అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నా జెట్టిగామాలపాడు-తంగెడ యాత్ర

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఈమని శివనాగిరెడి 98485 98446


అడుగుజాడల్లో ఆనవాళ్లు-3

నా జెట్టిగామాలపాడు- తంగెడ యాత్ర

కోడి కంటే వాడిగా, ఒక ఘడియముందే లేచాను. ఆదివారం అందరికంటే నాకు మరింత ఆనందాన్నిచ్చేరోజు. రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా, ఇంట్లో కూడా చెప్పకుండా పంజరం నుంచి చిలకలాగ నేను చరిత్ర-శాసనాలు అన్న రెండు రెక్కలు తొడుక్కొని ఎక్కడో దూరాన ఉన్న ఊళ్లపై, ప్రాచీనశాసన రాళ్లపై వాలుతుంటాను. ఈసారి బెజవాడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు వశపరచుకొన్న దాచేపల్లి దగ్గర, కృష్ణాతీర చారిత్రక స్థలం తంగెడకు బయలుదేరా. ఉదయం ఆరింటికి దాచేపల్లి (అసలు పేరు దాసపల్లి) చేరుకొని, బ్రిటీషు కాలంనాటి రహదారిబంగ్లా ముందు ఆగి, భవనపు అందాల్ని ఆరగిస్తూ ఒక అరకప్పు కాఫీ తాగుతున్నా. పక్కనుంచి శివనాగిరెడ్డిగారు నమస్మారం అంటూ ఓ పలకరింపు. ఆయన పశువైద్యులు డా. స్వర్ణవాచస్పతి. వాళ్ల నాన్న ప్రముఖ వాస్తు-శిల్సి స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారు. భారతీయ మహాశిల్చం పేరిట వాస్తు శాస్తాలన్నింటినీ తెలుగులో 16 గ్రంధాలు వెలువరించిన శిల్చశాస్త్ర ఘనాపాఠి. వాచస్పతిగారు కూడా, రావణ బ్రహ్మ వాస్తు-శిల్చ పదనిఘంటువు, ఇంకా అనేక ప్రామాణిక గ్రంధాల రచయిత. ఇద్దరం కలసి చరిత్ర శకలాల వేటకి వెళ్లాం. స్థానిక నాగేశ్వరాలయంలో క్రీశ 1218 నాటి కాకతీయ గణపతి దేవుని మహాప్రధాని ఖీమనాయకుని దానశాసనం, పాత పెద్దకోట శివాలయంలోని క్రీశ. 14వ శతాబ్ది దేవయరెడ్డి శాసనం, ఆంజనేయాలయం ముందటి క్రీ.శ 1789నాటి వెంకన్న పంతులు నాగులేటికి మెట్లు కట్టించిన శాసనాలను, కొత్తదనం పేరిట పురాతనాన్ని పోగొట్టుకున్న గుళ్లనూచూశాం. నాగేశ్వరాలయంలోని దిక్కుమొక్కులేని నాగదేవత, వీరశిల, కుమారస్వామి శిల్పాలు జాలిగా మా వంక చూడటం తట్టుకోలేకపోయాం. కూరుకుపోయి కొన్ని పగిలిపోయి మరి కొన్ని వంగిపోయి ఇంకొన్ని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మౌనంగా బాధ్యతనుగుర్హు చేస్తుంటే గుండె బరువెక్కింది. గట్టిగా నిట్టూర్చేలోవు, వాచస్పతిగారు వీడుకోలు చెప్పి పక్కకు తప్పుకొన్నారు.

