Jump to content

అమ్మనుడి/సంపుటి 5/మే 2019/శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు చదివిన ఉపన్యాసం

వికీసోర్స్ నుండి

సాహిత్యం

కీ.శే. ఇంద్రగంటి హనుమచ్చాస్తి


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి షష్టిపూర్తి మహోత్సవ సందర్భంలో

శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రీగారు చదివిన ఉపన్యాసం


కొనలు కొంచెం గిరజాలుగా తేల్చి దువ్విన జుట్టు. వైకల్పికంగా ధరించే కళ్లజోడు. కమీజులోపలికి పెట్టి కట్టిన తెల్లని పంచ మీద నిలువునా బొత్తాలుగల కోటు. ఒక కౌన వీపుమీదకు పోగా రెండవ కొన ముందుకు విడిచిన సన్న ఖండువా, కొంచెం వెడల్పైన పెదవులమీద ఒక చిత్రమైన యాసతో ఉచ్చరించే అచ్చపు తూర్పు, గోదావరి జిల్లా తెనుగు. సడలని ఉత్సాహంతో, వడలని శరీరంతో, రాజమహేంద్రవరం వీధిలో తెనుగుబింకంతో నడిచే ఆ నిండు విగ్రహం ఎవరు?

ఆయనే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రిగారు. ఉరపు - కలాభివర్ధనీ పరిషత్తు.

ఆయనకు షష్టిపూర్తి అంటే ఎవరు నమ్ముతారు? నేటి సాహిత్య యువకు, లందరికంటే గూడా యువకుడుగా కనిపిస్తూ, పొంగులు వారే ఉత్సాహంతో సాహిత్య సేవ చేస్తూ, ఏ విషయంమీదనైనా ముక్కుమీద గుద్దినట్టు వెర 'పెరుగకుండా మాటలాడుతూ, తెనుగుతనం ప్రసక్తిలో పిడికిలి బిగించి ఉపక్రమించే ఆయన ఎప్పుడూ ముప్పయి దాటని సాహిత్య త్రిదశుడని మా విశ్వాసం గదా - అప్పుడే ఆయనకు అరవై అంటే ఎవరు నమ్ముతారు? “నిజమే...ఆయన రచనాశక్తికీ, సాహిత్యాసక్తికీ, కార్యదీక్షకూ, కళాభిరుచికీ నిత్యయౌవనమే కావచ్చు. కాని : శరీరానికి మాత్రం షష్టిపూర్తి, అన్నాడు మావాడు.

ఉచితజ్జులైన రాజమహేంద్రవర పౌరులు అఖిలాంధ్రదేశ ప్రోత్సాహ, ప్రోద్బలాలతో సుబ్రహ్మణ్యశాస్రిగారికి శక్తివంచన లేకుండా “ఓహో” అన్నట్టు షష్టి పూర్వుత్సవం చేస్తున్నారంటే సారస్వత ప్రియులంతా సంతోషిస్తున్నారు.

ఆంధ్ర వాజ్మయానికి - తత్రాపి - నవ్య సాహిత్యానికీ శ్రీ శాస్రిగారి యీవి తక్కువ కాదు. భక్త విజయం మొదలు కలంపోటు దాకా ఆయన లేఖిని ఆంధ్రసారస్వత క్షేతంలో విశ్చంఖల విహారం చేసింది.

నాటకాలు వ్రాశారు. నవలలు సృష్టించారు. రూపికలు చిత్రించారు. కవిత నారాధించారు. వ్యాఖ్యానాలు ప్రపంచించారు. వ్యాసాలు రచించారు, మీగడతరకలు అందించారు. ఇంకా ఎత్తిన కలం దించలేదు. కొత్తరచనకు పథకాలు పడుతూనే ఉన్నాయి. సాహిత్య రంగంలో ద్రుతగమనం సాగుతూనే ఉంది.

యుగపురుషులు, నన్ని భట్టారకుడూ, వీరేశలింగం పంతులూ మెట్టిన రాజమహేంద్రవర సారస్వత పుణ్య క్షేత్రంలో శాస్త్రిగారి మనుగడ. అటు ్రాబీనసారస్వత సారమూ, ఇటు నవ్య సంస్కార చైతన్యమూ నమన్వయించి ఆస్వాదించిన (ప్రబుద్ధాంధ్రులు శ్రీ శాస్త్రిగారు.

