Jump to content

అమ్మనుడి/సంపుటి 5/మే 2019/తలోదారిలో సాహిత్యం-సమాజం-సంఘాలు-సాధికారిత

వికీసోర్స్ నుండి

భాష సంస్కృతి.

డా॥పి. శివరామకృష్ణ (శక్తి)94414 27977

తలోదారిలో సాహిత్యం-సమాజం-సంఘాలు -సాధికారిత

నూతన ప్రజాస్వామిక విప్లవం, పీడిత జన విముక్తి, రాజ్యాధికారం, సాహిత్యం- సామాజిక స్పృహ, శాస్త్ర విజ్ఞానాల ఆధునికీకరణ అంటూ “ఎవరికి తెలియని ఏవో పాటలు పాడే బుద్ధిజీవులు తమ పాత్రను నిర్వచించుకోవలసిన అవసరం వచ్చింది.

1. పండిట్స్‌ టైనింగ్‌కు వచ్చిన నాటినుండి రాజమహేంద్రి సాంస్కృతిక వాతావరణంతో నాకు పరిచయం.కానీ జిల్లాలో మన్య ప్రాంతానికి ఉపాధ్యాయుడుగా వెళ్ళిన తరువాత, ఆ గిరిజన పిల్లల మీద మనచదువులు రుద్దటం, నగర వాసులకు ఆ అదోజగత్‌ సహోదరులమీద ఏమి ఆసక్తి లేకపోగా అవాకులు చెవాకులు వాగడం ...వీటినిగూర్చి అలోచిస్తున్నకొద్దీ, ఆ నగర వాతావరణంలో డొల్లతనం అర్ధం కాసాగింది.

2. తెల్లవాళ్ళు ప్రవేశపెట్టిన సార్వత్రిక విద్యకు ఉద్యోగం పరమావధి అయింది. ఆ ఉద్యోగ భద్రత రకరకాల వ్యాపకాలలో మునిగి తేలటానికి భద్రలోకానికి అవకాశమిచ్చింది. పాఠశాల స్థాయి నుండి వక్తృత్వం, వ్యాసరచనలలో తర్ఫీదు, పెరుగుతున్న అక్షరాస్యత, విస్తరిస్తున్న పత్రికారంగం - రచయితలు, సాహిత్యగాళ్ళుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం కలిగించింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు శిష్టసాహిత్యం రసానందం వైపు, నవ్యసాహిత్యం పలాయనం వైపు, ఉద్యమ సాహిత్యం ఉన్మాదం వైవు, సామాజిక స్పృహ పిడి వాదంగా వెర్రితలలు వేస్తూ ఎవరి దుకాణం వారిదిగా గుంపులను పెంచుకోసాగాయి.

