అబలా సచ్చరిత్ర రత్నమాల/శ్రీమతి భండారు అచ్చమాంబగారి జీవితచరిత్ర

వికీసోర్స్ నుండి

శ్రీమతి భండారు అచ్చమాంబగారి జీవితచరిత్ర *

    పగలు కడున్ నభోమణి, కపాలిశిరోమణి రే, జగంబు గా
    రగపడునంతకున్ వెలుగునట్లుగ జేయుదు రంతెకాని, యీ
    జగతికి మాటు జెందియు నజస్రము నప్రతిమాన తేజమున్
    దగ గలిగింతురిట్టి వనితామణులే కద! దైవసృష్టిలోన్!

అప్రతీ కాశ పాతివ్రత్యము, ఉదాత్త వైదుష్యము, అనుపమాన స్వదేశప్రీతి, అనిర్వచనీయ స్వజాత్యభిమానము, అనూనదీనవత్సలత, నిర్ణిద్రసత్కార్యాచరణము, నిరంతర సచ్చింత, అసమాన క్షమ మున్నుగాగల సుగుణ గణంబు లొకటికి మించి యొకటి తనయందు వాసముచేయుచుండ, హిందూ దేశమునకు నాయికమణియన విరాజిల్లిన యీ వరవర్ణినీమణిచరితం బనుకరణీయంబును, ఆహ్లాదదాయకంబునునై యొప్పుచున్నది.

మహారాజ్ఞులు, పతివ్రతాతిలకములు, శూరనారీమణులు, విదుషీరత్నములు, పరిశుద్ధ ప్రవర్తనలు, స్వదేశాభిమాన మా నీయలు మొదలగు ననేక సతీరత్నముల సచ్చరిత్రములు బుధజవసంస్తవనీయంబులుగా విరచించి మించిన యీ విదుషీమణి చరితం బెంతటి మాహాత్మ్యసంభృతంబు గాక పోవును!

కృష్ణామండలములోని మునగాల సంస్థానమునకు గ్రీ.శ. 1880 సం|| ప్రాంతములవరకు దివాన్‌గిరీ చేసిన ఆర్వేలనియోగి వంశజులగు కొమఱ్ఱాజు వేంకటప్పయ్య పంతులు గారు శ్రీమతి అచ్చమాంబగారి జనకులు. ఈ మహనీయుడు కేవలాధి కారైశ్వర్యముచేతనే కాక పరోపకార పరాయణత, క్షమ,

  • శ్రీమతి సౌ. పులుగుర్తి లక్ష్మీనరసమాంబగారిచే బ్రకటింపబడు 'సావిత్రీ' పత్రిక నుండి స్వీకరింపబడినది. గాంబీర్యము, బుద్ధికౌశలము, మున్నగు గుణగణములచే మిక్కిలి సత్కీర్తి గాంచెను. ఆధ్యాత్మికవిషయజ్ఞయు, సాధ్వీగుణభాసితయునగు గంగమాంబ యను విజ్ఞానవతి యీ యన సహధర్మచారిణి. గుణనిధి యగు నీ మిథునమునకు సముద్రునకు లక్ష్మీ కళానిధులవలె గ్రీ.శ. 1874 సం||న నొక కుమారీమణియు, నాపిమ్మట నొక కుమారరత్నము నుదయించిరి. ఈ యిరువురిలో నగ్రజయెయన యచ్చమాంబగారు, అచ్చమాంబగారి జన్మస్థానము మాత్రము మన దేశాచారము ననుసరించి ఆమె తల్లి పుట్టినింటివా రప్పుడువాసము చేయుచున్న నందిగామ యయ్యెను. ఈ నందిగామ యను గ్రామము కృష్ణామండలములోనిదే. ఈమె మాతామహుల నివాసస్థల మా తాలూకాలోని కంచెల యను గ్రామమైనప్పటికీ, నీమె మాతామహు లప్పు డచ్చటి జమీందారుల పనిమీద నచ్చట నుండుట తటస్థించినందున నీమె జననస్థల మది యయ్యెను.

మల్లెపువ్వు పుట్టింతోడనే వాసింప మొదలు పెట్టి యట్లు, మన యచ్చమాంబగారిలో కడుబాల్యమునాటనుండియు మిక్కిలిగా క్షమాగుణంబు, అనుకరణశక్తి, దీనవత్సలత మున్నుగాగల సుగుణగణంబులు బొడసూపుచుచుండెను. పెద్దవారు చేయుచుండెడు చాతుర్యములగు ననేక కార్యములను శ్రద్ధగా గ్రహించుచు, జాకచక్యముతో దానుగూడ నట్టి పెద్దపనుల జేయుట కీమె బాల్యమందే ప్రయత్నించు చుండెడిదట! చెలులతో నాటలాడెడు వేళలందుగాని, యితర సమయములందు గాని, సాధారణముగా దన కెట్టి బాధ కల్గినను దాను లోలోన సహించుచునే యుండెడిది గాని, పెద్దవారితో జెప్పి బేలవడి వాపోవుట యీమె యెరుగదు. ఇందుకొక చిన్ని దృష్టాంతము జెప్పెదను. ఈమె యైదారు సంవత్సరముల పిల్లగానుండినప్పుడొక్క నాడీమెను బెద్ద తేలొకటి కుట్టెను. అనేకమంది పెద్దవారు సైతము వృశ్చికస్పర్శ తగలగానే యోర్పుచాలక గుట్టువీడి రోదనముచేయుచు జుట్టుపట్టులవారిని బోగుచేతురు కదా; అట్టి తేలు నొవ్వబొడిచినను నాబాలికా శిరోమణి కిమ్మనక యా బాధనంతను లోలోన నణచుకొనుచు వారు తమంతవచ్చి తెలిసికొనునంతకు నింటిలోని పెద్దవారికైనను దెలియనీయకుండెను. మరియు నీమెకు జిన్నతనమున నాటపాటలు మున్నగువానికి దల్లిదండ్రాదు లిచ్చుచుండెడి సొమ్ము దనస్వంతమునకు గర్చుబెట్టక సదా దీనులకు బీదలకు నిచ్చుచుండెడిదట. ఇత్యాది సుగుణపుంజము లీమెతో జిన్ననాటనుండియు వర్థిల్లుచున్నవి. గనుకనే తన జీవిత కాలమందీమె యనేక విద్యలయం దారితేరి గర్భశోకాదులకు సహించి దీనజనులను గన్నబిడ్డలట్టు గారవించుట మున్నగువాని యందెంతయు ఘనతను బొందగల్గెను!

