Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/ఆవడాబాయి

వికీసోర్స్ నుండి

ఆవడాబాయి.

విద్యా దదాతి వినయం వినయా ద్యాతి పాత్రతాం. [1]

ఈమె మహారాష్ట్రబ్రాహ్మణ స్త్రీ. 1869 వ సంవత్సరమునందు నీమె రత్నగిరిలో జన్మించెను. ఈమె తండ్రిపేరు రావుబహద్దరు విష్ణుమోరేశ్వరభిడే. ఆయన అసిస్టంటు కలెక్టరు అదికారమునం దుండెను. ఆవడాబాయి జన్మించిన రెండుమూడు నెలలకే యామెతండ్రిగారి నచటనుండి నాసికకు మార్చిరి. ఆవడాబాయి బాల్యమునందలి మూడునాలుగు సంవత్సరము లచటనే గడచెను. అందుపై నామె తండ్రియగు విష్ణుపంతుగారి నచటనుండి సురతు అనుగ్రామమునకు మార్చిరి. సురతునందు కొద్దిదినము లుండినవెనుక నచటినీళ్ళు శరీరమునకుఁ బడనందున విష్ణుమోరేశ్వరుగారు తమకుటుంబమును పూనానగరమునకుఁ బంపిరి. నాటినుండి ఆవడాబాయి జన్మమంతయు నచటనేగడచెను. ఆవడాబాయి బాల్యమునందుఁ గొంచెము విద్యనభ్యసించెను కాని యామెయందుఁగల యపూర్వసద్గుణములన్నియు నప్పుడు పూర్ణముగా వికసించుటకు వీలు లేక యుండెను. అయినను సహనశీలత, శుభ్రతమాత్ర మామెయందు నతిబాల్యమునుండియుఁ గానఁబడుచుండెను. 1880 వ సంవత్సరమునందు సోలాపురమునందుండు దాదా సాహెబుజోగుగారి జేష్ఠపుత్రుఁడగు అప్పాసాహెబు అను నాతనిని ఆవడాబాయి వివాహమయ్యెను. వివిహానంతర మాఱుమాసములలోనే యత్తమామలు లోకాంతరగతులైరి. కాన ఆవడాబాయి పాదగుణఫల మిదియని లోకు లామెను నిందింపసాగిరి. ఇట్టి నిందనలను లెక్కింపక యాయబల పరమేశ్వరుని నమ్మియుండెను. తదనంతరము 1886 వ సంవత్సరమునం దామెకు దు:ఖసహమగు వైధవ్యము ప్రాప్తించెను. పతిమరణసమయమునం దామెకు పదియేడేండ్ల ప్రాయముండెను ఇంత చిన్నతనమునందుఁ గూఁతున కిట్టిదురవస్థ ప్రాప్తించి నందున రావుబహద్దరు భీడేగారు ఆవడాబాయికి విద్యనేర్పి ఆవిద్యవలనఁ గలుగు ఆనందములో నామె వైధవ్యదు:ఖమును లోపింపఁదలఁచిరి.

హిందూదేశ హితచింతకులగు సర్ విల్యమ్ వేడర్ బర్నుదొరగారు పూనానివాసులను ప్రోత్సాహపఱచి వారికి ననేక విధసహాయములఁ జేసి స్త్రీలకొఱకు స్థాపించిన హయిస్కూలులో ప్రధమమునం దావాడాబాయియే విద్యార్థిని యయ్యెను. ఈమె యంతకుఁ బూర్వమె మహారాష్ట్రభాష యందు నాలుగుపుస్తకములును, ఇంగ్లీషు మొదటిపుస్తకమును ఇంటనే చదివినదేగాన, పాఠశాలాధ్యక్షురాలామెను పరీక్షించి యింగ్లీషు రెండవతరగతిలోఁ జేర్చుకొనెను. అచట విద్య నభ్యసించుకాలమునం దామె తనసత్ప్రవర్తనవలనను, విద్యాభిరుచివలనను సహాధ్యాయినులకును, ఉపాధ్యాయినులకును మిగుల ప్రియురా లాయెను. ఆవడాబాయి ప్రతిసంవత్సరము పరీక్షలయందుఁ దేరుచు తప్పక బహుమానములను బొందుచు వచ్చెను. తాను చదివినపుస్తకము లన్నియు తనకాపీపుస్తకము లన్నియు, తనవారపరీక్షలలోని ప్రశ్నోత్తరకాగితము లన్నియు నామె తనమరణకాలము వఱకును మిక్కిలి శ్రద్ధతో దాఁచియుంచెను. శ్రద్ధయను సద్గుణము బాల్యమునుండియే యామెయందుఁ గానుపించుచుండెను. (1884 వ సంవత్సరమునుండి 1888 వ సంవత్సరమువఱకు నాలుగుసంవత్సరములలో నీమె ఇంగ్లీషు నాఱవపారపుస్తకము ముగించెను. సాధారణముగా నొక్కొక్కపుస్తకము చదువుటకు నొక్కక్క సంవత్సరము పట్టును; గాని ఆవడాబాయి రెండవ మూడవపాఠపుస్తకముల నొక్కసంవత్సరములోనే చదివెను. ఈమె యింగ్లీషు నాల్గవపాఠపుస్తకముతోడనే సంస్కృతాధ్యయనము ప్రారంభించెను.) ఈమె సంస్కృతమునం దధిక శ్రద్ధగలిగి పని చేసినందున త్వరలోనే యాదేశభాషయందు నామెకుఁ గొంత వ్యుత్పత్తిజ్ఞానము గలిగి రఘువంశము, శాకుంతలము, వేణీసంహారము మొదలయిన సంస్కృతగ్రంథము లామె చదివెను. పాఠశాలయం దాంగ్లేయ సంస్కృతభాషల నభ్యసింపఁగా మిగిలినకాలమునం దీమె డ్రాయింగు (చిత్తరువు, పటములువ్రాయుట) సహితము నేర్చుకొనుచుండెను. (1887 వ సంవత్సరమునం దీమె డ్రాయింగుయొక్క ఫస్టుగ్రేడుపరీక్షయందు కృతార్థురాలయి ఫ్రీహ్యాండు, మాడెల్, డ్రాయింగులయం దధికప్రవీణురాలని బహుమానపత్రికలను బడయుటయేగాక కర్తవ్య రేఖాగణితము నందు గొప్ప బహుమతి వడసెను. రేఖాగణితము, ఫ్రీహ్యాండ్ డ్రాయింగు, ఈరెంటియం దధికప్రవీణురా లనియు, మాడెల్ డ్రాయింగు విషయమునం దీమెకు మిగుల చాతుర్యము గలదనియు, పరీక్షకులు వ్రాసిరి. 1887 వ సంవత్సరము స్కాలరషీపుపరీక్షకు నింగ్లీషుపరీక్షకులుగా వామన ప్రభాకరభావే యను విద్వాంసుని దొరతనమువారు నియమించిరి. ఆసంవత్సరము ఆవడాబాయి యింగ్లీషు అయిదవపాఠపుస్తకము చదువుచుండెను. అప్పు డాయన వేసినప్రశ్నకు ఆవడాబాయి వ్రాసియిచ్చినయుత్తర మింగ్లీషునం దెంతయు రసవంతముగా నున్నదని ఆంగ్లేయ భాషాపారంగతులు మెచ్చుకొనెదరు. అంత యుత్తమభాషయు, నుదాత్త విచారణములును గలవ్యాస మిప్పుడు ప్రవేశపరీక్షలోఁ దేరినవారుగూడ వ్రాయఁగలరా యని సంశయింపవలసి యున్నదఁట (ఆవ్యాసముయొక్క తాత్పర్య మిచ్చట నాంధ్రమున వ్రాయుచున్నాను.