కానైతే... సాహిత్య పూర్వాశమంలో పండిత శ్రీపాద సుబ హ్మణ్య శాస్త్రులవారు చక్కని గ్రాంథీకాంధ్రభాషలో పెక్కు గ్రంథాలు వ్రాశారు. అప్పుడు నలిగిన తోవలో వ్రాసుకుపోయే నలుగురు రచయితల్లోనూ ఆయన ఒకరు...అంతే. ఏ విశిష్టతకూ ఆయన లక్ష్యం కాలేదు. ఏ ప్రత్యేకతకూ ఆయన నిదర్శనం కాలేదు.

ప్రతిభగల వ్యక్తికి ఏనాడో ఏర్పడిన పరిధుల్లో కళ్లు మూసుకుని సురక్షితంగా నడవడం సాధ్యమైన పనికాదు. అప్రయత్నంగా ఆతడు ఎప్పుడో ఎర్రజండా పట్టుకొని గీతలుదాటి బయటపడి తన ప్రజ్ఞకు రెక్కలు తొడుగుతాడు. ప్రజలకు తన ముక్తకంఠం వినిపిస్తాడు.

శాస్రిగారికి ఎప్పుడో ఒకనాడు ప్రజాసామాన్యంతో బెట్టుసరిగా ఉండే గ్రాంధిక భాషమీద పొంగివచ్చే నవ్య చైతన్యవాహినికి ఇరకాటమైన సంప్రదాయ రచన మీద నిర్లక్ష్యం పుట్టింది. దానితో ఆయన మేధలో వింత మెరపులు మెరసీ విచిత్ర భావావళి విరిసింది.

'శోత్రియతా సంపన్నమైన వైదిక కుటుంబంలో పుట్టిన శాస్త్రి గారు, అన్నగారిలా, నిగ్గయిన ఏ దైవజ్ఞ శిభామణిగానో, (శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్థాన యోగ్యతా పరతంతులైన ఏ వేదమూర్తిగానో కావలసింది. అయితే ఆయన పేరు మహేంద్రవాడ పరిసరాలన్ఫూ మహా అయితే రామచంద్రపురం తాలూకానూ దాటకుండానే ఉందేదేమో, కాని ఆయన భవిష్యత్తు అదికాదు. వరినరాలను ఒత్తిగించుకొని ఆయన వ్యక్తిత్వం ఒక నవ్య వాజ్యయ తపస్సిద్ధివైపు అచంచల గమనం సాగించింది.


శాస్త్రిగారు కృషిచేసిన తెనుగు పొలం చాలా పెద్దది. గట్టుమీద నించుని కలయజూస్తే ఆ సస్యాభోగం కంటిని చెదరగొడుతుంది. ఆంధ్రంలో సర్వతోముఖమైన సారస్వత కృషిచేసి వాసి కెక్కిన ప్రముఖులెందరో ఉన్నారు.

కాని, వారి మార్గం-మార్గ కవితానుకారి. వారు ఎంత నవీన సమస్య నెత్తుకొని వ్రాస్తూన్నా వారి రచనల్లో అగ్గలమైన సాంస్కృతిక వాసన గుప్పుమనక తప్పదు.

ఇక, సుబ్రహ్మణ్యశాస్రిగారు ఏది వ్రాసినా దేశపథం పట్టిస్తారు. ఆయన నాటకాల్లో అఖండ రాజమర్యాదలతో విలసిల్లే తెలుగు రాజులూ, అతి “లౌక్యం” లో ముదరబండిన తెలుగు మంత్రివృద్దులూ, మాటలాడిన ప్రతీమాటనూ కావ్యంగా మెరిపించగల తెలుగు మహాకవులూ ప్రత్యక్షమవుతారు.

కథల్లో, నిండు పాలకుండల్లాంటి తెలుగు కుటుంబాలూ, కొత్త బంతిపూవుల్లాంటి పల్లెపడుచులూ కనిపిస్తారు.