8. వీరేశలింగం సంఘసంస్కరణ గత చరిత్ర అయింది. తెల్లవాళ్ళు ప్రవేశ పెట్టిన విద్యను,ఉద్యోగాలను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు తన ఆత్మకథ 'నా జీవితయాత్ర'లో 'ఆ కాలంలో రాజమహేంద్రవరంలో విద్యాసంస్థల గురించి, విద్యావిధానాన్ని గురించి విపులంగా వ్రాస్తాను. ఉత్తరోత్తరా ఈ విద్యావిధానం మన జాతినెట్లా నిర్వీర్యం చేసిందో తెలుసుకోవాలంటే - ఆనాటి మన జాతీయ విద్యావిధానం, దాన్ని ఇంగ్లిష్‌ వాళ్ళు వచ్చి ధ్వంసం చేసిన విధము, అందువల్ల మనజాతి అవిద్యలో మునిగి పోవడము బాగా అవగాహన చేసు కోవాలి. ఈ నూతన విద్యావిధానానికి దాసుడైన నాబోటి వారి వర్ణన, ఈ విషయంలో మరీ సమంజసంగా ఉంటుందనుకుంటాను. మెకాలే సలహా మీద ఈ దేశంలో ఇంగ్లీష్‌ చదువు స్థాపించడానికి నిర్ణ యించారు. ఆనాటి పాలకుల విద్యాదర్భంఃఆనాదన్న మాటేమిటి, ఈనాటికి అదే. తమ పరిపాలనకు కావలసిన గుమస్తాలను దుబాషిలను తయారు చెయ్యటమే. ఆ జాతీయ విద్యావిధానపు ఆదర్శం జాతీయమైనది, విశాలమైనది. ఈ నూతనవిద్యకు ఆదర్శం నౌకరీ, ధన సంపాదనా, స్వార్ధమూను. ఎప్పుడైతే మిడిల్‌ స్కూళ్ళ చదువు పూర్తిచేసిన వాళ్ళు, మెట్రికులేషన్‌ పాసయిన వాళ్ళుకూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులై అమితంగా ధన సంపాదనలో పడ్డారో, అప్పుడే దేశంలో విద్యాదర్శాలు క్షీణించాయి. జనం ఇంగ్లిష్‌ చదువులకు తియ్య నీటికీ చేపలెక్కినట్లు ఎక్కారు. అప్పట్లో ఈ చదువులలోకి వెళ్లిన వారంతా ఉద్యోగస్తులై ధనార్జన బాగా చేయడం వల్ల దేశస్తుల వ్యామోహం అటు తిరిగింది. అంటూ దుయ్యబట్టిన తీరును గాని,” నీవేమన్నా కరణానివా మునసబువా కనిస్టేపువా, నీకు దడిచేందుకు అంటూ ఉద్యోగుల దాష్టికాన్ని ఎత్తిపొడిచిన చిలకమర్తి లేవదీసిన ప్రశ్నలను చర్చించే వారు కరువయ్యారు. చరిత్ర వేత్త రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, దామెర్ల ఆర్ట్‌ గాలరీలమీద ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం “మున్నీరు? “మిన్నేరు” అద్దేపల్లివారు ప్రచురించారుగాని, వాటిని పట్టిం చుకునేవారు లేరు. మధిర సుబ్బన్న దీక్షితులు సంప్రదాయంగా చెప్పుకునే కాశి మజిలీ కధలను ప్రచురించి గడించారు. నవభారత గురుకులం, భూపతిపాలెం పాఠశాలలు వి"శిష్ట ' విద్యాలయాలుగా వెలుగొందుతుండేవి.

4 మార్కిస్ట్‌ విమర్శకుడు త్రిపురనేని మధుసూదనరావు మాటల్లో “వెన్నెముక లేని మధ్యతరగతి జీవితం సాహిత్యంలోకి ప్రవేశించింది”. “తెలుగు సాహిత్యాన్ని జానవదసాహిత్యం అని ముద్దుపేరో మొరటు పేరో పెట్టి విస్మరిస్తున్నారు. తెలుగు సాహిత్యం అంటే అనువాద సాహిత్యమే అని బహుళ ప్రచారం చేస్తున్నారు. (సాహిత్యంలో వస్తు శిల్పాలు పెర్సెక్టిన్‌ ప్రచురణ 19.వు 117,109.) ఇలా లిఖిత సాహిత్యాన్నికళలను రుద్దటాన్ని ప్రపంచవ్యాప్తంగా గమనించే 'క్లబ్ ఆఫ్‌ రోమ్‌' ఈ పోకడలను 'టెక్నో ట్రానిక్‌ ఎత్నోసైద్‌' అంటే జంత్రబలంతో జాతుల సృజనాత్మకతమీద చేసే మారణకాండగా నిరసించింది.