పరీక్షకులగు బావేగారడిగిన ప్రశ్న : _ నీ పాఠశాలయం దార్జించినవిద్యను గృహకృత్యములయం దెట్టుపయోగపఱచెదవు?

ఆవడబాయి వ్రాసి యిచ్చిన యుత్తరము : _ నాకిచట నేర్పఁబడువిద్య ముందు నాకు నధికోపయోగకరమగునని తల చెదను. నాసంసారపాశములఁ ద్రెంపుట పరమేశ్వరున కధిక సమ్మత మయినందున నాజన్మమిఁక పరోపకారమునందే గడపఁ దలంచితిని. ఇట్టి నాతలంపున కిపుడే నభ్యసించు విద్య మిగుల సహాయకారి యగును. ఇంటిలెక్కలు వ్రాయుటకుఁ దల్లికిఁ దోడుపడుదును. ఇంగ్లీషుగ్రంథములను జదివి వానియర్థ మామెకుఁ దెలిపెదను. మహారాష్ట్రస్త్రీలకొఱ కనేకాంగ్లేయ గ్రంధములను మహారాష్ట్రమున వ్రాసెదను. మాయమ్మకు సంస్కృతగ్రంథముల యర్థమువివరించెదను. పురాణము లన్న నామె కధిక సంతోషముగాన నామెకొఱకు పురాణపఠనము చేసి యామెను తృప్తిపఱచెదను. నాకు సంతానము కలుగుట పరమేశ్వరున కసమ్మతమే యయినను నేను నాయక్కబిడ్డలకును, స్నేహితురాండ్రబిడ్డలకును విద్యాబుద్ధులు గఱపెదను. ఇట్లు నేను వారికి నుపయోగపడినయెడల నాజన్మము కొంత సార్థక మగును. నావలె సౌభాగ్యహీన లయ్యును విద్యా గంధములేని యనేక బాలికలు విద్యాయుతుఁడయిన తండ్రితో నేమి తోఁబుట్టువులతో నేనే తగినవిషయములను గుఱించి యేమియు మాటాడుటకుఁ దోఁచక యూరకుండెదరు. నేనెట్లు మౌనముద్ర వహింప నక్కఱలేనందున వారితో నాకుఁ దెలిసిన శాస్త్రవిషయములును, ఇతరవిషయములును ముచ్చటింతును. అందువలన వారికి సంతోషముకలుగును. కాన నాకదియే విద్యవలనఁ గలిగెడి యొక మహానందము.

ఇదియుఁగాక ప్రస్తుత విద్యాభ్యాసమువలన నాకుఁ గొంత ద్రవ్యార్జనశక్తి కలుగును. ఆద్రవ్యమువలన బీదసాదలకు సహాయము చేయుదును. ఏతద్విషయమై నాకును స్వతంత్రత కలుగును.

నా స్వదేశ సోదరీమణు లేయేవిద్య నాయొద్ద నేర్చుకొనఁ గోరెదరో యాయా విద్య నేను వారికి మిగుల శ్రద్ధతో నేర్పెదను. నేను చేయఁదలఁచిన మంచికార్యములలో నిదియే ముఖ్యమైనది. విద్య, డ్రాయింగు మొదలగు నితరవిషయములు నేర్చుకొనుటవలన నాకు మనోల్లాసము గలుగును. ఇట్లు సుఖసంతోషముతోను, స్వతంత్రముగాను అనఁగా నితరులపై భారము వేయక నాజీవితము గడపఁ గలశక్తి నాకిచట నేర్పఁబడు విద్యవలనఁ గలుగును."

