Jump to content

అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నిరుడు వెలిగిన 'పత్రిక'

వికీసోర్స్ నుండి

సాహిత్యరంగం

డా. మధురాంతకం నరేంద్ర 98662 43659

నిరుడు వెలిగిన 'పత్రిక'

“వాట్స్‌ ఆప్‌లో యిటీవల వొక వ్యంగ్య చిత్రం చిందులు తొక్కింది. అందులో పెద్ద గుంపు వో వస్తువిశేషం చుట్టూ చేరి అదేమిటో తెలుసుకోలేక ఆశ్చర్యపడుతూవుంటారు. యింతకూ ఆ వస్తువిశేషం మరేమిటోగాదు. అది వొక పుస్తకం. టీవీలూ, సినిమాలూ, అంతర్జాలమనే మాయా జాలమూ విరుచుక పడడంవల్ల, మనుషులంతా క్రమంగా పుస్తకమనే స్నేహితుడ్ని మరిచిపోతున్నామని ఆ చిత్రకారుడి అభిప్రాయం. పుస్తకమే లేని ప్రపంచమొకటి రాబోతోందని అతని భయం. ఆ చిత్రకారుడు తప్పుకుండా తెలుగువాడే అయివుంటాడు. పుస్తతమన్నదాన్ని మానవజాతి మరిచిపోవడమ న్నదెప్పుడైనా జరిగితే, ముందుగా అది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగి తీరుతుంది. అసలే సాహిత్యపత్రిక లేని జాతిగా గొప్ప గుర్తింపు పొందిన తెలుగులో యిటీవల దాదాపు యెనిమిది నెలలుగా ముంచుకొచ్చిన 'కోవిడ్‌ కరోనా” అనే మహమ్మారి దయవల్ల మిగిలిన వోకటి రెండు పత్రికలు గూడా మూతబడిపోయాయి. యిప్పుడు మనం చేయగలిగింది “చేయెత్తి జై కొట్టు తెలుగోడా! గతమే కీర్తిగల వాడా!” అని పాడుకోవడం మాత్రమే!

ప్రచురణ యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత పారిశ్రామిక విప్లవం మధ్య తరగతి సంఖ్యను పెంచడంతో బాటూ వాళ్లకు కొంత తీరికను కూడా కలగజేసిన తర్వాత, యూరపులో పత్రికల ప్రచురణకు బాగా వూపొచ్చింది. పుస్తక ప్రచురణా, వార్తాపత్రికల ప్రాచుర్యమూ మానవుల లౌకిక సాహిత్య సాంన్కృతిక జీవితానల్ని ప్రభావించేసాయి. దానితో లోకపు తీరే మారిపోయింది. పుస్తకాలూ, పత్రికలూ లేకపోయివుంటే ప్రపంచం యిప్పుడున్నట్లుగా వుండేదేకాదు.

మద్రాసుకు అచ్చుయంత్రం 1806 ప్రాంతానికే వచ్చింది. కానీ 1880 వరకూ తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభం కాలేదని బ్రౌన్‌ మహాశయుడొకచోట చెప్పారు. 1989లో తాను ప్రచురించిన తెలుగు పత్రికల సేవ అనే పుస్తకంలోనయితే తిరుమల రామచంద్రగారు, తెలుగులో వార్తావత్రికా సంప్రదాయం 16వ శతాబ్ద చివరిలో వచ్చిన రాయవాచకం తోనే ప్రారంభమైందంటారు. విశ్వనాధ నాయకుని స్టానాపతి శీ కృష్ణదేవరాయలు దినచర్యను గురించి రాసిన యీ పుస్తకాన్ని పత్రికల ఆరంభమనుకోవడం కేవలం పాక్షికమైన సత్వమేనని గూడా రామచంద్రగారే చెప్తారు.

ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, వ్యాసం అలాగే పత్రికలు, పత్రికారచన అనేది గూడా పాశ్చాత్య ప్రభావంతో వచ్చినదే ననుకోవడంలో తప్పులేదు. ప్రముఖ భాషావేత్త జి.ఎన్‌.రెడ్డి గారు తెలుగులో మొదటి పత్రికగా “కర్నాటక క్రానికల్" ని గుర్తిస్తారు. అది 1832 ప్రాంతంలో వచ్చినట్టుంది. అప్పటి నుంచీ లెక్కబెడితే కొన్ని వందల పత్రికలు తెలుగులో వచ్చి, కొంతకాలం జీవించి, తరువాత మాయమైపోయాయి.

1908 సెప్టెంబరు 8వ తేదీన బొంబాయిలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిచే ఆంధ్రపత్రిక, వారపత్రిక ప్రారంభంగావడం తెలుగు పత్రికల చరిత్రలో బంగారు అక్షరాలతో రాసి గుర్తు పెట్టుకోవలసిన సందర్భం. 1910 నుంచే ఆంధ్రపత్రిక ఉగాది సంచికలను ప్రచురించడం. ఆ సంవత్సరా ప్రత్యేక సంచికలు మొత్తం తెలుగువారి సాహిత్య సాంస్కృతిక వైభవానికంతా ఆవిష్మరాలుగా తయారుగావడం ఆనాడు మధురానుభూతి. 1914లో ఆంధ్రపత్రిక మదరాసుకు తరలిరావడంతో మరొ కొత్త అధ్యాయం ప్రారంభమయింది. అప్పటి నుంచి ఆంధ్రపత్రిక దిన పత్రిక గూడా ప్రారంభమయింది. ఆంధప్రభ వారపథత్రికతో బాటూ కాశీనాధుని నాగేశ్వరరావు గారు 1924లో “భారతి” అనే గొప్ప సాహిత్య సాంస్కృతిక మాసపత్రికను ప్రారంభించడం మరో మరుపురాని సంఘటన. కాశీనాధుని నాగేశ్వరావుగారి తరువాత శివలెంక శంభుప్రసాద్‌ గారి సంపాదకత్వంలో ఆంధ్రపత్రిక, భారతి పత్రికలు ఆధునిక తెలుగు సాహిత్యంలో వోక గొప్ప సవర్ణ భూమికలుగా రూపొందాయి.

1970 ప్రాంతాల్లో తెలుగులో చాలా సాహిత్య సామాజిక పత్రికలుండేవి. ఆంధ్రపత్రిక వార పత్రికతో పాటు ఆంధ్రప్రభ వారపత్రిక కూడా సమాన 'ప్రాచుర్యంతో నడిచేది. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలతో పాటు కొద్ది రోజుల పాటు మాత్రం ఉండిన పొలికేక, ఆదివారం మొదలైన మరికొన్ని వారపత్రికలు వచ్చేవి. యువ, జ్యోతి మాసపత్రికలతో బాటూ విజయ, నీలిమ, తరుణ, విజేత మొదలైన మాసపత్రికలు కొద్దికాలం పాటూ నడిచాయి.

అప్పుడు ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక వచ్చేది. దీపావళికి యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి నుండి వచ్చే ప్రత్యేక సంచికలు గొప్ప సాహిత్య వార్షిక సంరంభాలుగా వుండేవి. ఆతరువాతి కాలంలో స్వాతి మాసపత్రిక వచ్చి, దానికి కొనసాగింపులా స్వాతి వారపత్రిక కూడా వచ్చి చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

ఈనాడు పత్రిక వచ్చాక దానీతో బాటూ చతుర, విపుల అనే మాసపత్రికలు పుట్టాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా మొదలైన చందమామ మాసపత్రికది మరొక పెద్ద వైభవం. బాలమిత్ర, బొమ్మరిల్లులతోబాటూ మరికొన్ని బాలల మాసపత్రికలు చాలా వచ్చి కొద్ది సంవత్సరాలపాటూ మనగలిగాయి.

మొత్తం తెలుగు రాష్ట్ర మంతా ప్రాచుర్యంలో ఉండే యీపత్రికలతో బాటు అనేక ప్రాంతీయ వార, మాసపత్రికలు కూడా వుండేవి. ఆ సంఖ్యను లెక్కబెట్టగలిగితే వేలను దాటొచ్చు. కేవలం వార్తలకు, రాజకీయాలకూ, సినిమాలకు, భక్తికీ కూడా ప్రత్యేకమైన చాలా వార మాసపత్రికలు కూడా పుట్టి కొంతకాలం బతికాయి. కేవలం సంచలనాన్ని ఆలంబనగా చేసుకొనే పత్రికలూ కొన్ని వుండేవి. ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రభుత్వ పత్రిక ఇటీవల వరకు వచ్చింది.

1991లో ఆంధ్రపత్రిక వారపత్రిక ఆగిపోవటంతో యీ పత్రికల చరమదశ ప్రారంభమైంది. భారతి మాసపత్రిక కూడా ఆప్రాంతంలోనే ఆగిపోయింది. ఆంధ్రప్రభ వారపత్రికది కూదా ఆంధ్రపత్రికతో దీటైన చరిత్ర. విద్వాన్‌ విస్వం గారి కలం నుంచీ వాకాటి పాండురంగరావు గారి వరకూ గొప్ప సంపాదకుల నేతృత్వంలో ఆ పత్రిక తెలుగు కథకూ, నవలకూ గొవ్ప ఆలంబనగా వుండేది. 1960-70 ప్రాంతాల్లో వారం వారం బాపు బొమ్మలతో సీరియల్లు గా రావడం తెలుగు నవలా చరిత్రలో మరుపురాని రోజులు. పురాణం సుబ్రమణ్యశర్మ గారి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆనాటి సాహిత్య ప్రమాణాలకంతా దీటురాయిగా వుండేది. ఇక వ్యాపార నవలల ప్రచురణలో ఆంధ్రభూమి వార పత్రిక సంచలనాలను సృష్టించింది.

