అబద్ధాల వేట - నిజాల బాట/హోమియో అమానుషం : అమెరికా హ్యూమనిస్టుల నిర్ధారణ

వికీసోర్స్ నుండి
హోమియో అమానుషం:
అమెరికా హ్యూమనిస్టుల నిర్ధారణ

హోమియో శాస్త్రీయమని రుజువుపరచడానికి అమెరికా, యూరోప్ దేశాలలో తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ విషయమై అమెరికా హ్యూమనిస్టులు నిపుణుల సంఘం వేశారు. హోమియో చిట్కా వైద్యమనీ, శాస్త్రీయంగా నిలబడదని తేలింది.

1988 జూలైలో ఫ్రాన్స్ లో ఇద్దరు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా హోమియో శాస్త్రీయమని ప్రకటించారు. టైం, న్యూస్ వీక్ వంటి పత్రికలు సైతం విపరీతంగా ప్రచారం చేసిపెట్టాయి. ఇంకా ఆశ్చర్యమేమంటే, నేచర్ అనే సైన్సు పత్రిక యీ విషయంపై వ్యాసం ప్రచురించింది. హోమియోకు సైంటిఫిక్ స్థాయి రావడానికి అదే ఆధారం అన్నారు. పారిస్ వెలుపల ఇన్ సెమ్ (INSERM-The Institute National de la Santo et la Recherche Medicale)అనే పరిశోధనా సంస్థకు చెందిన 13 మంది సంతకాలు చేశారు. దీనికి నాయకత్వం వహించిన జాక్ బెన్ వెనిస్టె (Jacques Benveniste) అతనికి తోడుగా ఇజ్రాయిల్ ఆమె ఎలిజబెత్ డెవెనాస్(Elizabeth Davenas) కీలకపాత్ర వహించారు. పరిశోధనల వలన వడపోసిన నీటిలో యాంటిబాడీ కణాలను తొలగించినా, నీటిలో యాంటిబాడి రసాయనిక శక్తి "ఎలాగో" వున్నదన్నారు. అంటే నీటికి జ్ఞాపకశక్తి వుందన్నమాట. ఇదే వాస్తవమైతే హోమియో శాస్త్రీయమని రుజువైనట్లే. నేచర్ పత్రిక పరిశోధనా వ్యాసాన్ని ప్రచురిస్తూ (చూడు 333-సంపుటి పుట 816)ఇది నమ్మశక్యం కాకుండా వుందని వ్యాఖ్యానించింది.

బెన్ వెనిస్టి పరిశోధన ప్రకారం తాను వాడిన యాంటిబాడీ కణాలు నీళ్ళలో కలిపి, పలచబరచినా, ఇంకా 10120 మాత్రం లేకున్నా దాని శక్తివలన నయం చేస్తుందనీ హోమియో అంటుంది. బెన్ వెనిస్టి పరిశోధన ప్రకారం నీరు-"ఎలాగో జ్ఞాపకశక్తితో"-యాంటిబాడి లక్షణాలను కొనసాగిస్తుందన్నాడు. నీటిలో యాంటిసెరం కణాలు తొలగించినా, హైడ్రోజన్ అణువులు ఎలాగో ఓలాగ యాంటిబాడి చర్యను సాగిస్తుందన్నాడు. ఇదే సరైనదైతే, హోమియో శాస్త్రీయంగా రుజువైనట్లే. హోమియో ఔషధాలలో మందు వున్నట్లు రుజువు కాకున్నా, దాని శక్తి పనిచేస్తుందన్నమాట.

