అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/పద్మావతి
పద్మావతి
సాభార్యాయా శుచి ర్దక్షా సాభార్యా యా పతివ్రతా
సాభార్యాయా పతిప్రీతా సాభార్యా సత్యవాదినీ. [1]
పద్మావతి జగన్నాధ నివాసస్థుఁడగు అగ్ని హోత్రుఁడనువిప్రుని కూఁతురు. జయదేవుఁ డను మహాకవిభార్య. ఈమె పాతి వ్రత్యమునందు మిగుల ప్రసిద్ధిఁ గాంచెను. పద్మావతి మిగులసౌందర్యవతియు గుణవతియు నైనందున నామెజనకుఁ డామెకుఁ దగినవరుని విచారించి వివాహము చేయనిశ్చయించెను. అంతఁ గొన్నిదినములకు జగన్నాధమునకు బిల్వా యను గ్రామములో నుండిన నారాయణభట్టను బ్రాహ్మణుని కుమారుఁడగు జయదేవుఁడు సకల సద్గుణపరిపూర్ణుఁ డనియుఁ దగిన వరుఁ డనియు దెలిసినందున బీదవాఁడని శంకింపక యాయగ్ని హోత్రి పద్మావతి నాతని కిచ్చి వివాహము చేసెను. వివాహానంతర మాదంపతులు మిగుల నైక్యము గలిగి కాపురము చేయుచుండిరి. పద్మావతి తమకుఁ గలదానిలోనే కాపురము మిగుల చక్కఁగాఁ గడపుచుండెను. ఆమె పూర్వకాలపు పతివ్రతలకధలు చదివియు వినియుఁ దాను వారివలెనే ప్రవర్తించుటకు నెల్లప్పుడు యత్నించుచుండెను. కాన పరమభక్తుఁడగు జయదేవునకు సంసార మసారమనితోచక మిగుల సారముగాఁ గానుపించుచుండెను. జయదేవుఁడు పీయూషవర్షుఁడగు కవియని ప్రసిద్ధిఁ గాంచెను. ఆయన సాహిత్యసంగీత విద్యలయం దసమానపాండిత్యము గలవాఁడై ప్రసన్న రాఘవ మనునాటకమును గీతగోవిందమను సంగీతగ్రంధము రచియించెను.
ఇట్లాదంపతులు సుఖముగా నుండఁ గొన్నిదినంబుల కొకయూరి సాహుకారు జయదేవుని మిగుల వేఁడుకొని సమీపమునం దున్న తనగ్రామమునకుఁ గొనిపోయెను. జయదేవుఁ డచటఁ గొన్నిదినంబు లుండి యాగ్రామమునం దంతటను ననేకులను భక్తులనుగాఁ జేసెను. తదనంతర మాయన స్వగ్రామమునకుఁ బ్రయాణ మగుటఁ గని యాసాహుకా రాయనకుఁ దెలుపక గుప్తముగా నాబండియడుగున కొంతద్రవ్యము నునిచి యింటి కేఁగినవెనుక పద్మావతిగారి కిమ్మని తనబంటగు బండితోలువానితోఁ జెప్పెను.
ఇట్లు బయలుదేరి జయదేవులు కొంతదూర మరిగినపిదప నతనిబండిలో ధనమున్న సంగతి యరణ్యవాసులగు దొంగలకుఁ దెలిసి వా రాబండిని నాపి సకలధనమును దోఁచుకొని జయదేవుని వదలినఁ దమకు నతఁడు రాజభటులచే నపాయముఁ జేయించునని తలఁచి, కాలు సేతులు కట్టి జయదేలను నొకపాడు నూతిలోఁ బాఱవేసిరి. అందుపైఁ గొంతసేపటికి క్రౌంచ దేశాధీశ్వరుఁ డచటికి వేఁటాడ వచ్చి జయదేవునిఁ గని తన నగరమునకుఁ గొనిపోయెను. అచట రాజవైద్యులచే ననేకౌషధోపాయములు చేయించఁగా జయదేవుల కాలు సేతుల గాయములు మానెను. జయదేవుల యపారపాండిత్య మును. నిర్మల దైవభక్తియు, నప్రతిమసాధువృత్తిఁగని క్రౌంచరా జాతనిని గురువుగా భావించి సేవింపుచుండెను.
