అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/గనోరు సంస్థానపురాణి

వికీసోర్స్ నుండి

గనోరు సంస్థానపురాణి

ఈశౌర్యశాలినియగు సతీరత్నముచేసిన శౌర్యసాహసములు దక్క విశేషచరిత మేమియుఁ దెలియదు. ఈమెపేరేమియో, జననీజనకుల పేళ్ళేమియో తెలిసికొనుటకుఁ బ్రస్తుత మేమియు సాధనములు కానరానందున నామె స్వల్పచరితము నిందుఁ దెల్పెదను.

మధ్యహిందూస్థానము నందలి బోపాలసమీపమున పూర్వము గనోరుసంస్థానమను నొకహిందూరాజ్య ముండెను. మహమ్మదీయులు హిందూస్థానమునకు వచ్చి స్వదేశపురాజుల పాలనలో నుండిన రాజ్యములను తాము స్వాధీనపఱచుకొను కాలములోని చిన్న సంస్థానము కొంతవఱకు ధైర్య మవలంబించి స్వతంత్రముగా నుండెను. మోగలులు డిల్లీ ప్రవేశించి యచటి తురుష్కులను వెడలఁగొట్టఁగా వారు హిందూస్థానము నలుగడలం జేరి వారివారిశక్త్యనుసారముగా రాజ్యములం గెలిచి జనుల ననేక బాధలకు లోను జేసిరి. ఇట్టివారిలోఁ జేరిన యొక మహమ్మదీయుఁడు మధ్యహిందూస్థానమునకు వచ్చి గనోరు రాజ్యమును గెలిచి యచట తనరాజ్యమును నిలుపవలయునని యత్నించెను. కాని యాసంస్థానమును గెలుచుట యాతఁ డనుకొనిట్లు సులభముగాక మిగుల దుస్తరమాయెను. తురకలు తనరాజ్యముపై యుద్ధమునకు వచ్చుట విని గనోరురాజు మిగుల రోషముతో వారితోడ యుద్ధమునకుఁ జనెను. అందు వలన రక్తప్రవాహము కానిదీ గనోరురాజ్య మొక యడుగయినను వారికిఁ జిక్కదయ్యెను. గనోరురాజాసంగ్రామమున తన శౌర్యసాహసములనంతను వినియోగించిచూచెను. కాని యాదినములు మహమ్మదీయులకు సుదినము లగుటవలన నాశౌర్యనిధియగు భూపాలుఁడు వీరస్వర్గమునకుఁ జని తురకలకే జయము ప్రాప్తించెను.

రాజు శూరసైన్యసహితముగా హతుఁ డగుట విని యాతని రాణి మిగుల దు:ఖించెను. కాని యాధైర్యవతి తన దు:ఖమునంతను మ్రింగి మరల క్రొత్తసైన్యమును సిద్ధపఱిచి తా నాసైన్యాధిపత్యమును స్వీకరించి హతశేషులగు తమసైనికులు మహమ్మదీయులతోఁ బోరాడుచున్న స్థలమునకుఁ జనెను. రాణిగారు సైన్యసహితముగాఁ దమకు సహాయమునకు వచ్చుటఁగని యావీరులు మఱింత శౌర్యముతోఁ బోరఁ దొడఁగిరి. రాణిగారును తనభర్తవలెనే యుద్ధమునందు మిగుల నేర్పుగలది యగుటవలన నామెధైర్యమువలన గనోరుసైన్యము మిగుల తెంపుతోఁబగర నడవఁ దొడఁగెను. కాని మ్లచ్ఛసైన్యమధికమగుట వలన వారిప్రయత్న మంతయు వృధయై రాణిగారు కోటలలో నైదుకోటలు తురకల పరంబులయ్యెను. తుదకల్పసైన్యముతో రాణిగారుమాత్రము జీవించియుండెను. అప్పటికిని నామెధైర్యము విడనాడక యుద్ధము చేయుచుండెను. మఱికొంతసేపటికి మహమ్మదీయులు మనసు పట్టుకొందురని రాణిగారికిఁ దోఁచి తన స్వాధీనములో మిగిలియున్న నర్మదాతీరపుకోటలోనికిఁబోయెను. ఆమె నర్మదాదాఁటి కిల్లాలోనికిఁ బోయినవెంటనే మహమ్మదీయు లాకోటను చుట్టుముట్టిరి. పగవారు సమీపించినందున రాణి తీవ్రముగాఁ గోటలోని కరిగి ద్వారముల నన్నిఁటిని మూసికొనెను. ఈతొందరలో సైనికు లనేకులు కోటబయిట నుండుటచేఁ బగవారిచే నతిక్రూరముగాఁ జంపఁబడిరి.

