అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/పుస్తకము చేతన్ బూనితిన్
చిన్నపిల్లల మేధాశక్తిని పెంచడానికి పుస్తకాలే ముఖ్యమైన దోహదాలు. తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లలకు యింగ్లీషు సరిగ్గా రావడం లేదనీ, వ్యాకరణం నేర్పమనీ వుపాధ్యాయుల దగ్గర మొర పెట్టుకుంటూ వుంటారు. పిల్లలను వుస్తకాలు చదవనివ్వకపోవడం మొదటి తప్పయితే, మాతృభాషలోని పుస్తకాల్ని పట్టించుకోకపోవడం యింకో తప్పు. కాలక్షేపం పేరుతో టీవీ కార్యక్రమాలు కాలక్షేపాన్నే కలిగిస్తాయి. అయితే కాలక్షేపం పేరుతో దగ్గరయ్యే పుస్తకాలు మనిషిని చైతన్య వంతుడ్ని చేస్తాయి. మార్కుల కోసమే పరిగెత్తే నేటి విద్యార్థులు యాంత్రి కంగా మారడానికి పుస్తక పఠనం లేకపోవడమే కారణం. గత పాతికేళ్ళుగా అనేక రకాల పరీక్షల్లో అగ్రశ్రేణిలో వుత్తీర్ణులైన అనేక మంది విద్యార్థులు తరువాతి కాలంలో యెలా తయారయ్యారో పరిశీలిస్తే సమ గ్రమైన ఎదుగుదల యెంత అవసరమో, దానికి పుస్తక పఠనమెంతగా వుపయోగ వడుతుందో అర్ధమవుతుంది.
1970 ప్రాంతాల్లో నేను వున్నత పాఠశాల విద్యార్థిగా వుంటున్న రోజుల్లో మా యింటికి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అనే వార పత్రికలూ, జ్యోతి, యువ అనే మాసపత్రికలూ వచ్చేవి. పది పది హేనిండ్లుండే మా చిన్న వీధిలో, దాదాపు ప్రతి యింటిలో చదువుకుంటున్న పిల్లలుండేవాళ్లు. వాళ్ళలో ఆడపిల్లలే యెక్కువ. పత్రిక వచ్చీ రాకముందే వాటిల్లో తాము చదువుతున్న సీరియల్ నవలల కోసం వొకరికంటే ముందుగా వొకరు చదివేయడం కోసం పోటీ పడుతూ వుండేవాళ్ళు. మా వీధిలోనే పది, పదకొండు తరగతులతోనే చదువులు చాలించి, బాధ్యత తెలియకుండా తిరిగే యువకులిద్దరు ముగ్గురుండే వాళ్ళు. వాళ్ళు చెప్పే పనుల్ని చేస్తూ వాళ్ళ ఆంతరంగిక మిత్రులవగలిగే వాళ్ళకు వాళ్ళు రహస్యంగా యెర్రంచులుండే జానెడు పొడుగు పుస్తకాలను యిచ్చేవాళ్ళు. దేశాలనే సర్వనాశనం చేయాలనుకునే దుర్మార్గులూ, వాళ్ళను వెతికి పట్టి శిక్షించే గూఢచారులూ వుండే రకరకాల రహస్య పరిశోధనల నవలలవి.
1972లో కాలేజీ చదువుకోసం తిరుపతికి రాగానే రాజభవనాల్లాంటి గ్రంధాలయాలు పరిచయమయ్యాయి. ప్రతిసారీ మూడు నాలుగు పుస్తకాల చొప్పున గదికి తెచ్చుకుని నిర్ణీత గడువులోపల తిరిగిచ్చేయాలి. కాలేజీ హాస్టల్లో విద్యార్థులు కొందరు మరీ రహస్యంగా కొన్ని పుస్తకాల్ని చదవడం గమనించాను. చాలా నమ్మక పాత్రమైన వ్యక్తికిగానీ వాళ్ళా పుస్తకాల్ని యిచ్చేవాళ్ళు కారు. తీరా ఆ పుస్తకాల్ని చదవగలిగే అవకాశం దొరికినప్పుడు అంతవరకూ తెలియని చీకటి ప్రపంచమొకటుందని తెలిసి వచ్చింది. యెక్కడో రహస్యంగా ప్రచురణ్ణై, యే చీకటికొట్లలోనో అమ్ముడై, తమకు కావలసిన ప్రత్యేక మైన పాఠకుల్ని అలరించే ఆ శృంగార పత్రికలు పదనైదు, పదహారేళ్ల కుర్రాళ్ల పైన యెటువంటి ప్రభావాన్ని చూపెట్టి వుంటాయో తెలుసు కోవడం కష్టంగాదు.
