అబద్ధాల వేట - నిజాల బాట/విశిష్ట పాత్రికేయుడు ఎజికె

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
విశిష్ట పాత్రికేయుడు ఎజికె

దినపత్రికల నాయకత్వం అనే శీర్షికతో ఆనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలను హద్దుల్లో పెట్టిన అసాధారణ వ్యక్తి ఆవుల గోపాలకృష్ణమూర్తి. తెనాలిలో 1942లో రాడికల్ అనే పత్రికా సంపాదకుడుగా ప్రారంభించి, ఉత్తరోత్తరా రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష అనే పత్రికలు నడిపారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఎ.జి.కె.అసాధారణ పతిభావంతుడుగా గుర్తింపు పొందారు. నా చుట్టూ ప్రపంచం అనే శీర్షికతో ఎజికె వాహిని పత్రిక(విజయవాడ)లో రాసిన అంశాలు ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను కదలించాయనడానికి అనేక ఆధారాలున్నాయి. ఒకేఒక పర్యాయం తెనాలి మునిసిపల్ చైర్మన్ గా చేసిన ఎజికె ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఆయన పత్రికా వ్యాసాలు, ప్రసంగాలే కారణం. 1964లో అమెరికా ప్రభుత్వం ఎజికెను ఆహ్వానించగా, బి.ఎస్.ఆర్.కృష్ణ తెచ్చిన ఆహ్వానలేఖ అందరినీ ఆశ్చర్య ఆనందాలతో ముంచెత్తింది. మారుమూల వున్న ఒక అనధికారిని కేవలం ప్రతిభ ఆధారంగా గుర్తించి, పిలవడం ఎజికె గొప్ప మానవతావాద విలువలకు గీటురాయి. దానికి తగ్గట్లే మూడు నెలలు పర్యటించిన ఎజికె అమెరికా వారిని ఆశ్చర్యపరిచే హేతువాద ఔన్నత్యాన్ని కనబరచారు. అది చరిత్ర.

ఎజికె పత్రికా రచనలు చాలా పదునుగా కొత్త దశలో సాగాయి. ఎందరినో ఉత్తేజపరచిన ఎజికె విమర్శలు, చాలామందిని ఇబ్బందిపెట్టేవి కూడా. గాంధీజీపై 1942లోనే రాడికల్ పత్రికలో ఎజికె రాసిన వ్యాసం అబ్బూరి రామకృష్ణారావును దిగ్భ్రాంతిపరచగా, ఆయన,ఎం.వి.రామమూర్తి కలిసి ఎం.ఎన్.రాయ్ కు ఫిర్యాదు చేశారు. రాయ్ ఆ వ్యాసాన్ని పూర్తిగా బలపరచగా, తరువాత మల్లాది రామమూర్తి, అబ్బూరిగారలు ఎజికె సన్నిహితులుగా మారారు.

గవర్నర్ త్రివేది : ఆంధ్ర గవర్నర్ గా కాకలుతీరిన ఐ.సి.ఎస్ అధికారి చందూలాల్ త్రివేది వుండగా, ఒకసారి తెనాలి సందర్శించారు. అప్పుడు మునిసిపల్ ఛైర్మన్ గా వున్న ఎజికె, పురపాలక సమావేశానికి వచ్చిన త్రివేదికి చురకలు వేయడం, త్రివేది తన తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ చెప్పడం, చెప్పుకోదగిన అంశం. ప్రొటోకోల్ తెలిసిన త్రివేది,వేరే సభకు ముందు వెళ్ళి, అనంతరం మునిసిపల్ సభకు వచ్చారు. అందుపై ఎజికె చమత్కారంగా అంటేటట్లు వేసిన చురక త్రివేదికి నచ్చడం గమనార్హం.

