అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/విమల

వికీసోర్స్ నుండి

విమల

ఈ పతివ్రత ఘూర్జరాధిపతియగు జయశిఖరునికి సహోదరి. ఈజయశిఖరుఁడు క్రీ. శ. 695 వ సంవత్సరప్రాంతమున పంచాసర మనుపట్టణము రాజధానిగా ఘూర్జరదేశము పాలించినట్టు తెలియుచున్నది. ఆసమయమున ఘూర్జరదేశము మిగుల నున్నతదశయం దుండెను. విమల మిగుల రూపవతి యగుటయే గాక, సద్గుణవతియై యుండెను. సకల దేశముల రాజపుత్రులును తమ్మే యామె వరియింపవలెనని కోరుచుండిరి. కాని విమల యైశ్వర్యభోగములయం దిచ్ఛ లేనిదియై గుణవంతుఁడగు శౌర్యనిధిని వరియింప నిచ్ఛగలిగియుండెను.

ఇట్లుండఁగాఁ గొన్ని దినములకు ముల్తానను పట్టణము నందు రాజు భార్యాపుత్ర సహితుఁడయి ప్రభాసక్షేత్రము దర్శించుటకుఁ బోవుచుఁ ద్రోవలో నుండినందున పంచాసరమునకు వచ్చెను. అప్పుడు జయశిఖరుఁడు వారినితనకోటలోనికిఁ గొనిపోయి తగిన మర్యాదలుచేసి కొన్నిదినములు వారి నచట నుంచుకొనియెను. వారచటనుండిన దినములలో నా రాజునకుఁ బుత్రుఁడగు సురపాలునితో జయశిఖరుఁడు క్రీడాయుద్ధము చేయుచుండెను. నంత:పురకాంత లందఱును చూచుచుండిరి. అప్పుడు సురపాలుని శౌర్యసద్గుణములు విమలకుఁ దెలిసెను. అంత నొకదిన మా రాజపుత్రులు సింహమువేట కరుగుచు దానిఁ జూచుటకై విమలతోఁగూడ నంత:పురకాంతల నందఱ నరణ్య మునకుఁ దీసికొనిపోయి యచట నొకమంచముపైఁ గూర్చుండఁబెట్టిరి. అప్పు డొకసింహము జయశిఖరునిపైకి రాఁగా దానిని సురపాలుఁడు మిగుల శౌర్యముతోఁజంపెను. దానింగని నప్పటినుండియు విమల సురపాలుని శౌర్యధైర్యములకు మెచ్చి యతనిని భర్తనుగా వరియింప నిశ్చయించెను.

అటుపిమ్మట జయశిఖరుని వీడ్కొని సురపాలుని తండ్రి పత్నీ పుత్రసహితుఁ డయిపోయెను. పిదపఁ గొన్నిదినములకు సురపాలుని చెలియలగు రూపసుందరిని తనకొఱకు భార్యగా నిశ్చయించు నిమిత్తమయి జయశిఖరుఁ డొక బట్రాజును ముల్తానాకుఁబంపెను. అపుడాబట్రాజుచేతికి విమల యొకయుత్తర మిచ్చి దానిని సురపాలున కిమ్మని చెప్పెను. వాడుదానిని సురపాలున కిచ్చెను. తరువాత రూపసుందరిని వివాహమాడుటకు జయశిఖరుఁడు ముల్తానాకుఁ బోయెను. వివాహానంతరము రూపసుందరికినిఁ దోడు సురపాలునిం దీసికొని జయశిఖరుఁడు తన దేశమునకు వచ్చుచుండెను. అప్పు డాత్రోవలో లాటదేశాధీశుఁడు తనకుఁ జెల్లింపవలసినపైకము బహుసంవత్సరములనుండియుఁ జెల్లించనందున జయశిఖరుఁడు వానిపైకి సైన్యమునంపెను. ఆ సైన్యాధిపతివెంట నతనికి సహాయునిగా సురపాలునిఁ దోడిచ్చెను. లాటదేశమున వీరికిని, వారికిని గొప్పయుద్ధము జరిగి జయశిఖరుని సైన్యాధిపతి చావఁగా సురపాలుఁడు వారిని గెలిచి యారాజును దెచ్చి జయశిఖరునకు నొప్పగించెను. అప్పుడుసురపాలుని శౌర్యమునకుమెచ్చి జయశిఖరుఁ డాతనికిఁ దన సేనానాయకత్వమునిచ్చి నగరమునకువచ్చినపిదపఁ దన చెల్లెలగువిమల నాతనికిచ్చి వివాహము చేసెను. విమల వివాహానంతరము పతి యం దధిక ప్రేమ గలదియయి పతివ్రతాధర్మములను దప్పక నడుపుచుండెను.

