అబద్ధాల వేట - నిజాల బాట/చదువుకున్నవారిలోనూ మూఢనమ్మకాలెందుకుంటాయి?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
చదువుకున్నవారిలోనూ
మూఢనమ్మకాలెందుకుంటాయి?

అంత చదువుకున్న సైంటిస్టు బాబా కాళ్ళకు మొక్కుతున్నారు. కనుక ఏదో మహత్తు వుందన్నమాట అని సాధారణ పౌరులు అనుకోవడం చూస్తున్నాం.

సాంకేతిక నిపుణులు, పవిత్ర గ్రంథాలను పట్టుకొని, పూజలు చేస్తున్నారు. ప్రొఫెసర్లు, సాధువు ఏం చెప్పినా, ఇంటిలో విగ్రహారాధన, బయట మొక్కుబడులు చేస్తున్నారు.

ఈ విధంగా చదువుకున్నవారు మూఢనమ్మకాలను పాటిస్తుండటం వలన ప్రజలలో యింకా వాటికి బలం పెరుగుతోంది.

రాజకీయవాదులు, సినిమాతారలు, జడ్జీలు, పోలిస్ అధికారులు తిరుపతి, షిర్డి, అయ్యప్ప భక్తులుగా, బాబా పాదాక్రాంతులుగా ప్రవర్తించడంతో అదంతా ఆనవాయితీగా ప్రశ్నించరాని తీరుగా మారుతోంది.

చదువుకున్నవారు మూఢవిశ్వాసాలతో వుండడం మన సమాజానికే పరిమితం కాదు. అగ్రరాజ్యమైన అమెరికా మొదలు కమ్యూనిష్టు దేశాలవరకూ యీ మూఢత్వం వివిధ రూపాలలో వ్యాపించి అంటురోగం వలె ప్రబలుతున్నది.

కొందరు కొన్నిటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి మరికొన్నిటిని గుడ్డిగా నమ్ముతున్నారు.

మనకు అనుకూలమైన విషయంలో మనకు గిట్టుబాటు అయినచోట, సంపాదనకు ఉపకరించే దగ్గర, శాస్త్రీయ పరిశీలన పక్కనబెట్టి, హాయిగా మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారు. మిగిలిన విషయాలపై వేదికలెక్కి మూఢనమ్మకాలను ఖండించే వారే, యిలా అవకాశవాదులుగా మారడంతో ప్రజలలో విశ్వాసం సడలుతున్నది.

ఇలా ఎందుకు జరుగుతున్నది? ఈ విషయం సునిశితమైనది. జాగ్రత్తగా పరిశీలించి అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా మానవవాదులు, హేతువాదులు, సందేహవాదులు, నాస్తికులు గ్రహించాలి.

మన సమాజాలు పెత్తందారీ విధానంలో వున్నాయి. అధికారాన్ని కొలిచే సంప్రదాయంలో అలవాటుగా పెరుగుతున్నాం. తల్లిదండ్రులు చెప్పిందే చిన్నప్పుడు వేదం. బడిలో ఉపాధ్యాయులు చెప్పిందే సరైనది అని నిర్ధారణగా నమ్ముతారు. సమాజంలో రాజకీయ నాయకులు, సినిమా తారలు,బాబాలు, చాలామందిని నడిపిస్తున్నారు. వీరందరిలో మూఢనమ్మకాలు అలవాటుగా, వంశపారంపర్యంగా వస్తున్నవి.

చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, సమాజంలో పెద్దలు చెప్పిన మూఢనమ్మకాలు వాళ్లల్లో గాఢంగా నాటుకపోయివుంటాయి. అలాంటప్పుడు సైంటిస్టుగా, ఇంజనీర్ గా, డాక్టర్ గా చదువుకున్న వ్యక్తి తన పరిధిలో, తన ప్రాక్టీసులో నిపుణుడుగా తేలినా, మిగిలిన రంగాలలో మూఢనమ్మకాలను పట్టించుకోడు. కనుక చిన్నతనంలో మనస్సులో నాటుకుపోయిన నమ్మకాలు విజృంభించి పనిచేస్తాయి. ఈ విషయాలను పరిశీలించి కార్ల్ శాగన్ చక్కని గ్రంథం రాశారు. అందుకే జేమ్స్ రాండి అంటాడు-చదువుకున్నవారిని,సైంటిస్టులను భ్రమలో పెట్టడం మోసగించడం తేలిక అని, ఏదో ఒక అద్భుతం జరుగుతున్న చోటుకు పరిశీలక బృందం వెడితే, అందులో ఒక మెజీషియన్ వుండడం అవసరమని జేమ్స్ రాండి అన్నాడు. లేకుంటే కనికట్టుతో, ఇంద్రజాలంతో బురిడీ కొట్టించడం చాలా తేలిక. సైంటిస్టులు ముక్కుసూటిగా పోతూ, యీ పక్కదారుల్లో జరిగే మాయాజాలాన్ని పట్టించుకోరు. పైగా వాటిని గ్రహించానికి వేరే శిక్షణ వుండాలి.