నీలం సంజీవరెడ్డి : ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్ది తెనాలి రాగా,మునిసిపాలిటీ వారడిగిన రెండు రోడ్లలో ఒకటి మంజూరు చేసినట్లు ప్రకటించారు. అప్పటి వరకూ ఎవరికీ అడిగిన రెండిటిలో సగం యివ్వలేదని, చప్పట్ల మధ్య రోడ్లలో మంజూరు చేసిందానికి బదులు రెండోది యిస్తే సంతోషిస్తామన్నారు. మంజూరుచేసిన రోడ్డు విలువ 20వేలు కాగా, రెండో రోడ్డు విలువ లక్షరూపాయలని ఎజికె అనేసరికి, సంజీవరెడ్డి బిత్తరపోగా, జనం ఎజికెను హర్షధ్వానాలు పలికారు. నన్ను ఏడిపించడానికి ఎజికెను సభకు పిలిచారా అని తరువాత మునిసిపల్ బంగళాలో ఆలపాటి వెంకట్రామయ్య(కీ.శే.మంత్రి)తో సంజీవరెడ్డి మండిపడ్డారు.

దామోదరం సంజీవయ్య : ముఖ్యమంత్రిగా సంజీవయ్య వున్నప్పుడు, ఎజికె కు మిత్రుడు. ఒకసారి విజయవాడ పర్యటనకు వెళ్ళి,గుట్టమీద వున్న హరిజన (దళిత) హాస్టల్ కు వెళ్ళవలసి వుండగా నేను ఎక్కలేనంటూ తిరిగి వెళ్ళిపోయారు. దీనిపై ఎజికె వ్యాఖ్యానిస్తూ "ముఖ్యమంత్రి పదవికి దేక గలిగినవాడు ఆ మాత్రం దళితుల కోసం గుట్టెక్కలేకపోయాడా" అన్నారు. ఆంధ్రపత్రిక ఆమాటల్ని ప్రధానంగా ప్రచురించడంతో, సంజీవయ్య స్పందించి వెంటనే కార్యక్రమం వేసుకొని దళిత హాస్టల్ సందర్శించడమేగాక, ఎజికెకు మెచ్చుకోలు లేఖ రాశాడు.

తిమ్మారెడ్డి : పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయ మంత్రిగా దిగిపోయినప్పుడు తెనాలిలో ఎజికె పూనుకొని ఘనంగా ఆయన్ను సన్మానించి,ఒక సంచిక ప్రచురించి బహుకరించారు. పదవిలో లేనప్పుడు గుర్తించడం, వ్యక్తికి గౌరవమని ఎ.జి.కె.స్పష్టం చేశారు. అది ఎజికె హేతుపద్ధతికి, మానవ విలువలకు పట్టంగట్టే తీరు.

విద్యామంత్రితో : ఎస్ బిపి పట్టాభిరామారావుకు రవాణ, విద్యాశాఖలు ఆంధ్రప్రదేశ్ తొలిమంత్రి వర్గంలో యివ్వగా "విద్య కదలబారుతుందన్నమాట" అని ఎజికె చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకున్నది. చలన రహితంగా వున్న విద్యాశాఖపై అదొక చురక. అప్పుడే పాఠ్యగ్రంథాల జాతీయకరణ చేయడం, విశ్వనాథసత్యనారాయణ రాసిన పాఠంలో బుద్ధుణ్ణి రాక్షసుడుగా, పాపాల్నిపెంచేవాడుగా చిత్రించడం జరిగింది. దీనిపై ఎజికె తన రచనల ద్వారా ధ్వజమెత్తి, ఆ పాఠాన్ని ఉపసంహరించేవరకూ పోరాడారు. ఎజికె విమర్శలకు పట్టాభిరామారావు వుక్కిరిబిక్కిరైపోయారు.

మాకినేని బసవపున్నయ్య : చదువుకునే రోజులలో (2వ ప్రపంచ యుద్ధ సమయం) గుంటూరు ఎసి కాలేజిలో కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య, ఎజికె మిత్రులే. ఎం.ఎన్.రాయ్ అనుచరులతో మాట్లాడవద్దని కమ్యూనిస్టు పార్టీ రహస్య తీర్మానం చేసింది. ఆనాటి రాజకీయ కారణాలతో చేసిన ఆ నిర్ణయం ఎజికెకు తెలిసింది. రోడ్డుమీద అనుచరులతో వెడుతున్న బసవపున్నయ్యను ఉద్దేశించి "విప్లవాలు పరిగెత్తిపోవడం లేదు లేవోయ్ ఆగి మాట్లాడు కాసేపు" అని ఏడిపించాడు. చుట్టూ చూస్తున్న కమ్యూనిస్టు అనుచరులు గిలగిల్లాడిపోయారు కాసేపు! తీర్మానం అలా అమలుజరుగుతున్నందుకు.

రాజాజీమెప్పు : రాజ్యాంగ 17వ సవరణ వలన రైతు లోకానికి నష్టం వాటిల్లుతుందని, నియంతృత్వ ధోరణులు ప్రబలుతాయని రాజగోపాలాచారి, ఎన్.జి.రంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా బాపట్లలో పెద్దసభ జరిగింది. ఆ విషయంపై ముందుగా ఎజికె మాట్లాడారు. అది విన్న తరువాత రాజాజీ వ్యాఖ్యానిస్తూ, యిక తాను మాట్లాడవలసిందేమీ లేదని, చాలా విడమరిచి లోతుపాతులతో ఎజికె ప్రసంగించారన్నారు. రాజాజీ అలా శ్లాఘించడం ఎజికె విషయ పరిజ్ఞానానికి, పరిపక్వ విమర్శకు సర్టిఫికెట్. ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరచుకోవడానికి జవహర్ లాల్ నెహ్రూ తలపెట్టిన సవరణ విషయం. ఇదంతా(1957) స్టడీకాంపులలో ఎజికె ఆధ్వర్యం, ఆచార్య నిర్వహణ, కొత్తవారిని ప్రోత్సహించే తీరు, విషయాన్ని విపులీకరించడం ఒక అద్భుత ప్రక్రియగా వుండేది. అందులో పాల్గొని ఎజికె పట్ల ఆకర్షితులుకాని వారు లేరు. ఆలిండియా కాంప్ లో ఒకసారి ఎం.ఎన్. రాయ్ తో కొరియా విషయంలో విభేదించగా, వీరారాధకులు ఆశ్చర్యపోయారు. ఎ.జి.కె వీరారాధకుడు కాదు. చివరకు ఆ విషయం గుర్తించిన ఎం.ఎన్.రాయ్ దిగివచ్చి ఎజికెతో సత్సంబంధాలు సాగించాడు. ఎ.బి.షా, వి.ఎం. తార్కుండే, జి.డి. పరేఖ్,కె.కె. సిన్హ మొదలైన హ్యూమనిస్టులతో ఎజికె పనిచేశారు. అన్నిటా తన వ్యక్తిత్వమే రాణించింది. పత్రికారంగంలో ఎజికె సన్నిహితులు చాలామంది వుండగా, ప్రముఖులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనదగినవారు.

వివేకానంద, నెహ్రూ వివాదం : 1964లో ఎజికె,అమెరికా వెళ్ళబోతున్న సందర్భంగా తెనాలిలో సన్మానించారు. వివేకానందను గురించి గొప్పగా అమెరికాలో ప్రశంసించమని సభలో కోరగా, వున్నదివున్నట్లే వివేకానంద గురించి చెబుతానుగాని, కోరినట్లు స్తుతి పాఠాలు చెప్పమని ఎజికె అన్నారు. దీనిపై ఆంధ్రప్రభ నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వాన తీవ్ర దాడిచేసింది. నెలరోజులపాటు లేఖలు, నిందారోపణలు గుప్పించింది. ఎజికెను అమెరికా నుండి వెనక్కు పిలిపించాలని ఉద్యమించింది. ఆ దురుద్దేశ ఉద్యమం ఫలించలేదు. కాని ఎజికె వ్యాఖ్యాల బాగోగులు పరిశీలనకు వచ్చాయి. ఎజికె అమెరికాలో వివేకానందపై ప్రస్తావనే తేలేదు. అటువంటి సందర్భంరాలేదు. కాని జవహర్ లాల్ నెహ్రూపై ఎజికె వ్యాఖ్యలు ఆనాటి రాయబారి బి.కె.నెహ్రూకు నచ్చలేదు. రాయబార కార్యాలయం వారు ఎజికె పర్యటన ఆపించాలని, వీలైతే ఇండియాకు పంపాలని ప్రయత్నించినట్లు వడ్లమూడి శ్రీకృష్ణ చెప్పారు. నెహ్రూపై విమర్శలు చేయవద్దని ఎజికెకు కబురు పంపారు. కాని ఎజికె అవి పట్టించుకోలేదు. ఇండియాలో నెహ్రూ విధానాల పట్ల ఎలాంటి విమర్శనాత్మక ధోరణి చూపాడో, అదే అమెరికాలోనూ కొనసాగించాడు. 1940 నుండి 1967లో గుండెపోటుతో చనిపోయేవరకూ "వ్యాసోపన్యాసకుడు" గా ఎజికె రాణించారు.