5. అవ్వాకావాలి, బువ్వాకావాలి అంటూ స్వేచ్చా కావాలి -భద్రతా కావాలంటూ ఊగిసలాడే మధ్యతరగతి పలాయన వాదులను తెన్నేటి సూరి చెంగిజ్‌ ఖాన్‌ నవలలో మన్యం వంటి గోబీ ఎడారులకు పోరాదా అంటూ ఎత్తి పొడిచినా - పాపికొండలలో కొండరెడ్డి తెగను 1943లొ అధ్యయనం చేసిన మానవ శాస్త్రవేత్త హైమెందర్భ్‌ , రెండు గంటల ప్రయాణం దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాల గూర్చి ఈ నగర వాసుల అజ్ఞానాన్ని, పిరికితనాన్ని దెప్పిపొడిచినా ఈ భద్ర లోకానికి చీమకుట్టినట్టన్నా ఉండేదికాదు. అటు మన్యం వైపు చూస్తే అడవుల నరికివేత ముమ్మరంగా సాగుతున్న రోజులవి. గిరిజన ప్రాంతంలో రైతుకూలి సంఘాల సాయుధ దళాలు గిరిజనులను వేధించే కింది స్థాయి అధికారులను మందలిస్తూ, కూలి రేట్లు పెంచుతూ కలప సారా వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటూ తమపట్టు కోసం ఎత్తుగడలు వేస్తుండేవి. 6. జీవితం దశ దిశలను వెతుక్కుంటూ ఆందోళనతో రగిలి పోయే ఈ తరుణంలో, 1976 లో గిరిజనగీతాల సేకరణ, పరిశోధన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాను. ఇక్కడ అన్నిరకాల రాజకీయ / వామపక్షాలకు విద్యార్ధి సంఘాలుండేవి. వారిమధ్య ఘర్షణలతో ప్రాంగణం మొత్తం ఉద్రిక్తంగా ఉండేది.

జానపద సాహిత్యం అధ్యయనానికి తెలుగు శాఖ కేంద్రం. జానపద కళాకారులు చుక్క సత్తెయ్య, చిందు ఎల్లమ్మలకు సభాగౌరవం తేవటానికి నటరాజ రామకృష్ణ రామరాజు, నాగభూషణ శర్మలు కృషి చేస్తుండేవారు. పరిశోధన విషయాన్నిబట్టి నా దృష్టి సాంఘిక శాస్త్రాలు, ముఖ్యంగా మానవ శాస్త్రం వైపు మళ్ళింది.” Nothing human is alien to me" అన్న మార్క్స్ సూక్తికి తగ్గట్లు, మానవశాస్త్రం సర్వశాస్త్రాల సమాహారం. తెగలకు సంబంధించిన భాష, సాహిత్యం, కర్మకాండ, పర్యావరణం, సంజ్ఞానం, భౌతిక ప్రాక్ళారిత్రక విశేషాలనుఎందఱో శాస్త్రజ్ఞులు తరతరాలుగా అధ్యయనం చేసి, వాటిలో క్రమాన్ని స్పష్టపరచారు. సంస్కృతి గతిశీలం అని నిరూపించారు. సంస్కృతి అంటే నమ్మకాల దొంతర, పురాగాధలు అంటే పుక్కిటి పురాణాలు అని నిరసించే హేతువాద, “శాస్త్రీయ” వ్యాఖ్యానాలను పటాపంచలు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవశాస్త్రం లేకపోవడంవల్ల, ఏదో వాళ్ళు చెప్పిన ఒరవడిలో కాకుండా, స్వేచ్చగా చదువుకోడానికి, ఆలోచించుకోటానికి, తోచిన సమాచారం సేకరించుకోటానికి అవకాశం కలిగింది. భారతీయుల తాత్విక చింతన విశ్లేషణ విధానాన్ని మానవశాస్త్ర విచారధారతో సమన్వయిస్తూ నేను సేకరించిన సమాచారం వ్యాఖ్యానించిన తీరు, తెలుగుశాఖ పత్రిక 'వివేచన ' పంచకన్యల వృత్తాంతాన్ని 'దేశకాలాలు- వివాహ పద్ధతులు ', 'వార్త యందు జగము వర్దిలు చున్నది ' (1982) అనే శీర్షికలతో ప్రచురించింది. మూల్యాంకనం చేసిన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మానవ శాస్త్రవేత్త మునిరత్సంరెడ్డి గారి ప్రశంస, కొత్త పరిచయాలను సమకూర్చింది.

7. ఇదే సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమాల మీద వచ్చిన సాహిత్యం మీద మార్చిస్ట్‌ దృక్పధంతో పరిశోధనలు జరుగుతుండేవి. ఉద్యమ కళాకారులు గద్దర్‌ వగైరాలు ఎదగసాగారు. అయితే కధలు, ఉద్యమ సాహిత్యం ఒక మాధ్యమం మాత్రమే నని 'నూరేల్లకు పైగా తెలుగు కథ వస్తు నిర్దేశంగా పయనించింది...గత ముప్పైఏండ్లుగా తెలుగు ప్రజాసంన్కృతిలో [ప్రాణం పోసుకున్న పాటకు జన్మనిచ్చింది ఉద్యమం...కథయే పరమార్థంగా, వాహికగా కాకుండా లక్ష్యంగా, సాహిత్య ప్రక్రియగా కాకుండా, ఉద్యమంగా ప్రచారం చేసి , ఆ ప్రచారం ఒక సత్యంగా నమ్మే ప్రమాద సూచిక దగ్గరికి ప్రచారకులు చేరిపోయారు అంటూ వామపక్ష సాహిత్యగాళ్ళను హెచ్చరించవలసి వచ్చింది...(భూమితో మాట్లాడు” వరవరరావు 2005లొ తెలంగాణా విమోచనోద్యమం తెలుగునవల1983).

8. అదే సమయంలో గిరిజన ప్రాంతాలలో సమస్యలమీద అధ్యయనాలు జనార్దనరావు అద్వర్యంలో జరుగుతుండేవి. 1/70 రెగ్యులేషన్‌ నుండి చిన్న రైతులను మినహాయిస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం, అంతకు ముందే కోర్టు ద్వారా జిల్లాలో కొన్ని గ్రామాలు గిరిజన ప్రాంతంనుండి తీసివేయించటం ఆయన పేర్కొన్నారు. కొందరు అధికారుల సలహా మేరకు కావచ్చు, ఆ జి.వా.ను ఖమ్మం జిల్లాలో ఒక గిరిజనసంఘం పిటిషనర్‌ గా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు కన్నబిరాన్‌ కొట్టేయించారు. చిన్న రైతులను ఆదుకునేందుకు వామపక్షాలు ఉద్యమించి బలం పెంచుకో సాగాయి. శ్రీకాకుళం ఉద్యమాన్ని అణచి వేసినట్టే, ఇక్కడకూడ పౌరహక్కుల ఉద్య మాన్ని అణచి వేతకు ప్రభుత్వం దమనకాండకు పూనుకొంది. ఈ హింస, నక్సలైట్ల ప్రతిహింస మీద జోరుగా చర్చలు జరుగుతుండేవి. “కూలి సరిగ్గా ఇవ్వని భూస్వాములను కూలి అడగటానికి, భూములు పంచని పాలకులను భూములు అడగటానికి, అడవులను ఆక్రమించు కున్న ప్రభుత్వానికి అవి గిరిజనుల అడవులు అని చెప్పటానికి...జనం ఐక్యమై ఆందోళన చేస్తే దానిని తీవ్రవాదం అనడానికి వీల్లేదు'అని పౌరహక్కుల నాయకుడు రామనాధం గారికి జోహార్లర్చించిన బాల గోపాల్‌

9. "పేదలకు పంచడానికి భూములెక్కడున్నాయి అని కమ్యూనిస్టులు సహితం అనుకుంటున్నదశలో తన స్వంతజిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన... భూముల్ని ఒక్కటొక్కటిగా బయటకు తీసి భూసంస్కరణల కార్యాచరణోద్యమం పేరిట దళిత సంఘాలను ఇతర ఉద్యమకారులను కలుపుకుని కలక్టర్ల వెంట పడ్డాడు నరేంద్రనాద్‌ అంటూ ఆయన గాంధేయ దృక్పధాన్ని 'ప్రశంసిస్తాడు. (హక్కుల ఉద్యమం - తాత్విక దృక్సధం 2010).

10. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకాలో ఈ ఉద్యమానికి 'సలహా' ద్వారా పునాది వేసిన వారు గీతారామస్వామి, సిరిల్‌ రెడ్డి మనోహర్‌, శైలజ, సి.వి.మోహానరెడ్డి వగైరాలు-జాతీయ గ్రామీణాఖివృద్ధి సంస్థ పరిశోధన పేరిట, భూమి రికార్డులు సేకరించు కోటానికి, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యుడు డి.నరసింహారెడ్డిగారి నుండి ఉత్తరం పెట్టించి, జిల్లాలలో రికార్డులు సంపాదిస్తూ, ఈ కార్యక్రమాన్నివారు కొంతకాలం నడిపించారు. అయితే విశ్వవిద్యాలయాలలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, జనార్దనరావ్‌ వంటి ఆచార్యులు ఈ విధానంలో గిరిజన భూముల మీద పరిశోధనలు చేయటానికి పూనుకోలేదు.కానీ 'సలహాతో పని చేసిన దళిత మేధావి బొజ్జాతారకం ఆ విద్య యొక్క అవసరం గుర్తించారు. “సర్వే నెంబర్లు, సరిహద్దు రాళ్ళూ అన్నీ కరణానికే తెలుస్తాయి...భూమికి సంబంధించిన విషయాలన్నీ అతని మాట మీదనే ఆధారపడి ఉంటాయి. మూడో ఎద్దుగా మనిషి మారాలంటే ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. ఒకటి భూమి సమస్య, రెండు చదువు.భూమి ఇస్తే చదువు తనే చదువుకుంటాడు...భూమి, చదువు ఎంత అవసరమో తెలుసుకున్న ఆసాములు పాలేరు జీతగాల్లకు ఆ రెండు లేకుండా చేసారు. (నేల నాగలి మూడు ఎద్దులు 2008) తరువాత నవల పంచతంత్రంలో(2012) కూడా అయన ఇదే చెప్పారు. 1964లో వచ్చి, ఒరవడిగా మారిన కారా 'యజ్ఞం కథకు రావలసిన మలుపు, ఇప్పటికి వచ్చింది.

11.మైదాన ప్రాంతాలలోకన్నా గిరిజన ప్రాంతాలలో రైతు కూలి సంఘాలకు పట్టు ఎక్కువ. అధికారంలోకి వచ్చే బలంలేదు గాని తమ ప్రయోజనాలు కాపాడుకోడంలోవారు వివిధ వర్గాలతో చేతులు కలుపుతారు. సమర్ధించుకుంటారు. శక్తి ప్రారంభించిన తొలినాళ్లలో, గిరిజనులు ఒక సారాకొట్టు మూయించారు. రైతుకూలి సంఘాలు ప్రశంసించాయి. మరుసటి సంవత్సరం, ఆ సారాకొట్టు తెరిస్తే గిరిజనులు ఆ కొట్టు మూయించారు. ఈసారి సంఘాలు ఆ కొట్టును సమర్ధిస్తూ గిరిజనులలో తాగుడు అరికట్టడం, బయటి వాళ్ళు పెట్టే సారాకొట్టు ద్వారానే సాధ్యం అంటూ కరపత్రం వేసి సమర్ధిం చుకున్నారు...తాగుడు అదుపు చేస్తాం, మాకో అవకాశం ఇవ్వండి అంటూ గిరిజన విద్యార్దులు, దళ నాయకుడిని బతిమాలినా వాళ్ళు అంగీకరించలేదు. పనులలోకి రాకుండా వెలివేస్తాం అంటూ బెదిరించారు. అప్పట్లో ప్రముఖంగా వచ్చిన ఈ వార్తలు చూసి, నేడు రచయిత గిరినసంక్షేమశాఖలో అధికారి శ్రీ చినవీరభద్రుడు నన్ను చూడడానికి వచ్చారు. ఆయన తత్వశాస్త్రం చదువుతున్నారని తెలిసి నావ్యాసం “వార్తయందు జగము...” ఇచ్చాను. వారి నాన్నగారు శరభవరం కరణం గారు చెప్పిన వివరాల నమూనాలో, కలెక్టరు కార్యాలయంలో తారీకులు దస్తావేజులు వెతికి 'భూములు కోల్పోతున్న గిరిజనులు 'అనే పుస్తకం వేసాం. పాడేరులో ప్రాజెక్ట్‌ అధికారి కొన్న 'తెలుగు గిరిజనగీతాలు' సొమ్ము ఆయనే పంపించారు. ఈ మధ్యనే గిరిజన సంస్కృతి ప్రధానోపాధ్యాయుల కరదీపిక ఆయన సమన్వయం లోనే వచ్చింది.