అసలు నేను చూడాలనుకొంది తంగెడ. పక్కనే పల్నాడు చరిత్రతో ముడిపడి ఉన్న జెట్టిగామాలపాడుకు నాదారి మళ్లింది. గ్రామానికి 1 కి.మీ. తూర్పుగా, కాలిబాట. అక్కడొక పాడుబడిన కోట. అక్కడక్కడా కప్పుల్లేని ఇళ్లు. తలుపుల్లేని గుళ్లు. విరిగిన శిల్పాలు, పగిలిన శాసనాలు, అరిగిన రోళ్లుు అలుపెరుగని తిరగళ్లూ. వన్నెకోల్పోయినా, పల్నాటి పౌరుషాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ఒంటెలా ఓగంటపాటు ఒంటరిగా తిరిగి ఒకచెట్టు కింద కూర్చున్న నాకు, క్రీ.శ.1182లో నాయకురాలు నాగమ్మ తండ్రి చౌదరిరామిరెడ్డిని ఉరితీసింది ఈ చెట్టుకిందేనేమోననిపించింది. దాంతోపాటు పల్నాటి వీరభారత ఘట్టాలు, వీరులెక్కిన గుర్రాల పదఘట్టనలు, కరవాల కరచాలనాలు, నేలకొరుగుతున్న వీర సైనికులూ, భీభత్సంగా పరుగులు తీస్తున్న ఏనుగుల ఘీంకారాలు, కుత్తుకలు కత్తిరిస్తున్న కత్తుల వికటాట్ట హాసాలు కళ్లవుందు కదలాడాయి. ఒళ్లంతా కంపించింది. నాగులేటి నాపరాళ్ల సందుల్లోంచి మెలికలు తిరుగుతూ, దానిదారిన అదిపోతున్న ఒక మెలికల పాము నన్ను మళ్లీ ఈలోకంలోకి తీసుకొచ్చింది.

చౌదరి రామిరెడ్డి చనిపోయింది ఇక్కడే. “చౌదరి” అన్న పదం ఒకప్రాంతంలో పండిన పంటలో నాలుగోవంతును పన్ను రూపంలో (చౌత్‌ + అరి = చౌదరి (ప్రభుత్వానికి జమచేసే అధికారిని సూచిస్తుంది. రానురాను అది, రెడ్డి మాదిరిగా కులవాచకమైంది. గామాలపాడు అసలు పేరు జెట్టిగామాలపాడు. కుస్తీ పోటీల్లో కండబలాన్ని గుండెబలాన్ని ప్రదర్శించే ధృఢథకాయులైన యోధుల్ని జెట్టీలంటారు. రానురాను జెట్టిగామాలపాడు, జిట్టగామాలపాడై చివరకు గామాలపాడైంది. పేరుకుపోయిన రాళ్ల గుట్టల్లోని శిల్పాలు,శాసనాల పలకరింపులు కాళ్లను కదలకుండా కట్టిపడేశాయి. పదిలపరచే ఎదలకోసం ఎదురుచూస్తున్నాయి.

గామాలపాడు శంభునిగుడిలోని క్రీశ. 1223 నాటి కుమ్మరికుంట బేతరాజు దాన శాసనం, నంది స్థంభం పైనున్న క్రీ.శ. 1290 నాటి మల్లికార్జున నాయకునికి పుణ్యంగా, దానంచేసిన దాడిపోచుంగారి శాసనం, చెన్నకేశవాలయం వెనుకున్న క్రీ.శ.1677లో బొల్లా నారశింహుడు గరుడ స్టంభాన్నెత్తించిన శాసనం, నాయకురాలు నాగమ్మ గుడిద్వార శాఖ పైనున్న క్రీ.శ 15 వ శతాబ్దిలో చెన్నమల్లికార్డునునికి ముఖమండపం కట్టినట్లు తెలిపే శాసనం, ఇరికల్లి దారిలోనున్న క్రీ.శ, 16వ శతాబ్ది గుండయరెడ్డి శాసనం,

క్రీ.శ. 1312 నాటి గజసాహిణి గుయిరెడ్డి పన్ను మాన్యం శాసనాల అక్షరాలపై నా మునివేళ్లతో పలుమార్లు తడిమి, తడిమి చూశాను. తెలుగు తల్లి


ఒడిలో గుడికట్టుకాన్న చరిత్రను ఒడిసి పట్టుకొన్నాను.

