున్న పలువురు జర్నలిస్టులు “సార్‌ ఏదైనా కాపీ ఇవ్వండి పత్రికా భాషలో వార్త” అంటూ పీవీ ని చుట్టుముట్టారు. ఆయన నవ్వేసి, “రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యాను. ఢిల్లీ నుంచి నా పుస్తకాలను హైద్రాబాదుకు షిఫ్ట్‌ చేసే పనిలో వున్నాను. నేనేం కాపీ ఇవ్వగలను, కాకపోతే మీకు మంచి కాఫీ మాత్రం ఇవ్వగలను” అంటూ చమత్మరించారు. దీనీతో అందరూ హాయిగా నవ్వుకున్నారు.

కుంటి లక్ష్మి

పీవీ గారి వద్ద ఎన్నికల ప్రచారానికి గ్రామాలలో తిరగడానికి ఒక పాత జీపు ఉండేదట. ఆయన దానికి “కుంటి లక్ష్మి” అని పేరు పెట్టారు. మిగతా రోజుల్లో అది వంగరలో వారి ఇంటి ఆవరణలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడి ఉండేదట. ఎన్నికలు సమీపిస్తుంటే “ఆ కుంటి లక్ష్మిని బయటకు తీసి బాగు చేయించండి, ఎలక్షన్లకు అదే గతి” అని ఛలోక్తి విసిరేవారట.

ప్రయాణాలలో పాటలు, పద్యాలు

పీవీకి శాస్త్రీయ సంగీతమంటే మక్కువ. రాగ, తాళ గతులను గుర్తించేవారు. బాల్యం నుంచే పద్యాలను, పాటలను శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులు, జావళీలు అంటే మహా ఇష్టం. ఏ కొంచెం విరామ సమయం దొరికినా కూనిరాగాలు తీసేవారు. 1952లో ఒకసారి ఢిల్లీకి స్నేహితులతో రైలులో ప్రయాణిస్తూ, ఆ రెండు రోజుల ప్రయాణంలో పాటలను, పద్యాలను రాగయుక్తంగా పాడి, తన సంగీత పాటవాన్ని ప్రదర్శించి, పీవీ అందరి ప్రశంసలూ పొందారు.

మన బృహస్పతి ఎక్కడ

పీవీ కార్వదక్షుడు. ఏ పనైనా చక్కగా అరమరికలు లేకుందా పూర్తిచేసేవారు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సరైన సలహా ఇచ్చేవారు. అందువళ్లే ఆయన అచిరకాలంలోనే మహానాయకుల సాన్నిహిత్యాన్ని పొందగలిగారు. రాజకీయ గురువైన రామానందతీర్థ, స్టేట్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ పీవీ కే అప్పగించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాక, పీవీ చురుకుదనం గమనించి అప్పటి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు గారు కీలక ప్రతులు, చట్టాల రూపకల్పన బాధ్యత పీవీకి అప్పగించారు.

ఒకసారి సమావేశానీకి కాంగ్రెస్‌ పెద్దలందరూ హాజరయ్యారు కానీ పీవీ ఇంకా చేరుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రి బూర్జుల రామకృష్ణారావు గారు “అయ్యో! ఎక్కడ మన బృహస్పతి, ఇంకా రాలేదు?” అని అక్కడున్నవారిని అడగటం పీవీ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. కాసు బ్రహ్మానందరెడ్డిగారు ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు కూడా అన్నిరాత కోతలకు ఆయన పీవీ మీదనే ఆధారపడేవారట. ఆయన కూదా పీవీని “బ్బహస్పతి” అనే సంబోధించడం విశేషం.

(శీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా వున్నా లేకపోయినా, ఆమెకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అని కూడా చూడక పీవీ ఇంటికి వెళ్ళేవారట. ఆయనతో కూర్చుని సుదీర్ధంగా మంతనాలు జరిపేవారట. ఆమె పీవీ గారిని అంతగా నమ్మకంలోకి తీసుకున్నారు. అది కేవలం పీవీ గారి ప్రతిభను, దక్షతను మాత్రమే కాక, ఆయన విశ్వసనీయతను కూదా సూచిస్తుంది.

తెలుగు సాహిత్యం పై పీవీ గారికి అమితమైన గౌరవం. ఆయన ఒకసారి 20వ శతాబ్దపు సాహిత్యం గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ సాహిత్యంతో సరితూగగల తెలుగు సాహిత్య సంపద ఎంతో ఉందన్నారు. దీన్నీ పరిరక్షించుకోవాలన్నారు. మంచి సాహిత్యాన్ని ఎంత మాత్రం పోగొట్టుకోకూడదని, దాన్ని భద్రపర్చుకోవడంతో పాటు, ఆత్మ చెడకుండా ఇతర భాషల్లోకి తర్జుమా చేయాలి. ఏ భాషా సాహిత్వమైనా ఆ జాతి సంస్కృతి, నాగరికతకు మూలకందం. సాహిత్వానికి ఆది, అంతం అంటూ లేదు. ప్రజలకు సమాంతరంగా సాహిత్యం ఉత్పత్తి అవుతుంది. ఆయా కాలాల్లో ప్రజలు, పాలకుల అఖీష్టం మేరకు రచనలు వచ్చాయి. ప్రక్రియ సైతం ప్రజలు కోరిందే ఉంటుంది అన్నది పీవీ అభిప్రాయం.