(పైని వ్రాయఁబడిన వ్యాసమును జదివి పరీక్షకుఁ డామెను మిగుల మెచ్చుకొనెను. ఇందుకాయన 40 మార్కులలో 35 మార్కులిచ్చెను. ఈపరీక్షయం దన్నియుఁ గలసి 525 మార్కులుండెను. అందు 430 మార్కు లీమెకుఁ దొరికెను. ఇట్లు నూటికి 82 మార్కులు సంపాదించు విద్యార్థులు బహు అరుదని యందఱకును దెలిసినవిషయమే.

పైనుదాహరించిన ఆవడాబాయి వ్యాసము మూలభూత మయిన యింగ్లీషు వ్యాసమునుండి వ్రాయఁబడినదికాదు. ఇంగ్లీషుయొక్క మహారాష్ట్ర అనువాదము ననుసరించి వ్రాయఁబడినది. కాన నిందు మూలములోనుండు భాషాశోభ యంతయులోపించి యుండవచ్చును. అయినను ఆమెయొక్క యుదార కల్పనము, పరోపకారబుద్ధి యిందువలన వ్యక్తమగుచున్నది. ఆవడాబాయికిఁ దోఁచిన కల్పనలలో నెల్ల నొక్కటి మిగుల నాహ్లాదకరముగా నున్నది. అది యేదయన, విద్యావంతులయినతండ్రితోఁబుట్టువులతో వారికిసంతోషముఁ బుట్టించెడి గొప్ప గొప్ప సంగతులనుగుఱించి ముచ్చటించ వలయునని యామెయిచ్చ. మనదేశమునందు మహావిద్యాంసులయి రాజకీయసాంఘిక సంస్కరణము మొదలయిన పరోపకారకృత్యములచే దేహము సమర్పించిన యనేక పురుషులకు నింట కూరగాయ ముచ్చటలుతప్ప మఱియేమియు లేనందున వీధియే యెప్పుడును సుఖకరముగా నుండుటయు, అనేక విద్వాంసులతో ననేకప్రసంగములు చేసి యింటికిఁ బోఁగానే తా మొకక్రొత్తసృష్టిలోఁ బ్రవేశించితిమని తోఁచుటయు, సభలయందు పందొమ్మిదవశతాబ్దమువలెఁ దోఁచినను నింటఁ బదునాల్గవశతాబ్దమువలెఁ గానుపించుటయు సర్వ సాధారణమే గదా! ఇందుకుఁ గారణము స్త్రీవిద్యాభావమే యని చెప్పవలసియున్నది. కాన నిట్టివిద్వాంసులకు ఆవడాబాయికిఁగలిగిన యిచ్ఛఁజూచి సానందాశ్చర్యము గలుగక మానదు. స్త్రీలకు విద్య గఱపినయెడల నెట్టిమంచియూహలు గల్గునో ఈయావడాబాయి వ్యాసమువలననే స్పష్టమగుచున్నది. కాన స్త్రీవిద్య వలన నష్టము కలుగునని భయపడుటకు నెంతమాత్రము కారణము లేదు.

స్త్రీవిద్య శత్రువుల కనఁగా స్త్రీలకు బొత్తుగా విద్యనేర్పఁగూడదను వారికి పూనానగరమునందలి హయిస్కూ లోకగర్భశత్రువుగాఁ గానఁబడుచుండును. అచట విద్య నేర్చుకొను బాలికలను దూషించుటయే వారికి సత్కాలక్షేపముగాఁదోఁచుచుండెను. కాన నచట విద్యనభ్యసించువారిలోనెల్ల నాకాలమునం దగ్రగణ్యురాలుగా నుండిన ఆవడాబాయిని వారు బహుబాధలఁ బెట్టసాగిరి. వారామెను వీధులలో నెగతాళి చేసియు, తిట్టియు ననేకవిధముల నవమానపఱుపఁ జూచిరి. ఇంతటితోఁ దృప్తిచెందియుండక అనేక బీభత్సవచనములతో నాకాశరామన్న పేరుపెట్టి యనేకమైన యుత్తరములు నామెపేర వ్రాయుచుండిరి. వారామెను కనపడినచోటఁ గొట్టి చం పుదుమని బెదరించిరి. దు:ఖసముద్రమునందు మునిఁగియు, జంకక విద్యయను నొకయూఁతకోల నాధారము చేసికొని, యాసముద్రమునుండి వెల్వడఁ బ్రయత్నింపుచున్న ఆవడాబాయిపై దుష్టుల కుశబ్దములను శిలావర్షము కురియఁగా నామె మనస్థ్సితి యెటుండెనో చదువరులె యూహించుకొనఁగలరు. ఇట్లామె యెన్నికష్టములు వచ్చినను విద్యమాత్రము వదలక తననురక్షింప న్యాయస్వరూపుఁడైన పరమేశ్వరుఁడే గలఁడని ధైర్యముతో నుండెను. ఇట్టినిరుపమానధైర్య మెంతయుఁ బ్రశంసనీయముగదా?

