అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/అమ్మనుడులే బడినుడులుగా ఉండాలి
సంపుటి :6 సంచిక; 6 ఆచార్యుని ణమ్మునుచె తలుకులు నవంబరు 2020
అమ్మనుడులే బడినుడులుగా ఉండాలి
జీవ పరిణామ క్రమంలో భాష పుట్టుక ఒక విప్లవం. మానవుణ్ణి మహోన్నతుణ్ణి చేసినది తను మాట్లాడే భాషే ఈ నేలపై పుట్టి పెరిగిన జీవులలో మనిషిదే ఉన్నత స్థానమని అందరికీ తెలుసు. అయితే ఆ మనిషి ఎందుకు అంతగా ఇతర జీవులపై పైచేయి సాధించి కనీ వినీ ఎరుగనటువంటి నాగరికతను సృష్టిస్తున్నాడంటే దానికి జవాబుగా - భాషే దానికి మూలం అని మానవశాస్త్రవేత్తలు అందరూ చెబుతారు. అంటే స్థూలంగా ఈ ప్రకృతిలో మానవుడు సాధించిన అన్ని విజయాలకూ మూలం భాషే మరి, పరిణామ క్రమంలో ఆ భాష మనిషికే ఎందుకు సొంతం ఐనట్టు, ఇన్ని కోట్ల జీవరాసులు ఉండగా. దీనికి జవాబుగా “మానవ మేధస్సే” కారణం అని అటు మేధావులూ ఇటు జీవశాస్రజ్ఞులూ కూడా అంటారు. మానవ మేధస్సు ఇంతగా పరిణితి చెందడానికి కారణం మనిషి మెదడు పరిమాణమే.
మెదడు బరువును బట్టే మనిషి తెలివిగలవాడు అయ్యాడు అంటారు. అయితే పరిణామ క్రమంలో అతి స్థూలకాయం కలిగిన జీవులలో మెదడు కూడా పెద్దదిగానే ఉంటుంది. కానీ ఆ మెదడులో ఎక్కువ భాగం ఆ స్థూలకాయాన్ని సజావుగా నడిపేందుకు పనిచేస్తుంది. జీవశాస్రజ్ఞులు జీవులలో తెలివికి కొలమానంగా జీవుల మెదడు బరువుకీ శరీర బరువుకీ మధ్యనున్న నిష్పత్తిని ప్రమాణంగా _ చెబుతారు. మనుషులలోనూ ఎలుకల్లోనూ ఇది 1: 40 అయితే, చింపాంజీలలో 1: 110, ఏనుగులలో 1: 560గా ఉంది.) అయితే ఈ నిష్ప్రత్తుల సాపేక్షతలో ఎలుకలు మనిషితో పోటీపడుతున్నాయంటారు. మళ్లీ దీనికి జవాబుగా మనిషి తెలివికి కారణం, మెదడుకు ఉన్న అనేక లోతైన ముడతలు ఉన్న పైపొరలే అంటారు. అంటే ఈ లోతైన ముడతల పొరలవలన ఉపరితల వైశాల్యం విపరీతంగా పెరుగుతుంది. ఇట్లా పెరిగిన ఈ ఉపరితల ముడతల పొరలలో ఉండే న్యూరాన్లు అనే కణజాలమే (కార్డెక్స్) మనిషి ఇంత తెలివిగా ప్రవర్తించడానికీ పరిణామ క్రమంలో భాషా వికాసం సాధ్యపడటానికీ మూలం అంటారు. ఈ న్యూరాన్‌లే సమాచారాన్ని అందుకోవడమూ పంపిణీ, బైటి నుంచి వచ్చే ప్రేరణలకు స్పందించడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.
