Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/రామమోహన్ రాయ్ పునర్వికాసానికి తోడ్పడ్డాడా ?

వికీసోర్స్ నుండి
రామమోహన్ రాయ్ పునర్వికాసానికి తోడ్పడ్డాడా?

భారతదేశంలో పునర్వికాసానికి నాందిపలికిన వ్యక్తిగా రామమోహన్ రాయ్ ను పేర్కొంటాం. ఆయనతోనే అది ఆగిందని కూడా అంటుంటాం. అలాంటి వ్యక్తి జీవితాన్ని గురించి చాలా పరిశోధనలు జరిగిన తరువాత బయటపడిన విషయాలు గమనిస్తే ఆశ్చర్యపడక మానం. ఆ దృష్టితో కొన్ని పరిశీలనాంశాలు యిక్కడ ఉదహరిస్తున్నాను :

బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా సంస్థ గ్రామానికి చెందిన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో రామమోహన్ జన్మించాడు. పౌరోహిత్యం వంశపారంపర్యంగా వారి వృత్తి. రామమోహన్ ముత్తాత మొగలాయిల క్రింద రెవిన్యూశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేశాడు. కృష్ణచంద్రబందోపాధ్యాయ ఆయన పూర్తి పేరు. ఆయన చేసిన ఉద్యోగాన్ని రాయ్-రాయన్ అనేవారు. అది క్రమేణా రాయ్ గా మారింది. బందోపాధ్యాయ స్థానంలో రాయ్ వచ్చి అదే యింటి పేరైంది. ఉద్యోగరీత్యా కృష్ణచంద్ర వెళ్ళి రాధానగర్ లో వున్నారు.

రామమోహన్ తాత ప్రజవినోద్, తండ్రి రమాకాంత్ లు బాగా ఆస్తులు సంపాదించారు. ఆ సంప్రదాయంలో రామమోహన్ పుట్టాడు. రమాకాంత్ తన ముగ్గురు పుత్రులకు 1796లోనే ఆస్తుల్ని పంచేశాడు. పన్ను చెల్లింపు తప్పించుకోడానికి యీ పనిచేశాడు. ఆ పంపకాలలో రామమోహన్ కు 50 బిగాల వ్యవసాయక్షేత్రం, జొరశాంకోలో కలకత్తా గృహం సంక్రమించాయి. దీనితోబాటు డబ్బు కూడా లభించింది. పంపకాలు జరిగిన 9 మాసాలకే రామమోహన్ కలకత్తా వచ్చి వడ్డీవ్యాపారంలో దిగాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు పెద్ద వడ్డీలతో డబ్బిచ్చేవాడు. (కలకత్తా రివ్యూ 1933 Vol. 49 నెం. 3,పుట 238)

1797లో అండ్రూరాంసేకు 5 వేల రూపాయలు, థామస్ ఉడ్రోఫ్ కు 5 వేలు అప్పిచ్చాడు రామమోహన్. వందరూపాయలు నెలకు జీతం తెచ్చుకునే ఉద్యోగిగా బెనారస్ లో రామమోహన్ జీవితం ప్రారంభించాడు. అక్కడ కొద్దికాలమే వున్నాడు. తిరిగివచ్చి వుడ్రోఫ్ కింద దివాన్ అయ్యాడు. తరువాత జాన్ డిగ్బే కింద చేరాడు. దివాన్ గా యితడికి మంచి పేరు లేదు.

దివాన్ గా ఉద్యోగం చేస్తున్నా, వడ్డీవ్యాపారం మానలేదు. తన బంధువు గోపీమోహన్ ఛటర్జీని కలకత్తాలో యీ పనికి వియోగించాడు. రంగపూర్ లో కూడా యిదే వడ్డీవ్యాపారం సాగించాడు. తరచు రంగపూర్ నుండి కలకత్తాకు డబ్బు చేరవేస్తుండేవాడు. ఈ విధంగా వడ్డీలతో కూడబెట్టిన ధనంతో భూములు కొంటూపోయాడు. శాశ్వత కౌలుదారీ విధానం క్రింద భూములకు విలువ పెరిగింది. ఆ దృష్ట్యా అప్పులపాలైన జమీందార్ల నుండి గ్రామాలకు గ్రామాలే రామమోహన్ కొనేశాడు. 1799 జులైలో జహనాబాద్ పరగణలోని గోవిందపూర్ ను గంగాధర్ఘోష్ వద్ద 3100 రూపాయలు యిచ్చి కొనేశాడు. చంద్రకోన పరగణాలోని రామేశ్వరపూర్ ను రాంతనూరాయ్ వద్ద 1250 రూపాయలకు కొన్నాడు. 1903లో లాంగులాపురాను,1809లో శ్రీరాంపూర్, కృష్ణనగర్ లను కొన్నాడు. కలకత్తా, హుగ్లీ, రంగపూర్ లలో గృహాలు నిర్మించాడు.

జమీందారుగా మారిన రామమోహన్ కు మంచి పేరు రాలేదు. ప్రజల్ని అణచివేస్తాడని ప్రతీతి తెచ్చుకున్నాడు. రాంనగర్ వాసి రాంజోయ్ వాతవ్యాల్ హుగ్లీ కోర్టులో దావావేసి, తన తోట, పొలాన్ని దోచుకున్నందుకు రామమోహన్ పై కేసుపెట్టాడు. అందుకు కోర్టు రామమోహన్ కు డబ్బు చెల్లించమని శిక్ష వేసింది. 2092 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. రామమోహన్ చేసిన క్రూర హింసాత్మక చర్యలన్నీ అతని సేవకుడు జగన్నాధమజుందార్ జరిపినవే.

దారుణంగా రైతుల్ని అణచివేస్తూ, అక్రమంగా భూముల్ని ఆక్రమించుకున్న జమీందార్లను వెనకేసుకొని రామమోహన్ ప్రభుత్వానికి దరఖాస్తులు, ఆర్జీలు పెడుతుండేవాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని జమీందార్ల పక్షాన అలా పెట్టిన ఆర్జీని బ్రిటీష్ కంపెనీ వారు 1829 సెప్టెంబరు 29న నిరాకరించిన ఘట్టం లేకపోలేదు. (ఏషియాటిక్ ఇంటెలిజెన్స్ 1830 పుట 203-205) ఇంగ్లండ్ లో కూడా జమీందార్ల పక్షాన విఫల పోరాటం జరిపాడు. కరపత్రాలు ప్రచురించాడు.

నీలిమందు తయారుచేసే నిమిత్తం భూములు సంపాదించే అవకాశం బ్రిటిష్ వారికి కూడా వుండాలని రామమోహన్ పోరాడి, బ్రిటిష్ వారి మన్ననలు పొందాడు. దేశీయ జమీందార్ల దోపిడీకి జతగా బ్రిటీష్ జమీందార్లు కూడా చేరడానికి రామమోహన్ బాగా తోడ్పడ్డారు.

బ్రిటిష్ వారు యధేచ్ఛగా వ్యాపరం చేసుకోవాలని కూడా రామమోహన్ కోరాడు. దేశీయ పరిశ్రమలు, కళలు నాశనమైనప్పటికీ, కళాకారులకు బ్రిటీష్ కంపెనీలలో ఉద్యోగాలు, జీతాలు బాగా లభిస్తాయన్నాడు. ఇటలీ, గ్రీసు, స్పెయిన్ దేశాల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోరిన రామమోహన్ ఇండియాలో బ్రిటిష్ పాలకులు బాగా స్థిరపడి పాలించడానికి మద్దత్తు యిచ్చాడు.

ఢిల్లీలో నామమాత్రంగా బ్రతుకుతున్న మొగల్ చక్రవర్తికి బ్రిటిష్ వారిచ్చే భరణం చాలనందున, అది పెంచమని కోరడానికి రామమోహన్ ను ఇంగ్లండు వెళ్ళమన్నారు. దీనికి ఆయన అంగీకరించాడు. ఇంగ్లండు వెడితే గౌరవంగా వుండాలనే దృష్టితో 1829 ఆగస్టులో 'రాజా' అనే బిరుదును మొగల్ చక్రవర్తి ప్రసాదించాడు. సాలీనా 4 వేల పౌండ్ల ఆదాయం లభించే ఒక జాగీర్ కూడా రామమోహన్ కు యిచ్చాడు. ఆ విధంగా రామమోహన్ మొగలాయి చక్రవర్తి కోసం, ఆయన ఖర్చులతో ఇంగ్లండు వెళ్ళాడే తప్ప, అందరూ భ్రమిస్తున్నట్లు సతీసహగమన నిషేధానికి కాదు! ప్రభుత్వం మాత్రం రామమోహన్‌కు యిచ్చిన 'రాజా' బిరుదాన్ని గుర్తించలేదు. (జె.కె.మజుందార్ "రాజరామమోహన్‌రాయ్, అండ్ ది లాస్ట్ మొగల్ పుట 115, 116 పుట 206-207) మొగల్ చక్రవర్తి ప్రతినిధిగా కలకత్తాలో వుంటున్న ఫరీద్‌ఖాన్ చనిపోయాడు. రామమోహన్‌ను ఇంగ్లండు పంపిస్తున్న విషయం ఆయన ప్రభుత్వానికి తెలియజేయవలసి వున్నది. అది జరగలేదు. ఆయన స్థానంలో వచ్చిన ఫజల్‌బేగ్ ప్రభుత్వానికి లోగడ ఫరీద్‌ఖాన్ ఉత్తరం వ్రాసినట్లు దొంగ ఉత్తరం సృష్టించాడు. ఇందుకు రామమోహన్ తోడ్పాటు వున్నది. (పొలిటికల్ ప్రొసీడింగ్స్ 1830 జులై 23 నం. 98)

సతీసహగమనాన్ని ఒక్కసారిగా నిషేధించక, క్రమేణా తొలగించాలని రామమోహన్ ఉద్దేశ్యం. కాని బ్రిటిష్ ప్రభుత్వం 1829 డిసెంబరులో నిషేధశాసనం చేసింది. 1830 జనవరి 14న కలకత్తాలోని 800 మంది ఈ నిషేధానికి వ్యతిరేకంగా గవర్నర్ జనరల్‌కు విజ్ణప్తి చేశారు. అప్పుడు రామమోహన్ మేల్కొని ఇంగ్లండు పోడానికి అదే అవకాశమనుకొని, ప్రీవికౌన్సిల్‌లో సతీసహగమన నిషేధానికి అనుకూలంగా వాదించడానికి తనను ఇంగ్లండు పోనివ్వమని కోరాడు. మొగల్‌చక్రవర్తి ప్రతినిధిగా కాక, వ్యక్తిగతంగా వెడతానంటే ప్రభుత్వం అంగీకరించింది. 1830 నవంబరులో ఇంగ్లండు బయలుదేరాడు. వెళ్ళినవాడు , ప్రీవికౌన్సిల్‌లో సతీసహగమన నిషేధంపై వాదోపవాదాలు పూర్తిగాకముందే ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. పైగా మొగలాయి చక్రవర్తి పక్షాన కృషిచేస్తూ, ఆయన ప్రసాదించిన 'రాజా' బిరుదును బాగా వాడుకున్నాడు. ఆయన కృషివలన మొగల్‌చక్రవర్తి భరణాన్ని సాలీనా మూడువేల పౌండ్లు పెంచారు కూడా. ఇదంతా ఇండియా ప్రభుత్వ ఆదాయంనుంచి చెల్లించాలన్నారు. అదికూడా చాలదని ఇంకా పెంచమని రామమోహన్ కోరాడు. (డిల్లీలో గవర్నర్ జనరల్ ఏజంటు ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీకి 1830 జులై 18న వ్రాసినలేఖ) ఈవిధంగా ప్యూడల్ చక్రవర్తికి తోడ్పడడంతో మిగిలిన జమీందార్లు కూడా ఎగబడి తమ కష్టాలు తీర్చమన్నారు.గ్వాలియర్ రాణి బైజాబాయి తన రాయబారిగా 1833లో రామమోహన్‌ను నియమించింది. అయోధ్య, మైసూరు రాజులు కూడా యిలాంటి ప్రయత్నమే చేశారు.

