Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/జపాన్ దిగుమతి రేకి చికిత్స

వికీసోర్స్ నుండి
జపాన్ దిగుమతి రేకి చికిత్స

విదేశాల నుండి మనకు అనేక మార్గాంతర వైద్య చికిత్సలు వచ్చాయి. అందరూ తమది సైంటిఫిక్ అని ముద్ర వేసుకొంటున్నారు. విచారణ జరిపి, నిగ్గు తేల్చే వైద్యసంస్థ లేదు గనుక, ఎవరికి చేతనైనంత వారు సంపాదించుకొని, జబ్బు మనుషుల్ని బాగా వాడుకుంటున్నారు.

ఇప్పుడు మార్కెట్ లో రేకి (REY-KEY అని పలుకుతారు)కొత్తగా వ్యాపిస్తున్నది. ఇది జపాన్ నుండి వలస వచ్చింది. ఇప్పటికే అమెరికా యూరోప్ లకు వ్యాపించిన రేకి వైద్యం, భారతదేశంలో అడుగిడింది. జపనీస్ అర్థంలో రే అంటే స్పిరిట్. రేకి అనగా ఆధ్యాత్మిక జీవశక్తి అని అర్థం. జీవన శక్తిని నడిపించే స్పిరిట్ అన్నమాట.

మికాఓ ఉసుయై(MIKAO USUI) 1802-1883-జపాన్ లో మత ఉద్యమం నడిపాడు. అతడు కనుగొన్నదే రేకి వైద్యం. మన రుషుల వలె, ప్రవక్తల వలె యితడికీ దివ్యవాణి వినపడడం, భ్రమలు కలగడం, అమ్నిషికి చికిత్స చేయడానికి యీ దివ్యవాణి అక్కరకు వస్తుందనడం అవసరమన్నాడు. మికాఓ తరచు ఉపవాస దీక్షలు చేసి, ఆ తరువాత తనకు దివ్యవాణి తెలిపిందంటూ బయట పెట్టేవాడు.

జీవశక్తిలో వడిదుడుకులు సంభవించినప్పుడు రోగాలు వస్తాయని రేకి సిద్ధాంతం విశ్వమంతటా శక్తి వ్యాపించి వుంది. దీనిని రేకి విధానం ప్రత్యేక శక్తితో కనుగొని, రోగికి ప్రసరింపజేస్తుంది. విశ్వంలోని శక్తిని సరైన మార్గంలో పెడితే రోగి కుదురుకుంటాడన్నమాట. విశ్వశక్తిని రోగి దగ్గరకు కేవలం రేకి డాక్టర్ మాత్రమే తేగలడు. విశ్వశక్తి తోడ్పాటుతో వ్యక్తిలోని శక్తి పెరిగి, రోగం నయమౌతుంది. ఆ విధంగా రోగిలోని శక్తిని సమపాళ్ళలో మళ్ళించడంతో వ్యక్తి స్వస్థత పొందుతాడు.

అయితే రేకి వలన రోగాలు తగ్గకపోతే? అందుకు కారణం రోగి విశ్వశక్తిని స్వీకరించకుండా నిరోధిస్తున్నాడన్నమాట! అంటే, రోగి పూర్తిగా రేకి డాక్టర్ కు లొంగిపోయి అతడు చెప్పింది వింటే, ఏ రోగమైనా తగ్గిపోతుంది. అన్ని రోగాలకు రేకి చికిత్స వుంది.

నేడు రేకి చికిత్స మూడు దశలలో నేర్పుతున్నారు. దీనికిగాను బాగా ఫీజులు వసూలు చెస్తున్నారు. మత పరిభాషను అడుగడుగునా రేకి చికిత్సలో ప్రయోగిస్తున్నారు. రేకి విధానంలో వివిధ దశలలో మత సంకేతాలు వాడతారు. ఉద్వేగరీతుల్ని యధాస్థితికి తెస్తామంటారు.

- నాస్తికయుగం, జూన్ 2001