1887 వ సంవత్సర మావడాబాయిని మిగుల ప్రేమించునట్టి యక్క చింగూబాయి క్షయరోగమువలన మృతిఁజెందెను. ఈమె తనముద్దుచెల్లెలికి ప్రాప్తించిన వైధవ్యదు:ఖమునకై మిగుల చింతించుచు నెల్లపుడు ఆవడాబాయికి దు:ఖోపశమన వచనములఁ జెప్పుచు విద్యయందు పరోపకారమునందును విశేషాసక్తి కలుగఁజేసెను. ఇట్లుమనసుగలిసి ప్రేమించునట్టి సహోదరియొక్క మరణమువలన ఆవడాబాయికి నత్యంతదు:ఖముకలిగెను. ఆదు:ఖమువలననే కొన్నిరోజులు విద్యాభ్యాసము జరగక తుదకొక విధముగా మనస్సమాధానముచేసికొని యేది యెట్లయిననుతలఁచిన సత్కార్యము విడువగూడదని యామెవిద్య నధిక ప్రయత్నముతో నభ్యసింపసాగెను. ఇట్లామె దుస్సహ దు:ఖములలో మునిఁగియుండియు నసమానధైర్యముతో విద్య నభ్యసింపుచుండఁగా 1887 వ సంవత్సరాంతమున నామెకుఁ గొంచెము దేహమస్వస్థముగా నుండసాగెను. అందువలన నాయెండకాల మామె మహాబలేశ్వరమను ఆరోగ్యప్రదమైన పర్వతప్రాంతమున కరిగెను. కాని యచటినుండివచ్చిన తదనంతర మేమియు సుగుణమగుపడక రుగ్ణత హెచ్చసాగెను. ఇట్లు రుగ్ణత హెచ్చినందువలన అక్టోబరునెలనుండి యామె విద్యాభ్యాసము బొత్తుగా మానవలసినదాయెను. ఇంగ్లీషు డాక్టర్లు హిందూవైద్యులు పరీక్షించి యెన్నిమందు లిచ్చినను రోగము నిమ్మళించక హెచ్చుచుండెను. కడుపులో శూలవిశేషముగాఁ బుట్టుచున్నందున నామెతాళఁజాలక మరణమునకుఁ బూర్వము కొన్నిరోజు లప్పుడప్పుడు కేకలు వేయుచుండెను. అందుకామె తండ్రి "బిడ్డా! నీకంటి కేమయినఁ దోఁచుచున్నదా? నీకు మరణభీతి కలుగుచున్నదా?" యని యడిగెను. అందు కామె "నాకు మరణమన్న నెంతమాత్రము భయములేదు. నేను పాపము చేయనపుడు పరలోకయాత్రకు భయమేలపడుదును? ప్రాణముతో సమానముగా నున్న పెంచినట్టి మిమ్ము నెడబాయవలసినందుకు, నేను జన్మించినందుకు జనోపయోగకరమయిన కార్యమేదియుఁ జేయకయే దేహము విసర్జించ వలసివచ్చెఁగదాయనియు కొంచెము వ్యసనముగా నున్నది. కాని యీశ్వరాజ్ఞ శిరసావహించి సంతోషముతో వెడలుటయే మనకర్తవ్యము. నాకడుపులో దు:ఖసహమగువేదనకుఁ దాళఁజాలక నేనిట్లు అఱచెదనెగాని మరణభీతిచేతఁగాదు" అనెను. అందుపైభిడే "ఆవడా! నీమనసునం దెవ్వరికైన నేమేని యియ్యఁదలఁచితివేని