మనుషుల్లో గూడా శరీరక బరువూ మెదడు బరువుల నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నా శరీర బరువు ఎక్కువ ఉన్నవారికంటే శరీర బరువు తక్కువ ఉన్నవారు ఎంతో కొంత తెలివిగా ప్రవర్తిస్తారట. ఈ వరవడిలోనే పసిబిడ్డల్లో, చిన్నపిల్లల్లో మెదడు బరువు శరీర బరువుకంటే నిష్పత్తిలో (సుమారుగా 1:10)చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ వయసులో వారు పెద్దవారి కంటే తెలివిగా ఉంటారు. అందుచేతనే అతి సంక్షిష్టమైన భాషను ఎవరూ ప్రత్యేకంగా నేర్చకుండానే సులువుగా నేర్చుకోగలుగుతున్నారు. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ మాటలకు స్పందిస్తూ అమ్మ నుడికి నేపథ్యాన్ని ఆలకిస్తూ, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టగానే తల్లిదండ్రుల నుంచీ చుట్టూ ఉన్నవారి నుంచీ అమ్మనుడిలో నేర్పును సాధిస్తాడు. భాష అంటే ఏవో నాలుగు పడికట్టుపదాలతో మాట్లాడగలగటం కాదు. ఆ చిన్న వయసుకే (ఆరేళ్లు) పిల్లలు భాషను అంతర్గతీకరించుకుంటారు. అంటే అమ్మనుడికి తమ మెదళ్లలో వ్యాకరణ నిర్మాణం చేసుకుంటారు. ఈ అమ్మనుడి పునాది పైనే, ఆ తరువాత నేర్చే ఇతర భాషా వ్యాకరణాల నిర్మాణం తేలికఅవుతుందంటారు భాషాశాప్రజ్ఞులు. ఈ ఉపోద్ద్ధాతం అంతా ఎందుకంటే, పిల్లల్లో భాషను నేర్చే శక్తి సామర్ధ్యాలు సమస్త జీవరాసులలో కంటే ఎక్కువ. పిల్లలు భాషలను పుట్టక ముందు నుంచే మొదలుపెట్టి పుట్టిన ఆరు సంవత్సరాలకే అవసరమైన భాషనంతా నేర్చుకొంటున్నారు. ఇట్లా నేర్చిన భాషా పునాదిమీద మరో భాషను నేర్చుకోవడం సులువవుతుంది. ఆ అమ్మనుడే ఆ తరువాత తరగతి గదిలో నేర్చిన కొత్త ఏషయాల అవగాహనతో విస్తృతమౌతుంది. ఈ పరిణామంలో పిల్లలకు ఎటువంటి బెరుకూ భయాందోళనలూ కలుగవు. ఈ క్రమాన్ని తల్లకిందులు చేసి తరగతిగదిలో అమ్మనుడికి బదులు పర నుడులను వాడితే పిల్లల మానసిక ప్రవర్తనలో అనూహ్యమైన మార్చులు చోటుచేసుకుంటాయి. తరగతిగదిలో భాష పరాయిది అయితే, పిల్లల మనస్సులో బెరుకూ, భయం, ఆందోళనా మొదలై, వారు చదువులో వెనకబడిపోవటమూ, చివరికి బడిమానేసెయ్యడదమూ జరుగుతుంది. అందుకనే ప్రపంచమంతటా జరిగిన పరిశోధనలలో పిల్లల చదువులకు ఇంటి భాషే బడి భాష కావాలనే విషయం తేటతెల్లమైంది.
