Jump to content

అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య

వికీసోర్స్ నుండి

సంపాదక హృదయం


సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య


పాఠశాలల నుంచి తెలుగు మాధ్యమాన్ని తొలిగించి, పూర్తిగా ఆంగ్లమాధ్యమాన్ని నిర్బంధం చేస్తూ 2019 నవంబరులో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు 81, 85లను కొట్టివేస్తూ 2020 ఏప్రిల్‌ 15న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 92 పుటల తీర్పులో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. కోర్టును ఆశ్రయించినవారు ఏం కావాలని అడిగారో, దానికి మాత్రమే తీర్చు సారాంశం పరిమితం అయినా, దానికి సంబంధించిన విస్తృతాంశాలను న్యాయమూర్తులు తమ తీర్పులో చర్చించడం విశేషమే. అధ్యయనం చేసి దాచుకోదగిన 'పత్రం'గా ఆ తీర్చు రూపొందింది. మాతృభాషా మాధ్యమం ఆవశ్యకతను జాతిజనులకు తెలియజెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నేతలు మాత్రం దీనిని ప్రశాంతంగా స్వీకరించలేకపోయారు. ఆధికార పార్టీ తన రాజకీయ అజెండాను నెరవేర్చుకొనేందుకు మరింత పట్టుదల వహించింది. మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్చను తమకు అనుకూలమైన విధంగా మలచుకొనేందుకు పూనుకుంది. కోర్టులకు ఏదో విధంగా నచ్చజెప్పి తమ దారిని సుగమం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాధ్యమం అనేది విధానపరమైన నిర్ణయం అని కోర్టుకు విన్నవించింది.

“మాధ్యమం అనేది విద్యాశాఖ గానీ రాష్ట్రంగానీ తీసుకొనే విధానపరమైన నిర్ణయం. భాషకు సంబంధించిన విధానాన్ని ఎలా మెరుగ్గా అమలుచేయాలో రాష్ట్రానికి తెలుసు. ఇది కోర్టులు జోక్యం చేసుకొనే అంశం కాదు అని ఇంగ్లీష్‌ మీడియం స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్నాటక వ్యాజ్యంలో సుప్రీం కోర్టు తీర్చు ఇచ్చింది అని నివేదించింది. అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమాన్ని కోరుకొంటున్నారని తాము తయారుచేసుకున్న లెక్కలను చూపించింది. తమ ప్రభుత్వం ఆంగ్లమాధ్యమాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం చర్యలను తీసుకొంటున్నట్లు, దీనివల్ల సామాజిక, ఆర్థిక వివక్షతలు కనుమరుగై, వాటికి అతీతంగా అందరికీ సమానమైన అభివృద్ధి అందుతుందని తెలిపింది.

తెలుగు మాధ్యమమే కావాలనే వారి కోసం మండలానికొక్క బడిని మండల కేంద్రంలో పెడతామని భరోసా ఇచ్చింది. మొత్తంమీద ఇంగ్లీష్‌ మీడియాన్నే ప్రజలు కోరుతున్నారు గనుక, ప్రజలు కోరినదాన్ని యిచ్చే బాధ్యతను నెరవేర్చుకోవడం కోసం తాము చేసిన విధాన నిర్ణయాన్ని అమలు పరిచే స్వేచ్ళను కోర్టులు అడ్డుకొన కూడదని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని శరణు జొచ్చింది.

విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చివేసి, అందులో రాజకీయ నాయకులే భాగస్వాములై ఏలుతున్న రోజుల్లో ప్రభుత్వాలు వారిని కాపాడుకొనేందుకే అంకితమవుతాయి. దానిలో భాగంగా జరుగుతున్నదే ఇదంతా. అందుకే ఇంతకాలంగా ఒక పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రయివేటురంగాన్ని ప్రోత్సహించడమే విధానంగా పెట్టుకొన్నాయి మన ప్రభుత్వాలు. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలు ఏమీలేవు.

రాజ్యాంగం ఏమిచెప్పినా, విద్యాహక్కు చట్టం ఎంత నిక్కచ్చిగా చెప్పినా, ప్రపంచ సంస్థలూ, మేధావులూ ఎవరు ఏమని మొత్తుకున్నా మన తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమైతే తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఆర్థిక, సామాజిక సమస్యలన్నిటికీ పరిష్కారం ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నదని వారు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రిగారు చట్టసభల్లోనే స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, భారతదేశంలో అన్ని ఇతర రాష్ట్రాల కంటే ముందుగా తామే ఈ విషయంలో తొలి అడుగు వేశామని, దేశంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచామని అన్నారు.

దీనితోపాటు తొలి ఏడాదిలోనే పాలనా రంగంలో తెలుగును పూర్తిగా అణచివేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగులో పాలనా వ్యవహారాలను నిర్వహించేందుకు ఏ అధికారీ ప్రయత్నించడం లేదు! కనుక కీలకమైన పాలన, బోధన రంగాలు రెండింటిలోనూ తెలుగును పాలకులే అణచి వేస్తున్నారన్నది నూటికి నూరుపాళ్లూ నిజం.