కోటలో నత్యల్పసైన్యము రాణిగారితోడ నుండెను. ఆస్వల్పసైన్యముతోడ రాణి కొంతవఱకు సంగ్రామము నడపెను. కాని దానిని లక్ష్యపెట్టక విజయులగు నామ్లేచ్ఛులు కోటకు నిచ్చెనలు వేసి వేలకొలఁది కోటలోనికిఁ జొచ్చిరి. ఆసమయమునందు రాణిగారికి శరణు చొచ్చుటకంటె నొండుమార్గము లేనందున "కోటను మీస్వాధీనము చేసెదను; యుద్ధము నాపు" డని యాసైన్యాధిపతియగు తురుష్కునకు నొకదూత పరమున మంపెను.

రాణిగారివద్దినుండి వచ్చినకబురువిని యాఖానుసాహేబు మిగుల సంతసించెను. వాఁడదివఱకు రాణిగారి యసమానరూపమునువిని యామెపైనధికమోహము కలిగియుండెను. కానవాఁడు సంకోచపడక ఆవచ్చినదూతతోడ నిట్లని చెప్పిపంపెను. "తమ యధిక సౌందర్యమునకు నేను మెచ్చితిని. మీరిదివఱకు మహారాజ్ఞిపదవియందుంటిరి. కాన నేను జీవించియుండు నంతవఱకు నా పదవియే కలిగి యుండవలయును. నేను సేవకునివలె నీ గనోరురాజ్యము నేలేదను." ఈవాక్యములు వినఁగానే రాణిగారాదుష్టుని యభిప్రాయ మెఱిఁగెను. కాని యామె తానేమి చేయుటకును దోఁచక కొంతసే పేమియో యోచించి తురుష్కులపై నామెకుఁ గలకోపవహ్ని నార్పునుపాయము నొండు గానక నామ్లేచ్ఛుని నొకకపటోపాయముతోఁ జంప నిశ్చయించెను. ఇట్లు కృతనిశ్చయయయి యాదూతతోడనే ఖానున కిట్లు చెప్పి పంపెను. "నేనును మీయతుల పరాక్రమము విన్నది మొదలు మీభార్య నగుటకుఁ దొందర పడుచున్న దానను. క్షత్రియస్త్రీలు పరాక్రమవంతులనె మెచ్చెదరు. నావంటి స్త్రీని వివాహ మగుటకుఁగా మీ రొప్పినదే నా కొకసన్మానమని తలఁచెదను. కాని మనవివాహప్రయత్నము చక్కఁగా జేయుటకయి నాకు కొంత యవకాశ మియ్యవలయును."

ఖానుసాహేబు మిగుల సంతోషముతో రాణిగారు చెప్పినట్లంతయు నొప్పుకొనెను. వానికి నాటిని బోలినసంతోషదినము జన్మించినదిమొదలు ప్రాప్తించకుండెను. కాన వాఁడు రాఁబోవు సౌఖ్యసముద్రములో మునిఁగియుండెను. ఇట్లాతఁ డానందమగ్నుఁడయియున్న కాలములో లగ్ననిశ్చయమునకని రాణిగారివద్దినుండి రత్నఖచితమగుదుస్తు ఖానునకు వచ్చెను. దానిం గనినపిదప నాతని సంతోషమునకుఁ బారములేదయ్యెను. అప్పుడు రణవాద్యములును, ఘోరనాదములును నెచ్చటలేని మంగళవాద్యములును, శుభవాక్యములును నలుగడల వినఁబడుచుండెను. తమసైన్యాధిపతి వివాహదినము గాన నామ్లేచ్ఛసైనికులు మదిరాపానముచే శరీరభ్రాంతిలేకయుండిరి. ఖానుసాహేబు మిగుల నానందముతో రాణిగారంపిన దుస్తు ధరియించి వివాహమున కెప్పుడు పిలుపు వచ్చునాయని నిరీక్షింపుచుండెను.

