Jump to content

అన్నమాచార్య చరిత్రము/అన్నమయ పెండ్లి

వికీసోర్స్ నుండి

నెలజవ్వనము మేన నిగురొత్తు కొడుకుఁ
దలిదంఢ్రు లరసి యాతనిఁ దోడుకొనుచు

కులములవారిండ్లకును బోయి సుతున-
కెలమి మీ పడుచుల నీవలె నన్న-

నేవేళఁ జూచిన నితఁడు శ్రీరామ
గోవింద హరి యనుకొనుచుండుఁ గాని

యలవోక సంసార మది యిచ్చఁ దనకు
వలెననఁ డది యెటువంటి గొంటైన

నాచారముల దాసరయ్యను జూచి
చూచి యేగతిఁ బడుచుల నిచ్చు ననిన

వారల కలలోన వారిజోదరుఁడు
దారియు మొనఁ జూపి తనదు భక్తునకు-

నన్నయార్యునకుఁ గన్యకల నిమ్మనిన-
నన్నన్న యని వారు నరుదందికొనుచు

తిరుమలమ్మను నొక్కతిరువాలుఁగంటి-
నరుదైన యక్కలమ్మను నొక్కకన్య

బంగారు ప్రతిమల భావంబుఁ జూప
సింగార మెఱపుగాఁజేసి మోదమునఁ

గ్రన్నన నాగమోక్తప్రకారమునఁ
జెన్నుగాఁ బెండ్లిడ్లు చేసిరంతటను;

పరమేశుఁడగు నహోబిలనృసింహుండు
గురుభావమునఁ జేరుకొని త్రిదండంబు-

నా నరసింహు చక్రాదిమంత్రములు
తానె ప్రత్యక్షంబు దయ సేయఁ గొనుచు,

హరి హయగ్రీవుఁ బ్రత్యక్షంబుఁ జేసి
ధర సర్వతంత్ర స్వతంత్రుఁడైనట్టి-

వేదాంతదేశికు వేంకటాచార్యు-
నా దివ్యసంప్రదాయమున వర్తించు-

శఠకోపమునివద్ద సకల వేదాంత-
పఠనంబుఁ జేసి యభంగవిస్ఫూర్తి

హరిపూజ హరిసేవ హరికీర్తనంబు
హరిమననము ధ్యాన మనిశంబుఁ దనకు

ఘనతర సకలభోగంబులుగాఁగ
మనుచు వాల్మీకిరామాయణ మెల్ల

రాగంబుతో ననురాగంబుతోడ
బాగుగా గంధర్వుబాగుగాఁ జదివి

పాటలన్నియుఁ దన పాటపిమ్మటన
పాటపాటనె పాటపాడి చూపఁగను

విన్నవారెల్ల నువ్విళ్ళూరి యొక్క(చొక్క?)
ప్రన్నవీనులు నిండుపండువుల్ సేయ

తుంబురుఁడో నారదుఁడొ కాక యీ వి-
ధంబున దిరుగు గంధర్వుఁడో కాక

మనుజుఁడో యీ యన్నమయ యని సర్వ
జనులును గొనియాడి సంతసింపఁగను-