ఆసంగతి నాకుఁ జెప్పుము" అని యడుగఁగా ఆవడాబాయి యిట్లనెను. "నేనీసంవత్సరము నన్నూ చిన్నతనమునందుఁ బెంచిన గోవిందరావు చింధడేగారికి నేమియుఁ బంపలేదు. ప్రతిసంవత్సరము పాఠశాలయందు నాకు బహుమానముగా దొరికినసొమ్మునే నాయనకుఁ బంపుచుంటిని. ఈసంవత్సర మీరుగ్ణతవలన బహుమతి పొందలేదు . కాన పాప మాబీదవాని కేమియుఁ బంపనైతిని. కనుక తా మాతని కేదేనిఁ బంపిన నాకు బరమసంతోషము కలుగును" తత్క్షణమే భిడేగారు 20 రూపాయలను ఆవడాబాయిపేరుఁబెట్టి గోవిందరావు చింధడే గారికి హుండీ పంపిరి. తదనంతరము భిడేగారు తనముద్దుల కూఁతురిపేరు జనులకు జ్ఞాపక ముండునట్లుగా నామె చదువుకొను పాఠశాలలో నొకబహుమతి యుంచగోరి తనయభిప్రాయము ఆవడాబాయికిఁ జెప్పి నీ కేవిషయము విశేషప్రీతికరమా చెప్పుమని యడిగెను. అందుకామె "నాయనా! నాయనంతరము జనులు నన్నుఁ దలఁచుకొను నంతటి ఘనకార్య మేదియు నేను జేయలేదు. తమరు చేయు బహుమానమున కెంత మాత్రమును నేనర్హు రాలనుకాను" అనెను. అందుకామెతండ్రి మఱింత వేగిరిపఱుపఁగా తనకు గణితమునందును డ్రాయింగునందును విశేషప్రీతికలదని యామె చెప్పెను. అందుపైభిడేగా రపుడే వెయ్యిరూపాయలు పాఠశాలాధ్యక్షునికడకుఁ బంపి, అందుపై వచ్చెడి వడ్డి ప్రతిసంవత్సరము గణితములో, డ్రాయింగులో నందఱికంటె నధికముగా పరీక్షయిచ్చిన కన్యకుఁబహుమాన మిచ్చునట్లు నియమించెను. ఈ సంభాషణ జరిగిన పిదప నిరువది నాలుగుగంటల కనఁగా 1889 వ సంవత్సరము జనవరి 22 తేది మంగళవారము మధ్యాహ్నము రెండుగంటల వేళ ఆవడాబాయి తనదేహ మీనశ్వర భూలోకమున విడిచి, తనకీర్తినిచట శాశ్వతముగానుండ నియమించి, దుష్టుల దుర్భాషణల కెంతమాత్రమును నవకాశ మియ్యనట్టి సదానందమయమైన పరలోకమునకుఁ జనెను. ఆహా! యిట్టిస్త్రీ రత్న మింత యల్పకాలమునందే నష్టమగుట మనదేశముయొక్క దౌర్భాగ్యమనియే చెప్పవలయును. ఆమె మరణమువలన జననీజనకులకు నమితదు:ఖము కలుగుట యొక ఆశ్చర్యముగాదు. ఎట్టియనామధేయులు చనిపోయినను వారి మాతాపితలకు దు:ఖము కలుగుటస్వభావమే కాని రక్తసంబంధములేని పరుల కనేకులకు నెవరిమరణమువలన దు:ఖము విశేషముగాఁగలుగునో వారే మనుష్యునామమున కర్హులు.

