అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/సావిత్రీబాయి ఠాణేకరీణ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సావిత్రీబాయి ఠాణేకరీణ్.

ఈశూరనారి కర్నాటకములోని బేళగాముజిల్లాయందుండు బేలవాడీయందలి భుయికోటకు నధిపతిగానుండిన యే సాజీభార్య. ఈమె శివాజీ మహారాజు సైన్యములతో యుద్ధముచేసెను.

శివాజీ యొకప్పుడు కర్ణాటకముపైకి దండువెడలెను. అప్పుడాయన తనసైన్యాధిపతియగు దాదోజి నచటిదుర్గములు గెలువ నియమించి తాను తనదేశమున నౌరంగజేబు సైన్యములను గెలుచునిమిత్త మరిగెను. దాదో తాను భుయికోటను గెలిచినచోదాని చుట్టుపట్టులనుండు దుర్గము లల్పశ్రమతోఁ దనకుఁ జిక్కఁగలవని యనుకొని ప్రధమమునందు దానిని ముట్టడించెను. కాని దానిసంరక్షకుఁడగు ఏసాజీ వారికి లోఁబడక వారితో ఘోరముగాఁ బోరెను. ఇట్లు కొంతసేపు సంగ్రామము జరిగినపిదప నేసాజీయుద్ధరంగమునంబడియె. అంత నతని సైన్యములు విచ్చలవిడిగా నలువంకలకుఁ బాఱసాగెను. భర్త యుద్ధమునఁ జచ్చుట విని యతనిపత్ని కొందఱు దాసీలతో యుద్ధభూమికి వచ్చెను. ఆమె యచటికివచ్చి గతప్రాణుఁడైనను చేతిపలుకయు, వాలునువిడువని తనపతిని గాంచెను. అప్పు డామె మనంబున శౌర్యాగ్ని ప్రజ్వలింపఁగా నామె పతివియోగదు:ఖమును మ్రింగి భర్తచేతివాలును, బలుకయుఁ దనకేల నమర్చి పతిసన్నిధిని నిలిచి తనసైనికులతో నిట్లనియె. 'ఓవీరవరులారా! స్త్రీలవలె నేల పాఱిపోయెదరు? మీరు మిగుల పరాక్రమవంతు లనియు, శత్రువులకు వెన్నియ్యని వారనియు మిగుల కీర్తిగాంచితిరి. ఆకీర్తికిదియేనా లక్షణము? మీ కధిపతియగు వాఁడిచటఁ బడియుండఁగా నతనిని శత్రువులస్వాధీనమున విడిచి చనుటయేనా శూరధర్మము ? మీతండ్రులు, తాతలు రాజభక్తులై తమప్రాణములను రాజుకొఱకు విడిచి స్వర్గమునకరిగి యుండఁగా మీరు రాజద్రోహులై నరకమునకుఁబోవ యత్నించుట యుచితమా? మీశత్రువులు మీయజమానునియొక్కయు, మీసహచరులయొక్కయు, మీబంధువులయొక్కయు మృతశరీరములకు నిర్దయులై గొడ్లనీడ్చు విధమున నీడ్చికోటక్రిందఁ బాఱవేయుదురో లేక అంత్యజులచేత వారిశరీరముల నొకపల్లములోఁ బాఱవేయింతురో, అట్లుగాక కుక్కలనక్కల కాహారముగానిచ్చి మిగిలిన యస్థిమాంసముల నరణ్యమునఁ బాఱవేయుదురో! ఇందుకైనను మీకు సిగ్గుకాదా? తిరుగుఁడు; మరలిరండు. మీచేత పరాక్రమమేమియుఁ గాకున్నను నాయొక్కయు, నాదాసీజనముయొక్కయుఁ బరాక్రమము చూచుచుండుఁడు! ఇట్టివాక్యముల నుచ్చరించి కేవలము మహిషాసురమర్దనుని యవతారమును బోలియున్న యా వీరయువతి తా నశ్వారోహణముచేసెను. వెంటనే యామె దాసీలును ఆయుధహస్తులై తమతమ గుఱ్ఱముల నెక్కిరి. దీనింగని పాఱిపోవు సైన్యములు సిగ్గుపడి మరలి సావిత్రిబాయి యాజ్ఞను మన్నించి యుద్ధముచేయుటకు సిద్ధమయ్యెను.

సావిత్రీబాయి తనసైనికుల నందఱినిఁ జేర్చి కోటను మరలఁగొన నిశ్చయించెను. ఈసంగతి దాదోజీకిఁ దెలియఁగా నతఁడధికాశ్చర్యముంబొంది స్త్రీ లిట్టిసాహసకార్యములలోనికిఁ జొరఁగూడదనియు మీజీవనమునకై శివాజీగారు చాల భూమిని మీకిచ్చెద రనియు, గాన మీరు సాహసించి మీయొక్కయు మాసైనికుల యొక్కయు ప్రాణములకుఁ దెగించకుఁ డని యతఁడు సావిత్రీబాయికి వర్తమాన మంపెను. కాని యావచనములా శూరయువతికి రుచియింపక మరల నిట్లు చెప్పిపంపెను. 'నాప్రాణముల కాధారమగు ప్రాణనాధుఁ డిదివఱకే స్వర్గమున కరిగెను. కాన నిఁక నేను నాప్రాణముల కెంతమాత్రమును భయపడను. నాపుట్టినింటివారును, చొచ్చినయింటివారును ప్రాణముల కన్న స్వకర్తవ్యమునే యధికముగా నెంచెడివారుగా నుండిరి. నాభర్త నెఱవేర్పఁదలఁచినకార్యము నతఁడు నెఱవేర్పకయే పరలోకమున కేగెను. కాననది నెఱవేర్చుట నాకర్తవ్యము. ఇందువలన మీరు వెంటనే కోటను నాస్వాధీనము చేసిపొండు. లేదా యుద్ధమునకు సిద్ధమగుఁడు. ఈరెండు వాక్యములు దప్ప మూడవవాక్యము నేనెన్నటికి నొప్పను.'

