Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/జసరేశ్వరి

వికీసోర్స్ నుండి

జసరేశ్వరి

ఈయువతీరత్నము ప్రసిద్ధుఁడగు అక్బరుకాలమునందుండెను. ఈమె వాస్తవమయిన నామ మెవ్వరికినిఁ దెలియదు; గాని యామెను లోకులు గ్రామదేవతయగు జసరేశ్వరి పేరనే పిలుచుచుండిరి. ఆకాలమునందు బంగాలీదేశమున మాండలికులుగానుండి యక్బరునకు కప్పము నిచ్చుచుండిన రాజులలో జసరేశ్వరికి భర్తయు, జేసోరీ సంస్థానీకుఁడును నగు విక్రమాదిత్యుని పుత్రుండయిన ప్రతాపాదిత్యుఁడొకఁ డయియుండెను.

ప్రతాపాదిత్యుఁడు మిగులబలవంతుఁడేగాని యాతనిబల శౌర్యములకుఁ దోడుసద్గుణము లలవడక జన్మముతో దుష్కరములే వృద్ధియగుచుండెను. ఈయన పూర్వుల కెవ్వరికో గ్రామదేవతయగు జసరేశ్వరి ప్రత్యక్షమయి మీవంశమున నెన్నఁడేని పాపాచరణ జరిగిన నేను గ్రామము విడుతుననియు, నా విగ్రహపుముఖము మఱియొకవైపునకుఁ దిరిగిన నేనుగ్రామమును విడిచితినని తెలిసికొనవలెననియుఁ జెప్పెనని యొకవాడుక కలదు. ప్రతాపాదిత్యుని దుష్ప్రవర్తనఁ గనినవా రందఱును త్వరలోనే గ్రామదేవత గ్రామమును విడిచి పోవునని భయపడుచుండిరి. రాణి జసరేశ్వరి తనభర్త యిట్టి దుష్టుఁడయినను నాతనియెడ నిసుమంతయు దిరస్కారభావము లేనిదయి సదా యాతనిని సన్మార్గమునకుఁ ద్రిప్ప యత్నింపుచుండెను. సుగుణమణియగుపత్ని యనేకవిధముల హితములు బోధింపుచున్నను ప్రతాపాదిత్యుఁడు వాని నన్నిఁటిని పెడ చెవులఁ బెట్టి దుష్ప్రవర్తనమును మానకుండెను. ఆతఁడుద్రవ్యాశచే మిగుల సైన్యమును తోడుకొని పల్లెలు, పట్టణములు కొల్లగొట్టసాగెను. ఆతని వర్తనము నెఱిఁగి కొందఱుబందిపోటు దొంగలాతనికి సహాయులు కాఁగానాతఁడు దక్షిణ బంగాళాదేశమునం గలసామంతరాజులను, జమీం దార్లను, కొల్లగొట్టితానువారికి ప్రభువునని వారిచేఁగప్పములఁ గొనుచుండెను. ఆయనకు బుడుతకీచులు (పొరుచుగీజులు)ను తోడుపడుటచే నాతఁడు బంగాళా ప్రాంతమునకు సుబేదారుగానుండిన మహమ్మదీయునికి సహితము మిగుల దుస్సాధ్యుఁడుగా నుండెను. తుద కాతఁడు బాదుషాకు పన్ను గట్టక స్వతంత్రతను వహించెను.

ఆదుష్టుఁ డంతటితో నయిన నూరకుండక పినతండ్రియగు బసంతరాయులయెడ ద్రోహము తలఁచెను. బసంతరాయులు మిగుల సజ్జనుఁడును రాజవంశమునందలి వృద్ధుఁడును నగుటచే ప్రజ లాతనియం దధిక భక్తిగలవాఁరై యాతనిని విశేషముగా గౌరవింపుచుండిరి. ఆభీష్మునకుఁ దనయన్న కుమారుని చేష్ట లెంతమాత్రమును నిష్టము లేక యనేక పర్యాయము లాతనికి బుద్ధి చెప్పి చూచెనుకాని, యందువలన ఫల మెంతమాత్రమును గలిగినదికాదు. ప్రతాపాదిత్యుని కాతనిమాటలవలన ద్వేషము గలిగి తనప్రజలు పినతండ్రియొక్క సత్స్వభావము నెఱిఁగి తననుపదచ్యుతులను జేసి రాజ్యమాతని కిచ్చెదరేమోయని తలఁచి యాతనిఁజంప నిశ్చయించెను. జసరేశ్వరికి భర్తచేయు దురాలోచన తెలిసి తన్నివారణార్థమై యామెయాతని కనేక హితబోధ లొనర్చియు, వేఁడుకొనియుఁ జూచెను. కాని యందువలన ఫలమెంత మాత్రమును గలుగుజాడ కానరాదయ్యెను. జసరేశ్వరియందును కెంతయు జింతింపక పతిచేత నట్టిదుష్కార్యము కాకుండ నొక యుపాయముఁ యోచించెను.

బంగాళాదేశమునందు బహుదినములనుండి నడుచుచుండిన యొక యాచారము కలదు. అది యిప్పటికిని ఆదేశమునం దచ్చటచ్చట నడుచుచున్నదఁట. అది యేదనగా నొకస్త్రీ తనకార్యము నొకశూరపురుషునిచేఁ జేయించఁగోరినప్పు డామె తనచేతి కంకణము నొకదానిని శూరులసభకుబంపును. దానిం గొని చని యొకదాసి యీశూరులమధ్యం బడవేయును. తదనంతర మచటి శూరులలో నొకఁ డాకంకణమునుతీసికొని కంకణమంపిన స్త్రీ యెట్టిదుర్ఘటమైన కార్యము నిర్వహింప నంపినను నిర్వహించెదనని ప్రతినచేయును. జసరేశ్వరి దీనినంతను విచారించి తన నాయుపాయముచేయ నెంచెను. తదనంతర మొకదినము రాణిగారి యాజ్ఞవలన నామె కంకణమును దాసికొనివచ్చి ప్రతాపాదిత్యుని కొలువుకూటమునం బడవేసెను. దాని గని సభికులందఱు మిగుల వింతపడి రాజువంకఁ జూచుచుండిరి. ప్రతాపాదిత్యుఁడు తిరస్కారముగా దానికయి చూడకుండెను. తుద కాసభయందలి శూరుఁడొకఁడు లేచి మెల్లఁగా ముందడుగిడెను. ఆలేచినవాఁడు రాణిగారి సహోదరుఁడును, ప్రతాపాదిత్యుని సేనానియునై యుండెను. ఆతఁ డట్లు లేచి కంకణమునెత్తి రాజువంకఁ దిరిగి యిట్లని వక్కా ణించెను. "ఈ కంకణము తమపత్ని కడనుండి వచ్చెను. రాణిగారి కిట్టిసంకటమేమి వచ్చినదో తెలియదు. ఆమె సంకటమును నివర్తింప తమరే దీని నెత్తెదరని యెదురు చూచుచుంటిని. కాని తాము దాని నెత్తుజాడ కానరానందున నేనెత్తవలసిన వాఁడనయితిని. అదేలననఁగా యెవ్వరును నెత్తకుండిన నింతసభయందు శూరుఁడులేన ట్లర్థమగును. కాన నేనెత్తి యిట్లు ప్రతిజ్ఞఁ జేయుచున్నాను. నాబొందిలో ప్రాణమున్నంతవఱకు రాణిగారి యిచ్ఛితకార్యమును నెరవేర్పకమానను."

సేనాపతి ప్రతిజ్ఞనువిని రాజు మనమునందు మిగుల కోపించెను. కాని యాతఁడు తనమఱఁది నేమియు ననుటకు సాహసింపఁడయ్యె. దీనినంతను గనికంకణము తెచ్చినదాని మిగుల సంభ్రమముతో రాణిగారియిచ్ఛితకార్యమును సభవారి కిట్లు నివేధించెను. "రాణిగారి యిచ్ఛితకార్యమును వినుఁడు ఈకంకణము నెత్తిన వీరపురుషుఁడు రాజావసంతరాయులను, ఆతని కుటుంబమును రక్షించుటకయి తమప్రాణ మున్నంత వఱకును బ్రయత్నింపవలయును" "ఆమె యిచ్చ ప్రకారమే జరుగున"ని యాసేనాధిపతి తనసంస్థానమునఁ గూర్చుండెను.

ఆదినము సభచాలించి రాజు రాణినగరునకు వచ్చెను. ప్రతాపాదిత్యుఁ డితరుల కెంతభయంకరుఁడయినను తనపత్ని ముందర నాభయంకరత యేమియులేక మిగుల సాత్వికుఁడుగా నుండుచుండెను. ఇదియంతయు జసరేశ్వరియొక్క నేర్పుచాతుర్యమువలననేకాని మఱివేరుకారణముచేఁగాదు. ఎట్టిదుష్టులును ఆమెను గనిన సమయమునందు శిష్టులుగా నుండుచుండిరి. ప్రతాపాదిత్యుఁడు రాణిమనస్సు మరల్ప ననేకయుక్తులను బన్నెను కాని వానివలనఁబ్రయోజన మెంతమాత్రమును కానరాకుండెను. అందుపైనాతఁడామెను భయపెట్టియు, బతిమాలియు, వసంతరాయులను జంపినయెడలఁ దమకుఁ గలుగులాభములనుదెలిపి వసంతరాయులు బ్రతికియుండఁగా నాకుసుఖము కలుగదని చెప్పెను. కాని రాణి తననిశ్చయమును విడువక "మీకు సుఖము కలిగినను దు:ఖము కలిగినను మీచే నట్టి పాపకార్యము జరగనియ్యన"ని స్పష్టముగాఁ దెలియఁజెప్పెను.

బహిరంగముగాఁ బినతండ్రినిఁ జంపుట దుర్ఘటమని తలఁచి ప్రతాపాదిత్యుఁడు కపటమును బన్నెను. అతఁడు తానదివఱకు చేసిన దుష్కార్యమునకుఁ బశ్చాత్తాపపడినటుల నటియించి వసంతరాయల సన్నిధికరిగి మిగుల వినయముతో నాతనికి నమస్కరించిక్షమియింపుఁడని వేఁడుకొనెను. కొమారునిపశ్చాత్తాపమున కెంతయు సంతసించి వసంతరాయు లాతనిని మిగుల గారవించెను. అందుపైరాజు పినతండ్రిని నేఁడు తమరు నాతోడభోజనమునకు వేంచేయుఁ డని వేఁడుకొనఁగాఁ గపట మెఱుఁగని యావృద్ధ రాజందునకు సమ్మతించెను.

ప్రతాపాదిత్యుఁడు పై కెంతసాధుస్వభావముఁ దాల్చినను ఆతని దుస్స్వభావము నెఱిఁగిన రాణి వసంతరాయుల పుత్రునిఁ దెచ్చి తనవద్ద దాచియుంచినపిదప భర్తను పినమామగారి వద్దికి పోవ నిచ్చెను. తదనంతరము వసంతరాయులు విందారగింప బయలుదేరెను. అప్పు డాయనకుప్రతాపాదిత్యుపై యించుక సంశయముకలిగి యొక పావురమును తనతోడఁ గొనిపోవుచు తనభార్య కిట్లని చెప్పెను. "ఈపావురము నను వదలియిటకు వచ్చునేని నాకు కారాగృహ వాసమో, స్వర్గవాసమో కలిగెనని తెలిసికొనుము."

ఇట్లాయన తనపత్నిని వీడ్కొని అశ్వారోహణముచేసి మితపరివారముతో జేసోరునకుఁ బయలుదేరెను. ఇంతలో నాతని నెదుర్కొనుటకయి ప్రతాపాదిత్యుఁడు పంపిన సేన లాతనిని దారి తప్పించి యొకయరణ్యమధ్యమునకుఁ గొని చని యచట నతనిని జంపిరి. ఆయనప్రాణము విడిచినతోడనే పావుర మాతని భార్యసన్నిధి కరిగెను. ఆపక్షినిం గనినతోడనే యాసతి మానహానికి వెఱచి తనపరివారముతో సమీపమునందున్న చెఱువునంబడి ప్రాణములు విడిచెను. ఆమె పుత్రుఁడుమాత్రము జసరేశ్వరియొక్క సంరక్షణలో సురక్షితుఁడై యుండెను.

పినతండ్రినిఁ జంపి తాను సుఖింతునని ప్రతాపాదిత్యుఁడు తలఁచెను. కాని యాతని పాపఫల మధికమైనందున నాతని కట్టిసుఖము దొరకదయ్యెను. వసంతరాయుల మరణానంతర మల్పకాలములోనే రాజామానసింహుఁడను అగ్బరు సేనాధిపతి విపులసైన్యముతో ప్రతాపాదిత్యునిపై యుద్ధయాత్ర వెడలెను. ప్రతాపాదిత్యుఁ డును ఆతనితోడఁ బోరుటకు శక్తుఁడుగా నుండుటవలన యుద్ధసన్నద్ధుఁడయ్యెను. ఆసమయమున నాతనియొద్ద నెనుబదివేల కాల్బలములును, పదివేల అశ్వములును, ఇన్నూరు గజములును నూరుతోపులు యుద్ధమునకయి సిద్ధముగానుండెను. ఇదిగాక బుడతకీచులును ఆతనికి సహాయులైయుండిరి. కానియింత కలిగియుఁ దుద కాతనికే యపజయము కలిగెను. దీనికొక కారణము కలదు. అచటి గ్రామదేవతయగు జసరేశ్వరియొక్క ముఖము మఱియొకవైపునకుఁ దిరిగెనఁట. యుద్ధసమయమున నీవార్త సైనికులకుఁ దెలియఁగా తమరాజు దుష్ప్రవర్తనము వలన దేవిగ్రామమును విడిచిపోయెను గాన జయము కలుగదని తలఁచి వారు నిరుత్సాహులయిరి. తదనంతరము వారి పిచ్చి నమ్మకమును పోఁగొట్టవలయునని రాజనేకరీతుల యత్నించెను. కాని వారందఱు తమరాజు దుష్టత్వము నెఱిఁగినవారలే కాన నాతనిమాటలను నమ్మక సంగ్రామరంగమును విడిచి పాఱిపోవఁదొడఁగిరి. కానఁ బ్రతాపాదిత్యుఁ డల్పకాలములోనే పగఱచేఁ జిక్కి కారాగృహవాసి యయ్యెను.

ప్రతాపాదిత్యుఁడు చేతఁ జిక్కిన తదనంతరము మానసింహుఁడు రాజధానియగు జేసోరుపట్టణముం గొనువేడ్క నాపట్టణమును సమీపించెను. కాని పట్టణము నలుదిక్కుల సంరక్షకులతో రక్షింపఁబడుచుండుటఁ గని యాతఁడు మిగుల వింతపడెను. దాని నెవరు రక్షించెదరని విచారింపఁగా ప్రతాపాదిత్యునిభార్యయగు జసరేశ్వరి తాను సైన్యాధిపత్యమును స్వీకరించి గ్రామసంరక్షణ మొనర్పుచున్నదని తెలిసెను. అందుపై నాతఁడు గ్రామము తనస్వాధీనపఱుపమని జసరేశ్వరికి వర్తమాన మంపెను. అందుపయి నామె స్వపరబల తారమ్యముల నెఱిఁగి మిగుల చాతుర్యముగా నిట్లు ప్రత్యుత్తర మంపెను. "నేను కోరిన కొన్ని సంగతులను మీరొప్పుకొనిన నగరము మీకొప్పగించెదను. నగరరక్షణమునకై రక్తధార లొడుపుట నిష్ప్రయోజన మని నే నెఱుఁగుదును. మీరు మాగ్రామమును కొల్లగొట్టుట మొదలగు బాధలఁ జరుప కుండిన పక్షమునను, నాభర్త యెచ్చటనుండునో యచ్చటనే నన్ను నుంచుటకు సమ్మతించిన పక్షమునను నిరాటంకముగా నీయూరు మీస్వాధీనపఱచెదను. ఇది మీకసమ్మతమేని నాబొందిలోఁ బ్రాణము లున్నంతవఱకును యుద్ధము చేయఁ గలదానను."

రాజామానసింహుఁ డామె కోరినసంగతుల కనుమతించి పట్టణము వశపఱచుకొని ప్రతాపాదిత్యునిఁ గొని డిల్లీకుఁ బ్రయాణ మయ్యెను. రాణీ జసరేశ్వరి భర్తయం దధికభక్తి గలదిగాన నట్టిసంకట సమయమునందు అతని విడువక వెంబడించెను. కాని ప్రతాపాదిత్యుఁడు కారాగృహవాసదు:ఖము నోర్వఁ జాలక డిల్లీమార్గముననే గతప్రాణుఁ డయ్యెను. కాన నా కాలమునం గలయాచారప్రకారము జసరేశ్వరి సహగమనము చేసెను.

ఇట్టి స్త్రీ లేకదా సాధ్వీమణులనం దగియుందురు. జసరేశ్వరివంటి రూపగుణములు గలశూరస్త్రీ దొరకినను నిర్భాగ్యుఁ డగు ప్రతాపాదిత్యుఁ డామె సహవాసము వలన ఫలము నెంతమాత్రమును బొందకుండగా తనదుష్కర్మమువలన నామెకు దు:ఖముకలుగఁ జేసెను. జసరేశ్వరి కట్టిదుష్టుఁడు భర్తయయినను అతనియం దెంతమాత్రమును దిరస్కారబుద్ధిలేక సన్మార్గప్రవర్తకునిఁ జేయ యత్నింపుచుండెను. ఇదియేభార్య ధర్మము; గాని యది భర్తధర్మము గాదు.


జోధపురపు రాణి

ఈరాణి ఔరంగజేబుబాదుషా రాజ్యారంభమునందు ననఁగాఁ బదు నేడవశతాబ్దమధ్యమున నుండెను. శహజహన్ బాదుషా రాజ్యదినములలో మార్వాడదేశమునందలి జోధపుర రాజ్యమును జసవంతసింగుఁడను రాఠోడవంశీయుఁ డగురాజు పాలింపుచుండెను. ఈయన పత్నియొక్క ధైర్యస్థైర్యములును స్వాభిమానమును మిగుల శ్లాఘనీయములు ఆమెపే రెచటను కానరాదు. కానియామె చేసినకార్యము లనేక దిక్కుల వర్ణింపఁబడినవి.

ఈజసవంతసింగు డిల్లీపతియగు శహజహానునకు సామంతుఁడయి యుండెను. జసవంతసింగు మిగుల పరాక్రమ వంతుఁడయి ఔరంగజేబును ఉత్తరమునకు రానియ్యక మాళ్వా ప్రాంతముననే బహుదినములవఱకు సంగ్రామము చేయుచు నాపెను. అప్పుడాయవరంగ జేబు తండ్రియగు శహజహనుని పదచ్యుతినిఁ జేయు తలంపుతో సహోదరసహితుఁ డయి డిల్లీకిఁ జనుచుండెను. త్రోవలో నుజ్జయనీయం దాతనిని జసవంతసింగు డాపఁదలఁపఁగా నాయిరువురకును ఘోరయుద్ధము జరిగెను. ఆయుద్ధమునందు సైనికులందఱు సమయుట వలన జయము కలుగునని ఆశలేక జసవంతసింగు మరలి తన నగరమునకు వచ్చుచుండెను. గ్రామమును సమీపించినకొలఁదిని ఆతని కొకవిధమయిన భీతి జనించెను. ఏలయనఁగా తాను పరా