Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/ఇద్దరు నరేంద్రనాధ్‌లు

వికీసోర్స్ నుండి
ఇద్దరు నరేంద్రనాధ్‌లు

ఇద్దరూ నరేంద్రనాధ్ లే. ఇరువురూ బెంగాలీయులే. ఉభయులూ అవివాహితులే. ఆ యిద్దరూ ఉగ్రజాతీయవాదులే.

ఒక నరేంద్రనాధ్ 19వ శతాబ్దం చివరలో, మరో నరేంద్రనాధ్ 20వ శతాబ్దం ఆరంభంలో అమెరికాలో అడుగుపెట్టారు.

సందేహవాదిగా, విద్యార్థిదశలో, పేదరికం భరించలేని స్థితిలో, రామకృష్ణ పరమహంస దగ్గరకు నరేంద్రనాధ్ వెళ్ళారు. దేవుణ్ణి చూపిస్తానని అభయం ఇచ్చేసరికి సాష్టాంగపడిపోయాడు. ఆశ్రమవాసి అయ్యాడు. రామకృష్ణ శిష్యుడయ్యాడు. సన్యాసిగా మారాడు. ప్రచారకుడుగా పరిణమించాడు. సంప్రదాయానుసారం పేరు మార్చుకున్నాడు. నరేంద్రనాధ్ కాస్తా వివేకానంద అయ్యాడు. ఆ పేరుతోనే అమెరికాలోని చికాగో మతసమావేశంలో మాట్లాడాడు. హిందూమత ప్రచారం చేశాడు. అందులోనూ వేదాంత ప్రసారం గావించాడు. దేశంలో జాతీయవాదులకు మత ఉద్వేగాన్ని అందించాడు. అంతవరకూ బ్రహ్మసమాజం తలపెట్టి, పరిమితంగా ఆచరిస్తూ వచ్చిన పునర్వికాసాన్ని వివేకానంద వచ్చి అడ్డుకున్నాడు. జమిందార్ల సహాయ సహకారాలతో మతపునరుద్ధరణకు పూనుకున్నాడు. అమెరికాలో, ఇండియాలో అదే చేశాడు. ఇండియా ఆధునిక యుగంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు. మాటల గాంభీర్యతకు, ఉద్వేగప్రసంగాలకు ముగ్దులయ్యే జనానికి వివేకానంద వాగ్ధోరణి, ప్రసంగ పాఠాలు హత్తుకపోయాయి. ఆలోచించకుండా ఆమోదించేవారికి వివేకానంద బాగా గురి కుదిరాడు. రామకృష్ణను ఆయన గుడ్డిగా అనుసరిస్తే, జనం వివేకానందను ఆమోదించారన్న మాట.

మరొక నరేంద్రనాధ్ మత ఉద్రేకంతో ఆరంభించి, బ్రిటిష్ వారిని అదర్గొట్టి తరిమేయాలని, అందుకు జర్మనీ ఆయుధాలు సేకరించాలని ప్రయత్నించాడు. బ్రిటన్ కు జర్మనీ శత్రువు గనుక, శత్రువుకు శత్రువు మన మిత్రుడు అనే సూత్రాన్ని అనుసరించాడు. (ఉత్తరోత్తరా సుభాష్ చంద్రబోసు యిదే బాటలో నడిచాడు) ఆ వేటలో అమెరికా పశ్చిమతీరం చేరుకున్న నరేంద్రనాధ్ అచిరకాలంలోనే ఎవిలిన్ తో పరిచయంకాగా ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. న్యూయార్క్ లో అభ్యుదయవాదుల సాంగత్యం, లైబ్రరీలో మార్కిస్టు సాహిత్యం పరిచయమైంది. జాతీయవాదం సడలడం ఆరంభమైంది. పూర్తిగా పోవడానికి కొంతకాలం పట్టింది. అమెరికాలోనే నరేంద్రనాధ్ పేరు మానవేంద్రనాధ్ గా మారింది.

మానవులంతా సమానం అని మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా అమలు పరచాలన్నప్పుడు, సంకుచిత జాతీయవాదం ఎలా పనికొస్తుంది? మన మతం మంచిదని వివేకానంద, హిందూమతాన్ని గురించి ప్రచారంచేస్తే అందులో విశ్వజనీనత ఎంతవరకు వుంది? అని ఆలోచించాలి.

జాతీయవాదాన్ని, తరువాత మార్క్సిజాన్ని కాదని, శాస్త్రీయపంధాలో మానవవాదాన్ని అవలంబించిన ఎం.ఎన్.రాయ్ చాలామందికి రుచించకపోవచ్చు. అతడి సిద్ధాంతాలు జీర్ణం కావడానికి కాలం పట్టొచ్చు. భారతదేశం వివేకానందను తృణీకరించి, ఎం.ఎన్.రాయ్ ను అనుసరిస్తే, మిగిలిన ప్రపంచంతో పాటు ముందంజ వేసేదే. ఇప్పుడు ఆ ప్రయత్నమే జరగాలి.

- హేతువాది, మార్చి 1992