అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/రఖమాబాయి కిబే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రఖమాబాయికి బే

రాజకార్యధురంధరత్వమునకయి ప్రఖ్యాతి గాంచి యీ సాధ్వి క్రీ. శ. 1765 వ సంవత్సరప్రాంతమున ఖాన్ దేశమునందలి పారోళే యనుగ్రామమున జన్మించెను. ఈమె తండ్రి పేరు బాళంభట్టు; తల్లిపేరు సావిత్రిబాయి. భాళ భట్టు బైక్షుకవృత్తితో జీవనము చేయుచుండెను. రఖమాబాయియొక్క బాల్యేతిహాస మేమియుఁ దెలియదు. ఈమెకుఁ దల్లిదండ్రులు భివరాభాయియని నామకరణముచేసిరి. భివరాబాయిని విఠల్ మహాదేవను నతని కిచ్చి వివాహముచేసిరి. వివాహనంతర మీమెకు రఖమాబాయి యనునామాంతరము గలిగెను. భర్త జీవితకాలమునందు నీమెబుద్ధివైభవ మంతగాఁ బ్రకాశింపకున్నను, ఈమె భర్త కనేక పర్యాయములు రాజ కార్యములయందుఁ దోడుపడెనని మాత్రము తెలియుచున్నది.

క్రీ. శ. 1826 వ సంవత్సరమున విట్ఠల్ మహాదేవ్ గతించెను. ఆయనమరణమునకుఁబూర్వమే జ్యేష్ఠపుత్రికకొమారుఁడగు గణేశవిట్ఠల్ జోగి అనుపిల్లవానిని దత్తపుత్రునిగా స్వీకరించెను. తదనంతర మల్పకాలములో మహారాజ్ మల్హారరావ్ హోళకర్ గారు గణేశవిట్ఠలునకు తమదివాన్‌గిరినిచ్చిరి. అప్పు డాయన బాలుఁడగుటవలన రాజ్యవ్యవస్థనంతను రఖమాబాయిగారే చూచుచుండిరి. అటుతరువాతఁ గొన్నిదినములకు రావ్‌జీతియంబకను నాతనిప్రోత్సాహమువలన గణేశవిట్ఠ లుని దివాన్‌ గిరినుండి తీసి ఆపని రావ్ జీత్రియంబకున కిచ్చిరి. పిదప రఖమాబాయి తన ద్రవ్యముతో వర్తకము చేసి దాని నధికముగా వృద్ధిపఱుపఁ జొచ్చెను. ఆమెవర్తకశాలలు హిందూస్థానమునం దంతటను నుండుటయేగాక చీనా దేశమునందు సహిత ముండెను. ఈవర్తకమువలన ప్రతిదినము లక్ష యిరువదియైదు వేల లాభము కలుగుచుండె ననియెదరు. ప్రతివర్తకశాలకును లక్షరూపాయిలు మూలధనము (అసలు) గా నుంచి ఆధనముతో నతఁడు సంపాదించు లాభములోఁ గొంతభాగ మాతనికి నిచ్చునట్టుగా నేర్పాటు చేసినందున నాశాలాధికారులు కపటము చేయక వర్తకము చక్కఁగా నడుపుచుండిరి. ఇట్లు 1827 వ సంవత్సరమునుండి 1833 వ సంవత్సరము అక్టోబరు నెలవఱకును ఆమె తనవ్యాపారమునె చక్కఁగా జేసికొనుచుండెను.

1833 వ సంవత్సరము అక్టోబరునెలలోనే మహారాజ్ మల్హార్ రావు హోళకర గారు దివి కరిగిరి. ఆయన పుత్రులు లేక గతించినందున నాతనిభార్య గౌతమ బాయియు తల్లి కేసరిబాయియు నాలోచించి మార్తాండరావను చిన్నవానిని దత్తునిగాఁగొనిరి. అప్పుడు రఖమాబాయి రాజమాతకు మిక్కిలి సహాయము చేసెను.

ఈసంధికాలములో నదివఱకు మహేశ్వరయను పట్టణమునందు రాజనిర్బంధములోనుండిన హరిరావ్ హోళకరను నాతఁడు బంధముక్తుఁడయి వచ్చి రాజ్యము చేయసాగెను. అప్పుడు కొన్ని కారణములవల రఖమాబాయి యిందూరు నుండి వెడలి ఉజ్జయినిలో నాంగ్లేయుల యాశ్రమమునం దుండ వలసినదాయెను.

ఈమె యుజ్జయనిలో నుండినకాలమునందు నచట ననేక గృహములను గట్టించెను. క్షిప్రానదీతీరమున నొకఘట్టము కట్టించి యచట గంగయొక్క మూర్తిని స్థాపించెను. రఖమాబాయిగా రచట నొక యన్న సత్రమును సహితము స్థాపించిరి. ఇది యంతయుఁగాక యామె గ్రామమునందలి బీదసాదల నరయుచు వారికి సహాయము చేయుచుండెను.

1843 వ సంవత్సరమున హరిరావ్ మహారాజుగారు స్వర్గస్థు లయిరి. తదుపరి ఖండేరావుగారు సింహాసనారూఢులయిరి. అప్పుడు హరిరావు కాలమునందు జప్తు చేయఁబడిన రఖమాబాయిగారి యగ్రహారము వారికి మరల నియ్యఁబడెను. కాన నామె మరల నిందూరునకు వచ్చెను.

రఖమాబాయి తనద్రవ్యమును హోళకరుకు బదులిచ్చెను. అది నేఁటివఱకుఁ దీర్పఁబడుచున్నది. ఇదిగాక యామె రాజపుతానాయందలి మధ్యహిందూస్థానమునందలి సంస్థానికుల కనేకుల కనేకలక్షధనము వడ్డీకి నిచ్చి వారి నందఱినిఁ దనకు ఋణులను జేసి వారిచే మిగుల గౌరవింపఁబడుచుండెను. ఇప్పటికిని నామె వంశీకులను సంస్థానికు లందఱు తమతో సమానముగా మన్నింతురు.

1844 వ సంవత్సరమున క్రొత్తగా సింహాసనారూఢుఁడయిన ఖండేరావు మృతినొందెను. అప్పుడు రాజ్యమునకు వారసులు లేక యున్నందున నచటివారి కందఱకును మిగుల విచారముగా నుండెను. ఆసమయమునందు రఖమాబాయియు, ఆమెకు సహోదరతుల్యుఁ డయిన రెసిడెంటు దొరగారును రాజ్యమునకు వారసుని నేర్పఱుచుటకై చేసిన కష్టము వారికే తెలియవలెను. కాని తదితరులకు తెలియఁజాలదు. ఏప్రెల్ నెల 4 వ తేదిని వేడ్(ఇది రెసిడెంటుపేరు) దొరగారి నచటినుండి మార్చి యాస్థలమునకు హ్యామిల్టన్ దొరను బంపిరి. అప్పుడు వేడ్‌దొరగారు హామిల్టనును తనతోఁదీసికొని రఖమాబాయివద్దకి వచ్చి యామెకు సహాయము చేయవలసినదని హ్యామిల్టన్ గారితోఁ జెప్పి నీ యిచ్ఛ యేమియని రఖమాబాయిని నాతఁడడిగెను. అప్పుడామె సంస్థానమువిషయమయి తనకుఁ గలవిచారమును వెల్లడి పఱచెను. అందుపై నాదొర సంస్థానము కొఱకు వారసు నేర్పఱుచుటయందు రఖమాబాయికి సహాయము చేయుమని హ్యామిల్టను గారితోఁ చెప్పెను. అందుపై భావుహోళకరుగారి యిద్దఱు పుత్రులలో నెవరిని బెంచుకొనవలయుననియోచనకొలఁది రోజులుజరుగుచుండెను. వారిలోఁ చిన్నవానిని మెచ్చి రఖమాబాయి చూపఁగా వానినే దత్తపుత్రునిగాఁ గొనిరి. ఈయనయే తరువాత తుకో మాహారాజని ప్రసిద్ధుఁడయ్యెను. తుకోజీరావు యావజ్జీవము రఖమాబాయిగారి యుపకారము మఱవక యామెను నామెవంశీకులను మిక్కిలి మన్నించుచునుండెను.

కొమారుఁడు పెద్దవాఁడయి వ్యవహారము చేయమొదలు పెట్టినపిదప రఖమాబాయి దానధర్మములయందే తనదృష్టి నిలిపి కాలము గడుపుచుండెను. ఆమె వారి ద్వారమునుండి రామేశ్వరమున కరుగుత్రోవలోనికి ననేకుల నంపి యక్క డక్కడ అన్న సత్రములను కట్టించెను. కాశియం దొక దేవాల యమును కట్టించి దానిలో విట్ఠలమూర్తిని స్థాపించెను. కాశీ యందలియు నితర స్థలముల యందలియు వర్తకశాలలలోఁ గొంతధనము ధర్మముక్రింద వ్యయపఱుపఁ బడుచుండెను.

ఇట్లు కొంతకాలము గడపిన పిదప నామెకు ద్వారకా యాత్రకుఁ బోవలయునని బుద్ధి పుట్టెను. అంత నామె మిగుల వైభవముతో నాయాత్రకుఁ బయలుదేఱెను. ఆమె పోవుచుండఁగా గాయకవాడ మహారా జామెను మిగుల నాదరముతోఁ బిలచుకొని పోయి తగినమర్యాదలు చేసిపంపెను. అచటి నుండి పోవునపుడు త్రోవలో నీళ్ళు దొరకనిచోట్ల నెల్ల నీమె బావులు త్రవ్వించి యూరివారికిని బాటసార్లకును గలయిబ్బందులను దొలఁగించుచుఁ జనెను. అచటియాత్ర సాంగముగాఁ జేసికొని పోయినదారినే తిరిగి స్వగ్రామము చేరెను.

వి. శ. 1908 వ సంవత్సర మాషాడశుద్ధ యేకాదశి రోజున నీపవిత్రురాలగు సాధ్వి పుణ్యలోకమున కరిగెను ! మరణసమయమునం దామెకు రమారమి 57 సంవత్సరముల వయ స్సుండెను. ఆమె మృతి నొందినందున కాపట్టణమునందలి ప్రజ లందఱును మిగుల దు:ఖించిరి.

రఖమాబాయిగారికి నిద్దఱుపుత్రిక లుండిరి. వారిలో పెద్దదియగు --బాయినిబాపూసాహెబ్ పణశీకర్‌గారికి నిచ్చి వివాహము చేసిరి. రెండవదగు చిమూతాయిని నానాసాహెబు కాకిగ్డేగారికి నిచ్చి వివాహము చేసిరి. వారిలో పెద్దామె కొమారుని రఖమాబాయిగారు పెంచుకొని యతనికి గణపతిరావు లేక దాజీసాహెబ్‌కిబేయని పేరుపెట్టిరి. చిన్నకూఁతురి వంశముసయితము వృద్ధిపొందుచునే యున్నది.