అబద్ధాల వేట - నిజాల బాట/ఆవుల గోపాల కృష్ణమూర్తి (స్కెచ్)

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఆవుల గోపాల కృష్ణమూర్తి
(స్కెచ్)

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో కనిష్టుడుగా ఏప్రియల్ 29-1917లో జననం. ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం తురుమెళ్ళలో. ఆనాడే విద్యార్థులలో వేరుగా మసిలాడు. ప్రైవేటుగా తెలుగు చదువుకున్నాడు. అప్పుడే 'కృష్ణశతకం' వ్రాసాడని వినికిడి. కళాశాల విద్యాభ్యాసానికి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పటినుండి ప్రతిభావ్యుత్పత్తులు విప్పార నారంభించినవి. స్వగ్రామంలో జి.బి.యస్. సరస్వతీ స్వాములవారితో తాత్త్విక చర్చ ఫలితంగా కలానికి పదునెక్కింది. సెలవుల్లో యింటికి వచ్చి, పురాణ శాస్త్రులకు పోటీగా తానూ మహాభారత ఘట్టాలను పురాణంగా చెప్పాడు. అది విని బ్రహ్మానందభరితులైన తల్లి దిష్టి తీసెయ్యటం యేమంత విశేషంకాదేమో.

గుంటూరు కళాశాలా జీవితంలో భవిష్యత్తుకు పునాదు లేర్పడ్డయ్. ఇంగర్ సాల్, త్రిపురనేని రామస్వామి రచనలు ఛాందస భావాల్ని ఛేదించటానికి వుపకరించగా, ఆ ప్రోత్సాహం మున్ముందుకు నడిపించింది. పట్టణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడటం అందులో భాగమే. అప్పుడే కర్ణాకర్ణిగా ఎం.ఎన్.రాయ్ ని గురించి విని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలోవుండగా, ఒకానొక కమ్యూనిస్టు రాయ్ ని దూషిస్తుంటే, సాచి చెంపపెట్టు పెట్టిన ఉద్రేకి గొపాలకృష్ణమూర్తి. ఆప్తమిత్రుడు ఎలవర్తి రోసయ్య చాదస్తాన్ని వదలించ దీక్షబూని, త్రిపురనేని రామస్వామి పద్యాలు వినిపించి, విప్లవబీజాలు నాటి ఒకనాటి రాత్రి పిలక కత్తిరించిన చిలిపి గోపాల కృష్ణమూర్తి. యధార్థ సాహిత్య సమితి స్థాపించి గ్రాంధిక వాదానికి మద్దత్తుగా రచనలు సాగించాడు. ఆ తర్వాత, సిద్ధాంతంలో వ్యతిరేక సిద్ధాంతం పుట్టినట్లు, పచ్చి వాడుకభాషా వాదిగా, తన పేరును 'క్రుష్నమూర్తి' అని వ్రాసుకున్నాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, 'ఇండిపెండెంట్ ఇండియా' దినపత్రిక తెప్పించి, గుంటూరులో అమ్మిన ఘట్టాలు కేవలం తలపులుగా నిలిచిపోయినయ్. లక్నోలో ఎం.ఏ., ఎల్.ఎల్.బి., చదువుతుండగా రాయ్, బోస్ ప్రభృతులతో పరిచయమైంది. ఆవుల దృష్టిలో బోస్ 'సోషల్ ఫాసిస్టు' కాగా, రాయ్ తాత్త్విక విప్లవమూర్తిగా సన్నిహితత్వం వల్ల గ్రహించగలిగాడు. నేషనల్ హెరాల్డ్ లో వ్యాసాలు వ్రాయటంతో పత్రికా రచనలోకి దిగాడు. అప్పటి గోపాలకృష్ణమూర్తి తేడాగల రాయిస్టు. చివరివరకూ అలాగే వున్నాడు. తేడా గల రాయిస్టుగా వుండగలగటమే ఆయన వ్యక్తిత్వ విశిష్టత.

విద్యాభ్యాసానంతరం కొద్దిమాసాలు మాత్రం మద్రాసులో, తర్వాత గుంటూరులో న్యాయవాదవృత్తి అభ్యసిస్తూ, చివరకు తెనాలిలో స్థిరపడ్డాడు. ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా సన్నిహితులనుండిగూడా ఫిర్యాదులు తెచ్చుకొని, విచారణకు ధైర్యంగా నిలబడి, వ్యక్తి స్వేచ్ఛను నిలబెట్టుకున్నాడు. ఆనాటి గోపాల కృష్ణమూర్తి ఉద్రేకి, వుద్వేగి. తీవ్రంగా వ్రాసేవాడు. కరకుగా ఉండేవి. గాంధీని గురించి వ్రాస్తే, ఆప్తమిత్రులే సహించలేకపోయారు. 1942లో రాడికల్ పత్రిక స్థాపించి, పార్టీ పత్రికగా నడిపారు. సమకాలీన సిద్ధాంతాల్ని వెంటనే అర్థం చేసుకుని, అన్వయీకరణ గావించి, తెలుగులో విడమరచి చెప్పగలగటం గోపాల కృష్ణమూర్తికి అబ్బిన విద్య. అందుకే ఆంధ్రలో ఎం.ఎన్.రాయ్ కు భాష్యకారుడు కాగలిగాడు. బహుశ అధ్యయన శిబిరాల్లో 'పీఠాధిపతి'గా యితరులు ముద్రవేయటానికి కూడా యిదే కారణమనుకోవచ్చు. త్రిపురనేని రామస్వామిచేత రాయ్ గ్రంథాలు చదివించి, మెప్పించాడు. ఆంధ్ర నుండి వచ్చిన ఫిర్యాదుల నాధారంగా రాయ్ ఎడముఖంగా వుంటే, తానూ పెడముఖం పెట్టి, చివరకు రాయ్ రాజీకి వచ్చేట్లు ప్రవర్తించిన పట్టుదల; కొరియా యుద్ధం వంటి సమస్యలలో 'నీకింకా కమ్యూనిస్టు మనస్తత్వం వదలలేదని' రాయ్ ని ముఖాన కొట్టినట్లు అనగల సాహసోపేత భావుకుడు మూర్తి. అందుకే తేడాగల రాయిస్టు. రాయ్ పార్టీని రద్దుచెయ్యాలనే తీర్మానాన్ని బలపరచి భావగమన వేగాన్నందుకున్న ఆలోచనాపరుడు. క్రమేణా పలుకులో పరుషం సడలించి, మాధుర్యం పెంచి, వ్రాతలలో 'పోలీసు దెబ్బల' తీరును సాగించాడు. వివిధ రంగాలలో పునర్వికాసోద్యమాన్ని నడిపే యత్నంలో నిర్విరామ కృషి చేసి, అనారోగ్యానికి పునాదులు వేసుకున్నాడు. అవసరమొచ్చినప్పుడు జారుకునే మిత్రులనబడే వారిమధ్య, ఆషాడభూతులుచుట్టూ క్రమ్మిన వాతావరణాన్ని నిబ్బరంగా ఆకళింపుజేసుకొని, ఎన్నో మానసిక వైవిధ్యాల నెదుర్కొంటూ,గజ గమనం సాగించాడు. 1954లో తెనాలి పురపాలక సంఘాధ్యక్షుడుగా కొద్దికాలంపాటు నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం ఆచరించ ప్రయత్నించి,కొంత సఫలత కొంత విఫలత పొందాడు. మానసికంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ, తామర తంపరగా మాజీ మిత్రులను తయారుచేసాడు. ఆయన 'చుట్టూ ప్రపంచంలో' పత్రికా విలేఖరులు, కళాకారులు, కవులు, స్వాములు,పురపాలకులు, రాజకీయపు మనుషులు, హ్యూమనిస్టులు, అన్యులు వుండేవారు.

పదవులు లేనివారికి, 'నష్టజాతకులకు', సన్మానాలు చేయించాడు. స్వేచ్ఛ దెబ్బతినే ఏ విధాన్నైనా ధైర్యంగా ఎదిరించాడు. 'మూడక్షరాల', 'ఐదవ తరగతి' పండితుల మొదలు, 'బ్రహ్మీమయమూర్తుల' వరకూ అన్ని రంగాలలో భిన్నస్థాయీ భేదాలతో, ఆదరించటమో ఎదిరించటమో చేయగలిగాడు. ఎంతటి ఆప్తులైనా తప్పుదారిన పడితే, 'తప్పు' అని హెచ్చరించగలిగాడు. పదుగురాడు మాటే చెల్లాలి అంటే, అది హేతుబద్ధం కాకుంటే, అలాగని చెప్పి, ప్రవాహానికి అడ్డంగా, ఎదురుగా ఈదాడు. ఆయన ఠాగూర్ విమర్శిస్తూ వ్యాసం వ్రాస్తే, 'రాడికల్ హ్యూమనిస్ట్' (ఆంగ్ల వారపత్రిక) ప్రచురించలేకపోయింది. రాడికల్ హ్యూమనిజం కూడా అనార్కిజానికి దారి తీస్తుందంటే ఆశ్చర్యపోయారు అనుచరులు. కాశ్మీర్ సమస్యపై వ్యాసాలు వ్రాస్తుంటే, అరెస్ట్ చెస్తారేమోనని మిత్రులు భయపడకపోలేదు. సంస్కృతానికి తెలుగే మాతృక అంటే ఆశ్చర్యంతో నోర్లు నొక్కుకున్నారు.

అసలు ఆవుల గోపాలకృష్ణమూర్తిలో లోపాలే లేవా? అన్నీ అత్యుత్తమ లక్షణాలేనా? అంంటే అదేమికాదు. కాని లోపాల నుండి నేర్చుకునేదేమున్నది, లోపాలు తప్ప!

తారీఖులతో నిమిత్తంలేని జీవితం గడపి, ఒకరు అనుసరించ వీల్లేని పంథాలలో గమించి, విశేషణాలలో యిమడని రీతిగా ఎన్నో పనులు చేసాడు.

వ్యాసాలు-ఉపన్యాసాలు, పౌరోహిత్యం, ప్రెస్ క్లబ్, బాలకళామందిర్, లయన్స్ క్లబ్, పంతుళ్ళ సమావేశాలు; సన్మానాలు కవులకు, కళాకారులకు; స్టడీకాంపులు, రాడికల్ హ్యూమనిస్ట్ లకు; అన్నిటా 'గాత్రం' పాడి, 'వైశేషికత్వాన్ని' నిలబెట్టుకున్నాడు. అనేక యుద్దముల ఆరితేరిన జ్ఞానవృద్ధుడయ్యాడు. అఖిల భారత సమావేశాల్లో, అమెరికా, ఐరోపాలలో విశిష్టుడుగానే చలామణి అయ్యాడు. ఇంట్లో పిల్లలమధ్య హాయిగా కాలక్షేపం చేసాడు. వాళ్లు పూజలు, పునస్కారాలు చేస్తుంటే - మతస్వేచ్ఛ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వ్యక్తిగనుక - నిరోధించనూలేదు, ప్రోత్సహించనూ లేదు. తన భావాలు చెప్పేవాడు. వాటి ప్రభావం తక్షణమే చూడాలన్నంత రాజకీయవాది కాదు.

ఆంధ్రలో పునర్వికాసోద్యమం వ్రాస్తూ, అందులో ఆయన పాత్ర వ్రాస్తే, కొంత స్వీయం కలసొస్తుందని, చనువుతో నేనంటే 'పార్కలాం' అన్నాడేగాని, దానికి నాంది పలకలేదు. అన్యులు ఆ కృషి చేసేదెప్పుడోమరి!

- హ్యూమనిజం,అక్టోబరు 1966