అభినయ దర్పణము/హస్తానామష్టావింశతి విధనామ నిరూపణమ్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తా. అన్నివ్రేళ్లనుచేర్చి చాఁచి బొటనవ్రేలినివంచిపట్టునది పతాక హస్తమని నృత్యశాస్త్రవిశారదులు చెప్పుదురు.

వినియోగము: తా. నాట్యారంభము, మేఘము, వనము, వస్తువులనునిషేధించుట,కుచస్థలము, రాత్రి, నది, దేవసమూహము, అశ్వము, ఖండించుట, వాయువు, శయనము, గమనము, ప్రతాపము, ప్రసాదము, చంద్రిక, మిక్కిలియెండ, తలుపుతట్టుట, ఏడువిభక్తులు, అల, వీధిలోప్రవేశించుట, సమముగానుండుట, గంధముపూయుట, తాననుట, పంతము, ఊరకుండుట, ఆశీర్వదించుట, గొప్పరాజునుజూపించుట, తాటాకు, చెంపపెట్టు, పదర్ధమును స్పృశించుట, అక్కడనే యక్కడనే యనుట, సముద్రము, సుకృతిక్రమము, సంభోధనము, ముందుగాఁబోవువాఁడనుట, కత్తియాకృతిని జూపుట, మాసము, సంవత్సరము, వర్షము, దినము, సమ్మార్జనము, (అనఁగా తుడుచుట) ఈఅర్ధములయందు ఈహస్తము వినియోగపడును.

తా. తర్జనీమూలమందుఁజేర్చి వంచఁబడిన బొటనవ్రేలును, చాఁచఁబడిన అరచేయియు, వ్రేళ్లునుగలది పతాకహస్త మనఁబడును. ముందు బ్రహ్మ యొంటరిగా పరబ్రహ్మను చేరఁబోయినప్పుడు పతాకాకృతిగా చేయి చాఁచి 'జయవిజయీభవ'యని స్తోత్రముచేసెను. ఆకారణముచేత అట్లు పట్టఁబడిన చేయి నాఁటినుండి లోకమునందు పతాకమని ప్రసిద్ధినొందెను. కనుక ఇది యెల్లహస్తములకును మొదటిదాయెను. ఈపతాకహస్తము బ్రహ్మవలనఁబుట్టినది. దీనిజాతి బ్రాహ్మణజాతి. వర్ణము తెలుపు. ఋషి శివుఁడు. అధిదేవత బ్రహ్మము.

వినియోగము: తా. జయజయయనుట, మెఘము, నిషేణము, అడవి, రాత్రి, పొమ్మనుట, నడచుట, గుఱ్ఱము, గాలి, రొమ్ము, ఎదురు, పుణ్యము, అతిశయము, ప్రవాహము, దేవలోకము, హాహాకారము, వెన్నెల, ఎండ, దేవతాసమూహము, గడియ తీయుట, గోడ, నరకుట, సంతోషము, చెక్కిలి, గంధము పూయుట, కత్తి, నీటికికట్టవేయుట, గుంపు, దండుయొక్క ఆయత్తము, సమయము, వెరపుతీర్చుట, ఆశ్రయములేమి,క్షయము, కప్పుట, పానుపు, భూమి, నిప్పుమంట, వానధార, అల, పక్షిరెక్క, ప్రభువుతో మనవి చేయుట, ఇక్కడననుట, ఎట్టిది అట్టిదియనుట, చెంపపెట్టు, వస్తువులను అంటుట, కొలను, ఒడలుపిసుకుట, వ్యజస్తుతి, ప్రతాపము, దేవతానివేదనము, ప్రక్కకౌఁగిలింత, టెక్కెము, పెద్దగాలి, కొంగు, చలి, ఉక్క, తళతళ, నీడ, సంవత్సరము, ఋతువు, ఆయనము, దినము, పక్షము, మాసము, తేట, గొప్పవంశము, సమీపించుట, పాలింపుము లాలింపుము అనుట, బ్రాహ్మణజాతి, శుభ్రవర్ణము వీనియందు ఈ హస్తము వినియోగించును.


తా. ముందుచెప్పిన పతాకహస్తమందలి యనామిక, (అనఁగా చిటికినవ్రేలికి ముందువ్రేలు) పంచఁబడెనేని యది త్రిపతాక హస్తమగును.

వినియోగము: తా. కిరీటము, వృక్షము, వజ్రాయుధము, ఇంద్రుడు, మొగలిపువ్వు, దీపము, అగ్నిజ్వాల పైకిలేచుట, చెక్కిలి, మకరికాపత్రరేఖ, బాణము, మార్పు, స్త్రీపురుషులచేరిక వీనియందు ఈ హస్తము వినియోగించును.


తా. క్రిందచెప్పఁబడిన పతాకహస్తమందు అనామిక (ఉంగరపు వ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్తమగును. ఆదికాలమందు దేవేంద్రుఁడు వజ్రాయుధము నెత్తుకొనునపుడు అనామికనువదలి పతాకముయొక్క మూఁడుభాగములచేత గ్రహించుటచే నేర్పడినది కనుక ఇది త్రిపతాకము అనఁబడెను. ఇది ఇంద్రునివలన పుట్టినది, ఎఱ్ఱవన్నెగలది, క్షత్త్రియజాతి, దీనికి ఋషి గుహుఁడు, ఆధిదేవత శివుఁడు.

