అనుభవసారము/అనుభవసారము

వికీసోర్స్ నుండి

శ్రీ

అనుభవసారము

ఉ.

శ్రీగురులింగజంగమవిశిష్ట[1]విభేదసదన్వయంబులన్
శ్రీగురులింగజంగమముఁ జెప్పఁ ద్రిమూర్తి [2]నిరూఢమై చనున్
శ్రీగురులింగజంగమవిశేషము లేకముగాఁ దలంచి యా
శ్రీగురులింగజంగమవశీ[3]కృత మౌమదిఁ గొల్చి సమ్మతిన్.

1


క.

పరమపరుం బరమేశ్వరుఁ
బరమానందస్వభావు భక్తి నుతింతున్
గురులింగము హరలింగముఁ
జరలింగము శాంత్యతీతు శంభున్ శరణున్.

2


క.

భవనాశుఁ బాపనాశను
వివిధేంద్రియవిషయనాశు వినుతింతు సదా
శివు శివదేవు శివాత్మకుఁ
బ్రవిమలవిజ్ఞాను భర్గు భక్తనిధానున్.

3


క.

పశుపాశవినిర్ముక్తునిఁ
బశుపాశపతిన్ భజింతుఁ బశుపాశవిసృ
ష్టశరీరు విముక్తి[4]ప్రద
కుశలున్ విశ్వేశు విమలు గురు హరు శరణున్.

4

క.

గురులింగం బుత్పత్తికి
హరలింగము నిత్యసత్క్రియాస్థితికినిఁ ద
చ్చరలింగము మాయాసం
హరణమునకు నాదికర్త లని తలఁచి మదిన్.

5


క.

భంగిగఁ బూజాక్రియలకు
లింగత్రయ మనఁగఁ బరఁగు లెక్కింపఁగ నే
కాంగం బై చను శ్రీగురు
లింగం బని త్రివిధలింగలీనాత్ముఁడ నై.

6


సీ.

శ్రుతి “ఏక ఏవ రుద్రో న ద్వితీయాయ
                    తస్థే” యనుట యథార్థంబు దలఁప
నవల “నణోరణీయా న్మహతో మహీ
                    యా” నన నదియె యనూనపదము
[5]పంబి “యవాగ్గోచరం” బను "[6]నప్రాప్య
                    మనసా సహా” యనుమాట నిజము
ఏదియుఁ గా దనియెడిపరమేశుఁడే
                    యెంతయు నని యెర్గి యెఱుఁగ ననక


ఆ.

ఎట్టు లనుచు సంశయింపక శివతత్త్వ
సారగద్యపద్యసమితి శివుని
మహిమఁ దెల్పినట్టిమల్లికార్జునపండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

7


సీ.

వేదముల్ ధర “సర్వవేదేష్వతో భవ"
                    తనఁగఁ బరఁగులింగ మతిశయిల్లు

నెఱి "శ్వపచో౽పి మునిశ్రేష్ఠ య స్తు లిం
                    గార్చనే రత" యన నట్లు నమ్మి
ప్రీతి “స రుద్రైవ భూతలే” యని “తత్ర
                    సన్నిహిత శ్శివ" యన్నయదియుఁ
దగ "స చ పూజ్యో యథాహ్యహ” మ్మనఁగను
                    నేత్రాంగకక్రియాపాత్ర మగుచు


ఆ.

జంగమంబుఁ గాంచి [7]చరలింగపరవశ
భాతి నుభయలింగభక్తియుక్తి
మహిమఁ దనరినట్టి మల్లికార్జున పండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

8


సీ.

ఆది “రుద్రేణాత్త మశ్నంతి రుద్రేణ
                    పీతం పిబంతి” ప్రఖ్యాతిశ్రుతుల
నన్నిగమాంతర 'మతికిల్బిషం స్యా ద
                    నర్పితం' బనెడుసిద్ధాంతములను
నవికలసిద్ధాంతనివహోక్తి "లోభా న్న
                    ధారయే” త్తనుశివధర్మములను
శివధర్మశాస్త్రదృష్టిఁ "బ్రసాద మేవ భో
                    క్తవ్య" మనుపురాణకాండములను


ఆ.

సిద్ధ మనుచు వేదసిద్ధాంతశాస్త్రపు
రాణతతుల మలహరప్రసాద
మహిమఁ దెలిపినట్టి మల్లికార్జున పండి
తయ్యగారిఁ దలఁతు ననుదినంబు.

9

క.

ప్రాక్తనభక్తానీకము
వ్యక్తిగ మత్ప్రాణలింగమంద నియుక్తా
సక్తమతిఁ దలఁచి నూతన
భక్తులఁ బ్రణుతించి తత్కృపాకలితుఁడ నై.

10


క.

నిరవధిగణ్యుఁడు ధన్యుం
డరిషడ్వర్గాపహారుఁ డఘదూరుఁడు సు
స్థిరచారిత్రుఁడు పాత్రుఁడు
పురహరువరమూర్తి చిత్ప్రపూర్తి [8]తలంపన్.

11


క.

త్రిభువనవంద్యుఁ డనింద్యుఁడు
నభవధ్యానప్రవీణుఁ డసమానుఁడు భ
క్తభయాపహరుఁడు ధీరుం
డభిమతశీలుండు వరదయాళుఁడు పేర్మిన్.

12


క.

మంగళభక్తిసమేతుఁడు
జంగమసన్మానదానచర్యోపేతుం
డంగవికారాతీతుఁడు
సంగతభక్తైకదేహజాతుఁడు పేర్మిన్.

13


క.

మనసిజహరవ్రతశీలుఁడు
ఘనతర[9] నాదప్రవీణగానవిలోలుం
డనుపమకీర్తివిశాలుఁడు
జననుతుఁడు గతప్రపంచజాలుం డరయన్.

14


క.

శివయోగానందసుధా
ర్ణవ[10]విహరణ నిరతిశయనిరంతరసౌఖ్యో

త్సవలీలాపరతంత్రుఁడు
శివ[11]చరణస్మరణవిమలచేతస్కుండున్.

15


క.

అన్నీలకంఠరూపిత
సన్నుతగురుసిద్ధలింగసారదయాసం
పన్నకరాబ్జోదయుఁ డన
మున్నయదేవుండు వెలయు ముల్లోకములన్.

16


క.

ఆమున్నేశ్వరగురుది
వ్యామృతహస్తావతంసుఁ డతికారుణ్యో
ద్దామతనూజుఁడు [12]శిష్టుఁడు
శ్రీమద్గురుసత్పదాబ్జసేవారతుఁ డై.

17


క.

గోడగ మగుసంసారము
గోడగ మని తెలుపఁ బూని గోపతియెదురన్
గోడగ మాడెడికతమున
గోడగినారయ్య నాఁగఁ గొఱలు ధరిత్రిన్.

18


క.

పరవనితాజనదూరుఁడు
పరమర్మపరాపకారపరనిందాని
ష్ఠురచిత్తుఁ డసత్యవచో
విరహితచరితుండు తత్త్వవేత్త తలంపన్.

19


క.

ఆనారనాఖ్యునకు లిం
గానర్పితభోగవిరహితాత్మునకుఁ బ్రసా
దానూననిత్యసౌఖ్య
శ్రీనిధికి మహానుభవవశీకృతమతికిన్.

20

క.

అగ్రతనూజుఁడు సద్భ
క్తగ్రాహకచెన్ననీలకంఠపదాంభో
జగ్రహణాంతఃకరణస
మగ్రసుఖామృతపయోధిమగ్నుఁడు ప్రీతిన్.

21


క.

గురుభావోద్భవహృదయే
శ్వరసంజాతప్రసాద[13]సంభ్రమమథన
స్ఫురితానందసముద్భవ
పరవశమానసమహానుభావుఁడు భక్తిన్.

22


క.

ఏకసతీవ్రతచరితుం
డేకాగ్రమనఃప్రపూరితేంద్రియ[14]గుణలిం
గైకాత్మకప్రమథనసు
ఖైకాంతనితాంతపరవశాత్ముఁడు పేర్మిన్.

23


క.

గురులింగహస్తజాతుఁడు
గురులింగపదాబ్జభృంగగురుతరమతి స
ద్గురులింగప్రాణుఁడు శ్రీ
గురులింగాఖండ[15]భక్తికోవిదుఁ డెలమిన్.

24


క.

త్రిపురారిభక్తియుక్తుఁడు
త్రిపురారిమహిష్ఠనామధేయుఁడు సాక్షా
త్త్రిపురారిమూర్తి గోడగి
త్రిపురారి మదీయసత్కృతికి నొడయఁడు గాన్.

25


క.

గురులింగజంగమస్థల
శరణస్తోత్రప్రసాదసంవిత్పదమున్

గురుభక్తిపూర్వకంబుగ
విరచింతు మదీయభక్తి వినుతింపంగన్.

26


చ.

గురు నుతియింతు సంతతము ఘోరభవాంబుధితారణార్థి నై
హరుఁ బ్రణుతింతు లింగమథనార్థసముద్భవచిత్సుఖార్థి నై
శరణులఁ గీర్తి సేయుదుఁ బ్రసన్నకటాక్షనిరీక్షణార్థి నై
యిరవుగ నొండుభంగి నుతియింపమి నాకు నిజవ్రతంబుగన్.

27


క.

మదనారిభక్తమండలి
నుదరార్థము పొగడువాని యుక్తిఁ దలంపన్
సదమలరత్నవితానముఁ
బదడున్ సరిఁ బోల్చునట్టిపగిదియె కాదే.

28


క.

కావున భక్తానందము
వావిరి నీప్సితము గాఁగ వర్ణింతు లస
ద్భావనఁ గృతి సత్కావ్యక
ళావేదులు వొగడఁ గావ్యలసనము నెగడన్.

29


క.

అనుభవసారం బనఁగా
మనసిజహరుశుద్ధభక్తిమార్గము వేదో
క్తనిరూఢిఁ బురాణరహ
స్యనియుక్తిని [16]విస్తరింతు నది యెట్లనినన్.

30


క.

వారక వేదపురాణ
ప్రారంభార్థముల నెల్లఁ [17]ద్రచ్చఁగ 'హంస
క్షీరమివాంభసి' యనుగతి
సారమె కొని తెలుపువాఁడ సద్గురుకరుణన్.

31

క.

భృంగిరిటిగోత్రుఁడను గురు
లింగతనూజుండ శివకులీనుఁడ దుర్వ్యా
సంగవివర్జితచరితుఁడ
జంగమలింగప్రసాదసత్ప్రాణుండన్.

32

గురుమహత్త్వము

గీ.

విమలచిత్ప్రపూర్తి విశ్వేశువరమూర్తి
వినయవర్తి భువనవినుతకీర్తి
విభుకరస్థలంబు విశ్వేశుకారుణ్య
జనితవినుతకావ్యశక్తియుతుఁడ.

33


క.

అనయము పాలకుఱికిసో
మనాథుఁ డనఁ బరఁగువాఁడ మానవసంస
ర్గనివర్తకుఁడను గురుభ
క్తినిరూపితమానసుండఁ గృతకృత్యుండన్.

34


క.

చెప్పుదు సద్భక్తావళి
యెప్పుడుఁ గొనియాడుచుండ నిల నీకావ్యం
బొప్పు శివానుభవంబున
లెప్పం బై వెలయులింగలీలల నొలయన్.

35

గురుస్థలము

క.