ఒకనాటి మేటి శాసనపరిశోధకులు శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ గారినీ తలచుకున్నాను. నాయకురాలిదిగా పిలువబడుతున్న అపురూపాలయం, చంనమల్లికార్డునాలయమనీ, దాడిపోచుంగారి శాసనంలోని మల్లికార్జున నాయకుడు, ఎవరోకాదు, కాయస్థ అంబదేవుని కుట్రలు కుతంత్రాలకు బలై, రుద్రమదేవితో పాటు యుద్ధభూమిలో మరణించిన ఆమె అంగరక్షకుడని తెలుసుకున్నాను. క్రీ.శ 12వ శతాబ్టినాటి నాయకురాలు నాగమ్మ దేవాలయం కళ్యాణీ చాళుక్య వాస్తుశైలిలో అత్యంత శిల్చకళావిన్వాసంతో పల్నాటి నాపరాతితో నిర్మించబడింది. శిఖరం పడిపోయింది. కలశం కనుమరుగైంది. ప్రజలతో, ప్రభుత్వంతో పనిలేకుండా చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు ప్రహారీ గోడలా ఆలయాన్ని కాపాడుతున్నాా పక్కనున్న పదో శతాబ్ది బైరవ విగ్రహం నిర్లక్ష్యానికి నిరసనగా ఢమరుకాన్ని మోగిస్తూనే ఉంది. ఆరుగంటలపాటు అణువణువూ అన్వేషించి అలసిపోయిన నన్ను ఆకలి, ఈలోకంలోకి తెచ్చింది. దాచేపల్లి అడ్డరోడ్డులో సుబ్బమ్మ హోటల్లో భోంచేస్తూ, వరంగల్‌ మట్టెవాడలో టిట్టిభశెట్టి, మంచన శర్మలు ఇంపుగా కడుపునింపుకొన్న పూటకూళ్లమ్మను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకున్నాను. కర్తవ్యం గుర్తుకొచ్చి, కారెక్కాను తెలియకుండానే, తంగెడ చేరుకొన్నాను.

2009వ సంత్సరంలో శ్రీకృష్ణదేవరాయలి 500వ పట్టాభి షేకోత్సవాల సందర్భంగా, నేను, మిత్రులు కె.జితేంద్రబాబు, డి.సూర్యకుమార్‌ కలసి శ్రీకృష్ణదేవరాయల తెలుగు శాసనాలు” అన్న పుస్తకాన్ని తెచ్చాం. తూర్పు దిగ్విజయ యాత్ర సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలం, చిన్నఅహొబిలం, కాంచీపురం మొదలైన శాసనాల్లో తాను జయించిన కోటల్లో తంగెడ కోటను గురించి ప్రస్తావించిన సంగతి, క్రీశ 1515 జూలై 25, బుధవారం నాటి శ్రీకృష్ణదేవరాయలి శ్రీశైలం శాసనంలో శ్రీ వీరప్రతాప శ్రీకృష్ణదేవమహారాయలు విజయనగరాన నుండి పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి, ఉదయగిరి దుర్గం సాధించి, తిరుమల కాతరాయ మహాపాత్రుని పట్టుకుని, అద్దంకి, వినుకొండా, బెల్లంకొండ, నాగార్జునునికొండ, తంగెడ, కేతవరం, మొదలైన గిరి దుర్దా స్థల దుర్గాలు ఏకధాటిన గైకొని అని పేర్కొన్న విషయం మదిలో మెదిలాయి.

