అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అడుగుజాడల్లో ఆనవాళ్లు-2

డా॥ ఈమని శివనాగిరెడ్డి 98485 98446

నా పిడుగురాళ్ల - పిల్లుట్ల యాత్ర

ముందుగా అనుకున్నట్లు రేపు తెల్లవారుజామునే బయలుదేరదామని అనుకొన్నాం. గుంటూరుజిల్లా మ్యాపు, టోపీ, ఒకటి రెండు బౌద్ధంపై పుస్తకాలు, (ప్రయాణంలో చదువుకోవటానికి) నోట్‌బుక్‌, అన్నీ సంచిలో సర్దుకొని, టీవీలో వార్తలు చూస్తూ, అన్నంతింటు న్నాను. ఇంతలో నాకు రావడం కుదరదని డైవర్‌నుంచి ఫోను. అన్నంమీద, వార్తలమీద ఆసక్తి ఆవిరైంది. తెల్లవారుజాము, 8.00గంటలకు బయలుదేరి, గుంటూరులో ఒకర్ని ఎక్కించుకొని పిడుగురాళ్ల పోదామనుకొన్న ప్లానుకు ఆటంకమొచ్చి పడింది. గబగబా అన్నంతిని, మరో మిత్రునిద్వారా, ఒకరోజువారీ డ్రైవర్ని మాట్లాడుకున్నాక మనసు స్థిమితపడింది. ఆడ్రైవరుకు ఫోనుచేసి, విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్‌, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ & అమరావతి దగ్గరకు రమ్మని చెప్పాను. నా సహోద్యోగి చందూ కార్తీర్‌ను, కెమెరా తీసుకొని సిద్ధంగా ఉండమని చెప్పి, రేపటి యాత్రలో మునిగి, తెలియకుండానే నిద్రబోయాను.

అనుకున్నట్లుగానే మరునాటి ఉదయం 8.00గంలకే బయలుదేరి, గుంటూరులో ఒక మిత్రుణ్జి ఎక్కించుకొని తెల్లారేసరికి పిడుగురాళ్ల చేరాం. అక్కడ జర్నలిస్టు, ప్రముఖ రచయిత, పల్నాడు మీద పరిశోధనలు చేసిన కె, హెచ్‌.వై.మోహనరావుతో కలసి టీతాగి, పిల్లుట్లకు బయలుదేరాం. ఊరు దాటామో లేదో మోహనరావు మళ్లీ ఫోను చేసాడు. వెనక్కి తిరిగి వచ్చి ఆయన ఇచ్చిన “గుంటూరు జిల్లా దేవాలయాలు” అన్న పుస్తకాన్ని తీసుకొన్నాను. పిడుగురాళ్ల అంటే మా చిన్నతనం మాటొకటి గుర్తుకొచ్చింది. తెనాలి పంచాయితీ సమితి ప్రెసిడెంటు కనుసన్నల్లోలేని హైస్కూలు టీచర్లను పిడుగురాళ్ల బదిలీ చేస్తారనే మాట అది. ఇప్పుడు పిడుగురాళ్ల మంచి టౌనైంది కాని ఆరోజుల్లో (1965-66 ప్రాంతంలో) నీళ్లు దొరక్క ఇబ్బంది పదేవాళ్లు. ఎండాకాలం వేడి ఎక్కువుగా ఉండటాన, అక్కడ పిడుగులు రాళ్లలా కురుస్తాయనే అర్ధంలో ఆ వూరికి పిడుగురాళ్ల అని పేరు పెట్టారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు పిడుగురాళ్లలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగైనాఒక పగిలిన రాతిపైగల క్రీ.శ.1318వ సం॥పు శాసనం నాకు ఊరట నిచ్చింది. పాకుడుబట్టి రూపు పోగొట్టుకొన్న అక్షరాల్ని తడిమ తడిమి చదివితే, అది అన్మకొండ పురవరాధీశ్వరుదైన కాకతీయ ప్రతాపరుద్ర దేవమహారాజులకు పుణ్యంగ్కా ..వయిలెంకంగారి పుత్రుడు, అయోధ్య రామలక్ష్మణులకు చేసిన అస్పష్ట దాన వివరాలున్నాయి.

