అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/సింధువులో బిందువులు
భాషోద్యమ కథానిక
విహారి
9848025600
సింధువులో బిందువులు
“తెలుగు నేర్చటానికి ఉచిత సేవా కార్యక్రమం అది. స్థలం దొరికింది. విద్యాలయం వాళ్ళు శనిఆదివారాలు పెట్టుకోమన్నారు. టీవీల్లో పని చేసేవారూ, పని చేద్దామనుకునేవారూ, కళాకారులూ, సృజనకారులూ, సంగీతం నేర్చుకుంటున్న పిల్లలూ, ఇతర యువతీ యువకులూ...ఏ వయస్సు వారైనా సరే అర్హులే. శని ఆదివారాల్లో ఉదయం పదినుండి పన్నెండువరకూ - తెలుగు అభ్యాసం. చదవటం రాయటం.”
హైదరాబాద్‌లో చాలామంది బంధువులు.
సాయంత్రం నడకకి పార్కుకు వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాన్నేను. 'వస్తావా' అంటే రానని నవ్వాడు.
నా శ్రీమతి శారద కూడా నవ్వుతూ, “ఆయనకు సీరియలుంది. దాన్ని మిస్‌కాడు” అంది.
సంభాషణ టీవీ కార్యక్రమాల మీదికి పోయింది. నేనూ ఆగిపోయాను.
- సమయం కాగానే, ఆ ఛానెల్‌ని మార్చింది శారద.
రియాల్టీ షో! నృత్యమో, నర్తనమో, నాటకమో తెలియని విన్యాసాలు. ఇద్దరు యువతులు, నలుగురు యువకులు, టీనేజ్ వారు. ఒకరిని మించి ఒకరు ఊపుతున్నారు ఊగుతున్నారు, ఎగురుతున్నారు. ఎక్కుతున్నారు, కాళ్ళకింది నుంచీ దూరిపోతున్నారు. మొత్తానికి కిందామీదా పదుతున్నారు.
ఫోకస్ లైట్స్! రంగులు మారుతున్నై! హాలంతా వెర్రెక్కిపోతున్నది. ఈలలూ, చప్పట్లూ, నవ్వులూ...!
ముగ్గురు జడ్జిలు. ఇద్దరు నడివయస్సు స్త్రీలూ, ఒక పెద్దాయనా. మహిళాజడ్డిల్లో ఒకావిడ లేడీవిలన్‌గా సీరియల్స్ వేసివేసి, శరీరం సహకరించక ఆగిపోయింది. రెండో ఆవిడ ఇంకా సీరియల్స్ ఫీల్డ్‌లో ఉన్నది. పెద్దాయన ఎప్పుడో రచనలు చేసి రిటైరయిన ఉపాధ్యాయుడు.
మహిళా జడ్జిలిద్దరూ చాలా ఆనందిస్తున్నారు. పెద్దాయనేమో తెచ్చికోలు నవ్వుతో, ఆముదం తాగిన మొహంతో ఇబ్బంది పడుతున్నాడు.
“డాన్స్' అయింది! హాలు సంతోషాల ఎక్కిళ్ళతో కరకరలాడుతోంది.
ముందుగా యాంకర్ స్టేజిపైకి వచ్చింది. 'సొయంపెబా! నీ పెరపామెన్స్ అదిరింది” అని ఒక యువతిని అభినందించింది.
పెద్దాయన మొహం చిట్లించాడు. “అబ్బబ్బ! అది స్వయంప్రభ తల్లీ! ఖూనీ... ఖూనీ” అనుకున్నాడు. పక్క వారికీ వినపడింది!
యాంకరిప్పుడు ఒక యువకుడి వైపు గెంతి 'రంజిత్ యూ ఆర్ గ్రేట్. బెస్ట్ టీమ్‌వర్క్!' అని భుజం తట్టింది.
అతను వంగి వంగి 'థాంక్స్' చెప్పాడు. చేతిలో మైకుంది. యాంకరమ్మ 'ఇప్పుడు మన జడ్జెస్ ఏమంటారో విందాం' అని వారివైపు చూసింది. 'శ్రుతకీర్తి మేమ్' అన్నది - మీ అభిప్రాయం ఏమిటన్నట్టు.
శ్రుతకీర్తి - టీమ్‌ని నానా విధాలుగా మెచ్చుకుని మార్కులకార్డు చూపింది. పదికి పది!