11. 1976లో తూర్పుగోదావరిలో గిరిజన ప్రాజెక్ట్‌ అధికారిగా పనిచేసిన రచయిత 'నెలనెలా వెన్నెల ' సి. వి.కృష్ణారావుగారు, మారేడు మిల్లిలో కొండమామిడివెట్ల నరికివేతకు తన మెడను అడ్డంపెట్టిన చిన్నం శాంతయ్యను తన కవితలలో ప్రస్తావించారు. ఆ శాంతయ్య గారి దగ్గరే, పరిశోధనకు కావలసిన సమాచారం సేకరించాను. ఆ మామిడి చెట్లను నరికే ప్లయ్‌ వుడ్‌ ఫాక్టరీని మనోహర్‌, మోహనరెడ్డిల ద్వారా ప్రజాహిత వ్యాజ్యం వేయించి మూయించటం మాతోలి విజయం. తరువాత గనులు మూయించాము. రైతుకూలి సంఘాల ఒప్పందపు కూలి బదులు ఐ.టి.డి.ఏ. చేత కనీస వేతనాలు ఇప్పించాము.

12. మళ్ళీ వరంగల్‌ గిరిజన ప్రాంతానికొస్తే, అక్కడ కమలాపురం రేయన్‌ ఫాక్టరీ ఉంది. ఆదిలాబాబాద్‌ గిరిజన ప్రాంతంలో దేవాపూర్‌ సిమెంట్‌ ఫాక్టరీ ఖనిజాలు తవ్వుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 23 గ్రామాలు గిరిజన ప్రాంతం నుండి తొలగించటమే కాదు, 1/70 రెగ్యులేషన్‌ వర్తించదని స్టే తెచ్చుకోడం 1987లోనే వరంగల్‌ జిల్లాలో మొదలైంది ఇక్కడే. కన్నబిరాన్‌ తన ఆత్మకధ 24 గంటలలో ప్రస్తావించిన న్యాయవాది ప్రతాపరెడ్డి ఇలా 32 గ్రామాలకు స్టేలు వరసగా తెస్తుంటే, 1992లొ నిలువరించటంతో మా పశ్చిమ గోదావరి కార్యక్రమం ప్రారంభమైంది. 'చాలా కాలంగా ఆదివాసులలో పునాది ఉన్న ఏ కమ్యూనిస్ట్‌ పార్టీ కూడా 1/70 పోరాటాన్ని ఆ స్థాయిలో ఎందుకు చేపట్టలేక పోయింది అనేది ప్రశ్న...1/70 పోరాటం ఆదివాసీలే చేపట్టిన ఉద్యమాల్లో ముందుకొచ్చినంత బలంగా ఏ కమ్యూనిస్ట్‌ గిరిజన ఉద్యమంలోనూ రాలేదు'(చూపు జనవరి 1999) అని గమనించిన బాలగోపాల్ , జనార్దనరావుతో కలిసి ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఉద్యమిస్తున్న అశ్వారావు దమ్మపేట మండలాలలో పర్యటించి “వార్తలో రాసారు. కానీ స్వయంగా ఆ ఉద్యమంలో పాల్గొనలేకపోయారు.

13. బాలగోపాల్‌ పేర్మొన్నట్లు నల్లమల నుండి చెంచులను తరలించాలని చూస్తున్న తరుణంలో, ప్రకాశం జిల్లాలో వారిని వోటర్లుగా నమోదు చేయించటంతో వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావటం మొదలైంది. లోపలి అడవిలో ఉన్న అప్పాపూర్‌ పంచాయతి అయింది. చేపలు పట్టుకునే హక్కు చెంచులు సాధించు కున్నారు. అన్నిటికి మించి చెంచులు సేకరించిన సంప్రదాయ సాహిత్యం వెలుగు చూడటంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పటిదాకా విదేశీయులు హైమెందోర్స్‌, మైకేల్‌ యార్క్‌ కృషి మాత్రమే ఆధారమైతే,ఇప్పుడు గోండుల సంప్రదాయ సాహిత్యాన్ని ఆదిలాబాద్‌ ఆకాశవాణి ద్వారా సుమనస్పతి రికార్డ్‌ చేస్తున్నారు.