నేచర్ పత్రిక, వ్యాసమైతే ప్రచురించింది. కాని ఎంతో విమర్శ ఎదుర్కోవలసివచ్చింది. ఈ పరిశోధనలో సత్యాసత్యాలను తెలుసుకోడానికి నేచర్ పత్రిక సంపాదకుడు జాన్ మాడోక్స్, మేరీలాండ్ జాతీయ ఆరోగ్య సంస్థలోని జీవరసాయన శాస్త్రజ్ఞుడు వాల్టర్ స్టేవర్డ్, సుప్రసిద్ధ హ్యూమనిస్టు మాంత్రికుడు జేమ్స్ రాండి వెళ్ళారు. వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

డాక్టర్ జాక్ బెన్ వెనిస్టి పరిశోధనలు అంకెలదోషాలతో వున్నాయి. పరిశోధన మళ్ళీ మళ్ళీ జరిపే తీరులోలేదు. దోషాల్ని తొలగించే తీరు అమలుపరచలేదు. శాస్త్రీయ పరిశోధనకు నిలబడే స్థితి ఎక్కడా కనిపించలేదు. హోమియో మందులు తయారుచేసే కంపెనీలో ఇద్దరు కూడా బెన్ వెనిస్టి పరిశోధకులలో వున్నారని తెలిసింది. పరిశోధన పేరిట వీరు చేసిన పనికి ఆ కంపెనీ ఖర్చులు భరించింది. దీనిపై వ్యాఖ్య అనవసరం.

సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా॥స్టీఫెన్ బారెట్ యీ విషయాలన్నీ పరిశోధించి కన్సూమర్ రిపోర్ట్స్ లో (1987 జనవరి) ఇలా రాశాడు. "హోమియో ఔషధాలు శారీరకంగా ప్రభావం చూపలేనంత పలచబడి వున్నాయి. వైద్యశాస్త్రం ప్రకారం యీ ఔషధాలు అర్థంపర్థం లేనివి. ఇందులో ఎలాంటి వసలేదని, పనిచేయవని అమెరికాలో 49 ఫార్మసీస్కూల్స్ ఫాకల్టీ సభ్యులు పేర్కొన్నారు. రోగాలు వాటంతట అవే కుదురుకునే సందర్భాలలో పంచదార మాత్రల ప్రభావం మాత్రమే హోమియో ఔషధాలకు వుంటుంది. అలాంటి ఔషధాలు, డిగ్రీలున్న డాక్టర్లు వాడినా, చిట్కావైద్యులు వాడినా రోగులకు ప్రమాదమే. రోగి ఒకపక్క జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే, పనిచేయని ఔషధాలు యివ్వడం ప్రమాదం. హోమియో ఔషధాలు ప్రయోగించడం హానికరం. సొంతవైద్యం మరీ యిబ్బంది. జబ్బు విపరీతంగా వున్నప్పుడు, నొప్పి ఏమిటో తెలియకుండానే మాత్రలిచ్చే హోమియో చికిత్స వలన రోగి చనిపోవచ్చు. కేన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులకు హోమియో ఔషధాలు యివ్వరాదని కూడా 1988లో ఫెడరల్ డ్రగ్ సంస్థ ఆదేశించింది.

శాస్త్రీయం అని రుజువుపరచలేక, హోమియో డాక్టర్లు చౌకబారు రచనలతో, కరపత్రాలు, పుస్తకాలతో జనాన్ని ఆకట్టుకుంటున్నట్లు స్టీఫెన్ బారెట్ విమర్శించారు.

హోమియో మందుల్ని ఎలాంటి శాస్త్రీయ పరిశీలన లేకుండానే సరాసరి జనానికి అమ్మడం,మందులో ఏముందో చూపకపోవడం కూడా విమర్శలకు గురైంది. మనుషులకు యిచ్చే ఔషధాలు ఫెడరల్ డ్రగ్ నియమాల్ని పాటించకపోవడం, అమానుషచర్యగా భావిస్తున్నారు. ఎవరికి వారు హోమియో డాక్టర్లుగా ముద్రవేసుకొని, జనాన్ని దోచుకుంటూ,డబ్బుచేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. సైన్స్ రచయిత మార్టిన్ గార్డినర్ హోమియో మోసాల్ని, అశాస్త్రీయతను ఎండగట్టాడు. కేన్సర్ వంటి రోగాల్ని నయం చేస్తామంటూ జనాన్ని చంపుతున్న ఉదాహరణలు చూపాడు.