అచ్చమాంబగారి కారేడుల యీడువచ్చునప్పటికే అనగా క్రీ.శ. 1880 సం||న బితృవియోగ దు:ఖము తటస్థించెను. వెంకటప్పయ్యగారు మృతులైన పిదప గంగమాంబగారు తమ కుమారితెను, గొమారుని వెంటబెట్టుకొని యప్పుడు నైజాము రాజ్యములోని దేవరకొండ యను గ్రామమున నుద్యోగము చేయుచున్న తన సవతికుమారుడు శంకరరావుగారి యొద్దకేగెను. వీరచట నున్న కాలములో మధ్యపరగణాలలో నుద్యోగమందున్న గంగమాంబగారి అన్నగారగు భం. మాధవరావుగారికి ప్రధమ కళత్రవియోగము కలుగగా శంకరరావుగా రచ్చమాంబగారిని మాధవరావుగారికిచ్చి వివాహము చేసిరి. అది మొదలు తమ యంత్యదశవరకును అచ్చమాంబగారు మధ్యపరగణాలలోనే యుండిరి.

ఇది మొదలీమె జీవితకాలమందలి ప్రతినిముషము దోడి సోదరీలోకమునకు సన్మార్గ బోధకముగా నొప్పుచున్నదని చెప్పవచ్చును. భగవంతుడీమెను లోకమునకు సన్మార్గదీపికగా నుద్దేశించి సృజించెననుటకు సందేహములేదు. "చిన్న నాడు మావాండ్రు నాకు జదువు చెప్పింపలేదమ్మా! నాకిక చదువెట్ల వచ్చున"ని తలంచు మన కొందరు వెర్రిసోదరీమణుల తలంపులు, 'కాలుజారిపడి నాకీ యూరచ్చిరాదను' కొనుటను బోలియుండునవి యని అచ్చమాంబగారు తన విద్యాభ్యాసముయొక్క యుదాహరణమువలన నిరూపించుచున్నది. అచ్చమాంబగారికి పదియేడుల యీడువచ్చి వివాహమై భర్తతో మధ్యపరగణాలకు బోవువరకును విద్యయన నేమో తెలియదు. ఇదియే యీమె విద్యాభ్యాసమున కారంభసమయము. ఇపుడైనను బడికిబోయిగాని, పెద్దవారింటి యొద్ద జెప్పించుటచేగాని విద్య లభ్యసించుట కాదు. చివరకదెట్లు ఫలించిన నట్లు ఫలించును గాని, మనవారు జ్ఞానసంపాదనమునకని కాకపోయిన నుదరపోషణార్ధమని తలంచి యయిదేడుల యీడు వచ్చునప్పటికి మగపిల్లలకు మాత్రము శ్రద్ధగా విద్యాభ్యాసము చేయింప ప్రారంబించెడు నాచార మిప్పటి కున్నదిగదా! అచ్చమాంబగారి తమ్ముడగు లక్ష్మణరావుగారికి పెద్దలు శ్రద్ధగా విద్యాభ్యాసము చేయించుచుండిరి. తమ్ముడు చదువుకొనుచుండు సమయములందు అచ్చమాంబగారు తమ్మునియొద్ద గూర్చుండి యాయనతో దానుగూడ సహజాభిలాషతో విద్య నభ్యసింప మొదలుపెట్టెను. అప్పుడు తన తమ్ముడభ్యసించుచున్న తెలుగు, హిందీ, భాషలను దమ్మునితో సమానముగా నేర్చుచు, నంతకంతకు దమ్ముడు చదువుపాఠముల నాతనికంటెముందు తానేవల్లించుచు, నిట్లఖండమైన తెల్వితో గొంతకాల మారెండు విద్యల నభ్యసించెను. తదనంతరము లక్ష్మణరావుగా రింగ్లీషుభాషాభ్యాసమునకై నాగపురమునకు బోవలసిన వారైరి. తనకు విద్యాభ్యాసమున దోడైన తనతోడు తనను వీడి యితరస్థలమున కేగగానే తానొంటరియైనప్పటికి నీమె స్వయంకృషిచే విద్యాభ్యాసము చేయుచుండెను. మరియు దామప్పుడ్నూ మధ్యపరగణాలలోనిదైన మహారాష్ట్రభాషనుగూడ కృషిచేసి యభ్యసించుచు దానిలో గూడ దగుపాటి జ్ఞానము సంపాదించెను. అచ్చమాంబగారి సహజన్ముడై, స్త్రీవిద్యాభిమానియు, సుగుణ శోభితుండునైన లక్ష్మణరావు గారు మాత్రము తమ స్కూలు సెలవులలో దన యక్కగారియొద్దనే యుండి తత్పరతతో నామెకు విద్యాభ్యాసమున సాహాయ్యము చేయుచుండెను. ఇట్లు సుగుణ వంతుడగు తమ్ముని సాహాయ్యము, అచ్చమాంబగారు, తెలుగు, హిందీ, మహారాష్ట్రము, బంగాళము, ఘూర్జరము అను నైదుభాషలయందు బాండిత్యము సంపాదించెను. సంస్కృతమునందును స్వల్పముగా నీమెకు బరిచయము కలదు. ఇందలి మొదటి మూడుభాషలయందు సమానమగు విశేష పాండిత్య మీమెకుండెను. గుణనిధియగు తమ్ముని సాహాయ్యమున నచ్చమాంబగారింతియకా దింకయు ననేక ఘన కార్యము లాచరింపగల్గెను. మన హిందూదేశపు సోదరీమణులిట్టి సోదరవర్యు నూటికి బదుగురైనను గల్గి నింతలో మనదేశము యధాస్థితికి రాదా ? ఇంకేమికావలయును ? ఇచ్చువారికిని బుచ్చుకొనువారికిని దరుగని ధనంబగు నిట్టి విద్యాధనం బవ్యాజప్రేమతో దమ సోదరీతతి కొసంగు సోదరులే నిజమగు సోదరులు. కాని, యేడాదికి నాల్గుసారులింటికి దీసికొనివచ్చి నశ్వరధంబులగు నాల్గుసారెలు నాల్గు చీరెలుమాత్రము పెట్టి కన్నులు తుడుచు సోదరులు సోదరులా? లోకములోని సోదరులు తమ సోదరీమణుల యెడల శ్రీమతి అచ్చమాంబగారి సహోదరు ననుక రింతురు గాక! ఇట్లచ్చమాంబగారు పెద్దలయొక్క ప్రేరణగాని, పాఠశాలకు బోవుటగాని, తనకు సంభవింపకపోయినను స్వయంకృషిచే నిన్ని భాషల నందింతటి సామర్థ్యము సంపాదించుటయే కాక, అప్పుడు పైబడిన సంసారభారము చక్కగ వహించుచు, ఊలుఅల్లికలు, దారపు అల్లికలు, మొదలగు ననేకములగు నల్లికపనుల యందును, గుట్టుపనుల యందును, గృహిణీభూషణములగు గొప్ప గొప్ప వంటకముల యందును గూడ నిరుపమాన నైపుణ్యము గడించెను. ఈమె యెపుడు దన యింటిపను లితరులచే జేయించుకొని యెరుగదు.

ఇట్లనేక విద్యలయందును, గృహకృత్యములయందును విశేష నైపుణ్యము గల్గి, తనకుగల సవతికూతుతో నీటితో బాలవలె గలిసి వివేకవతి యయి కాపురము చేయుచుండ, నచ్చమాంబగారి కొక పుత్రుడును, బుత్రికయును గల్గిరి. ఇంతలో ధనవంతుడు లోకదీపముగా గాను సృజించిన యీ సాధ్వీరత్నము యొక్క హృదయగాంభీర్యము లోకమునకు ప్రర్శించుటకును, దదవకాశము నీమెచే ననేకములగు మేళ్లను జేయించుటకును దలచి, ఈమెకుగాను దయచేసిన పుత్ర, పుత్రికలను బరలోకగతులను జేసెను.

    "ఖండితంబయ్యు భూజము వెండిమొల్చు
     క్షీణుడయ్యును నభివృద్ధి జెందు సోము
     డివ్విధంబు విచారించి యెడలు తెగిన
     జాములకు గానమొందరు సాధుజనులు."

మరియు నాపదలయొక్క రాపిడి గలిగినపుడే గదా మహాజనుల ధైర్య గుణము ప్రజ్వరిల్లును. అచ్చమాంబ గారు తన కిట్లు పుత్ర పుత్రికావియోగము వలన గల్గిన దు:ఖము నెట్లు సమన్వయించుకొనెనో కనుడు! పురుష శ్రేష్ఠులకు గూడ నసాధ్యమైన రచనాసామర్థ్యముతో వొప్పుట్టియు, దనకుదానే సాటియగు నట్టియు, సోదరీలోకంబు కనుపమేయ ఫలదాయకం బగునట్టియు, వేయేల; యనిర్వచనీయ మహిమాడ్యమగు ట్టి "అబలా సచ్చరిత్ర రత్మమాల" యను నుదాత్త సద్గ్రంథరచనకు గారణ మచ్చమాంబగారికి బుత్ర పుత్రికా వియోగమే. అచ్చమాంబగారు పుత్రపుత్రి వియోగదు:ఖమున నుండగా నీమె ప్రాణతుల్యుడగు సోదరుడు లక్ష్మణరావుగా రొకనాడొక ప్రసంగవశమున నాగోజీభట్ట కృతమగు "శబ్దేందు శేఖర:పుత్రో మంజూషా మను కన్యకా" అను శ్లోకమునుజదివి, నాగోజీభట్టుగారు తనకు బుత్ర పుత్రికావియోగము గలుగగా దన రచించిన "శబ్దేందు శేఖర" మను గ్రంథము తన పుత్రుడు గాను, "మంజూష" యను గ్రంథము తన పుత్రిక గాను నుండునని మనస్సమాధానము చేసికొనినట్లు చెప్పగా, నాటనుండియు నచ్చమాంబ గారు నాగోజీభట్టు గారి వలెనే తానును మనస్సామాధానము పొందవలెనని కోరి 'అబలా సచ్చరిత్ర రత్న మాల" రచనకు గడగిరట. తన "అబలా సచ్చరిత్ర రత్న మాల" ప్రథమభాగము యొక్క పీఠికను మొదట "బ్రపంచకమునందలి జనులకు బరమేశ్వరుడు సదా మేలే కలుగజేయు నియు, అట్లయినను నొకప్పుడతడు సేయు మేలు మనకు దు:ఖరూపముగా గాన్పించుటవల మనమా దయానిధిని నిష్కరుణుడని నిందించెదమనియు, నట్లు నింధించుట మిక్కిలి యజ్ఞానమనియు, దత్వము విచారించి యెడల నీ కీడు మన మేలేయని తోచుననియు సుజ్ఞులు చెప్పెదరు. ప్రస్తుత మీ గ్రంథరచనకుగల్గిన కారణమువలన నీసంగతి నిజమని తేలుచున్నది." అని యీ విజ్ఞానవతి వ్రాసియున్నది. ఈ యబలా సచ్చరిత్ర రత్నమాలయొక్క మొదటిభాగము 1901 సం||లో బూర్తిగా బ్రకటింపబడియెను. ఈ రత్నమాల ఐతిహాసిక కాలములోని యుత్తమ స్త్రీల చరిత్రములతో మొదటిభాగమును, వైదిక, పౌరాణిక, బౌద్ధ స్త్రీల చారిత్రములతో రెండవభాగమును, ఇంగ్లాండు మొదలగు పరదేశములలోని స్త్రీల చరిత్రలతో మూడవభాగమును, ఇట్లు మూడు భాగములుగా నచ్చమాంబగారు వ్రాయదలచిరి. మొదటి భాగము ముగియగనే రెండవభాగము వ్రాయ మొదలు పెట్టిరి. కాని, యే గ్రంథము వ్రాసినను బూర్తిగా సంగతులు గనుగొని వ్రాయవలయుననియు, వ్రాసిన సంగతులు విశ్వాసార్హములుగా నుండ వలయుననియు నీమె యుద్దేశము. కావున, నీమెయే వేదవాక్యము నుదహరించినను, ఏ పురాణశ్లోకము నుదహరించినను, బ్రత్యక్షముగా నాయా వేదముల యందు, నాయా పురాణములయందు జూడనిది వ్రాయు దికాదు. ఒక్కొక్క వేదవాక్యము సంపాదించుట కెన్నియో నెలలు పట్టుచుండెను: ఈమె 1903 సం||న బుణ్యక్షేత్రాదుల సేవించుటకును, దన సఖుల దర్శించుటకును గృష్ణా, గోదావరీ మండలములు మున్నగు తావులకు వెడలినప్పుడు, కాశీ క్షేత్రములో బ్రత్యేకముగా గొన్నినాళ్లు నిలచి, వేదకాలపుస్త్రీలను గురించి కొందరు శాస్త్రులతో ముచ్చటించి, కొన్ని సంగతులను దెలిసికొనెను. తానుదహరింప దలచుకొని, మంత్రముల నిజానిజముల గనుగొనుటకు ఋగ్వేదసంహిత దొర, కక కొంతకాలము వేచియుండి, తుద కెంతయు గర్చుపెట్టి హైదరాబాదు నుండి ఋక్ సంహిత బదులు తెప్పించుకొనెను. అదియుగాక రెండు సంవత్సరములలో నీమెభర్తకు ఆరుతావులకు మార్పు గలిగినందున నీమెకు సావకాశము దొరకకుండెను. ఇట్టి కారణములచే నీ భాగము నెమ్మదిగా వ్రాయ దటస్థించి మొదటిభాగమునకు దీనికి నాల్గేండ్లు వ్యవధియయ్యను. ఇట్లు శ్రమపడి సోదరీలోకమున కమూల్యభూషణంబుగా నీ గ్రంథరాజమును సమకూర్చుచుండ, నదియైనను బూర్తిగానీక యింతలో నీదేశముయొక్క దౌర్భాగ్యదేవత మృత్యుదేవతాకారమున, దనకు గన్నెర్రగా దేజరిల్లుచున్న యీ నారీమణిని మ్రింగివేసెను. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' రెండవభాగము వైదిక స్త్రీల చరిత్రములును, పౌరాణిక స్త్రీలలో ద్రౌపది, సీత ఈ రెండు చరిత్రలును మాత్రము ముగిసినవి. ఈ సతీరత్నము తానీలోకమునకు గొప్ప యాపదను సంఘటించి పరలోకము, కేగునప్పు డసంపూర్తిగా నుంచిపోయిన గ్రంథములు, ఇపుడు సావిత్రి యందు బ్రకటింపబడుచున్న "అబలాసచ్చరిత్ర రత్నమాల" రెండవభాగముగాక మరి రెండుగలవు. 1. క్రోషాఅల్లిక. 2. ఊలు అల్లిక, మొదటిది హిందూసుందరీపత్రిక కొరకును, రెండవది సరస్వతీ పత్రికకును వ్రాయబడుచుండెను. ఈ గ్రంథము లారంభించుటకు బూర్వమందువ్రాసెనో పరమందు వ్రాసెనో గాని యీమె రచించినది వేరొక శతకంబుగూడ నున్నది. ఈమె గ్రంథరచనయందు బద్యరచన యిదియొక్కటియే కానబడుచున్నది. సోదరీమణుల యుపయోగార్థము ప్రకటింపబడుచుండెడి పత్రికలకీమె నీతి దాయకములు, నాహ్లాదకరములునగు ననేకాంశములను వ్రాయుచుండెడిది.

ఈమెకుగల స్వజాత్యభిమానము చెప్పశక్యము కానిది. ఈమె తన జాతిపైనిష్కారణముగా ద్వేష్టలగువారు మోపెడినిందలను గూకటివేళ్ళతో బెల్లగించి, స్త్రీ జాతికిగల సహజ సద్గుణవితానమును సోదాహరణముగా బ్రతిపాదింప గంకణము గట్టుకొనెను. ఈ ప్రతిజ్ఞ 'అబలాసచ్చరిత్ర రత్నమాలా' రచనారూపముగా నెరవేర్చుకొనెను. అబలాసచ్చరిత్ర రత్నమాల రచించు టకు దనకుగల ముఖ్యోద్దేశములను దద్గ్రంధముయొక్క యుపోద్ఘాతములో నీమె మూడుభాగములుగా విభజించి వ్రాసినది. వానిని సంగ్రహముగా నిట బేర్కొనియెద. 1. సామాన్యముగా స్త్రీలకు మందబుద్ధి, సహజభీరుత్వము మున్నగు నీచగుణముల నారోపించెడివారి యారోపణములు పక్షపాత జన్యములనియు, స్త్రీలు గాంభీర్యము, సూక్ష్మబద్ధ మున్ను గాగల సుగుణములను సహజముగా గలవారనియు నుదాహరణ పూర్వకముగా స్థాపించుట. 2. స్త్రీలు చదువుకొనుటవలన ననేకదుర్గుణములను బొందుదురనెడివారి వాదము శశవిషాణ న్యాయమును బోలుననియు, స్త్రీలు విద్యావతులైన యెడల ననేకములగు లాభములను బొందుటయే యప్రతిహతమైన సత్యమనియు రూడిపరచుట. 3. తన సోదరీలోకమునకు సుబోధకమును సన్మార్గబోధకమును జ్ఞానగాయకంబునుగా నేదేని యొక గ్రంథమును రచించి యొసగుట. ఇంత స్వజాత్యాభిమాన మీమె హృద్వీధిని బ్రవహించుచున్నది. గనుకనే తారచించిన రత్నమాలలో నవకాశము చిక్కినపు డెల్ల దన స్వజాతిపై మోపబడిన నిందలను దన సహజ క్షమను వదలి శూరరీతిని ఖండించు వచ్చినది. ఇట్టి స్వజాత్యభిమాన మాననీయ నింతలో దైవము గొని పోవుటకీ స్త్రీలోక మెంత మందభాగ్యము కలదో కదా!

రెండుపన్యాసములు, నొక యల్లమ్మకధ, యొక పుల్లమ్మకధ చదువుపాటి వారైనంతనే పెద్దవారందరు నేమియు దెలియని మూర్ఖపిశాచులనియు నితరులందరు దమపాటివారు కారనియు విర్రవీగెడు నిప్పటి కొందరివలెగాక యీ సాధ్వి తల్లిగారు మొదలైన పెద్దలకును దోడివారలకును నెప్పుడు గడు గూర్చుచుండెడిది. వీరి కుటుంబము పూజానీయమగు నార్యమతము నందత్యంతాభిమానముకలది. అచ్చమాంబగా తీరిక సమయములందు బూజనీయములగు భారత, భాగవత, రామాయణాది గ్రంథములును, విజ్ఞానప్రదంబులగు తత్వసంబంధములగు గ్రంథములును శ్రద్ధగా జదివి తల్లి మొదలైన పెద్దలకు జెప్పుచుండెడిది. అచ్చమాంబగారు తన ప్రాణమునకంటె నధికముగా జూచు కొనుచున్న తన సవతికూతురు దైవవశమున భర్తను కోలుపోగా నామెకు దత్పరతతో బావన బ్రహ్మచర్యమును బోధించి జ్ఞానాభివృద్ధియు విద్యాభివృద్ధియు జక్కగ గలుగ జేసినది. ఈమె 1908 సం|| కుటుంబ సహితముగ దేశాటనము చేసినపు డాయాతావుల యందలి సోదరీమణులకు నైకమత్యము, సత్కాలక్షేపముచే దోడిసోదరీతతిని బాగుచేసి తాము బాగుపడెడి విధానము మున్నగు ధర్మములను బోధించుచు వచ్చినది.

ఎట్టివిపరీతపు స్వభావము కలవారినైను ధన సౌజన్యముచే దన కనుకూలముగా ద్రిప్పుకొను చాతుర్యమీమెకు జక్కగ సాధ్యమైయుండెను. ఇందుకు గొప్పయుదాహరణ మీమె భర్తయే. ఆయన తొలుత మిక్కిలి కోపమును, స్త్రీలను గారాగృహమువంటి ఘోషాలోనుంచిన గాని పాతివ్రత్య రక్షణము జరుగనేరదను రూహను కలిగియుండెడివారు. ఆయన యిచ్చ ననుసరించి యీ సాధ్వి మొట్టమొదట కారాగృహమువంటి ఘోషా ననుభవించి, తన సౌజన్యమువలనను, అనుపమేయ ప్రవర్తన చాతుర్యమువలనను బతిని శాంతస్వభావునిజేసి స్త్రీలకు విద్యయు, నుచిత స్వాతంత్ర్యమును సామాజోద్ధారణకు మూలాధారములని యాయనకు దోచునట్లు చేసెను.