1995 వరకూ తెలుగు ప్రాంతాల్లోని ప్రతి నగరంలోనూ అద్దెకు పత్రికలనిచ్చే అంగళ్లు చాలా వుండేవి. వూర్లో చాలా చోట్ల పత్రికలనమ్మే అంగళ్లూ కనిపించేవి. 1980 ప్రాంతంలో దూరదర్శన్‌ కార్యక్రమాలకే పరిమితమైన టీవీ రాకతో కొత్త పరిణామాలు వచ్చాయి. సినిమా హాళ్ళతో పోటీ పడేలా టీవీ పార్లర్లు పుట్టాయి. వాటి ప్రభ వొకటి రెండు సంవత్సరాలు సాగింది. టీవీలోకి వ్యాపార ఛానళ్లు రావడంతో పాఠకుల్లో చాలా మంది అక్కడికి వలసపోవడం ప్రారంభమయ్యింది. వినోదానికి వ్యాపార నవలలూ, కథలు, చదివే పాఠకులు టీవీకి వెళ్లడం వల్ల పెద్ద ఇబ్బందేమీ లేదని కొందరు సరి పెట్టుకోజూశారు. వ్యాపార నవలలు రాసే రచయితలు సాహిత్యం నుంచీ వేరే విషయాలకు వెళ్లిపోవడం మంచిదేనని అనుకున్నారు. తమ ప్రాచుర్యాన్ని పెంచుకోవడానికి దినపత్రికల్లో గూడా సీరియల్‌ నవలల్ని ప్రచురించిన సందర్బాలు తగ్గిపోయినా పర్వాలేదనుకొన్నారు. అయితే క్రమక్రమంగా వార పత్రికలొక్కక్కటిగా అగిపోవడం ప్రారంభమయింది. అంతకు ముందే యువ, జ్యోతి అగిపోయాయి. పెద్దలు కూడా ఆవురావురమని యెదురు చూస్తూ ఉండిన “చందమామే” ఆశాభంగాన్ని మిగిలించింది. కొంతకాలం పాటూ తెలుగు కథకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇండియాటుడే వారపత్రిక ముందు సాహిత్యాన్ని వదిలి పెట్టి తరువాత తెలుగునే మరిచిపోయింది.

2020 ఫిబ్రవరిలో కోవిడ్‌ అనే విపత్తు తెలుగు ప్రాంతాలను తాకేటప్పటికి తెలుగు పత్రికలు కొన్ని బలవంతంగానయినా మిగిలేవుండేవి. యీ చీకటి కాలంలో నవ్య అనే ఆంధ్రజ్యోతి వారపత్రిక మూతబడిఫోయింది. చివరకు ఈనాడు యాజమాన్యం కూడా విపుల, చతుర అనే మాసపత్రికల్ని వెజ్‌ పత్రికలుగా కుదించేనింది. యిప్పుడు తెలుగు సాహిత్యానికి మిగిలిందల్లా పాలపిట్ట, చినుకు, విశాలాక్షి అనే కొన్ని చాలా పరిమితమైన 'ప్రాచుర్వముండే పత్రికలు మాత్రమే. కొన్ని దినపత్రికల ఆదివారం అనుబంధాలు మూడునాలుగు పేజీల్ని కధకోసం కేటాయించి తమ వుదారతకు తామే మురిసిపోతున్నాయి. వొకప్పుడు పరిమితమైన విద్వావంతులకూ, విదేశీయులకు మాత్రమే అందుబాటులో వుండిన, వుండగలిగిన అంతర్జాల పత్రికలు యీ చీకటికాలంలో తెలుగు కథ, నవల, కవిత్వాలకు ఆలంబనగా మిగిలివున్నాయి.