హోమియోపతి డాక్టర్లు విమర్శలకు సమాధానాలు చెప్పలేక, శాస్త్రీయం అని రుజువు చేయలేక, వీధినబడి తిట్లకు లంకించుకున్న ఉదాహరణలు గార్డినర్ ఉదహరించాడు.

బెన్ వెనిస్టి పరిశోధనలు బోగస్ అని తేలేసరికి, హోమియో సంస్థ అతన్ని 1989లో సస్పెండ్ చేసింది.

హోమియో అద్యంతాలు మోసంతో కూడిన, అర్థంలేని వైద్యవిధానంగా గార్డినర్ చిత్రికబట్టాడు, జేమ్స్ టైలర్ కెంట్ ను, హోమియో వారంతా హానిమన్ తరువాత, మహాత్మునిగా ఆరాధిస్తారు. ఆయన రాసిన లెక్చర్ ఆన్ హోమియోపతిక్ మెడిసన్ అనే 982 పేజీల గ్రంథం అయోమయపు అశాస్త్రీయ పులుముడు అని గార్డినర్ విమర్శించాడు. కెంట్ రచనలో ఏ పేరాకూడా సాక్ష్యాధారాలకు నిలబడదన్నాడు. (గార్డినర్ ఆన్ ది వైల్డ్ సైడ్ 1992 పుట 39)

హానిమన్ "జీవశక్తి"ని నమ్మాడు. హోమియో శాస్త్రీయం అనేవారు దీనిని ఎలా రుజువు చెస్తారు?

హోమియో పేరిట, పుస్తకాలు చదివి, జనానికీ మందులిస్తూ, వారికి నయం చేశాం, వీరికి ఇంగ్లీషు మందుల ద్వారా తగ్గనిచోట హోమియో ద్వారా తగ్గించాం, అని ప్రచారం చేసేవారున్నారు. అమెరికాలో ఇలా చేసిన వారిని పట్టుకొని జైల్లో వేశారు. ఫ్లారిడా రాష్ట్రంలో 1985లోనే ఇది జరిగింది. అలాంటి స్థితి మనదేశంలో ఎప్పుడు వస్తుందో మరి!

హోమియో డాక్టర్లు సెనేటర్లను పట్టుకొని హోమియో లైసెన్సు బోర్డులు ఏర్పరచడానికి అమెరికాలో ప్రయత్నిస్తున్నారు. శాస్త్రీయం అని రుజువుపరచలేకపోయినా, ఇలాంటి లాబీ చేయడంలో వారు సుప్రసిద్ధులు. మనదేశంలో కూడా ఇదే తంతు. కీలకస్థానాల్లో వున్నవారిని పట్టుకొని హోమియోకు నిధులు సమకూర్చుకోవడం ఆనవాయితీ అయింది. శాస్త్రీయమని బోకరించడం తప్ప. ఒక్క ఆధారం కూడా చూపని వారికి ఆగ్రహం రావడం సహజం. వృత్తి దెబ్బతింటుంది గనుక యిది అర్థం చేసుకోవచ్చు.

వైద్యరంగంలో ఏ చట్టమూ హోమియోకు వర్తించరాదంటున్నారు. అలాచేస్తే హోమియో నిలబడదు. కాబట్టి పైరవీలు (సిఫారసులతో), ప్రచారంతో పత్రికలలో వచ్చి అబద్ధాలతో ప్రాకులాడుతున్నారు. అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు. అలోపతి వైద్యరంగంలోని విషయాల్ని తెలివిగా హోమియో ప్రచారానికి వాడుకుంటుననరు.