మన దేశంలో కవిత్వం, కవితా పద్ధతులు, శైలి రకరకాలుగా ప్రవహించాయి. చిత్రకవిత్వపు పాయ మాత్రం తెలుగుకే ప్రత్యేకమైంది. హిందీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషా పండితులు, కవులు అనేక మందితో తాను మాట్లాడినప్పుడు మన అవధానం, చిత్ర కవిత్వం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారని పీవీ పేర్కొన్నారు.

ఎక్కడైనా శ్లేష, శ్లేష తరువాత శ్లేష రెండు పదాల్లో వస్తే అది సాహితీ కౌశల్యానీకి పరాకాష్టగా వారు అభివర్ణిస్తారు. ఉత్తర భారత భాషల్లో భావానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. భాషా పాండిత్యం తక్కువ. అనేక సందర్భాలలో యతి, ప్రాసలు తదితర వ్యాకరణ సంబంధమైన పొరపాట్లు వున్నా భాషాదోషాలను పట్టించుకోకుండా రసగ్రహణం, భావం మాత్రం చూస్తారు. అదే తెలుగు గడ్డపై “రాఘవ పాండవీయం” లాంటి ఒక కావ్యంలో ప్రతి పద్యాన్ని రామాయణ, భారతాలకు అన్వయిస్తూ చెప్పడం మరే భాషలోలేని అపురూపసంపద అని పీవీ నరసింహారావు గారు పరిశీలనాత్మక దృష్టితో వింగడించారు. పూర్వకాలంలో మన దగ్గ యుద్దాలు జరగని సందర్భాలలో రాజులు తీరికగా కూర్చుని, ఒక వంక వారు రాస్తూ మరో వంక మహాకవులైన వారు విశేష రచనలు చేయదానికి దోహదం చేశారని కూదా ఆయన సింహావలోకనం చేశారు.

ప్రపంచ న్యాయ చరిత్రలో మరే భాషలో కూడా లేని అవధాన ప్రక్రియ తెలుగు భాషకే సొంతమన్స, దానినీ ఒక శాస్త్రంగా, ఒక కళగా అభివృద్ధి చేసి, అది అంతరించిపోకుండా ముందు తరాలకు అందించాలని ఆయన సూచించారు. అవధానంలో పాండిత్వంతో పాటు శబ్లాధిపత్యం ప్రధానం. అది లేకపోతే కవి రాణించడు. సుమారు మూడు, నాలుగు వందల సంవత్సరాలుగా తెలుగు నేలపై భాషాకోవిదులు, పండితులు, కవులు అభివృద్ది చేసిన ఈ అవధాన ప్రక్రియకు ఇంకా ప్రాముఖ్యత లభించే విధంగా మెరుగులు దిద్ది అందరికీ రసాస్వాదనీయంగా పునరుద్దరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన తన పనితీరును అవధానంతో పీవీ పోల్చారు. అవధానానికి ఒకరు సమస్యాపూరణమిస్తే, మరొకరు అప్రస్తుత ప్రసంగంలోకి లాగుతారు. మరొకరు గంట కొట్టి దృష్టి, ధ్యాస మళ్ళిస్తారు, ఇంకొకరు నిషిద్దాక్షరి ఇస్తారు. ఈ పద్దతిలోనే తాను పార్లమెంట్‌ లో ప్రశ్నోత్తరాల సమయంలో చేసేది అవధానమే. అన్నారు పీవీ. సభ్యులు వేసిన అడ్జదిద్దమైన ప్రశ్నలకు సరైన జవాబులను చమత్మారంగా చెప్పవలసి ఉంటుంది. చెప్పే జవాబు - ప్రశ్న ఎంత తెలివి తక్కువగా వుంది, అని ధ్వనించే లాగా ఉండాలంటే, తమకు ఎంతో సాధన అవసరమని ఆయన అన్నారు. అవధాన విద్యలో పాండిత్యం, భాషాజ్ఞానం, చమత్మారం ఒక పాఠ్యమైనప్పటికీ, అందులో జ్ఞాపకశక్తి ప్రధానమైనది.

కంప్యూటర్‌ లో చదరంగం ఆదే పద్దతి వ్యాప్తిలోకి వచ్చినట్టుగానే, అవధాన ప్రక్రియ సైతం కంప్వూటర్ల ద్వారా చేసే విశేష ప్రక్రియగా రూపొందాలని శ్రీ పీవీ నరసింహారావు గారు అన్నారు.

