కోలంక శ్రీ మదనగోపాల శతకము
శ్రీకృష్ణ కేశవ చిన్మయానంద ము
కుంద గోవింద వైకుంఠవాస
దేవనారాయణ దేవదేవ యనంత
నరసింహ వామన గరుడగమన
క్షీరాబ్ధిశయన లక్ష్మీనాథ పుండరీ
కాక్ష హృషికేశ యాత్మరూప
మధుసూదన త్రివిక్రమ జనార్దన పురాణ
పురుష కౌస్తుభమణిభూషితాంగ
శంఖచక్రగదాఖడ్గసహితహస్త
పాహిమాం దేవ యని మిమ్ముఁ బ్రస్తుతింతు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
1
గురుతరగౌతమగోత్రపవిత్రుండ
ప్రధితవంకాయలపాటికులుఁడ
వేంకయమంత్రి సాధ్వీమణి కామమాం
బాగర్భవార్థిజైవాతృకుండ
గుండు వేంకటరామ కోవిద గురుదత్త
శుద్ధపంచాక్షరీసిద్ధియుతుఁడ
సకలలక్షణలక్ష్యసాహితీనిపుణుండ
శైవవైష్ణవసదాచారరతుఁడఁ
వేంకటాఖ్యుడ నే జగద్విదితముగను
శతక మొనగూర్తు త్వ త్సమర్పితముఁ గాఁగ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
2
దండంబు దోర్దండమండితకోదండ
దండంబు భూరిప్రతాపచండ
దండంబు పాలితార్తస్తుత్యవేదండ
దండంబు మునివరదానశౌండ
దండంబు దండితాతతనిశాచరకాండ
దండంబు వైరిరౌద్రప్రకాండ
దండంబు భక్తసంత్రాణమహోర్దండ
దండంబు బ్రహ్మాండధరపిచండ
దండమో పాపతిమిరమార్తాండ నీకు
ననుచు మ్రొక్కెద ననుబ్రోవు మయ్య వేగ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
3
......................................
శరణు జగద్దర్త శరణు శరణు
శరణు తాండవలీల శరణు పాండవపాల
శరణు పండితఖేల శరణు శరణు
శరణు శంకరపక్ష శరణు కింకరరక్ష
శరణు పంకరుహాక్ష శరణు శరణు
శరణు దయాసార శరణు జయాధార
శరణు నయాగార శరణు శరణు
శరణు వారణ వారణ శరణు శరణు
శరణు కారణ కారణ శరణు శరణు-
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
4
వీరాయ గోపికాజారాయ రుక్మిణి
దారాయ భవభయోత్తారణాయ
శూరాయ మునిజనధారాయ పరుణాప్ర
చారాయ సత్యప్రచారణాయ
ధీరాయ వార్థి గంభీరాయ సద్గుణ
వారాయ దురిత నివారణాయ
స్ఫారాయ ధృత జగద్భారాయ నవ సుకు
మారాయ కృతశత్రు మారణాయ
తే నమో యంచు వినుతించు ధీర మతులు
సిద్ధ సామ్రాజ్య లక్ష్మీచేఁ జెలగు చుండ్రు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
5
ముసిడి తుప్పలకుఁ గొప్పులు ద్రవ్వనేటికి
వట్టి నూతికి యొరల్ గట్ట నేల
గొడ్డుఁబోతుకు నొఱ్ఱ కొట్టు కాయం బేల
మాచకమ్మకు పైఁట మా టదేల
అంధురాలికి నిల్వుటద్ద మేటికి నపుం
సకున కొయ్యారంపుఁ జాన యేల
దొంగముండకు వ్రతోద్యోగ నిష్ఠ లవేల
జారకాంతకు సదాచార మేల
క్షుద్రగుణునకు సజ్జన గోష్ఠి యేల
మోటు కొయ్యకు మృదువైన మాట లేల
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
6
దురితాత్మునకు దేవ గురుపూజనం బేల
కర్ణ హీనునకుఁ జొకటు లవేల
జ్వరరోగ కృశునకు హరి చందనం బేల
పరమ లోభికి దాన పటిమ యేల
కర్మ బాహ్యునకు గంగా స్నానమేటికిఁ
గామాంధునకుఁ దపః కాంక్ష యేల
తిండిపోతుకు నిత్య దేవతార్చన లేల
వెట్టి వానికి స ద్వివేక మేల
మూర్ఖ జనునకు సతత ప్రమోద కరణ
సాధు సజ్జన గోష్ఠి ప్రసంగ మేల
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
7
కుళ్ళుతొత్తుకు గంధ కుసుమాగరు లవేల
గూదలంజకు జరీ కోక లేల
మొండి కట్టెకు ధర్మములు దెల్పఁగా నేల
సొట్ట వానికి నాట్యశోభ లేల
అంధురాలికి నయనాంత సంజ్ఞ లవేల
బోసి దానికిని దాంబూల మేల
పలు గుదండకు బతి భక్తి మార్గం బేల
చెడుగుముండకు నీతి జెప్పనేల
మూర్ఖ జనునకు బహుతరామోదకారి
సరసకవితావిచిత్ర వైఖరు లవేల
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
8