1975 వ సంవత్సరం వచ్చేసరికి నగరంలో ప్రతి వీధికీ బాడుగ పుస్తకాల అంగళ్ళున్నాయని తెలిసింది. అన్ని వార, మాస వత్రికలూ నవలలూ రోజుకింత అని అద్దెకిచ్చే అంగళ్ళవి. అవెప్పుడూ పాఠకులతో కిటకిటలాడుతుండేవి. ప్రాచుర్యముండే సీరియళ్లను ప్రచురించే వారపత్రికలు కావాలంటే వారాలపాటూ నీరీక్షించాల్సి వుండేది. కొన్ని ప్రాచుర్యముండే నవలలు పాఠకుల చేతుల్లో నలిగినలిగీ జీర్ణావస్తకు చేరేవి. బాగా పరిచయం పెరిగాక అస్మదీయులైన వినియోగదారుల కోసం బాడుగ పుస్తకాల యజమాని తన నేలమాళిగలోంచీ రహస్య శృంగార సంచికల్ని తీసిచ్చేవాడు.
దూరదర్శన్ 1959లో ప్రారంభమైనప్పటికీ అది సామాన్యుల వరకూ రావడం 1980 ప్రాంతాల నుంచీ మొదలయ్యింది. 1983లో ప్రపంచ క్రికెట్ పోటీ, 1998లో మహాభారతం సీరియల్ దూరదర్శన్‌లో ప్రసారమయ్యే రోజుల్లో ప్రేక్షకులంతా టీవీల ముందు అతుక్కుపోవడం అందరికీ తెలుసు. దూరదర్శన్‌లో చిత్రసీమ, చలన చిత్రాలు ప్రసార మయ్యేటప్పుడు నగరాల్లో వీధులు కూడా ఖాళీగా కనిపించేవి. 1991లో దూరదర్శన్‌లోకి ప్రభుత్వేతర ప్రసార సంస్థలు వచ్చిన తర్వాత క్రమంగా పాఠకుల సంఖ్య తగ్గడం ప్రారంభమయ్యింది.
గతంలో పత్రికలు బాగా ప్రాచుర్యంలో వున్న రోజుల్లో, పాఠకుల సంఖ్య బాగా యెక్కువగా వున్నప్పుడు గూడా మంచి సాహిత్యాన్ని చదివే వాళ్ళు బాగా తక్కువనీ, పాఠకుల బలహీనతలను వుపయోగించుకునే నాసిరకం సాహిత్యానికే యెక్కువ గిరాకీ వుందనీ విమర్శకులు చెబు తుండేవాళ్ళు. టీవీ సీరియళ్లకు తరలిపోయినవాళ్ళు ఆ నాసిరకం పాఠకులేననీ, వాళ్ళు టీవీలకు వలసపోయినందువల్ల సాహిత్చ రచనల కొచ్చే యిబ్బందేమీ వుండదనీ గూడా వాదించారు. వ్యాపార రచనలు చేసే రచయితలు కొందరు ప్రాప్త కాలజ్ఞులైపోయి, కాల్పనికేతర రచనలకు మొగ్గేశారు. యీ సంధికాలంలో ప్రముఖ వత్రికలు ఆంధ్రపత్రిక, భారతి మూత పడడంతో సాహిత్య షత్రికల పతనం ప్రారంభమయ్యింది.
పాఠకుల సంఖ్య గణనీయంగా పెంచడానికి వ్యాపార రచనలూ, సాధారణ పాఠకుల్ని అలరించే అపరాధ పరిశోధన, శృంగార రచనలూ దోహదం చేస్తాయని చరిత్ర చెబుతోంది. ప్రతిపాఠకుడూ తొలిదశలో అటువంటి పుస్తకాలే చదువుతాడనీ, అతడు యెదిగే కొద్దీ వున్నత ప్రమాణాలుండే పుస్తకాల వైపు మొగ్గుతాడనీ అనుకుంటూ వుంటాం. అయితే యిలా యెదుగుతూ వుత్తమ పాఠకులయ్యే వ్యక్తుల శాతం చాలా తక్కువే గావచ్చు. గతంలో ఆ తక్కువ శాతం పాఠకుల సంఖ్య కూడా బాగా గణనీయంగా వుండేది. యిప్పుడు అన్ని రకాల పాఠకులూ తగ్గిపోయారు.
పాఠకుల సంఖ్య తగ్గడానికీ, టీవీ ప్రేక్షకుల సంఖ్య పెరగడానికీ కారణాలు మానవ స్వభావంలోనే వున్నాయి. పుస్తకం చదవడమన్నది కాల్పనికమైనపని. పాఠకుడు గూడా పఠనంలో చైతన్యవంతమైన బాధ్యతను పోషించి తీరాలి. అయితే టీవీ చూడడంలో అటువంటి చైతన్య వంతమైన అప్రమత్తత అవసరం లేదు. టీవీ తెరముందు కూర్చుని హృదయాన్నీ మేధస్సునూ దానికే అప్పగించి, నిర్మోహంగా, నిస్తేజంగా కాలహరణం చేయడంలో మానవుడికుండే ఆనందం చైతన్యవంతమైన పుస్తక వఠనంలో వుండదు. యీ రెండింటికీ మధ్య వుండే తేడాను గ్రహించగలిగిన వారే పుస్తక పఠనంలో వుండే గొప్పతనాన్ని గుర్తించ గలడు. అయితే ఆ స్థితిని చేరగలిగే వ్యక్తులు తక్కువగావడంచేతనే పుస్తక పఠనం తగ్గిపోతోంది.
పుస్తకం మనిషి మేధస్సుకు సవాలుగా యెదుగుతుంది. అదే పుస్తకాన్ని యెంత గొప్పగా దృశ్యమాన మాధ్యమంగా మార్చినా ఆ పుస్తకానికున్న గొప్పతనం ఆ మాధ్యమానికి రాదు. మహాభారతాన్ని చదివినప్పుడు అది పాఠకుని మానస ప్రపంచంలో వికసించే తీరుముందు యెంత గొప్ప చలన చిత్రమైనా, మరేయితర ప్రదర్శన అయినా దిగదుడుపే అవుతుంది. ప్రపంచంలోని గొప్ప పుస్తకాలనంతా యిన్నిసార్లు నాటకాలుగా చలన చిత్రాలుగా, టీవీ సీరియళ్లుగా మలచినా వాటికున్న మహత్యం యే మాత్రం తగ్గకుండా నిలచి వుండడానికిదే కారణం.
నాశనం కానిదాన్ని 'అక్షరం' అనడం, 'తల్లీ నిన్నుదలంచి పుస్తకం చేతన్ బూనితిన్' అని పుస్తకాన్ని సమస్త విజ్ఞానాలకీ భూమికగా గుర్తించడానికీ వున్న గొప్ప సంప్రదాయ సత్యాన్నిప్పుడు గుర్తించాల్సిన తరుణం వచ్చింది. సాంకేతికంగా యెంత ప్రావీణ్యతను పొందినా, సినిమా టీవీల వంటి సాధనాలు పుస్తకానికి అనుయాయులేగానీ, ప్రత్యామ్నాయాలు కాలేవని యిప్పటికైనా గ్రహించాలి.
యిప్పుడు గూడా యింగ్లీషులో పాఠకుల సంఖ్య బాగానే వుంది. మనదేశంలో వుండే యే పుస్తకాల అంగడికెళ్లినా అక్కడ వుండే అన్ని భారతీయ భాషా పత్రికలకంటే యింగ్లీషు పత్రికలే యెక్కువగా కనిపిస్తాయి. అన్ని విమానాశ్రయాల్లోనూ యాత్రికులు వందల, వేల పుటలుండే లావుపాటి యింగ్లీషు పుస్తకాలను చదువుతూ కనిపిస్తారు. అయితే ఇంగ్లీషుతోబాటూ యితర భారతీయ భాషలన్నింటితోనూ పోల్చినప్పుడు తెలుగులోనే పాఠకులు బాగా తక్కువగా వుండడం గమనించాలి. దేశస్థాయి, రాష్ట్రస్థాయి పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు అన్ని భాషల పుస్తకాల కంటే తెలుగులోనే తక్కువ పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం తెలుగు రాష్ట్రాల్లో విద్య మాతృభాషలో కాకుండా, యింగ్లీషులోనే జరగడం.