రాజ్యాధికారంలో వున్న వ్యక్తులు జ్యోతిష్యాన్ని, వాస్తును, యోగంను చిట్కావైద్యాలను ప్రచారం చేసినప్పుడు, ప్రజలు పక్కదారులకు పోతుంటారు. అందుకే రాజకీయవాదుల్ని బాబాలు ఆశ్రయించి తమ పని సులువు చేసుకుంటారు. ఉభయులూ జనాన్ని మోసం చేయడం, వారి పబ్బం గడుపుకోవడానికే.

అలాంటి వాతావరణంలో కొందరు హేతువాదులు,మానవవాదులు నాస్తికులు సైతం ఒక్కోసారి ఏదో ఒక మూఢనమ్మకం దగ్గర తప్పటడుగు వేస్తారు. శాస్త్రీయ పద్ధతిని అన్వయించడంతో అది విమర్శలకు దారితీస్తుంది.

ఇలాంటి విషపూరిత సామాజిక మూఢనమ్మకాల వాతావరణంలో ఏం చేయాలి?

శాస్త్రీయ పద్ధతి మూలసూత్రాలు వంటబట్టించుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించే అలవాటు చేసుకోవాలి. ఏ ప్రశ్న వేయాలి, ఎలాంటి పరికరాలు వాడాలో అన్వేషించడంలో ఏ మార్గం అనుసరించాలి, అనేవి గ్రహించాలి. ఒక్కొక్క మూఢనమ్మకం వెనుక వున్న విషయం ఏమిటి అనేది చూడాలి. సైన్స్ పరిశోధనలు ఒకసారి వచ్చి ఆగిపోవు. నిత్యనూతనంగా జరిగే, ప్రక్రియ అది. కనుక ఎప్పటికప్పుడు కొత్త అంశాలు ఏమి వచ్చాయో చూడాలి. ఎంత గొప్ప సైంటిస్టు చెప్పినా అది వ్యక్తిగత అభిప్రాయం అయితే దానిని ప్రమాణంగా స్వీకరించరాదు. జ్యోతిష్యాన్ని గురించి న్యూటన్,యూంగ్ చెప్పాడంటే అది సైన్స్ లో భాగం కాదు. ఈ విషయం గ్రహించక తరచు సైంటిస్టుల పేరు చెప్పి బోల్తా కొట్టించే వారి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఈ విషయాన్ని మరో కోణం నుండి చూద్దాం.

సూరి భగవంతం సైంటిస్టుగదా. అలాంటి వ్యక్తి సత్యసాయిబాబా భక్తుడై అతని దేవుడని నమ్మాడుగదా. ఏమంటారు అని అనేకమంది అడుగుతుంటారు. అలా సమస్య వచ్చినప్పుడు సామాన్యవ్యక్తులు అవును నిజమే అంతటి సైంటిస్టే నమ్ముతుంటే ఏమీ లేకపోతే ఎందుకు గుడ్డిగా పాదాక్రాంతుడౌతాడంటారు.

హేతువాదులు ఆ క్లిష్టసమస్యను ఎదుర్కోవడంలొ ముందుగా గమనించవలసిన విషయాలున్నాయి. సూరి భగవంతం ఫిజిక్స్ లొ ఒక భాగమైన క్రిస్టలోగ్రఫీ నిపుణుడు. అది గొప్ప సైన్సు. ఆ విషయాలు ఏవైనా సూరిభగవంతం చెబితే అందుకు రుజువులు, ఆధారాలు, పరిశోధనలు, పరిశీలనలు వుంటాయి. ఆయన చెప్పేవి నిజం అవునోకాదో ఇతరులు అవే పరిశోధనలు చేసి కనుగొనవచ్చు. కాని సత్యసాయిబాబా విషయం కేవలం వ్యక్తిగత నమ్మకం. ఫిజిక్స్ లో ఆయన చదివిన దానికీ, యీ మూఢవిశ్వాసానికీ ముడిపెట్టకూడదు. కాని జనం అలా రెండింటినీ పెనవేసి, ఒకేగాటిన కట్టేసి చూస్తారు. అదే లోపం. శ్రీ పాదగోపాలకృష్ణ మూర్తి ఫిజిక్స్ ప్రొఫెసర్ కాని ఆయన జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుడు. ఆ రెండింటికీ సంబంధం లేదు. ఈ విషయాలను విడమరచి చూడకపోవడంలోనే తేడా వస్తున్నది.

