అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా
సంపుటి:6 సంచిక : 5
అమ్మనుడి అక్టోబరు 2020
సంపాదక హృదయం
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై కుప్పిగంతులు వేసిన రాష్ట్రప్రభుత్వం చివరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని శరణుజొచ్చి, తన వాదనను వినిపించింది. తమది విధానపరమైన నిర్ణయం అనీ, ఆ హక్కు రాష్ట్రప్రభుత్వాలకు ఉందనీ నివేదించింది. సుమారొక పుష్కరకాలం కిందట తెలుగు భాషోద్యమ సమాఖ్య, ప్రాథమిక విద్యలో మాతృభాషా మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలంటూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినపుడు ఇది ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించినది గనుక మేము జోక్యం చేసుకోలేమంటూ దానిని కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆం. ప్ర. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం మీదే ఆధారపడింది. తొలుత ప్రభుత్వ ఉత్తర్వుల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కిన కక్షిదారుల వాదనలతోపాటు, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని వ్రాత పూర్వకంగా సర్వోన్నత న్యాయస్థానం తీసుకొంది. కేంద్రం సమగ్రమైన సమాధానాన్ని నివేదించింది. (ఆ వివరాలను వెనుక పుటలో చూడండి) అందులో - భాష విషయంలో నూతన జాతీయ విద్యావిధానాన్ని అంతకు పూర్వ విద్యావిధానాలతో పాటు యునెస్కో నిర్ణయాలను వివరించింది. రాజ్యాంగంలోని అంశాలను పేర్కొంది. విద్యాహక్కు చట్టం ఉండనే ఉంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.
విద్యకు సంబంధించి - రాజ్యాంగంలో ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఎదురవుతున్న సమస్యల్ని రానున్న తీర్పు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. అంతేగాదు. త్రిభాషా సూత్రం అమలులో వస్తున్న సమస్యలనూ, ఇండో ఆర్యన్ భాషలమూలాలతో ముడిపడివున్న భారతీయ భాషలవారు ద్రావిడ భాషల్ని మూడోభాషగానైనా అంగీకరించలేని నిజాన్ని ఎలా పరిష్కరిస్తారు. దేశమంతటికీ ఒక జాతీయ భాష ఉండాలనే వాదాన్ని ఏంచేస్తారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు వల్ల రాష్ట్రాల్లో భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రజల భాషాసమస్యనెలా పరిష్కరిస్తారు - ఇలాంటి పలు సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు దారితీస్తుందా, ఇదంతా తేనెతుట్టెను కదిలించినట్లవుతుందా?
మాతృభాషోద్యమాలు ప్రపంచమంతటా తలెత్తుతున్నాయి. కొందరు అనుకొంటున్నట్లు ప్రపంచమంతా ఒకే భాషాధిపత్యానికి లొంగిపోక తప్పదన్నది భ్రమ. ప్రతి మాతృభాషా తన జాతీ భావోద్వేగాలకే కాదు, సంస్కృతికీ, బ్రతుకు తెరువుకూ స్వేచ్చకూ ముడి పెట్టుకొని ఉంటుంది. బహుభాషా జాతుల సమ్మేళనమైన మనదేశంలో పాలకవర్గాలు ఈ విషయంలో జాగరూకత వహించాలి.
ఇక్కడ తప్పనిసరిగా పరిశీలించవలసిన 'అసలు సంగతి'ని పక్కకు పెట్టకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలోకి మొత్తం విద్యను తేవాలన్న నిర్ణయాన్ని తీసుకోవడం ఒక్కసారిగా జరగలేదు. ఇంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం, దానికి ముందు పాలించిన కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలూ ఆ బాటనే నడిచాయి. కాకపోతే ఈ ప్రభుత్వం కొంచెం దూకుడుగా, పట్టుదలగా వ్యవహరించింది. ఇదే సమయంలో - భారతదేశంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదో విధంగా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. భాషారాజకీయాలతో నడిచే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఏదో ఒక స్థాయిలో ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కర్నాటక ప్రభుత్వానికీ, ఆరాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యానికీ న్యాయస్థానాల్లో జరిగిన పోరాటం సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమనే కారణంగా ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కొంతపోరాడిందన్న సంగతిని మనం మరచిపోకూడదు. అయితే అది మాధ్యమాన్నెంచుకొనే స్వేచ్చ విద్యార్థికి ఉండాలన్న అంశానికి పరిమితం. అయినా ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పంతానికి పోయి, సర్వోన్నత నాయస్థానాన్నాశ్రయించింది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారయితే, ఆంగ్ల మాధ్యమాన్ని దేశమంతా అనుసరించడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు ఇదంతా భాషల సమర్ధతకు సంబంధించిన విషయమేకాదు. అన్ని భాషలూ శక్తిమంతమైనవే. మనం భాషల్ని వినియోగించే తీరునుబట్టి వాటి వికాసం, ఎదుగుదలా ఉంటాయి. దానితోపాటు మన పాఠశాలలను సమర్థంగా నిర్వహించుకోవడాన్ని బట్టి విద్యారంగ అభివృద్ధి ఉంటుంది. స్వార్థపూరితమైన అవినీతిమయమైన మన రాజకీయ పార్టీలు, నేతలూ ఈ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు. విధాన ప్రకటనల మంచీ చెడూ, అంతా పాలకుల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటాయి.