వ్యాసాల్లో, వ్యాఖ్యానాల్లో మాట పరువంతో నిశితతర్కం చూపే ఒక ఆంధ్ర మనిషి కనిపిస్తాడు. వెరసి - ఒక మాటలో చెప్పవలసి వస్తే - సుబ్రహ్మణ్యశాస్త్రిగారి రచన అంతా తెనుగు జాతికి అంకితం. దీనికోసం ఆయన తన సంస్కృతాంధ్ర సంస్కారాన్నంతా ఒకొక్కప్పుడు మూటకట్టి ఒకచోట పెట్టి..ఎంత మట్టానికైనా దిగి తెనుగు వాతావరణం సృష్టించడంలో చరితార్థులవుతారు.

ఆయన ఆంధ్రాభిమానానికి తోడు ప్రశంసార్దమైనది అసాధారణమైన అభ్యుదయదృష్టి ఈనాడు భాషా, సంఘ, సంస్కారాల గురించి ఎవరు ఎట్లా మాటలాడినా పేల పిండి. శాస్త్రిగారు రచన చురుగ్గా చేసేనాటికి కత్తులబోను. భాషా సంస్కారం గురించి తల పెడితే చీల్చి చెండాడే వృద్దపండితులొక ప్రక్క సమాజ సంస్కారం గురించి ఎత్తితే నిప్పులు చెరిగే సనాతన వాదులు రెండో పక్క రెండు కక్ష్యలనూ ధిక్కరించి, తాను నమ్మిన భావావళిని రచనల ద్వారా ప్రచారం చెయ్యడంలో-గుండెలు దీసిన బంటు శ్రీ శాస్త్రిగారు.

స్త్రీ వునర్వివాహ విషయంలో వీరేశలింగం పంతులుగారి వాక్కు ప్రభుసమ్మతంగా హుంకరిస్తే... శాస్త్రిగారి కథలు కాంతా సమ్మతంగా తెలుగు గుండెలను కరిగించి వేశాయి. వితంతు దయనీయ స్థితిని లోకానికి ఇంతగట్టిగా వాదించి చెప్పిన వకీలు మరొకరు కనిపించరు.

చేసే చేసే గ్రాంథికాంధ్ర రచనను విడిచి తెనుగు మసస్సులోనికి దూనుకువెళ్ళి వాడుక భాషను వట్టుకున్నారు. గ్రాంథికం మార్చి వ్యవహారికం చెయ్యవచ్చు. కాని యీయన వ్యానహారం వేరు. ఇంకొకరికి పట్టుబడడు. ఈయన రచన ఏదిచదివినా ఇది కసబడి పోతుంది!

శాస్త్రిగారి రచనల్లో ఒక పరమోద్దేశం స్పుటంగా కనబడుతుంది. హిందువుల ఆర్షమతం చాలా గొప్పదే. అయితే ఏం లాభం? అది శిధిలమూ, విషమమూ అయిపోయింది. దాన్ని అభిమానంతో కప్పితే ఏం లాభం? దాని కలరూపు స్పష్టంగా గుర్తించి ధైర్యంగా సంస్కరించాలి. ఈ భావ ప్రచారం కోసం అగ్రజాతుల అహంకారాలూ, మాలిన్యాలూ, అన్యమత మాత్సర్యాలూ, సోమరితనం, స్త్రీల పతనం వస్తువులుగా తీసుకుని పరశ్ళతంగా రచనలు సాగించారు.

శాస్త్రిగారి రచనలు రెండు విధాలుగా విభజించవచ్చును.

1. ప్రగతిశీల రచనములు

2. రసైక రచనములు, అని.

ఒక సిద్ధాంతం ప్రచారం చెయ్యడానికి రమణీయ సన్నివేశాలు కల్పించి చేసిన రచనలు మొదటి తరగతివి.

ఉన్న విచిత్ర సంవిధానాలను, వింత కథలనూ ఉపయోగించుకొని ప్రజ్ఞతో కావ్యత్వ సిద్ధిని పొందించిన రచనలు రెండవ శ్రేణికి చెందుతాయి. శాస్త్రిగారు యీ రెండు విధాలైన రచనలూ సమృద్ధిగానే చేశారు.

1 మార్గదర్శి 2. మొదటి దాడి 3. పెళ్లాడ దగ్గ మొగాడేడే 4 తాపీ మేస్త్రి 5. తల్లిప్రాణం 6. ఇల్లాంటి తవ్వాయి వచ్చిపడితే మొదలైన కథలనేకం తొలి జాతివి.