అంతఁ గొన్నిదినములకు ఘూర్జరదేశపు ఖ్యాతినివిని [1] కళ్యాణాధిపతి దానిపైకి దాడివెడలివచ్చెను. కాని సురపాలునివంటి శౌర్యనిధి సేనాదియగుటవలన నతనిబలంబులు ధైర్యంబు లుడిగి మరల తనదేశమున కరుగవలసినవాఁ డాయెను. తన యపజయమునకు సురపాలుఁడే గారణుఁడుగాన నతనిని జయశిఖరుని సమీపమునుండి చీలఁ దీయవలయునని తలఁచి కళ్యాణరాజు "నీవు జయశిఖరుని విడిచిపోయినచో విశేష ధనమిచ్చెద" ననియు, "రాజ్యమిచ్చెద" ననియు నాసచూపి సురపాలున కొక జాబునువ్రాసెను. ఆజాబొక భృత్యుఁడు తెచ్చి విమలతోనున్న సురపాలుని కిచ్చెను. అతఁడు దానిం జదివికొని మిగుల క్రోధము గలవాఁ డయ్యెను. కాని తనపత్నినిఁ బరీక్షింప సమయ మిదియే. యని తలఁచి యామె కాసంగతిఁ దెలిసి "నీవు మిగుల వైభవముగ రాణివయిభోగముల ననుభవించెదవా! నే నీయుత్తర ప్రకారము చేసెద" నని చెప్పెను. అదివిని మిగుల తిరస్కారముగా నిట్లనియె 'నీవు సత్యవ్రతుఁడవనియు, కృతజ్ఞుఁడవనియు, ననుకొని నిన్ను వివాహమాడితినేగాని, యిట్టి కృతఘ్నుఁడవని తెలియకుంటిని. నేనిదివఱ కెన్నఁడును దుస్సాంగత్యము చేయ లేదు ముందును చేయను. మీరు మీతలఁచినట్లు చేయుదురేని మీకును నాకును ఋణ మింతటితోనే సరి. సతిపతినే దైవముగాఁ జూడవలెను. పతి దుష్కార్యము చేయుమని నపుడు పతికంటె నధికుఁడుపర మేశ్వరుఁడు గలఁడనితలఁచి యాపరమేశ్వరునకు భయపడ వలయును. కాన నేను మీతోడ దుష్కార్యమున కొడిగట్టి జగదీశ్వరుని శిక్షకు లోనుగాను." భార్య చెప్పిన నీతికిని, నామెకుఁగల ధర్మబుద్ధికిని మిక్కిలి సంతసించి సురపాలుఁ డామె నాలింగనము చేసికొని తననిజమయిన యభిప్రాయ మామెకుఁ జెప్పెను. అప్పు డాదంపతు లిరువురు నాలోచించి తిరస్కా రోక్తులతో నొకజాబును కళ్యాణరాజునకు వ్రాసిరి. జాబుతెచ్చిన దూతను శిక్షించెదనని సురపాలుఁ డనగా దూతనుశిక్షించుట ధర్మము గాదని చెప్పి విమఒల వాని నంపించెను.