ఇప్పుడు చంద్రభాగ మేమ్.
చంద్రభాగ - ఒకటి రెండు సూచన లిచ్చింది. 'ఓవరాల్‌గా సూపర్బ్' అంటూ కార్డ్ చూపింది. తొమ్మిది!
“సార్ రంగనాథం గారూ? అన్నది యాంకర్.
పెద్దాయన వంతు వచ్చింది. చిత్రంగా నవ్వాడు. స్వయంప్రభ వైపు చూస్తూ 'బాగా చేశావమ్మా' అన్నాడు.
చప్పట్లు మరీ ఎక్కువ మోగినై.
'కానీ... నీ డ్రెస్ నీకు సహకరించినట్లు లేదు' అన్నాడు.
ఈలలు ఎక్కువైనై.
ఆ యువతి తనను తాను ఆపాదమస్తకం చూసుకుంది.
ఈలోగా శ్రుతకీర్తి 'ఫర్వాలేదులే మాష్టారూ' అంటే అట్టాంటివి మనం పట్టించుకుని కామెంట్ చేయకూడదు సారూ” అని దీర్ఘం తీసింది చంద్రభాగ!
“అలాగా” అన్నట్లు తల పక్కకి తిప్పి, “నీ పేరేమిటమ్మా!” అని ఇంకో యువతిని అడిగాడు రంగనాథం.
“దవలండి” చెప్పిందామె.
అర్ధం కాలేదు. పక్కకి చూశాడు. వాళ్ళకీ అర్ధం కాలేదు. పెదవి విరిచారు. “ఇంటిపేరా?” అంటే కాదన్నది ఆమె.
ప్రేక్షకుల్లోంచి ఎవరో అరిచారు “ధవళ” అండీ అని! అవునన్నట్లు తల ఊపింది ఆమె.
“ఓహో!” అని “దాని అర్ధం తెలుసా అమ్మా?” అని అడిగేడు.
“తెలీదండి” అని కొంచెం విసుగుదల చూపిందామె.
యాంకర్ కలుగచేసుకుంది. “మాష్టారూ మార్కులు” అని గద్దించింది.
ఆయన నవ్వాడు. ధవళవైపు చూశాడు. “ఇట్టాగైతే ఎట్టాగమ్మా!” అని “దాని అర్ధం స్వచ్చమైనది, తెల్లనిది అని” అన్నాడు.
“అఁహాఁ" అని దీర్ఘం తీసి సిగ్గుపడింది. ధవళ
రంగనాథం రంజిత్‌వైపు చూస్తూ “మీ వేగం చొరవా చాలా బాగున్నాయి” అని మెచ్చు కున్నారు.
రంజిత్ ఛాతీ నాలుగంగుళాలు పెరిగింది. చేతిలో మైక్‌ని పెదవుల దగ్గరపెట్టుకుని, సగం వంకరలు తిరిగి, వంగి వంగి, “థాంక్యూ సోమచ్‌సార్” అన్నాడు.
హాలు మళ్ళీ స్పందించింది!
“అవునూ- మీరు పాడిన పాట నాకు సరిగా తెలీలేదు. ఒకసారి సాహిత్యం వినిపించగలవా?”
“అంటే?” తెల్లమొహం వేశాడు రంజిత్. పక్కనున్న తన మిత్రుల్నీ చూశాడు. అందరూ పెదవి విరిచారు.
“అంటే - పాటలో అక్షరాలూ, వాక్యాలూ భాయ్” అని కొంచెం వ్యంగ్యస్వరంతో అరిచారెవరో.
“అదా!” అంటూ ఒక యువతి ముందు కొచ్చి రంజిత్ చేతిలోని మైకుని అందుకోబోయింది. ఈలోగా రంజిత్ కొంచెం కోపంగా “ఏంటిసార్, ఏవేవో అడుగుతున్నారు?” అని “అంతా బీట్‌సార్. దాన్నిబట్టి మా మూమెంట్స్ సెట్స్ చేసుకుంటాం” అంటూ “ఈ మాత్రం తెలీదా?” అన్నట్టు చూశాడు. మైక్‌ని ఆ యువతికి అందించాడు.