వినియోగము: తా. ఆవాహనము, దిగుట, మొగమెత్తుట, వంచుట, మంగళవస్తువులనుముట్టుట, గురుతిడుట, నమ్మకములేమి, దుర్జనుఁడు, సందేహము, కిరీటము, వృక్షము, ఇంద్రుడు, వజ్రాయుధము, ముంగురుల నెగదువ్వుట, దీపము, బొట్టుపెట్టుకొనుట, పాగాపెట్టుకొనుట, కారైనవాసనవలనను కఠోరశబ్దమువలనను ముక్కు చెవులను మూసికొనుట, గుఱ్ఱమునుతోముట, బాణము, మొగలిపువ్వు, మకరికాపత్రములనువ్రాయుట, కొన్ని పక్షులయొక్కపాటు, నిప్పుమంటలులేచుట, క్షత్త్రియజాతి, ఎరుపువన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. త్రిపతాకహస్తమందు చిటికెనవ్రేలు వంపఁబడునేని యది అర్ధపతాక హస్త మనఁబడును.

తా. చిగురు, పలక, గట్టు, ఇద్దరని చెప్పుట, నూరుకత్తి, రంపము, ధ్వజము, గోపురము, కొమ్ము వీనియందు ఈ హస్తము వినియోగ్ంచును.

తా. అర్ధపతాకహస్తమందలి చిటికెనవ్రేలును చూపుడువ్రేలును బైటికిచాఁపఁబడునేని కర్తరీముఖహస్తమగును.

తా. స్త్రీపురుషులయెడబాటు, వ్యత్యస్తస్థానము, దొంగిలించుట, కడకన్ను, చావు, భేదించుట, మెరపు, ఏకళయ్యావిరహము, క్రిందపడుట, తీఁగె వీనియందు ఈహస్తము వినియోగించును. తా. త్రిపతాకహస్తమందు తర్జనిబయటకు చాఁచఁబడెనేని కర్తరీహస్తమగును. పూర్వకాలమందు శివుఁడు జటాధరాసురసంహారము కొఱకు భూమిలోమధ్యమనుంచి తర్జనిచే చక్రమునువ్రాసెను. అది మొదలుకొని కర్తరిగలిగెనని ఋషులు చెప్పుచున్నారు. కర్తరిహస్తము శివునివలనఁబుట్టినది. ఇది క్షత్త్రియజాతి. ఋషి పర్జన్యుఁడు. రక్తవర్ణము. ఆధిదేవత చక్రపాణి.

వినియోగము:-

తా. కాళ్లకులత్తుకపెట్టుట, వ్రాయుట, దంపతులవిరహము, వ్యత్యాసము, విష్ణువు, మెరపు, ఏకశయ్యావియోగము, మహిషము, మృగము, చామరము,కొండశిఖరము, ఏనుఁగు, వృషభము, ఆవు, దువ్వెన, క్షత్త్రియుండు, రక్తవర్ఱము, కత్తెర, గోపురము వీనియందు ఈహస్తము వినియోగపడును.

తా. కర్తరీముఖహస్తమందు అనామికను అంగుష్ఠతోఁజేర్చి తక్కిన వ్రేళ్లను చాఁచిపట్టినయెడ మయూరహస్తమగును.

వినియోగము:-

తా. నెమిలిముఖము, తీఁగె, పక్షి, క్రక్కుట, ముంగురులు దిద్దుట, నొసలు, తిలకము, కన్నీరుఎగజిమ్ముట, శాస్త్రమును వ్యవహరించుట, ప్రసిద్ధి వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. పతాకహస్తమందు అంగుష్ఠము చాఁచఁబడిన యెడల అర్ధచంద్రహస్తమగును. తా. కృష్ణాష్టమిచంద్రుడు, మెడపట్టిగెంటుట, భల్లాయుధము, దేవాభిషేకము, కంచము, పుట్టుక, మొల, చింత, తన్ను దానుచెప్పుకొనుట, ధ్యానము, ప్రార్ధించుట, అవయవములను అంటుట, సలాముచేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. పతాకహస్తము చాఁచఁబడిన బొటనవ్రేలుగలదగునేని అర్ధచంద్రహస్తమగును. ఇది అవిసెమొగ్గవలె నుండును. ఇది భూషణేచ్ఛగల శివునినిమిత్తమై చంద్రునినుండిపుట్టినది. ఇది వైశ్యజాతి, దీనికి ఋషి ఆత్రి, వర్ణము గౌరము, ఆధిదేవత మహాదేవుడు.

తా. ముంజేతికడియము, మనికట్టు, అద్దమునుజూచుట, ఆశ్చర్యము, ప్రయాసము, మేరలేమి, సకలము, తాళమానము, సిగముడివేయుట, లేఁతచెట్టు, దుఃఖమువలన చెక్కిట చెయిచేర్చుట, ఏనుఁగుచెవులను చూపుట, తప్పుచేసినవారిని వెడలఁగొట్టుట, నొసటిచెమటతుడుచుట, యౌవనవంతుడు, సమర్ధుఁడు, చంద్రుడు, ప్రాకృతులకు నమస్కరించుట, అభిషేకము, కనుబొమ్మ, వస్త్రము, ధనుస్సు, మిక్కిలియనుట, నడుముకట్టు బిగించుట, కుండలుచేయుట, అంగము కాళ్లనుచూపుట, బిడ్డనెత్తుకొనుట, వీఁపు, తెలుపు, వైశ్హ్యజాతి వీనియందు ఈహస్తము వినియోగపడును.

తా. పతాకహస్తమందు చూపుడువ్రేలు వంచఁబడినయెడ అరాళహస్తమగును. వినియోగము:-

తా. విషము అమృతము మొదలగువానిని త్రాగుటయందును, ప్రచండమయిన గాలియందును ఈ హస్తము ఉపయోగింపఁబడును.


తా. పతాకహస్తమున అంగుష్ఠతర్జనులు వంచఁబడినయెడ అరాళహస్తమగును. ఇది పూర్వకాలమునందు అగస్త్యమహామునివలన సప్తసముద్రములను అపోశనము చేయునపుడు పుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి అగస్త్యుఁడు ఋషి. పాటలవర్ణము. వాసుదేవుఁడు అధిదేవత. దీని అనుపూర్వి ఇటువంటిదని భరతాదులు చెప్పిరి.

వినియోగము: తా. బ్రాహ్మణులయొక్క అపోశనము, ఆశీర్వాదముచేయుట, విటులప్రియవైముఖ్యము, వెండ్రుకలు చిక్కుదీయుట, వేగమురమ్మనుట, సంధ్యాకర్మమునందలి ప్రదక్షిణము, నొసటిచెమ్మటతుడుచుట, కన్నులకు కాటుక పెట్టుట మొదలగువానియందు ఈ హస్తము చెల్లును.

తా. ముందుచెప్పిన అరాళహస్తమందు అనామిక వంచఁబడెనేని శుకతుణ్డహస్తమగును.

వినియోగము:-

తా. బాణప్రయోగము, ఈటె, మర్మమైనమాట, తీక్ష్ణభావము వీనియందీహస్తముపయోగింపఁబడును.

తా. పతాకహస్తమందు తర్జన్యనామికలు పంచఁబడెనేని శుకతుండ హస్తమగును. ఇది సదాశివునిపై పార్వతీదేవికి ప్రణయకలహము గలిగినప్పుడు పార్వతీదేవియందుపుట్టెను. ఇది బ్రాహ్మణజాతి. ఋషి దుర్వాసుఁడు. రక్తవర్ణము. మరీచి అధిదేవత.

వినియోగము:-

తా. బ్రహ్మస్త్రము, మొగముతుద(ముక్కు), వంకర, మార్పు, భిండిపాలమను ఆయుధము, నడవఁబోవువిషయము, దాఁటుట, కలహము, ప్రీతిలేమి, ఈటె, చిలుకగోరువంకలను జూపుట, ఉగ్రభావము, మర్మోక్తి, తామ్రవర్ణము వీనియందు బ్రాహ్మణజాతిదైన ఈహస్తము చెల్లును.

తా. నాలుగువ్రేళ్లనుజేర్చి యరచేతిలోనికివంచి యంగుష్ఠమును మీఁదఁజేర్చునెడ ముష్టిహస్తమగును.

వినియోగము:-

తా. స్థిరమనుట, సిగబట్టుట, దృఢత్వము, పదార్ధములఁబట్టుకొనుట, జెట్టీలజగడము వీనియందు ఈముష్టిహస్తము వినియోగింపఁబడును.


తా. నడిమివ్రేలిమీఁద అంగుష్ఠమునుమడిచి పిడికిలిపట్టఁబడెనేని యది ముష్టిహస్తమగును. అది విష్ణువువలనపుట్టెను. ఇది శూద్రజాతి. దీనికి ఋషి అమరేంద్రుఁడు. వర్ణము నీలము. చంద్రుడు ఆధిదేవత.

తా. పట్టు, నడుమ, ప్రయోజనము, సంకేతము, క్షేమము, బలియిచ్చుట, ప్రాకృతజనుల నమస్కారము, గట్టిపట్టు, గంటనుపట్టుట, వడిగా పరుగెత్తుట, తేలిక, జెట్టిపోట్లాట, కేడెము మొదలయినవానిని పట్టుట, నిలుకడ, తలవెండ్రుకలుపట్టుట, పిడికిటిపోటు, గద యీటె మొదలయిన ఆయుధములనుపట్టుట, నీలవర్ణము, శూద్రజాతి వీనియందు ఈహస్తము వినియోగింపబఁడును.


తా. ముందుచెప్పిన ముష్టిహస్తమందు అంగుష్ఠమును పొడవుగా నెత్తినయెడ శిఖరహస్తమగును.

వినియోగము:-

తా. మన్మధుఁడు, ధనుస్సు, స్తంభము, శబ్దములేమి, పితృతర్పణము, పెదవి, పెనిమిటి, దంతము, ప్రవేశించుట, ప్రశ్నచేయుట, అవయవము, లేదనుట, తలఁచుట, ఇతరాభినయము, నడుముకట్టు నీడ్చుట, కౌఁగిలింత, ప్రియుఁడు, శక్త్యాయుధ తోమరాయుధములను ప్రయోగించుట, ఘంటానాదము, పేషణము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.


తా. ముష్టిహస్తము పైకెత్తఁబడిన బొటనవ్రేలుగలదయ్యెనేని శిఖర హస్తమగును. ఇది పూర్వకాలమందు శివుఁడు త్రిపురాసురులతో యుద్ధము చేయుటకు మేరుపర్వతమును విల్లుగాచేసి దాని నడిమిభాగమును పట్టునపుడు శివునివలనఁబుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి ఋషిజినుఁడు వన్నె చామన. ఆధిదేవత మన్మధుఁడు.

తా. పితృతర్పణము, కుటుంబమును నిలుపుట, నాయకుఁడు, శిఖరము, స్నేహితుఁడు, అడ్డముగఁ బట్టినయెడ పండ్లుతోముకొనుట, వింజామరము, విసనకఱ్ఱ, ఏమని యడుగుట, గిండిచెఁబు, నీళ్లుత్రాగుట, నాలుగనిలెక్కపెట్టుట, శక్తి అను ఆయుధమును వైచుట, ఈటెను విసరుట, ఫలాంశమును గ్రహించుట, ఆఁడువారియడఁకువ, సిగ్గు, విల్లు, మన్మధుఁడు, మగఁడు, నిశ్చయము, స్తంభము, గంటవాయించుట, బోగమాట, లేడనుట, ఈవి, నిలుకడ గలిగియుండుట, పిళ్ళారి, మహిషాసురమర్దని, వీరుఁడు, గుఱ్ఱమును దాఁటించుట, అర్ధచంద్రతిలకము మొదలగునవి, కొప్పుగురుతును పూనుట, ఇంద్రనీలము, దృఢత్వము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.


