అబద్ధాల వేట - నిజాల బాట/21వ శతాబ్ది తాత్వికుడు పీటర్ సింగర్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
21వ శతాబ్ది తాత్వికుడు పీటర్ సింగర్

గౌరి తీరిగ్గా టి.వి. చూస్తున్నది. అనాధ పిల్లల్ని అప్పగిస్తే లక్ష రూపాయలు ఒక్కొక్కరికీ యిస్తామని, అమెరికాలో పిల్లలు లేని సంపన్నులు పెంచుకోడానికి ముందుకు వస్తున్నారని ప్రకటన చూచింది. వెంటనే తనకు తెలిసిన వీధి అనాధ బాలుడిని టి.వి.లో చూపిన అడ్రస్ కు చేరవేసింది. లక్ష రూపాయలు కళ్ళజూసింది. హాయిగా కొత్త మోడల్ టి.వి.సెట్ కొనుక్కున్నది. విలాసవంతమైన హోటల్ కు వెళ్ళి ఖరీదైన భోజనం చేసి తృప్తిగా తేపింది. ఇంతలో పక్కింటి లక్ష్మి వచ్చి గౌరికి ఒక వార్త చేరవేసింది. టి.వి.లో ప్రకటించునట్లు, కొనుక్కున్న పిల్లల్ని అమెరికా సంపన్నులకు చేర్చడం లేదట. పిల్లల్ని చంపేసి వారి కిడ్నీలు, లివర్, కళ్ళు విడి భాగాలుగా అమ్ముతున్నరట. గౌరి యీ దుర్వార్తకు అదిరి పడింది. ఇప్పుడేం చేయాలి. తన వద్ద వున్న డబ్బు తిరిగి యిచ్చేసి పిల్లవాడిని వాపస్ కోరాలా? వీధిలో దిక్కులేకుండా తిరుగుతున్న అబ్బాయి ఏమైతేనేం అని వూరుకోవాలా?

ఇది నైతిక సమస్య. ఇలాంటివి ఎదురైతే ఏం చేయాలి? ఆధునిక తాత్వికుడు పీటర్ సింగర్ చర్చను ప్రారంభించి పెద్ద దుమారం లేపాడు. సంపన్న దేశాలలో విలాసాలకు ఖర్చుచేసే వారు ఒక్కసారి ఆలోచించి, వాటిని తగ్గించుకుంటే, ఆ పొదుపుతో పేద పిల్లలు బాగుపడతారంటాడు.

పీటర్ సింగర్ హేతుబద్ధమైన ఉపయోగతావాది చింతనాపరుడు. మనం చేసే పనుల ఫలితాలను, బాగోగులను బట్టి మంచిచెడ్డలు నిర్ధారించాలంటాడు.

వస్తువులన్నీ వుండగా వాటిని మార్చేసి, లేదా అవతలపారేసి, కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాటికోసం సంపన్నులు పరుగెడుతుంటారు. సెలవుల్లో ఖరీదైన పిక్నిక్ లకు వెడతారు. అత్యంత విలాసవంత హోటళ్ళలో బాగా ఖర్చుపెట్టి తాగుతారు, తింటారు. అవసరం లేని ఖర్చులు పెడతారు. ఆ డబ్బులో కొంతైనా విరాళంగా యిస్తే చాలామంది అనాధ పిల్లలు, పేద పిల్లలు బాగుపడతారంటాడు పీటర్ సింగర్.

తన వాదానికి మద్దతుగా పీటర్ సింగర్ మరో తాత్వికుడి రచనలు కూడా ఉదహరించాడు. న్యూయార్క్ యునివర్శిటీ ఫిలాసఫర్ పీటర్ సింగర్ 1996లో ప్రచురించిన పుస్తకంలో యిలాంటి వాదన ఆకట్టుకున్నది. (Peter Singer:"Living High And Letting Die")

అయితే పిల్లల్ని ఎందుకు కాపాడాలి? అంటే, రోగాలకు, ఆకలికి పిల్లలు బాధ్యులు కారు. వారిని కన్న తల్లిదండ్రులు, సమాజం అందుకు బాధ్యత వహించాలి. కనుక అలాంటి పిల్లల్ని ఆదుకోవడం బాధ్యతగా స్వీకరించాలని పీటర్ సింగర్ వాదించాడు.