ప్రపంచ విజ్ఞానమంతా యింగ్లీషులోనే వుందనీ, ఆధునిక పోటీ ప్రపంచంలో నిలబడగలగాలంటే యింగ్లీషు మాధ్యమంలోనే విద్య వుండాలనీ ప్రభుత్వాధినేతలు నొక్కి చెబుతూంటారు. యింగ్లీషులో కాకుండా తమ మాతృభాషలోనే చదువుకునే చైనా దేశీయులు యీ పోటీలో ముందే వున్నారు. అమెరికాలో చదువుకునే చైనీయులు యింగ్లీషులో పాఠాలు అర్ధం చేసుకోకపోయినా, వాళ్ళ మాతృభాషలో వున్న పుస్తకాల్ని చదువుతూ యెవ్పటికవ్చుడు అగ్రశ్రేణిలోనే వున్నారనీ అక్కడి అధ్యాపకులు చెప్తారు. దానికి కారణం ప్రవంచంలో యెప్పటి కప్పుడు వస్తున్న విజ్ఞానాన్నంతా తమ మాతృభాషలోకి అనువదించి ప్రచురించుకునే సంస్థల్ని అక్కడి ప్రభుత్వాలు నిర్మించి, ప్రోత్సహించడమే! యిటువంటి అనువాద సంస్థల్ని గురించి యింతవరకూ మన ప్రభుత్వాలు ఆలోచించనైనా లేదు.
ప్రతి పాఠశాలలోనూ వొకప్పుడు గ్రంథాలయానికొక ప్రత్యేకమైన పీరియడ్ వుందేది. ఆ సమయంలో విద్యార్థులకు పుస్తకాలనిచ్చేవారు. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకమైన సాహిత్య సంఘాలుండేవి. వాళ్ళు క్రమం తప్పకుండా సాహిత్య సమావేశాలు జరిపేవాళ్ళు. కొన్ని మంచి పాఠశాలల్లో విద్యార్థులు తాము చదివిన పుస్తకాల గురించీ, తమకు నచ్చిన రచయితల గురించీ చర్చలు జరిపేవాళ్లు. పిల్లల్లో పఠనాసక్తిని పెంచే యిటువంటి కార్యక్రమాలకు యికనైనా పాఠశాలలు పూను కోవాలి.
చిన్నపిల్లల మేధాశక్తిని పెంచడానికి వుస్తకాలే ముఖ్యమైన దోహదాలు. తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లలకు యింగ్లీషు సరిగ్గా రావడం లేదనీ, వ్యాకరణం నేర్పమనీ వుపాధ్యాయుల దగ్గర మొరపెట్టుకుంటూ వుంటారు. పిల్లలను పుస్తకాలు చదవనివ్వకపోవడం మొదటి తప్పయితే, మాతృభాషలోని పుస్తకాల్ని పట్టించుకోకపోవడం యింకో తప్పు. కాలక్షేపం పేరుతో టీవీ కార్యక్రమాలు కాలక్షేపాన్నే కలిగిస్తాయి. అయితే కాలక్షేపం పేరుతో దగ్గరయ్యే పుస్తకాలు మనిషిని చైతన్య వంతుడ్ని చేస్తాయి. మార్కుల కోసమే పరిగెత్తే నేటి విద్యార్థులు యాంత్రి కంగా మారడానికి పుస్తక పఠనం లేకపోవడమే కారణం. గత పాతికేళ్ళుగా అనేక రకాల పరీక్షల్లో అగ్రశ్రేణిలో వుత్తీర్ణులైన అనేక మంది విద్యార్థులు తరువాతి కాలంలో యెలా తయారయ్యారో పరిశీలిస్తే సమగ్రమైన ఎదుగుదల యెంత అవసరమో, దానికి పుస్తక వఠనమెంతగా వుపయోగ పడుతుందో అర్ధమవుతుంది.
అమెరికాలోని అనేక నగరాలకు వెళ్లినప్పుడూ, యితర దేశాలను చూసినప్పుడూ అక్కడ [గ్రంథాలయాలకున్న ప్రాముఖ్యత వెల్లడవుతుంది. ప్రతి నగరంలోనూ పెద్దదీ, అందమైనదీ అయిన భవనం గ్రంథాలయమే అయి వుంటుంది. దానిలో దాదాపుగా దొరకని పుస్తకాలుండవు. దొరకని పుస్తకాలను యితర గ్రంథాలయాల నుంచీ తీసుకొచ్చి పాఠకుల కిచ్చే సౌలభ్యం కూడా వుంటుంది. అక్కడి పుస్తకాల అంగళ్లు గూడా గ్రంథాలయాల్లాగే వుంటాయి. కొందరైతే అక్కడే కూర్చుని వుచితంగా పుస్తకాలు చదువుకుంటూ వుంటారు. కొన్ని పుస్తకాల అంగళ్ళు గొప్ప సాంస్కృతిక కేంద్రాలుగా గూడా వుంటాయి. అక్కడ అప్పుడప్పుడూ సాహిత్య సమావేశాలు గూడా జరుగుతాయి. 'రైటర్‌స్ కార్నర్' అనే ప్రత్యేక స్థలంలో రచయితల్ని కలుసుకునే వీలుగూడా వుంటుంది. రచయితలు సంతకం చేసిన పుస్తకాల కోసం పాఠకులు యెగబడుతూ వుంటారు.
