అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/వాక్పుష్టా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వాక్పుష్టా

ఈ పుణ్యశీల కాశ్మీరాధిపతిగా నుండిన తుంజీనునికిఁ బత్ని. ఈరాజు మిగుల ప్రజావాత్సల్యము గలవాఁడనియు, ధర్మాత్ముఁడనియుఁ గీర్తిఁ గాంచెను. ఆయన భార్యమిగులధర్మాత్మురాలును, ధైర్యవతియునయి యుండెను. తుంజీనుఁడు తనసతి సహాయమువలన రాజ్యము నేలుచుఁ బ్రజలను సుఖులనుజేయు చుండెను. కాని యొకానొక సమయమునం దాదేశమునందలి ప్రజలకు క్షామమువలన గొప్పయాపద సంభవించెను. అట్టిసంకటసమయమునందా సుశీలచూపినధైర్యమును స్వప్రజారక్షణమునకయి పడిన పాట్లును మిగులస్తుత్యములు.

కాశ్మీరదేశము తుంజీనుని పరిపాలనదినములలో సర్వైశ్వర్యయుతమయి యుండియచటి ప్రజలకు మిగుల సుఖకరంబై యుండె. తుంజీనుఁడును న్యాయపరిపాలనము చేయుచుఁ దనప్రజల నానందింపఁ జేయుచుండెను. ఇట్లుండఁగా నొక సంవత్సరము ఫాల్గుణమాసమునం దాదేశమునం దంతటను మంచు కురిసి కోఁతకు సిద్ధము లయిన పొలములపై నంతటను మంచు గట్టిగాఁబేరెను. అందువలన ధాన్య మంతయు నాశ మొంది యాదేశమున గొప్ప కాటకము సంభవించెను. అందువలన జనులన్నార్తులై తిరుగుచుండిరి. రాజు తనపత్ని సహాయవలన క్షుద్భాధాపీడితు లగుజనుల నాదరింపుచు, వారి కందఱకు నన్నము పెట్టింపుచుండెను. అప్పుడు వాక్పుష్టకుఁ గలదయా రసమును జూచి యచటి ప్రజలు మిగుల నారందపరవశులయి తమ దు:ఖములను మఱచిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప రాజు బొక్కస మంతయు నొడిసెను. అప్పుడు రాజు, మంత్రి మొదలగువారి సహాయమువలనఁ గొన్ని దినములు ప్రజల యాఁకలివాపి తుదకు ద్రవ్యహీనుఁడును, ధాన్య రహితుఁడునునై ప్రజలబాధలు చూచుచు నుండవలసినవాఁడాయెను. అప్పుడు రాణి తమ ప్రజలబాధలు తొలఁగుటకయి యనేకోపాయములను చేసెను. తుద కామె తననగల నన్నిఁటిని నమ్మి యాద్రవ్యముతో నితర దేశములనుండి ధాన్యము తెప్పించి యన్నార్తుల కన్నము పెట్టుచుండెను. ఆహా! యీమె యౌదార్యము నేమని కొనియాడవలయును? కాని యా స్వల్పద్రవ్యముతోఁ గొనిన ధాన్యము ప్రజల కెన్నిదినములు చాలును? ఇంతటితో నా దేశపుక్షామము వదలనందున జనులలో ననేకోపద్రపములు గలుగసాగెను. జననీజనకులు తమ పిల్లలపయి నిర్దయులైరి. భార్యాభర్త లొండొరులపైఁగల పవిత్రమగుదాంపత్యప్రేమను విడనాడిరి. సహోదరప్రేమలు రూపుమాసె అందఱును దమతమ పొట్టకూటికయి నలువంకల విచ్చలవిడిగా దిరుగ సాగిరి. అన్నాభావమువలన ననేకజనులు మృతులయిరి. వృద్ధులు, బాలురు, తరుణులు ననుభేద మిసుమంతయును లేక యందఱును యమపురమునకు విందులయి చనిరి. పోఁగా మిగిలిన యల్పజనులును చూచుట కతి వికారరూపులయి మనమున నొక విధమగు భయము పుట్టించువారయి యుండిరి. అప్పు డాకాశ్మీరదేశము కేవలము దండధరుపురమును బోలి యుండె. ఇట్టివిపద్దశయందొకరాత్రి పురజను లన్నమున కయి రాజగృహమును ముట్టడించి యాక్రందనము చేయసాగిరి. క్షామమువలనను గత్తరవలనను పీడింపఁబడిన యాదీనజనుల దురవస్థనుగని వాక్పుష్ట మిగుల చింతాక్రాంతయయి, నివారించు నుపాయము గానక సదయాంత:కరణయై తనపతి బుజముపైఁ దలవాల్చి యిష్టదేవతను ప్రార్థింపుచుండెను. ఆసమయమున దు:ఖమువలన చిత్త వ్యాకులుఁడయిన తుంజీనుఁడు తన పత్నితో 'కాంతామణి! మనము చేసిన పాపమువలన మన ప్రజల కిట్టికష్టములు సంభవించె. నాదురదృష్టమువలన ధనమంతయు వ్యయమయ్యె. ప్రజల యాఁకలి నివారించుట కెన్ని యుపాయములుచేసిన నవన్నియువృధలయ్యె; నిట్టి నరాధముఁడనగు నాజన్మము కాల్పనా? నేను బ్రతికి యుండఁగానే నా ప్రజలు చచ్చుచున్నవారు. మనముచేసిన ప్రయత్నములన్నియు నిష్ఫలములయ్యె. మనగర్భమునఁ గన్నవారివలెఁ గాపాడిన యసంఖ్యప్రజనాశ మొందెను. ఇంకను నాశ మొందనున్నది. రాజ్యమునండెటు చూచినను పతులకయి విలపించు సతులును పుత్రులకయి శోకించు జననీజనకులును, అన్నమునకయి యారాటపడు జనులును నమితముగా నగుపడుచుండెదరు. ప్రపంచమునందింత కంటెను దు:ఖకరమగు సమయము వేఱుగ నుండునా? రత్నములతోడను, సువర్ణరజతాది ద్రవ్యముతోడను ధాన్యసమృద్ధితోడను, నొప్పి సుందరముగాఁ గానుపించు నీకాశ్మీరదేశము నేఁడు శ్మశానతుల్యముగాఁ గానుపించెడిని. నలుదిక్కులనుండి విపత్సముద్రములో మునుఁగుచున్న యీ ప్రజకుఁ దరుణోపాయ మెయ్యది? ఈదుస్సహ మగు ప్రజా దు:ఖమును జూడనోప. కాన నగ్నికుండములో దుమికి ప్రాణములను విడిచి నాఖేదమును బాపుకొనియెదను. తన ప్రజలు సుఖులై రాత్రి నిద్రింపఁగాఁ జూచి సంతోషించు రాజెంత ధన్యుఁడో! ప్రాణేశ్వరి! మన కిట్టిదురవస్థ కలుగుట కెట్టిఘోరపాతకము చేసితిమో చెప్పుము.