అది యెట్లనినను భక్తికిఁ
గుదురు గదా గురుపదాబ్జగురుతరమహిమం
బది మున్ను విస్తరించెద
విదితము గురుభక్తిమహిమ విను త్రిపురారీ!

36

సీ.

అఖిలవేదాతీత మగుమూలమంత్రాక్ష
          రములకు నతనివాక్యములతేట
యయ్యక్షరాత్మకుం డగులింగమూర్తి కా
          తనిమనోభావంబు జనితభూమి
యాలింగమూర్తికి నాశ్రయం బైనశ
          రణుని కాతనికరాగ్రంబు తల్లి
యమ్మహాశరణున కాభరణం బైన
          భక్తి కాతనిపదాబ్జములె యూఁత


తే.

యట్టిభక్తి కాది యైనజీవన్ముక్తి
కతనిఘనదయామృతావలోక
నంబె పరమపదవి యమ్మహత్తరకీర్తి
నొప్పుగురునిమహిమఁ జెప్పఁ దరమె.

37


క.

జ్ఞానాతీతుని నతివా
ఙ్మానసగోచరుని గురునిమహిమ నుతింపం
గా నలవియే [18]మదీయ
జ్ఞానమనోద్గతము లైనశబ్దార్థములన్.

38


సీ.

అచ్యుతబ్రహ్మామరాగోచరుం డయ్యు
          వరశుద్ధభక్తైకవత్సలుండు
నన్నాదబిందుకళాతీతుఁ డయ్యు నా
          శ్రితశిష్యవర్గసంతతికుటుంబి
స్థిరసత్పరవ్యోమసింహాసనుం డయ్యు
          [19]సాధకాత్మాంభోజషట్పదుండు

పరమాణుతరమహత్తరమూర్తి యయ్యు స
          ల్లింగజంగమప్రాణలీయమూర్తి


ఆ.

యనఁగ వినఁగ నాది కాది యై సన్మతి
నెగడఁ బొగడ మహిమఁ దగిలి మిగిలి
యున్నయసదృశప్రసన్నైకసద్గురు
మూర్తిఁ గొలువ కెట్లు ముక్తి దొరకు?

39


క.

దుర్మలదుష్టపురాకృత
కర్మేంధననిచయదాహకౌశలనిచితాం
తర్మహితజ్ఞానానలు
నిర్మలగురుమూర్తిఁ గొలుతు నిరుపమభక్తిన్.

40


క.

గురుభక్తి దురితనాశని
గురుభక్తి యగణ్యపుణ్యగోచర మౌ న
గ్గురుభక్తి భక్తిబీజము
గురుభక్తియె సహజముక్తి గురుభక్తినిధీ!

41


క.

గురుభక్తి దళితసంసృతి
గురుభక్తి సమస్తరోగకులగిరిపని య
గ్గురుభక్తి భక్తిహేతువు
గురుభక్తియె సహజముక్తి గురుభక్తినిధీ!

42


క.

గురుభక్తి మలనివారిణి
గురుభక్తి విశుద్ధతత్త్వగుహ్యాంతర మ
గ్గురుభక్తి భక్తిదీపిక
గురుభక్తియె సహజముక్తి గురుభక్తినిధీ!.

43

క.

గురులింగైక్యవిభేదము
గురులింగాశ్రవణమతియు గురువంచనమున్
గురు [20]తత్త్వద్వైతంబును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

44


క.

గురుమంత్రాధః[21]కృతియును
గురునాజ్ఞోల్లంఘనంబు గురువిముఖతయున్
గురురంధ్రాన్వేషణమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

45


క.

గురుసద్గుణవంచనమును
గురువంశామాన్యతయును గురువిస్మృతియున్
గురుదుర్గుణప్రకటనమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

46


క.

గురుసన్నిధి గర్వించుట
గురుసన్నిధిఁ దన్నుఁ దాన కొనియాడుటయున్
గురుసన్నిధి శంకింపమి
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

47


క.

గురువాక్యోదాసీనత
గురుపాదధ్యానవిరతి గురు[22]హుంకృతియున్
గురుమార్గాతిక్రమమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

48


క.

గురుని సపంక్తిని గుడుచుట
గురుని [23]సమాసనమునందుఁ గూర్చుండుటయున్

గురుని సమశయ్య నొందుట
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!.

49


క.

గురుహస్తాగ్రతనూజుల
గురుపుత్త్రకళత్రమిత్రగోత్రాదులఁ ద
ద్గురురూపముగాఁ దలఁపమి
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!.

50


క.

ఓపి మనోవాక్కాయ
వ్యాపారములందు గురుదయాత్మకరసధా
రాపాత్రుఁడు గాఁడేనిన్
క్ష్మాపాత్రుఁడు భక్తుఁడే? కుమార్గవిదూరా!

51


క.

గతి మతియు దెసయు దిక్కును
బతియును దలి దండ్రి తోడు ప్రాణము నర్థ
ప్రతతియు బంధుఁడు విద్యో
న్నతియున్ సద్గురుఁడ కాఁడె నారయపుత్రా!

52


సీ.

గురుమూర్తి యనుకల్పతరు వొప్పుఁ దత్తరు
         మూలంబు కరుణావిలోలదృష్టి
యాద్యశాఖోన్నతి యాజ్ఞామహత్త్వ మ
         య్యుపశాఖ లాదితత్త్వోదితములు
పల్లవంబులు శ్రుతుల్ ప్రసవముల్ మంత్రముల్
        ఫలము లింగంబు తత్పరిమళంబు
జంగమబోధలసారంబు నిత్య[24]ప్ర
        సాదాదికనయనోత్సవము ముక్తి

ఆ.

యగుచు నాది కాది యగుచు నఖండితం
బగుచు సకలనిష్కళాంగ మగుచు
నభిమతార్థదాయి యగుచు శిష్యావళిం
దన్నుఁ జేర్చుకొనును దాత యగుచు.

53


క.

హేతువులు పాఱి దృష్టాం
తాతీతం బై పరాంత మగుచున్న పరం
జ్యోతి మఱి తానె యిల గురు
వై తనరుట శిష్యరక్షణార్థము గాదే?

54


క.

భక్తునకు గమ్యమాన మ
భక్తునకు నగమ్య[25]మానపద మగుటం బ్ర
వ్యక్తిగ గురురూపము భయ
[26]భక్తులకును బట్టు దానిఁ బట్టఁగఁ దరమే?

55


క.

భయ మది భక్తికి హేతువు
క్రియ గొన సద్భక్తి ముక్తికిని హేతువు ని
శ్చయముగ భక్తులకుం ద
ద్భయమె ప్రధానంబు భక్తి[27]పారీణతకున్.

56


క.

నియతియె భక్తికి జీవము
భయ మది మును ప్రాణపదము భావాదికశు
ద్ధియు చైతన్యము తగు స
త్క్రియశృంగారంబు భక్తికిం ద్రిపురారీ!

57


క.

శివభక్తులయెడ భయమును
శివునెడ నతివీరగుణము శీలంబులయం

దవికల్పం బగుచలమును
భవియెడ రోఁతయును వలయు భక్తుల కెందున్.

58


క.

కామంబు భక్తి రతియెడఁ
దా మఱి క్రోధంబు దేహధర్మములయెడన్
వ్యామోహము భక్తులయెడ
శ్రీమతిలోభంబు వలయు శివపూజయెడన్.

59


క.

మదమాత్సర్యంబులు మది
[28]వదలినకార్యములు గాఁగ వర్తించుచు నె
మ్మదిఁ జనునాతని జన్మం
బది సఫలము; కానినాఁడు నది శ్లాఘ్యంబే?

60

శివపూజావసరసావధానము లింగస్థలము

సీ.

లింగార్చనక్రియాసంగతి శృంగార
         రసమును నద్భుతరసముఁ దోఁప
ననయంబు జంగమార్చన సేయుచో శాంత
         రసము భయానకరసముఁ దోఁప
సంసారసంపదల్ చర్చించుచో హాస్య
        రసమును బీభత్సరసముఁ దోఁప
దుష్టేంద్రియంబులఁ దూలించుచో రౌద్ర
        రసమును నతివీరరసముఁ దోఁప


ఆ.

నెల్లజీవరాశియెడలను గారుణ్య
రసముఁ దోఁప భక్తి రమణఁ బరఁగు

నవరసైకరసికుఁ డవివేకదూరుండు
భక్తుఁ డొక్కరుండె ప్రస్తుతింప.

61


క.

కష్టభవ మొల్ల ననియెడి
శిష్టాచారంబుకలిమిఁ జెప్పఁగఁ దరమే?
దుష్టేంద్రియవిజయత్వం
బిష్టమతిం బడయలేనియెడఁ ద్రిపురారీ!

62


క.

ఇంద్రియపరవశుఁ డధముం
డింద్రియనిగ్రహఁడు భక్తియెడ మధ్యముఁ డౌ
నింద్రియజయుఁ డుత్తముఁడు శి
వేంద్రియసంధాయకుఁడు మహేశుఁడు కాఁడే?

63


క.

పంచేంద్రియముల మదిఁ [29]దూ
లించి మనోగతియు లింగలీనంబుగ భా
వించిన భక్తుం డటు గా
కించుక మఱచినను భక్తుఁడే? త్రిపురారీ!

64


క.

విగ్రహసకలేంద్రియముల
నిగ్రహలీలానిరూఢి నిలుచునది సదా
నుగ్రహశివపదవశవిష
యగ్రహణసుఖంబు దొరకు నంతకు నియతిన్.

65


క.

సద్భక్తు లెల్లఁ దనయు
ద్యద్భయభక్తికిని మెచ్చ నాత్మేశుఁడు తా
సద్భావమునకు మెచ్చ జ
గద్భరితగుణా[30]ఢ్య! నడవఁగావలయు మహిన్.

66

క.

ఏయెడ భక్తుఁడె భక్తని
కాయం బిల మెచ్చ బాహ్యగతి మెలఁగండే,
నాయంతర్గతియు మనో
నాయకుఁ డీశుండు మెచ్చ నడవండేనిన్?

67


క.

తను సేయుభక్తి తాఁ జే
యను విహితం బట్లు గాక యన్యులఁ జేయం
బనుచుట సజ్జనభక్తికి
ననుచిత మె ట్లనిన సత్క్రియాభరణాంకా!

68


క.

సంతతము నెట్టి యాప్తులఁ
గాంతలఁ గవయంగఁ గుడువఁ గట్టఁగఁ దా నై
కంతుహరు పూజ సేయఁగ
నెంతశఠుం డైనఁ బనుచునే? త్రిపురారీ!

69


క.

తా [31]నురవడించె నేనియుఁ
గానంగా రాదు భక్తికడ యెఱుఁగ కుదా
సీనుం డైనం జెడు నటు
గాన వివేకంబు భక్తిగతి త్రిపురారీ!

70


క.

[32]ఉరువిడికిఁ దెలివి; భక్తికిఁ
బరిచర్య; కృతార్థమతికి భయమును; వ్రతత
త్పరతకుఁ జలమును; దగుస
చ్చరితకు నిస్పృహయు నొప్పు సద్భక్తినిధీ!

71


క.

వలపునకుఁ దలఁపు; చేఁతకు
నలయమి; పలుకులకు వినయ; మారాధన క

గ్గల మగు[33]నేమమ్మును మతి
కలిమికి [34]వినతియును నొప్పుఁ గరుణాంబునిధీ!

72


క.

జ్ఞానికి శాంతంబును నవ
ధానికి లింగార్పితముల తాత్పర్యంబున్
దానికి నుచితంబును నభి
మానికి నడుగమియు నొప్పు మహితగుణాఢ్యా!

73


క.

ఎట్టి వ్రతస్థుం డైనను
నెట్టి మహాభక్తుఁ డైన నెన్నఁ[35]గఁబడుఁ దాఁ
బట్టిన నియమంబులు [36]తుద
ముట్టినచో బీఱువోకమున్నె మహాత్మా!

74


క.

ఒడలును బ్రాణము [37]మానస
మొడమియుఁ గొనియాడ కవసరోచిత మైనం
గడఁగి నివేదింపక చొ
ప్పడునే సద్భక్తి? భక్తిపారీణమతీ!

75


ఉ.

మంచిగ నిత్యధర్మనియమవ్రతతత్పరుఁ డై దయాత్ముఁ డై
సంచితపుణ్యుఁ డై గుణవిశారదుఁ డై శివలింగపూజలం
దంచితసత్క్రియానిరతుఁ డై చరియించిన; భక్తుఁడే మనో
వంచకుఁ డైనఁ బ్రాణధనవంచకుఁ డైన సదోచితంబులన్.

76


క.

ఒడ లిది నాయది యన్నన్
జెడు నొడ లది లేక భక్తి సేయఁగరా ద
య్యొడలు గొని యుండియును దా
నొడలిగుణంబులను బొరయకుండఁగ వలదే?

77

క.

ఆదిపురాతనభక్తా
పాదితవచనములఁ దనరు[38]పక్వత మది సం
పాదింప కెట్లు కొలువక
వాదమె కా కవునె భక్తి? వరభక్తినిధీ!

78


ఉ.

భక్తులు చన్న మార్గ మది పాటిగఁ దప్పక భక్తుఁ డైయథా
శక్తిని భక్తి సేయు టది సత్పథ మట్లును గాక యమ్మహా
భక్తులు పల్కినట్లు తనప్రాప్తియె తాఁ బలుకంగఁజేయఁ బ్ర
వ్యక్తముగాఁ జరింప; భవవారణ సజ్జనభక్తికారణా!

79


ఉ.

ఒప్పుగ భక్తిసత్పథ[39]నయోక్తులు సెప్పక యున్కి మేలు సుగి
చెప్పుటకంటెఁ దాను నొగిఁ [40]జెప్పినయ ట్లుపదేశమయ్యెనేఁ
జెప్పెడి దానిలోనఁ గడుఁ జిక్కిన మాటల నైన నిల్పి మున్
దప్పక యుండఁగా వలదె? తామసదూరగ! తత్త్వపారగా!

80


క.

ఇది భక్తి యిది క్రమం బని
యెదిరికి నుచితంబుఁ జెప్పునెడ భక్తుఁడు దా
నెదిరికిఁ జెప్పినయట్టుల
ముదమున నడవంగ వలదె ముట్టినచోటన్.

81


చ.

ముదము వహింప హేతువులు ముప్పిరి యై మదిసొంపు పెంపునన్
మృదుమధురోక్తు లింపడర మెచ్చులు దీటుకొనంగ నవ్యసం
పద దళుకొత్త సాంగముగ భావము లల్లనఁ బల్లవించ న
ట్లెదిరి భజింపఁగాను వలదే శివభక్తకథాప్రసంగతిన్.

82


చ.

నిక మిది భక్తియుక్తి యననేరక నోరికి వచ్చినట్టు తా
నొకటికి వేయుఁ బన్నుచును నొడ్డరియడ్డరిమాట లాడుచున్

బకపక నవ్వుచున్ గెలని భావము దూలఁగఁ బల్కునట్టి య
వ్వికలునిగోష్ఠికిన్ సొగసి విందురె సజ్జనమార్గ మందురే?

83


మ.

కడువేడ్కన్ శివభక్తగోష్ఠి వినుచోఁ గంపించుచున్ మగ్నుఁడై
యొడ లెల్లం జెవులై ప్రసన్నముఖుఁ డై యుద్యత్ప్రమోదాత్ముఁ డై
యడరంగా బ్రమదాశ్రుధార లవి నేత్రాపాంగసంజాత మై
తొడరన్ ముత్పులకాంకితాంగుఁ డయి భక్తుం డున్నఁ గా కొప్పునే.

84


చ.

అసదృశభక్తగోష్ఠి వినునట్టియెడన్ వెడమాట లాడుచున్
[41]నుసులుచుఁ గంటగింపుచు వినోదము సేయుచు నిద్రఁబొందుచున్
విసుగుచు మీఁదు చూచుచు భువిం గలవార్తలు ద్రవ్వునట్టిపా
లసు నట నుండనీఁ జనునె? లాలితభక్తమనోనురంజనా!

85


అస్తవ్యస్తున కెఱుక, స
మస్తేంద్రియమగ్నునకు విమలబుద్ధియు [42]
ప్రస్తుతవాదికి గోష్ఠియు
నాస్తికునకుఁ గృపయుఁ గలదె? నారయపుత్త్రా!

86


జూదరికి బొంకుఁ బొరయమి;
[43]పాదలికిని భక్తివలని భయమును, విషయా
హ్లాదికిఁ బ్రసాదభోగా
స్వాదనసుఖమును నసంభవము త్రిపురారీ!

87


దుర్గుణికిఁ గీర్తి, గర్వికి
భర్గార్చన, క్రోధికిని దఫఃఫల, మరిష

డ్వర్గపరతంత్రునకు నప
వర్గసుఖంబును నసంభవము త్రిపురారీ!

88


చ.

జనవిను[44]తాశయా! విధివశం బగునే సుఖదుఃఖసంఘముల్
తనవశమే శుభాశుభవితానము? కర్మవశంబె పుణ్యపా
పనిచయ? మిన్నియుం గుడుపఁ బాఁపఁగ నీశుఁడె కర్త యై చనున్
దనరఁగఁ గూడునే [45]విధికృత మ్మని కర్మముఁ గూర్మి పల్కఁగన్.

89


చ.

కులమును రూపుఁ బ్రాయమును గూరిమి యర్థము గల్గి యాత్మలో
మలహరుభక్తి లేక చనుమానవుజన్మ మదెట్టు లన్నఁ దా
విలసితహావభావగుణవిభ్రమసంపద లెల్లఁ గల్గి [46]సం
చలనపుశక్తి లేక మనుజంతువిధం బగు సద్గుణాకరా!

90


చ.

హరుఁ డనుకల్పవృక్ష మమృతాంశుధరుం డనుకామధేను వీ
శ్వరుఁ డనుపెన్నిధాన మహివల్లభకుండలుఁ డన్‌సుధావశం
కరుఁ డనుమేరు వుండఁ దమకన్నులఁ గానక వాంఛితార్థముల్
సురపతిఁ గొల్చినం దమకుఁ జొప్పడునే శివభక్తశేఖరా!

91


చ.

హరువిభవంబు భర్గునిలయంబు సదాశివు రాజ్యలక్ష్మి శం
కరు ముద మీశునాజ్ఞ విషకంఠుని యాభరణంబు నిర్జిత
స్మరు సుఖలీల నాఁ బరఁగు సజ్జనభక్తి; తదీయభక్తిత
త్పరులకు భుక్తిముక్తు లవి బ్రాఁతులె? సజ్జనభక్తిశేఖరా!

92


ఉ.

ఆఱడిబోధలం బొదలి యాదిమతంబులు నూకి స్వేచ్ఛమై
వేఱొకబుద్ధులందలి విశేష[47]మతంబుల భక్తియుక్తులన్

మీఱఁగఁ బల్కుచున్ గురువుమేరలఁ బోక చరించువారికిన్
జాఱును గాక భక్తి సహజం బగునే? వరభక్తివర్ధనా!

93


అవిరళలింగపూజయు నిరంతరసద్గురుభక్తియుక్తియున్
సవినయజంగమార్చనయు సత్యము శౌచము సచ్చరిత్రయుం
దవిలి ప్రసాదసేవయును దా నొడఁగూర్పక వట్టిమాటలం
దవునె యుదాత్తభక్తి సుగుణాకర! శ్రీకర! [48]దోషిభీకరా!

94


కింకయుఁ [49]గపటము శౌర్య మ
హంకారము మచ్చరంబు ననృతంబును ని
శ్శంకితవృత్తియుఁ దమలో
శంకరుభక్తులకుఁ జనునె? సత్యవిచారా!

95


క్రోధంబుఁ బగయు నరయ వి
రోధంబును [50]డాంబికంబు రోషమనీషా
గాథలుఁ దమలో మిథ్యా
బోధలు భక్తులకుఁ జనునె? పురుషనిధానా!

96


సడ్డలు బండపదంబులు
వడ్డాచారంబులును వివాదముఁ జలమున్
వెడ్డరిమాటలుఁ దమలో
గొడ్డాచారములు తగ వగునె? సర్వజ్ఞా!

97


సుస్థిరుఁ డై సజ్జనభ
క్తిస్థితి వర్తించునట్టిధీరుఁడు భక్తుం
డస్థిరమతి స్వేచ్ఛాభ
క్తిస్థితి వర్తించునతని దేవుఁడె యెఱుఁగున్.

98

క.

కడుఁ గలిసియు భక్తులయెడ
నెడమడు గది లేమి భక్తి [51]యెన్నిక కెక్కున్
వెడమాటలఁ గలియుచు మది
నెడమడు గై యునికి భక్తియే? త్రిపురారీ!

99


చ.

అలయక మోచి దున్నియును నంకముఁ జొచ్చియు నష్టవృత్తిమైఁ
గొలిచియుఁ జోరుఁ డై చనియుఁ గూలి యొనర్చియు విద్య చూపియున్
వలి వ్యవహార మాడియున్నవార కవస్థలఁ బడ్డఁ గాని తాఁ
గలుగదు భుక్తి; ముక్తి మును గల్గునె సోమరి వట్టిమాటలన్.

100


క.

తను వొగ్గి ప్రాణ మమ్మియు
ధన మెదు రిచ్చియును భక్తిఁ దాఁ బడయుట వ్రేఁ
గనినం దనువును బ్రాణము
ధనమును వంచింప భ క్తి దగ దొరకునొకో!

101


క.

నిత్యంబు గానియొడలికిఁ
బ్రత్యహమును బెద్ద దుఃఖపడవలె నన్నన్
నిత్యపదం బగుభ క్తికి
నత్యంతము దుఃఖపడక యగునె మహాత్మా!

102


క.

ఘనభ క్తి కటకటా! లే
దనువగయును భక్తి చాల దనువగయును భ
క్తి నిజంబు నాకు నె ట్లగు
ననువగయును గలుగ భక్తి యగుఁ ద్రిపురారీ!

103

చ.

మృడుకృప లేక భక్తిఁ దరమే పడయంగ ననంగ నేల మున్
వడిగొని క్రేఁపు ప్రీతిఁ గుడువన్ గుడువన్ మొద వంతఁ జేఁపున
న్వడువున భక్తుఁ డర్థఁ గొలువన్ గొలువన్ శివుఁ డిచ్చు భక్తి గా
కెడపునె యట్లు గాన కొలు వెంతయు మేలుర సద్గుణాకరా!

104


అయ్యెడినో కాదో కా
దయ్యెడినో యనుచు సంశయం బుడిగి శివున్
నెయ్యం బెలర్పఁ గొలిచిన
యయ్య కవశ్యమును భక్తి యగుఁ ద్రిపురారీ!

105


క.

సచ్చరితుం డై నడవక
యిచ్చునె తనుఁ జేరి కొలువ కిల నరపతియున్
సచ్చరితుం డై నడవక
యిచ్చునె తనుఁ జేరి కొలువ కీశుం డనఘా!

106


క.

భక్తుల నవమానింపమి
భక్తుల కరయంగ భక్తి భక్తికి మీఱన్
భక్తులకుఁ గాదు కావున
భక్తులకుం గర్త భక్తి భక్తినిధానా!

107


క.

భక్తుఁడు [52]తా నై చను స
ద్భక్తుండును దక్కుభక్తిపరు లెల్లను సు
వ్యక్తిగ శివరూపమ యని
భక్తినిరంతరమహానుభవసుఖవార్థీ!

108

క.

భక్తి గలనాఁడె భక్తులు
భక్తునిఁ బాటింతు రతఁడు భక్తియు వదలన్
భక్తులు చేరరు గావున
భక్తియె సౌభాగ్య మండ్రు భక్తుల కెందున్.

109


క.

భూతియు రుద్రాక్షలు న
త్యాతతబహువేషరచన లవి తొడవులె? సం
ప్రీతిగ భక్తునకును బ్ర
ఖ్యాతిగ సద్భక్తి తొడవు గాక మహాత్మా!

110


క.

ముట్టినచోఁ దను [53]విడువక
దిట్టతనంబునను భక్తి ధీరుఁడ ననుచున్
బిట్టాడెడిసందేహికిఁ
బుట్టునె వైరాగ్యగుణము? బుధజనవినుతా!

111


క.

భక్తుండు విషయి యైనను
భక్తుఁడు నిర్విషయి యైనఁ బాటింపరు స
ద్భక్తులు; భక్తియు నిర్విష
యోక్తియుఁ గలయతని మెత్తు రుచితాభరణా!

112


క.

భక్తిపరతంత్రుఁ డై చను
భక్తునిఁ గడు వలతు రండ్రు భక్తులు వలవన్
భక్తపరాధీనుఁడు త
ద్భక్తుని రక్షించు శివుఁడు భవభయదూరా!

113


క.

వంటని దుర్వ్యసనంబుల
[54]పెంటకుఁ గా కీశుభక్తిపెంపునకుం గా

కుంటఁ జెడు [55]భక్తుఁ డాసల
రెంటికి నెడ తాకి చెడ్డరేవనిభంగిన్.

114


క.

వంచకునకుఁ గపటునకుం
గుంచితునకు దుర్వ్యసనికిఁ గుటిలాత్మునకున్
గించునకు భక్తిగుహ్యం
బించుకయునుఁ జెప్పఁ [56]గలదె యీడ్యచరిత్రా!

115


క.

లింగసువిధానికంటెను
జంగమసువిధాని మేలు సద్భక్తియెడన్
లింగోభయసువిధాని కి
లం గలరే సవతు చెప్ప? లలితగుణాఢ్యా!

116


క.

హరభక్తుఁ డేని నిందం
బొరయునె? హింసాగుణంబుఁ బొందునె? యొరులం
దిరియునె? యొరుమర్మముఁ దా
నరయునె? యనృతంబు పల్కు నయ్య? మహాత్మా!

117

ద్వంద్వప్రాస కందములు

క.

కన్నిడునే పరసతులకుఁ
ద న్నిడునే భక్తుఁ డన్యదైవంబులకున్
వెన్నిడునే భవములకును
మున్నిడునే మనము విషయములకు మహాత్మా!

118


క.

చేరునె మానవసంగతిఁ
గోరునె దుర్వ్యసనసుఖముఁ గుటిలాత్ముం డై

పాఱునె సుఖగోష్ఠియెడం
గోరునె పరధననిముక్తి గుణరత్ననిధీ!

119


క.

కొనునే నిషిద్ధపాకము
వినునే శివదూషణంబు వేఱొకత్రోవం
జనునే సద్భక్తుఁడ నే
ననునే గర్వించి భక్తియందు మహాత్మా!

120


క.

కూడునె యుపాధిగుణముల
నోడునె వంచించి యవసరోచితముల రెం
డాడునె సద్భక్తుఁడు గొం
డాడునె భవవిపినముల మహానందాత్మా!

121


క.

జాఱునె నియమవ్రతముల
మీఱునె శివునాజ్ఞ [57]నెందు మితి గడవక మున్
పాఱునె పలుత్రోవలకును
దాఱునె భక్తుండు భక్తతతిఁ ద్రిపురారీ!

122


క.

పెట్టునె భక్తుఁడు భవికిని
మెట్టునె ము న్నన్యపదము [58]మెయ్యొఱపులఁ దా
ముట్టునె లింగానర్పిత
మెట్టైనను బ్రతుకఁ దలఁచునే త్రిపురారీ!

123


క.

ఇల భక్తుఁడు సుఖదుఃఖం
బులయెడ బొబ్బిడక వంతఁ బొందక యవి యి

మ్ముల లింగాధీనం బని
నిలుచుం గా కేల కలఁగు నీతివిలాసా!

124


క.

తనమదిఁ బుట్టినకోపము
తనుఁ జెఱుపునె యెదిరివారిఁ దాఁ జెఱుపునె పు
ట్టినయి ల్లుండఁగ ననలము
మును చెఱుచునె యితరసదనములఁ ద్రిపురారీ!

125


క.

కోపంబు పాపహేతువు
కోపము దుర్గతికి నూఁత కోపమె పగవాఁ
డేపారఁగ భక్తునకుం
గోపము దాఁ బుట్టు నయ్య? కోపవిదూరా!

126


క.

లేకుండును గోపం బథ
వా కలిగినఁ బూరిచిచ్చువడువున నాఱుం
గా కెగయునె సద్భక్తుని
యాకోపము శమము [59]పొరుగ; నతిశాంతాత్మా!

127


క.

కోపంబు పెరిఁగి శాంతత
రూ పణఁచుం గర్మి; కొక్కరూ పగు నది ధ
ర్మాపాదికి; నతిశాంతత
కోపముఁ బరిమార్చు భక్తి గుణికి మహాత్మా!

128


క.

చెనయుశివద్రోహులయెడఁ
దనుధర్మములెడలఁ దక్క దయయును శాంత
త్వనిరూఢియు[60]శృంగారిలు
ననయము భక్తులకు గురుపదాంబుజభృంగా!

129

క.

అలుగునె భక్తుఁడు భక్తున
కలుగం డలిగినను నతని యవగుణముల ప
ట్లలుగు రజకుండు చీరల
కలుగక మాలిన్యమెడల నలిగినభంగిన్.

130


క.

నిండి మనంబునఁ గోపం
బుండిన నెడ గలదె భక్తి కుండఁగ, గరిసెన్
నిండి తవు డుండునెడఁ బుల
కండమునకుఁ గలదె చో టఖండితచరితా!

131


క.

ఎఱుక మది లేక యున్నను
నెఱుకలు పెక్కైన నెఱుక యెఱుఁగక యున్నన్
గుఱి నెఱు కెఱుఁగనిక్రియ మై
యొఱపుల నెఱపినను భక్తి యొడఁగూడు నొకో!

132


క.

తెలియుటయె యెఱుక; కోర్కులు
పొలియుటయే సుఖము; సుకృతబుద్ధియె గతి; దా
వలచుట పరముం బాయక
తలఁచుటయె; సమాధి పరమతత్త్వం బనఘా!

133


క.

చేయుటయె భక్తి; లోకులఁ
బాయుటయె పథంబు; తనయుపాధికి మదిలో
రోయుటయె విరక్తి; యుపా
దేయం బెఱుఁగుటయె యాత్మదృష్టి తలంపన్.

134


క.

ఇట్టిది మతి యిట్టిది గతి
యిట్టిది నాశక్తి భక్తి యిట్టిది యిది తా

నెట్టైనఁ గాని కా దని
ముట్టి విచారింపక తుది ముట్టునె చెపుమా.

135


క.

కొలుచుటయె భక్తి; భక్తికిఁ
దలఁకమియె వ్రతంబు; వ్రతముఁ దవులుటయే ని
శ్చలకృప; శివునిశ్చలకృప
గలుగుట యది ముక్తిపథము కరుణాభరణా!

136


క.

హృద్యతపఃఫలసిద్ధియు
విద్యానుష్ఠానదానవివిధవ్రతసం
పద్యుక్తికి శివభక్తుని
యుద్యోగమె తీర్థయాత్రయును సత్పాత్రా!

137


క.

అర్థార్థము వ్యవసాయం
బర్థము జంగమహితార్థ, మదియును సద్భ
క్త్యర్థము, సద్భక్తియు ము
క్త్యర్థము, బటు గాన వలయు వ్యవసాయ మిలన్.

138


క.

కలనాఁడె ధనము, ప్రాయము
గలనాఁడె జవంబు, బలము గలనాఁడె విని
శ్చలమతియు గతియుఁ దనకుం
గలనాఁడె భజింపవలయుఁ గరుణానిలయున్.

139


క.

అర్థము ప్రాణమునకుఁ దగు
నర్థిగ నని కూర్తు రర్థ మయ్యర్థము తా
వ్యర్థం బై చెడకుండు స
మర్థుం డెవ్వండు గాని మహిఁ ద్రిపురారీ!

140


క.

అర్థం బర్థము శివభ
క్త్యర్థం బై సమసెనేని; యటు గాదే న

య్యర్థం బనర్థ మనియు ని
రర్థక మనియును నెఱుంగు మటు త్రిపురారీ!

141


క.

పడయుదురర్థం బర్థము
పడసియుఁ దమశక్తి మెఱసి భక్తహితార్థం
బొడఁగూర్తురు సద్భక్తులు
విడువరు వ్యవసాయములు భువిం ద్రిపురారీ!

142


క.

[61]వలయుం గృషివాణిజ్యకు
శలవిద్యావర్తనములు [62]సలుపఁగ సద్భ
క్తుల కర్థం బార్జింపఁగ
నిల భక్తార్థంబె కాన యెలమి మహాత్మా!

143


క.

కాయక్లేశముఖంబున
న్యాయంబునఁ బడయవలయు నర్థము సమయం
జేయునది భక్తులకు న
న్యాయవివర్జితచరిత్ర నారయపుత్త్రా!

144


క.

ఎన్నిముఖంబుల నర్థముఁ
బన్నుగఁ బడసియును దారు పడసితి మన ర
త్యున్నతిఁ గుడువరు ముడువరు
[63]చెన్నటిపనులకు వ్యయంబు సేయరు భక్తుల్.

145


క.

చేయునెడ భక్తిపరులకు
న్యాయార్జిత మైనయట్టియరకానికి న
న్యాయార్జిత మగుమాడలు
వేయును సరి గావు భక్తివిధిఁ ద్రిపురారీ!

146

క.

వచ్చునెడ లింగవశ మను,
నిచ్చునెడన్ భక్తు లెల్ల నీశుం డను, ము
న్నిచ్చియు నిచ్చినయెడఁ దా
నిచ్చితి ననఁ డచలభక్తుఁ డిలఁ ద్రిపురారీ!

147


క.

అడుగమి నిచ్చుట యుత్తమ;
మడిగినయెడ నీఁగి యెన్న నగు మధ్యమ; మ
ట్లడిగిన మెయ్యొఱపులఁ దా
నిడుటయె యధమంబు భక్తియెడఁ ద్రిపురారీ!

148


క.

భక్తుని భక్తుం డడిగిన
భక్తునకున్ భక్తి సేయఁ బాటిల్లు నయో
ద్యుక్తి నటు గాక యుండిన
భక్తుం డనవలదు దుఃఖపాశవినాశా!

149


క.

నిపుణగుణి "యర్థిదోషం
[64]న పశ్యతి" యనఁగ వినును మనం బలరారన్
ద్రిపురారిభక్తుఁ డడుగుట
త్రిపురాంతకుఁ డడిగినట్లు తెల్లం బగుటన్.

150


ఉ.

లింగము మూర్తి యంచు [65]మఱి లింగము నే మని పూజ సేయుఁ? దా
లింగము మూర్తి యంచు [66]మఱి లింగము నెక్కడ నెట్లు కొల్చు? ము
న్నంగము లేదు సత్క్రియకు నంగము లేక భజింపరాదు లిం
గాంగవినిశ్చయం బెఱుఁగ నన్యుల శక్యమె? లింగసంచితా!

151

ఉ.

అంగమదృశ్యదృశ్యముల [67]కాశ్రయుఁ డయ్యును గానరానిస
న్మంగళలింగమూర్తి నసమానజగత్త్రయచక్రవర్తి ను
త్తుంగవిశాలకీర్తి నవధూతవినమ్రజనార్తి నాత్మలో
సాంగము గాఁగ సద్గురు[68]కృపాఢ్యతఁ గా కెఱుగంగ వచ్చునే?

152


చ.

అవిరళభక్తియుక్తి ననయంబును భక్తుఁడు దా నొనర్చురా
జవదుప[69]చారభావనల సత్క్రియ లెల్లను లింగమూర్తియం
దవయవముల్ దలంచు తలఁ పట్టులఁ దోఁచగ భక్తవత్సలుం
డవుట నిజంబు గావున దయామతి మున్నుగఁ జేయు సత్క్రియల్.

153


క.

భావింపఁగ సద్భక్తుని
భావం బెట్లట్ల తోఁచుఁ బరమేశుఁడు "య
ద్భావం త ద్భవతి" యని క
[70]దా వినఁబడు శ్రుతులలో నుదారచరిత్రా!

154


క.

పంబినభక్తిస్థితి త్రివి
ధం బగు నది యెట్టు లనినఁ దా శుద్ధము మి
శ్రంబును సంకీర్ణంబు న
నం బరఁగి లసచ్చరిత్ర నారయపుత్త్రా!

155


మ.

అమరం గేవలభక్తియుక్తియుఁ దదీయధ్యానమున్ శుద్ధభ
క్తి; మనంబార సదాశివార్చనము మూర్తిధ్యానమున్ మిశ్రభ
క్తి; ముదం బీశ్వరచింతనంబు మును ప్రీతిం గొల్చు సంకీర్ణభ
క్తి; మహాత్మా యన శుద్ధభక్తిపద ముత్కృష్టంబు దా నెమ్మెయిన్.

156

చ.

అనయముఁ బంచవింశతిమహావరమూర్తుల నీశ్వరాదులన్
దనరినమూర్తి మూర్తిఘనతత్త్వసదాశివపంచకంబులన్
[71]జననుత! నూఱుకోట్లయుగసంఖ్యలు గొల్చిన నొందుతత్ఫలం
బనుపమలింగమూర్తి నిమిషార్ధము గొల్చినఁ బొందు సమ్మతిన్.

157


శా.

దానానేకమహాతపోనిచయసద్ధర్మౌఘతీర్థాఖిల
స్థానస్తోమజపవ్రతప్రణుతయజ్ఞవ్రాతమంత్రోక్తని
త్యానుష్ఠానవితానముల్ సలుపుపుణ్యం బంతయున్ గూడ నా
ర్యానాథాంఘ్రులఁబూన్చుపుష్పజసహస్రాంశంబునుం బోలునే?

158


సీ.

స్ఫీతుండు తొల్లి యుచ్ఛిష్టప్రదేశని
          పతితపుష్పము శివార్పితము గాఁగఁ
దలఁచినంతనె చేసి మలహరుం డతనికిఁ
          ద్రిదశత్వమును బ్రసాదించె ననఁగ
వాంఛఁ "గించిద్దళం వా చులుకోదకం
          వా" యనఁ బరమతత్త్వప్రలీన
చింత "దేవేంద్రలక్ష్మీపదం తే దదా
          సి" యన నింద్రత్వంబు శివునియీవి


గీ.

అదియు నరిదియే నిరంతరస్థితిఁ దదీ
యార్చనావిధేయు లైనభక్త
తతికి నీశ్వరుండు త న్ని చ్చుట యరిది
యే తలంపఁగా మహితయశస్క!

159


క.

స్వర్గసుఖార్థులకును నప
వర్గసుఖార్థులకుఁ గోర్కె వారక సలుపన్

భర్గనివేదితపుష్పని
రర్గళఫలరాశిలోని యల్పమె చాలున్.

160


క.

ఫలమునకుఁ గొల్చువారికి
ఫల ముపభోగాంత మనఁగ ఫలవిరహితు లై
కొలిచినవారికిఁ దథ్యము
సలలితనిశ్రేయసుఖము శంభుం డొసఁగున్.

161


క.

మోక్షార్థులకుం జక్కన
మోక్షముతెరు వితరసుఖసమోహార్థులకున్
వీక్షింప మఱొకతెరు వగుఁ
ద్ర్యక్షార్చనఫలము ముక్తి [72]దప్ప దదెట్లున్.

162


క.

కాన యఖిలాల్పభోగవి
తానము లగుచిక్కులందుఁ దగులక సద్భ
క్తానీక మర్థిఁ గొలుచుట
మానితమోక్షార్థవిమలమతిఁ ద్రిపురారీ!

163


సీ.

సద్గురుకరుణాలసత్పట్టభద్రుఁ డ
          స్థిరరాజ్యవైభవస్థితికిఁ జనునె
నిత్యప్రసాదవినిర్మలామృతభోగి
          స్వర్గోపభోగానుషక్తుఁ డగునె
విస్ఫారభక్తిసంవిత్సుఖార్ణవమగ్నుఁ
          డితరసుఖశ్రేణి కిచ్చగిలునె
ప్రథితలింగప్రాణమథనజీవన్ముక్తుఁ
          డంగావసానమోక్షార్థి యగునె

ఆ.

సత్క్రియానుకూల సారానుభవలోల
భక్తజనహితార్థ [73]భవ్యతీర్థ
[74]పరమసౌఖ్యలోల పరమానురాగసం
సారదుఃఖనాశ! సత్కవీశ!

164


శా.

ఆలస్యంబు మనోవికల్పమును నాత్మాద్వైతమున్ సత్క్రియా
కాలాతిక్రమమున్ జడత్వము నహంకారంబు సంసారలీ
లాలోలత్వము సంచలత్వము దురాలాపంబులుం గూడునే
[75]త్రైలింగార్చన సేయుభక్తునకు నుద్యద్భక్తచింతామణీ!

165


శా.

వ్రాలున్ వ్రాలు శివార్చనాపరవశవ్యాప్తిన్ బ్రమోదంబునన్
గ్రాలున్ గ్రాలు నహర్నిశంబు శివలింగధ్యానసంపన్నుఁ డై
సోలున్ సోలు నపారసారవివిధస్తోత్రప్రలాపంబులన్
దేలున్ దేలు మహానుభావసుఖవార్ధిం భక్తుఁ డుద్యద్గుణా!

166


ఉ.

ఏపున శుద్ధభక్తిరతి యేడెఱ నూల్కొన నేకలింగని
ష్ఠాపరయుక్తి నివ్వటిల సజ్జనభావము పొంగలింప ను
ద్దీపితతత్త్వదృష్టి [76]మతిఁ దేజ మెలర్పఁగ సచ్చరిత్రయం
దోపి వెలుంగుభక్తుఁడు మహోన్నతి నుండు జగజ్జనాశ్రయా!

167


ఉ.

వేళ లెఱింగి సత్క్రియలు వెల్లిగొనంగ మనంబు ప్రీతికిన్
[77]మేళన మిచ్చి యచ్చుపడ మేన సముత్పులకాలి పర్వఁగాఁ
జాలఁగ నేత్రవారి దనసంస్మితవక్త్రము ముంచి యెత్తఁ బూ
జాలసనంబున న్నెగడు సజ్జనభక్తుఁడు సత్క్రియాశ్రయా!

168

చ.

హరు మది నిల్పి నిల్పి యనయంబును బూజలు సల్పి సల్పి శం
కరు మును చూచి చూచి తమకంబు దలిర్పఁగ నేచి యేచి యీ
శ్వరునుతి చేసి చేసి స్వవశస్థితిచేష్టలఁ బాసి పాసి త
త్పరవశభావ మంది చనుభక్తుఁడు లింగముఁ బొందు సమ్మతిన్.

169


ఉ.

చెన్నొలయించు సత్క్రియలచేత మనం బెడ సొచ్చియోడఁగా
సన్నుతిఁ జేయు శబ్దముల సమ్మతి గద్గదకంఠ మాగఁగాఁ
గన్నిడి చూచుచూపుల సుఖస్ఫురితామలవారి పర్వఁగా
మిన్నక యుండుభక్తుఁడు సమేళన మొందఁగ లింగలీనుఁ డై.

170


క.

భృత్యాచారమె భక్తియు
భృత్యాచారంబె ముక్తిపెంపును సొంపున్
భృత్యాచారము సరియే
నిత్యాహంకారఘోరనియమవ్రతముల్?

171


క.

తను భక్తిపారవశ్యం
బున మఱవక తా శివైక్యమును గల్గునె? యెం
దును "మమ మాతా వంధ్యా"
యనుబాసలు పొసఁగునే? మహానందాత్మా!

172


క.

తాను శివైక్యుఁడ యేనిన్
దా నైతి ననంగఁ బల్కఁ దగునే యహహా
యేనాఁటనైనఁ జచ్చియుఁ
బీనుఁగు నని పలుకునట్టిపీనుఁగు గలదే?

173


క.

ప్రస్తుతకీర్తీ! "గ్రామో
నాస్తి కుత స్సీమ" యనిన యాస్మృతిక్రియ న

ప్రస్తుతము భక్తి వెలిగా
[78]నస్తవ్యస్తులకు మును శివైక్యము గలదే?

174


క.

గతిమతి చైతన్యక్రియ
లతిశయ మై తనకుఁ గల్గు [79]నంత కనర్థ
స్థితిఁ బూజాతిక్రమస
మ్మతుఁ డై వర్తింపఁదగునె మఱి భక్తునకున్?

175


చ.

అవసరమందుఁ బుష్ప మొకటైనను బత్తిరి యైన ము న్నసం
భవ మగునేని నీశునకు భక్తి ప్రధానము గావునన్ మహో
త్సవగతిదృష్టి పూజయును సంస్మరణంబును భావశుద్ధియుం
దవిలి యొనర్చునేనియును దప్పక చేసిన[80]వాఁడె కాఁదగున్.

176


క.

నిర్భయులకు నిష్ప్రియులకు
దౌర్భాగ్యాద్వైతులకు వృథావాదులకున్
దుర్భావకులకుఁ దా నపు
నర్భవసుఖరాశి గలదె? నారయపుత్త్రా!

177


క.

ఆరయ నద్వైతాహం
కారం బది ఫలము గాదు కావున నిరహం
కారస్థితిగాఁ గొల్చిన
వారికి దొరకదు పునర్భవము త్రిపురారీ!

178


సీ.

ఆరయ 'లింగద్వయం సమాఖ్యాత' మ
         నంబడి లింగద్వయంబు వెలయు
నిలఁ జరం చాచర మేవ చ యన జంగ
         మము లింగ మన నందు మహితభక్తి

దీక్షమైఁ 'జరవ్రతీతి' సువిఖ్యాత మ
         నంగ వ్రతస్థుండు జంగమంబు
[81]అ'ట్లచరాః పార్థి వాదయో' యనఁ బార్థి
         వంబు నయి ప్రతిష్ఠితంబు లింగ


గీ.

మట్లు గాన శివుని యపరావతారంబు
జంగమంబు గాన జంగమంబు
లింగ మనఁగ వలయు లింగసంగతగాత్ర!
భవలతాలవిత్ర! పరమపాత్ర!

179


క.

ఈకుల మాకుల మనక ని
రాకులమతి వారికొఱఁత లరయక భక్తా
నీకము శివుఁ డని కొలిచినఁ
జేకొనఁడే వాంచితార్థసిద్ధి? మహాత్మా!

180


సీ.

సిద్ధరసస్పర్శఁ జేసియె కాదె తా
         మ్రంబు శుద్ధము సువర్ణంబు మఱియు
సిద్ధంబుగా శివసిద్ధాంతవేదశా
         స్త్రోక్త మగుచు శుద్ధభక్తియుక్తి
తా 'నుమా మాతా పితా రుద్ర యీశ్వరః
         కుల మేవ చ' యనియుఁ గలదు గాన
సద్గురుకారుణ్యసంజాతు లెల్ల స
        గోత్రు లనక యన్యగోత్రు లనఁగఁ


గీ.

దగునె? యొక్కతల్లిదండ్రుల కుద్భవం
బైనప్రజలలో నహీనవంశ్యు

లెందుఁ గలుగఁ బోదురే శివగోత్ర! స
త్పాత్ర! భక్తిసూత్రపథచరిత్ర!

181


క.

శివగర్భులు శివజన్ములు
శివగోత్రులు శివకులజులు శివవిజ్ఞానుల్
శివశాసనధరు లటె యం
దు వేఱకులములను వెదుకుదురె? త్రిపురారీ!

182


క.

భువిలో శివదీక్షితు లగు
శివభక్తులపూర్వజాతిఁ జింతించుట రౌ
రవనరకభాజనం బా
శివుఁ బాషాణంబు గాఁగఁ జింతించుక్రియన్.

183


క.

నికముగ 'మద్భక్తా విగ
[82]కల్మషా' యనిన శివునితద్వచనము న
మ్మక భక్తుల దుర్గుణములు
ప్రకటించినవాఁడె కాఁడె పాతకుఁ డుర్విన్?

184


క.

శివలాంఛనసంహితుఁడును
భువి మానవుఁడే యగణ్యపుణ్యుఁ డతనియం
[83]దవగుణము గలదె యేయెడ
ల వెదక వారాశిలోఁ గలంకము గలదే!

185


శా.

వీక్షింపంగ శరీరధారులె భవావిర్భూతులే యీషణా
పేక్షాక్రాంతులె యన్యభోగవిషయప్రేతాత్ములే [84]పూర్వక

ర్మక్షోభాన్వితులే యధర్మమతులే రాగాదిదోషాఢ్యులే
సాక్షాద్రుద్రులు గాక కేవలులె భాస్వద్భక్తు లుద్యద్గుణా!

186


మ.

ధర జన్మించినభక్తు లెన్న జనులే? ధాత్రీతలావిష్కృతా
చరలీలం జనులింగమూర్తు లవి పాషాణంబులే? వారు దా
నరచర్మావృతు లైన నేమి నరులే నానావిచిత్రాదివి
స్తరవస్త్రావృతు లైనమానవులు తద్వర్ణాంగులే? ధీనిధీ!

187


చ.

నిరవయవాదిమూర్తికి ననిర్వచనీయవిశాలకీర్తికిం
బరమపదప్రవర్తికి నపారజగత్పరిపూర్తికిన్ సదా
వరదున కర్థిమై నవయవప్రకరాదులు దార యై మహిం
బరఁగుమహాచరిత్రు లగుభక్తులు భక్తిగుణాఢ్యు లల్పులే?

188


చ.

హరునకు నాశ్రయంబును గుణాగుణమూర్తికి నాత్మయుం బరా
పరునకు దేహ మీశునకుఁ బ్రాణము శంభునకున్ జవంబు శం
కరునకు సీమ యాగరళకంఠున కాభరణంబు నిర్జిత
స్మరుసుఖలీల నాఁ బరఁగుసజ్జనభక్తిగుణాఢ్యు లల్పులే?

189


ఉ.

మి న్నెట యందు[85]కొన్గలరె? మేనితనర్పది పెద్ద యంచుఁ దా
రెన్నుదు రెల్లలోకముల [86]నిట్టివి మిన్నుల నంతకోట్లకున్
మిన్నగుచున్న మిన్నయట మిన్నుకు మిన్నును మిన్ను దాటున
త్యున్నతి నున్న లింగముసమున్నతి నంటినభక్తు లల్పులే?

190


చ.

మొదలున కెల్ల మున్మొదలు ముప్పదియాఱును [87]మించి నడ్మి కిం
పొదవఁగఁ దాన నట్టనడు మొప్పుసమున్నతి నుల్లసిల్లి య
త్తుదికిని దాన తుట్టతుదిఁ దోఁచి వెలింగెడుదివ్యలింగమున్
ముదమునఁ బట్టియాడెడువినోదమహిష్ఠులు భక్తు లల్పులే?

191

ఉ.

దుష్టభవప్రకీర్ణ[88]మలదూరులు ధీరులు నాదిసంభవో
త్కృష్టశివాగమవ్రతచరిత్రులు పాత్రులు శుద్ధభక్తి[89]సం
పుష్టమహోత్సవోల్లసనభోగులు యోగులు తత్త్వసన్మనో
ద్దిష్టశివార్చనాశ్రయవిధిజ్ఞులు తద్‌జ్ఞులు భక్తు లల్పులే?

192


మహాస్రగ్ధర.

అవినాశుల్ సంయమీశుల్ వ్యపగతవిషయాహ్లాదు లుద్యత్ప్రమోదుల్
ధ్రువకీర్తుల్ శాంతమూర్తుల్ దురిత[90]హరణసద్బుద్ధు లాజ్ఞాసమృద్ధుల్
భవదూరుల్ నిర్వికారుల్ ప్రణుతగుణమహాపాత్రు లానందగాత్రుల్
శివభక్తుల్ తత్త్వయుక్తుల్ చిరతరసుమనస్సిద్ధు లాత్మప్రబుద్ధుల్.

193


త్రిభంగి.

గురుమతసహితులు, దురితవిరహితులు
సురుచిరసజ్జనవర్తుల్, ధ్రువకీర్తుల్, శాంతసుమూర్తుల్
పరిహృతవికృతులు, నిరవధిసుకృతులు
మరణపునర్భవదూరుల్, సువిచారుల్, భక్తివిచారుల్
పరవశహృదయులు, నిరుపమసదయులు
పరసమయ[91]ప్రవిఫాలుర్ గుణశాలుర్ దానసుశీలుర్
పరహితచరితులు, వరగుణభరితులు
పరమపరాత్యనుషక్తుల్, శివభక్తుల్, శాంతనియుక్తుల్.

194


క.

అవిరళదాననియుక్తులు
భవదుఃఖవితానపాశబంధవిముక్తుల్

శివధర్మకథాసక్తులు
సవిశేషాభీష్టఫలదసద్గురుభక్తుల్.

195


క.

చిరతరకృపాసముద్రులు
కరుణాభరణాన్వితులు విగతదారిద్ర్యుల్
నిరవధికలియుగరుద్రులు
హరచరణారాధకులు నిరంతరభద్రుల్.

196


క్రౌంచపదవృత్తము.

భక్తివినీతుల్ యుక్తిసమేతుల్ భవభయ[92]విగళితపశుగుణపూతుల్
వ్యక్తసుబుద్ధుల్ శక్తిసమృద్ధుల్ వ్యపగతకులచయవరసుఖసిద్ధుల్
సూక్తిరసజ్ఞుల్ భక్తివిధిజ్ఞుల్ సురుచిరశుభకరసుకృతమనోజ్ఞుల్
భుక్తివిరక్తుల్ ముక్తినియుక్తుల్ పురహరభక్తుల్ బుధవినుతమతుల్.

197


మాలినీవృత్తము.

సకలజనవరేణ్యుల్ శాశ్వతాగణ్యపుణ్యుల్
నికృతదురితవర్తుల్ నిర్మలానందమూర్తుల్
వికృతరహితవేషుల్ వేదవేదాంతభాషుల్
ప్రకటితసుమనస్కుల్ భక్తు లుద్యద్యశస్కుల్.

198


వనమయూరవృత్తము.

ధీరులు పరాపరవిధేయు లసహాయుల్
శూరులు మనోగమనశుద్ధులు ప్రబుద్ధుల్
వీరులు మహోద్ధతవివేకు లతిలోకుల్
శూరులు శ్రుతిస్ఫురితసూక్తు లిల భక్తుల్.

199

మానినీవృత్తము.

లింగగభీరులు లింగవిచారులు లింగవిహారులు లింగమతుల్
లింగవిధానులు లింగసమానులు లింగవిలీనులు లింగమయుల్
లింగసుశీలురు లింగవిలోలురు లింగకృపాళురు లింగరతుల్
లింగసదుక్తులు లింగనిషిక్తులు లింగసుభక్తులు లింగనిధీ!

200


సీ.

లింగసంజాతులు లింగవిఖ్యాతులు
         లింగసదర్థులు లింగముఖులు
లింగాభిమానులు లింగావధానులు
          లింగవిజ్ఞానులు లింగ[93]సఖులు
లింగప్రమోదులు లింగవినోదులు
          లింగాత్మవాదులు లింగసములు
లింగసత్ప్రాణులు లింగధురీణులు
          లింగనిర్వాణులు లింగసుఖులు


గీ.

లింగయోగ్యు లధికలింగసౌభాగ్యులు
లింగభక్తిపరులు లింగధరులు
లింగలీయు లాత్మలింగవిధేయులు
లింగతత్త్వమతులు లింగ[94]రతులు.

201


సీ.

అవ్యయు లనుపము లవినిషేధులు [95]ధీరు
         లఘటితఘటితు లార్యైకనుతులు
సుభగులు సుగుణులు సుమతులు సుజనులు
         సుప్రసన్నాత్ములు శుద్ధమతులు
దివ్యులు భవ్యులు త్రిభువనారాధ్యులు
         త్రిగుణవిదూరులు త్రిమలహరులు

నణిమాదిసిద్ధగుణైశ్వర్యసంపన్ను
         లజరామరులు విభవాఢ్యు లాత్మ


గీ.

చరులు వితతసర్వసంగపరిత్యాగ
చరితు లప్రతిములు స్వచ్ఛు లుభయ
కర్మవిరహితులు జగత్పావనులు కాల
కాలు లభవుభక్తగణము లనఘ!

202


చ.

అతులితశాంతచిత్తు లమలాత్మకు లాతతధర్మసంయమ
వ్రతు లకలంకచిత్తు లనివారితకర్ములు దీనరక్షు లం
చితగురుభక్తియుక్తులు వశీకృతశుద్ధమనస్కు లుద్భవ
స్థితిలయ[96]కార్యకర్తలు విచిత్రచరిత్రులు భక్తు లల్పులే?

203


ఉ.

లోకమునందుఁ బుట్టియును లోకవిరుద్ధు లనంతజీవన
వ్యాకులచిత్తు లయ్యు నధనార్థు లనారతధర్మసత్క్రియా
నీకసమేతు లయ్యు ఫలనిష్ప్రియు లంగవిధేయు లయ్యు దూ
రీకృతదుర్మదేంద్రియచరిత్రులు జాణలు భక్తు లల్పులే?

204


మ.

[97]అరుదా స్థావరలింగమూర్తు లిలఁ దారాదానదానస్థితిన్
నరులం దమ్ము భజించువారలను బుణ్యప్రాప్తులం జేయుట
ట్లరుదే జంగమలింగమూర్తు లిలఁ దారాదానదానక్రియే
తరు లై మర్త్యులు దమ్ముఁ జూడఁగనుమాత్ర న్ముక్తిఁ బొందింపఁగన్.

205


మ.

అనపేక్షావిధి నైన భక్తులను దా రల్లంతటం గాంచు మా
త్రన గమ్యాగమనోత్కటప్రకటహత్యాపాతకానేకకో
ట్లు నివృత్తం బగు నన్న సంస్పృహగుణాటోపంబునన్ స్వాగతా
సన[98]పాద్యాదు లొనర్చువారికిఁ బునర్జన్మంబు దా శ్లాఘ్యమే?

206

ఉ.

నెయ్య మెలర్ప జంగమము నిక్కము లింగ మటంచుఁ బిల్చి యో
జియ్య పనేమి? దేవ యని శీఘ్రమె పోయియు నానతిచ్చి మా
యయ్య మహాప్రసాద మని [99]యర్చన చేసియుఁ బ్రీతి సల్పు మా
యయ్యలు దారె కారె చరితార్థులు భక్తహితార్థకారణా!

207

భక్తభావక్రియార్చనావిధి

సీ.

సాష్టాంగుఁ డై మ్రొక్క నానందజనితాశ్రు
          సమితియె పాదమజ్జనము గాఁగ
నలరుచు నాపోవ కందంద వీక్షించు
          దృష్టులు పూజ లై తేజరిల్ల
సముచిత మొనరించు సత్క్రియాభ్యుదితవా
          సన తాన ధూపవాసన వహింపఁ
జెలఁగుచుఁ బ్రస్తుతి సేయుహృద్యార్థవా
          ఙ్మణులు నీరాజనమహిమ వెలుఁగ


గీ.

విగతలోకుఁ డై నివేదించు నభిమతా
ర్థములె యిచ్చు నోగిరములు గాఁగ
సహజభక్తిపరుఁడు జంగమలింగపూ
జనము సేయ నేర్చు సంతతంబు.

208


చ.

అలయక యెగ్గు లాడ కపహాస్యము సేయక సేఁత కెమ్మెయిన్
జొలయక నీవు దా ననక సుంకరిమాటల నింపు లాడ కి
మ్ములఁ జన కర్థి దింపక ప్రమోద మణంపక గర్వి గాక మా
ర్మలయక యుండఁగా వలదె మానుగ జంగమభక్తుఁ డేనియున్.

209

ఉ.

పొచ్చెము లేక రిత్త వెడపొల్లులు పూనక కార్య మెయ్యెడన్
[100]గ్రుచ్చఁ దలంప కేమియును గోరక యెల్లెడ లోభి గాక ము
న్నిచ్చియు నిప్పు డిత్తు నన కిబ్బడివాదము లేక యెమ్మెయిన్
సచ్చరితుండు గావలదె సజ్జనభక్తుఁడు జంగమాశ్రితా!

210


చ.

మనము మనంబులోఁ గలిసి మాటలు మాటలు సొచ్చి యర్థముం
దనరఁ దదర్థ మై సమసి తథ్యముగాఁ దను వెన్నిభంగులన్
దనువున కొడ్డి వారిప్రమదంబును వారలదుఃఖవృత్తియుం
దనయవి గాఁ దలంచు మదిఁ దప్పక జంగమభక్తుఁ డేనియున్.

211


క.

క్రియగొన భక్తుం డై బం
టయి బానిస యై నిజాప్తుఁ డై [101]యెన్నఁగఁ బెం
టయి తుడువఁగఁ జీపురుఁ దా
నయి జంగమభక్తి సేయునతఁ డీశుఁ డిలన్.

212


క.

ఉపజీవికత్వమతియును
జపలత్వము నాస్తికతయు సందేహంబుం
గపటంబుఁ గంటకంబును
నుపమింపఁగ సహజభక్తియుక్తికిఁ గలదే?

213


క.

నయమును బ్రియమును నధికవి
నయమును బాయనిభయంబు నమ్మికయును ని
ర్ణయమును నిర్వంచకతయుఁ
గ్రియగొనఁగా సహజభక్తికిని హేతు వగున్.

214

క.

పిలిచినఁ బని [102]యే మనకయుఁ
దలఁచినతలఁ పెఱిఁగి వారి[103]తలఁ పడుగమియున్
[104]గెలు పిచ్చి కీడు వడుటయుఁ
గలుగుట యది శుద్ధభక్తిగతి త్రిపురారీ!

215

సర్వతః ప్రాససీసము :-

మృడుభక్తు లేతేరఁ బొడగని యైనను
          బొడఁగానరానట్లు పెడమొగంబు
[105]నిడి తలవంచి యున్నెడ డాయవచ్చిన
         [106]కడగంటఁ గని యున్న [107]యెడన యుండి
వెడమ్రొక్కు మ్రొక్కి యక్కడఁ జూచుచును గొంత
        వడికిఁ గూర్చుండనె యెడము లేదు
తడవయ్యె వచ్చి యెక్కడఁ బోయెదరొ యంచు
        నుడువరి యై వారిఁ గడపి యుచిత


గీ.

మెడపి శివునిఁ గొల్వఁ గడఁగెద నని జాలిఁ
బడుట చేతివాని విడిచి కాలఁ
బడినవాని కాసపడినట్లు త్రిపురారి!
జడుని కేల భక్తిగడన దొరకు.

216


సీ.

ఉడురాజధరభక్తు లెడదవ్వులను రాఁగఁ
          బొడగని బిట్టుల్కిపడి సుఖాశ్రు
లెడతెగ కందందఁ గడకన్నులను జాఱఁ
          గడుసంభ్రమమునఁ గాల్దొడర నెదురు

నడచి పాదములపైఁ బడి తోడుకొని వచ్చి
         పొడవుగా నాసనం బిడుచు నునిచి
యడుగులు గడిగి యప్పుడు తగుసత్క్రియ
         లొడఁగూర్చి చిత్తంబుకడ యెఱింగి


గీ.

తొడరి యిష్టగోష్ఠియెడ మనం బలరించి
యడుగ కర్థిఁ దన్ను నిడుచు భక్తిఁ
బడయరాదు గాక మృడుచేతఁ ద్రిపురారి!
కడఁక నభిమతములు వడయు టరుదె?

217


శా.

విన్నం జాలుఁ దలంపు దీటుకొన సద్విధ్యుక్తులన్ భక్తులం
గన్నం జాలు నమస్కరించుచు సమగ్రప్రీతిమైఁ బక్షమై
యున్నంజాలు మనంబులోఁ గలిసి యింకొండేమి మీవాఁడనే
నన్నంజాలుఁ గృతార్థుఁడై చను ఖలుం డైనన్ సముద్యద్గుణా!

218


చ.

మలహరుభక్తుఁ డున్న నిజమందిర మారజతాద్రిలీలమై
నిలుచు పథంబు సత్పథము నిక్కము తొక్కినచోట్లు తీర్థముల్
పలికినపల్కు లన్నియును బ్రాతిగ నన్నిగమోక్తివాక్యముల్
తలఁచుతలంపు సూక్ష్మశివతత్త్వము భక్తజనాంఘ్రిశేఖరా!

219


సీ.

అసమాక్షభక్తుల నలవోకఁ జూచిన
        శంకించుఁ గర్మముల్ సక్కఁ జూడ
సోమాంకభక్తులతో మాటలాడిన
        స్రుక్కుఁ గాలుఁడు వారిదిక్కుఁ జూడ
మారారిభక్తులఁ జేరి వర్తించిన
       ఘోరసంసారంబు చేర వెఱచు

శంభుభక్తులపాదజలములు ద్రావిన
          తల్లిచన్నులపాలు ద్రావఁ దప్పు


గీ.

హరగణప్రసాద మర్థి భోగించిన
నితరభోగవాంఛవితతి యాఱు
ప్రాణలింగమథనభవ్య[108]జీవన్ముక్తి
కెనయువేఱుముక్తి గనఁగఁ గలదె?

220


ఉ.

జంగమభక్తిలింగపరిచర్యల మీఱుట యుత్తమంబు త
జ్జంగమలింగపూజ లది సామ్యము [109]సల్పుట మధ్యమంబు మున్
జంగమలింగపూజ యెడ సల్పుచు లింగముఁ గొల్చుచున్కి యె
న్నంగఁ గనిష్ఠ మౌట శరణప్రతిపత్తియె ముఖ్య మెమ్మెయిన్.

221


క.

లింగాభ్యర్చన లింగము
నంగమునకు, జంగమార్చనం బది మదిఁ దా
లింగంబు ప్రాణమునకు న
భంగుర మగుభక్తిచేత భక్తినిధానా!

222


క.

జంగమపరాఙ్ముఖుం డై
లింగార్చన సేయునతని లీల [110]దలంపన్
వెంగలియై శవమునకును
శృంగారము [111]సేయునట్లు శివభక్తినిధీ!

223


క.

అవిరళగురుకారుణ్య
ప్రవిమలశుద్ధప్రసాదపరిపూర్ణానం

దవివర్జితునకు జంగమ
సవిశేషార్చన మ దెట్లు సమకూరు మదిన్?

224

ఇష్టలింగార్పణవిధి

సీ.

వినియెడుశబ్దంబు కనియెడురూపు మూ
          ర్కొనుసౌరభంబు గైకొనురసంబు
ముట్టెడువస్తువుల్ మెట్టెడుఠావు చే
          పట్టుధనంబు పైఁ బెట్టుమనము
కట్టెడువస్త్రముల్ పట్టెడుశస్త్రముల్
          పెట్టుభూషణములు దట్టుసుఖము
డాయుసతులగోష్ఠి పూయులేపనములు
          పాయువిరోధముల్ సేయుక్రియలు


గీ.

వాహనాసనములు వాక్కాయకర్మాంగి
వర్తనములు ప్రాణవల్లభునకు
[112]నవధరింప నిచ్చి యవధరింపఁగఁ గోరు
నతఁడు సావధాని యగుప్రసాది.

225


క.

ముట్టఁ డనర్పితవస్తువు
ముట్టక యర్పింపరాదు మునుముట్టకయున్
ముట్టించి వెండి ముట్టెడు
నట్టివిచిత్రప్రసాది యనువే మరయన్.

226


క.

ఈవచ్చు నెల్లసుఖములు
భావింపఁగ జాగరతనె భావుకులకు స్వ
ప్నావస్థ నిచ్చి కొనుసౌ
ఖ్యావహుఁ డౌ భక్తిజాణఁ డమలినదేహా!

227

సీ.

ప్రాణేశునకుఁ దనప్రాణంబు వల్లభి
          సన్మనోభావంబు సజ్జపట్టు
చిత్తాగ్ర ముత్తుంగసింహాసనము హృద
         యాబ్జమధ్యంబు విహారభూమి
యింద్రియపంచకం బిలుపుట్టులెంకలు
         పురుషుఁ డ[113]య్యెడకాఁడు బుద్ధి మంత్రి
పంచవింశతిగుణప్రతతులు బంటులు
         దేహంబు వరవుడు ధృతియు గతియు


గీ.

