అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఆంగ్లారాధన అనర్థదాయకం

వికీసోర్స్ నుండి

బోధనా మాధ్యమం

వెన్నెలకంటి రామారావు 95503 67536

ఆంగ్లారాధన అనర్ధదాయకం!

పరభాషలను ఎలా నేర్చుకోవాలన్నదే కీలక సమస్య

ప్రపంచ పర్యావరణ సంక్షుభిత సందర్భంలో భాష-పర్యావరణాల పరస్పరపూరక స్వభావాన్ని గుర్తించకుండా,“ఎదగడానికి ఇంగ్లీషే రాచబాట (సాక్షి ఏప్రిల్‌ 24) అనే వ్యాసంలో - ఇంగ్రీషు భాష సామాన్య ప్రజలందరి భాషగా మారి, దాని ద్వారా జాతీయ స్థాయి సంబంధాల్లోకి వెనకబడిన వర్గాలు రాగలిగితేనే ఎదుగగలరని కంచ ఐలయ్యగారు రాశారు. అందుకు ఇంగ్లీషు భాష ఎన్నికల అంశంగా తప్పక మారి తీరాలని ఆయన రాజకీయ పక్షాలను డిమాండ్‌ చేశారు... ఇంగ్లీషు భాష, నుడికారం, కార్పొరేట్‌ మార్కెటింగ్‌, ఉత్పత్తి 5 కార్యకలాపాలు, సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతల వినియోగంలో ధ్వంసమవుతోందని ఆంగ్లభాషా శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో దళిత బహుజన వర్గాలు ఏ ఆంగ్ల భాషను నేర్చుకోవాలని ఐలయ్య డిమాండ్‌ చేస్తున్నట్లు!... భారతీయ మాతృభాషలు ప్రధానంగా అణగారిన కులాలు, వృత్తుల ప్రజానీకానివే. అలాంటిది వారి సామాజికార్థిక స్థితితో, అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా ఆంగ్లాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తూ ఐలయ్యగారు పిలుపు ఇవ్వడం ఆ ప్రజలకు చెడుపు చేస్తుంది... భాష (ఇంగ్లీషు) నేర్చుకోవడం వల్ల బహుజన ప్రజానీకం వారంతట వారే అభివృద్ది చెందుతారనే ఐలయ్య వాదన - ఆ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఈనాడు ప్రపంచమంతా స్థానిక భాషలు, స్థానిక సంస్కృతుల పునరుద్ధరణలోనే అభివృద్ధి ఉందనే ఎరుకతో ఆ వైపుగా అడుగులు వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు.