తా. ముందుచెప్పిన శిఖరహస్తము అంగుష్ఠముపై చూపుడువ్రేలు వంచఁబడెనేని కపిత్ధహస్తమగును.

వినియోగము:

తా. లక్ష్మీదేవి, సరస్వతి, చుట్టుట, తాళమునుపట్టుట, పాలుపిదుకుట, కాటుకపెట్టుకొనుట, వినోదముగా పూలచెండ్లు ధరించుట, కొంగు మొదలగువానిని పట్టుకొనుట, గుడ్డ ముసుఁగువేసికొనుట, ధూపదీపార్చనము వీనియందు ఈ హస్తము వినియోగింపఁబడును.


తా. శిఖరహస్తమునందలి బొటనవ్రేలును చూపుడువ్రేలును చేర్పఁబడునెడ కపిత్ధహస్తమగును. పూర్వకాలమునందు సముద్రమును చిలుకుటకు అనుకూలముగా మందరపర్వతమును పట్టునపుడు ఈకపిత్ధహస్తము విష్ణువువలనఁబుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి నారదుఁడు. వర్ణము తెలుపు. ఆధిదేవత పద్మగర్భుఁడు.

వినియోగము: తా. కవ్వమునుబట్టి చిలుకుట, లక్ష్మి, ధూపదీపములను నివేదించుట, గవ్వలను ఎగఁజిమ్ముట, అంకుళవజ్రాయుధములనుపట్టుట, ఒడిసెలత్రిప్పుట, తాళముపట్టుట, నాట్యమునుజూపుట, వినోదముగా తామరపువ్వు చేతపట్టుకొనుట, సరస్వతిజపమాలికను ధరించుట, లత్తుక మొదలగువానిని మెదుపుట, కొంగునులాగుట, ఋషిజాతి, గౌరవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.


తా.ముందుచెప్పిన కపిత్ధహస్తమందు చూపుడువ్రేలు నడిమివ్రేలితోను బొటనవ్రేలితోనుజేర్చి పట్టఁబడునేని కటకాముఖహస్తమగును.

వినియోగము:-

తా. పువ్వులుకోయుట, ముత్యాలదండ పూలదండలు ధరించుట, బాణ మెల్లగా ఆకర్షించుట, ఆకుమడుపులిచ్చుట, కస్తూరి మొదలగు ద్రవ్య కలుపుట, వాసనద్రవ్యములు చేర్చుట, మాట, చూపు వీనియందు స్త ముపయోగింపఁబడును.


తా. కపిత్థహస్తముయొక్క బొటనవ్రేలు ఎత్తి పట్టఁబడునేని కటఖహస్తమగును. శివునియొద్ద కుమారస్వామి విలువిద్యనేర్చునపుడు ముఖహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషిభార్గవుఁడు. స్వర్ణ అధిదేవత రఘురాముఁడు.


తా. ముత్యాలసరము, పూలదండ, వింజామరము వీనిని ధరించుట; ముమొదలైనవానిని ఆకర్షించుట, అద్దము నెదుటికితెచ్చుట, కళ్లెము, తొడిమనుత్రుంచుట, పండ్లుతోముట, పువ్వులుకోయుట, ఆకుమడు పులిచ్చుట, కస్తూరిమొదలగువస్తువులను మెదుపుట, బోగమువారి కౌఁగిలింత, వింటినితిగుచుట, చక్రాయుధమును ధరించుట, విసనకఱ్ఱపట్టుట, బంగారువన్నె, దేవజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. ముందుచెప్పిన కటకాముఖహస్తమునందలి చూపుడువ్రేలు పొడుగుగా చాఁచఁబడినయెడ సూచీహస్తమగును.

వినియోగము:-


తా. ఒకటి అనుట, పరబ్రహ్మనిరూపణము, నూరుఅనుట, సూర్యుఁడు, నగరము, లోకము అనుట, అట్లు అనుట, ఎవఁడు ఎవతె ఏదియనుట, వాఁడు ఆమె అదియనుట, విసనకఱ్ఱ, వెరపించుట,కృశించుట, సలాక, దేహము, ఆశ్చర్యపడుట, జడచూపుట, గొడుగు, నేర్పరితనము, మూలఅనుట, నూగారు, భేరివాయించుట, కుమ్మరవాని చక్రముతిరుగుట, బండిచక్రము, సమూహము, వివరించుట, సాయంకాలము వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. కటకాముఖహస్తముయొక్క చూపుడువ్రేలు పైకెత్తఁబడెనేని సూచీముఖహస్తమగును. పూర్వకాలమునందు బ్రహ్మ నేనొకఁడనేయని నిర్దేశించునపుడు ఆ బ్రహ్మవలన ఈ సూచీహస్తము పుట్టెను, ఇది దేవజాతి. దీనికి ఋషి సూర్యుఁడు. వర్ణము శ్వేతము. ఆధిదేవత విశ్వకర్మ.

వినియోగము:

తా. శ్లఘించుట, నిజము, దూరమునుజూపుట, ప్రాణమనుట, ముందుగఁబోవువానిఁజూపుట, ఒకటి అనుట, సంధ్యాకాలము, ఏకాంత ప్రదేశము, తూడు, బాగనుట, చూపు, అట్లేయనుట, లోకము, పరబ్రహ్మ నిరూపణము, ఒకటేయనునర్ధము, సలాక, చక్రమునుత్రిప్పుట, సూర్యుఁడు, ఉదయాస్తమయములు, బాణము, రహస్యముగనాయకునిజూపుట, అలుగుగలబాణము, ఏది అది అనుట, ఇనుము, కమ్మి, బెదరించుట, నీచునిపిలుచుట, వినుట, విరహము, తలఁచుట, ముక్కు, పక్షిముక్కు, తెలుపు, చూచుట వీనియందు ఈహస్తము వినియోగపడును.