బాల్యదశలో ఆకలి, రోగాలు లేకుండా బయటపడితే ఆ తరువాత వారి తిప్పలు వారు పడతారు. కనుక 2 వేల రూపాయలు దానం చేస్తే ఒక పిల్లవాడు (లేదా బాలిక) ప్రమాదస్థితిని దాటి బయటపడే అవకాశం వుంది.

ప్రపంచంలో అనేక మంది ఆ మాత్రం దానం చేయగల స్థితిలో వున్నారు. అయినా ఉదాసీనంగా అశ్రద్ధ చేస్తున్నారు. ఎందరో పిల్లలు సహాయం అందక చనిపోతున్నారు. ఇదీ స్థితి.

జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులను చంపారు, చిత్రహింసలకు గురి చేశారు. నాజీలు హిట్లర్ నాయకత్వాన జరిపిన యీ దారుణ అమానుష చర్యలు జర్మనీ పౌరులకు తెలుసు. అయినా వూరుకున్నారు. పిల్లలు చనిపోతున్నా బాధపడుతున్నా తెలిసీ కనీస దానం చేయకపోవడం అలాంటిదేనని పీటర్ సింగర్ అంటున్నాడు.

కనీస అవసరాలు తీరేవారు, విలాసాల జోలికి పోకుండా దానం చేయడం నైతిక బాధ్యత అని తాత్వికుడు పీటర్ సింగర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. జీవించడమేకాదు. నైతికంగా మంచి జీవనం అవసరం. ఆ దృష్ట్యా అతడు వాదిస్తున్నాడు.

ఎవరీ పీటర్ సింగర్?

1946లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో పుట్టిన పీటర్ సింగర్ అటు ఆస్ట్రేలియాలోనూ, ఇంగ్లండ్ లోనూ చదివి రెండేళ్ళు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేశాడు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ లెక్చరర్ గా అనుభవం పొందాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మొనాష్ యునివర్శిటీ ప్రొఫెసర్.

మానవ జీవ నీతి శాస్త్ర కేంద్రం డైరెక్టరుగా పీటర్ సింగర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంవారు ఆయన్ను సెనేటర్ గా నిలబడమని కోరారు. 1992 నుండీ అంతర్జాతీయ బయో ఎథిక్స్ సంస్థ స్థాపకుడుగా కృషి చేస్తున్నారు. 1985 నుండీ బయో ఎథిక్స్ పత్రిక సహసంపాదకుడు.

ఇప్పుడు పీటర్ సింగర్ ను అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీవారు మానవ విలువలు అధ్యయనం చేసే బయో ఎథిక్స్ కేంద్రంలో ప్రొఫెసర్ గా ఆహ్వానించారు. ఆయన అంగీకరించి చేరారు. కాని ఆయన నియామకాన్ని ప్రశ్నిస్తూ ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో జీవకారుణ్య సంఘాలవారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకని?

పుట్టిన పిల్లలు ఒకనెల లోపు వికలాంగులని, శారీరకంగా తీవ్ర లోపాలు వున్నాయని తెలిస్తే వారిని చంపేయడం మంచిదని పీటర్ సింగర్ అభిప్రాయం. పిల్లలు సుఖ సంతోషాలను యివ్వాలేగాని, తాము బాధపడుతూ, తల్లిదండ్రులకు, సమాజానికి క్షోభ తీసుకొచ్చే రీతిలో పరిణమించరాదని ఆయన ఉద్దేశం. కనుక అలాంటి పిల్లల్ని నెల రోజుల లోపు చంపేస్తేనే అందరికీ మంచిదన్నాడు. దీనిపై హాహాకారాలు బయలుదేరాయి.

గర్భస్రావం అనుమతించాలనీ, తీవ్ర బాధలు భరించలేక ఎవరైనా చనిపోతామంటే వారిని అలా చనిపోనివ్వాలని అందుకు డాక్టర్లు తోడ్పడడంలో తప్పు లేదని పీటర్ సింగర్ వాదించాడు. యూరోప్, అమెరికాలలో పెద్ద చర్చనీయాంశంగా యీ వాదం మారింది.

1968లో పీటర్ సింగర్ రెనాటా డయమంగ్ ను వివాహమాడాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, రచనలతో బాటు, కూరగాయల పెంపకం, ఈత, నడక ఆయన అభిరుచులు.

కోతుల జాతిని సంరక్షించాలనే (Ape Project) పథకంలో విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుల మద్దత్తు పీటర్ సింగర్ గడించాడు. పరిణామంలో మానవులతో సమంగా వున్న వివిధ కోతి జాతుల్ని ఏ మాత్రం సంహరించరాదని వాదించాడు. కోతి అంగాలు పరిశోధనకు స్వీకరించడం తప్పు కానప్పుడు, మెదడు లేకుండా పుట్టిన శిశువుల అంగాలను తీసుకోవచ్చు గదా అంటున్నాడు.