“యుగ సంక్షోభం” (సామాజిక - ఆర్థిక, పర్యావరణ సంక్షోభాలు) లో కూరుకుపోయిన తరుణంలో అంతర్జాతీయ సమాజం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న జరుపుకునే మాతృభాషా దినోత్సవాన్ని ఈసారి అంతర్జాతీయ దేశీయ భాషల దినంగా జరుపుకోవడం విశేషం. పర్యావరణ పరిరక్షణలో దేశీయ భాషల అవనరాన్ని బలంగా గుర్తించింది. ప్రకృతి-సమాజాల మధ్య ఆదాన ప్రదాన క్రమానికి గండి పడి, అకస్మిక, పునరుద్ధరణకు వీలుకాని స్థితికి వాతావరణ మార్పులు చేరుకుంటున్న రూపంలో ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి బయటపడాలంటే దేశీయ భాషలు “మాధ్యమం” (మీడియం)గా, సాధనంగా ఉపకరిస్తాయన్న విషయం అంతర్జాతీయ సమాజానికి క్రమంగా అనుభూతమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి మాతృభాషా దినోత్సవాన్ని "దేశీయ భాషలతోనే అభివృద్ధి శాంతిస్థాపన, సయోధ్య వంటివి సుసాధ్యం” అనే ఇతివృత్తంతో, భాష-పర్యావరణం మధ్యగల పరస్పర ఆధారితను, న్పరస్పర వూరకత్వాన్ని సాధించే లక్ష్యంతో జరుపుకున్నారు. వాతా వరణ మార్చును వేగవంతం చేసి, మానవజాతి మనుగడను ప్రశ్చార్థకంగా మార్చే పర్యావరణ విధ్వంసాన్ని యుద్ధ ప్రాతిపదికపై అరికట్టడంకోసం మాతృభాషలనే కాకుండా, అంతకు మించి స్థానిక, మూలవాసీల భాషలను అనివార్యంగా పరిరక్షించుకోవలసిన తరుణమిదని ప్రపంచ మేధావులు, భాషా - పర్యావరణ నివుణులు వివిధ అధ్యయనాలు, పరిశోధనల ద్వారా గత కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. జాతి, మత - కుల, ప్రాంత, జెండర్‌ తదితర అస్తిత్వాల అణచివేతలు, ఆధిపత్యాలు, అసమానతలు, వివక్షలతో సంబంధం లేకుండా మాతృభాషలు - స్థానిక భాషల పరిరక్షణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చింది. ఇలాంటి చారిత్రక సంక్షుభితకాలంలో పాలకులైనా, పాలిత ప్రజలు, పాలిత అస్తిత్వాలైనా (మత(కుల), జాతి, ప్రాంత, భాష తదితర) మాతృభాషలు, స్థానిక-మూల భాషల పరిరక్షణను ఉమ్మడిగా చేపట్టవలసి ఉంది. తద్వారా అందులో ఆ భాషల్లో నిక్షిప్తమైన స్థానిక విజ్ఞానాన్ని వినియోగించుకొని స్థానిక ప్రజలు, మూల వాసుల చొరవతో పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టే అవకాశ ముంటుందని పర్యా వరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ పర్యావరణ సంక్షుభిత సందర్భంలో భాష-పర్యావరణాల పరస్పర పూరక న్వభావాన్ని గుర్తించకుండా “ఎదగడానికి ఇంగ్లీషే రాచబాట” అనే వ్యాసంలో ఇంగ్లీషు భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప, సామాన్య ప్రజలందరి భాషగా ఇంగ్లీషు మారితేనే... వెనకబడిన వర్ణాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రాగలరని, అలా వారి ఎదుగుదల ఇంగ్లీషు ద్వారానే సాధ్యమవుతుందని కంచ ఐలయ్యగారు రాయడం దురదృష్టకరం.

ముడిసరుకులు, చౌక శ్రమశక్తి, సరుకుల మార్కెట్లు గల ప్రాంతాలను, రాజ్యాలను ఆంగ్లేయులు వలసలుగా మార్చుకున్నారు. వాటి నియంత్రణ కోసం వలసేకరణ ద్వారా తమను పోలిన ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడి స్థానిక నాగరికతల విధ్వంసానికి పాల్పడ్డారు. తమలాగే ఆలోచించే, ప్రవర్తించే, సంభాషించే, అనుభూతి పొందగలిగే కులీన సమూహాన్ని సృష్టించి వారి ద్వారా వలస పాలనను సమర్థంగా సాగించారు. ఆ క్రమంలో ఆంగ్లేయుల ఇంగ్లీషు భాషను, క్రైస్తవ మతాన్ని శక్తిమంతంగా వినియోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్‌ సామాజ్యాన్ని విస్తరింపచేయడం తెలిసిందే. మెకాలే విద్యా విధానమంటే తమలాగే ఆలోచించి, ప్రవర్తించే, బ్రిటీష్‌ రాణి ప్రయోజనాలను కాపాడే సంకల్పం గల కులీన వలస ప్రజలను (విభజించి పాలించే క్రమంలో అగ్రవర్జాలు, వృత్తేతర బడుగు, బలహీన, అస్పృశ్య సమూహాల నుంచి) సృష్టించి, బ్రిటీష్‌ సామాజ్యాన్ని సుస్థిర పరచుకోవడమే. ఈ క్రమంలో కేవలం 5శతాబ్దంలో (ఇప్పటికీ 1400 ఏళ్ల క్రితం) పశ్చిమ జర్మనీకి చెందిన (ఆ దేశ ఉత్తర సముద్ర తీరంలో నివసించే 'ఇంగేవోన్స్‌' అనే తెగ (ప్రజలు) ఆంగ్లో శాక్సన్‌ వలస జనం మాట్లాడే ఆంగ్ల భాషను వలస ప్రాంతాల్లో పాలన భాషగా వినియోగించారు. అందుకోసం క్రీస్తుపూర్వం నాటి నుంచి కొనసాగుతున్న స్థానిక భాషాజాతీయుల సంస్కృతి, నుడి- నానుడి, సంప్రదాయాలను కాలరాచేందుకు విఫల ప్రయత్నం చేశారన్నది చరిత్ర. స్థానిక మత విశ్వాసాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలతో ఇబ్బందిపడుతున్న అణచివేతకు గురయిన బడుగు బలహీన ప్రజలను మత, భాష, వ్యవహార శైలితో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్య వెనుక కుట్ర కోణం ఏమైనప్పటికీ, తమకు లాభం జరిగింది / జరుగుతోందన్న ఒకే ఒక కారణంగా స్టానిక బహుజనులు ఆంగీకరణను, మతాంతీకరణను అంది పుచ్చుకోవడాన్ని అర్ధం చేసుకోగలం. స్థానికభాషలు, మూలవాసుల భాషలు, పాలకుల భాషలుగా పరిగణించేవి సైతం ప్రజలే సృష్టించారన్న సంగతి ఐలయ్యగారు గుర్తించకపోవడం దురదృష్టకరం. పెట్టుబడిదారీ పూర్వ సమాజాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రాజ్యంలోనైనా పాలకుల భాష ప్రజల భాష వేర్వేరుగా ఉండడం సర్వసాధారణ విషయం. వలసల సంపద సమీకరణ నుంచి ఇంగ్లాండ్‌లో పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించేంత వరకు, అక్కడా రెండు భాషా విధానాలు కొనసాగేవి. 15వ శతాబ్దం దాకా దాదాపు 600 ఏళ్ల పాటు ఇంగ్లాండ్లొ అధికార భాషగా ఫ్రెంచ్‌ భాష కొనసాగడం విడ్డూరమేమీ కాదు. ఇంగ్లాండ్‌లో పెట్టుబడిదారీ విధానం ఆవిర్భ వించిన అనంతరమే మార్కెట్‌లోను, రాజ్య నిర్వహణలోనూ “ఇంగ్లీష్‌ (అక్కడి ప్రజల భాష అయిన ఇంగ్లీష్‌ అధికార భాషగా అవతరిం చింది. ఆ తర్వాత వలస పాలనా క్రమంలో విశ్వభాషగా అవతరించింది. పెట్టుబడిదారీ వర్గం ముడి సరుకులు, చౌక శ్రమ శక్తి, సరుకుల మార్కెట్లో నిర్వహణ అవసరాలు, అంతర్జాతీయ ముక్కోణ వాణిజ్యం, అందుకు ఉపకరించే పాలనా అవసరాల నేపథ్యంలో ఇంగ్లీష్‌ విశ్వభాషగా అవతరించింది. వలసలు, వలసవాద దేశాల సంపదల సమీకరణతో ప్రపంచ, పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించకుండా ఇంగ్లీష్‌ భాష విశ్వజనీనతను సాధించడం సాధ్యం కాదన్న విషయాన్ని ఐలయ్యగారు గుర్తించకుండా, “ఆంగ్ల ఆరాధనను” అహేతుకంగా ప్రోత్సహిస్తున్నారు. ముడి సరుకులు, చౌక శ్రమ శక్తి, సరుకుల మార్కెట్లుగా ఉంటూ, పెట్టుబడిదారీ పూర్వ సామాజిక స్వభావాన్ని కోల్పోని ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లోని స్థానిక భాషలు, పెట్టుబడిదారీ విధానంలోకి అభివృద్ధి పాశ్చాత్య దేశాల భాషల వలె పరిపక్వతను, విశ్వజనీనతను సాధించలేక పోయాయి. ఆంగ్లేశాక్సన్‌ ప్రజలు మాట్లాడే ఆంగ్ల భాష పాలక భాషగా మారి, శతాబ్దాల కాలంనాటి స్థానిక భాషలను విధ్వంసం చేయడానికి కారణం ఆ ప్రజల సామాజిక ఆర్థిక స్వభావంలో ఉందిగానీ, వారి భాషాధిపత్య కాంక్షలో లేదనే విషయాన్ని ఐలయ్యగారు గుర్తించ లేదు. ఇంగ్లీషు (రాజబాటలో ప్రయాణించడం) వల్ల ఆంగ్లేయులు ఎదగలేదు, వారి సామాజిక ఆర్ధిక వికాసం వల్లనే ఇంగ్లీషు భాష విశ్వజనీనత సాధించిందనే సత్యాన్ని అయన గుర్తించలేదు. అలాంటిది బడుగు, బలహీనవర్గ ప్రజానీకం ఇంగ్లీషును అందిపుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి చెందుతారు (ఎదుగుతారు) అనే తలకిందులు వాదన ఐలయ్య తీసుకువస్తుండడం వల్ల ఆ ప్రజలకు హాని కలుగుతుంది.