రాజరాజు నిగళబంధనం, కలంపోటు మొదలైన నాటకాలూ, వడ్లగింజలు, యావజ్జీవంహోష్యామి, ఇల్లుబట్టిన.... ఆడపడుచు, గులాబీ అత్తరువూ మొదలైన కథానికలూ రెండవజాతికి చెందినవి.


శాస్త్రిగారి రచనలమాట తల పెట్టేసరికి -మొట్టమొదట చిన్నకథలు జ్ఞాపకం వస్తాయి. ఎన్నాళ్లకిందట చదివినా ఆ కథల్లోని సన్నివేశాలూ, పాత్రలూ, అన్నింటినీ మించిన కథ చెప్పే ఒడుపూ మనస్సులోనుంచి చెరిగి పోదు.

వడ్లగింజల్లో తంగిరాల శంకరప్పగారినీ, దివాంజీగారినీ తెలుగు పాఠకులు మరచిపోగలరని నేననుకోలేను.

“ఇల్లుబట్టిన...ఆదబడుచు” కథలో ఒక సాధారణ (బ్రాహ్మణ కుటుంబ సన్నివేశం ఎంత నేర్పుగా చిత్రించారో, వడ్లగింజల్లో గంభీరమైన ఒక తెనుగు దివాణాన్ని అంత లోకజ్జతతో వర్ణించారు. ఈ రచనలో శాస్త్రిగారి రచనా సౌందర్యం “పరిణత ్రజ్ఞస్యవాణీ మియామ్‌” అన్నట్టుంది. దాన్ని ఇంకా వివరించడానికి ఈ సంకుచిత స్థలం చాలదు.

సరిగ్గా ఇదే రంగస్థలం మీద గులాబీ అత్తరుతో షుకురల్లీ కనిపించి, “ఇదేనా తెనుగు జాతి రసికత” అని ఎర్రని కళ్లతో అడుగుతూ ఉంటే మన తెల్లని కళ్లు చెమ్మగిలుతూ ఉంటాయి.

మార్గదర్శి అంతా ఒక ఉపన్యాసం. కాని విసుగు పుట్టించదు. అందులో కొన్ని కథలు చరచర పరుగెత్తుతాయి. ఇందులోని టెక్సిక్‌ చిత్రమైనది. ఉద్యోగం పేరిట బానిసతనానికి ఎగబడే బ్రాహ్మణ యువకుల భావరుజకు ఈ రచన సంజీవిగా పని చేస్తుంది.

“శ్రుఖికేశిర ఆరోహ” అనేది ఒక చురుకైన “శటైర్‌”. అచ్చపు తెనుగు కుటుంబంలో అతకని ఉత్తర హిందూ నాగరికతా వ్యామోహాన్ని చమత్కారంగా నిరూపించి చాలా మంది ఆంధ్ర యువకుల భావ దాస్యాన్ని హేళన చేశారు. ఇందులో. అంతేగాదు - శాస్త్రిగారికి హిందీభాషమీద ఉండే సదభిప్రాయం కూడా దీనిలో తొంగిచూస్తూ కనబడుతుంది.

తల్లిప్రాణం ఒక మంచికథ. టీ కప్పులో తుఫాను అన్నట్టు ఒక బ్రాహ్మణ కుటుంబంలోని భావ సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. శిథిలమైన సనాతనాచారానికి ఒక ముసలి వితంతువు ప్రతినిధి. పొంగివచ్చే సంస్కార వాహినికి ఒక ప్రోడ తెనుగు ఇల్లాలు ఆలంబం. మధ్య నిస్సహాయుడైన యజమాని యొక్క సంశయాత్మ, ఫలితం

మొదటిదాన్ని రెండవది అణచి వేసి నెగ్గుతుంది. ఇది శాస్త్రిగారికే గాదు, ఆంధ్ర పాఠకులందరికీ అభిమాన రచనే అనుకుంటాను. ఇట్లాంటి వందల కొలదీ రసవత్కథానికలే కాకుండా ఈయన నవలలు కూడా అనేకం వ్రాశారు. రక్షాబంధనం మొదలైనవి అపరాధ పరిశోధకములు. వీటిలో గూడా ఈ రచయిత మేలికత కనబడుతుంది. వంగ అపరాధ కథలతో నిండిన తెలుగు పాఠకులకు ఊరటగా - తెలుగు జీవితంలో నుంచి అట్టి కథలు కల్పించి ప్రజాదరణ సంపాదించారు.