ఇంతలో రాణిగారివద్దినుండి పిలుపురాఁగాఁ బరమానందముతోఁ దురుష్కుఁడు వివాహమంటపముకడకు వచ్చెను. అచటికి వచ్చి యాతఁడు రాణిగారినిఁ గని తానదివఱకు వినిన దానికంటే నామె విశేషసౌందర్యవతిగా నుండుటవలన నాతనికి విశేషానందము కలిగెను. నర్మదయొడ్డు నంటియున్న యొక విశాలభవనమునం దీవివాహప్రయత్నము చేయఁబడెను. రాణి సర్వాలంకారయుత యయి యొకమంచముపయి కూర్చుండి యుండెను. ఇతర రాజస్త్రీలును, దాసీలును పైని మంచి తివాచిపఱచిన యొకయుచ్చస్థలమునఁ గూర్చుండిచేత నొక్కొక దివిటీలను పట్టుకొనిరి. ఖాను రాఁగానే రాణిగా రాతనినొక మంచముపై కూర్చుండ నియమించెను. ఖానుసాహేబు రాణిగారి వాక్యములను శిరసావహించి మంచ మెక్కెను. ఆమంచముపై కూర్చుండి రాణిగారితో నేమో కొంతసేపు మాటాడిన పిదప నాదుష్టుని శరీరమునం దంతటను తాపముపుట్టి శరీరము నల్లఁబడి నాలుక లోనికి గుంజసాగెను. వాఁడు మరణవేదనకుఁ దాళఁజాలక నేలఁబడి పొరలఁదొడఁగెను. అప్పుడు రాణి వాని సమీపమున కరిగి మిగుల కఠినముగా వాని కిట్లనియె. "పాపీ! నీపాపఫల మనుభవింపుము. ఓచెడుగా! నీకు మృత్యువు సమీపించెను. నీవు తొడుగుకొనిన దుస్తంతయు విషముపూసినది. కాన నావిషమంతయు నీశరీరమున నింకెను. కనుక నిఁక నీవు జీవితాశను వదలుము. నాపాతివ్రత్య రక్షణమునకు వేరుపాయము గానక యీనింద్య కార్యమునకుఁ దెంపుచేయవలసే" ఖానుసాహేబుగారి యవస్థంగని యాతనిసేవకులు కొంతవడి రిచ్చవడి యూరకుండిరి. వారు తెలివితెచ్చుకొని యాగడము చేయ నెంచునంతలో రాణిగారు గవాక్షములోనుండి నర్మదలోనికిఁ దుమికిరి. అంత నామ్లేచ్ఛభటు లేమిచేయుటకుఁ దోఁచక నచటనున్న యితరస్త్రీలను బాధింప నెంచిరి. కాని యాస్త్రీలు తుపాకిమందు గోనెలపైఁ గూర్చుండి యుం డినందున వారు తమచేతి దివిటీలతో నామందు గాల్చిరి. అంత నగ్ని ప్రజ్వరిల్లి యాస్త్రీలును అచట నుండిన మ్లేచ్ఛభటులును నొక్కసారిగా నాశ మొందిరి ! !

ఇట్లు తేజోమయురాలగు రాణి పరాజయ మొందియు, పగవానిచేఁ జిక్కియుమిగుల యుక్తిగా నాపగతునిఁ జంపి పాతివ్రత్యమును గాపాడుకొనెను!! ఇట్టిపతివ్రతలే ధన్యలుగదా?

జసరేశ్వరి

ఈయువతీరత్నము ప్రసిద్ధుఁడగు అక్బరుకాలమునందుండెను. ఈమె వాస్తవమయిన నామ మెవ్వరికినిఁ దెలియదు; గాని యామెను లోకులు గ్రామదేవతయగు జసరేశ్వరి పేరనే పిలుచుచుండిరి. ఆకాలమునందు బంగాలీదేశమున మాండలికులుగానుండి యక్బరునకు కప్పము నిచ్చుచుండిన రాజులలో జసరేశ్వరికి భర్తయు, జేసోరీ సంస్థానీకుఁడును నగు విక్రమాదిత్యుని పుత్రుండయిన ప్రతాపాదిత్యుఁడొకఁ డయియుండెను.

ప్రతాపాదిత్యుఁడు మిగులబలవంతుఁడేగాని యాతనిబల శౌర్యములకుఁ దోడుసద్గుణము లలవడక జన్మముతో దుష్కరములే వృద్ధియగుచుండెను. ఈయన పూర్వుల కెవ్వరికో గ్రామదేవతయగు జసరేశ్వరి ప్రత్యక్షమయి మీవంశమున నెన్నఁడేని పాపాచరణ జరిగిన నేను గ్రామము విడుతుననియు, నా విగ్రహపుముఖము మఱియొకవైపునకుఁ దిరిగిన నేనుగ్రామమును విడిచితినని తెలిసికొనవలెననియుఁ జెప్పెనని యొకవాడుక కలదు. ప్రతాపాదిత్యుని దుష్ప్రవర్తనఁ గనినవా రందఱును త్వరలోనే గ్రామదేవత గ్రామమును విడిచి పోవునని భయపడుచుండిరి. రాణి జసరేశ్వరి తనభర్త యిట్టి దుష్టుఁడయినను నాతనియెడ నిసుమంతయు దిరస్కారభావము లేనిదయి సదా యాతనిని సన్మార్గమునకుఁ ద్రిప్ప యత్నింపుచుండెను.