మెకాలే విద్యావిధానం (1885) ఫలితంగా ఇంగ్లీషులో పట్టు సాధించిన మహాత్మా ఫూలే అంబేద్కర్‌ వంటివారు ఇంగ్లీషు వల్లనే గొప్ప వారయ్యారనే ఐలయ్య సులభ సూత్రీకరణలు ఆ మహాత్ముల జీవితం, కృషి, తాత్వికతను కించ పరున్తున్నాయి. వారు స్థానిక భాషల్లోను, స్థానిక సామాజికాంశాల్లోను పట్టు సాధించడంతొనే, పరభాష అయిన ఇంగ్లీషుతో వారు సమర్థంగా వ్యవహరించ గలిగారన్నది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు భాషను నేర్చుకోవడం వల్ల సామాజికార్థిక వెసలుబాటు ఉన్న ఫూలే, అంబేడ్కర్‌ వంటి కొద్ది మంది బహుజనులు మాత్రమే ఉన్నత స్థాయికి పోగలిగారు. కానీ మెజారిటీ ప్రజలు ఇంగ్లీషును సవ్యంగా నేర్చుకోలేక రెండింటికీ చెడ్డ రేవడులుగా మారి, ఆత్మ విధ్వంసానికి గురవుతారు. అందువల్ల సరైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, తగిన వసతులు లేని విద్యా సంస్థలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఆత్మహత్యాసద్భశం. పాలకులు చేపడుతున్న ఆంగ్ల విద్యాబోధన విధాన నిర్ణయం అభివృద్ధి కరమైనదిగా కనపడుతుంది గానీ, అందుకు తగిన సామాజిక పరిస్థితులు, విద్యారంగ అవకాశాలు, విధానాలు లేకుండా అలాంటి చర్యలు చేపడితే అరకొరగా ఉన్న విద్యా రంగం కొడిగడుతుంది. మాతృభాషలను ఇంగ్లీషులాగా ఆదానప్రదానాలను చేపడుతూ విశ్వజనీన స్థాయికి వెళితే యావత్తు సాధారణ ప్రజానీకానికి పూర్తిస్థాయిలో ఈ లబ్ది చేకూరుతుంది. ఫూలే, అంబేడ్కర్‌ వంటి మహనీయులు మాతృభాషలను విశ్వజనీన స్థాయికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేసి ఉండాల్సింది. కార్పొరేట్‌ ప్రపంచం ఇంగ్లీషు భాష నుడికారం కార్పారేట్‌ మార్కెటింగ్‌, ఉత్పత్తి కార్యకలాపాలు, సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతల వినియోగానికి సరిపడే ఆంగ్ల విద్య కారణంగా ధ్వంసమవుతోందని ఆంగ్లభాషా శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో దళిత, బహుజన వర్గాలు ఏ ఆంగ్ల భాషను నేర్చుకోవాలని ఐలయ్య డిమాండ్‌ చేస్తున్నట్లు!