ఏ భాష అయినా వినియోగించుకొనే కొద్దీ వికసిస్తుంది. సమకాలీన రంగాలన్నిటిలోనూ ఎంత పట్టుదలగా వినియోగిస్తే అంత బాగా ఆ భాష వికసిస్తుంది. ఇది ప్రపంచమంతటా నిరూపితమవుతున్న శాశ్వత సత్యం. మన దేశాన్ని దురాక్రమణ చేసిన ఆంగ్లేయుల భాష స్వాతంత్ర్యానంతరం మన నాయకుల అసమర్ధతవల్ల, దార్శనికతా లోపంవల్ల హాయిగా ఇక్కడ రాజ్యం చేస్తున్నది. అది లేకపోతే బ్రతకలేమనే స్థితికి జాతి జనులను తెచ్చి, ఇప్పుడు అదే మీకు దిక్కు చెప్పినట్లు పడివుండండని ప్రజలను పాలకులు ఆదేళిస్తున్నారు. ఇందుకా, భాషారాష్ట్రాల కోసం మన పెద్దలు త్యాగాలు చేసింది! ఇదేనా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లలో మనదే తొలి అడుగు అని మనం ప్రకటించుకొన్న ఫలితం? మాతృభాషను ఒక 'భాషగా' మాత్రమే నేర్చుతాం అంతవరకు సరిపెట్టుకోండి అంటున్న ప్రభుత్వ గడుసుతనానికి పరిష్కారం ఏమిటి?! మాధ్యమంగా బోధించని భాష, వినియోగంలో లేని భాష- బతికి బట్టగడుతుందా?!

ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు, ఈ ప్రమాదం ఇప్పుడు దేశమంతటా వ్యాపిస్తోంది, నెమ్మదిగానైనా! మాతృభాషలకు రానున్న ముప్పును 20 ఏళ్లనాడే యునెస్కో హెచ్చరించింది అందుకే ఇప్పుడు ఈ పతనక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే సారధ్యం వహిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే-అందునా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే ముందడుగు.

మాతృభాషలను బోధన, పాలన రంగాల్లో పూర్తిగా వినియోగించుకోవడం అనే అంశాన్ని ఇప్పుడు ఒక జాతీయ సమస్యగా చర్చలోకి తేవాలి. బోధన, పాలన రంగాల్లో నిపుణులను, బాధ్యులను, రాజకీయవేత్తలను, న్యాయవేత్తలను అందరినీ ఈ చర్చలోకి తేవాలి. దీనికి సంబంధించిన అనేక అంశాలతో పాటు రాష్ట్రాలను, కేంద్రాన్ని- మాతృభాషల సంరక్షణపై ఒక జాతీయ విధానానికి అంగీకరింపజేయవలసిన అత్యవసరం ఏర్పడిందని మనం గుర్తించాలి. ఈ ఉద్యమం కూడా ముందుగా తెలుగు రాష్ట్రాల్లోనే, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలు కావాలి. మాతృభాషల రక్షణకై రాజ్యాంగాన్ని కూడా తగువిధంగా సవరించవలసివుందని కొందరు పెద్దలు చెప్తున్న సంగతిని కూడా పట్టించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లడం వల్ల మళ్లీ మొత్తం విషయం ఆ స్థాయిలో చర్చకు దారి తీసున్నది. కర్నాటక వ్యాజ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్చు రాజ్యాంగ ధర్మాసనం నుంచి వచ్చింది. దానిని తిరగతోడాలనే ఆలోచనకు ఈ పరిణామాలు దోహదం చేస్తాయి. విద్యాహక్క్ములు, మానవహక్కులు, మాతృభాషలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వంటి అంశాలెన్నో చర్చకు వస్తాయి. రానివ్వండి. విద్య భాషారంగాల్లోని సమస్యలకు కోర్టులే ఏకైక పరిష్కార వేదిక కాకపోయినా వాటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అసలు విద్యారంగాన్ని కనీసం పాఠశాల స్థాయి వరకైనా ప్రయివేటు రంగాన్నుంచి తొలగించి, ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాలనే బలమైన అంశం ఉండనే ఉంది.

ప్రజల భాషలను కాపాడుకోలేని ప్రజాస్వామ్యం ఎవరికోసం?! ఉద్యమాలు చరిత్రను నిర్మాణం చేస్తాయి. అదెక్కడా ముందుగా రాసిపెట్టి ఉండదు. తెలుగు ప్రజల సత్తాకిది పరీక్షాసమయం.

తేదీ : 29-6-2020

మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం

విద్యార్ధి చదువుకు అడ్డంకిగా మారుతుంది - “యునెస్మో