ఈమె పాతివ్రత్యానుష్ఠానము వర్ణనాతీతము. ఈమె జగత్పూజ్యము గా రచించిన 'అబలా సచ్చరిత్ర రత్నమాల' యందలి పతివ్రతా మణులగు వీరమతి, మీరాబాయి, కొమర్రాజు జోగమాంబ మున్నగువారి చరిత్రముల వ్రాయుచో వారి యుత్కృష్ట పాతివ్రత్యభావములు వర్ణించునప్పుడీమె యుత్సాహము మూర్తీభవించి ఆయాస్థలముల యందు దాండవకేళి సల్పుచున్నట్లుండును. ఒక్క కాగితమైనను సరిగానిండని కొమర్రాజు జోగమాంబగారి చరిత్ర యొక్క పాతివ్రత్య విషయముకొరకే తన రత్నమాల యందు జేర్చి యీసతి దన పాతివ్రత్యాభిమానము నగపరిచినది. ఈ యమ 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గన్న వారికి దానియందలి యంకిత యామెసతీత్వవిశేషముల జెప్పకయే చెప్పుచుండును. ఈసతి సద్గుణసమితి యందలి మాకుగల యభిమానముచే వాని నిచట మరల బ్రచురించుచున్నాము. "ఎవరి పరిపూర్ణ కటాక్షంబుచే నాకీ గ్రంథము వ్రాయునంతటి శక్తియు, స్వాతంత్ర్యంబును గలిగనో, నా శరీరము నందలి చర్మంబుచే బాదరక్షల నిర్మించి జన్మజన్మంబునందు బాదంబులకు దొడిగినను నెవరిఋణంబుదీరి నేను ఋణవిముక్తురాలనగుట యసంభవమో, యెవరు నాకు దేవాధిదేవునికంటే నధికతముడైన దేవుండో, యట్టి నా ప్రియభర్తయగు మ|| రా|| శ్రీ|| భండారు మాధవరావు గారి దివ్యపాద పద్మములకు నీ గ్రంథము సమర్పించి యంకితం బొనర్చుచుచున్న దానను." అని పాలిత సతీ ధర్మయైన యీ ధన్య యమృతరసముతో నిట్లు వ్రాసియున్నది. ఈ విషయములలో నీ సాధ్వి వ్రాసిన వ్రాత కాక, ప్రత్యక్షాదరణములుగూడ నా పుణ్యవశమున నాకుగూడ లభించెను. ఈమె భర్తృ పుత్రికాసహితై మాగృహంబున నొక సమయమున గొన్ని దినంబులుండి ననుధన్యను గావించినది. ఈసతి మా ఇంటనున్న సుదినంబులలో నొకదినంబున మధ్యాహ్న మందరమును భోజనములు చేసి వాకిట గూర్చుంటిమి. ఆనాడెప్పటి యట్టు నేనీ సఖీమణియొద్ద గూర్చుండి తాంబూలము గైకొనగోరుచు వక్కలామె చేతనిడి యాకులు మడిచి యిచ్చుచుంటిని. ఇట్లు నేనిచ్చు వక్కలును, ఆకుమడుపులుగూడ కైకొని చేయి నింపుచుండెనేకాని యచ్చటివారందరు దాంబూలములను గైకొనుట పూర్తియైనను తానుమాత్ర మట్టెయుండెను. అదికని తాంబూలము గైకొనుడని నేనొకటి రెండుసారు లడీగితిని కాని, అట్లె గైకొందునని నాకు నెమ్మదిగా నుత్తరువు సెప్పుచు నేను మరియొకసారి యడిగినపుడు చిన్ని--వు గైకొనుచు నూరకుండెను. అప్పటి మా యిరువురి స్థితిని జూచుచు మాయొద్ద గూర్చున్న మీనాక్షమ్మగారు (అచ్చమాంబగారి సవతికూతురు) మేము గూర్చున్న వాకిలి తలుపించుక దీసి మగవారు కూర్చుండి మాటలాడుచున్న వాకిలివంక జూచివచ్చి మా తండ్రిగారింకయు దాంబూలము వేసికొనలేదు. వారు వేసికొనినగాని యామె వేసికొనదని చెప్పెను. అందుకు ముందే మగవారు తమ భోజనములు కాగానే తాంబూలపు పళ్లెరము గైకొనినవారైనప్పటికిని అచ్చమాంబ గారి భర్తగారు నాడు జరుగుచున్న ప్రసంగావసరములో దాంబూలమును స్వీకరింపకట్లాలస్యము చేసిరి. పతిభక్తి తత్పరయగు నా సాధ్వీమతల్లి యా సంగతి గ్రహించుటచే నట్లొనరించెను. సర్వకాల సర్వావస్థలయందును దేవాధి దేవునిగా నిట్లీసతి పతిని సేవించుట నేను కొన్ని నాళ్ళవరకు గన్నులార గాంచుచు బూర్వ సతీమతల్లులగు సీతాంగనాదుల గాంచుచున్నట్లానంద నీరధి నోలలాడితిని. ఈ యుత్తమ సతివలన బతివ్రతాధర్మము లిట్లు నియతిగా బాలింపబడినవి. పరపురుషులున్న తావునుండి దూరముగా దొలగిపోవుటయే కాని, తనకేదియైన నవసరమున్నను నటనించుక సేపైనను నీ సతి నిలుచునది కాదు. తగినంతపని వచ్చినయెడల దలవంచుకొని సోదరులతో భాషించునట్లు సంగ్రహముగా భాషించి వెడలిపోవుచుండెడిది. ఆహా! యిట్టి నారీరత్నములే కదా ఆర్య స్త్రీ సంతతిలోని వారమను గౌరవబిరుదమును మన స్త్రీలోకమునకు నిల్పువారు!

ఈమె యందు స్వదేశప్రీతి మెండుగా వాసము చేయుచుండెను. ఈ గుణమింత జాజ్వల్యముగా బహు కొలది పురుషులలో నుండును. స్వదేశ వేషభాషలను మాని పరదేశ వేషభాషల నాదరించువారీ నారీమణికి హృదయ శల్యములవలె దోచుచుందురు. చదువుకొని కొలది స్వదేశాభిమాన మధిక మగుచుండవలెనని యీమె తన చెలులకు శ్రద్ధతో బోధించుచుండెడిది. ఈయరు తన "అబలా సచ్చతిత్ర రత్నమాల" లో నొక విదుష్టీచారిత్రమును వ్రాయుచు నా చరిత్ర నాయికకుగల స్వదేశప్రీతి నిట్లు కొనియాడియున్నది. "కొందరు పురుషులు గాని, స్త్రీలుగాని తమ దేశమును వదలి పరదేశమున కేగిన పిదప దమ దేశాచారముల విడచి యా దేశాచారములనే స్వీకరింతురు. కాని మా చరిత్రనాయిక యట్లుగాక పాతాళలోకమున కరిగియు దన దేశాచారములను మరువక యా దేశపువారికిని వానిని నేర్పెను! ఆమె తన స్నేహితురాండ్రకును, కార్పెంటరు నింటివారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలు వేసి చీరలు కట్టింపుచుండెను! తాను న్యూజరసీ పట్టణమున కేగుటకు ముందు తన స్నేహితురాండ్ర కందరకును మహారాష్ట్ర పద్ధతి ననుసరించి విందు చేసెను. ఆ దిన మామె తానే తనదేశపు పక్వాన్నములువండి భోజనములకు గూర్చుండుటకు బీటలు వేసి, తినుటకు విస్తరులును దొప్పలును గుట్టి మహారాష్ట్ర దేశాచార ప్రకారము సకల పదార్థములును వడ్డించి విందారగింప వచ్చిన యువతులకు మహారాష్ట్ర స్త్రీలవలె జీరలు, గాజులు, గుంకుము మొదలైన వలంకరించి చేతితో భోజనముచేయు విధమంతయు వారికి దెల్పి తానును వారితో గూర్చుండి భోజనము చేసెను."

చూచితిరా యీమె స్వదేశాభిమానము! ఈ స్వదేశభక్తిపరాయణ యొకచో శ్రీమతి కొటికలపూడి సీతమ్మగారి 'లేడీ జేన్‌గ్రే' యను గ్రంథమును గూర్చి "ఈ కవయిత్రి హిందూదేశము నందలి నారీరత్నములలో నొక స్త్రీని గావ్యనాయికగా దీసికొని, కావ్యము రచించిన యెడల నది హిందువులకు విశేష ప్రియమగునని నా యభిప్రాయము" అని వ్రాసియున్నది. ఈమె స్వదేశములో జేసిన వస్తువులనే గాని, సాధ్యమైనంతవరకు బరదేశములో జేసిన వస్తువులను వాడుకొనగూడదని యిటీవల వ్రతముధరించెను. ఈ వ్రతము నీమె దినదినమును దృడముగా బాలించుచుండెను. తన కట్టకడపటి వ్యాధిలో గాళ్లకు ఉన్ని మేజోళ్లను దొడగవలసినదని డాక్టర్లుచెప్పగా, బజారునుండి మేజోళ్లు తెప్పించిరి. అంతవ్యాధిలో గూడ నా నారీమణి యా మేజోళ్లమీది గుర్తులు చూచి "ఛీ యివి స్వదేశములో జేసినవి కావు" అని వానిని బారవైచి, స్వదేశములో జేసినవాని నపుడు తెప్పించి తొడుగుకొనెను. ఆహా! ఏమి యీ స్వదేశాభిమానము! ఇట్టి స్వదేశాభిమాన మా నీయను గోల్పోయిన మనదేశముయొక్క దౌర్భాగ్య మింతయని చెప్పదరమైనదా!

బీదల దు:ఖమును జూచినంత తనకు దు:ఖమగుట యీమె నైసర్గిక గుణము. సాధ్యమైనంతవరకు దన ధనము బీదలకుపయోగపరచుట ఈమెకువెన్నతో బెట్టిన గుణముగా జదువరు లింతకు మున్నే యెరుగుదురు. అయి నను సర్వజనానుకరణీయమై యీ మెకుగల యీ గుణము యొక్క ప్రచారము నిచట మరి కొంచెము వివరించెదను; తరుచుగా ననేక పర్యాయములు రొట్టెలును, పప్పును వండించి గ్రామములోని బీదలకు, అనాథలకు దన యెదుట భోజనము పెట్టించి వాండ్లు తిని సంతసించుట జూచి తాను సంతసించు చుండెడిది. తనకు గుమారుడు పుట్టినపు డితరవిధములగు నుత్సవములు మొదలైనవానికై ధనము వ్యయము చేయక, యది కరువుకాల మైనందున నాధనమంతయు నసంఖ్యాకులగు బీదలకు, ననాథులకు గొన్ని దినములవరకు నన్నము పెట్టించుటయందు వ్యయపరచెను. తన్నాశ్రయించుకొని యున్న బీదవాండ్ల కన్యకలను దాను స్వయముగా సంబంధములు విచారించి తన ధనమును పెట్టి ధర్మ వివాహములను చేయుచు నా వియ్యాలవారు పెట్టెడి బాధలన్నిటికి దా దలయొగ్గి యనుభవించు చుండెడిది. ఈమె కడుపునబుట్టిన సంతానము లేక పోయినను, యీమె యింట నెల్లప్పు డైదారుగ్గురు పిల్లవాండ్రకు విద్యాదానము దొరుకుచుండెడిది. ఈ పిల్లల నందరి నెల్లవిధముల గడుపున బుట్టినవారి వలెనే చూచుచున్నందున దెలియనివా రా పిల్లలందరు నామె సంతానమనియే భావించుచుండిరి. అట్టి పిల్లలలో గొంద రామె బంధువులును, మరికొందరు పరాయివారునుగా నున్నను, వారిని, వీరిని నొక్క కంట గాంచి యాదరించు చుండెడిది. వారి కెన్ని యంగీలో వీరి కన్ని యంగీలు, వారి కెన్ని టోపీలో, వీరి కన్ని టోపీలు! "అయం నిజ: పరోవేతి గణనా లఘు చేతసాం | ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం ||" అనిన మాట యీమె యెడలనే సార్థకమైనది. ఒకసారి యొక యూరినుండి మరియొక యూరి కీమె భర్తగారికి బదిలియై పోవుచు, మార్గస్థుల కొర కేర్పడిన యొక సత్రమున విడిసిరి. ఆ సత్రమును గని పెట్టుకొని యుండు కూలి వాని గుడిసె యచ్చటకు గొంత దూరమున నుండెను. అచ్చట నెవతియో యాడుది దు:ఖపడుచున్నటుల శబ్దము విని, యచ్చమాంబగారా గుడిసెకు స్వయముగా వెళ్లి, వాండ్ల కష్టములను విచారించి యా స్త్రీకి నీళ్లాట ప్రొద్దులైనందున ఖర్చునకు గొంత సొమ్మిచ్చి వారి నోదార్చెను. అదియునుగాక యాకూలివాని జీతము హెచ్చుచేయుటకై తన పెనిమిటి ద్వారా యత్నముచేసి, వానిజీతముకొంత హెచ్చునటుల జేసెను. ఇటీవల కొంతకాలమునుండి బిలాస్ పూరులో ప్లేగు ఉన్నందున నూరుబైట గుడారములు వేసికొని కాపురము చేయుచుండిరి. డిశంబరు నెలలో వీరు కాంగ్రెస్ నిమిత్తమై బొంబాయివెళ్లుటకు సిద్ధముచేసికొని బయలుదేరబోగా, నొక సేవకునిభార్య నిండుప్రొద్దులదియైనందున నొప్పులు పడజొచ్చెను. అపుడు ప్రయాణమాపి యచ్చమాంబగారు దానికి స్వయముగా మంత్రిసానితనముచేసి పురుడు పోసెను. పిల్లకు బొడ్డుకోసి నీళ్లుపోయించి యప్పుడు ఉన్ని అంగీలు అల్లి, తొడిగించి తల్లికి గావలసిన మందులు వగైరాలు సిద్ధముచేసి, పదిరోజులకు సరిపడు సామానులు వాండ్ల కమర్చి, రెండవరోజున బయలుదేరి బొంబాయి వెళ్లిరి. బొంబాయినుండి తిరిగి వచ్చిన తరువాత నీ గుడారములోనే యచ్చమాంబ గారు కీర్తిశేషులైరి. 1898 వ, సంవత్సరము కరువులో నీమెభర్త గారు క్షామశాల (ఫ్యామిన్ క్యాంపు) పై నధికారిగా నుండిరి. అక్కడ నొకానొక తల్లిదండ్రులు నిర్దయులై రెండు నెలలు తనకుమారుని విడిచివెళ్లిరి. ఆపిల్లవానిని బెంచువారెవరును లేనందున మిషనరీల కిచ్చివేయవలయునని యధికారులు నిర్ణయింపగా, దీనావనయగు అచ్చమాంబగారా సమాచారమువిని యాపిల్లవానిని దా బెంచదననియు బరధర్మకుల కియ్యనక్కరలేదనియు నధికారులకు దెలిపి, యాపిల్లనిదెచ్చి యెంతయు వాత్సల్యముతో బెంచుచుండెను. అ కరువులోనే యిక నొక 10 యేడుల పిల్లవాడు వాని యనాధయగు తల్లియు జెల్లెలు నుత్తర దేశమునుండివచ్చి బిచ్చ మెత్తుకొనుచు జీవించు చుండిరి. దీన బాంధవియగు నచ్చమాంబగారు ఆ పిల్లవాని తెల్విచూచి వానిని బిచ్చ మెత్తు కొనవలదని చెప్పి, యింటనుంచుకొని యన్ని వ్యయప్రయాసములకోర్చి విద్య నేర్పెను. వాని తల్లి కొక యావును గొనియిచ్చి దీని పాలమ్ముకొని జీవనము చేయుమని త్రోవచూపెను. ఆహా! ఏమి యీ దీనదయాళుత్వము! దీన జనులకును, అనాధులకును దల్లి పోయినదే! 1904 డిశంబరు నెలలో బొంబాయికివెళ్ళి యచ్చటి ఎగ్‌జిబిషన్, మహిళాపరిషదము, మున్నగు వన్నియు వీక్షించి, 1 వ జనవరి నటనుండి బయలుదేరి బిలాస్‌పురము వచ్చి యా నెల 8 వ తేదీ మొదలు 18 వ తేదీ వరకు నఖండమైన జ్వరముచే బీడింపబడి, యీ యద్వితీయ సాధ్వీమణి 18 తేదీ పగలు 11 గంటలకు బుద్బుదస్రాయమైన ప్రకృతి దేహమును జాలించి, శాశ్వత కీర్తికాయమును బొందినది. ఈ సతి యీ లోకమును విడచునప్పుడు, నీవు చదివిన వేదాంతము నుపయోగపరచుకొని దు:ఖము వడచి వేయుము అని తల్లిగారికిని, దగురీతి నితరులకు బోధించి, తన ప్రాణ సమానుడగు సోదరుని బిలిచి తానుబెంచుచున్న పసివాడగు దీనబాలునికి విద్యాబుద్ధులు చెప్పించుటకు శ్రద్ధవహింపుమని చెప్పెను. ఈమె వియోగ దు:ఖమగ్నులగు నీమె భర్త, తల్లి, సోదరుడు మున్నగువారి కందరకు నీమె మృతజీవయను విషయ మనుక్షణము జ్ఞప్తికి దెచ్చుచు దు:ఖోపశమనము మనశ్శాంతియు భగవంతుడు కటాక్షించు గాక!

ఉ. హా! వరవర్ణినీప్రముఖ! హా విదుషీ మణి!!హా!సపూజ్య!!హా!
   పావనీ!!!జీవయాత్రగడుపంగల పద్ధతి నీ స్వజాతికిన్
   గైవశమాదరించుపనికై ధరియించినయట్టి కాయమున్
   బోవిడి కీర్తికాయమును బొందితె! నీ పనిదీరెనేకటా!!!

తే. సాధ్వి! యార్యోక్తులను శిరసావహించు
   నీగుణాతిశయత "సుకృతీగతాయు"
   వనెడు నార్యోక్తిసార్థకంబును నొనర్చి
   ధరబ్రదర్శింప నిట్టుల దలచితమ్మ!

సీ. నీదుపాతివ్రత్య నిష్ఠాఫలంబు నీ నయదైవతారాధనాఫలంబు
   అతివ! నీపుణ్యతీర్థాటనాఫలము నీయఖిలసద్ధర్మక్రియాఫలంబు
   కతన దివ్యము సతీకాంక్షితంబునునైన పుణ్యాంగ నామృతి బొందగల్గి
   శ్రీమన్మహాశాంకరీ సన్నిధానంబు గాంచిన ధన్యవీవంచునిన్ను

   గూర్చి యీరీతి విలపింప గూడదంచు
   బెద్దలెన్నెన్ని భంగుల బుద్ధితెల్పి
   యనునయించిన నీవియోగార్ణవంబు
   నీద శక్యంబె? మాబోంట్ల కేది తెరవు!!!

మ. తతచేలాంచలమున్ శరీరలతనంతన్ గప్పికొంచున్ బ్రస
    న్నతచే గుంకుముబొట్టుచే దనరి గన్నన్ బూజ్యపూర్వాంగనా
    ప్రతతిన్ జ్ఞప్తికిదెచ్చు నెమ్మొగము నొప్పన్ సుంతపై కెత్తి నీ
    వతివాత్సల్యముతోడ మమ్ముగనుచున్నట్లే సదాతోచెడిన్
    మృతజీవావళి జేరితే యకట!! మమ్మీయాపదన్ ద్రోచితే!

మ. అకటా!!!దైవమ! నీకు నేగతిని జేయాడెన్ సతీలోక నా
    యికా రత్నంబును ద్రుంచివేయ గట! నిన్నేమందు మాదేశపున్
    సుకృతం బాగతినుండె! దేవ! కరుణాస్తోకా! యజస్రంబు న
    య్యకలం కాత్మకు నాత్మసౌఖ్యమిడవే యధ్యాత్మ తేజోనిధీ!

   "అరక్షితా గృహే రుద్ధా పురుషై రాప్తకారిభి:
   ఆత్మాన మాత్మానా యాస్తు రక్షేయుస్తా స్సురక్షితా:

"ఆప్తులైన పురుషులచే గృహమున నిర్బంధింపబడు స్త్రీలు రక్షితు రాండ్రు కారు; ఏ స్త్రీలు, తమ యాత్మను తామే కాపాడుకొందురో, వారే సురక్షితురాండ్రు."