14. అయితే ఎవరి పని వాళ్ళది అన్నట్లు పక్కపేజి పట్టించుకోని ధోరణి పెరుగుతోంది. జయధీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం జానవద విజ్ఞానంపై స్నాతకోత్తర విద్యార్థులకు వ్యాసావళి తయారు చేసి ప్రచురించింది. వాటిలో జానవద సాహిత్యం మీద రాసిన వ్యాసాలతో పాటు, “గిరిజనుల కళలు సాహిత్యం” వ్యాసం కూడా ఉంది. గిరిజన రచయిత మల్లిపురం జగదీశ్‌ శిలకోల ' కథల సంకలనానికి ముందుమాట రాసి, అతని వ్యాసాన్ని 'బహుళ 'లో చేర్చిన సంపాదకులు, తన వ్యాసాల పక్మనే ఉన్న “గిరిజనుల కళలు, సాహిత్యం” వ్యాసం జగదీశ్‌ దృష్టికి, పాఠకుల దృష్టికి తేలేక పోయారు.

15. 1960లో తయారైన మాండలికవృత్తి పదకోశాలకు ముందుమాట రాస్తూ ఆ విజ్ఞానాన్ని మానవ శాస్త్రవేత్తలు ఉపయోగించుకోవాలి, విశ్లేషించాలి అని భద్రిరాజు కృష్ణ మూర్తి ఉద్బోధించారు. అయన హైదరబాదు విశ్వవిద్యాలయం కులపతిగా ఆ ప్రయత్నం చేస్తే బాగుండేది. 1995లో తెలుగు భాషాభిమానులు, తెలుగు గ్రంథాలు పునర్ముద్రించాలని పిలుపునిచ్చారు. కానీ మాండలిక పదకోశాల ప్రచురణ త్వరగా పూర్తిేచేయమని కోరలేదు. ఇవేళ పాత పంటలు, రుచులు గూర్చి ప్రచారం చేస్తున్నవారు, జానపదుల వారసత్వాన్ని చాటే వ్యవసాయ వృత్తి పదకోశాలను తెలుగు సామెతల సంకలనాలను గుర్తుచేయటం లేదు. ఇటీవల వస్తున్న చట్టాలు సంప్రదాయాన్ని గుర్తిస్తున్నాయి. అడవిలో గిరిజన ఆవాసాలకు సంప్రదాయ సరిహద్దు పటాలు తయారు చేస్తున్నట్లే , సముద్రంలో మత్స్య కారుల స్థల నామాలను ఉపగ్రహ చిత్రాలతో అనుసంధానం చేసే ప్రయత్నం మొదలైంది. అందుకు మత్స్య పరిశ్రమ మాండలిక పదకోశం ఉపయోగ పడుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణంలో పెను మార్పులను వ్యవసాయ పదకోశం ఆధారంగా అధ్యయనం చేయాలి. జ్ఞానాన్ని ప్రజలలోకి తీసుకు పోవాలంటే ఈ పలుకు బడులే దిక్కు

16. ఇలా సాహిత్యగాళ్ళు, సంఘాలు, మేధావులు, ఆచార్యులు శీతకన్ను వేసినా, సంప్రదాయ జునపద గిరిజన సాహిత్యం తన ఉనికిని చాటుకుంటుంది. సాధికారిత ఏటికి ఎదురీది ఊపిరి పీల్చుకొంటుంది. ఒక పక్క చట్టాలు తాము పోరాడితేనే వచ్చినాయి అని చెప్పుకుంటూ, అవి అమలు కావట్లేదని విమర్శించే ధోరణి పెరిగింది.

(తరువాయి భాగం 45 వ పుటలో)