సురపాలుఁ డంపిన జాబును జూచుకొని భూవరుఁడు (కళ్యాణరాజు) మిగుల క్రోధించి విశేషసైన్యములతో మరల ఘూర్జరపతితోడి రణమునకు వచ్చెను. ఈపర్యాయము కొంత యుద్ధము జరిగిన వెనుక జయశిఖరునకు జయము దొరకునను నాసతగ్గెను. కాన నాతఁడు గర్భవతిగానున్న తన భార్యను, చెలియలిని నరణ్యమునం దెచటనైనను గుప్తముగానుంచి రమ్మని సురపాలుని నంపెను. అట్లు సురపాలుఁడు వారలను కిరాతులకు స్వాధీనముచేసి వారికిఁ గొందఱు వీరభటులను సహాయమున కుంచి మరల పట్టణము వైపునకుఁ బోవుచుండెను. ఇంతలో సురపాలుఁడు లేనందున భూవరుసైన్యములు మిగుల ధైర్యముతోఁ బోరాడి జయశిఖరుని జంపి పట్టణము నాక్రమించెను. అచట సురపాలుఁడు దొరకనందున నతనిని వెదకుటకయి కొంతసైన్యముతో భూవరుని కొమారుఁడు కర్ణుఁ డనువాఁడు బయలుదేఱెను, కాని సురపాలుఁడు వేరు మార్గమునఁ బోయినందున కర్ణునకుఁ జిక్కఁడయ్యె. కర్ణుఁడు అరణ్యమున నతనిని వెదకుచుఁబోయి విమలా రూపసుందరు లున్నస్థలమునకుఁబోయెను. అల్పులగు వీరభటులను విపుల సైన్యసహితుఁ డగు కర్ణుఁడు వధియించి విమలయొక్క రూపమునకు మోహితుఁడయి యామెను బలాత్కారముగా తన శిబిరములోనికిఁ గొనితెచ్చెను. అప్పు డామె రోదనమును విని కర్ణుఁడు దప్పక యతని సైనికుల కందఱకును నామెపై మిగుల దయగలిగను. కర్ణుఁడు బలాత్కారముచేయు ననుకొని యామె ప్రాణములను విడువ నిశ్చయించెను. కాని నీసమ్మతిలేనిది నిన్ను నేను బలాత్కారము చేయనని యతఁడు పల్కఁగా నామె ప్రాణత్యాగము చేసికొనుట మానెను. కర్ణుఁడామెను తనవైపునకుఁ ద్రిప్పుటకు నలుగురైదుగురు దాసీలను నియమించెను కాని వారామె దృఢనిశ్చయమును, పాతివ్రత్యమునందలి యభీష్టమును మరల్పలేక యుండిరి. అంతఁ గర్ణుఁ డచటనుండిన నీమె తనకు వశవర్తిని గాదని తన రాజ్యములోని దగుసోరట్ నగరమున కామెను తీసికొనిపోయెను. అచట నామె కనేకప్రకారముల బోధించినను ఆమె కర్ణునకు వశపడకుండెను. కాన కర్ణుఁడు సురపాలుఁడు చనిపోయెనని యామె భృత్యుని కొకనికి లంచమిచ్చి వానిచే నామెకుఁ జెప్పించెను. అట్లు చెప్పుటవలన నామె భర్తయాసను విడిచి తనకు వశపడునని కర్ణుఁడు తలఁచెను. కాని యట్లుగాక వెంటనే యామె సహగమనమునకుఁ బ్రయత్నముచేసెను. అప్పుడు కర్ణుఁ డామెనట్లుచేయవలదనియును, ధర్మశాస్త్ర ప్రకారముతనను వివాహము చేసికొనుమనియు ననేకవిధములఁ జెప్పి సహగమ నము చేయ నియ్యకుండెను. కాని యామెసద్గుణముల వలన సైనికులంద ఱామెపక్షమునే స్వీకరించి కర్ణుని చీవాట్లు పెట్టి యామెను సహగమనమునకు సిద్ధము చేసిరి. ఆమె చితి యొక గట్టుపైన నుండెను. విమల యచటి కరిగి తనను చూడవచ్చి తనకు నమస్కరించిన స్త్రీలకు పాతి వ్రత్యధర్మముల నుపదేశించి సైనికులకు బుద్ధులు గఱపెను. అంతవఱకుఁ బశ్చాత్తాప మను మాటలేని కర్ణుఁడు మిగులఁ బశ్చాత్తాపమును బొంది యామెను క్షమవేఁడెను. అప్పుడు విమల 'నీవు పరమేశ్వరుని క్షమ వేఁడుకొని మరల నిట్టి పాపకార్యములు చేయకుమ'ని యతనికిఁ బోధించి చితి నెక్కెను.