కృష్ణరాయలు వశమైన తంగెడ కోట గోడను చూడగానే ఐదొందలేళ్ల నాటి సంఘటన కళ్లముందు కదలాడింది.నిజానికి శ్రీకృష్ణదేవరాయలు తంగెడకొచ్చి, కోటను స్వాధీనం చేసుకోలేదు. ఈ మూరు రాయగండడు, తూర్పు దిగ్విజయ యాత్రలో ఉదయగిరి నుంచి బెల్లంకొండ దాకా గల గిరి, స్ధల దుర్గాల్ని జయించిన పరాక్రమవంతుడని విన్న తంగెడ దుర్గాధిపతి కృష్ణరాయనికి లొంగిపోయి, స్థలదుర్దాన్ని ఆయన వశం చేశాడు. కాలి నడకన కోట చివరిదాకా వెళ్లాను. కృష్ణానది కనిపించింది. తెలంగాణాకు కొత్తగా నిర్మించిన వంతెన కనిపించింది. మళ్ళీ కృష్ణ ఒడ్డు నుంచి వ్యాపించిన గుండ్రటి రాతి కోట ఐదు అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు, నాలుగు దిక్కులా ప్రవేశద్వారాలు, దక్షిణ ద్వారానికి ముందు నాలుగు కాళ్ల మండపం, సాక్షిదుర్దాలయం, చుట్టూ లోతైన కందకం. లోనికి ప్రవేశించగానే వేణుగోపాల, వీరేశ్వర, వీరభద్ర, గంటల రామలింగేశ్వరాలయాలూ, ఒక దిగుడు బావి, అనేక శాసనాలూ తంగెడ చరిత్రకు అద్దంపడుతున్నాయి. చరిత్రపై అసక్తిగల ఒక కుర్రాడి మోటారు సైకిల్‌పై మళ్లీ కోటగోడ చుట్టూ, లోపలా, చుట్టొచ్చి దక్షిణద్వారం దగ్గర టీ తాగి శాసనాలమీదే ధ్యాస, కొత్త విషయం మీద ఆశతో అన్వేషణకు బయలుదేరాం.

గంటల రామలింగస్వామి ఆలయంలో క్రీ.శ 1308 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనంలో తంగెడ గవర్నరు దేవరి నాయని సమక్షంలో అక్కడి 18 సమయాల వారు, ఉభయ నానాదేశ పెక్కండ్రనే వర్తకులు, తమ అమ్మకాల్లో కొంత లాభాన్ని గంటల రామనాథ దేవరకు సమర్పించినట్లుంది. వేణుగోపాల దేవాలయం ముందున్న క్రీ.శ. 1373 నాటి కొండవీటి ప్రభువు అనవేమారెడ్డి శాసనంలో అవుభళనాధుని దేవులెంక, గోపినాధ దేవుని చుట్టూ మండపం కట్టించి, 12మంది అళ్వార్లను ప్రతిష్టించి, కొంత భూమిని దానం చేసినట్లూ,కుమార గిరిరెడ్డిగారు రాజ్యం చేయుచుండగా(బహుశా యువరాజుగా) తంగెడ పాలకులైన చొక్క్మన సింగన, వాడపల్లి ఎక్కటీలు (సైనికులు), ఇంకా

తంగెడ సైనికులు, ఆలయానికి చేసిన



దాన వివరాలున్నాయి.

తంగెడకు పడమరగా అడవిలోనున్న క్రీ.శ.1391 నాటి కుమారగిరిరెడ్డి శాసనంలో చొక్మన సింగన , స్థానిక నరశింహస్వామికి, అళ్వార్లకు గోంగులపాటి (గోగులపాడు) దాసపల్లి(దాచేపల్లి) అనంతగిరి (అనంతారం), పినగారిపాడు (గారపాడు), కల్లుపాడు(కర్లపాడు) బయ్యనపాడు, ఆకురాజుపల్లె, కొత్తపల్లి, కాచవరం, తక్కెళ్లపాడు, చింతపల్లిలో కొంత భూమిని, చింతపల్లి గోపులెంక తెలుంగరి, కొంత భూమిని, గోపాయ రెడ్డి తన జీత తుమ్మలచెరువులో మీద కొంత ఆదాయాన్ని సమర్పించినట్లు చెప్పబడింది. లెంక అనగా రాజుల విశ్వాససేవకుడు. గోపులెంక తెలుంగరి అని చెప్పబడింది. తెలుంగరి అనే శబ్దం అర్ధంపై పరిశోధించాలి. గోపాయరెడ్డి, తంగెడ ఎక్కటీలు(సైనికులు) తమ జీతాల వల్ల కొంత భూమికొనిచ్చారు. జీతం అన్న పదం ఆనాడు వారి సేవలకుగాను ప్రభుత్వం సంవత్సరానికిచ్చే భూమి రూపంలోని పారితోషికంగా చెప్పుకోవచ్చు. అదే బ్రిటీషు కాలానికి నెలజీతమైంది.

వేణుగోపాలస్వామి ఎదురుగా పాతిన గరుడస్థంభం పైనున్న క్రీ.శ. 1394 నాటి కుమారగిరిరెడ్డి శాసనంలో వెల్లంపల్లి రాజబంట్లు, పడాలు (సైనికులు), వారి జీతాల్లో కొంత భాగాన్ని గోపీనాధునికి సమర్పించినట్లుగా చెప్పబడింది. క్రీ.శ. 1509 నాటి ప్రతాపరుద్ర గజపతి శాసనం, తంగెడ గజపతుల పాలనలో కొచ్చినట్లు తెలియజేస్తుంది. క్రీ.శ. 1656 నాటి కాకునూరి అప్పకవి, తన 'అప్పకవీయం'లో తంగెడ, కృష్ణకు దక్షిణంగా కొండవీటికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఈశాన్యంగా ఉందని రాశాడు. గజపతుల తరువాత ఈ సీమ విజయనగర రాజులు, కుతుబ్‌షాహీల పాలనలోకొచ్చింది.


తంగెడ దక్షిణ కోట గోడ ఆనాటి రాచరికపు వ్యవస్థ, ప్రధాన ద్వారం 'ప్రక్మన చిన్న ద్వారం, వచ్చీపోయేవారి నియంత్రణ పద్దతికి ఆనవాళ్లు. ద్వారానికి దక్షిణంగా సగానికి పైగా పూడుకుపోయిన దుర్గాదేవి ఆలయముంది. గ్రామంలో ఎవరైనా తప్పుచేస్తే నిజం ఒప్పించే సాక్ష్యవేదికగా ఇప్పటికీ తన ప్రాముఖ్యతను నిలుపుకొంటుంది. ద్వారంలో ప్రవేశించేముందు, ఎడమ వైపు బురుజు పక్శనే ఒక శాసనం కూరుకుపోయి, దాని శ్వాసనాళాలు మూసుకుపోయాయి. వీరభద్ర, వీరేశ్వర, గంటల రామలింగ ఆలయాలు కొద్దిగా ఆధునీకరింప బడినాయి. కానీ వేణుగోపాల ఆలయం, ఇతర కట్టడాలు, శాసనాలు, ప్రాచీనతతో పురాతనాన్ని ఒలికిస్తున్నాయి. ఊళ్లో పశువుల ఆసుపత్రి దగ్గరున్న ద్వికూటాలయం ముందు వసారాలో ఒకరు ట్రాక్టరును నిలుపుకొంటున్నారు. ఆలయం గోడల వెంబడి, స్థానికులు చెత్తను కుప్పలుగా పోస్తున్నారు. కోపం కట్టలు తెంచుకుంది. ప్రజాస్వామ్యం ఇచ్చిన అలుసుతో అందరికీ చెందిన ఆలయం కొందరి సొంత వనులకు పరిమితమైందేమో అనిపించింది. ఒక వైపు నీటి తొట్టి, మరో వైపు పశువుల ఆశుపత్రి, గోడలను దాటితే ఏపుగా పెరిగి సర్కార్‌ తుమ్మలు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలయ్యాయి.