విదేశాల్లో విమర్శలు తట్టుకోలేక, శాస్త్రీయం అని రుజువుపరచే ప్రయత్నాలన్నా చేశారు. మనదేశంలో అలాంటి ప్రయత్నం అసలే లేదు. హోమియో చికిత్సకు ఇన్సూరెన్స్ లేదు. అలోపతికి వున్నది. ఎందుకని? హోమియో చికిత్సలో ఏ ఔషధాలు యిస్తున్నారో రోగికి చెప్పరు. ఎందుకని? హోమియోలో వైఫల్యాలు బయటపెట్టరు. తగ్గినవి మాత్రం బాగా ప్రచారం చేసుకుంటారు. లైసెన్స్ లేని హోమియో డాక్టర్లను నిర్బంధించమని కోరరు. అదంతా అమానుష ప్రక్రియే.

హోమియో చికిత్సలో మనిషి ముఖ్యం కాదు. తగ్గకపోతే, ముదిరిన తరువాత వచ్చావంటారు. అలోపతిలో అంతా చెడగొట్టుక వచ్చావంటారు. చనిపోతే, అసలు బాధ్యత వహించరు. కిక్కురుమనరు. అందుకే యిది అమానుష వైద్యం. వైఫల్యాలను స్వీకరించి, నిరంతర పరిశోధన జరిపి, మనుషుల్ని కాపాడటానికి కృషిచేస్తేనే వైద్యం శాస్త్రీయం అవుతుంది. వేదప్రమాణంవలె, హానిమన్ ఆరాధ్యుడంటూ జీవశక్తి నమ్మకాలతో, మనుషుల్ని హతమార్చడం మంచిదికాదు. రోగాల్ని ఎదుర్కొని, నయం చేసుకునె గుణం దేహానికి వుంది. హోమియోవారు ప్రచారం చేసుకుంటున్నారు. డాక్టరుపై విశ్వాసంతో పనిచేసే తీరువుంది. అదికూడా ప్లాసిబో ప్రభావంగా పేర్కొనక హోమియోవారు వ్యాపారం చేసుకొంటున్నారు. ఆరోగ్యవంతులకు హోమియో బాగా పనిచేస్తుందన్నమాట!

హార్ట్ ఎటాక్ వస్తే హోమియోకు పరిగెత్తం. అంటురోగాలొస్తే హోమియో కోసం వెళ్ళం. అలాంటప్పుడు హోమియో స్వీకరిస్తే ఫామిలీ ప్లానింగ్ వారికీ ఇక ప్రచారం అక్కరలేదు. అలోపతి పూర్తిగా నిషేధిస్తే, హోమియో మాత్రమే వుండాలంటే, జనాభా సమస్య దెబ్బకు తీరుతుంది!

ఇంతకూ మన ప్రశ్న అలాగే మిగిలింది. హోమియో శాస్త్రీయమని ఇండియాలో ఏమిటి రుజువు? ఒక్క ఉదాహరణ చూపమనండి విమర్శలు మానేద్దాం.

హోమియో శాస్త్రీయమని రుజువు చేయడానికి కంట్లోల్డ్ పరిశోధన గాని, డబుల్ బ్లయిండ్ టెస్ట్ గాని చేశారా? చెస్తే ఎవరు? ఎక్కడ? వివరాలేమిటి? ఒక ఆధారం ఇండియాలో చూపమనండి.

అమెరికాలో హ్యూమనిస్టులు ఒక నిపుణుల సంఘం నియమించారు. దానికి స్టీఫెన్ బారట్ అధ్యక్షులు. ఆయన ఆధ్వర్యాన జరిగిన పరిశీలనల ఫలితంగానే హోమియో శాస్త్రీయం కాదని తేలింది. మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. సొంతవైద్యం చేసుకోమనే హోమియో ప్రచారం మరీ అమానుషం, బాధ్యతారహితం, అశాస్త్రీయం.

- హేతువాది, అక్టోబరు 1992