భగవతి ఒక జడ్జి. ఆయన సాయిబాబా భక్తికీ, న్యాయమూర్తిగా ఆయన చట్టనైపుణ్యతకూ పొందిక లేదు. ఇలాగే ఎవరి విషయంలోనైనా చెప్పవచ్చు.

జనంలో వీరారాధన తత్వం వుంది. అందులో అరలు పొరలు వున్నాయి. సినిమా హీరోలను, రాజకీయవాదులను గొప్ప ఆరాధ్యులుగా చూచేవారున్నారు. వారికోసం ప్రాణాలు తీసుకునేవారూ వున్నారు. అలాంటివారే బాబాలకు భక్తులుగా వున్నప్పుడు, వారిని ఆరాధించే తీరు సంగతి చెప్పాలా?

జనంలో వున్న యీ బలహీనతల్ని, వీరారాధన తత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను తాకట్టుపెట్టే ధోరణి బాగా వాడుకుంటున్నారు. స్వేచ్ఛకు దూరంగా జరుగుతూ ఎవరికో, ఒకరికి లొంగిపోయి అదే హాయి అనే ధోరణి జీవిస్తున్నారు. దీనికి కర్మవాదం తోడైంది.

భయం వలన భక్తిగా వుండటం సర్వసాధారణం, చిన్నప్పటినుండే పిల్లల్ని కొట్టి, తిట్టి, గుడులకు మసీదులకు, దేవాలయాలకు తీసుకెళ్ళి, గుడ్డిగా వల్లెవేయించిన ఫలితంగా యీ భయం గూడు కట్టుకొనివుంటుంది. అది పెద్ద అయినా పోవడం లేదు. ఆ భయం చుట్టూ క్రతువులు,పూజలు, మొక్కుబడులు,యజ్ఞాలు,యాగాలు ఒకటేమిటి, ఎన్నో అల్లేశారు. పురోహిత వర్గం అన్ని మతాలలో యీ భయాన్ని కట్టుదిట్టం చేసి, జనాన్ని గుప్పిట్లో పెట్టుకున్నది. కమ్యూనిస్టు పాలనలో సైతం యిది రూపుమాపలేకపోయారు.

శాస్ర్తీయ పద్ధతిని చిన్నప్పటి నుండే పిల్లలకు చెప్పడం ఒక్కటే ఈ భయాన్ని పోగొట్టగలదు. ఇది క్రమేణా జరగాలి.

సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిశీలించాలో, ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం. దీనికి ముందు ఒక్క సత్యాన్ని విస్మరించరాదని హెచ్చరిక చేయక తప్పదు.

సత్యసాయిని ఖండించే వారంతా మూఢనమ్మకాలకు వ్యతిరేకం అని భ్రమపడితే పెద్ద పొరపాటే. సత్యసాయి బోగస్ కానీ, షిర్డీ సాయి అనువైన వాడనేవారున్నారు. ఇదంతా కాదు, కేవలం తిరుపతి వెంకటేశ్వరుడే నిజమైన దేవుడనేవారూ వున్నారు. మనం చెక్కిన విగ్రహాలకు మనమే మొక్కుతూ బానిస మనస్తత్వంతో బ్రతుకుతున్నామని ఆర్యసమాజ్ వారన్నారు. అలాగని వారు వేదాల్లోకి వెనక్కుపోయి అక్కడే ఆగిపోదామంటున్నారు.

ఈ మతాల మధ్య కలహాలలో పరస్పరం దేవుళ్ళ మహాత్మ్యాలు బయటపడుతుండగా, అన్ని మతాల సమన్వయ వ్యాపారానికి దిగిన రామకృష్ణ పరమహంస వున్నారు. మూఢనమ్మకాలలో, తరతమభేదాలే తప్ప యిందులో మానవుని స్వేచ్చను కాపాడేవి ఒక్కటీ లేవు. అది గ్రహించగలిగితే వివిధ మూఢనమ్మకాలను, వాటి పేరిట జరిగే చికిత్సలను బట్టబయలు చేయవచ్చు. ఎలా చేయడం అనే దగ్గర జాగ్రత్త వహించాలి.

జ్యోతిష్యం శాస్త్రీయమనంటే?

జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అని హేతువాదులు అంటుంటారు. కాదు శాస్త్రీయమే అని మరొక వాదన వుంది. ఏదైనా శాస్త్రీయం అని ఎవరన్నాసరే సంతోషమే. ఒక విషయం శాస్త్రీయం అనగానే ఆహ్వానించాలి. శాస్త్రీయం అయితే బహిరంగంగా పరిశీలనకు పెట్టవచ్చు. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు చేర్పులకు అనుగుణంగా శాస్త్రీయ విధానం వుంటుంది. దీనినే శాశ్వతం అనదు. పూర్వకాలంలో రుషులు రాసారు గనుక అదే ప్రమాణం అని శాస్త్రీయం అంగీకరించదు. రుజువుకు నిలబడితే ఒప్పుకోవడం, లేకుంటే తృణీరించడం శాస్త్ర లక్షణం. తనను తాను దిద్దుకుంటూ సాగడం శాస్త్ర మూలం.

జ్యోతిష్యం శాస్త్రీయమేనని అనగానే, హేతువాదులు ఏమని అడగాలి? ఎలా పరిశీలించాలి? ఏది రుజువుకు పెట్టాలి? ఈ అంశాలు కూడ క్షుణ్ణంగా తెలిసి వుండాలి. గుడ్డిగా వ్యతిరేకించి కొట్టిపారేయరాదు. ఆ దృష్ట్యా మానవ, హేతువాదులకు సూచనలు యిస్తున్నాను. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మనుషులపై ప్రభావం చూపుతాయి. సరే, బాగానేవుంది. ముందుగా గ్రహాల నుండి ఎలాంటి ప్రభావం వస్తుందో చూడాలి. ఇంత వరకు సైన్స్ పరిశోధించిన దానినిబట్టి నాలుగు శక్తులున్నాయి. అందులో వీక్ నూక్లియర్, స్ట్రాంగ్, విద్యుదయస్కాంతశక్తులు అని తేల్చారు.

అస్థిరంగా వుండే నూక్లియర్ క్షీణదశకు వీక్ నూక్లియర్ ఫోర్స్ కారణమౌతుంది.

స్ట్రాంగ్ నూక్లియర్ ఫోర్స్ అణువు పరమాణువుల స్థాయిలో అతి సమీపస్థలంలో పనిచేస్తుంది.

విద్యుదయస్కాంత శక్తి పనిచేయడానికి వస్తువుల్ని ఛార్జి చేయాలి. అప్పుడే అది చర్యకు ఉపక్రమించి రసాయనిక మార్పులకు దారితీస్తుంది.

గురుత్వాకర్షణ శక్తి ఏవైనా పెద్ద వస్తువుల మధ్య పనిచేస్తుంది. అంటే భూమి చంద్రుడు లేదా చంద్రుడు సముద్రాలంతటి పెద్ద వాటి మధ్య పనిచేస్తుందన్నమాట. నాలుగు శక్తులలో ఇది చాలా బలహీనమైనదంటాడు. మనిషికీ గ్రహానికీ ప్రత్యక్షంగా ప్రభావం చూపే శక్తి కనబడలేదు. ఇక మిగిలింది సూర్యుడి నుండి వచ్చే వెలుగు మాత్రమే. ఎప్పుడు పడిన వెలుతురును ప్రమాణంగా స్వీకరించాలి? తల్లిగర్భం ధరించిన తరువాత ప్రసవించే వరకూ పడే వెలుగును జ్యోతిష్యం స్వీకరించడం లేదు. వెలుగుకు ప్రభావం వుంటే ఆ 9 మాసాల వెలుగు కిరణాలమాటేమిటి?

జ్యోతిష్యులు కొందరు చెప్పే అయస్కాంత ప్రకంపనాల ప్రభావం ఇంతవరకూ రుజువు కాలేదు. జ్యోతిష్యంలో నక్షత్రాల ప్రస్తావన వుంది. భూమికి సమీప నక్షత్రం నుండి వెలుగు రావడానికి నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది. మిగిలిన వాటి దూరం శతాబ్దాలకు మించిపోయింది. కనుక ఈ కిరణాల ప్రభావం పరిగణలోకి జ్యోతిష్యం తీసుకోజాలదు.

జ్యోతిష్యంలో పేర్కొనే రాశిచక్రాలు, గుర్తులు ఊహమాత్రమైనవి. అంటే వాటికి ఉనికి లేదు. గ్రహాలలో రాహువు కేతువూ అంతే. అవి కేవలం నమ్మకాలు. గ్రహాల ప్రభావం వుందని తాత్కాలికంగా అంగీకరిస్తే, కొత్తగా కనుగొన్న నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో మాటేమిటి? అవి కనుగొనక ముందున్న జ్యోతిష్యం అంతా తప్పు గదా? ప్రాచీన జ్యోతిష్యం గ్రంథాలన్నీ తిరగరాయాలి గదా.

ఒకే సమయంలో పుట్టిన కవలలపై జ్యోతిష్య ప్రభావం భిన్నంగా వుండడాన్ని అధ్యయనం చేశారా?

ఆకాశంలో వున్న సమీప శకలాలు(మీటరాయిట్స్, అస్టరాయిడ్స్) తోకచుక్కల ప్రభావం జ్యోతిష్యం పరిగణలోకి తీసుకోదా? ఎందుకని?

నక్షత్రాలు పుడతాయి. గిడతాయి. అటువంటప్పుడు నక్షత్రాల ప్రభావాన్ని గురించి,జ్యోతిష్యం ఏమంటుంది? జ్యోతిష్యం నమ్మకస్తులకు యీ విషయాలను వివరించాలి. వెంటనే నమ్మకాలు వదలుకోరు. జ్యోతిష్యం గిట్టుబాటైన వ్యాపారంగా మార్చేశారు గనుక అది నిలదొక్కుకోడానికే ప్రయత్నిస్తుంది. అందుకే కమబద్ధమైన ఎదుర్కోలు సాగాలి.

అతీంద్రియ శక్తులు(పేరాసైకాలజీ)

దూరాన వున్న మనిషి మనస్సులో వున్న ఆలోచన చెప్పగలగడం టెలిపతి అంటున్నారు. అలా చెప్పిన వ్యక్తికి, అవతల వ్యక్తికి మధ్య ఏ సంబంధమూ వుండదు.

దూరాన వున్న వస్తువుల్ని కంటిచూపుతో,మనోశక్తితో కదలించడం,ప్రభావం చూపడాన్ని సైకో కెనిసిస్ అంటున్నారు.

మామూలుగా తెలిసిన ఇంద్రియశక్తులకు మించిన శక్తులు వున్న వ్యక్తిని మహాత్ముడని, బాబా అని, చెబుతున్నారు.

వీటన్నిటినీ పరిశీలించడానికి 19వ శతాబ్దంలో మొదలు పెట్టి నేటి వరకూ చాలా శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఇంగ్లండ్ లో యూరోప్ దేశాలలో, అమెరికాలో యీ శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా యింతవరకూ ఎక్కడా పేరాసైకాలజీ, అతీంద్రియశక్తులు శాస్త్రీయంగా రుజువు కాలేదు.

అమెరికాలో జె.బి.రైన్ మొదటి డ్యూక్ యూనివర్శిటీలో పేరాసైకాలజీ శాఖను ఆరంభించి పరిశోధించారు. చివరకు తేలిందేమంటే, రైన్ చిత్తశుద్ధితో చేసినా ఆయన వద్ద పనిచేసినవారు మోసగించారు. శాస్త్రీయ పరిశోధనలనే పేరిట దొంగ లెక్కలు చూపి రుజువు అయినట్లు ప్రకటించారు. తీరా వాటిని శాస్త్రీయంగా పరిశోధిస్తే ఫలితాలు రాలేదు. రైన్ దంపతులు తమ తప్పును ఒప్పుకున్నారు. డ్యూక్ యూనివర్శిటీలో పేరాసైకాలజీ శాఖను ఎత్తివేశారు. కాని చాలా చోట్ల యీ అతీంద్రియ శక్తుల దుకాణాలు వెలశాయి.

ఇంగ్లండ్ లో ఆర్థర్ కోస్లర్ యీ అతీంద్రియ శక్తులపై తెగరాసి, నిధులు సమకూర్చి, పరిశోధనలు చేయించాడు. అయినా రుజువుకాలేదు. ఎప్పటికప్పుడు పరువు నిలబెట్టుకోడానికి పేరాసైకాలజీ వారు తిప్పలు బడుతూనే వున్నారు. పేకముక్కల ప్రయోగం గణాంక పరిశీలనలు, గోడ అవతల మనిషిని పెట్టి అతడి ఆలోచనలు చెప్పాలనే పరిశోధన, యిలా రకరకాలుగా చేసి, బోర్లాపడ్డారు. ఆశ వదులుకోలేక యింకా పేరాసైకాలజీని రుజువు చేద్దామనుకుంటున్నారు.

సైంటిఫిక్ గా చూస్తే దూరాన వున్న వ్యక్తి మనస్సులో ఏముందో తెలుసుకోడానికి, అవతలవ్యక్తి మెదడునుండి వచ్చే ఆలోచనలు పట్టుకోవాలి. మెదడులోని కోట్లాది న్యూరాన్ లు ఆలోచన, ఆవేదన, నిర్ణయాలు తీసుకునే పనిచెస్తుంటాయి. న్యూరాన్లు ఏగ్జాన్లతో కలుస్తాయి. అంటే సంకేతాలు పంపిస్తాయి. అలా పంపించే తీరును విద్యుత్ చర్యగా పేర్కొంటారు. మెదడు విద్యుత్ రసాయనిక చర్య ద్వారా పనిచేస్తుంది. అవతల వ్యక్తి మెదడులో యివన్నీ పనిచేసే తీరు ఏదో ఒక విధంగా పొక్కితే గాని, టెలిపతి సాద్యంకాదు. అదెలా సాధ్యమో ఇంతవరకూ పరిశోధనలో టెలిపతివారు చెప్పలేకపోయారు. ఎలాగో పట్టుకున్నారనుకుందాం. అవతలవ్యక్తి మెదడులో వచ్చే ఇంపల్స్ లను టెలిపతి ఎలా విప్పి చెబుతుంది. దీన్ని డికోడింగ్ అంటారు. అదెలా సాధ్యమో చెప్పలేకపోయారు.

సిట్రాన్ అనే కణాలను మెదడు విడుదల చెస్తుందని వాటిని అధ్యయనం చేసి టెలిపతి పనిచేస్తుందని బుకాయించారు. కాని సిట్రాన్ వునికి యింతవరకు తేలలేదు!

టెలిపతిలో ఏ మాత్రం వాస్తవం వున్నా లాటరీ టిక్కెట్ల నంబరు చెప్పి గెలవడం సాధ్యమెగదా. అదెందుకు చేయలేకపోయారు? గుర్రపు పందాలలో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు టెలిపతి సమాధానం చెప్పదు.

దూరాన్నుండే వస్తువులు కదలించే ప్రయోగాలు యూరిగెల్లర్ చేయగా,అందులో మోసాన్ని,బూటకాన్ని జేమ్స్ రాండి బయటపెట్టారు. ఇందులోనే చూపుతోనే స్పూన్ లు వంచడం కూడ వుంది.

దూరాన్నుండి ఒక వస్తువూ చూపుతోనే కదలించాలంటే ఎంత శక్తి వినియోగించాలి అనే పరిశోధనలు చేశారు. అలాంటి పని మానవుడి మెదడు ఉత్పత్తి చేయాల్సిన శక్తి ప్రమాదకర ఓల్టేజితో వుంటుంది. అది కూడా సాధ్యం కాదని రుజువైంది. బల్లమీద ఒక గ్లాసును చూపుతో కదలించాలంటే 100 మిల్లిఓల్ట్స్ శక్తి మెదడులో ఉత్పత్తి కావాలి. 0.25 ఏంస్ అదనపు ఎనర్జీ ఇందులో సగం గుండెలో ప్రసరిస్తే మనిషి చచ్చిపోతాడు! కొందరు రేడియో సంకేతాల సామ్యం తెచ్చారు. రేడియో సిగ్నల్స్ సమాచారాన్ని యిస్తాయే గాని వస్తువుల్ని కదలించవు. చంచాలను వంచవు. విద్యుదయస్కాంతం ద్వారా సైకొకెనిసిస్ పనిచేస్తుందనడానికే రుజువులు దొరకలేదు. ఇంతవరకూ సైన్స్ కు తెలిసిన శక్తుల వలన టెలిపతి టెలికెనెసిస్ పనిచేయడం సాధ్యం కాదు. ఇక మిగిలింది మూఢనమ్మకమే. అదే కొందరిని నడిపిస్తున్నది.

కొందరు శాస్త్రజ్ఞులు చిత్తశుద్ధితో అతీంద్రియ శక్తుల విషయంలో కృషి చేశారు. అందులో ష్మిట్, జాన్, జె.బి.రైన్ పేర్కొనదగినవారు.

- హేతువాది, జూన్ 2001