“నీ పేరు?” శ్రుతకీర్తి అడిగింది. “నవ్యప్రియ" అని “బిగినింగ్ వోన్లీ ఐనో సారూ?” అంటూ పాడింది. “వచ్చి...వచ్చి...అహ వచ్చి...వచ్చీ...వచ్చీ ఎయ్‌మాకురా...సచ్చి... సచ్చి...సచ్చి...నోడా...హయ్...గుచ్చి... గచ్చి...గుచ్చి సంపమాకురా” ఆమె పాటతో పాటూ ఈలలూ, చప్పట్లూ...వాయిద్యాలూ, ఆమె స్టెప్సూ అన్నీ కలగాపులగం, శబ్దకాలుష్యం, హోరూ...రొద....!
నవ్యప్రియని చేత్తో దగ్గరికి లాక్కుని “హాయ్ ఫైన్...నైస్” అంటూ హగ్ చేశాడు రంజిత్.
అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు. ప్రేక్షకుల్లో నుంచీ ఎవరో పెద్దగా “మార్కులు?” అని అరిచారు. “మేగ్జిమమ్” అని అరిచారు మరికొందరు ప్రేక్షకులు.
శ్రుతకీర్తీ, చంద్రభాగా కూడా ముఖ కవళికలు మార్చి, ఒకరి మొహాలొకరు చూసుకుని, “అబ్బే! ఇదెక్కడి తీర్పు?” అన్నట్టూ “అసలీయనగారెక్కడ దొరికారు?” అన్నట్టూ యాంకర్ వైపు చూశారు.
యాంకర్ తన చేతిలోని మైక్‌ని ఆన్‌చేసి, “జడ్జిగారి ఒపీనియన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. లైట్ తీసుకోకూడదు” అని సలహా ఇచ్చింది.
ఆమె నవ్వుతో చెట్టంతయింది. ఆ వెంటనే డ్రెస్‌ని సర్దుకుని లేచి వేదికనెక్కింది. టీమ్‌తో కలిసి 'స్టెప్స్' కొన్ని వేసింది.
'జడ్జెస్ అందరూ మాట్లాడతారు” - యాంకర్, మిగిలిన ఇద్దరూ కూడా వేదికమీదికి వచ్చారు. శ్రుతకీర్తి రెండు నిముషాలు తన కాలంలో ఇలాంటి “షోలు రానందుకు చింతించింది. చంద్రభాగ మళ్ళీ ఏమీ చెప్ప కుండా అందరికీ కలిపి 'యూఆర్ ఆల్ ఫ్యూచర్ స్టార్స్” అన్నది. కరతాళ ధ్వనులు. రంగనాథం గారు తన కంఠం విప్పారు. 'నాకు తెలీ కడుగుతాను. ఇది డాన్సా? అసలు దీని ప్రయో జనమేమిటితో మొదలుపెట్టి తెలుగు భాషని మంటగలుపుతున్నారని ఆక్రోశించాడు. ఒక్క వాక్యమైనా పూర్తిగా తెలుగులో చెవ్పలేని రేపటి పౌరుల్ని పనికిరానివారుగా తయారుచేస్తున్న ఈ కార్యక్రమాల్ని నిషేధించాలి” అని గొంతెత్తి పలికాడు.
అటువైవునుంచీ - పీలగా ఎవరో 'అవునవు'నంటూ అరిచారు. ఎక్కువమంది 'ఆపండి ఆపండి' అని కేకలు పెట్టారు.
ఈలోగా టైమయిపోయింది. జరజరా పాక్కుంటూ ప్రకటన వచ్చేసింది. ప్రాయోజిత కార్యక్రమం!
పురుషోత్తం బావ 'బాగుంది.. బాగుంది' అంటూ 'అమ్మాయ్ ఇంకో కాఫీ కొట్టు... తాగి వెళ్తాను' అన్నాడు. శారద ఆ పనిలోకి వెళ్ళింది.
నేను నోరూరుకోక “ఆ రంగనాథం గారు నాకు తెలుసు. చాలా సాహిత్య సభలకు వస్తూ ఉంటారు. సంగీతంలో కూడా నిధి” అన్నాను.
“ఎంత ఘనుడైతేనేం. అలా బిహేవ్ చెయ్యకూడదు” అనేశాడు. నేను విస్తుపోయి చూశాను.
“అవును. న్యూట్రెండ్స్ తెలియవు. అసలలాంటి వాళ్ళని పిలవటం తప్పు” అని తేల్చేశాడు.
“మరి తెలుగుభాష ఇట్టా ఖూనీ కావలసిందేనా?” అన్నాను కొంచెం ఉద్వేగంతో.
“మీలాంటి వాళ్ళతో ఇదే చిక్కు రియా లిటీని తెలుసకోరు. అన్నీ జనరలైజ్ చేసి జనం మీద పడి ఏడుస్తారు” అన్నాడు. నాకు కడువు రగిలిపోయింది.
“ఇప్పుడు నువ్ మాట్లాడేభాషే చూసుకో. మనం ఎంతగా ఇంగ్లీషులో కూరుకుపోయామో తెలుస్తుంది”
“ఏం ఫర్వాలేదు. మీరు ఉద్ధరించేదేం లేదు. వఠ్ఠి అరుపులే”
పెద్దవాడు. నేను అంతకంటే ఆయనతో వాదన పెట్టుకోలేను. ఆగిపోయాను. కాఫీలు వచ్చినై.
కాఫీ తాగి కదిలాడు పురుషోత్తం. ఆయనవెళ్ళిన తర్వాత శారద, నేనూ 'రియాల్టీ షో'లలో తెలుగు ఇంగ్లీష్ గురించీ, ఇంగ్లీష్ తెలుగు గురించిన చర్చలో పడ్డాము.
ఉన్నట్టుండి మధ్యలో ఆమె “ఉండండి నా 'సంగీతం' కార్యక్రమం వస్తుందివాళ” అంటూ టీవీలో ఛానెల్‌ని మార్చి, సర్ఫుకుని కూచుంది.
అప్పటికే 'పాట పాడనా... ' కార్యక్రమం మొదలైంది.
పాడుతున్న పదేళ్ళపిల్ల చూడముచ్చటగా ఉంది. ఆడంబరమైన ఆభరణాల్లో మెరిసి పోతోంది. పేరు వేశారు. పద్మజ. కెమేరా కార్యక్రమ నిర్వాహకుని పైకి మరలింది. ఆయన చాలా పేరున్న సినీ సంగీత దర్శకుడు. ఆయన పక్కగా రంగనాథం! ఆనాటి అతిథి!
ఆశ్చర్యపోయాను. రంగనాథం సంగీత నిధి కనుక ఇక్కడికీ ఆహ్వానించారన్నమాట!
“మీ మిత్రులు ఇక్కడా ఉన్నారు” అని నవ్వింది శారద.
పాట పూర్తయింది. శ్రోతలంతా లేచి కరతాళ ధ్వనులు చేశారు. అంత బాగా పాడింది - పద్మజ. నిర్వాహకుడు చాలాసేపు ఆమెని మెచ్చుకున్నాడు.
రంగనాథం నవ్వుతూ “సంగీతం నేర్చుకుంటున్నావు కదూ?” అని, చక్కని గాత్రం. బాగా సాధన చెయ్యి” అంటూ “క్షీరసాగర మధనం...” అను” అన్నాడు.
పద్మజకి వత్తులు పలకలేదు. “మధురం” అను- అని అడిగాడు. ఇక్కడా వత్తు రాలేదు.
“తెలుగుభాషకి నిజంగా వత్తులు తక్కువ. మనం సంస్కృతమయమై పోయాం. లేకపోతే ఆంగ్లమయం” అని ఆ పదాల స్వరూపాన్నీ ఉచ్చారణనీ విశదీకరించాడు.
ఆ తర్వాత పాడిన పిల్లల్లోనూ, అక్కడక్కడా ఇలా గోచరించిన ఉచ్చారణ దోషాల్నీ, భాషాపరమైన అవస్థల్నీ సరిచేస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించాడు-రంగనాథం.
గంటపైగా సాగి ముగిసింది. మేమూ రాత్రి ఉపాహారానికి లేచాము.
- * *
రెండు నెలల తర్వాత - ఒకరోజు, నేను ఉదయపు నడకనుంచీ తిరిగొచ్చి కూర్చున్న సమయంలో వచ్చాడు రంగనాథం.
చాలా ఆశ్చర్యపోయాను. ఇదే ఆయన మాఇంటికి మొదటిసారి రావటం. వెతుక్కుంటూ వచ్చాడట.
- కాఫీ తాగడం పూర్తయింది.
అప్పుడు మొదలెట్టాడు రంగనాథం, “నేను కొన్ని టీవీ ప్రోగ్రాములకి అతిథిగా వెళ్ళాను. మీకు తెలుసో తెలీదో?”