భాషా నిత్యత్వ నియమం:

ప్రతి భాష ఏకశిలాసదృశం కాదు. ప్రజలు దైనందిన ఉత్పత్తి,సామాజిక కార్యకలాపాల అనుసంధాన క్రమంలో రూపొందే “సహజ” భాష నిర్దిష్ట భౌగోళిక నమాజం-ప్రకృతి సమతుల్యతకు అనుగుణంగా జరిగే ఆత్మిక అభివృద్ధి (వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాలు, కళలు సాహిత్యం, తత్వశాస్త్రం, రాజకీయాలు, రాజ్యాంగం తదితర) లో భాగంగా ఆయా రంగాలకు చెందిన కృత్రిమ భాషలు (నిర్దిష్ట సాంకేతిక పరిభాషలు) కలసి ఒక సామాజిక వ్యవస్థలోని భాషగా

ఓట్లు అడిగేది తెలుగులో... పరిపాలించేది ఉత్వర్వులిచ్చేది ఇంగ్లీషులోనా?

ఏర్పడుతుంది. సామాజిక భాష సహజ భాష కృత్రిమ భాష. వివిధ వైజ్ఞానిక రంగాల్లోనూ, కళలు, సాహిత్యం, సంస్కృతి వగైరా ఆత్మిక రంగాల్లో ప్రత్యేకమైన పదజాలం, పరిభాషా పదజాలాన్ని కృత్రిమ భాషగా పరిగణించాలి. సహజ, కృత్రిమ భాషలు పరస్పర పూరకాలు, సహజ భాషల నుంచి కృత్రిమ భాషలు ఆవిర్భవించినప్పటికీ, కృత్రిమ భాషల కారణంగా సహజ భాషలు మరింత పరిపుష్టమవుతాయి. తామున్న పరిసరాలు, పర్యావరణం పునాదిగా సహజ భాషలు ఆవిర్భవిస్తే, ప్రజలు ప్రకృతిని మానవీకరించే క్రమంలో, ఉత్పత్తి కార్యకలాపాల వైవిధ్యతల, సంక్షిష్టతల క్రమాల్లో నుంచి సహజ భాషలు, కృత్రిమ భాషలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల సహజ భాషలను మాత్రమే (వ్యవహారిక భాషలను) ప్రజల భాషలుగా గుర్తిస్తూ, కృత్రిమ భాషలను పాలక వర్గాల భాషలుగా గుర్తించడం పొరపాటు. సహజ-కృత్రిమ భాషల అభివృద్ధికి అటు శారీరక శ్రమ చేసేవారు, ఇటు మేధా శ్రామికులు ఇద్దరూ కలసి కృషి చేస్తారు. గణితంలోని పరిభాష సాధారణ ప్రజలకు అర్ధం కానంత మాత్రాన దాని అభివృద్ధిలో సాధారణ ప్రజల పాత్ర లేకపోలేదు. గణితం, అందులోని పరిభాష సాధారణ ప్రజల సొంతం కాకపోలేదు. అదే విధంగా ఆనాటి సమాజ ఆత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రంగాల అవసరాల నుంచి కృత్రిమ భాష సంస్కృతం ఆవిర్భవించింది. అది సహజ భాషల నుంచి ఆవిర్భవించి ఆనాటి వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాల పరిభాషకు ప్రాతినిథ్యం వహిస్తూ జ్ఞానాభి వృద్ధికి దోహదం చేయడాన్ని కాదనడం అర్ధరాహిత్యం మాత్రమే . సహజ భాషలైన పాళీ, ద్రవిడ భాషలు ప్రజల జీవిత కార్యకలాపాల నుంచి ఎలా అభివృద్ధి చెందాయో, అదే విధంగా కృత్రిమ భాషగా సంస్కృతం అభివృద్ధి చెందడమూ అంతే సహజం. ఇప్పటికీ ప్రపంచ భాషల్లో అత్యంత భాషా శాస్త్ర ప్రామాణికతను సంతరించుకున్నది సంస్పృతమేనని ప్రముఖ భాషా శాస్త్ర నిపుణులు నోమ్చోమ్స్మీ పలు సందర్భాల్లో వివరించారు. పాలకులు సృష్టించిన లేదా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నించిన, వారి ప్రయోజనాలను నెరవేర్చిన భాష లను పాలక భాషలుగా పరిగణించడం కద్దు. పర్షియన్‌, ఇంగ్లీషులు వారి ప్రాంతాల్లో ప్రజల భాషలే. సంస్కృతం పాలక భాష కంటే భారత సమాజ ఆత్మిక జీవన రంగాల నుంచి ఆవిర్భవించిన కృత్రిమ భాష. అంతేకానీ, ఫలానా ప్రజలను అణచేందుకు ఉద్దేశించిన భాషగా దాన్ని పరిగణించడం అమాయకత్వమే అవుతుంది. అదీకాక, స్థానిక భాషల నుంచి, మరీ ముఖ్యంగా వ్యవసాయం, చేతివృత్తులు తదితర ఉత్పత్తి రంగాలలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ఆయా ప్రాంతీయ ప్రజల దైనందిన వ్యవహారాల నుంచి పుట్టుకొస్తున్న పదజాలంతో సంస్కృతం ఆవిర్భవించింది. ఆ స్థానిక భాషలు లేకుండా సంస్కృతం లేదు. అదే సమయంలో వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాల పరిభాషగా సంస్కృత భాష మాధ్యమంలో పుట్టుకొస్తున్న కృత్రిమ భాషాజాలం తిరిగి స్థానిక భాషలను క్రియాశీలంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లీషు కూడా అంగ్లోశాక్సన్ల భాష పునాదిగా, ఫ్రెంచ్‌, గ్రీక్‌, రోమన్‌ తదితర యూరోపియన్‌ భాషల నుంచి కీలకంగాను, వలస ప్రాంతాల్లోని స్థానిక భాషల నుంచి పాక్షికంగానూ అభివృద్ధి చెందిందనేది విదితమే. ఈ నేపథ్యంలో ప్రతి భాషా నిర్దిష్ట సమాజ చారిత్రక అవసరాలనుంచి పుడుతుంది, గిడుతుంది. అంతేగానీ సామాజిక ఆర్థికాభివృద్ధి 'క్రమంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తనకు తానుగా ఏ భాషా పుట్టదు, గిట్టదు.