21వ శతాబ్దంలో కొత్త సూత్రాలు రావాలి. లోగడ టాలమీ విశ్వాసాన్ని కోపర్నికస్ దెబ్బ కొట్టాడు. అతడి లోపాల్ని కెస్లర్ సరిదిద్దాడు. అలాగే ముందుకు సాగడంలో మార్పులు చేసుకోవాలి. ఇందుకుగాను పీటర్ సింగర్ కొత్త నిబంధనలు సూచించాడు. బైబిల్ 10 ఆజ్ఞలు యిప్పుడు మార్చుకోవాలంటున్నాడు. అందులో ముఖ్యమైనవి: 1. మానవజీవితం మారుతుందని గ్రహించాలి.

2. నీ నిర్ణయాలకు వచ్చే ఫలితాలను స్వీకరించే బాధ్యత నీదే.

3. బ్రతకాలా వద్దా అనేది వ్యక్తి యిష్టం. దానిని గౌరవించు.

4. పిల్లలు కావాలంటేనే వారిని యీ లోకంలోకి తీసుకురావాలి.

5. జీవరాసులలో విచక్షణ చూపవద్దు.


జంతువులపట్ల హింసను పీటర్ సింగర్ తీవ్రంగా ఖండించాడు. ఆయన రాసిన పుస్తకం జంతు విమోచన (Animal Liberation) చదివి అనేక మంది శాఖాహారులుగా మారిన దాఖలాలున్నాయి. జంతువుల హక్కుల పోరాట కర్తలకు యిది వేదప్రమాణంగా వుంది.

ఆధునాతన ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో (1996) ఎథిక్స్ పై పీటర్ సింగర్ విపుల వ్యాసం రాశారు. ప్రాచ్య పాశ్చాత్య నైతిక పరిణామాన్ని చక్కగా సమీక్షించారు. 21వ శతాబ్దంలో ఎదురుకాబోతున్న నైతిక సమస్యల ప్రస్తావన తెచ్చారు. ఈ విషయంలో ఆయన జొనాథన్ గ్లోవర్ రచన చూపారు. (Jonathan Glover, 1984, What Sort of People should there be?) రానున్న అనేక క్లిష్ట సమస్యలను, నైతిక సంక్షోభాలను ఆయన మన దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా జనిటిక్స్ రీత్యా యీ సమస్యలు తలెత్తనున్నాయన్నారు. పిల్లలు లేని వారికి తోడ్పడే నిమిత్తం, స్ధంభింపజేసిన రేతస్సు కణాల ద్వారా ఒకామె గర్భం ధరిస్తుంది. తీరా పిల్ల పుట్టిన తరువాత తానే అట్టిపెట్టుకుంటానంటే, ఏమౌతుంది? మనకు అనూహ్యమైన నైతిక సమస్యలు వస్తాయంటున్నాడు.

భారతదేశంలో నీతి, తత్వం, మతం కలసి పోయిన రీతిని పీటర్ సింగర్ ప్రస్తావించాడు. వేదాలు, బౌద్ధ, జైనాలు, చార్వాక నీతి విషయాలు చూపాడు. జంతువుల్ని చంపి యజ్ఞాలు చేస్తే పుణ్యలోకాలకు పోతారనే వేదాలను ప్రశ్నిస్తూ, అలాగయితే వృద్ధ తల్లిదండ్రులను చంపేస్తే సరాసరి స్వర్గానికి పోతారుగదా అని చార్వాకుడు చెప్పిన ఉదంతాన్ని పీటర్ సింగర్ ఆశ్చర్యంతో చూపాడు.

పాశ్చాత్య లోకంలో, తాత్విక ప్రపంచం పీటర్ సింగర్ ను పట్టించుకుంటున్నది.

Peter Singer కొన్ని ముఖ్య రచనలు:

1. Animal Liberation

2. Marx

3. The Expanding Circle : Ethics & Sociobiology

4. Practical Ethics

5. Rethinking : Life and Death

6. Democracy and Disobedience

7. Reproduction Revolution Articles :

Ethics : Encyclopedia Britannica 1996 edition

Co-Editor : Bio Ethics Journal

- మిసిమి మాసపత్రిక, జనవరి-2000