అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/మైసల దేవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మైసల దేవి

ఈయుదాత్తచరిత 1072 వ సంవత్సరప్రాంతమునం దుండెను. విదర్భదేశమున చంద్రపురంబు గలదు. అచటి రాజగు జయకేశునను మైసలదేవియను కూఁతురు కలదు. ఈమె యుక్తవయస్కురాలు కాఁగా తండ్రి యామెకొఱకు సకల రాజపుత్రుల పటములను దెప్పించెను. వానిలో ఘూర్జరా (గుజరాతి) ధిపతియును, చాలుక్యవంశీకుఁడునగు కర్ణరాజు రూప మామె కధిక ప్రియమగుటవలన నామె తనపటము నొక విప్రునకిచ్చి యారాజున కంపెను. కర్ణుఁడును మైసలదేవి సౌందర్యమును మెచ్చుకొని యావిప్రుని మిగుల సన్మానించి యామెను వివాహమాడ సమ్మతించెను. ఆవార్త దెలిసినవెంటనే మైసలదేవి ఘూర్జరదేశమున కరుగఁగా నచటనే కర్ణ రాజునకు నామెకు వివాహమయ్యెను. వివాహానంతరము రోజు క్రొత్తపుష్పము నాఘ్రాణించు పురుషస్వభావము ననుసరించి కర్ణ రాజునకు మైసలదేవియందలి ప్రేమతగ్గెను. అట్టిసమయమునందు మైసలదేవికిఁ గలిగిన దు:ఖమువలన నామె యనేక పర్యాయములు జీవితముపై రోసెనుగాని యత్తగారి హితబోధవలనను, ఆత్మహత్య దోషమని యెఱిఁగిన దగుటవలనను ఆమె యెన్నఁడును తనమరణమునకుఁ బ్రయత్నముచేసినది కాదు. ఇట్లు కొన్నిదినము లరిగినపిదప ముంజలాయను భోగకాంతపై రాజునకుమక్కువగలదని ముంజలుఁడను మంత్రికిఁదెల్యఁగానాతఁ డుమైసలదేవియొక్క సద్గుణములంగనిమిగుల కనికరించిముంజలా యను నెపమున రాణినే యాతనికడకంపెను. రాజును వేషాంతరములో నున్నభార్యను భోగభామినిగా నెంచి నాఁ డామెతో మిక్కిలి సంతోషముగాఁ గాలము గడపెను. మైసలదేవియు నాతని యుంగరమును గుర్తుగాఁగొనెను. పరమేశ్వరుని యనుగ్రహమువలన నాటితో మైసలదేవి గర్భమును ధరియించెను. తదనంతరము కొన్ని కారణములచే వేశ్యాసంభొగము చేసినందునకయి రాజు మిగుల పశ్చాతాపము నొందెను. తద్దోషపరిహారార్థ మారాజు బ్రాహ్మణానుమతంబున నైదుతప్తప్రతిమల నాలింగనము చేసికొనుటకు సహితము సిద్ధమయ్యెను. కాని మంత్రి నిజముగా జరిగినసంగతిఁ దెలుపఁగా రాజుమనసు శాంతిఁబొందెను. అటుపిమ్మట రాణి ప్రసవమై కొమరునిఁ గనెను. ఈచిన్నవానిపేరు సిద్ధరాజ జయసింగని పెట్టిరి.

ఈచిన్నవాఁడు బాలుఁడయి యున్నసమయముననే కర్ణరాజు 1094 వ సంవత్సరము మృతినొందెను. పతిమరణము వలన మైసలదేవికిఁ గలిగిన దు:ఖమునకుఁ బారములేదు. కాని యట్టిసమయముననే యామె తనదు:ఖమును దిగమ్రింగి రాజ్యభారమును వహించి ప్రజలను సుఖపెట్టవలసిన దయ్యెను అదేలయన కర్ణరాజు ననంతరము బాలుఁడగు సిద్ధరాజ జయసింగునికిఁ బట్టము గట్టి యాతనిపేర కర్ణరాజునకు మాతులుఁడగు మదనపాలుఁ డనువాఁడు రాజ్యము నడుపుచుండెను. కాని యాతఁడు విచారశూన్యుఁ డయినందున ప్రజలకు న్యాయము దొరకకుండెను కాన సామంతుఁడను ప్రధానుఁ డొకఁడు బాలరాజును తనస్వాధీనము చేసికొని మిగులచాతుర్య ముతో మదనపాలుని నొక సేవకునిచేఁ జంపించెను. ఇందువలన రాజ్యపాలనము మైసలదేవిపైఁ బడెను. మైసలదేవియు మిగుల దక్షతతో రాజ్యము నడుపుచు ప్రజలను బిడ్డలవలె నేలుచుండెను. మైసలదేవి, సామంతి, ముంజ, ఉదాయను ముగ్గురు జైనమంత్రుల సహాయముచే న్యాయముగా రాజ్యశాసనముల నేర్పఱచి ప్రజలను తదనుసారముగాఁ బ్రవర్థింపఁ జేసెను. ఆమె మోనరసమను తటాక మొకటియు, మలావను చెఱువొకటియుఁ ద్రవ్వించెను. నినిలో మలావను తటాకము కట్టునెడ నొకవేశ్యగృహము పడఁగొట్టినఁగాని యది యందముగాఁ గట్టుటకు వీలులేకుండెను. కాన రాణిగా రావేశ్యకు మిగుల ధనమిచ్చి దానియిల్లు గొనుటకు మిక్కిలి యుత్సహించెను. ఆవేశ్య తా నాధనముతీసికొని గృహము నియ్యననియు, మీరు తటాకము కట్టుటవలన మీ కెట్టికీర్తి కలుగునో దాని నడ్డగించుటచే నాకును నట్టికీర్తియే కలుగుననియు చెప్పెను. రాణిగారు న్యాయప్రవర్తనయందే చిత్తము కలదిగాన నెవరియాస్తియందు వారికిఁ బూర్ణాధికారము గలదని యెంచి వేశ్య నెంతమాత్రమును నిర్బందిపెట్టక దానియిల్లు వదలి చెఱువును వంకరగాఁ గట్టించెను. ఈ న్యాయమువలన నేఁటికిని ఆప్రాంతమునందలి ప్రజలు "న్యాయముఁగన నిచ్ఛగలవారు మలావతటాకమూ గనవలెనని" చెప్పుదురు.

ఆమె ప్రధానులును రాణిగారి యనుజ్ఞప్రకారము అనేక ధర్మకార్యములఁ జేసిరి. ఒకానొకసమయమునం దామె సోమనాధమునకుఁ బుత్రసహితయై యరిగి భాలోడను గ్రామమున యాత్రికులకుఁ బన్ను వలనఁ గలుగు బాధలఁగని కొమా రునిచే పన్ను విడుచినటుల ధారపోయించెను. ఇట్లీసతి రాజ్యమునేలి యనేక సత్కార్యములఁజేసి కొమారుని చేతికి రాజ్యసూత్రముల నిచ్చి మిగుల వృద్ధయయి కాలధర్మము నొందెను.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf