అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఎప్పటిలాగే
Appearance
ఎప్పటిలాగే
గేటు చప్పుడైంది
కవిత్వం తోసుకొస్తుందేమో!
కొబ్బరాకులు కదుల్తున్నాయి,
వాటి పైకెక్కి
జారిపడిందేమో!
కింద పడి లేవటం
దానికలవాటే.
సూర్యకిరణాలు
వంకర్లు బోతున్నాయి
అక్షరాలుగా మారే
ప్రయత్నం కాబోలు.
అనాడు
ఎక్కడికో ఎగిరిపోయిన పక్షి
మళ్లీ కనపడలేదు.
దాని రెక్కల కదలిక
ఇప్పటికీ మనస్సులో వుండిపోయింది.
రాత్రంతా నిద్ర లేదు
'ఆగిపోరాత్రీ అంటే
ఆగిపోయేదేమో.
నిద్రను ఆపొచ్చునేమోగాని
గడియారం ఆగదు.
తెల్లరగట్ల
దుప్పటి మీది పూల డిజైన్లు
పరిమళిస్తున్నాయి.
ఫ్యాన్‌ల నీడలో
ఏసీల శీలత భాహువుల్లో
పులిసిపోయిన దేహంతో
ఎండలో
కుర్చీ వేసుకొని కూర్చున్నాను
కవిత్వం
'డి ' విటమిన్‌లా విస్తరిస్తుంది.
డా॥ ఎన్.గోపి 93910 28496