మన యిరుగుపారుగు భాషలయిన తమిళ, కన్నడ, మలయాళాలలో యేంజరుగుతూ వుందో తెలుసుకోవడం కోసం కొందరు మిత్రుల్ని అడిగి చూశాను. మలయాళంలో యిప్పుడు కూడా బాగా ప్రాచుర్యంలో వుండే వార, మాసపత్రికలు యిరవైవరకూ వున్నాయట. యీ కరోనా సమయంలో కూడా కొన్ని పత్రికలు 'వోనం' పండుగ ప్రత్యేక సంచికలు ప్రచురించాయట! తమిళంలో యిప్పుడు గూడా పదిపన్నెండయినా కథలూ, నవలలూ, కవిత్వమూ ప్రచురించే వార మాసపత్రికలున్నాయన్నారు. అయితే తెలుగులో వొకప్పుడు ప్రచురించినంత ఖరీదైన పత్రికల్లాగాకుండా అవి మామూలు కాగితం పైనే ప్రచురించబడుతున్నాయి. అందువల్ల వాటిఖరీదూ తక్కువే! చదివేవాళ్ళూ యొక్కువే! కన్నడంలోనూ దాదాపుగా అదే పరిస్థితివుంది. మన యీమూడు సోదరభాషలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు జనసంఖ్యవుండే మన తెలుగులో మాత్రమే పత్రికలు బతికి బట్టగట్టు లేకపోయాయి. పత్రికలు మూతబడ్డాయనీ కేవలం రచయితలు మాత్రమే వాపోతున్నారు. అసలు పత్రిక అనే వొక సాంస్కృతిక భూమిక వుండేదని గుర్తయినా లేని జనం మాత్రమే తెలుగులో మిగిలిపోయారు.

యీ కరోనా సమయంలో మలయాళ ప్రభుత్వం పనిగట్టుకుని యింటింటికీ పుస్తకాల్ని చేర్చే యేర్చాటు చేసిందట! తెలుగు రాష్ట్రాల్లో గ్రంధాలయాలన్నీ యిప్పుడు దాదాపుగా చారిత్రక శిధిలాలుగా మారిపోతున్నాయి. తమిళమూ, కన్నడమూ, మలయాళాలలో వచ్చే పుస్తకాలను ప్రభుత్వమే వందలసంఖ్యలో కొని గ్రంధాలయాలకు చేరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ ప్రచురణగా వస్తూవుండిన “ఆంధ్రప్రదేశ్‌ అనే మాసపత్రికకూడా ఆగిపోయిందని అనుకునేవాళ్ళు సయితం యిప్పుడులేరు.

కథ, నవల అనే ఆధునీక సాహిత్య ప్రక్రియలు పత్రికలు పుట్టిన తరువాతే (లేక పత్రికలతో బాటూనే) పుట్టి యింత ప్రయాణము చేశాయి. టాల్‌స్టాయ్‌, దాస్టోలిస్కీ చార్లెస్‌ డికెన్స్‌, చెకావ్‌, మొపాసా, ఓహెన్రీ, స్టెయిన్‌బుక్‌, రవీంద్రనాథ్‌ టాకూర్‌, శరత్‌ చంద్ర ఛటర్జీ, ప్రేమ్ చంద్ -యీ ఆధునిక రచయితల జాబితా చాలా పెద్దది. పత్రికలు లేకుండా యీ రచయితలెవర్నీ వూహించలేరు. ఆధునిక ప్రపంచ సాహిత్యానికంతా పత్రికలే ఆలంబన. టీ.వీ సినిమా వంటి ఆధునిక మాధ్యమాలెన్ని వచ్చినా తెలుగు ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా పత్రికలు అవసరమైనంత స్థాయిలో వెలుగుతూనే వున్నాయి.

1980 ప్రాంతంలో రచయితలకు ప్రచురించుకోవడానీకి పత్రికలు వుండడమే కాదు, రాసినందుకు పారితోషికాలు కూడా వుండేవి. క్రమంగా పారితోషికాలు ఆగిపోయాయి. పాఠకులు తగ్గారు. అయినా దాదాపొాక యాభైమంది వరకూ రచయితలు వందల సంఖ్యలో కవులూ రాయడమన్నదొక బాధ్యతగా రాసుకుంటూ పోతున్నారు. వున్న మిగిలిన కొద్దిమంది పాఠకులకూ, రచనలకూ మధ్య వారధిగా వుండాల్సిన పత్రికలే కూలిపోతే రచనల అస్తిత్వానికి ప్రశ్నలే మిగిలుతాయి. గత పది సంవత్సరాలుగా ఐటీ రంగంలో స్థిరపడిన విద్యావంతులూ, విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్ళు బాగా చదవడమేకాకుండా, విడిగా రాయటంలో గూడా సాధన చేస్తున్నారు. అయితే అంతర్జాలానికి మాత్రమే పరిమితమైన ఆ సాహితీ సృజన అందరికీ అందుబాటులో వుండేలా కొన్నయినా పత్రికలుండాలి గదా!

యిుదొక అరణ్యరోదనం!

యెవరు పట్టించుకుంటారు?