“ఒకటిరెండు చూశాను”
“వాటి అనుభవంతో నేను మానసికంగా బాగా దెబ్బతిన్నాను మాష్టారూ?” అని క్షణం ఆగి, “తెలుగుభాష చెడిపోతున్నదనీ, ప్రభుత్వం వారు ఏమీ చేయటం లేదనీ, అధికారులూ, ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ ఉదాసీనతతో పట్టించుకోవడం లేదనీ అందరూ ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని కౌన్ని సంస్థలు కొంత నిర్మాణాత్మక కార్యక్రమాలకీ పూనుకున్నారు”
“అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది"
“నిజం. అందుకని నా వంతుగా నేనొక ప్రయత్నాన్ని మొదలెట్టాను”.
ఏమిటన్నట్టు చూశాను. శారద వచ్చి వో పక్కగా నిలబడింది.
“తెలుగు నేర్పటానికి ఉచిత సేవా కార్యక్రమం అది. స్థలం దొరికింది. విద్యాలయం వాళ్ళు శనిఆదివారాలు పెట్టుకోమన్నారు. టీవీల్లో పని చేసేవారూ, పని చేద్దామనుకునేవారూ, కళాకారులూ, నృజన కారులూ, సంగీతం నేర్చుకుంటన్న పిల్లలూ, ఇతర యువతీ యువకులూ...ఏ వయస్సు వారైనా సరే అర్హులే. శని ఆదివారాల్లో ఉదయం పదినుండి పన్నెండువరకూ - తెలుగు అభ్యాసం. చదవటం రాయటం.”
“బాగుంది.మంచి ప్రయత్నం” నేనూ శారదా ఇద్దరమూ అన్నాము.
“దీని కోసం మీ వంటివారి సహకారం తీసుకుంటున్నాను. ఒక గంటలో వివిధ గ్రూపులవారికి ఏమేమి నేర్పాలో - ఒక సిలబస్ వంటిది తయారుచేశాము - నేనూ మరో నలుగురం కలిసి”.
క్షణాల తర్వాత అడిగేడు, “మీ సహకారం కావాలి. ఒక గ్రూపుని మీరు చూసుకుంటే మాకు సహాయం చేసిన వారవుతారు”
“తప్పకుండా” అన్నాన్నేను. “నేనూ వచ్చి చూస్తాను” అన్నది శారద.
“స్వయంగా చూస్తే, అవసరాన్ని బట్టీ, అభ్యర్థల్ని బట్టీ మనం మన బోధన విషయాల్నీ విధానాల్నీ కూడా నిర్ణయించుకోవచ్చు, మార్చుకోవచ్చు” అంటూ చాలా కాగితాల్నీ వారు తయారు చేసిన చిన్న చిన్న పుస్తకాల్నీ చూపాడు.
“చాలా బాగుంది అంటూ ఆనందించాము.
రంగనాథం శలవు తీసుకున్నాడు.
- * *
ఆ తర్వాతి శని, ఆదివారాలు నేనూ, శారదా రంగనాథం చెప్పిన విద్యాలయంకి వెళ్ళాము.
చక్కటి, చల్లటి వాతావరణం. ఏదో ఉత్సవం జరుగుతున్నట్టున్నది. వందమంది దాకా బాలబాలికలు. యువతీయువకులు, నడివయస్సువారు, పిన్నలతో వచ్చిన పెద్దలు!
విద్యాలయంలో ఒకటి రెండు అంతస్థులు వీరికిచ్చారు. మొత్తం నాలుగు గ్రూపులుగా క్లాసులు జరుగుతున్నాయి.
నావరకూ నాకయితే మనస్సూ- శరీరమూ కూడా ఆహ్లాదంతో తేలిపోతున్నట్లుంది.
“వట్టి మాటలు కట్టి పెట్టోయ్/ గట్టీ మేల్ తలపెట్టవోయ్!” గురజాడ గేయం నా చెవుల్లో మార్ర్మోగుతుంది.
“ఈయన అమాయకుడిలా ఉన్నాడు గానీ, అసాధ్యుడే” అన్నది శారద.
“అవును. ఒక ఆశయానికి అంకితమైన ప్రతి మహనీయుడూ అసాధ్యుడే మరి" అన్నా న్నేను.
పిల్లలూ, పెద్దలూ బిలబిలమంటూ వెళ్తున్నారు. !!
అ