ఈమె చెప్పినమాటలు దాదోజీకి నసమ్మతములైనను విధిలేక యతఁడు సంగ్రామరంగమునకు రావలసినవాఁడాయెను. అప్పుడు సావిత్రీబాయి నాలుగైదువందలసైనికులతో వేలకొలఁది సైనికులు గలదాదోజీసైన్యములను దైన్యంబు నొందించి వారివ్యూహములను చిందరవందఱగఁ జేసి యనేకులను దనకత్తివాతంబడవేసి కొందఱిని మూర్ఛనొందించి, కొందఱిని గాయపఱచి యీనిన యాఁడుసింగమువలె నా రణరంగమున నెటు చూచినను దానెయై యందఱకును భయము పుట్టింపుచుండెను. ఇట్లామె మూడువేలసైనికులను లక్ష్యముచేయక రెండుజాముల సంగ్రామములో వారిలో ననేకులను జంపియుఁ గొందఱిని పాఱఁగొట్టియుఁ గోటాద్వారములను దెఱచెను. దీనింగని దాదోజీ మిగులదిగులొంది యింకను గొన్నివేలసైన్యమును దెచ్చి యామెను చుట్టుముట్టెను. అప్పుడును నామె ధైర్యమును విడువక శత్రుసైన్యములతోడఁ బోరి తన శౌర్యము నందఱకును విదితపఱపుచుండెను. ఆసమయమునం దామె ధైనికులుకొంచె మధైర్యపడిన ట్లగుపడఁగా వెంటనే యామె ముందుకువచ్చి తన మెడలోని హారములను దెంపి సైనికులకు బహుమానములిచ్చి వారి కుత్సాహము కలిగించెను. అందువలన వారు మిగుల శౌర్యముతోడఁ బోరి యుద్ధమునఁబడిరి. తదనంతరము దాదోజీ యేడెనిమిదివేలసైనికులతోడ నామెను ముట్టడించి యామెవెనుకకుఁ బోయి యామె గుఱ్ఱపుకాలిని నఱికెను. అందువలన నామెక్రిందికి రావలసినదాయెను. ఆమె క్రిందదిగినవెంటనే యామె కుడిచేతిని దాదోజీ నఱికెను. అంతతో నాచెయ్యి ఖడ్గముతోఁగూడ ధరణిపైఁ బడియెను. అప్పుడు చేయి పోయినందునకంటెను చేతిలోని ఖడ్గముపోయినందున కే సావిత్రీబాయి కధిక దు:ఖము కలిగెను. తదనంతర మాయన యాకిల్లాపైని శివాజీ పతాకమును నాటి విజయమునుచాటి యచటినుండి సావిత్రీబాయిని దనతోఁ దీసికొని శివాజీ కోలాపురమునం దుండఁగా నచటికివచ్చెను. అచట దాదోజీసావిత్రీ బాయి ధైర్యస్థైర్యములను, యుద్ధవిశారదత్వమును శౌర్యమును, ధృఢనిశ్చయమును మొదలగు గుణములను చాలవర్ణించెను. వానిని విని శివాజీమిగుల నాశ్చర్యమునుబొంది యామెను తనసన్నిధికిఁ దెప్పించెను. ఆమె ముఖావలోకనము చేసినతోడనే శివాజీకి మిగుల పశ్చాత్తాపము కలిగెను. అందువలన నతఁ డామె కనేక సమాధాన వచనములనుఁ జెప్పి తాను గొనిన కోటను మరల నిచ్చెదననియె. కానిసావిత్రీబాయి యామాటలను చెవిని బెట్టక 'నాకివన్నియు నక్కఱలేదు. వంశమునం దెవ్వరును లేని యపకీర్తిని నేను శౌర్యహీనతవలనఁ దెచ్చితిని. కాన నాఖడ్గమును, నాశత్రువును నాకొప్పగింపుఁడు ఇదియే నాకోరిక. ఇట్లుచేయని యెడలఁ దమ రిప్పుడేనాశిరస్సునుఛేదించి పుణ్యము కట్టుకొనుఁడు' ఇదియేగదానిజమయిన శౌర్యలక్షణము. శివాజీయామె యడిగినవాని నియ్యఁజాలక యామె నామెయింటి కంపెను కాని యావీర వనిత తనకుఁ గలిగిన యపజయమునకు సహింపక దిగులొంది రెండు మూడుమాసములకే పరలోకమున కరిగెను.