ఒక భాషాజాతీయుల సొంత భాషను వారి సామాజి కార్థిభివృద్ధితో నిమిత్తం లేకుండా ధ్వంసం చేసి పరభాషను చొప్పించడం సాధ్యం కాదు. అయితే ఒక సామాజిక వ్యవస్థకు చెందిన భాషలోని సహజ భాష మాత్రమే మిగిలి, ఆ సమాజానికి చెందిన కృత్రిమ భాష నశిస్తే, కొంతకాలానికి దాని సహజ భాష కూడా అంతరించిపోగలదు. ప్రస్తుత భాషోద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నట్లు కేవలం సహజ భాష మాత్రమే కొనసాగితే చాలని తృప్తి పడటం అమాయకత్వమే అవుతుంది. ఇంగ్లీష్‌ దాడికి (ఆ భాష చేసే దాడి కాదు. ఆ ( పీడిత/ పీదక భాషాజాతీయుల్లోని పాలకుల విధానంగా. మాత్రమే అర్థం చేసుకోవాలి) స్థానిక కృత్రిమ భాష మృగ్యమై, కేవలం సహజ భాషగా కొనసాగుతున్న తెలుగు భాష కొడిగడుతున్న దీపంలా రెపరెవలాడుతోంది. సహజ, కృత్రిమ భాషలు రెండూ ప్రజలకు సొంతమే. ముఖ్యంగా వ్యవసాయం, చేతివృత్తుల్తో జీవిస్తున్న సువిశాల బడుగు, బలహీన వర్గాల ప్రజానీకానికి చెందినవి. ఈ నేపథ్యంలో భారతీయ మాతృభాషలు-ప్రధానంగా అణగారిన కులాలు, కుల వృత్తుల ప్రజానీకానివే. అలాంటిది వారి సామాజికార్థిక స్థితితో, అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా ఐలయ్యగారు విశ్వ భాష ఆంగ్లాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహించడం ఆ ప్రజలకు చెడుపు చేస్తుంది. ఇంగ్లీషును నేర్చుకోవడం వల్లనే పూలే, అంబేద్కర్లు అభివృద్ధి

గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ 'అమ్మనుడి'లోనే

చెందారని చెప్పడం తప్పు. సంప్రదాయక వ్యవసాయ శ్రమ సంబంధాల రూపంలోని కులవృత్తులకు దూరమైన చిరు వ్యాపార వర్గ సామాజిక నేపథ్యం గల మహాత్మా ఫూలే అలాగే రాజవంశీయుల సాన్నిహిత్యంలో ఉన్న సైనిక కుటుంబ నేపథ్యంగల అంబేడ్కర్‌ తదితరకుటుంబ సాంసృతిక నేపథ్యం నుంచి విద్యావంతులుగా ఎదిగి వచ్చిన వారిని చూపించి, దళితులందరూ (వ్యవసాయ శ్రమ సంబంధాల్లో ఉన్నవారు) వారిలాగే ఇంగ్లీషు నేర్చుకుంటే జీవితంలో ఎదుగుతారు అని ఐలయ్య సూచించడం దురదృష్టకరం. సామా

జికంగా, ఆర్థికంగా ఈ అభివృద్ది చెందుతున్న ప్రజానీకం తమ విజయాలను సుస్థిరం చేసుకునేందుకు సాధనంగా భాష ఉపకరిస్తుందే గానీ, ఫలానా భాష నేర్చుకోవడం వల్లనే అభివృద్ధి దానికదే సాకారం కాదు.

20వ శతాబ్దం ఆరంభం నాటి కల్లా ప్రపంచ, పెట్టుబడిదారీ విధానం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, సంక్లిష్టంగా మారింది. అది ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల నిర్దిష్ట కార్యకలాపాల అనుభవాల నుంచి ఆవిర్భవించి వైవిధ్య భరిత వైజ్ఞానిక సంపదను, నైపుణ్యాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి పాశ్చాత్య సంస్పృతి (ఉత్పత్తి విధానాలు, నైపుణ్యాలు, సరకుల వినియోగం, వైజ్ఞానిక సంప్రదాయాలు వగైరా) ని ప్రవేశ పెట్టింది. దాంతో స్థానిక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన కృత్రిమ భాషా సంపద అభివృద్ధి క్రమానికి గండి పడింది. స్థానిక పర్యావరణ అనుభవాల సారంగా వెలువడుతున్న వైజ్ఞానికాఖివృద్ధి పక్కదారి పట్టింది. పాశ్చాత్య ఉత్పత్తి విధానాలు,నైపుణ్యాలు, యంత్ర సంస్ఫృతులే ప్రజా జీవనానికి ఏకైక ప్రత్యామ్నాయంగా నిలవడంతో, సంబంధిత కృత్రిమ భాషను ఇతర ప్రాంత ప్రజలు సైతం ఆకళింపు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

దాంతో ఇంగ్లీషు వలసల్లో కృత్రిమ భాషగా, ఉపాధి భాషగా ఆంగ్లాన్ని నేర్చుకోవడం తప్పనిసరి అయింది స్థానిక ప్రజల ఉత్పత్తి కార్యకలాపాల అనుభవాల సారంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన స్థానిక కృత్రిమ భాష అభివృద్ధి స్తంభించింది. ఆ కారణంగా స్థానిక విజ్ఞానాభివృద్ధి నిలిచిపోవడమే కాకుండా ధ్వంసమవుతుండడం దురదృష్టకరం. పెట్టుబడి దారీ విధానం ప్రపంచీకరణ క్రమం ద్వారా సంఘటితమవుతున్న కొద్దీ స్థానిక విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న స్థానిక కృత్రిమ భాషలు పూర్తిగా అంతర్ధానమవుతాయి. దాంతో కృత్రిమ భాషాభివృద్ధి క్రమానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్న సహజ భాషలు క్రమంగా సారహీనంగా, సమకాలీన అవసరాలు తీర్చలేని విధంగా మారతాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సదరు భాషలు అంతరించి పోవడమో, సమాజంలో ఏదో ఒక మూల ప్రాభవాన్ని జీవాన్ని కోల్పోయి ఒక శిలాజంగా మృత భాషగా మిగలడమో జరుగుతుంది. పర్యవసానంగా భూగోళంపై ఆ భాషా జాతి అస్తిత్వం అంతరిస్తుంది. ప్రస్తుతం తెలుగు భాషలో కృత్రిమ భాషాభివృద్ధి కుంటుపడి, దాని ప్రతికూల ప్రభావం సహజ భాషపై తీవ్రంగా ఉండడం గుర్తించగలం. స్థానిక సహజ, కృత్రిమ భాషల్లో నిక్షిప్తమై ఉన్న స్థానిక ప్రజల అనుభవం, విజ్ఞాన సంపదలను విశ్వజనీన స్థాయికి తీసుకువెళ్ళే విశ్వమానవ భాష రూపొందే క్రమం సదరు భాషాజాతి అస్తిత్వ సమానత్వ ప్రాతిపదికన పరిఢవిల్లుతుంది. అలాగాక స్థానిక భాషలను ధ్వంసం చేస్తూ, ఆ భాషకు ప్రత్యామ్నాయంగా పరాయి భాషను స్వీకరించడం సాధ్యమూ కాదు, అణగారిన అస్తిత్వాలకు ఆత్మహత్యాసదృశ్యంగా మారుతుంది.