1718 నుంచి పండితనందకుమార్ విద్యాలంకార్ వద్ద సంస్కృతం, వేదాభ్యాసం చేశాడు రామమోహన్. రాంనారాయణ అధికారివద్ద స్వగ్రామంలో పర్షియన్, అరబిక్ భాషలు నేర్చాడు. ఇస్లాం ప్రభావంలో ఏకేశ్వరాధన కోరాడు. తన కుటుంబంతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా రామమోహన్ తన తండ్రి శ్రాద్ధకర్మను కలకత్తాలో చేశాడు. ఇది ప్రాచీన వైష్ణవ పద్ధతిలో చేశాడు. చనిపోబోయేముందు తండ్రి రమాక్రాంతుడు తీవ్రమైన అప్పులలో పడ్డాడు. దీనివలన జైలులో పెట్టారు. ఆ అవమానంతో ఆయన చనిపోయాడు. అలాగే అన్నకూడా అప్పుల పాలయ్యాడు. అప్పటికే సంపన్నుడుగావున్న రామమోహన్ వీరిని ఆదుకోడానికి ఏమి చేయలేదు. జైలులో వున్న అన్న జగన్‌మోహన్ తనను విడిపించమని తమ్ముడిని కోరగా, నోటు రాయించుకొని 1804 ఫిబ్రవరి 13 లోగా తిరిగి చెల్లించే షరతుపై వెయ్యి రూపాయలు అప్పుగా యిచ్చాడు. రంగపూర్ లో వుండగా ఒక ముస్లిం స్త్రీతో రామమోహన్ తాంత్రిక విద్యను ఆచరించాదడు. హరిహరానందుడి ప్రభావం క్రింద యిది జరిగింది. తాంత్రిక విద్యలో రామమోహన్ కు దీక్ష యిచ్చింది హరిహరానందుడే.

ఫోర్డ్ విలియం కాలేజీలో రామమోహన్ చదువుతుండగా డిగ్ బీ అనే ఆంగ్లేయుడు పరిచయమైనాడు. రాంపూర్ లో డిగ్ బీ అధికారిగా నియమితుడై రామమోహన్ కు ఉద్యోగం యిచ్చాడు. రెవిన్యూ శాఖలో దివాన్ గా చేరిన రామమోహన్, డిగ్ బీ లైబ్రరీ ఆధారంగా ఇంగ్లీషు పుస్తకాలు చదివాడు. ఇక్కడే ఆంగ్ల గ్రంథాల లిబరల్ ఆలోచన వలన ప్రభావితుడైనాడు, అయితే హేతువాదాన్ని ఆమోదించక, మతపరమైన విషయాలను అర్థం చేసుకోడానికి హేతువు తోడ్పడదని రామమోహన్ వ్రాశాడు. దైవసాక్షాత్కారం వంటివాటిలో అతడికి నమ్మకం వున్నది.

రామమోహన్ ను ఇంగ్లీషు పాలకులు బాగా వాడుకున్నారు. కూచ్ బీహార్, భూటాన్ రాజులకు వచ్చిన సరిహద్దు తగాదాలు తీర్చడానికి 1809, 1811, 1815 లో రామమోహన్ ఆ ప్రాంతాలకు వెళ్ళాడు, భూటాన్ రాజు నేపాల్ ను సమర్ధిస్తున్నందున, అతన్ని ఆకట్టుకోడానికి బ్రిటిష్ వారు రామమోహన్ ను వినియోగించారు. భూటాన్ రాజుకు విలువైన బహుమతుల్ని రామమోహన్ ద్వారా బ్రిటిష్ వారు పంపారు. నేపాల్ ను బలపరచకుండా భూటాన్ రాజును మళ్ళించడంలో రామమోహన్ సఫలీకృతుడైనాడు.