తా. ముందుచెప్పిన సూచీహస్తమునందు బొటనవ్రేలిని విడిచినయెడ చంద్రకలాహస్తమగును. ఈచంద్రకలాహస్తము కలామాత్రచంద్రునియందు వినియోగింపఁబడును.

తా. అయిదువ్రేళ్ళను ఎడముగాచాఁచి కొంచెము వంచి అరచేయిపల్లమగునట్టు పట్టఁబడునెడ పద్మకోశ హస్తమగును.

వినియోగము:-

తా. మారేడుపండు, వెలగపండు, స్తనములు, వట్రువ, చెండు, అల్పాహారము, పూమొగ్గ, మామిడిపండు, పూలవాన, పూగుత్తి మొదలగునది, మంకెనపువ్వు, ఖంటారూపమునుజూపుట, పాములపుట్ట, నల్లకలువ, గ్రుడ్లు వీనియందు ఈహస్తము ఉపయోగించును.

తా. శ్రేష్ఠమయిన తెల్లదామర యాకృతిగా పట్టఁబడునది పద్మకోశ హస్తమనఁబడును. పూర్వకాలమునందు చక్రాయుధముకొఱకు పద్మముల చేత శివపూజఁజేయుచున్న విష్ణుదేవునివలన ఈపద్మకోశహస్తముగలిగెను. ఇది యక్షజాతి. కిన్నరాంశము. దీనికి పద్మధరుడు ఋషి. భార్గవుఁడు అధిదేవత.


తా. ఏనుగుతొండము, ధళధళయనుకాంతి, బంగారు వెండి మొదలగువాని పాత్రము, కొప్పు, కొలఁదియనుట, అందము, బాగు అనుట, ఘంట, పుట్ట చెండు, తామర, పుట్ట, గుండ్రన, కుచము, టెంకాయ, మామిడిపండు, కొండగోగు, అద్దము, కొమ్మవంగుట, పూలవాన, కబళము, గ్రుడ్లుపగులుట, మారేడుపండు, వెలగపండు వీనియందు ఈ హస్తము వినియోగించును. వినియోగము:-

తా. గందము, పాము, మెల్లగాననుట, నీళ్ళుచిలుకరించుట, ప్రోచుట మొదలగునవి, దేవర్షితర్పణములు, ఏనుఁగు కుంభస్థలములను చరచుట, జెట్టిలు భుజముచరచుట వీనియందు ఈహస్తము ఉపయోగపడును.

తా.పతాకహస్తమునందలి అరచేయి పల్లముగాపట్టఁబడునేని సర్పశీర్షహస్తమగును. పూర్వకాలమునందు బలిచక్రవర్తికి వెరచి తన్ను శరణుచొచ్చినదేవతలనుగూర్చి విష్ణుదేవుఁడు 'వామనావతారమెత్తి బలినివంచించి మిమ్ముకాపాడెద' నని చేయిచాఁచి చెప్పునపుడు ఆవామనునివలన ఈసర్పశీర్షహస్తముపుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఇంద్రుడు ఋషి. పసుపువర్ణము. శిఁవుడు అధినేత.

వినియోగము:

తా. కుంకుమము, అడుసు, ప్రాణాయామమునుజూపుట, మొగము కడుగుకొనుట, దానకాలమునునిరూపించుట, గందము, ఏనుఁగు, పొట్టివాఁడు, జెట్టిలుభుజముచరచుట, బుజ్జగించుట, పాలు, నీరు, కుంకుమపువ్వు, సిగ్గు, దాఁచఁదగినవస్తువు, పసిబిడ్డ, బొమ్మ, నీళ్ళుత్రాగుట, ఐక్యము, మంచిదనుట, దేవజాతి, పసుపువన్నె, తగుననుట, గంధపుపొడిచల్లుట, గందము మొదలగువానిపూఁత, స్తనము మొదలగువానిని పట్టుకొనుట వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. ముందుచెప్పిన సర్పశీర్షహస్తమందలి చిటికెనవ్రేలును బొటనవ్రేలును చాఁచఁబడునేని మృగశీర్షహస్తమగును.

తా. స్త్రీవిషయము, చెక్కిలి, క్రమము, మర్యాద, వెరపు, వాదు, అలంకారము, ఉనికిపట్టు, త్రిపుండ్రము పెట్టుకొనుట, ఎదురెదురు, మృగ్గు, కాళ్ళుపిసుకుట, అన్నిటినికూర్చుట, ఇల్లు, గొడుగుబట్టుకొనుట, మెట్టు, అడుగుపెట్టుట, ప్రియులనుబిలుచుట, తిరుగుట వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. చతురహస్తాంగుష్థము వెలుపలికెత్తఁబడెనేని మృగశీర్షహస్తమౌను. మహేశ్వరునిగూర్చి తపస్సుచేయుటకు పార్వతీదేవి త్రిపుండ్రమునుధరింపగా ఈహస్తము పుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి మార్కండేయుఁడు. వర్ణము తెలుపు. ఆధిదేవత మహేశ్వరుడు. తా. గోడ, విచారము, సమయము, నివాసస్థానము, గొడుగుపట్టుట, పద్మినీ శంఖినీ హస్తినీజాతి స్త్రీలు, మెల్లగాననుట, గందము మొదలగువాని పూఁత, స్త్రీలాభినయము, త్రిపుండ్రధారణము, వితర్కము, మృగము యొక్క మొగము, నేను అనుట, దేహము, సైగచేగ్రహించుట, ఋషిజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము ఉపయోగించును.