బోధనామాధ్యమ సమస్యతోపాటు, దానితో వున్న భాషాపరమైన సమస్యలకు పరిష్కారం త్వరలో రానున్న తీర్పు ఇస్తుందేమో - అశగా ఎదురుచూద్దాం.
- తేదీ
- 30-9-2020
సామల రమేష్ బాబు
ప్రాథమిక విద్య మాతృభాషలోనే
వీలైనంత వరకు ఉన్నతస్థాయిలోనూ... నూతన విద్యావిధానం చెబుతున్నదీ ఇదే...
యునెస్కో కూడా దీన్నే సమర్థిస్తోంది... ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్...
ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగాలన్నదే తమ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు... వీలైనంత వరకూ ఉన్నతస్థాయిలోనూ మాతృభాషలోనే బోధించాలని 1988 నాటి విద్యావిధానంలో ఉందని చెప్పింది. 2020 జులై 29న కేంద్రం ఆమోదించిన నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతోందని వివరించింది. ప్రాథమిక విద్యను ఆంగ్లంలో బోధనను తప్పనిసరి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎయ్పే కేంద్ర పాఠశాల విద్యాశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విద్యానాణ్యత పెంపు కోసం యునెస్కో కూడా మాతృభాషాబోధననే సమర్ధిస్తున్నట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన 2008 నాటి నివేదికను అఫిడవిట్ జత చేసింది. ప్రాథమిక విద్యాబోధన తప్పనిసరిగా పిల్లల మాతృభాషలోనే సాగాలి. రాజ్యాంగం లోని ఆర్టికల్ 350ఎ ప్రకారం భాషాపరంగా మైనార్టీ వర్గాల పిల్లలకు సైతం ప్రాథమిక విద్యను వారి మాతృభాషలోనే బోధించాలి. అందుకు అనువైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, స్థానిక సంస్థల మీదా ఉంటుంది. మాతృభాషలో బోధించడమే అత్యుత్తమమని 2005 నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ చెబుతోంది. ఆ కరిక్యులమ్ ను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. దాని ప్రకారం 'త్రిభాషా సూత్రం అమలుకు ప్రభుత్వాలు కృషి చేయాలి' అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 (ఎఫ్).. సాధ్యమైనంత మేరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నట్లు కేంద్రం గుర్తుచేసింది. పిల్లలు భయపడకుండా స్వేచ్చగా భావాలను వ్యక్తం చేసే వాతావరణం పాఠశాలల్లో ఉండాలని పేర్కొంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే పిల్లల మాతృభాషే బోధనా భాషగా ఉండాలని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌లో పేర్కొన్నట్లు వెల్లడించింది. భాషాభివృద్ధి గురించి 1968 నాటి విద్యా విధానంలోనూ వివరంగా ఉన్నట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ మాతృభాషలో బోధన ఉండాలని అందులో పేర్కొన్నట్లు గుర్తు చేసింది. "విద్య, సాంస్కృతికాభివృద్ధికి భారతీయ భాషలు, సాహిత్యం శక్తిమంతం కావాలి. స్థానిక భాషలు అభివృద్ధి చెందేవరకూ విద్యాప్రమాణాలు మెరుగుపడవు. విజ్ఞానం ప్రజల చెంతకు చేరదు. ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో మాతృభాషల్లో విద్యాబోధన జరుగుతోంది. ఇప్పుడు యూనివర్సిటీల స్థాయిల్లోనూ మాతృభాషలో బోధించాలి” అని 1968 నాటి విద్యావిధానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ తన ఆఫిడవిట్లో తెలిపింది. ఆ భాషా విధానాన్నే 1986, 1992 విద్యా విధానాలు కూడా సమర్థించినట్లు వెల్లడించింది. 2020 జులై 29న కేంద్రం ఆమోదించిన నూతన విద్యావిధానం కూడా ఇదే చెబుతున్నట్లు వివరించింది. "పిల్లలు తమ మాతృభాషల్లో అయితేనే క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోగలరు. కనీసం ఐదో తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన ఉండాలి. దీన్ని 8వ తరగతి, అంతకు మించి కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా సాధ్యమైనంత మేర మాతృభాషలో విద్యాబోధన కొనసాగించాలి. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలుచేయాలి. సైన్స్ సహా అత్యంత నాణ్యమైన పాఠ్యపుస్తకాలను మాతృభాషలో అందుబాటులోకి తేవాలి. పిల్లలు మాట్లాడే భాషకు, బోధనా భాషకు ఎక్కడైనా తేడా ఉంటే ప్రాథమిక స్థాయిలోనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి” అని నూతన విద్యావిధానం పేర్కొన్నట్లు కేంద్రం తన అఫిడవిట్ లో వివరించింది. (ఈనాడు 25-9-2020)