అచట సురపాలుఁడు గ్రామమును సమీపించి గ్రామము శత్రువులస్వాధీనమగుటయు రాజు యుద్ధమునఁ జచ్చుటయు విని మరల నరణ్యమునకు వచ్చెను. కాని యతని కచటఁ దన వారెవ్వరును గానిపించలేదు. కాని జరిగినవృత్తాంత మంతయు నొకకిరాతుని వలన విని యతఁడు కర్ణునివద్ద చెఱలో నున్న తనసతిని విడిపింపనరిగెను. సురపాలుఁ డల్పవీరులతో సోరట్ నగర సమీపముననుండి కర్ణునిని గెలుచు నుపాయము చింతించుచుండఁగా తనపత్ని సహగమనవార్త వినెను. అప్పుడాయన తా నొక్కఁడును మాఱువేషముతో నామూకలోఁ బ్రవేశించి చితిపై నెక్కి యగ్నిరవులు కొల్పుచున్న విమల నదాటున నెత్తుకొని యతివేగమున నరిగెను. సురపాలుఁడు విమల నెత్తుకొనిపోయి యొకగుఱ్ఱముపై నెక్కించుకొని యరణ్యమార్గమునఁ బోవుచుండెను. విమల కర్ణుఁడే తన నిట్లు తెప్పించెనని తలఁచెను. కాని కొంతసేపటికి సురపాలుని వచనములవలన తనభర్త చచ్చుట యబద్ధమనియు నతఁడే తనను తీసికొనివచ్చెననియుఁ దెలిసికొనియెను. తదనంతర మాదంపతులు మాఱువేషములతో రూపసుందరి యున్న యరణ్యమునకుఁ బోయిరి. రూపసుందరి, యచట నిదివఱకే ప్రసవమయి మొగశిశువును గనెను. ఆబాలుని పేరా చెంచులు వనరాజని పెట్టిరి. విమల వదినెను పుత్రసహితముగాఁ జూచి యపరిమితానందభరిత యయ్యెను. వా రాయరణ్యముననే గుప్తముగా కాలము గడపుచుండిరి. కాని విమల కచటి యరణ్యజలముపడక క్షీణించి కొన్నిదినములకు నామె దివి కరిగెను.


పద్మావతి

                    సాభార్యాయా శుచి ర్దక్షా సాభార్యా యా పతివ్రతా
                    సాభార్యాయా పతిప్రీతా సాభార్యా సత్యవాదినీ. [2]

పద్మావతి జగన్నాధ నివాసస్థుఁడగు అగ్ని హోత్రుఁడనువిప్రుని కూఁతురు. జయదేవుఁ డను మహాకవిభార్య. ఈమె పాతి వ్రత్యమునందు మిగుల ప్రసిద్ధిఁ గాంచెను. పద్మావతి మిగులసౌందర్యవతియు గుణవతియు నైనందున నామెజనకుఁ డామెకుఁ దగినవరుని విచారించి వివాహము చేయనిశ్చయించెను. అంతఁ గొన్నిదినములకు జగన్నాధమునకు బిల్వా యను గ్రామములో నుండిన నారాయణభట్టను బ్రాహ్మణుని కుమారుఁడగు జయదేవుఁడు సకల సద్గుణపరిపూర్ణుఁ డనియుఁ దగిన వరుఁ డనియు దెలిసినందున బీదవాఁడని శంకింపక యాయగ్ని హోత్రి పద్మావతి నాతని కిచ్చి వివాహము చేసెను. వివాహానంతర మాదంపతులు మిగుల నైక్యము గలిగి కాపురము చేయుచుండిరి. పద్మావతి తమకుఁ గలదానిలోనే కాపురము మిగుల చక్కఁగాఁ గడపుచుండెను. ఆమె పూర్వకాలపు పతివ్రతలకధలు చదివియు వినియుఁ దాను వారివలెనే ప్రవర్తించుటకు నెల్లప్పుడు యత్నించుచుండెను. కాన పరమభక్తుఁడగు

  1. ఇతఁడు కళ్యాణపురమున స్థాపింపఁబడిన పశ్చిమ చాళుక్యవంశములోనివాఁడయి యుండవచ్చును.
  2. పవిత్రురాలును చాతుర్యవతియునై పతివ్రతయయి భర్త్రనుగ్రహము వడసి సత్యము పలుకునట్టిదియే సద్భార్య యనఁదగు.