తా. నడిమివ్రేలు ఉంగరపువ్రేలు ఈరెంటికొనలను బొటనవ్రేలితోఁజేర్చి తక్కినవ్రేళ్ళను జాఁచిపట్టినయెడ సింహముఖహస్తమగును. తా. పగడము, ముత్యము, మంచివాసన, ముంగురులదిద్దుట, వినుట, నీటిబొట్టు, (రొమ్మున నిలిపినయెడ) మోక్షవిషయము, హోమము, కుందేలు, ఏనుఁగు, దర్భనువిదలించుట, తామరపూలదండ, సింహముయొక్కమొగము, వైద్యుఁడు, మందు, పంటనుశోధించుట వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. పద్మకోశహస్తమందు ఉంగరపువ్రేలు వంచిపట్టినయెడ లాంగూలహస్తమగును.


వినియోగము:

తా. గజనిమ్మపండు, పడుచులచన్నులు, వాసనగల ఎఱ్ఱకలువ, చకోరము, పోక, చిరుగజ్జెలు, రసగుండు మొదలగునవి, చాతకపక్షి వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. నడిమివ్రేలు, బొటనవ్రేలు, చూపుడువ్రేలు వీనిని టెంకాయ కన్నుల తీరుననిలిపి ఉంగరపువ్రేలినివంచి, చిటికెనవ్రేలినిపైకెత్తిపట్టిన లాంగూలహస్తమగును. ఈహస్తము పూర్వకాలమునందు పాలసముద్రమునందుఁబుట్టినకాలకూటవిషమును మ్రింగుటకై శివుఁడు గుళికగాఁజేసినపట్టినపుడు శివునివలనఁబుట్టినది. దీనికి ఋషి కుమారస్వామి. సిద్ధజాతి. బంగారు వన్నె. ఆధిదేవత లక్ష్మి.

వినియోగము:-


తా. ద్రాక్షపండు, రుద్రాక్ష, గడ్డముపట్టుకొనుట, మొలకచన్ను, పోక, చిరుగజ్జెలు, కలువ, పండు, పగడము, కొద్దిపాటికబళము, నక్షత్రము, రేగుపండ్లు, వట్రువ, మల్లెపువ్వు, చకోరపక్షి, చాతకపక్షి, అల్పవస్తువు, వడగల్లు, సిద్ధజాతి, కరకకాయ, బంగారు ఇవి మొదలగువానియందు ఈహస్తము వినియోగించును. తా. చిటికెనవ్రేలు మొదలగువ్రేళ్ళు సందులు గలవిగాత్రిప్పి పట్టఁబడినయెడ సోలపద్మహస్తమగును.

వినియోగము:-

తా. విసిరినతామర, వెలగ మొదలగుపండు, తిరుగుడు, చన్ను, ఎడబాటు, అద్డము, పూర్ణచంద్రుడు, సౌందర్యపాత్రము, కొప్పు, మేడమీఁదియిల్లు, ఊరు, ఎత్తు, కోపము, చెరువు, బండి, చక్రవాకపక్షి, కలకధ్వని, మెప్పు వీనియందు ఈహస్తము వినియోగించును.తా. వ్రేళ్ళనువిరళముగఁద్రిప్పినయెడ అలపల్లవహస్తమవును. ఈ యలపల్లవహస్తము పూర్వము పాలు వెన్నలుదొంగిలించిన కృష్ణునివలనఁబుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి వసంతుడు ఋషి. శ్యామమువర్ణము. సూర్యుఁడు ఆధిదేవత.


వినియోగము:-
తా.అప్పుడుకాఁచిననెయ్యి, విరహము, తల, కుడుమునుజూపుట, వికసించిన తామరపువ్వు, పూగుత్తి, కిరీటము, వర్తులము, శ్లాఘించుట, ఆకృతి, చక్కదనము, నర్తనము, కోట, మేడ, కొప్పు, మేడమీఁదియిల్లు, మాధుర్యము, బాగుబాగు అనుట, తాటిపండు వీనియందు ఈహస్తము వినియోగించును.వినియోగము:-

తా. కస్తూరి, కొంచెమనుట, బంగారు రాగి మొదలగులోహములు, తడి, ఖేదము, రసాస్వాదము, కన్ను, వర్ణభేదము, ప్రమాణము, సారస్యము, మెల్లగనడచుట, తునుక, ఎత్తుపీఁట, నేయి నూనె మొదలగు ద్రవవస్తువులు వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. పతాకహస్తమునందలి అంగుష్ఠమును నడిమివ్రేలి నడిమిగణుపునందు పొందించి చిటికెనవ్రేలిని బయటచాఁచిపట్టఁబడినది చతురహస్తమనఁబడును. ఇది పూర్వకాలమునందు అమృతమును హరించుటకై తనయభిమతమునపేక్షించు గరుత్మంతునికి సుధను హరింపుమని హస్తముచేత జాడచూపిన కశ్యపునివలనఁబుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి వాలఖిల్యుఁడు ఋషి. చిత్రవర్ణము.వైనతేయుఁడు దేవత.


వినియోగము:-

తా. గోరోచనము, దుమ్ము, సరసము, లత్తుక, మనసునునిలుపుట, కర్పూరము, కన్ను, గడ్డము, కమ్మ, ముఖము, నొసలు, కడకంటిచూపు, ప్రియవస్తువు, నయము, కస్తూరి, చక్కెర, నూనె, తేనె, నెయ్యి, నేర్పు, అద్దము, బంగారు, రవ, పచ్చ, ఇంతఅనుట, కొంచెమనుట, వస్తువులను మితముగాఁజూచుట, నలుపు తెలుపు మొదలగువన్నెలు, మిశ్రజాతి, పచ్చిక నేల, చెక్కిలి, పాలిక వీనియందు ఈహస్తము చెల్లును.


తా. నడిమివ్రేలిచేత బొటనవ్రేలినితాఁకి చూపుడువ్రేలినివంచి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టినయెడ భ్రమరహస్తమగును.