అమ్మభాషే బడి భాషగా కూడా ఉండాలనడానికి ఇప్పుడు చెప్పుకున్న విషయాలే కాకుండా ఇంకా ఎన్నో సామాజిక ఆర్ధిక విషయాలూ సాంస్కృతిక అవసరాలూ ఉన్నై. భాషకు జాతి, మతం, కులం, ప్రాంతాల తేడాలు లేవు. అమ్మభాష పుట్టుకతోనే వస్తుంది. పర నుడులను ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అది వ్యయప్రయాసలతో కూడినది. ఆ చిన్న వయసులో వారి శక్తియుక్తులూ డబ్బూ సమయమంతా పర భాష నేర్చుకోవడంతో సరిపెట్టగూడదు. ఒకే సమాజంలో కొందరి బడి భాష అమ్మనుడిగానూ మరికొందరి బడి భాష పరాయి భాష కావడంతో చిన్న వయసులో భేద భావాలు ఏర్పడతాయి. సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించాలనుకున్న నాయకులూ మేధావులూ ఎవ్వరూ బడి భాషగా పరాయి భాషలను ఆమోదించరు. అవి ప్రభుత్వ బడులైనా, ప్రైవేటు, కార్బోరేటు స్మూళ్తైనా అన్నింటా అమ్మనుడే బడిభాషగా ఉండాలనేది. పైన చెప్పిన జీవభౌతిక సామాజిక కారణాల వలననే. అమ్మభాషే బడి భాష కావాలనేందుకు ఆర్థిక కోణం కూడా ఉంది. ఏ సమాజంలోనైనా, స్థూల జాతీయోత్పత్తి సాధన ఎలా సాగుతుందో పరిశీలించండి. వ్యవసాయం చేసే రైతులూ రైతుకూలీలు, పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఉండి సాంప్రదాయక వృత్తుల ద్వారా వస్తూత్పత్తి చేస్తూ జీవనం సాగించేవారూ, పట్టణాలలోనూ బస్తీలలోనూ ఉంటూ గనుల తవ్వకం, కట్టడాల నిర్మాణం, రవాణా సౌకర్యాల కల్పనా నిర్వహణా, వస్తూత్పాదనా బాగుసేతల పరిశ్రమలలో పాల్టొనేవారూ, విద్యా వైద్య, వ్యాపార పాలనా రంగాలలాంటి సేవల వినియోగంలో పాల్గొనే సమస్త శ్రామికశక్తీ సమాచార వినియోగానికి వాడే భాషలలో ఎక్కువగా స్థానిక భాషలే ఉంటాయి. కొన్ని సంస్థలలో కొన్ని సందర్భాలలో మాత్రమే పరభాషలను వాడవలసిన అవసరం ఉండొచ్చు. వీరందరూ సృష్టించే సంపద భారత సాలుసరి ఆర్ధిక గణాంకాల ప్రకారం చూసినా ఏడాదికి 85 శాతం స్థానిక భాషల ద్వారానే జరుగుతోందని తెలుస్తోంది. ఈ గణాంకాలు మన దేశ భాషల ఆర్థిక పరిపుష్టికి నిదర్శనం. ఈ విషయమే ఇంకొంచెం విడమరిచి చెప్పితే మన మాతృభాషలు అమ్మనుడులు మాత్రమే కాదు; మన సమాజాల ఆర్ధిక సామర్థ్యానికి ఆధారాలు కూడా.
ఈ సమాజం సమాచార, వస్తూత్సత్తుల వినిమయం మీద ఆధారపడి నడుస్తోంది. మన సమాజపు ఆర్థిక శక్తి సామర్థ్యాలు పెరగాలంటే, అందరికీ ఉపాధి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావాలంటే సమాచారం ముందుగా ఆ సమాజపు అమ్మ భాషలో ఉండాలి. ఒకే ప్రదేశంలో అనేక భాషా సమూహాలు ఉండవచ్చు. ఐనా ప్రతి భాషా సమూహమూ ఒక భాషా సమాజమే. ఆ సమాజానికి ఆ భాషలోనే వీలైనంతవరకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే సమాచారం అందరికీ సులువుగా అందుబాటులోకి వస్తుంది. ఇట్లా అందుబాటులోకి వచ్చిన సమాచారమే ఆ సమాజంలోని పరిశ్రమలలో వస్తూత్పత్తికి ఆధారం బెతుంది. అప్పుడే ఆ సమాజం వస్తూత్పత్తిలోనూ సమాచార వినిమయంలోనూ మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానిక పరిశ్రమలు నిలదొక్కుకుంటాయి. సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇదంతా జరగాలంటే మొత్తం సమాజంలో చదువులు అమ్మనుడిలోనే సాగాలి అనేది కుతర్మం కాదుగదా. ఈ విషయంపై ఈ సమాజంలోని పెద్దలూ, మేధావులూ, రాజకీయనేతలూ సావధానంగా ఆలోచించాలి.
- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు హైదరాబాదు విశ్వవిద్యాలయం 9866128846