ఇట్లువాక్రుచ్చియానరేంద్రుఁడు మూర్ఛితుఁడయి నేలం బడియెను. అంతకుముం దంతయు భర్తవాక్యములను చెవియొగ్గి వినుచున్న వాక్పుష్ట తన నాధుండు తుదివాక్యము నుచ్చరించి మూర్ఛిలుటఁ గని తాను ధైర్య మవలంబించి శైత్యోపచారముల నతనిని సేదఁదేర్చి యతనితో నిట్లనియె. "తా మింత శోకమునకుఁ జోటేల యొసంగెదరు! ఇట్టి సమయమున ధైర్యము విడుచుట యుచితమా? ఇట్టిసమయమున నదైర్యపడిన నింక తమయాధిక్య మెట్లు నిలుచును? తమ రజ్ఞానులవలె దిగులొందిన మేమిలాభము? ఇంద్రుఁడు గాని, బ్రహ్మగాని, యముఁడుగాని, మరియేదైవముగాని సత్యశీలుఁడగు రాజును జెఱుపఁ జాలఁడు. రాజు ప్రజలకు పితృతుల్యుఁడు, చావసిద్ధముగా నున్నసుతులను విడిచిపోవుట తండ్రికిఁ దగదు. పతిభక్తికలిగియుండుట సతులకర్తవ్యము. అట్లే విపన్నులగు ప్రజలను విడువకుండుట భూపాలుని కర్తవ్యంబు. ఆత్మహత్యచేసి కొనుట గొప్పపాతకములలో నొకటిగా నెన్నఁబడును. అట్టిపాతకమున కొడిఁగట్టుట మిగుల నధర్మము. ఆశాంకురము నెప్పుడును చంపఁగూడదు. ఒక్కప్రాణియైనను జీవించి యుండినంతవఱకు ప్రాణత్యాగముచేయనిశ్చయించుట యుచితముగాదు. మనము బ్రతికించుటకును మనల నాశ్రయించుట కును నిఁక నెవ్వరును లేనిసమయమున నగ్నియందు ప్రాణముల నాహుతిచేసినఁ జేయవచ్చును."

ఈవాక్యముల నుడువునప్పుడు వాక్పుష్ట శరీరమునం దొకకాంతి కలిగి మిగుల ప్రకాశించెను. అప్పు డామెకు మిగుల నుత్సాహము కలిగెను. ఆమె యేకాగ్రచిత్తముతోఁ బరమేశ్వరునిఁ బ్రార్థించి పతితో మరల "లెండి తమ రిఁక చింతింపఁ బనిలేదు. మనప్రజ లిఁక కాటకమునుండి రక్షింపఁబడియెద రని నాకుఁ దోఁచె." అనిచెప్పెను.

పరమపతివ్రత వాక్య మెప్పుడు నసత్యము కాఁజాలదనియెదరు. అట్లే పవిత్రురాలగు వాక్పుష్ట నుడువులును నసత్యములు కావయ్యె. మఱునాఁడు వేలకొలఁది పావురములు చచ్చి యాపురమునఁ బడియెను. అందువలన లోకులు వానినే తిని బ్రతికిరి. ఇతిహాసజ్ఞులగువారు స్కాట్‌లండ్ చరిత్రమునం దిట్టి యద్భుతము జరుగుట నెఱిఁగియుందురు. కాన నిది వారి కసంభవమని తోఁచకుండెడిని. రాజు తనభార్యయం దిట్టి యసామాన్యసద్గుణములు వసియించుటఁ గని యాత్మహత్య చేసికొనుట మానెను. కాశ్మీరవాసులు సుస్థిరులైరి. వాక్పుష్ట యొక్క పుణ్యచరితమువలన కాశ్మీరదేశము త్వరలోనే ధనధాన్యసమృద్ధంబై యచటఁ బ్రజలు సుఖసంపద నొప్పియుండిరి.

తుంజీనుఁడు బహుదినములు రాజ్యభోగముల ననుభవింపక ముప్పదియాఱవ యేటనే కాలధర్మము నొందెను. వాక్పుష్ట సహగమనము చేసెను.

రాణి ఔస్కువరు

ఈమె పంజాబుదేశములోని పటియాల సంస్థానమును 18 వ శతాబ్దాంతమునను 19 వ శతాబ్దారంభమునను నేలుచుండిన రాజాసాహెబు సింహునిభార్య. ఈమె తనపతి రాజ్యపాలన కర్హుఁడు కానందువలనఁ గొన్నిదినములును, అతని పిదపఁ గొమారుఁ డల్పవయస్కు డయినందువలనఁ గొన్ని దినములును పటియాల సంస్థానమును జక్కఁగా బాలించి కీర్తిఁ గాంచెను! రా జీమె సొంతవ్యయమునకై యీమెకుఁ గొంత భూమినిచ్చెను. గొప్ప రాజ్యభారమును వహింప సమర్థతగు నామె యా యల్పభూభాగముతోఁ దృప్తినొందియుండక మనమున రాజ్యమునంతను దానేల నిచ్చ గలిగియుండెను. రాజు విచారశూన్యుఁడును, రాజ్యపాలన యందసమర్థుఁడును, దుస్సాంగత్యము గలవాఁడుగాను నుండినందున సంస్థానము మిగుల హీనస్థితికివచ్చెను. రైతులు రాజును లెక్కింపక పన్నుల నెగఁగొట్టుచుండిరి. ఉద్యోగస్థులందఱు తమతమ యర్హకార్యములఁజేయక, తమపైవారిని ధిక్కరింపఁదొడఁగిరి! రాజ్య మిట్లధికదుర్దశకు వచ్చుటనెఱిఁగి రాజు తాను దానిఁ జక్కఁబఱుపలేనని తెలిసికొని తనసవతి తల్లియగు ఖేమ్‌కువరు తనకై రాజ్యముచేయునట్లు నియమింపఁ దలఁచెను. కానియామె సవతితల్లి యగుటవలన, నామె హితమును రాజుహితమును నొక్కటి కాదనియును, ఆమెచేతికి రాజ్యతంత్రము నిచ్చినచో రాజునకు