వినియోగము:-


తా. తుమ్మెద, చిలుక, యోగాభ్యాసము, బెగ్గురుపక్షి, కోయిల మొదలైనపక్షులు వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. హంసాస్యహస్తమందలి చూపుడు వ్రేలువంచిపట్టునెడ భ్రమర హస్తమగును. ఇది పూర్వమందు కశ్యపబ్రహ్మ అతిధిదేవికి కమ్మలుచేయునపుడు ఆయనవలనఁబుట్టినది. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి కపిలుండు చామనచాయ. పక్షిరాజు ఆధిదేవత.

వినియోగము:

తా. యోగాభ్యాసము, మౌనవ్రతము, కొన, ఏనుఁగుదంతమున జూపుట, నిడుకాడగలపువ్వులను పట్టుకొనుట, కర్ణమంత్రము చెప్పుట ముల్లుతీయుట, పోకముడి విప్పుట, రెండక్షరముల అవ్యములను నిరూపిఁచుట, ఆకాశమునందు తిరిగెడిప్రాణి, చామనచాయ వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. నడిమివ్రేలుమొదలు మూఁడువ్రేళ్లను ఎడముగలవిగాచాఁచి అంగుష్ఠమును చూపుడువ్రేలితోఁ జేర్చిపట్టినయెడ హంసాస్యహస్తమగును.

వినియోగము:


తా. బొట్టుకట్టుట, ఉపదేశము, నిశ్చయము, గగుర్పాటు, ముత్యము మొదలైనవి, చిత్రమువ్రాయుట, అడవియీగ, నీటిబొట్టు, దీపపువత్తి నెగఁద్రోయుట, ఒరయుట, శోధించుట, మల్లెమొగ్గలు మొదలైనవి, గీఁతగీయుట, పూలదండపట్టుకొనుట, నేనేబ్రహ్మమనుట, రూపించుట, లేదనుట, ఒరసి చూడఁదగినవస్తువులను భావించుట, కృతకృత్యము వీనియందు ఈహస్తము వినియోగించును.తా. బొటనవ్రేలిని చూపుడు నడిమివ్రేళ్ళనుచేర్చి, ఉంగరపువ్రేలిని చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసాస్య హస్తమవును. ఇది మఱ్ఱిమానిక్రింద మునులకు జ్ఞానోపదేశము చేయునప్పుడు దక్షిణామూర్తివలనఁబుట్టెను. ఇది విప్రజాతి. దీనికి శుకుఁడు ఋషి. వర్ణము తెలుపు. బ్రహ్మ ఆధిదేవత.

వినియోగము:
తా. జ్ఞానోపదేశము, పూజచేయుట, నిర్ణయించుట, తిలాహుతి, మాటలాడుట, చదువుట, పాడుట, ధ్యానము చేయుట, భావములను నిరూపించుట, లత్తుక మొదలైనవానిని పెట్టుట, గగుర్పాటు, మనస్సు, నీటిబొట్టు, గురిపెట్టుట, ముద్దుటుంగరము, ముద్దుపెట్టుట, బ్రాహ్మణజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. సర్పశీర్షహస్తమునందలి చిటికెనవ్రేలిని బాగుగా చాఁచిపట్టిన యెడ హంసపక్షహస్తమగును.

వినియోగము:-

తా. ఆరు అనెడి లెక్క, కట్టకట్టుట, గోటినొక్కుగురుతు, ఏదేనొక పనిచేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.


తా. సర్పశీర్షహస్తమునందలి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసపక్ష హస్తమగును. శివుని సన్నిధియందు తండువు తాండవము సభ్యసించునపుడు హంసరెక్కవలె చేతిని పట్టెను గనుక ఆతండువువలన హంసపక్షహస్తము పుట్టెను. ఇది అప్సరోజాతి. దీనికి ఋషి భరతుఁడు. వర్ణము నీలము. మన్మధుఁడు ఆధిదేవత.

వినియోగము:-

తా. శుభనాట్యము, నీళ్ళకు అడ్డకట్టకట్టుట, వీణవాయించుట, సంగ్రహించుట, కట్టుట, పక్షిరెక్క, ముగియుట, చిత్తరువువ్రాయుట, నలుపువన్నె, అప్సరోజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. ముందుచెప్పిన పద్మకోశహస్తము వ్రేళ్ళను మాటిమాటికిచేర్చి విడిచిపెట్టుచుండినయెడ సందంశ హస్తమగును.

వినియోగము:-

తా. త్యాగము, బలియిచ్చుట, పుండు, పురుగు, మనస్సునందలి భయము, అర్పించుట, అయిదు అనుట వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. హంసాస్యహస్తమందలి నడిమివ్రేలు చాఁచిపట్టినయెడ సందంశ హస్తమవును. సరస్వతీదేవి అక్షమాలధరింపఁగా నామెవలన ఈ సందంశ హస్తముపుట్టెను. ఇది విద్యాధరజాతి. దీనికి ఋషి విశ్వావసుఁడు. వర్ణము గౌరము. ఆధిదేవత వాల్మీకి.

వినియోగము:

తా. పల్లు, సన్ననిమొగ్గ, పాట, లాస్యము, టీక(పదములయొక్క అర్థము వివరణము) జ్ఞానముద్ర, త్రాసుపట్టుట, దంతక్షతము, జందెము, గీర, శోధించుట, చిత్రమువ్రాయుట, నిజము, లేదనుట, ఇంచుకయనుట, క్షణకాలమనుట, వినుట, బంగారు మొదలైనవానిని ఒరయుట, గురి, గోరు,మొలక,గురిగింజ,ఎనిమిదింటిలెక్క,పట్టుపురుగు,విషము,గడ్డిపోచ,చీమ,దోమ,ముత్యాలపేరు నెత్తుట,నల్లి,ఈగ,పూలదండ,నూగారు,జాడ,ఏకాంతము,తాఁకుట,వేదము,మంచు,మాటలాడుట,జారుట,గాయము,నఖక్షతము,రత్నము,యాచకుడు,బొట్టు,కాటుక,విద్యాధరవంశము,గౌరవర్ణము,మెల్లనిది వీనియందు ఈహస్తము ఉపయోగించును.

