Jump to content

అన్నమాచార్య చరిత్రము/రాయల పశ్చాత్తాపము

వికీసోర్స్ నుండి

బరికించి భూపతి భయమంది యతని -
చరణాబ్జములఁ జక్క సాఁగిలి మ్రొక్కి

కన్నీరు గదుర గద్గదకంఠుఁడగుచు
పన్నిన దైన్య మేర్పడఁగ నిట్లనియె;-

నపరాధి నపరాధి నన్నమాచార్య !
కృపఁజూడు నను నీవు కృపణశరణ్య !

యెఱుఁగని పసిబిడ్డఁ డేమైనఁ జేయ-
నరుదైన తల్లికి నలుగంగఁదగునె ?

నను నీవు పిన్నటనాఁటనుండియును
బనుపడ బంటుగాఁ బనిగొంటి గనుక

మందెమేళమున నీ మహిమఁ జింతింప-
కిందఱవలె నేన యిట్టు చేసితిని -

వేంకటపతివి నీవే మాకు మనసు-
శంక లింకించి ప్రసన్నుండ వగుము

నీ వలిగిన నల్గు నీలవర్ణుండు
నీవు మెచ్చిన మెచ్చు నీరజోదరుఁడు-

నాయర్థ మంతయు నన్నమాచార్య
నీయందె కంటిమి నిక్కంబు గాఁగ ;

నని పట్టమహిషితో నతనిఁ గీర్తించి
పనిఁబూని పన్నీటఁ బాదముల్ కడిగి

బంగారు విరులజొంపములఁ బూజించి
పొంగారు వేడుక భూషణావళులఁ

జిత్రాంబరంబులఁ జిత్రవస్తువులఁ
జిత్రంబుగాఁగ భూషించి తోషించి

తనకుఁగా మును పాయితంబైన పసిఁడి-
యనుసుల చతురంతయాన మెక్కించి

భజియించి తనమూఁపు పల్లకికొమ్ము
నిజభుజంబున నిడి నెమ్మి గావింప ,-