ఒక్క అడుగు ముందుకేసిన తరువాత 1882లో రాబర్ట్‌ సివెల్‌ చూచిన పిడుగురాళ్ల గుర్తుకొచ్చింది. పిడుగురాళ్లలో అమరావతిని పోలిన పెద్దదిబ్బ, దానిచుట్టూ పాతకాలపు కుండపెంకులూ ఉన్నాయని పాత పిడుగురాళ్లలో రెడ్డిరాజుల కోటగోడ శిధిలాలున్నాయనీ, ట్రావెలర్స్‌ బంగ్లా ఆవరణలో మాధవరామమ్మ, మంగమ్మ, పిడుగురాళ్ల విషం విల్లమ్మ అనే మూడు శిల్పాలున్నాయనికూదా సివెల్‌ రాశాడు. సతీసహగమనం చేసిన మంగమ్మ 'పేరంటాలుగా ఇప్పటికీ కొలవబడుతుంది. పాత కోటగోడ పక్మనేగల ఒక చిన్న శిధిలాలయంలో ఒకప్పుడు ప్రజల్ని పీడించుకుతిన్న ఒక స్త్రీని, “పిడుగురాళ్ల విషం పిల్లి అని కొలవటం, ఆమె మళ్లీ వాళ్లజోలికి రాకూడదనే మూఢనమ్మకమే. పాతకోట శిధిలాల్లో చూచిన పాతపాటేశ్వరి, గోపాలస్వామి, రామలింగ స్వామి ఆలయాలు, గణపతి ఖైరవ, మహిషాసురమర్దని, వీరగల్లులు నాగదేవతలు, సప్తమాతల శిల్పాలు, క్రీ.శ. 1552 నాటి శాసనం, ఆనవాళ్లు కోల్పోయి, పిడుగురాళ్ల సంతకాన్ని చెరిపేశాయి. చరిత్ర పరిశోధకులకు తీరని వ్యధను మిగిల్బాయి. దగ్గరలోనే క్రీ.శ. 5వ శతాబ్దికి చెందిన, ప్రసిద్ధ థేరవాద తెలుగు బౌద్ద్ధాచార్యుడు, శ్రీలంకలో బౌద్ధ సంఘనాయకుడిగా ఎన్నుకోబడిన ఆచార్య బుద్ధఘోషుని జన్మస్థలం కోటనెమలివురిని చూద్దామనిపించింది. అక్కడ ప్రతిష్టించిన ఆయన విగ్రహాన్ని చూచి, తెలుగునేలపై థేరవాద బౌద్ధాన్ని ప్రచలితంగావించిన ఆయన గొప్పతనాన్ని కొనియాదాలని పించింది. బౌద్ధానికి పునాదిరాశ్లైిన శీలం, సమాధి, ప్రజ్ఞలపై ఆ మహనీయుడు రాసిన 'విశుద్ధిమగ్గ, త్రిపిటకాలపై రాసిన వ్యాఖ్యానాలు సామంతపాసాదిక, సుమంగళ విలాసిని, పపంచ సూదని, జాతక, అంధక అత్థకధలనే గ్రంథాలను స్మరించుకోవాలని వంచింది. పాళీ సింహళ ఖాషలపై బుద్ధఘోషని సాధికారిక పాండిత్యాన్ని శ్లాఘించాలనిపించింది. అనుకౌన్నదే తడవుగా అక్కడికెళ్లి ఆయన విగ్రహాన్ని చూచి, మొక్కి వెనక్కి మళ్లాను.

ఈ తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకొంటూ తెలుగు వారి తొలి నరసింహస్వామి విగ్రహం దొరికిన ప్రాంతాన్ని చూద్దామని పిడుగురాళ్ల నుంచి 4 కి.మీల దూరంలో ఉన్న కౌండమోడు చేరుకున్నాను. స్థానికులను ఎవరినడిగినా తెలియదంటున్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు చూపించిన

ప్రదేశంలో పాటిమట్టి తప్ప అక్కదేమీ

లేదు. లేకపోయినా ఒక చారిత్రక స్థలంలో కాలుమోపానన్న ఆనందం మిగిలింది. ఇక్కడ దొరికిన తొలి నరసింహశిల్పం చారిత్రక ప్రాధాన్యత గలది. పల్నాటి సున్నప్రురాతి శిలపై మొత్తం ఆరు అర్ధ శిల్పాలున్నాయి. మధ్యలో రెండు మానవ చేతులున్న ఆసీన నరసింహుడు, వాటిలో గద, దిండిమలున్నాయి. ముఖం, శరీరం జంతురూపంలో ఉంది. వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నముంది. నరసింహానికి అటూఇటూ వృష్టివీరులు లేక వంచవీరులని పిలిచే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవ కృష్ణ, బలరాములు ఆయుధాలను ధరించి నిలబడి ఉన్నారు. బౌద్దం బాగా విలసిల్లుతున్న ఇక్ష్వాకుల చివరి కాలానికి చెందిన ఈ శిల్పం, వైష్ణవ మత ఉనికిని చాటటమేకాక, వృష్టి లక పంచవీర ఆరాధనను తెలిపే ఏకైక శిల్చంకూదా. క్రీశ. 4వ శతాబ్దికి చెందిన ఈ శిల్పం, తెలుగువారి వైష్ణవ మత చరిత్ర, శిల్పకళా పరిణామాన్ని తెలుసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అరుదైన, అపురూపమైన ఈ నరసింహ-పంచవీర శిల్పం, ప్రస్తుతం గుంటూరులోని బౌద్ధశ్రీ ఆర్కియోలజికల్‌ మ్యూజియంలో ఉంది. పిడుగురాళ్లలో చెన్నకేశవ, రామలింగేశ్వరాలయాలు మధ్యయుగం నాటివేకాని పునరుద్ధరణ 'పేరిట చారిత్రకత కోల్పోయినందున ఆ దేవాలయాల్ని చూడాలనిపించలేదు.

కొంచెం సేపట్లోనే పిల్లుట్ల చేరుకున్నాం. అదాక వ్యవసాయపుటూరు. పిల్లుట్లకు ఆ పేరు ఎలా వచ్చిందోనని ఒకరిద్దరిని అడిగినా సరైన సమాధానం లేదు. వేణుగోపాల స్వామి గుళ్లో పూజారిని అడిగినా తెలవదనే సమాధానం. పిల్లి, ఉట్టి, అల = ఉట్టిమీద పిల్లి ఉన్న ఊరు అని అర్జాన్ని స్ఫురింపడేసుకొని చారిత్రక అవశేషాల అన్వేషణలో పడ్డాను. గ్రామంలో శాసనాలేమి లేవు. కాశీ విశ్వేశ్వర, వేణుగోపాలస్వామి దేవాలయాలున్నాయి. అవి కూడా గతకాలపు ఆనవాళ్లేమీ మిగలకుండా పూర్తిగా ఆధునీకరింపబడినాయి. కాశీ విశ్వేశ్వరాలయం చుట్టుపక్కల పరిశీలించగా 16వ శతాబ్దపు నంది స్తంభం నిలబెట్టి ఉంది. ఇక్కడే బహుశా పురాతన ఆలయం ఉండి ఉంటుంది. ఈ స్తంభాన్ని చూస్తే తక్షశిలకు చెందిన గ్రీకు రాయబారి హెలియోడరస్‌ క్రీ.పూ. 110 ప్రాంతంలోని విదిశాలోని బేస్‌నగర్‌లో నిలబెట్టిన గరుడ స్థంభం గుర్తుకొచ్చింది. 'సైజులేదు, ఆ కాలమూ కాదు కాన్మీ సాంప్రదాయం కొనసాగింది. అతడు భాగవతుడు. ఇక్కడ ఎవరో ఒక మహేశ్వరుడు, శైవ మత ప్రచారంలో భాగంగా ఎత్తించి ఉంటాడు. అయితే పది అడుగుల ఎత్తున్న (ఇంకా భూమిలో 5 అడుగులుంటుంది). ఈ స్థంభం కోసం క్రింద, చదరంగా, పైన ఎనిమిది పలకలగాను, ఆపైన చిన్న ఫలకం, దాని మీద చక్కటి నంది. కళాచరిత్రకారుల దృష్టి నాకర్షించాల్సిన ఈ నంది కమ్ముకొచ్చిన ఇళ్ల మధ్య పట్టించుకునే వాళ్లు లేక, బిక్కు బిక్కు మంటుంది. దాన్ని చూచి జాలేసింది. రాయిని క్వారీ నుంచి తెచ్చి, చదునుచేసి క్రీ.శ 16వ శతాబ్దికి చెందిన విజయనగర శిల్పకళకు మచ్చుతునకగా తీర్చిదిద్దిన నాటి శిల్పుల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. ఆశ్చర్యమేమిటంటే, అక్షరాస్యత అంతగా లేని, శృంగార సాహిత్యాన్ని బొత్తిగా తడమని (గ్రామీణులకు నిశ్చబ్ద శృంగార (ప్రేరణ కలిగించే బూతు బొమ్మలు విద్యాత్మకంగా ఉన్నాయి. ఒకామె తెల్లవారురూమున మజ్జిగ చిలుకుతుంట్నే పొలం పోయే. పైలాపళ్చీసు మొగుడు వెనుకగా వచ్చి ఆనందాన్ని అంటిస్తున్నాడు. మరో జంట, ఒకరికొకరు 'పైనకింద, ఆశీనులై ప్రపంచాన్ని పట్టించుకోకుండా శృంగారకేళీ కలాపంలో మునిగి తేలిపోతున్నారు. బాగా పరిశీలిస్తేగాని ఈ మైధున శిల్పాలు కల్పించవు. ఇది ఆనాటి సమాచార ప్రసరణలో భాగమే గానీ, బూతూ కాదు, రోతా కాదు.

ఆలయం బయట నిరాదరణకు గురైన వీరభద్రుని విగ్రహం నన్ను కాలు కదలకుండా చేసింది. క్రిభంగిమలో నిలబడి అన్ని అలంకారాలను ధరించి కత్తి, దాలు పట్టుకొని ఉన్న వీరభద్రుడు, 'ప్రభామండలం క్రింద అంజలి ముద్రలో ఉన్న దక్షుడు, శిల్పాన్ని చెక్కిన తీరు, తంగెడలోని రెడ్డి రాజుల కాలవు వీరభద్రుని శిల్పాన్ని తలపించింది. క్రీ.శ. 1415 శతాబ్దాలకు చెందింది. సత్తువలేని ముసలి తాతను ఇంటి బయట కొట్టంలోకి నెట్టినట్లు, ఆలనా పాలన లేక కొంచెం భిన్నమైన ఈ విగ్రహాన్ని నిర్దాక్షణ్యంగా, ఆలయం ప్రాకారం వెలుపల పదేశారు. పూనుకొని ఆలయంలోపల పెట్టే నాధుదేలేడా అనిపించింది. ఒక్క నిట్టూర్పుతో ఊరుదాటాను. కారులో పోతున్న కొద్దీ చూచిన నందిస్థంభం, వీరభద్ర విగ్రహం మదిలో పదే పదే మెదులుతూనే ఉన్నాయి. శృంగార శిల్పాలైతే అంగారక గ్రహంమీద కాలుమోపిన అనుభూతిని కలిగించాయి.

ఇక నా చూపు, మోర్దంపాడువైపు. ఎప్పుడో, పిడుగురాళ్లలోని ఒక నగల వ్యాపారి, నాకు ఫోనుచేసి మావూళ్లో ఆలయం శిధిలమైంది. ఒకసారి చూచ్చి పునరుద్ధరణకు సలహాలిస్తారా అని అడిగిన విషయం జ్ఞాపకమొచ్చింది. ఊరి చివరున్న అయిదడుగుల లోతు దిగుడుబావి, పక్కనే తూర్పు చాళుక్యుల కాలంలో కట్టిన సాదాసీదా బుగ్గరామలింగేశ్వరాలయాన్నీ చూశాను. ఇక్కణ్ణుంచి కృష్ణానది మూడుకిలోమీటర్లు ఉంటుంది. నదిలోతుగాఉన్నా ఇక్కడి నీటిఊోట 5 అడుగుల్లోనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిది. (గ్రామస్థులైతే, అది ఆవూరి మహిమ అని చెప్పుకొన్నా నిజానికి సున్నపు రాతిపారల్లోంచి, నీటి జాలు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇది సహజ పరిణామమేగానీ, మహిమకు సంబంధంలేదని స్థానికులకూ, పూజారికీ చెప్పాను. 'అయ్యా మీకు దేవుని మీద నమ్మకం లేదా” అని అడిగారు. చర్చపెరక్కుండా, ఊళ్లో ఉన్న నీలకంకేశ్వరస్వామి గుడికి బయలుదేరాం.

ఊళ్లోకి చేరుకొని ఆలయం ముందు నుంచి చూస్తే, పాత ఆలయాన్ని ఊడదీసి, కేవలం రాతిద్వారాలను మాత్రం వాడుకొన్నారు. మిగతా చెక్కదాల్ని రోడ్డు పక్మన పదేశారు. నిలువెల్లా నిరుత్సాహం. ఆ ఆలయంముందున్న ఒక చారిత్రక బావి, మళ్లీ ఉత్సాహాన్నిచ్చింది. పది అడుగుల దారి, అటూఇటూ ఏనుగుల శిల్చాలు, మెట్లుదిగిన తరువాత, ఎడమవైపుకు నడవ, అక్కణ్ణుంచి మెట్ల వరుస, నీరు ఎంత వకద్బందీగా ఉందీ దిగుడుబావి అనుకొని చుట్టూ తేరిపారా చూస్తే, బావిలోపలి గోడలమీద విష్ణుమూర్తి దశావతారాలు, కృష్ణలీలలు, నిలబడిన సప్తమాతలు జంతువులు, శృంగార, మైధున శిల్పాలు, ఆబావి చరిత్రకు అద్దంపడుతున్నాయి. క్రీ.శ 16వ శతాబ్ది-విజయనగర శైలి. ఒకప్పుడు దప్పికతీర్చి, గంగతో సమానంగా వవిత్రంగాచూచి, పూజలు చేసిన ప్రజలు ఇంటింటికీ కుళాయి రావటం వల్ల, చెత్తాచెదారాన్ని ఇందులోనే వేస్తున్నారు. నాతో పాటొచ్చిన రత్నకుమార్‌, నేనూ కలసి, గ్రామస్తుల్ని పోగుచేసి,ఆబావి వాస్తు, శిల్పకళా విన్యాసం, చారిత్రక నేపధ్యాన్ని వివరించాం. అంతే ! అక్కడున్న ఐదారుగురు, ఆచెత్తాచెదారాన్ని ఏరి బయటేశారు. ఈ బావిని కాపాడుకొని, బయటి నుంచి వచ్చేవాళ్లకు దీని చరిత్ర, నిర్మాణరీతి, శిల్పకళగురించి, తెలియజెప్పమని నేను టూరిస్టు అవతారం ఎత్తాను. వాళ్లలో ఇద్దరు కుర్రాళ్లు నేను చెబుతున్నదంతా మొబైల్‌ ఫోనులో రికార్డు చేసుకొన్నారు. మోర్టంపాడుకు వచ్చే చుట్టాలకు, స్నేహితులకు వీటి గురించి చెబుతామన్నప్పుడు మనస్సు అనందంతో నిండిపోయింది. మోర్దంపాడు గ్రామంలో సంప్రదాయానికి ఆధునికతను జోడించి సీమ వాస్తు శైలితో ఎంతో అందంగా కట్టుకున్న ఒక ఇల్లు, ఆ ఊరి మొత్తానికే ఆకర్షణ. ప్రవేశ ద్వారం, దానిపైన 1936 సం॥ అర్ధచంద్రాకారపు ద్వారశాఖ పైన కోడిపుంజు నెత్తిమీద ఉండే అలంకారం, అటు ఇటూ ఎనిమిది కోణాల పడకగదులు, వాటి పైన బాల్మనీ, దాని క్రింద మళ్లీ కొయ్య అలంకారం, మొదటి అంతస్తు పైన చుట్టూ సుధాశిల్చ విన్యాసం, అన్నీ కలిపి ఉట్టిపడే రాజసం, ఆ ఇంటికే సొంతం. చక్కటి కొయ్య శిల్పంతో సింహద్వారం, అందమైన కిటికీలు, వాటిపైన పొడుచుకొచ్చిన చూరులూ, బర్మాకొయ్యతో నాటి నగిషీ పనుల్లో దిట్టలైన వడ్రంగులు రెచ్చిపోయి, పని తనంలో పోటీపడిన నేపధ్యాన్ని గోడకు బిగించిన కొయ్యఅల్మారాలు గుర్తు చేశాయి. ఇప్పుడు డబ్బుందీ, కొయ్యా ఉంది, వడ్రంగులూ ఉన్నారు. లేనిదల్లా అనాటి అలోచనలు, ఓపిక, కళాత్మక దృష్టి అక్కదే నిలబడి స్థాణువులా చూస్తున్న నన్ను ఇంటివాళ్లు లోపలకు పిలచ్చి ఇల్లంతా కలియజూపారు. సున్నపు తాపడపు గోడలు, కప్పులూ చలువరాతి గచ్చు, దీపాలు పెట్టుకునే గూళ్లు, కాలెత్తితే కాని దాటలేని గడపలు, యనభై ఏళ్ల నాటి మద్రాసు ఇనపభోషాణం, సింహాసనాన్ని తలపించిన పందిరి మంచం, చీమలు పట్టకుందా మంచం కోళ్లకింద నీళ్లు పోసుకోవటానికి గాడి చెక్కిన రాతి దిమ్మెలు, వాటిపైన ఏమాత్రం తేడాలేని తరిణిబట్టి భరిణెల్లా తీర్చిదిద్దిన మంచంకోళ్లు, మంచంపైన స్త్రింగ్‌ పరుపు, దోమతెరలు కట్టుకొవటానికి కట్టె చట్రం, నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నేను ఈ ఇంటి యజమాన్నైతే ఎంతబాగుణ్ణనే ఆలోచన పుట్టింది. లక్ష్మీదేవితో సమానంగా చూచుకొన్న రోలు, పన్న బిగించిన రోకళ్లు (అవి ఎన్ని పెళ్లిళ్లు చూశాయో), తరతరాల సంతానానికి పిండిని పండించిన తిరగళ్లు, పల్నాటి జీవనాన్ని కళ్లముందు కదిలించాయి. 'మోర్టంపాడు నుంచి, బయలుదేరి మళ్లీ పిడుగురాళ్ల వచ్చి తిరుగు ప్రయాణ మైనాం. గత కాలపు వైభవ, ప్రాభవాలు, కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. వారసత్వ సంపద పట్ల నిర్లక్ష్యం నీడలావెంటాడుతూనే ఉంది. మంచి కాలం రాకపోతుందా అని ఆలోచించేలోపు విజయవాడకు చేరుకొన్నాం.

(తరువాయి వచ్చే సంచికలో...)