క్రీ.శ. 14వ శతాబ్ధి ఆలయం బయట ఇలా ఉంది, లోపల ఎలాఉందోనని తొంగి చూశా. గుప్తనిధుల కోసం మండపం, గర్భాలయాలను తవ్వేసి చిందర వందర చేశారు. కప్పు బండలు తొలగిపోయాయి వానలు కురిసి మట్టి పేరుకుపోయింది. ముట్టె విరిగిపోయినా, అపురూపంగా చెక్కిన నంది, ఈ ఆలయం ఒకప్పుడు త్రికాలార్చనలందుకొన్నదని చెబుతుంది. తంగెడ కృష్ణానది ఒడ్డునున్నా తాగు నీటికి ఎప్పుడూ కటకటే. ఎప్పుడో మధ్య యుగాల్లో రాతినేలను తొలచి మలచిన మెట్లబావి ఆ ఊరికి ఆకాశ గంగ. బావిలోపల ఒక మట్టంలో ఒక ఆలయం, ఇంకోమట్టంలో మరో ఆలయం. ప్రక్మనే రావిచెట్టు, ఆచెట్టు ముందు ఇంకొక చిన్న ఆలయం. అన్నీ చూచిన తరువాత, కొట గోడల చుట్టూతిరుగుతున్న నాకు, ఆ గోడ లోపల గడ్జివాములు, పశువుల కొట్టాలు, గోడకు బయట చెత్తకుప్పలు,

పిచ్చిమొక్కలు, యుద్ధంలో చేయితెగిన సైనికునిగా కనిపిస్తున్న పడిపోయిన పశ్చిమ సింహద్వారపు నిలువు స్థంభాలు, నాకు మళ్లీ మనశ్శాంతి లేకుండా చేశాయి. పశ్చిమ ద్వారం నుంచి బయటికొచ్చి మట్టపల్లి బ్రిడ్జి దాకా వెళ్లాను. అక్కడ పులిచింతల రిజర్వాయరులో మునిగే ఒక 13వ శతాబ్ది దేవాలయాన్ని ఊడదీసి పదేళ్లక్రితం ఆ రాళ్ళను రోడ్డు ప్రక్కనే అనాధ శవాల్లా పడేశారు. చక్కటి చెన్నకేశవ విగ్రహం ముక్కలైంది. రోడ్డుకు ఎడమవైపున ఏనుగులు నీళ్లు త్రాగే 20 అడుగుల పొడవు ౩ అడుగుల లోతు, అంతే వెడల్పుగల రాతి తొట్టి ఎవరికీ పట్టకుండా ఉంది. ఇంకా ముందుకెళ్లాను. వరుసగా దాదాపు వంద వరకూ రాతి పెట్టెల్లాంటి కట్టడాలు కన్పించాయి. పరిశీలించి చూస్తే





అవి క్రీ.పూ. 1000 నాటి ఇనుప యుగపు సమాధులు. కొత్త వంతెన కోసం 25 సమాధులు ఆనవాళ్లు కోల్పోయి చరిత్రకు


చరమగీతం పాడాయి. రోడ్డుక్మావల్సిన కంకర కోసం మిగిలిన సమాధిరాళ్లూ బలైపోయాయి. పెద్దల తప్పిదాలకు పిల్లల సమాధులు చిన్నబోయాయి. తెలిసినా, తెలియక పోయినా, చరిత్రకు అపచారం జరిగింది. వారసత్వం వరసతప్పింది. శాసనాలకు శ్వాస ఆగింది. శిల్పాలు నిర్వికల్పాలయ్యాయి. శిధిలాలు వ్యధాభరిత కథనాలు చెబుతున్నాయి. అమరుడైన కుమారగిరిరెడ్డి కళకళలాడిన తంగెడ వెలవెలబోవడం చూచి కుమిలిపోయాడు. చొక్కన సింగన ముక్కున వేలేసుకొన్నాడు. తంగెడ స్థల శిధిలాలను చూచిన శ్రీకృష్ణదేవరాయలు మనోవ్యథకు గురైనాడు. ఇంటికొచ్చి బువ్వతింటూ తంగెడను తలచుకొంటే, నాకు మింగుడు పడటం మానేసింది.