ఆత్మబలి - శాస్రిగారు ఇటీవల రచించిన నవల. వయసు వచ్చిన కొడుకును కులపౌరుష చిహ్నంగా యుద్దానికి పంపిన ఒక కాపు యువతి ముమ్మరమైన యౌవనపు పొంగును ఆపుకోలేక నరకానికి జారిపోతూ చట్టున నిలదొక్కుకుని కొడుకు ప్రతిష్ట కోసం అతని సుఖం కోనం తన అనుభూతిని బలివేసుకుంటుంది. ఈ పతనోత్పతనాలలో రచయిత చూపిన కౌశలం సాటిలేనిది.

నాటకాల్లో “రాజరాజు” శాస్త్రిగారి కీర్తి పతాక అని చెప్పవచ్చు. గ్రాంధికాభిమాని స్వర్గీయ జయపురాధీశుణ్ణి గూడా ఆకర్షించి ఆనంద పెట్టినదంటే ఈ నాటకం యొక్క ఉదాత్తత ఊహించవచ్చు.

అనేకులు “సారంగధరలు” రాశారు. కాని వాటిలోని రాజరాజు పూసలకోటుతో వట్టి నాటకం రాజుగా కనిపిస్తాడు గాని 'యావదాంధ్ర భూమిని ఏకచ్చత్రంగా పాలించిన చాళుక్య ప్రభువుగా కాన్పించడు. ఇక ఆ నాటకాల్లో నన్నయకు నామరూపాలే లేవు. అట్టి కథ తీసుకుని ఇంద్రజాలం చేసినట్టు సజీవమైన ఆంధ్ర రాజ్య వాతావరణం సృష్టించి గంభీర చాళుక్య రాజరాజును, రాజనీతిలో పండిపోయిన తెనుగు మంత్రివృద్దులనూ, మాటలతో బంతులాడే భృత్యవర్షాన్ని ప్రదర్శించారు.

ఇందులోని నన్నయ మహాకవి సృష్టి అపూర్వం. ఈ నాటక ముకాహారానికి మేరుమణి నన్నయ. ఇతడు కులబ్రాహ్మణుడు మాత్రమే అనుకునే అల్పజ్జులకు కూలంకష లోకజ్ఞుడు కూడాను అని స్ఫుటంగా శాస్త్రిగారు తమ నాటకంలో నిరూపించారు.

భారత రచన అరణ్య పర్వంలో ఆగిపోవడానికీ, కోడలు కాదగిన చిత్రాంగిని రాజరాజు వరించడానికీ ఈయన చేసిన వ్యాఖ్యానం అద్భుతమైనది. అధర్మ పరిధిలో భారతాంధీకరణం చెయ్యలేడు నన్నయ మహర్షి

తన భోగం కోసం అన్యాయంగా కొడుకు యౌవనం అడిగి పుచ్చుకున్న యయాతి వంశస్థుడు రాజరాజు. ఎంత ఉజ్జ్వల కల్పన!

కలంపోటు - ఒక ఏకాంక రూపిక.

ఈ రచన చేసిన శాస్రిగారిలో - ఇప్పటి వారి పరిభాషలో - ఒక అభ్యుదయ కవి దాగి ఉన్నాడు. తిమ్మన పారిజాతాపహరణం గురించి చెప్పుకునే ఒక దంతకథ దీనికి ఆధారం. దాన్ని కవి అన్నవాని ప్రజ్ఞా పారమ్యానికి నిదర్శనంగా చేసి శక్తిమంతంగా నడిపారు.

పారిజాత... రచనలో మునిగి తేలే తిమ్మకవిగారికి మహామంత్రి తిమ్మరుసు కొట్టిన దెబ్బ నసాళం అంటింది. “నే నిప్పుడొక రాచకార్యం లో పడి కొట్టుకుంటున్నాను... ఈ స్థితిలో వాజ్యయవిషయం... అందులో శృంగార కవిత్వ...” అనే సన్నాయి నొక్కులతో తిమ్మకవిగారికి గొంతు నొక్కినంతపని అయింది. ఈ బీజాతాపంతో శాస్త్రిగారు కథకు వేగం కల్పించి, తిరుమల దేవి దాసి మంగ. ప్రసంగంతో తిమ్మకవికి తహతహ లెత్తించి, అతని గంటాన్ని అనేక యుద్ధాల్లో ఆరియుతేరిన కర్జాట సార్వభౌముని మీద మో పెట్టి ఓడించి రసవంతమైన పరి సమాప్తి నిచ్చారు.

రాయల సభలోని సాహిత్య చర్చా సౌరభం ఈ చిన్న నాటికలో అనుభూతమై తత్రియావులను ఎన్నటికీ విడువదు.

అయితే ఒక్కమాట - అభిజ్జులైన నటులూ, రనజ్ఞులైన ప్రేక్షకులూ వచ్చేదాకా తెనుగు రంగం మీద ఇట్టి నాటకాల ప్రదర్శనం చూచే యోగ్యత మనకు లేదు.

-4-

రచయితలకు సాధ్యంకాని ఒక అసాధారణ సాహిత్యసంస్థ నడుపుతున్నారు బి శాస్రిగారు. దాని పేరే కలాభివర్ధనీ పరిషత్తు. చాలా రోజులు ఈ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పుస్తకాల అట్టలమీద మాత్రమే కనబడుతూ ఉండేది. ఉండి ఉండి ఒక్కసారిగా కల నిజమైనట్టు ఇది బలిష్టంగా ప్రత్యక్షమయింది. పేరుపడిన ఎందరో రచయితలు కలాభివర్ధని పిలుపుతో వచ్చి అసాధారణ గౌరవమంది బిబిజాంబూనదాంబరంబులు గ్రహించి ఉత్సాహ తరంగితంగా ఉపన్యాసాలివ్వడం, కావ్యగానం చెయ్యడం జరుగుతున్నది. ఈ సమావేశాలకు నాయకమణులు నన్నయ్య శ్రీనాథ జయంతులు. వీటి అన్నిటి వెనకా ప్రబలమైన (ప్రేరకశక్తి శ్రీ శాస్రిగారు. వీరికి సాహితీ 'ప్రియులైన రాజమహేంద్రవర పౌరులు ఆలంబనం. భేష్‌. “మణినా వలయః వలయేన మణి”

మొత్తంమీద - శ్రీ సుబ్రహ్మణ్య శాస్రిగారి సాహిత్య వ్యాసంగం గురించి ఒక చిన్న వ్యాసంలో చెప్పడం సాహసికమైన పని. వారి అన్ని రచనల గురించీ సమగ్ర పరిశీలన చెయ్యవలెనంటే ఒక గ్రంథం వ్రాయడం అవసరం. నాకన్న సమర్థులు ఆ పనికి అర్హులనుకుంటాను. ఇంతకూ - శాస్త్రిగారు షష్టి పూరిత వయస్కులే కాకుండా సాహిత్య శతవృద్భులు గూడా అయి మాకు మార్గదర్శి కావాలని కాంక్షిస్తున్నాము.

కిన్నెర: సంపుటము 3, సంచిక 5, మే 1951)


ఆకాశవాణి - ఆంగ్రభాష

ఆకాశవాణి - విజయవాడలో ముఖ్యంగా యఫ్‌యమ్‌ కృష్ణవేణి వినేవారికి చాలా వరకు ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి. ఆకాశవాణి ఆంగ్లభాషకు ప్రాముఖ్యం ఇస్తున్నదా? లేక కార్యక్రమాలు నిర్వహించే వారి పరభాషా నైపుణ్యం చాటుకొనటానికా? అనే విధంగా ఎక్కువ ఆంగ్ల పదాలు వాడి, వినే సామాన్యులకు అర్ధం అయిన్న, కాకపోయినా మా భాష మాది అనే అహంకారమా? తమిళంలో కాని, కన్నడంలో కాని ఆంగ్ల పదాలు ఆలా తక్కువగా వాడతారు. మన వాళ్ళు ఇతరులను చూసి నేర్చుకొనరు. మాతృభాషపై మమకారం చూపరు. పరభాషా వ్యామోహం తగ్గితేగాని ప్రాంతీయ ప్రసారాలకు గౌరవం రాదు.....ప్రొఫెసర్‌ ఎ.వి. నరసింహం 08678 277155