ఇచటఁ బద్మావతి భర్తకొఱకు ననేకస్థలముల వెదకించియు వెదకియు జాడఁగానక మిగుల దు:ఖముతోఁ బుంటినింటనేయుండి భర్తజాడ లరయుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినవెనుక క్రౌంచాధీశ్వరుఁడు జయదేవుల వార్తఁ దెలిపి పద్మావతినిఁ దోడుకొని వచ్చుటకయి తనపరివారమును బంపెను. వారు చెప్పినవార్త విని పద్మావతి మిగుల సంతోషముతో భర్తకడ కేఁగెను.
పద్మావతి గురుభార్య యగుటవలనను మిగుల పతివ్రత యని ప్రసిద్ధి గాంచుటవలనను రాజపత్ని మిగుల శ్రద్ధతో నామెవలన ననేకనీతులు వినుచుండెను. ఇట్లొకనాఁడు పద్మావతి పాతివ్రత్యమునుగూర్చి యుపన్యసింపుచుండఁగా నచటికి నొక సేవకుఁడు వచ్చి రాజపత్ని సమీపబంధువుఁ డెవఁడో యొకఁడు లోకాంతరగతుఁ డాయెననియు, ఆయన వియోగము సహింపలేక యాతని భార్య సహగమనము చేయఁబోవు చున్నదనియుఁ దెలిపెను. ఆసంగతి విని యచటి స్త్రీలందఱు మిగుల నాశ్చర్యపడఁజొచ్చిరి. కాని పద్మావతికి నాసంగతియొక విశేషముగాఁ దోఁచకపోవుటవలన నామె ముఖమునం దాశ్చర్యభావ మించుకయుఁ గానుపించదయ్యె అందుకు రాజపత్ని పద్మావతిని "అమ్మా! ఆమహాపతివ్రత సకల సుఖములను విడిచి భర్తతో సహగమనము చేయు నన్న వార్త విని మీకాశ్చర్యము కలుగ లేదా? దయచేసి మీమనోగతము నెఱిఁగింపుఁడ"ని వేఁడుకొనెను. అందుకుఁ బద్మావతి రాజపత్నితో నిట్ల నియె, "భర్తప్రాణములు పోయినవెంటనే ప్రేమగల పత్నియొక్క ప్రాణములు బొందినుండి వెడలును. ఇదియె నిజమైన ప్రేమయొక్క లక్షణము. అట్లువెంటనే బొందిని విడువక తరువాత ప్రాణత్యాగము చేయుట యాత్మఘాతయెగాని పత్నీ ధర్మముగాదు."
పద్మావతియొక్క శుద్ధాంతకరణమునుండి వెడలిన యీవాక్యములు ప్రభుపత్ని చెవులకు ములుకులవలెఁ దోఁచగాఁ నామె పద్మావతి తాను నిజమయిన పతివ్రతను అనివెల్లడించుటకై యీడంబములు పలికెనని యెంచి పద్మావతి నామె పరీక్షించి భంగపఱచవలయునని నిశ్చయించెను.
అందుపైఁ గొన్నిరోజు లయినపిదప రాజుతో జయదేవు లరణ్యమున కరుగుట సంభవించెను. అప్పుడు రాజపత్ని తన మంత్రినిం బిలిచి తనకుట్ర యభిప్రాయ మాతనికిఁ దెలిపి తదనుసారముగా కార్యము నిర్వహింప నాతనిని నియమించెను. అట్లు కుతంత్రము పన్ని యా రాజకాంత యారోజునఁ గూడఁ దన నియమప్రకారము పద్మావతి గృహమున కరిగి యామెతోఁ బ్రసంగించుచుండెను! అంతలో దూతిక యొకత యతి దీనవదనయై వచ్చి కారడవిలో నాకస్మికముగా జయదేవుఁడు పులినోటఁ బడి