యింత గొప్పగా గాకపోయినా నా చిన్నతనంలో అన్ని వూర్లలో వో మాదిరి గ్రంధాలయాలుండేవి. జిల్లా కేంద్ర నగరంలోని గ్రంథాలయం యెప్పుడూ పాఠకులతో వెలిగిపోతూ వుండేది. ఆ రోజుల్లో కొన్ని లిఖిత పత్రికలు గూడా వుండేవి. యే చిన్న వత్రికలో రచన వచ్చినా చదివి గుర్తుంచుకునే పాఠకులుండేవాళ్ళు. యిప్పుడు తెలుగు
తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటుకై చట్టాన్ని వెంటనే తేవాలి
రాష్ట్రాల్లోని గ్రంథాలయాలు దాదాపుగా శిధిలాలయాలుగా మారిపోయి వున్నాయి.విద్య, పుస్తకాలు, గ్రంథాలయాల వంటి అంశాలు లాభకరమైనవిగావని యిప్పటి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అనేక రంగాల్లో ప్రజాధనం దుర్వినియోగమవుతున్న తీరును గమనిస్తున్నప్పుడు యీ నిర్లక్ష్యం మరింత విషాదకరమని గుర్తించి తీరతాం. ఆరేడేళ్ళకు పూర్వం “రాజా రాంమోహన్‌రాయ్ ఫౌండేషన్' పేరుతో ప్రభుత్వాలు కేంద్రం నుంచీ సొమ్ముతో కొన్ని పుస్తకాలు యెన్నిక జేసి వందల సంఖ్యలోకాని, గ్రంథాలయాలకు సరఫరా చేసేవి.
తమిళ, కన్నడ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరమూ ఆయా భాషల్లో ప్రచురించబడే పుస్తకాలను రెండు మూడు వందల ప్రతుల వరకూ కొని గ్రంథాలయాలకు పంపిణీ చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రంథాలయాలు చితికి పోయాయి. మలయాళంలో యివ్చుడు గూడాయే పుస్తకమైనా ప్రథమ ముద్రణ కనీసం అయిదువేల ప్రతులుంటాయి. ప్రసిద్ధమైన వో గ్రంథాన్ని రాసిన రచయిత దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం గూడా సాధ్యమేనంటారు. రెండు రాష్ట్రాల్లోనూ కలసి దాదాపు తొమ్మిది కోట్ల మందీ, రాష్ట్రాల కవతల మరో తొమ్మిది కోట్ల మందీ, వెరశీ 18 కోట్ల వరకూ వున్న తెలుగు ప్రజల భాషలో యిప్పుడు ప్రసిద్ధ రచయితలూ, కవులూ గూడా 500 ప్రతులు వేయడం గూడా భారమేనను కుంటున్నారు.
తన ప్రసిద్ధమైన గ్రంథం “వాల్డన్"లో ప్రముఖ అమెరికన్ రచయిత తోరో షేక్స్‌పియర్, మిల్టన్ రచనలకంటే ముఖ్యమైన వార్తా పత్రికలేముంటాయని ప్రశ్చిస్తాడు. మానవ విజ్ఞానమంతా పుస్తకాలలోనే వుంది. యెన్ని సాంకేతిక విప్లవాలు వచ్చినా వుస్తకానికి మాత్రం ప్రత్యామ్నాయ ముండదు. పాఠకుల సంఖ్య తక్కువగా వుందంటే ఆ జాతి సాంస్కృతికంగా తక్కువ స్థాయిలో వుందనే అర్థం. యిప్పటికైనా విద్యార్థులూ పాఠకులూ తల్లిదండ్రులూ వుపాధ్యాయులూ ప్రభుత్వాలు మేలుకుని పాఠకుల సంఖ్యను పెంచుకోక పోతే యే రంగంలోనైనా పురోభివృద్ధి సాధ్యం కాదు.
అ
పూలు సుగంధాలనే విరజిమ్మాలి
సముద్రం అల్లకల్లోలమవుతోంది.
అనంతమైన కల్మషంతో కొట్టుమిట్టాడుతోంది.
భూమి వేడెక్కి బీటలు వారుతోంది
రోడ్లతారు కరిగిపోతోంది.
అంతా నిర్మానుష్యం
భానుడు నడిరోడ్డుమీద నిద్రిస్తున్నాడు
కుళాయిలో వస్తున్న నీరు కూడా
కాలిపోతోంది
మత్తుపానీయాలు కాలేయానికి
చిల్లులు వేస్తున్నాయి
మనిషి ఏదో ఒక మత్తులో
బ్రతకాలని చూస్తున్నాడు
తన్నుతాను మోసం చేసుకొంటున్నాడు,
డ్రగ్స్ తీసుకొన్నవారు
ఇంద్రలోకాల్లో తిరుగుతున్నారు
ఆడా మగా అంతా పబ్బుల్లో గంతులేస్తున్నారు
గుక్కగుక్కకి కిక్కెక్కి తూలిపడిపోతున్నారు
యుక్త వయస్సులోనే
ఓడ్కాలు, విస్కీలతో శరీరాన్ని
విషపూరితం చేసుకొంటున్నారు
సంతానోత్పత్తి సామర్ద్యా న్ని
విచ్చిన్నం చేసుకొంటున్నారు
శని, ఆదివారాలంటే వినోదించే రోజులా!
జీవితానికి నిర్మాణం లేదా!
ఎవ్వరితో జీవితం పంచుకొంటున్నారో
వారి మీద నమ్మకం లేదు
జీవితం పంచుకొనే వారు ఒకరు
పెళ్ళి మరొకరితోనా?!
సంపదను పెంచుకోవడానికి
శరీరాన్ని ఫణంగా పెట్టడం ధర్మమా!
ఖండాంతరాలు దాటి షాపింగ్ లెందుకు?
జీవితం ధ్వంసం అయ్యాక
బంగారం ఎంత వుంటే ఏమిటి?
ఎన్ని సుఖాలు పొందినా
ఏదో 'ఫ్రస్టేషన్' లో బ్రతుకుతున్నారు
మానసిక రోగాలు పెరుగుతున్నాయి
మత్తు పోగొట్టే సెంటర్లు పెరుగుతున్నాయి
గ్రంథాలయ సంస్కృతిని ధ్వంసం చేశారు
జ్ఞాన జ్యోతులను ఆర్పేస్తున్నారు
నాలుగు అక్షరాలు బట్టి పట్టడం
చదువు అంటున్నారు
ప్రతి మనిషిలో ఓ వివేచన ఉంటుంది
దానికి పదును తగ్గుతోంది
ధనం పెరిగే కొద్దీ వ్యసనాలు పెరుగుతున్నాయి.
వేర్లు బలహీనంగా ఉండి
చెట్లు కూలుతున్నాయి.
నదుల నడిబొడ్డులో విషం పారుతోంది
పూలు కూడా దుర్గంధాన్నే చిమ్ముతున్నాయి
సందిగ్ధంలో మనుషులు బ్రతుకుతున్నారు
ఎవరిమీదా నమ్మకం లేదు
ఏ విషయం మీదా సమగ్రత లేదు
ఏ విషయాన్నీ వినే అలవాటు లేదు
ఏ అంశాన్నీ తేల్చుకోలేరు
మనుషులు ద్వంద్వత్వంలో వున్నారు
నిజమే! మరో ప్రక్క
చైతన్యం వెల్లి విరుస్తోంది
హిమాలయాలను
అలవోకగా ఎక్కుతున్నారు
సామర్ధ్యానికి నిరంతరం
పదును పెడుతున్నారు
కక్షా, కార్పణ్యాలను దాటి
కారుణ్య సముద్రులవుతున్నారు
సేవా సంస్కృతితో
ఉజ్బల భవితవ్యానికి దారులు నిర్మిస్తున్నారు
అవును! ఎప్పటికైనా మనిషే విజేతక!
మానవత్వమే జీవన సత్యం
పూలు సుగంధాలనే విరజిమ్మాలి...
అప్పుడే మనిషి ప్రకృతికి వికాసం
డా॥ కత్తి పద్మారావు.
9849741695