తా. అయిదువ్రేళ్ళనుచేర్చి పట్టఁబడునది ముకుళహస్త మనఁబడును.

వినియోగము:-

కుముదే భోజనే పఞ్చబాణే ముద్రాదిధారణే. 405
నాభౌచ కదలీ పుష్పే యుజ్యతే ముకుళ:కర:,

తా. కలువపువ్వు, భోజనముచేయుట,మన్మధుఁడు,ముద్రలు ధరించుట,బొడ్డు,అరఁటిపువ్వు వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. పద్మకోశ హస్తముయొక్క వ్రేళ్ళను చేర్చిపట్టినయెడ ముకుళ హస్తమవును. పూర్వము ఆంజనేయుఁడు దొండపండనెడి శంకచేత సూర్యుని పట్టఁబోయినపుడు అతనివలన ఈముకుళహస్తము పుట్టెను. ఇది సంకీర్ణజాతి. దీనికి విశాఖిలుఁడు ఋషి. కపిలవర్ణము. చంద్రుఁడు ఆధిదేవత.

వినియోగము:


తా. దానము,జపము,దీనవాక్యము,భోజనము,తామరమొగ్గ,ఆత్మ,ప్రాణములను నిర్దేశించుట,అయిదనుట,కాముకునిమాట,బిడ్డలను ముద్దుపెట్టుకొనుట, దేవపూజ,గొడుగు మొదలగువానియొక్కముడుగు,ఫలములను గ్రహించుట,సంకీర్ణజాతి, కపిలవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.తా. ముకుళ హస్తమునందలి తర్జనిని వంచిపట్టినయెడ తామ్రచూడహస్తమగును.

వినియోగము:-

తా. కోడిమొదలైనది,కొంగ,కాకి,ఒంటె,దూడ,వ్రాయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

తా. పతాకహస్తమునందలి చిటికెనవ్రేలిని బొట్టనవ్రేలుతాకిఁనయెడ తామ్రచూడహస్తమగును.

త్రిశూలహస్తలక్షణమ్‌.
తా. ఇది పూర్వము ఆకృతులను ధరించిన మూఁడువేదములు బ్రహ్మయెదుట నిలిచి తమ యభిప్రాయమును తెలుపునపుడు వానివలనఁబుట్టెను. ఇది దేవజాతి. దీనికి దేవేంద్రుడు ఋషి. శంఖవర్ణము. బృహస్పతి ఆధిదేవత.

వినియోగము:-


తా. మూఁడులోకములు, శూలాయుధము, మూఁడని లెక్కపెట్టుట, కన్నీరుతుడుచుట, మూఁడువేదములు, మారేడుపత్రి, దేవజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.
తా. బొటనవ్రేలిని చిటికెనవ్రేలిని వంచి తక్కిన వ్రేళ్లను చాచిపట్టినది త్రిశూల హస్తమనబడును.


వినియోగము:-


తా. మారేడుపత్రి, మూఁటికూడిక వీనియందు ఈహస్తము వినియోగించును.తా.ఈచెప్పఁబడిన యిరువదియెనిమిదిహస్తములును అసంయుత హస్తములనఁబడును. ఈహస్తముల ప్రయోగార్థములు ఎన్నికలవో అన్నిహస్తభేదములును గలవని చెప్పుదురు.
తా. పద్మకోశహస్తము వ్రేళ్ళను వంచిపట్టినయెడ ఊర్ణనాభహస్తమవును. ఇదిపూర్వము నృసింహస్వామి హిరణ్యకపునొరొమ్మును నఖములచేత చీల్చునపుడు నృసింహస్వామివలనఁబుట్టెను. ఇది క్షత్త్రియజాతి.దీనికి శార్దూలకుఁడు ఋషి. రక్తవర్ణము. ఆదికూర్మము ఆధిదేవత.

వినియోగము:


తా.తలగోకుకొనుట,దొంగతనము,నరసింహుఁడు,మృగముఖము,సింహము,కోఁతి,తాబేలు,కొండగోగు, స్తనము,భయము,క్షత్త్రియజాతి,ఎఱ్ఱవన్నె వీనియందు ఈహస్తముచెల్లును.


తా. చూపుడువ్రేలుమొదలు మూఁడువ్రేళ్ళను బొటనవ్రేలితో చేర్చి చిటికెనవ్రేలినిచాఁచిపట్టినయెడ బాణహస్తమవును. ఇది ఆఱు అని లెక్కపెట్టుటయందును నాళనృత్యమునందును వినియోగించును.

తా.కపిత్థహస్తపుచూపుడువ్రేలు పొడువుగా ఎత్తిపతట్టఁబడినయెడ అర్థసూచికహస్తమగును. ఇది మొలక,పక్షి పిల్ల మొదలగునది, పెద్దపురుగు వీనియందు వినియోగించును.

తా. అంజలి,కపోతము,కర్కటము,స్వస్తికము,డోల,పుష్పపుటము,ఉత్సంగము,శివలింగము,కటకావర్థనము,కర్తరీస్వస్తికము,శకటము,శంఖము,చక్రము,సంపుటము,పాశము,కీలకము,మత్స్యము,కూర్మము, వరాహము,గరుడము,నాగబంధము,ఖట్వ,భేరుండము,ఆవహిత్థము అనునీయిరువదినాలుగుహస్తములు సంయుతహస్తములు.


తా. అసంయుతహస్తముల సంయోగమువలన సంయుతహస్తములవును. అసంయుతహస్తముల ఉత్పత్తియే సంయుతములకును కాని ఆధిదేవతలు వేరువేరు.

తా.రెండుపతాకహస్తముల అరచేతులఁజేర్చిన నది యంజలిహస్తమనఁబడును.