ప్రాణములను విడిచెనని గద్గదస్వరముతోఁ జెప్పెను! ఆ పిడుగువంటివార్త చెవిసోఁకినతోడనే పద్మావతి నిశ్చేష్టితయై కొంతవడి దేహము తెలియకుండి మరల దేహస్మారకము గలిగి దు:ఖాతిరేకము పట్టఁజాలక పతినామము నుచ్చరించి మరణ తుల్యమగు మూర్ఛనొందెను. కాని యచ్చటి వారందఱును నామె మృతిఁజెందెనని యనుకొనిరి. ఆమె పాతివ్రత్యమును బరీక్షింపవలెనని యీతంత్రమును బన్నిన రాణిగారు పద్మావతి మరణమును గని యేమి చేయుటకుఁ దోఁచక దు:ఖింపసాగెను. అదివఱకామె కీకార్యమునందుఁదోడుపడినవా రిపు డామెనే నిందింపసాగిరి. ఇట్లు రాణిగారు సపరివారముగా శోకింపుచుండు నంతలో రాజుగారును జయదేవుఁడును పురమునకు వచ్చిరి. వారిల్లుజొచ్చి పద్మావతి గతించుట విని యామెను సమీపించిరి. అంత జయదేవులు భార్యను గని తనదు:ఖము నాప:జాలక కొంతవఱకు దు:ఖించిన పిదప ధైర్యము నవలంబించి తనసంగీతము పద్మావతికి మిగుల ప్రియమగుట యెఱిఁగినవాఁడు గావున నామె ముందు రసవంతమయిన సంగీతము పాడ నిశ్చయించి తనవీణెఁ దెప్పించి తాను రచియించిన గీతగోవిందమును మిగుల మనోహరముగాఁ బాడఁజొచ్చెను. ఇట్లు సంగీతమున కుపక్రమించిన కొంతసేపటికిఁ బద్మావతి మొగముపైఁ గొంచెము తెలివి గానుపించెను. ఇరువదియైదవ అష్టపదిముగియఁగానే పద్మావతి తెలివొంది కనులు విప్పి తనముందుఁ గూర్చున్న జయదేవునిఁ గాంచెను. అంత నామె మిగుల నానందముతో భర్తకు నమస్కరించి యానంద బాష్పములతో నతని పదములను గడిగెను.
ఈయనర్థమున కంతకుఁ దనపత్నియే కారకురాలని క్రౌంచరాజు మిగుల కోపించి యామెను విసర్జింపఁదలఁచెను. కాని దయామయురాలగు పద్మావతి రాజును సమాధాన పఱచి భార్యాభర్త లెడఁబాయకుండఁ జేసెను. తదనంతరము పద్మావతీ జయ దేవులు కాశీక్షేత్రమున కరిగి యచటి పురుషులకు భక్తియు స్త్రీలకు పాతివ్రత్యమును ఉపదేశింపుచు తమ ప్రవర్తనవలన వారికి దారిఁజూపుచుండిరి. కొంతకాల మచటనుండి స్వగ్రామమునకుఁ బోయి యచ్చటనే కొన్నిరోజులకు వారు కాలధర్మము నొందిరి.
పద్మావతీదేవి రాజుభార్య కుపదేశించిన యుపన్యాస మొకటి యాంధ్రమహాభక్త విజయమునందుఁ గానుపించుచున్నది; గాని మహారాష్ట్రభక్తవిజయమునందు లేదు. ఆంధ్రభక్తవిజయకారుఁ డీయుపన్యాసము నెచ్చటినుండి సంగ్రహించెనో తెలియదు. అయినను నాయుపన్యాసము స్త్రీలకుఁ బాతివ్రత్యంబు గఱుపుటకు నత్యంతోపయుక్తముగా నుండుట వలన దాని నిందుఁ బొందుపఱుచుచున్నాను.