లోకంలో ఏకసంథాగ్రాహులు, ద్విసంథాగ్రాహూలు ఉంటారు. చిన్నతనంలో పీవీ. నరసింహారావుగారు ఏకసంథాగ్రాహిగా గణుతి కెళ్ళారు. ఏ అంశమైనా ఒక్కసారి చదివితే ఆయనకు కంఠతా వచ్చేది. అయితే వయసు పెరగడం ప్రకృతి సహజమైన అంశమైనా, తాను నిర్వహించిన పదవుల రీత్యా ఎటు చూసినా ప్రశ్నలే. ఎన్నింటికి సమాధానాలు చెప్పినా ప్రశ్నల పరంపర సంధానం నిరంతరంగా సాగుతున్నది. ప్రతీ మనిషీ ఒక పృచ్చకుడైనాడు. అందుచేత, ఈ ప్రశ్నల కలగూరగంప తన జ్ఞాపకశక్తికి అడ్డం వస్తున్నది. ఈ నేపథ్యంలో, లోగడ మాదిరిగా ఒకసారి కాదుకదా, ఇరవై సార్లు చదివినా ప్రస్తుతం జ్ఞాపకం ఉండడంలేదని పీవీ గారు విచారం వ్యక్తం చేసారు. అయితే ఈ జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి శిక్షణ కావాలన్నారు.

ఆయన ఎంత సంప్రదాయవాదో, అంత ఆధునిక దృష్టి కలవాడు. కంప్యూటర్ల వాడకం తప్పనిసరి అని కూడా ఆయన నొక్కిచెప్పేవారు. అయితే కంప్యూటర్లకు ప్రాణం కానీ, మేధ కానీ వుండవు కదా? కాబట్టి సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా మనిషికి కంప్యూటర్‌ ప్రత్యామ్నాయం కాబోదని ఆయన పదేపదే చెప్పేవారు. అనేక యంత్రాలు, సాంకేతిక అభివృద్దికి మనిషే జనకుడు. ఈ సాధన సామగ్రి అంతా మనిషికి సేవకులు. కంప్వూటర్లు మంచి సేవకులుగా వాటితో మంచి సంబంధాలు ఉండాలి తప్ప, మనిషే వాటికి వశమైతే ప్రపంచం నిలవదని ఆయన హెచ్చరించేవారు.

అలనాడెప్పుడో వాల్మీకి, వ్యాసుడు ప్రభృతులు చేసిన రచనల తాళపత్ర ప్రతులు అందరికీ అందుబాటులో వుండేవి కావు. ప్రింటింగ్‌ సౌకర్యం వచ్చిన తరువాత, ఇతిహాసాలు మాత్రమే కాక ఇతర సాహిత్యాన్నంతా గ్రంథాల రూపేణా తెచ్చారు. ఇవాళ కంప్యూటర్లు వచ్చాయి. ఇంటర్నెట్‌ వచ్చింది. సమాచార సేకరణ ఎంతో సులభమైంది. అంత మాత్రాన పుస్తకాలు ప్రచురించకూడదనే అభిప్రాయానికి రాకూడదని, తిరిగి పుస్తకాలను గుర్తించే రోజులు వస్తాయని పీవీ ఆశాభావం వ్యక్తం చేసేవారు. ఇంటర్నెట్‌ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. నెట్‌ లో పొందుపరచిన అంశమే అందరికీ అందుబాటులో ఉంటుంది తప్ప, అది మనిషిలాగ కొత్త రచనలు చేయదనే సత్యాన్ని గ్రహించాలన్నారు.

భారతదేశానీకి ఇంతటి మహామేధావి ప్రధానమంత్రి కావడం ఈ దేశప్రజలు చేసుకున్న అద్బష్టం. ఇంతటి ప్రతిభామూర్తి భారత రాజకీయాలలో అరుదు.

“తాను పుట్టిన గ్రామం ఈ తెలుగు నేలపైనే వున్నది. ఈ గడ్డమీదనే ఓనమాలు దిద్దుకున్నాను. ఈ నేలపైనే దేశసేవ చేస్తూ, తొలి అడుగులు వేశాను. ఆప్తమిత్రులు, బంధువులు ఇక్కడే వున్నారు. ఇది ఖిన్న సంస్క్రుతులు ఎదిగి పూచిన చోటు. ఇక్కడే నా మూలాలున్నాయి” అంటూ ఆత్మావిష్మారం చేశారు పీవీ ఆయన ఒక పరిణిత మనస్వి.

మీ స్పందనను తెలియజేయండి

'అమ్మనుడిలో రచనలలోని అంశాలపై మీ స్పందనను క్లుప్తంగా తెలియజీయండి.

సంపాదకుడు “అమ్మనుడి"

జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి మాచవరం, విజయవాడ-520 004.

ఇ-మెయిల్‌ : ౭64|[౧/2౧7గ౭2౧6౮6|/ 98౧7౭|// ౧0౧