సజ్జనోపచారసమితియే శృంగార
[114]ముఖనియోగభోగములుగఁ జేసి
యుభయమథనసుఖనియుక్తియే ముక్తిగాఁ
జనుప్రసాది నెట్లు సంస్తుతింప?

228


చ.

వరుని సుబుద్ధిమైఁ దగిలి వల్లభు నాత్మ[115]గుఱించి జీవితే
శ్వరుని మనంబులో నిలిపి స్వామి నొడం[116]బఱిపించి నాథు హృ
త్సరసిజమందు నిల్పి విభుసమ్మతి గూర్చి స్వతంత్రలింగముం
జిరమతిఁ బ్రాణసంగతునిఁ జేసి ప్రసాది మథించు[117]చుండుఁదాన్.

229


క.

సర్వద్రవ్యవితానము
శర్వార్పిత మైన యాప్రసాదం బది దాఁ
బూర్వంబుపేరఁ బల్కుట
సర్వాంగద్రోహ మది ప్రసాదం బగునే?

230


సీ.

అంగంబు లే దుత్తమాంగంబు గూడ నా
          పాదమస్తకమును బాహుసమితి

ముట్టియు నొక్కటి ముట్టలే దెమ్మెయి
          నడుగొత్తకున్నట్టు నడచు పథము
వక్త్రంబు నొకఁడు జిహ్వ యొకఁడు గైకొను
          రుచులను భోగించు ధృతి నొకండు
దృష్టి వారనిచూపు దృఢము సద్భావన
          దా లేక వర్తించుఁ దాన చొచ్చి


గీ.

కాలియున్న నులుక గగనంబుదీధితి
యింద్రధనువుభాతి యెట్టు లట్లు
పట్టు లేక యాడి బైలికి నాశ్రయం
బగుప్రసాదిమహిమఁ బొగడఁ దరమె?

231


సీ.

నడచుచోఁ బ్రాణేశునకు వాహనము, నిల్చు
         చోనీడ, గూర్చుండుచోట గద్దె,
పూజించుచో [118]సజ్జ, భుజియించుచోఁ బాత్ర,
         భజియించుచో శుద్ధభక్తిభాతి,
మెలఁగెడిచో సంబవులు, పవళించుచోఁ
         బాన్పు, నిద్రించుచోఁ బ్రాణపదము,
తలఁచుచోఁ జిత్తంబు, పలుకుచో నాలుక,
         సత్క్రియావ్యాప్తిచే జంత్రబొమ్మ,


గీ.

అవికలేంద్రియానుభవసుఖవ్యాప్తిచే
లింగి దాన యై యభంగలీల
సహజలింగమథనసంతతసుఖసుధా
శరధిమగ్నుఁ డై ప్రసాది యుండు.

232

సీ.

పుట్టియుఁ బుట్టక పుట్టు మహత్త్వంబు
         కలిగియుఁ గలుగక కలుగు గుణము
పాసియుఁ బాయక పాయు వివేకంబు
         చేసియుఁ జేయక చేయు బెడఁగు
ముట్టియు ముట్టక ముట్టించుఁ చతురత
         పొందియుఁ బొందక పొందు సుఖము
తలఁచియుఁ దలఁచక తలఁచెడు తత్త్వంబు
         మఱచియు మఱవక మఱచు పదము


గీ.

అజ్జ లేనినీడ యన లేనిశబ్దంబు
రెండు లేనిమొదలు నిండియున్న
యఱయుఁ బొరయు లేనియానందనీరధిఁ
దరుచు శరణునెళవు తరమె పొగడ?

233

చతుర్విధకందము

ప్రథమకందము

క.

శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపు
రారిం గొలువంగ [119]భవభయాదులఁ దెలియున్
దా రుద్రుఁ డైనత్రిపురవి
దారిం దలఁపంగఁ దలఁపు దా నై కలియున్.

234

ద్వితీయకందము

క.

కొలువంగ భవభయాదులఁ
దెలియుం దా రుద్రుఁ డైనత్రిపురవిదారిం
దలపంగఁ దలఁపు దా నై
కలియున్ శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపురారిన్.

235

తృతీయకందము

క.

తా రుద్రుఁ డైనత్రిపురవి
దారిం దలపంగఁ దలఁపు దా నై కలియున్
శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపు
రారిం గొలువంగ భవభయాదులఁ దెలియున్.

236

చతుర్థకందము

క.

తలఁపంగఁ దలఁపు దా నై
కలియున్ శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపురారిం
గొలువంగ భవభయాదులఁ
దెలియున్ దా రుద్రుఁ డైనత్రిపురవిదారిన్.

237

షట్స్థలవివరము

సీ.

సహజసజ్జనశివాచారనిర్లోభని
        యుక్తి జంగమభక్తి భక్తపదము
అంగగుణేతరలింగైకనిష్ఠాప
        రత్వంబు మాహేశ్వరస్థలంబు
సతతబాహ్యాంతరార్పితలింగవికచనా
        స్వాదనసుఖము ప్రసాదినెలవు
స్వప్రాణలింగలింగప్రాణమథనవి
        లీనాంతరము ప్రాణలింగిలీల


ఆ.

అసుఖలింగపరవశాన్యోన్యగర్భవి
స్ఫురణ నిత్యసత్యశరణపదము
తా ననంగ లేనితత్త్వంబు లింగైక్య
మివియ షట్స్థలంబు లీశ్వరాంశ!

238

తరువోజ.

బాలుండు ద్రావినపాలసారంబు
        పసరంబు కలగన్న పదపదార్థములు
కాలినయినుము [120]క్రాగఁగఁ బడ్డనీరు
        కపివరు దేహంబుగత మైనడొక్క
పోలంగఁ జచ్చిన బొందిశబ్దంబు
        భువిలో నపుంసకుపుత్త్రుచరిత్ర
తాలోష్ఠసంపుటార్థము గానిపదము
        తలఁపఁగ లింగైక్యతత్త్వంబుననువు.

239


క.

ఈవిధమున వేదపురా
ణావిష్కృతసారసూక్తులం దొనరింపం
గా విదితం బగునీ కృతి
భూవినుతం బగును భక్తిపూజ్యత వెలయున్.

240


క.

అసమగురులింగజంగమ
ప్రసాదభక్తస్థలములఁ బరిపూర్ణం బై
యెసఁగులసత్కావ్యము నీ
కసలార నభీష్టదాయి యగుఁ ద్రిపురారీ!

241


క.

శివ మస్తు భక్తినిత్యో
త్సవ మస్తు కుటుంబమిత్రసకలాశ్రితసం
భవపూర్తి రస్తు విభవో
ద్భవ మ[121]స్తలనీల కంఠుదయఁ గృతిపతికిన్.

242

తరువోజ.

నవరసాంచితభక్తి నానాప్రయుక్తి
         నలిఁ బాల్కుఱికి సోమనాథుండు సెప్పె
ప్రవిమలం బై యనుభవసార మనఁగ
         [122]భ్రాజిల్లు సద్భక్తిపరు లుత్సహింప
సవిశేషభక్తిమై సద్భక్తసభలఁ
         జదివిన విన్న నాసక్తి వ్రాసినను
గవితావిశేషంబు గారవించినను
         గరుణించు శివుఁడు మంగళమహాశ్రీలు.

243

————

  1. మహామహిమంబు వేఁడెదన్
  2. నిగూఢ
  3. కృతమై
  4. ప్రదు
  5. రహి "స ఏ వాగోచరం" బను
  6. అవ్యాప్త
  7. చని; చను.
  8. ఁదలంతున్
  9. దాన
  10. కారణ
  11. శరణ
  12. శిష్యుఁడు
  13. సంభవ
  14. గుణి
  15. సంగ
  16. విన్నవింతు
  17. ద్రవ్వక
  18. తదీయ
  19. సాజకా
  20. తత్త్వా
  21. కృతమును
  22. హంకృతి
  23. సమానంబునందు
  24. ప్రభాదీపస్యాయనోత్సవము
  25. మూల
  26. భక్తిని కాతొంట దాన
  27. పారీణులకున్.
  28. వదలని
  29. సేవించి
  30. ఢ్యునట్ల గా
  31. నురువడించె
  32. ఉరువడికి
  33. నేమానము
  34. వినుతి
  35. గలఁడు
  36. తను
  37. మానము నుడికిం
  38. పక్వము
  39. నియోక్తులు
  40. జెప్పఁగనట్లు
  41. నుసురులు
  42. నప్రస్తుతి యవాది
  43. పాదరి
  44. తాశ్రయా
  45. విధియుఁ దన్నును
  46. సంచలమతి ముక్కుచును జంతువిధంబున
  47. మదంబు
  48. దోష
  49. కవచము
  50. దంభకంబు
  51. యెన్నికునైనన్
  52. తానై నిను సద్భక్తుండును దక్క
  53. విడువఁగ
  54. పెంటగు
  55. భక్తి వాసల
  56. గలరె
  57. యందు
  58. మెయ్యరపుల
  59. పొరుగు
  60. శృంగారము
  61. వలయు కృషి వనేప వణిజకు
  62. సలుపుచు
  63. చెన్నటు నన్న
  64. నపశ్యంత" యనన్ వలదు మనం బలరారున్
  65. మది
  66. మది
  67. కాశ్రయనియ్యము గానివాని
  68. కృపాఢ్యుఁడు
  69. కార
  70. దే వినబఁడు శ్రుతులలోన ధీరసమానా!
  71. జన నొక
  72. దప్పదు యెట్లున్.
  73. పరమయోగ
  74. భవ్యసౌఖ్యయోగ
  75. త్రా
  76. మది దేశ
  77. మేళము లిచ్చి
  78. వ్యస్తలమున్.
  79. నంతకు సార్థ
  80. వాఁడు కాలమున్.
  81. యట యచరు పార్థి
  82. కలుషా
  83. దవగుణములు గలుగునె యెయిల వెలయగ నీర్రాశిలో నలంతయు గలదే.
  84. పూజ్య
  85. కొన్వనరు.
  86. నెట్టిదొ
  87. ముంచి
  88. ఘన
  89. సంస్పృష్ట
  90. హరతగద్బద్భ
  91. ప్రతిపాలుల్
  92. నిపతిత
  93. సుఖులు
  94. తతులు
  95. భువి
  96. కాల
  97. అరుదే
  98. భాగ్యా
  99. యచ్చుగ
  100. గుచ్చ
  101. యెక్కగ
  102. యే మగుటయు
  103. తలఁ పెఱుగమియున్
  104. గెలిపించి విడువఁబడుటయు
  105. నిడి వంచియున్నెడనెరి
  106. అరగంట
  107. యడర
  108. జనయు జీవన్ముక్తి కెనయుఁ గలదె
  109. సల్పక
  110. దలిర్పన్
  111. జేసి
  112. ననుభవింప నిచ్చి యనుభవింపఁగ నేర్చు
  113. య్యెడగర్ర
  114. ముగను యోగిభోగముఖ్యుఁ జేసి
  115. గురించి
  116. బరికించి
  117. చుండుతన్.
  118. సెజ్జ
  119. భవభయాదులు పొలియున్
  120. త్రాగఁగ
  121. మస్తు సునీల
  122. శివభక్తవరులు మించినవేడ్కఁ బొగడ