అబద్ధాల వేట - నిజాల బాట/ప్రార్థనలతో ప్రాణాలు నిలుస్తాయా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ప్రార్థనలతో ప్రాణాలు నిలుస్తాయా?

ఉద్యోగాలకై గ్రామాలకు వెళ్ళమంటే పోకపోగా, సమ్మెచేయడం ధర్నాలు నిర్వహించడం మనకు తెలిసిన కథే. అమెరికాలో పరిస్థితి వేరే వుంది. అక్కడ గ్రామ ప్రాంతాలకు అమెరికా డాక్టర్లు వెళ్ళరు. అందుకు మార్గాంతరంగా ఆయా ప్రభుత్వశాఖలు ప్రతిపాదనచేసి, డాక్టర్లను పిలిపించుకోవచ్చు. స్వదేశీ డాక్టర్లు దొరకరు కనుక విదేశీ డాక్టర్లను రప్పిస్తారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ అలా వచ్చిన ఇండియన్ డాక్టర్. పంజాబ్ నుండి 1999లో అమెరికా వచ్చిన ప్రదీప్ కుమార్ ను ఎడారిలోని ఒక కుగ్రామానికి వెళ్ళమన్నారు. ఇండియాలో అయితే వెళ్ళేవాడు కాదేమోగానీ, అమెరికా కదా వెళ్ళక తప్పలేదు. యురేకా అనే మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు. నేవాడ రాష్ట్రంలో డైమండ్ పర్వతాల చెంత ఈ కుగ్రామం వుంది. కొద్దిమంది నివశించే ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవు. హాస్పటల్ లేదు. అయినా డా॥ప్రదీప్ కుమార్ మూడు సంవత్సరాలు పనిచేసి గ్రామస్తుల ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. అక్కడి వారు ప్రదీప్ కుమార్ ను తమలో ఒకడిగా భావించేవారు.

యురేకాలో ఎవరికైనా జబ్బుచేస్తే హాస్పటల్ లో చేర్పించాలంటే 110 మైళ్ళు పోవలసిందే. అమెరికాలో అలాంటి ప్రదేశాలు వున్నాయి. ప్రదీప్ కుమార్ ఇప్పుడు ఇండియానా రాష్ట్రంలో పనిచేయడానికి వెళ్ళాడు. అక్కడ తన భార్య, చిన్న కుమారుడు వున్నారు. ఒకప్పుడు అమెరికాకు విపరీతంగా వెళ్ళిన డాక్టర్ల ప్రభావం ఇప్పుడు లేదు. ఇంజనీర్ల వలన కూడా వెనుకంజ వేసింది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాలకు డాక్టర్లను విదేశాల నుండి పిలిపించుకోవచ్చు. కొత్త వాతావరణంలో వచ్చేవారికి టెర్రరిస్టు సంబంధాలు లేకుండా వుండాలి. కానీ అది రుజువు చేయడం ఎలా? ఆ పని రక్షణ సంస్థలు, ఇమిగ్రేషన్ శాఖ చేయాలని ఇతర ప్రభుత్వ శాఖలు అంటున్నాయి. పల్లె ప్రాంతాల్లో మాత్రం డాక్టర్ల అవసరం చాలా వుంది. యురేకాలో డాక్టర్ ప్రదీప్ కుమార్ కు డబ్బు వచ్చినా కనీస సౌకర్యాలు కూడా లేకుండానే కష్టపడి పనిచేయాల్సి వచ్చింది.

కొన్ని క్రిస్టియన్ శాఖలు కేవలం ప్రార్థనలతో జబ్బులు నయమవుతాయని నమ్ముతున్నారు. అమెరికాలో ఇలాంటి క్రిష్టియన్ శాఖలు పది వరకు వున్నాయి. పిల్లలకు జబ్బుచేస్తే కొందరు ప్రార్థనలు జరిపినా జబ్బు నయంకాక చనిపోతే, అడిగే దిక్కు లేకుండాపోయింది. దీనిపై డా॥ రీటా స్వాన్ తిరుగుబాటు వేసింది. ఆమె కుమార్తె అలానే చనిపోయింది. కోర్టుకు వెడితే మతసంస్థలపై తమకు హక్కులేదని అన్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కోర్టుకు వెళ్ళే రీతిలో చట్టాలు మారుస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మేవారు అమెరికాలోనూ వున్నారు.

- వార్త, 1 డిసెంబరు,2002