అబద్ధాల వేట - నిజాల బాట/అమెరికా హేతువాదులతో

వికీసోర్స్ నుండి
అమెరికా హేతువాదులతో

అమెరికా మూఢ నమ్మకాలలోనూ అగ్రరాజ్యమే. అత్యధిక సంఖ్యాకులు క్రైస్తవులుగా వివిధ విశ్వాసాలతో జీవితాన్ని సాగిస్తున్నారు. అటువంటివారి మెతక సనస్తత్వాలపై క్రైస్తవ బాబాలు, చర్చీలు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ధనార్జన చేస్తున్నాయి.

అమెరికాలో హేతువాదులు అల్పసంఖ్యాకులే. అయినా వారికి బలీయమైన ఆయుధం సైన్స్, సైంటిఫిక్ పద్ధతి. కొద్దిమంది శాస్త్రజ్ఞులు హేతువాది సంఘాలలో పనిచేస్తూ ప్రోత్సహిస్తున్నారు. కాని మూఢనమ్మకాల అమెరికా సమాజంలో వీరిది ఎదురీతగానే వుంది. ఎప్పటికప్పుడు హేతువాదులు(మానవాదులు) ప్రజలకు జరుగుతున్న మతపరమైన మోసాలు, దివ్యశక్తుల పేరిట కుట్రలు, అతీంద్రియ శక్తుల పేరిట ఘోరాలు బట్టబయలుచేస్తూనే వున్నారు. అయినా అమెరికన్లు కొత్త బాబాల్ని వెతుక్కుంటూ, కొత్త మోసాలకు గురిఅవుతూనే వున్నారు.

నేను 1992లో ఆర్నెల్లు, 1994 సంవత్సరం అమెరికా సంయుక్తరాష్ట్రాలలో గడిపి హేతువాద, మానవవాద, నాస్తిక, సందేహవాదులతో పరిచయం ఏర్పరచుకున్నాను. వారి కార్యకలాపాలు పరిశీలించాను. వారి సమావేశాలలో మాట్లాడి మన హేతువాదుల కృషిని వివరించాను. వారిపత్రికలు, ప్రచురణలు, ప్రసారాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. కొందరు ప్రతిభాశాలురతో సన్నిహిత పరిచయం కూడా ఏర్పరచుకున్నాను. వారిలో పాల్ కర్డ్స్, ఫ్రెడరిక్ ఎడ్వర్డ్స్ వంటివారికి ఇండియాతో పరిచయం వుంది.

అమెరికాలో హేతువాదులు, మానవవాదులు ఒకటిగానే పనిచేస్తున్నారు. హేతువాదులు సెయింట్ లూయిస్ నుండి రేషనలిస్ట్ అనే మాసపత్రిక నిర్వహిస్తున్నారు. దీనికి గార్డన్ స్టయిన్ సంపాదకుడు. ఆయన ప్రతిభాశాలి. ప్రస్తుతం బఫెలో నగరంలో ఇంగర్ సాల్ గ్రంథాలయం పెంపొందిస్తున్నారు. ఇంగర్ సాల్ ఇంటిని ఒక మ్యూజియంగా 1994లో రూపొందించారు. ఇది న్యూయార్క్ రాష్ట్రంలోని డ్రెస్ డన్ లో వుంది. ఇంగర్ సాల్ పుస్తకాలన్నీ పునర్ముద్రించారు. కంప్యూటర్ డిస్క్ లో కూడా అమర్చి అందిస్తున్నారు. క్రైస్తవమత ఘోరాల్ని ఇంగర్ సాల్ ఎదుర్కొన్నతీరు జనాలకు జ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంగర్ సాల్ పై ప్రచురించిన గ్రంథాలు, అనువాదాలు సేకరించి బఫెలో గ్రంథాలయంలో అమర్చే ప్రయత్నంలో వున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హేతువాద, మానవవాద ప్రచురణలు కూడా ఒకచోట చేర్చి అందుబాటులో వుండెట్లు ప్రయత్నిస్తున్నారు. బఫెలో కేంద్రంలో భవనాలు నిర్మించడంలో ప్రస్తుతం వీరు కృషి చేస్తున్నారు. ఇది నయాగరా దగ్గరే వుంది. అమెరికా సందర్శించే హేతువాదులు యీ కేంద్రానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న హేతువాద కార్యక్రమాలు పరిశీలించాలి. కొంతవరకు అవి మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

అమెరికా మానవవాద, హేతువాద సంఘాలు ఆ దేశంలో కొందరు నిపుణులతో పరిశీలన సంఘాలను ఏర్పరచాయి. అతీంద్రియశక్తులున్నాయని చెప్పేవారి నిమిత్తం ఒక సంఘం వుంది. వీరు ఆయా సంఘటనలు జరిగినచోట్లకు వెళ్ళి పరిశీలిస్తారు. వివరంగా పూర్వపరాలు తెలుసుకుంటారు. దీనికి రే హైమాన్ అధ్యక్షులుగా వున్నారు, పేరా సైకాలజి ఉపసంఘం వారు అనేక మౌలిక విషయాలు బట్టబయలు చేశారు. డ్యూక్ విశ్వవిద్యాలయంలో జె.బి.రైన్ ఆధ్వర్యాన మూడు దశాబ్దాలపాటు జరిగిన మోసాల్ని రట్టుచేశారు. అక్కడ శాస్త్రీయ పరిశోధనల పేరిట జరిగినదంతా తంతు అని తెలిపారు.