స్వపక్ష ప్రయోజనాలకు గండి:

భాష (ఇంగ్లీషు) నేర్చుకోవడం వల్ల బహుజన ప్రజానీకం వారంతట వారే అభివృద్ది చెందుతారనే ఐలయ్య వాదన - ఆ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఈనాడు ప్రపంచమంతా స్థానిక భాషలు,స్థానిక సంస్కృతుల పునరుద్ధరణతోనే అభివృద్ధిలో ఉన్నట్లు గుర్తించి ఆ వైపు అడుగులు వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు. గూగుల్‌, ఇంటర్నెట్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు నేడు తెలుగు సహా అనేక స్థానిక భాషల్లో విజ్ఞానాన్ని నిక్షిప్తంచేసేందుకు, సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లీషు మాధ్యమాన్ని భాషను ప్రాథమిక విద్య నుంచి ప్రవేశపెట్టాలనే ఎన్నికల హామీలను గుప్పిస్తూ, అలాంటి ప్రయత్నాలను అరకొరగా ప్రారంభిస్తున్న రెండు రాష్ట్రాలపాలకులను, అధికార, ప్రతిపక్షాలను ఒప్పించడంలో ఐలయ్య కృత కృత్యులయ్యారు. కులం, మతం అస్తిత్వ కోణాల నుంచి భాషా సమస్యను, విధానాన్ని ముందుకుతెస్తున్న ఐలయ్య వాదన ఆ ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగిస్తుందనడంలో సందేహంలేదు. ఇంగ్లీషు భాషను నేర్చు కోవడం, వ్యవహర్తలుగా శిక్షణ పొందడాన్ని ఎవరూ వ్యతిరేకించవలసిన అవసరం లేదు. అయితే దాన్ని ఏ పద్దతిలో సాధించాలనడంలోనే పేచీ ఉంది. ప్రజల అవసరాలను, ఎరుగమిని సొమ్ము చేసుకుంటున్న కార్పొరేట్‌,విద్యాపార సంస్థల స్వార్ధానికి వాస్తవ గణాంకాలపై కాక, నమ్మకాలు, ఉద్వేగాలపై ఆధారపడి రూపొందుతున్న (రూపొందిస్తున్న) ప్రజాభిప్రాయాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునే పోస్ట్‌ ట్రూత్‌ (సత్యానంతర) రాజకీయ నాయకులు, పార్టీలు ఇంగ్లీషు విద్యను ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకువస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను, దాన్ని పటిష్టం చేసి లబ్టి పొందేందుకు ప్రయత్నిస్తున్న ఈ దేశ కార్పొరేట్‌ శక్తులు,వారికి అనుకూలమైన విధానాలు రూపొందించే రాజకీయ శక్తుల కారణంగానే బడుగుల బతుకుల తో రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి గానీ భాష (ఇంగ్లీషు విద్యను పొందడం) ద్వారా అభివృద్ధి దానికదే సాకారమవుతుందనే ఐలయ్య వాదన బడుగు బలహీన వర్గాల విముక్తి వీక్షణాన్ని మసకబారుస్తుంది.


భాష లేకపోతే భావం లేదు

నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది