అబలా సచ్చరిత్ర రత్నమాల/చాందబీబీ

వికీసోర్స్ నుండి

చాందబీబీ

ఈ శూరవనితకు నిజామ్‌శాహిలో మూడవపురుషుడగు హుసేన్ నిజామ్‌శహ తండ్రి. ఆదిల్‌శాహిలో నాల్గవపురుషుడగు అల్లీ ఆదిల్‌శహభర్త. వీరిరువురికిని పరస్పరకలహములు కలిగియుండెను. కాని అహమ్మదనగరు బిజాపూరు, గోల కొండలకు ప్రభువులయిన తురకషహాలు కూడి విజయనగరముపై దండు వెడలుటకు నిశ్చయించుకొనిన కాలములో, అహమ్మదునగరమునకు నధిపతియయిన హుసేన్‌షహ, విజాపురమున కధిపుడయిన అల్లీషహాతో సఖ్యము చేయదలచి తన కూతురగు చాందబీబీని నతనికిచ్చి వివాహముచేసెను. తదనంతరము తేలికోటలో క్రీ.శ. 1565 వ సంవత్సరమునందీ మహమ్మదీయులకును విజయనగరాధీశ్వరుడగు రామరాజునకును యుద్ధముజరిగి విజయనగర సంస్థాన మడుగంటెనను సంగతి హిందూదేశ చరిత్రము చదివినవారి కందరకును విదితమే గాని స్త్రీ చదువరులకు నీ శాహీలసంగతి దిన్నగా దెలిసికొనినంగాని ప్రస్తుత చరితము బోధపడదు గాన వాని వివరము నిందు గొంత సంగ్రహముగా దెల్పెద.

క్రీ.శ. 1526 వ సంవత్సరమున *బ్రాహ్మణీరాజ్య ______________________________________________________________

  • డిల్లీలో గంగూయను బ్రాహ్మణుడు జఫీర్‌ఖానను తురకపిల్లవానిని బాల్యమున గొని పెంచి యింటిపని జేయుటకయి యుంచుకొనెను. పిదప నా చిన్నవాని బుద్ధివైభవము గని యాతని యజమానుడు ద్రవ్య మక్కరలేకయే యాతనిని దాస్యమునుండి విడిచెను. తదనంతర మా పిల్లవాడు దక్షిణమున రాజ్యము స్థాపించెను. అప్పు డతడు తన యజమానునియెడ గృతజ్ఞుడయి జఫీర్‌ఖాన్ గంగూ బ్రాహ్మణీ యని తన పేరు పెట్టుకొనెను. అతనిరాజ్యమే బ్రాహ్మణీరాజ్యమనం బరగెను. మను తురకరాజ్య మంత్య దశకు వచ్చెను. అప్పుడు దక్షిణమున నయిదుగురు తురుష్కులు స్వతంత్రులయిరి. వారిలో విజాపురమునందు రాజ్యము చేయువారిని 'ఆదిల్‌షహా'లనియు, గోలకొండ యందలి రాజుల వంశమును 'కుదుబ్‌షహా' లనియును, వర్హాడ(బీరారు) రాజులను 'ఇమాద్‌షహా' లనియు అహమ్మదనగర ప్రభుత్వమువారిని 'నిజామ్‌షహా'లనియు, అహమదాబాదునందలి వారిని 'బరీద్‌షహా' లనియు వాడుచుండిరి. కాని కొన్నిరోజులైన పిదప 'ఇమాద్‌శాహి' 'బరీద్‌శాహీ'లు రెండును నాశనము నొంది 'ఆదిల్‌శాహి', 'నిజామ్‌శాహి', 'కుతుబ్ శాహీ'లు మూడును మాత్రము నిలిచెను. శాహి యనగా రాజ్యమనియు, షహా యనగా రాజనియు నర్థము.

భర్త జీవితకాలమునందు చాందబీబీయొక్క చాతుర్యమంతగా దెలియకుండెను. ఈమె భర్తయగు అల్లీ మిగుల భోగముల ననుభవింపుచు రాజ్యమునం దెంతమాత్రము దృష్టి లేకుండెను. ఇట్లుండగా క్రీ.శ. 1580 వ సంవత్సరము నందొక దినమునం దాయన యజాగ్రతగానున్న సమయమునం దొక డకస్మాత్తుగా నతనిని జంపెను. తదనంతరమునం దాతని తమ్ముని కొడుకగు రెండవ యిబ్రాహీం ఆదిల్‌షహా సింహాసనారూడుడయ్యెను. ఆయన 9 సంవత్సరముల బాలు డగుట వలన నాతని పెత్తండ్రి భార్యయగు చాందబీబీయే కమీల్ ఖానను మంత్రి సహాయమువలన రాజ్యమునేలుచుండెను. కొన్నిదినములయిన వెనుక కమీల్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుట మయ్యెను. దానిం గని చాందబీబీ కీశ్వరఖానను సరదారుని సహాయముచే వాని జంపి కీశ్వరఖానునకు దివాన్‌గిరినిచ్చెను. కాని కొంతకాలమునకు వాడును కృతఘ్నుడయి రాణిమీద గొన్నిదోషముల నారోపించి యామెను సాతార కిల్లాలో కైదుచేసి యుంచెను. చాందబీబీని కైదుచేసిన పిదప కీశ్వర్‌ఖాను రాజ్యము నందంతటను విశేషసంక్షోభము చేయసాగెను. దాని నెవరును మాన్పలేక యుండగా యెకసాల్‌ఖానను సిద్దీ సరదారుడొకడు వాని నచటనుండి వెడలగొట్టి చాందబీబీని విడిపించి తెచ్చెను. తదనంతర మామె యెకసాల్‌ఖానును వజీరుగా నేర్పరచి రాజ్యము నేలుచుండెను. అప్పుడాతడు పాతనౌకరుల నందరినితీసి క్రొత్తవారిని నియమించెను. అక్కాలము నందు విజాపురమునందలి జనులు మంత్రిత్వము ఉన్‌ఉల్‌ముల్కసిద్దీ కియ్యవలెనని కొందరును, అబుల్ హసనను దక్షణీ తురక కియ్యవలెనని మరి కొందరును ఇట్లు రెండు పక్షములుగా నుండిరి.

ఇట్లు రాజ్యంబులో నంత:కలహంబులు జరుగుచుండగా మూర్తిజా, నిజామ్‌షహా కులీకుతుబ్‌షహ వీరిద్దరును అహమ్మద నగరముపైకి దండు వెడలి దానిని సమీపించిరి. అప్పుడచట బ్రజలలో బొత్తుగా నైక మత్యము లేక యుండినందున వైరులకు మిగుల ననుకూలముగా నుండెను. ఇట్టి సమయమునందు చాందబీబీ మిగుల యుక్తిగా లోకులను సమాధానపరచి అబ్దుల్ హసనునకు బ్రధానిత్వ మిచ్చి రెండు పక్షములవారిని నొకటిగాజేసి శత్రువులను మరలిపోవునట్లు చేసెను! షహాలు తమతమ నగరముల కరిగిన పిదప దిలార్‌ఖానను సిద్దీ మిక్కిలి గర్వించి అబ్దుల్‌హసనును జంపించి తానే ప్రధాని యయ్యెను. ఇట్లీ రాజ్యమున నొక సంవత్సరముపై నారు మాసములలో ముగ్గురు మంత్రులయినను నొకరును నెగ్గకుండిరి. దిలార్‌ఖాన్‌సిద్దీ మిగుల చాతుర్యవంతుడైనందున నతడు తనకు రాజ్యకాంక్ష గలిగియు దానిని వెలిపుచ్చక మిగుల జాగరూకుడయి యుండెను. ఇతడు రాజ్యవ్యవస్థను బహు చక్కగా జూచెను గాని, చాందబీబీ యచటనుండిన తనయాట లేమియు సాగవని తెలిసికొని ఇబ్రాహిమ్ ఆదిల్‌షహా చెల్లెలగు ఖుదీజాసుల్తానా యను రాజపుత్రిని మూర్తిజా నిజాంషహా కొడుకగు మిరాన్‌హుసేనున కిప్పించి క్రీ.శ. 1584 వ సంవత్సరమున ఖుదీజాసుల్తానాకు దోడు చాందబీబీని నిజామ్‌శాహీకి బంపి బాలరాజును నాశ్రయహీనుని జేసెను.

చాందబీబీ నిజామ్‌శాహీకి వచ్చినపిదప నచట నైదారు సంవత్సరములలో మూర్తిజాను జంపి యాతని కొడుకగు మిరాన్‌హుసేను, అతనిని జంపి యాతని పినతండ్రియగు బురాణ శహాయును, అతని వెనుక నాతని పుత్రుడగు ఇస్మాయెల్ షహాయును, తదనంతర మాతని తమ్ముడగు ఇబ్రాహిమ్‌నిజాం షహాయును రాజ్యము చేసిరి. ఇబ్రాహిమ్ మరణానంతరమునం దతనిపుత్రుడగు బహదుర్‌ను గారాగృహమనందుంచి మిఆన్ అను దక్షణీ తురకమంత్రి, నిజామ్‌శాహిలోనివాడని చెప్పబడు అహమ్మదను వానిని సింహాసనముపై నుంచి తానే రాజ్యము చేయ మొదలు పెట్టెను. ఈ అహమ్మదునకు రాజ్యమునిచ్చుట సిద్దీ సరదారుల కిష్టములేక బహదురునకు సమవయస్కుడగు నొక బాలుని దెచ్చి వానినే రాజ్యార్హుడని చెప్పదొడగిరి. ఇట్లు వారు రెండు పక్షముల వారయి సైన్యసహితులగుట గని మి ఆన్ మంజూ మిగుల చింతించి అక్బర్ బాదుషా కొడుకగు మురాదను నాతనికి మీరు నాకు సహాయము చేసినచో అహమ్మదనగరము మీస్వాధీనము చేయుదునని వర్తమానము నంపెను. కాని మురాద్ సైన్యసహితుడయి వచ్చులోపల అహమ్మద నగరమునం గల రెండుపక్షముల వారికిని యుద్ధము జరిగి సిద్దీలను మి ఆన్ మంజూ ఈడించెను. కాన దా ననిన ప్రకారము అహమ్మద నగరము మురాద్‌న కిచ్చుటకు సమ్మతింపడయ్యె. అంత నారాజపుత్రుడు యుద్ధసన్నద్ధు డయ్యెను. ఆసమయమున నీప్రధాని సైన్యమునంతను ఆదిల్‌షహా, కుతుబ్ షహాలను సహాయమునకు బిలువబోయెను. అత డరిగినపిదప బహదుర్ రాజ్యమని చాటించి చాందబీబీ రాజ్యమును తానే నడుపుచుండెను.

ఆ సమయమునం దిద్దరు ముగ్గురు రాజ్యము తమకే కావలయునని యనుటవలన నచటి లోకులు రెందు మూడు పక్షములుగా నుండిరి. ఇట్టిసమయమున చాందబీబీ తన దృడ నిశ్చయము విడువక, నేహంగఖానునకును శహా అల్లీ సిద్దీకిని వర్తమానములనంపి వారిని రాజధానికి బిలువనంపెను. చాందబీబీ యాజ్ఞప్రకారము వా రిరువురును వచ్చుచుండగా త్రోవలో శత్రువులు వారిని రానియ్యక నిలిపిరి. నేహంగఖాన్ మాత్రము శత్రుసైన్యము నుపాయముగా జీల్చి రాజధానిం బ్రవేశించెను. ఆదిల్‌షహా, కుతుబ్‌షహాలు మురాదునిరాక విని ప్రథమమునందు నిజామ్‌శాహీని గెలిచి పిదప మనపైకి వచ్చునని భయపడి విపులసైన్యములతో నిజామ్‌శాహీకి దోడుగా వచ్చుచుండిరి. ఈ సంగతివిని మురాద్ వారు వచ్చినచో గెలుపొందుట కష్టమని తలచి గ్రామమును చుట్టుముట్టి బురుజులను పడగొట్టి యత్నింపుచుండెను. మురాద్ సైనికులు బురుజులను బైటినుండి త్రవ్వి గూడుచేసి యాగూటిలో తుపాకిమందునుంచి దానికి నగ్నిని రవులుకొల్పి యత్నింపుచుండిరి. కాన చాతుర్య వతియగు చాందబీబీ లోపలినుండి బైటివరకు రంధ్రములు పొడిపించి వారాగూటిలోనుంచు మందు నీవలికి దీయింపు చుండెను. ఇంతలో వారొక బురుజునకు నిప్పంటించినందున నా బురుజుతో గూడ ననేక సైనికులు నాశనమునొందిరి. అంత నా త్రోవను మొగలులు పట్టణములోనికి జొరనుంకించగా నదివర కధిక శౌర్యముతో యుద్ధము చేయుచున్న నిజాము సైన్యములు ధైర్యమువిడిచి పారదొడగెను. అప్పుడు చాందబీబీ ధైర్య మవలంబించి, కవచమునుధరియుంచి మోముపై ముసుగు వేసికొని చేత ఖడ్గమును ధరియించి "నాబొందిలో ప్రాణములుండగా పట్టణము పగవారిచే జిక్కనియ్యన"ని గూలిన బురుజు వైపునకు బరుగెత్తెను. దానింగని సైనికు లధిక శౌర్య సాహసములు గలవారై మరలి శత్రువులతో బోరసాగిరి. ఆ దినమంతయు యుద్ధము జరిగెనుగాని చాందబీబీ శత్రువులను పట్టణములోనికి జొరనియ్యకుండెను. అప్పుడామె యెక్కడ జూచినను దానయై బహుశౌర్యముతో బొరాడెను. ఆ సమ యమునందలి యామె శౌర్యమునుగని శత్రుసైనికులు సహిత మాశ్చర్యపడిరని ప్రత్యక్షముగా జూచిన యతడే వర్ణించెను. అప్పుడు మురాద్ తనకు గెలుపు దొరకుట దుస్తరమని తెలిసికొని "మాకు వర్హాడప్రాంతము నిచ్చిన యెడల మేము మా దేశమునకు బోయెదమ" ని చాందబీబీకి వర్తమానమంపెను. త్వరగా రాజ్యమునందలి యితర సైనికులు వచ్చితనకు దోడుపడు లక్షణము లేమియు నగుపడనందున వర్హాడ ప్రాంతము చాందబీబీ వారికి నిచ్చి సంధి చేసుకొనెను.

తదనంతరమునం దామె బహాదుర్‌ను కారాగృహము నుండి విడిపించితెచ్చి యతనికి పట్టాభిషేకము గావించెను. అంత నామె అహమ్మదఖానను నాతని ప్రధానిగా నేర్పరచి యా పిల్లవానిపేర తాను రాజ్యము నేలుచుండెను. కాని అహమ్మద్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుటమైనందున అతడు చాందబీబీమాటను సాగనియ్యకుండెను. ఈ సంగతి సైనికులకు దెలియగా వారాతనిబట్టి బంధించి చాందబీబీ స్వాధీనముచేసిరి. తదనంతర మాతనిపని నేహంగఖానను నాతని కిచ్చినందున చాందబీబీ రాజ్యము సురక్షితముగా నేలదొడగెను. కాని త్వరలోనే నేహంగఖాను రాణికి వైరియయ్యెను. ఈ సమయముననే మురాద్ శహాపురమునందు కాలము చేసెను. అంత నగ్బరుపాదుషా తన చిన్న కొమారుడగు డానియల్ అను నాతనిని మురాద్ పనిమీదికి బంపి యతనికి వజీరుగాఖాన్‌ఖానను వానిని బంపెను. అప్పు డక్బరు బర్హాణ పురమునకు వచ్చి డానియల్‌ను క్రీ.శ. 1599 వ సంవత్సరమున అహమ్మద్ నగరము పైకి యుద్ధమున కంపెను.

ఈ సమయమునందు నిజామ్‌శాహీలో మిగుల నవ్యవస్థగా నుండెను. చాందబీబీ వంటి చాతుర్యవతి రాజ్యము చేయుచున్నను ఆసమయమునం దామెకు నచట విశ్వాసార్హులగువా రెవ్వరును లేకయుండిరి. కాన నామె ఏమియు జేయలేక యుండెను. నేహంగఖాను చాందబీబీతో నేమో యాలోచించి వైరులను త్రోవలో నాటంక బరుపబోయెను. కాని శత్రువులాత డుండుత్రోవనురాక మరియొక త్రోవను వచ్చి పట్టణమును ముట్టడించిరి. అప్పుడు చాందబీబీ తనయాజ్ఞను వినువా రెవ్వరును లేక నప్పటికి రాజధానిని విడిచి బాలరాజునుకొని జున్నురను గ్రామమునకు బోవనిశ్చయించెను. కాని యామె సమీపముననుండు హమీద్‌ఖానను వానికా యాలోచన సరిపడక చాందబీబీ పగవారికి రాజ్య మిచ్చుచున్నదని యూరంతను సాట మొదలుపెట్టెను. అది విని దక్షిణతురకలు నిజమని తలచి హామీద్‌ఖానును ముందిడుకొని కొందరు భటులు చాందబీబీ యంత:పురముజొచ్చి యామెను జంపిరి. ఇట్లు హిందూస్థానపు ఇతిహాసములో బ్రసిద్ధురాలయిన స్త్రీరత్నముయొక్క చరితము ముగిసెను. ఈమె ప్రధమమునందు విజాపురమున మరది కొమారుడగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షహా చిన్నతనమున నతనికొరకు ఆదిల్‌శాహిని రక్షించెను. పిమ్మట అహమ్మద్‌నగరమున తనతమ్ముని మనుమడగు బహుదురుకొరకు నిజామ్‌శాహీ సంరక్షణమును మిగుల కుశలతతో జేసిసార్వ భౌముడగు అగ్బరుయొక్క కుమారుని సైన్యములను దిరగగొట్టెను. కాని తుదకు రాజ్యమునం దంతటను మూర్ఖులుండుట వలన నామె యోగ్యత నెరుగక మిగుల నన్యాయముగా నామెను జంపిరి. నేటివరకునుదక్షిణమున స్త్రీల శౌర్యమును గూర్చి ప్రసంగించునప్పుడు అచటి వారు చాందబీబీయొక్క శౌర్యమునే ప్రథమమున శ్లాఘింతురు.


_______