మీకేమైనా తెలుసా

నేను ఆకాశపు శూన్యాన్ని అనుకుంటుంటే...

మదిలో అంటుకుపోయిన చింతల చిగుళ్ళు

గుబులు మొయిళ్ళు ఫక్కున నవ్వాయి!!!

నేను ధరిత్రిననగానే... చీటికి మాటికి మొలకెత్తే అసహనపు ఆనవాళ్ళు నిక్కిచూశాయి!!!

నేను మలయానిలాన్నందామంటే... గుండెల్లో ఎగసే విద్వేషపు అసూయల లావాలు భగ్గమన్నాయి!! నిర్మల జలాన్ననుకుందామంటే... అంతరంగంలో ఆగని సాగరఘోష నిలువనీయటం లేదు!!! పంచభూతాలు కలగలసినా.. ముఖ్యంగా. పార్ధివాన్నని... నాకింకా తెలీటంలేదు..!!

అనలమై ఎగసిపడుతూ...

ఝురినై తుళ్ళిపడుతూ...

మేఘాల ముసురుకు కన్నీరు పెడుతూ...

దరి లేని తలపులకారడవుల పడి, లేస్తూ.

లేఖిని నిండా చిత్రవర్దాలు నింపి.

గరళాన్ని ఆర్జవాన్ని

అక్షరాల జల్లుగా చల్లుకుపోతున్న నేనేంటో నాకు తెలియటం లేదు...???

మీకేమైనా తెలుసా... నేనెవరో..!!!???

-సుభాషిణి ప్రత్తిపాటి 8099305303

సాక్ష్యం ఎం!

చదువుగురెంచి మాట్లాడుకోవాలి,

చదువు.. ఏభాషలో సాగిందీ చెప్పుకోవాలి.

చదువు ఎక్కడ కొనసాగిందీ చర్చించుకోవాలి ! దిగువ మధ్యతరగతి నేపథ్యంగా

ప్రభుత్వ విద్యాసంస్థలే నా ప్రగతికి

అండగా నిలిచాయి.

నన్నొక బాధ్యతగల దంత వైద్యుడిని చేసాయి,

సామాజిక సమస్యలకు స్పందించే

కవిని చేసాయి... కథకుడిని చేసాయి... వ్యాసకర్తను చేసాయి.. ఒక సాహిత్యకారుడిగా తయారు చేసాయి ...!

చెప్పొచ్చేదేమిటంటే, వృత్తి విద్య తప్ప మిగతా చదువంతా మాతృభాషా మాధ్యమంలోనే ...!

నాకొక గొప్ప జీవితాన్ని అందించింది

తెలుంగు భాషే ... తెలుగుతల్లికి వందనం ..!!

-డా.కె .ఎల్‌ వి.ప్రసాద్‌

9866252002


రెండో భాష నేర్చుకోవటానికీ, ఉన్నత విద్యకు పోయే కొద్దీ మరో భాషలో చదువుకొనసాగించటానికి తల్లి భాష పునాదిగా ఉండి, వేదికలా పనిచేస్తుంది. కాబట్టి ఉన్నత విద్యలో రాణించటానికి ఉపయోగ పడుతుంది. సొంత భాషలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యం అంతా దానంతట అదే నేర్చుకొనే భాషలోకి మారుతుంది. కొత్తగా నేర్చుకోవల్సిన అక్కర ఉండదు”


తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020