ఫ్రెంచివిప్లవంతో ఉత్తేజితుడైన రామమోహన్, ఆ భావాలను ఇండియాకు అన్వయించదలచలేదు. బ్రిటీష్ సామ్రాజ్యం ఇండియాలో సుస్థిరంగా వుండడానికి యధాశక్తి కృషిచేశాడు.

పాట్నాలో వుండగా టిబెట్ లామాల గురించి, బుద్ధిజాన్ని గురించి తెలుసుకొని, ఉత్తరోత్తరా రామమోహన్ టిబెట్ వెళ్ళివచ్చాడు. 1788-90 ప్రాంతాల్లో యీ ప్రయాణం చేశాడు.

సతీసహగమనం - రామమోహన్ పాత్ర

1812లో తన పెద్దన్న భార్య అలకామంజరి భర్త చితిపై చనిపోవడం చూచి, సతీసహగమన అలవాటును మాన్పించాలని కంకణం కట్టుకున్నాడని ఒక కథ ప్రచారంలో వున్నది. అన్న జగన్ మోహన్ చనిపోయినప్పుడు రామమోహన్ అక్కడలేదు. ఈ ఉద్యమాన్నీ తరువాత ఆరేళ్ళకు,అంటే 1818లో గాని రామమోహన్ ఆరంభించలేదు. ఆయన గురువు హరిహరానంద ముందుగా సతీసహగమనాన్ని నిరసిస్తూ ఇండియా గజట్ లో వ్రాశాడు. (1818 మార్చి 27) తాంత్రికులు సతీసహగమనాన్ని వ్యతిరేకిస్తారు. ఆ సంప్రదాయంలో రామమోహన్ వచ్చాడు. బ్రిటీష్ వారు, క్రైస్తవమిషనరీలు అంతకు ముందు యీ అమానుష ఆచారాన్ని వ్యతిరేకించారు. సతీసహగమన విషయమై రామమోహన్ రచనల్ని చదివిన బెంటింగ్, కలకత్తాలో ఆయన్ను సంప్రదించిన మాట వాస్తవం. అంతేగాని యీ ఉద్యమాన్ని ప్రారంభించింది రామమోహన్ కాదు. సాంఘిక ఆచారాలలో కూడా రామమోహన్ అభ్యుదయవాదికాదు. రామమోహన్ కులాన్ని, కులాచారాలను పాటించాడు. చనిపోయే వరకూ జంధ్యం వేసుకున్నాడు. ముగ్గురు భార్యలను, అందులోనూ బాల్యవివాహాలను చేసుకున్నాడు.

అనాటి హేతువాది, శాస్త్రీయ ఆలోచనాపరుడు అయిన డిరోజియోను రామమోహన్ వ్యతిరేకించాడు.

ఆంగ్లేయులను, ముస్లిం మాజీపాలకులను దృష్టిలో పెట్టుకుని జీవితమంతా ఫ్యూడల్ గా బ్రతికిన రామమోహన్ రాయ్ విశేషాలు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంగ్లీషు విద్య కావాలన్నా, సతీసహగమనం పోవాలన్నావాటి వెనుక ఇలాంటి ఉద్దేశాలున్నవి. అయినప్పటికీ సనాతనులపై పోరాడి కొంతవరకైనా కృషి సాగించాడని సరిపెట్టుకోవాల్సిందే.

ఉన్న మతాలు, దేవుళ్ళు చాలవన్నట్లు, బ్రహ్మసమాజాన్ని స్థాపించి, మానవుడిని సాంతంగా ఆలోచించే అవకాశం కోల్పోయేటట్లు రామమోహన్ చేశాడు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి సత్యాలు బయటపడుతున్నవి. అయినప్పటికీ గతంపట్ల మనం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే, పునర్వికాసంరాదు, మనం ముందుకు పోలేం.

(నిరంజనధర్ కు కృతజ్ఞతతో)

- హేతువాది, ఏప్రిల్ 1987