జ్యోతిష్యవిషయ పరిశీలన సంఘానికి ఇ.డబ్లు.కెల్లీ అధ్యక్షులుగా వున్నారు. సైంటిస్టులు జ్యోతిష్యాన్ని పరిశీలించి అందులో శాస్త్రీయాధారాలు లేవని తేల్చారు. పత్రికలలో జ్యోతిష్యఫలాలు ప్రకటించినప్పుడు, అది కేవలం వినోదం కొరకేనని వ్రాయమని ఎడిటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పత్రికలు అలా చేస్తున్నాయి.

ఆరోగ్యరంగంలో అశాస్త్రీయ చికిత్సలు బయటపెట్టడానికి ఒక సంఘం పనిచేస్తూ వున్నది. విలియం జార్విస్ దీనికి అధ్యక్షులు. అక్యూపంక్చర్, హోమియో, కైరోప్రాక్టిస్ మొదలైన విధానాల వలన హాని,అశాస్త్రీయత బయటపెట్టారు.

ఎగిరే పళ్ళాల గొడవ మనకు అంతగా పట్టలేదుగాని అమెరికాలో యిది తీవ్రంగా వుంది. దీని ఉపసంఘం అధ్యక్షుడు ఫిలిప్ క్లాజ్ లో గుట్టు అంతా బయటపెట్టాడు. ఆయన్ను నేను కలసి ఇంటర్వ్యూ చేశాను. ప్రజలు తమకు తెలియని ఆకాశ వస్తువులపట్ల ఎలాంటి భ్రమలు, ఊహలతో వుంటారో వివరించారు.

అనేక మూఢనమ్మకాలను బట్టబయలు చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడే ఉపసంఘం పనిచేస్తున్నది. ప్రముఖ హేతువాది పేజ్ స్టేఫెక్ దీనికి అధ్యక్షులు. ఆయనతో, సెయింట్ లూయుస్ లో ఒకరోజు గడిపి, చర్చించాను. హిప్నాటిజం, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, దివ్యవాణి, అతీంద్రియ శక్తులు, ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలైన విషయాలలో వీరు కంప్యూటర్ల ద్వారా పరిశోధన చేస్తున్నారు.

క్రైస్తవ మత ప్రచారకులు, భక్తితో రోగాల్ని నయం చేస్తామనే వారిని జేమ్స్ రాండి అనే ఆయన ఉతికేస్తున్నాడు. కొందరు ఆయన ధాటికి తట్టుకోలేక దివాళా తీశారు. యూరిగెల్లర్ వంటి మాంత్రికులు కోర్టుకుపోయి, ఓడిపోయి, జేమ్స్ రాండి దెబ్బకు హడలి, పారిపోతున్నారు. అనేక రంగాలలో జేమ్స్ రాండి నేటికీ యువకులకు శిక్షణ యిస్తున్నారు. ఇండియా నుండి ఎవరైన వస్తే శిక్షణ యిస్తారుకూడా. ఆయనతో నేను ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. సైన్స్ రంగంలో మోసాలు చేస్తున్నవారి గురించి సుప్రసిద్ధ సైన్స్ రచయిత మార్టిన్ గార్డినర్ అనేక రచనలు చేసి, యధార్ధాలను వెల్లడించారు. 80వ ఏట కూడా ఆయన యింకా యీ కృషిసాగిస్తూ, హేతువాదులకు తోడ్పడుతున్నారు. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్ ను కలిశాను. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. శాస్త్రీయంగా ఆయన అనేక విషయాలలో మతం పేరిట చేస్తున్న తప్పుడు వాదనలు బయటపెడుతున్నారు. ఆయన ఉపన్యాసాలు స్వయంగా విన్నాను. భారత హేతువాదులకు, మానవవాదులకు తన శుభాకాంక్షలు అందజేశారు.

మానసిక వైకల్యం, పిచ్చి అనే పేరుతో దొంగ చికిత్సలు చేస్తున్నవారిని తీవ్రంగా విమర్శిస్తూ థామస్ సాజ్ కృషి చేస్తున్నారు. ఆయన్ను కూడా కలిశాను. ఆయన పుస్తకాలు హేతువాదులు పరిశీలించాలి. ముఖ్యంగా మిత్ ఆఫ్ మెంటల్ ఇల్ నెస్ గమనించాలి. ఇండియాకు ఎవరైనా పిలిస్తే వస్తామన్నారు.

- శాస్త్రీయ హేతువాదం, జనవరి-ఫిబ్రవరి 1998