అబద్ధాల వేట - నిజాల బాట/మనుషులు మరెక్కడ లేరా ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
మనుషులు మరెక్కడ లేరా?

మనం పుస్తకాల్లో చదివాం. కథల్లో విన్నాం. సినిమాలలో చూశాం. దేవుళ్ళకు, రాక్షసులకు, దేవతలకు వింత ఆకారాలు వున్నాయని, నాలుగు తలలు, మూడు కళ్ళు, ఎనిమిది చేతులు, సగం జంతువు యిలా ఎన్నో వింతలు వున్నాయి. వీరంతా వేరే లోకాల్లో వుంటారనీ, ఎప్పుడైనా భూమి మీదకు వస్తారనీ కూడా చెబుతారు. మేఘాలమీద, ఎగిరే పళ్లాల ద్వారా, క్షణంలో ప్రత్యక్షమవుతారని కథలు అల్లారు. పిల్లలకు ఇలాంటివి చెప్పినప్పుడు, అవి కథలన్నీ, ఊహలనీ చెబితే సరీ. కాని అలా జరగడం లేదు. అందుకే పెద్దవాళ్ళు అయినా చిన్నప్పటి వింత కథలు మనస్సునుండి తొలగకపోగా, అవన్నీ నిజాలనే దృష్టితో మొక్కులు పూజలు జరుపుతున్నారు. సైన్స్ పరిధిలో పరిణామం, సాపేక్షత, జీవుల పుట్టుక తెలుసుకుంటున్నారు.

ఇంతవరకు తెలిసిన ప్రకారం గాలి పీల్చుకొని బతికే జీవులు భూమికే పరిమితం. మిగిలినచోట్ల జీవులు వుండాలంటే ప్రాణవాయువు (ఆక్సిజన్) బదులు హైడ్రోజన్, ఇతర వాయువులు పీల్చి బతికే వారు కావాలి. భూమి మీద తప్ప ఆక్సిజన్ ఎక్కడా వున్నట్లు దాఖలాలు లేవు. జీవుల పరిణామానికి కార్బన్ ప్రధానంగా కావాలి. ఇందులో జీవాణువులున్నాయి. దీని అణువులు తీగలుగా మెలివేసుకుని, ఇతర అణువులతో కలుస్తాయి. సిలికాన్ లోనూ ఇలాంటి కలయిక వున్నా, కార్బన్ అంత బంధం లేదు. జీవితాన్ని నిర్మించే అణుసముదాయం కార్బన్ కే వుంది. కార్బన్ లో అణువుల అనుబంధమే డెక్సేరైబోక్లిన్ డి.ఎన్.ఎ అణువులకూ, రైబోనూక్లిన్ యాసిడ్ ఆర్.ఎన్.ఎ.ల అణువులకూ దారితీసింది. వీటిచుట్టూ ప్రొటీన్లు, ఎంజైమ్ లు, తగిన ఇతరాలు వచ్చాయి. జీవి లక్షణం ఏమంటే తన నుండి మరో జీవిని తయారు చేసి సమాచారాన్ని అందించడం, భూమ్మీద నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం జీవ సంబంధమైన పుట్టుక మొదలై, నేటి దశకు క్రమంగా పరిణమించింది. జీవోత్పత్తిని పెంచే ముందు, అందుకు అనుగుణమైన ఆర్ ఎన్ ఎ రైబోజైమ్స్ ఏర్పడ్డాయి. పరిణామం క్రమేణా నిరంతరంగా ఎలా కొనసాగుతున్నదో పరిశీలించారు. ఇది నిర్జీవలోకంలోనూ, జీవలోకంలోనూ సాగుతున్నది. ఇంతవరకూ పరిశీలించిన దానిని బట్టి, గ్రహాలలో, తారలలో మరెక్కడా జీవ లక్షణాలు కనిపించలేదు. ఒకటి రెండు గ్రహాలలో ప్రాథమిక జీవ లక్షణాలకు అనువైన వాతావరణం మాత్రమే ఒకప్పుడు వుండేదన్నారు. భూమి మీద జీవరాశిలో కూడా మనుషులు మాత్రమే మాట్లాడడం, రాయడం, జ్ఞాపకశక్తితో ఆలోచనలకు రూప కల్పన చేయడం కనుగొన్నారు.

ఇతర లోకాల్లో జీవులు వుండాలంటే 40 సెంటిగ్రేడ్ డిగ్రీల వేడివరకు వాతావరణం వుండే స్థితి కావాలి. అంతకు మించినా, సున్న స్థాయికి తగ్గినా ఎంజైమ్ లు బతకడం కష్టం. రేడియెషన్ తీవ్రంగా వున్నా జీవరసాయనిక చర్య పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడు కణాల అభివృద్ధి జరగదు. భూమి మీద వున్న సమతుల్య వాతావరణం, ఇతరచోట్ల లేదు. భూమిపై మొక్కలు ప్రాణవాయువును వదిలి, బొగ్గు పులుసు వాయువును స్వీకరిస్తాయి. జంతువులు, మనుషులు బొగ్గు పులుసు వాయువును వదలి, ఆక్సిజన్ పీల్చుకుంటారు. ఇది ఇతర గ్రహాలు, నక్షత్రాలాలో లేదు. అక్కడున్న గ్యాస్ లు పీల్చుకొని జీవులు ఉండాలంటే, వారి ఊపిరితిత్తులు, జీవ విధానం భిన్నమైనది కావాలి. గురుత్వాకర్షణలో గ్రహాలు, నక్షత్రాలు భిన్నంగా వున్నాయి. భూమి మీద వున్నదానికీ, వాటికీ తేడా కనబడుతున్నది. గనుక జీవులసైజు కూడా ఆ రకంగా మారాలి. శని గ్రహంలో చాలా ఎక్కువ గురుత్వాకర్షణ భూమితో పోల్చితే వుంది. చంద్రునిలో మనకంటే చాలా తక్కువ వుంది. కనుకనే చంద్రుని పైకి కృత్రిమ నౌకలలో వెళ్ళిన మానవుడు ఆక్సిజన్ గొట్టాలు పెట్టుకున్నాడు. తేలిపోతున్నందున నడక కష్టమై, శిక్షణ పొందాల్సి వచ్చింది. నాలుగు తలలు వుంటే ఎంతో రక్తం నాలుగు మెదడులకు కావాలి. అంతేకాక ఒక గుండె తట్టుకోలేదు.కాబట్టి మనపురాణాలలో వింత జీవులు, దేవుళ్ళు, దేవతలు వూహాజనితాలని తెలుసుకోవాలి.

ఏమైనా ఇంతవరకూ భూమిపై తప్ప మరెక్కడా మనుషులున్నట్లు రుజువుకాలేదు.

- వార్త,3 ఫిబ్రవరి 2002