"అమ్మా! లోకములో సతులకు ముఖ్యముగాఁ గావలసిన ధర్మ మొక్కటిగలదు. పతికంటె వేఱుదైవముగాని, పతికంటె వేఱు గతిగాని పతికంటె వేఱు చుట్టముగాని, పతికంటె వేఱుసంపదగాని, పతిసేవకంటె నుత్కృష్టమగు పూజగాని పతియనుమతి నతిక్రమించుటకంటె పరమసాధనముగాని లేదనియు, పాతివ్రత్యమున కెప్పుడును భంగము రాకుండ కాపాడుకొనుచుండుటే బ్రహ్మజ్ఞానమనియు, పతి నామముననవరతము సంస్మరించుటే బ్రహ్మధ్యానమనియు, పతి నెడఁబాయకుండుటే బ్రహ్మానందమనియు, పతిమృతి నొందినతోడనే ప్రాణములు విడుచుటె మోక్షమనియు, నిశ్చయించుకొని వర్తించుచున్న సతికి సర్వశుభములును సులభముగా సిద్ధించును. పాతివ్రత్యమున కన్న నుత్తమమయిన వ్రతము మఱేదియును లేదు. లోకమునంగల జపతపో నియమాదు లేవియుఁ బాతివ్రత్యమునకు సమానములు కావు. పాతివ్రత్యమును బాడు చేసికొనక మిగులజాగ్రత్తతోఁగాపాడు కొన్న గుణవతి భాగీరధి యనఁబడును. పాతివ్రత్యము గల వనితకు పరమపద మఱచేతిలోనిదని పెద్దలు పలుకుదురు. పాతి వ్రత్యమును రక్షించుకొన్న వనితలకు నేలోపములును రావు. పాతివ్రత్యమునకు భంగము కలిగించుకొన్నచో బహువిధములయిన బాధ లనుభవింపవలసి వచ్చును. ప్రాణమున కంటె పదిమడుగు లెక్కుడుగాఁ బాతివ్రత్యమునందు ప్రీతి గలిగి కాపాడుకోవలసినది. భూషణముల కెల్ల భూషణము ప్రాతివ్రత్యమే సుమీ ! పాతివ్రత్యమున కంటెఁబడఁతులకుఁ బాలింప వలసిన పదార్థ మొక్కటి లేదు. పాతివ్రత్యమును బాడు చేసికొనిన పాపాత్మురా లొకవేళ సత్కర్మములను జేసినను అవి దుష్కర్మములక్రింద మాఱి తుదకు దు:ఖమును గలిగించునుగాని లేశమయినను సుఖమును గలిగింపవు. పతివ్రతలయొక్క ప్రభావముచేతనే భూతలమంతయు నంతరమున నిలిచియున్నదనియు, పతివ్రతలవిషయమున బ్రహ్మాదిదేవతలు సహితము భయపడుచుందురనియు పెద్దలు పలుకుదురు. పూర్వము మృతినొందిన తనపతిని సావిత్రీదేవి మరల బ్రతికించుకొన్నది కాదా? తనచిత్తశుద్ధినిఁ దెలుపుటకై సీతాదేవి యగ్నిలో దుమికినది గాదా? తనకు హాని చేయవచ్చని కిరాతుని దమయంతీదేవి భస్మము చేసినది గాదా? తనమాంగల్యము నితరులకుఁ దెలియనీయక చంద్రమతీదేవి రక్షించుకొన్నది గాదా? రేణుకాదేవి యిసుకతోఁ గుండను జేసి జలమును దెచ్చినదిగాదా? బృంద తన భర్తవలె ననువర్తింపవచ్చిన విష్ణుమూర్తియొక్క మాయను దెలిసికొన్నది గాదా? అనసూయాదేవి నారదు లిచ్చిన యినుపసెనగలను బొరుగులగునట్టు వేఁచినది కాదా? ఆమెయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తనకు బిడ్డలనుగాఁ జేసికొన్నది కాదా? అరుంధతీదేవి యిసుకను నిమిషములోపల వండినదికాదా? లక్ష్మీదేవి పరమశివునుఁ బట్టుకొన్న బ్రహ్మహత్యను వదలఁ గొట్టినది కాదా? పార్వతీదేవి పరమేశ్వరుని యర్థాంగమును సంపాదించుకొన్నదిగాదా? ఇటువంటి మహత్వమంతయు వారికి పాతివ్రత్యమువలననే గదా గలిగినది. చూడుము; అరుంధతీదేవి తక్కువజాతిలోఁ బుట్టినదయ్యును తనపాతివ్రత్యముచేత సప్తర్షి మండలమున వసిష్ఠులవారిదండను నిండుకాంతితో వెలయుచు లోకమునకు కన్నులపండువుచేయుచున్నది. ఒక్కపర్యాయము పత్నులమీఁది మోహముచేత మిక్కిలియార్తిచెందిన తనభర్తయగు అగ్ని హోత్రునియొక్క యిష్టాపూర్తి చేయునిమిత్తమయి స్వాహాదేవి తనమాహాత్మ్యమువలన ఆర్గుఱు ఋషిపత్నులరూపములఁ దాల్చియు, పరమపవిత్రురా లన్న హేతువుచేత నరుంధతీ దేవిరూపమును మాత్రము ధరించుటకు శంకించినదిగాదా? సత్కులప్రసూతయు సకల సంపన్నయు నయిన అహల్యదేవి మనోవైకల్యముచేత పాతివ్రత్యమును పాడుచేసికొన్నందుననే గదా పాషాణమయి పడియుండి చిరకాలము దు:ఖమనుభవించినది ? ఇప్పుడును వివాహ సమయములయందు సన్నికలు మిషమున నహల్యను కన్యచేతఁ ద్రొక్కించుటయు, నరుంధతీదేవి నగుపఱచి భక్తిపూర్వకముగా మ్రొక్కించుటయు, వాడుకగానున్నది కాదా? చక్కఁగాఁ బాతివ్రత్యము నొక్కటినిఁ గాపాడుకున్నచో బహువిధము లయిన యుపవాసాదివ్రతములతోఁ బ్రయోజనములేదు. పాతివ్రత్యరక్షణమొక్కటే పడఁతులకు పరమోత్కృష్టవ్రతమని ధర్మశాస్త్రములు విధించుచున్నవి. దేవతాచార్యుని భార్యయైన తారాదేవి బుద్ధిమాంద్యముచేత చంద్రునితో వ్యభిచరించినందునఁగదా శాశ్వతమయిననింద ననుభవింపు చున్నది? చేడియలతోఁగూడి జలక్రీడసలుపుచున్న చిత్రరధునిఁ జూచి భ్రమసినందునఁగదా రేణుకాదేవి తనపాతివ్రత్యమును భంగము చేసికొని యిసుకతోఁ గుండను జేయలేక తుదకు ఱట్టువడి పరశురామునిచేత ఖండింపఁబడినది? ద్రౌపదీదేవి కర్ణుని యందుఁ గన్నిడినందునఁగదా తపోధనున కుపయోగపడు ఫలమును వృక్షమున కెక్కింపలేక సిగ్గుపడినది? కాఁబట్టి యత్నపూర్వకముగా పాతివ్రత్యమును రక్షించుకోవలసినది స్త్రీలకు ముఖ్యకర్తవ్యము. మృతులయినవారిని మరల బ్రతికింపవలె నన్నను హరిహరబ్రహ్మలను రక్షించవలనన్నను భూతముల నెల్లఁ దలక్రిందులుగాఁ జేయవలెనన్నను పతివ్రతల కొక లక్ష్యముకాదు. పాతివ్రత్యము బ్రహ్మనిష్ఠతో సమానమని పెద్దలు పలుకుదురు. సర్వోత్కృష్ట మగు బ్రహ్మనిష్ఠపురుషులకుఁ జిత్తశుద్ధిని గలిగించి పూజ్య మగు మోక్షసామ్రాజ్యము ననుగ్రహించునట్టే పాతివ్రత్యము సతులకు పరమపదము నొనగూర్చును. ఏకపత్నీవ్రతు లగువారికి నన్యస్త్రీసహవాస మెట్లు విసర్జనీయమో ఆప్రకారమే పతివ్రతలకు సహితము పరపురుషసాంగత్యము సర్వదావర్జనీయము. ఏకాంతమున నేకాసనమున నిందు కొమారునితో నైనను గూర్చుండుటకు కులభామినికి యుక్తముగాదు. ధనికుఁడయినను, నిర్ధనుఁడయినను, రూప వంతుఁడయినను, రూపహీనుఁడయినను, వివేకియయినను, అవివేకియయినను, రోగియయినను, నిరోగుఁడయినను, మఱి యెట్టివాఁ డయినను, చేపట్టిన పెనిమిటివిషయమున లేశమయిన పొర పొచ్చములులేక మిక్కిలి మచ్చికగలిగి యనువర్తింప వలసినది భార్యకు ముఖ్యధర్మము. భర్త తన కేమిచ్చినను మిక్కిలి సంతోషపడవలెనుగాని చాలదని యెప్పుడును దు:ఖపడఁగూడదు. పతి తెచ్చియిచ్చిన వస్తువులను పదిలముగా దాచి యుంచి మరల నాతఁడడిగినప్పుడు