పాఠశాలయందు నామెకొరకు దు:ఖించని పిల్లగాని, ఉపాధ్యాయినిగాని కానరాదయ్యెను. ఆమె సద్గుణములు దలఁచుకొని దు:ఖించుచు ననేకు లనేక లేఖలను ఆమె తలిదండ్రులకు వ్రాసిరి. వాని నన్నిఁటి నిటవ్రాయుటవలనఁ గ్రంథవిస్తార మగునని వానిలో నొకయుత్తర మిందు నుదాహరించెదను. ఇది యామె యుపాధ్యాయినులలో నొకతయగు నొకయాంగ్లేయ స్త్రీచే వ్రాయఁబడినది.

'మాప్రియ శిష్యురాలగు ఆవడాభాయి దేవలోకమున కరిగెను గాని యామెకు విద్య నేర్పునట్టి యోగ్యాధికారము వడసిన వారి హృదయమున కామె యెప్పటికిని మఱుపురాదు.

ఆమె ప్రారంభించినవాని నన్నిఁటిని మిగుల శ్రద్ధతోఁ దుదముట్టించుచుండెను. ఎన్నఁడు మధ్యవిడుచునదికాదు'

'నాయదృష్టవశమున రెండుసంవత్సరము లామెకు గణితము నేర్పుభాగ్యమునాకుఁ గలిగెను. ఈవిషయ మామె మిగుల శ్రద్ధతో నేర్చుకొనుచుండెను. ఈరెండు సంవత్సరము లలో నామెదీనియందు విశేషప్రజ్ఞగలదియయ్యెను. ఆమెకు నేర్పవలసిన సమయ మెపుడు వచ్చునాయని నిరీక్షింపుచుండెడిదానను. ఆవిషయమామెకు నేర్పుటనాకు వినోదకరముగా నుండుచుండెను.'

ఆమెకు గానము, జలతారుపూలు, తీగెలు, కుట్టుపని నేర్పుటకు నామె చెల్లెలిని నియమించిరి. కాని యామెశరీర మస్వస్థముగా నుండినందున గానవిద్య నేర్చుకొనుట కవకాశము చిక్కదయ్యెను. జలతారుపూవులు వగయరాలపనియం దామెకుఁ గల నిపుణత్వ మామెచేఁ గుట్టఁబడిన జలతారుపని వలననే తెలియుచున్నది.

తన సుస్వాభావమువలన నామె తన సహాధ్యాయినుల కెట్లు ప్రియురాలాయెనో, యదేప్రకారముగా నుపాధ్యాయినులకుఁ గూడ ప్రియతమురాలయ్యెను. ఆమెయం దద్వితీయమగు వినయముగలదు. ఆగుణమే సర్వసద్గుణములలో శ్రేష్ఠమైనదని నాయభిప్రాయము. ఆమెయందు నీ యలౌకికగుణమును లుండినందుననే యామెను ఉపాధ్యాయిను లెప్పుడును పొగడుచుండిరి. పాఠశాలఁ గనుఁగొనవచ్చిన సద్గృహస్థులనేకు లామెను ప్రశంసించెడివారు. ప్రతిసంవత్సరమును పరీక్షలయందు దేరి బహుమతుల నందుచుండెను. ఇన్ని గలిగియు తుదవఱ కామెయం దహంకార మన్నమాటయే కానిపించ లేదు. ఎంతవిద్య నేర్చెనో యంతవినయము మధికమగుచుండెను. ఆహా! విద్యాదదాతి వినయమ్ అను లక్షణమున కింతకంటె మఱియేమి లక్ష్యము కావలెను?

  1. విద్యవలన వినయము; వినయమువలన అర్హతయుఁ గలుగును.