ఎజికె తెలుగులోనూ ఇంగ్లీషులోనూ మంచివక్త. చాలా ఆకర్షణీయంగా, జటిల అంశాలను సులభంగా అర్థం అయ్యేట్లు చెప్పేవారు. సాహిత్య సభలలో ఆయనకు ఒక ప్రత్యేకస్థానం వుండేది. ఎజికెను సభకు పిలిచారా అని విశ్వనాథ సత్యనారాయణ ముందు అడిగి, ఆరాతీసి ఎజికె వస్తున్నారంటే, ఆ సభకు వచ్చేవారే కాదు. కాటూరి వెంకటేశ్వరరావు, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకట నరసయ్య, పూతల పట్టు శ్రీరాములు మొదలైనవారు ఎజికె యిష్టులు. చాలా మంది కవులు, గాయకులు, రచయితలు ఎజికెను గురువుగా భావించేవారు. అందులో కొండవీటి వెంకటకవి ఒకరు. ఆయన రాసిన నెహ్రూ చరిత్ర కావ్యానికి ఎజికె సహాయపడ్డారు. ఢిల్లీ వెళ్ళి నెహ్రూను కలసి పుస్తకం యిచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అడిగితే, ఈ గ్రంథం వెనుక ఎజికె వున్నట్లు వెంకటకవి చెప్పారు.

పెళ్ళిళ్ళు సెక్యులర్ పద్ధతిలో చేయించడం, అప్పుడు ఎజికె చెప్పే ప్రసంగం గొప్ప అంశం. బోర్ కొట్టకుండా కొత్త అంశాన్ని ఆలోచింపజేసేట్లు అందించడం ఎజికె మేధస్సుకే చెల్లింది. (నా వివాహం ఎజికె చేయించారు తెనాలిలో. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు 1964 మే 31న) అందరూ అనేదేమంటే,సాధారణ విషయాన్ని ఎజికె చెబితే అది అసాధారణంగా మారుతుందని!

సమాజాన్ని ప్రభావితం చేసిన జర్నలిజం ఎజికెది. ఎజికె రచనలు ఇంకా పుస్తకరూపం రాల్చవలసి వుంది. పరిశోధన జరగాల్సివుంది. "నా అమెరికా పర్యటన" పుస్తకం తప్ప, మిగిలినవన్నీ వ్యాసాలే. ఇంగ్లీషులో తక్కువగానూ, తెలుగులో విపరీతంగానూ వున్న వ్యాసాలు, అనేక రచనలకు ఆయన పీఠికలు పరిచయాలు సమగ్ర సంపుటాలుగా రావాలి. ప్రసంగ టేప్ లు వుంటే అవికూడా భద్రపరచవలసి వుంది.

జర్నలిస్టులపై ఎజికె ప్రభావానికి నిదర్శనగా ఒక అంశం ప్రస్తావిస్తాను. 1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన మద్రాసు నుండి వెలువడే ఆంధ్రప్రభ సంపాదకీయ ప్రస్తావన చేయలేదు. దేశంలోని ప్రముఖ పత్రికలన్నీ రాశాయి. గుంటూరులో ఏకాదండయ్య హాలులో సంతాపసభ జరిగింది. ఎజికె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రభ విలేకరి సోమయాజులు యథాతథంగా పంపారు. "ఎవడో దారినపోయే టొంపాయ్ చనిపోతే,ఒక వటవృక్షం కూలింది, ఒక తార రాలింది అని సంపాదకీయాలు రాసే ఆంధ్రప్రభకు ఎం.ఎన్.రాయ్ ఎవరో తెలియదా" అని ఎజికె చేసిన వూఅఖ్యానం నార్ల వెంకటేశ్వరరావును తగిలింది. వెంటనే ఎం.ఎన్.రాయ్ రచనలు తెప్పించుకొని, కూలంకషంగా చదివి, మరుసటేడు గొప్ప సంపాదకీయం రాశారు. అప్పటినుండీ ఎజికె,నార్ల మిత్రులయ్యారు.

- వార్త,21 అక్టోబరు,2001