అబలా సచ్చరిత్ర రత్నమాల/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

అబలాసచ్చరిత్ర రత్నమాల అనుపేరిట ఉదాత్తములైన స్త్రీలచరిత్రములు వ్రాయదలచినాను. ఈ చరిత్రములు వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము లే వనగా:-

(1) స్త్రీలు అబల లనియు, బుద్ధిహీన లనియు, వివేక శూన్య లనియు, సకల దుర్గుణములకు నివాసస్థల మనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన యీ దోషారోపణము లన్నియు నబద్ధము లనియు, స్త్రీలలో నత్యంత శౌర్య ధైర్యవతులును, అసామాన్యవిద్యావిభూషితలును, జ్ఞానవతులును, రాజ్యకార్యధురంతరత్వము గలవారును, స్వదేశాభి మానినులును, సకలసద్గుణవిభూషితలును, బూర్వముండిరనియు నిప్పు డున్నవా రనియు స్థాపించుట నామొదటి యుద్దేశము. ఇంతియకాదు. స్త్రీలయొక్క స్వాభావిక ప్రవృత్తి సద్గుణముల వైపున కేకాని దుర్గుణముల వైపునకు గాదనియు, సిద్ధాంతీకరించుట నాప్రథమోద్దేశములలోని యుద్దేశమే.

(2) స్త్రీలకు విద్య నేర్పినయెడలను, వారికి స్వాతంత్ర్య మొసగినయెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెద రనియు, గుటుంబసౌఖ్యమును నాశము చేసెద రనియు, గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈయారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూల మగునేకాని దురాచారప్రవృత్త్యనుకూలము గానేరదనియు, స్త్రీవిద్యాస్వాతంత్ర్యముల వలన మన దేశమునకు లాభమే, గాని నష్టము గలుగ నేరదనియు, స్త్రీవిద్య యత్యంతావశ్యకం,బనియు, సోదాహరణ పూర్వకముగా నిరూపించుట నాద్వితీయోద్దేశము.

(3) ఆంథ్రదేశములోని భగినీగణములకు మనోరంజకముగను, ఉపదేశకరముగను ఉండుపుస్తకము నొక దానిని రచించుట నాతృతీయోద్దేశము. యుపదేశ గ్రంథములవలనను, కేవల కల్పనాకథలవలనను జేసినయుపదేశమున కంటె నిజమైన చరిత్రంబుల వలన జేసిన యుపదేశము అధిక ఫలప్రదంబగునని యందరికి దెలిసిన విషయమే. కాన, నిజములైన యీ స్త్రీల చరిత్రముల వలన నాంధ్రసోదరీమణులకు బాతివ్రత్యము, స్వదేశాభిమానము, స్త్రీవిద్య మొదలయినవాని గురించి కొంత విన్నవించు కొనవలయు నని నామూలోద్దేశము.

నేను వ్రాసెడి యీచరిత్రములలో ననేకములు మహారాష్ట్ర భాషనుండియు, హిందీభాషనుండియు నాంధ్రీకరింప బడును. కనుక, నీ చరిత్రములయందలి యుత్తమ భాగములకయి యాయా భాషలలోని గ్రంథకర్తలను మెచ్చవలయునేగాని నన్ను శ్లాఘింప వలసినపని యెంతమాత్రమును లేదు. ఇట్టి రత్నమాలలు మూడుగ్రుచ్చి జనులకు సమర్పింప వలయునని నే దలచితిని. అవి యేవి యనిన:-

1. అబలాసచ్చరిత్ర రత్నమాల యొక్క మొదటిభాగము:- ఇందు హిందూదేశమునందు బుట్టిన యైతిహాసిక స్త్రీల చరిత్రము లుండును. ఐతిహాసిక కాల మనగా వేయి సంవత్సరములనుండి నేటివరకు జరిగినకాలము. ఈ భాగమునందు పద్మావతి, సంయుక్త మొదలయిన ప్రాచీనస్త్రీలు మొదలుకొని, ఆనందీ బాయి మొదలయిన యర్వాచీన స్త్రీలవరకు నయిన యుత్తమ స్త్రీల చరిత్రములు రాగలవు.

2. రెండవభాగము:- ఇందువైదిక పౌరాణిక బౌద్ధ స్త్రీలయొక్క చరిత్రములు రాగలవు. వైదిక స్త్రీలనగా వేదమందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయి మొదలయిన స్త్రీలు, పౌరాణిక స్త్రీలనగా పురాణాదులలో వర్ణింపబడిన పార్వతి, సీత, తార, దమయంతి, ద్రౌపది మొదలయిన స్త్రీలు.

3. మూడవభాగము:- ఇందు ఇంగ్లండు మొదలయిన పరదేశములలోని స్త్రీలచరిత్రము లుండగలవు.

కాలమానమునుబట్టి చూడగా రెండవభాగములోని వైదిక, పౌరాణిక స్త్రీలు మొదటిభాగమునందును, మొదటి భాగమునందలి యైతిహాసిక స్త్రీలు రెండవభాగమునందును రావలసియుండును. కాని, ప్రస్తుతము రెండవభాగమువ్రాయుటకై కావలయు సాధనములు నాయొద్ద లేనందునను, ఆసాధనములు సమకూరువరకు నైతిహాసిక స్త్రీచరిత్రములను ఆపుట యోగ్యమని తోపనందునను, వైదిక, పొరాణిక స్త్రీలను రెండవభాగము నందు జేర్చెదను. ఇదియొక గొప్పదోషముగాదు గనుక చదువరులు మన్నింతురుగాక!

మొదటిభాగమునందలి చరిత్రము లన్నియు నాయొద్ద నొకసారి గూడనందున జరిత్రములు కాలక్రమముగా వ్రాయుటకు వీలుగలదు. ఏయేచరిత్రము నా కెప్పుడెప్పుడు దొరకునో యాయాచరిత్ర మప్పుడప్పుడు వ్రాయబడును. చరిత్రాధ్యయనము మనముఖ్యోద్దేశముగాని, పరీక్షలకు జదువువారివలె కాలగ్రమానుగతమైన చరిత్రములను జదువుట మన యుద్దేశము కానందున, నీ చిన్నదోషమునుగూడ చదువరులు మన్నింతురుగాక!

మొదటిభాగమునందు రాగల రాణీ భవానిగారి యొక్కయు, రాణీసువర్ణమయిగారి యొక్కయు చరిత్రములలోని కొన్నిభాగములు జనానాపత్రిక యందు బ్రచురింపబడినవి. ఆ భాగములు గూడ నిందు జేర్పబడినవని యెరుగునది.

భండారు - అచ్చమాంబ
_______