నిష్కపటముగా నిచ్చి వేయవలెను. బతిభిక్ష మెప్పుడును దప్పక పెట్టుచుండవలెను. దేవ పితృపూజకాలములయందుఁ దనపతికి ననవరతము శుభములు గలుగునట్టుగాఁ ప్రార్థింపవలెను. పతియనుమతిలేక దేవతలనుగాని పితరులనుగాని యతిధులనుగాని పూజింపరాదు. పూజించినచో నది సద్గతినొందనేరదు. ఈవిషయమున పార్వతీదేవిచెప్పిన యితిహాసము చెప్పెదను. పూర్వ మొకబ్రాహ్మణున కిద్దఱుముద్దియలు గలరు. వారిలో నొక్కతె తనపెనిమిటి యనుమతిప్రకార మడఁకువగలిగి నడచుకొనుచుండెను. మఱియొక్కతె స్వతంత్రతను వహించి తనయిష్టప్రకారము పితృదేవతాతిథి పూజలను జేయుచుండెను. కొంతకాలమునకు పిమ్మట విధివశమున వారు మువ్వురును నొక్కపర్యాయమే మృతినొందిరి. అప్పుడు పతికి హితముగా నడుచుకొన్న సతి పతిపోయిన సుగతికిఁ బోయెను. పతిసమ్మతికి విరోధముగా నడచుకొన్న రెండవ పడఁతిని యముఁడు పోఁగూడ దని యాటంక పఱచినందున వెనుకనే నిలిచి కన్నుల నీరు పెట్టుకొని యేడువ మొదలు పెట్టెను. అది చూచి యతఁడు దయార్ద్రహృదయుఁ డయి యా మెను గనుఁగొని "పతికిసమ్మతిలేని ధర్మము నెప్పుడును సతిచేయఁగూడదు. చేసినయెడల దుర్గతికిఁ బాత్రమగును ఇఁకమీఁద నయినను నీవు బుద్ధి తెచ్చుకొని పతికి హితములగు వానినిఁ జేసినచో నాతనిగతి నొందఁగల" వని చెప్పఁగా నామె మరలిపోయెను. కాఁబట్టి పతికిసమ్మతముగా ననువర్తింపవలసినదే సతికి పరమధర్మము అధర్మవర్తనఁగల వనితలు అసురు లని పైశాచులని రాక్షసులని చెప్పఁబడు మూఁడు తెగల వారికిని సాధారణముగా వ్యభిచారమునం దనవరతము నిష్టము గలిగియుండును. వారిలో నాసురీవర్గమువారు సదా హృదయమునందు కౌర్య ముంచుకొనియుండుట. ధనధాన్యములను నాశ చేయుట, భోగములయందు కేవల మనురాగము కలిగి యుండుట అసూయపడుట, మొదలగు దుర్గుణములు కలిగెఁ వర్తింతురు. పైశాచికావర్గమువారు మనసునందు క్రోధమును సాధించుట, పతిసుతులయందు ద్వేషము కలిగియుండుట, గృహకృత్య వర్తనముల నేర్పుచాలకుండుట, కలహములయందిచ్ఛ గలిగియుండుట, మొదలగు దుర్గుణములు గలిగినడుచు కొనుచుందురు. రాక్షసీవర్గమువారు లేశమయిన సహనము లేకుండుట, యెల్లప్పుడు కల్లలాడుట, విశేషముగా నిద్రపోవుట సిగ్గులేక యుండుట మొదలగు దుర్గుణములు గలిగి నడుచుకొనుచుందురు. వీరందఱు నిస్సంశయముగాఁ బతివంశమువారిని నరకమునకుఁ బంపి తామును నరకమునకుఁ బోవుదురు. అట్టి దుష్ప్రవర్తనగల వనితలయినను తుదను తెలివి తెచ్చుకొని పతిభక్తిఁ గలిగి మికికిలి యనరక్తితో సత్కృత్యములుచేసి శాంతినివహించి వర్తించుచున్నచో మునుపుచేసిన పాపములనుండి తొలఁగిపోయి పురుషునితోఁగూడ స్వర్గలోకమునకుఁ బోవఁగలుగుదురు. అట్లు వర్తింపక పోయినను పతుల యవసానకాలమునం దయినను ఇతర చింత లేక యను మరణము చేసిన పక్షమున వారికి పతి సహితముగా సద్గతి సిద్ధించును."
- ↑ పవిత్రురాలును చాతుర్యవతియునై పతివ్రతయయి భర్త్రనుగ్రహము వడసి సత్యము పలుకునట్టిదియే సద్భార్య యనఁదగు.