గుడిగూల్చి యిటకల కొట్టు గట్టినవాడు
చెట్టు కొట్టుటకు విక్షేప పడునె
తిన్న యింటికి ఘాత పన్నఁ జూచిన కౄరుఁ
డన్యాపకృతికి భీతాత్ముఁడగునె
చెలుల చుట్టంబులఁ జెరిపిన పాపాత్ముఁ
డొరుల మాపగఁ జింత నొందఁ గలడె
తనవారలకుఁ గీడు దలఁచిన నిర్దయుం
డితర బాధకు సంశయించఁ గలడె
తల్లి దండ్రుల హింసించు దారుణుండు
దుఃఖ పడగలఁడే గురు ద్రోహమునకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
9
తల్లి చెవుల్ ద్రెంచఁదలచిన మూర్ఖుండు
బినతల్లి చెవి దెంచ భీతి పడునె
తండ్రిని పస్తుంచి తా దిన్న దుర్మతి
యాకొన్న యతిథుల కన్న మిడునె
తమ్ముల పాలి విత్తమ్ము మ్రింగు ఖలుండు
పరధనంబుల కాస పడక యున్నె
తసయుల పట్ల మాత్సర్యమూను దురాత్ము
డన్య వైరము దోషమని తలఁచునె
నమ్మువారిని చెఱచు దుర్ణయపరుండు
యితరులను బాగుజేయ నూహింప గలడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
10
పైతృకంబున రాత్రి భక్షించు చపలుండు
నుపవాసములు నిష్ఠనుండఁ గలడె
యిలు వెడలంగఁ దావనలయు మూలుగుఁటోఁతు
తీర్థయాత్రాసక్తిఁ దిరుగఁ గలఁడె
గ్రహణ కాలమున మున్గని మందుఁ డనిశంబు
వేడ్క ప్రాత స్స్నాన విధికి జనునె
బాపఁడి కొక స్వయంపాక మియ్యని లోభి
నిత్యాన్న సత్త్రంబు నిలుపఁ గలఁడె
తనదు పెండ్లాము నదిమి దీర్పని జడుండు
దివిరి మఱపండ్రఁ గోడండ్ర దీర్పఁగలఁడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
11
పిడికెడు బిచ్చంబుఁ బెట్టజాలని దాత
యిష్టార్థ సంసిద్ధు లివ్వఁగలఁడె
చేని గట్టే దాటలేని గుఱ్ఱము వైరి
గిరి దుర్గములకు లంఘించగలదె
యూరబందికి భీతినొంది పారిన బంటు
దాడి బెబ్బులుల వేటాడ గలఁడె
కొలుచువారికి జీతములు నొసంగని దొర
యర్థుల బిలిచి వెయ్యారు లిడునె
బట్టు బొగడిన నొకపూట బత్తెమిడని
యతినికృష్టుఁడు సత్కృతుఁలందగలడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
12
అప్పిచ్చి యిమ్మని యడుగునాత డధర్ముఁ
డెగదొబ్బునాతఁడు తగవు పెద్ద
అడ్డుండి తప్పించు మనువాడు కఠినుండు
తంటాలు బెట్టునాతఁడు సాధు
వెరువిచ్చి యడిగిన నరుడు దుర్మార్గుఁడు
నమ్ముకుతిన్న వాఁడార్యవరుఁడు
దాఁచనిచ్చిన సొమ్ముఁ దలచువాఁ డవివేకి
లేదు పొమ్మనువాఁడు వేదవేత్త
యనుచు తీర్పులు చేసిన యట్టి మూఢుఁ
లంతకన్నను గుణవంతు లవనిలోన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
13
తనదు దరిద్రత్వమునకు నేడ్వఁగనేల
యితర సంపద తా సహించలేక
తన యాలు ఱంకుఁబోయినఁ గృశింపఁగనేల
తా నన్యసతి పొందు మానలేక
తనదు శత్రు లసౌధ్యులని చింత వడనేల
యొరుల మాపంగఁ దా నుడుగలేక
తనపుత్రు లవగుణులని మొత్తుకోనేల
యొకరి బిడ్డలనీతి కోర్వలేక
యెఱుఁగ నేరని మూఢుల కేమిజెప్ప
దీనికి ఫలంబు మీఁదను గానవచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
14
తన తాత నిరతాన్న దాతయం చననేల
ముసలామె యూళ్ళంట ముష్టియెత్త
తన తండ్రిగారు సద్ర్వత నిష్ఠుఁడననేల
తల్లి బల్ జారవర్తనలు సేయ
తనదు భార్యను వరగుణవతి యననేల
కూఁతురు తలవంపురీతి నడువ
తనవారలంత సద్ధర్మాత్ము లననేల
చెల్లెండ్రు చౌర్యముల్ సేయుచున్న
తాను తీర్పరినని యభిమాన మేల
కొడుకు నొకమూలఁ దెరవాట్లు గొట్టుచున్న
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
15
అప్పు పుచ్చుకొని లేదను మొండి కొయ్యకుఁ
బత్రంబు చించుకో భార మగునె
గురుజన ద్రవ్యాపహరణశీలున కన్య
ధనము హరింప సంతాప మగునె
తల్లిదండ్రులను బాధల బెట్టు క్రూర చి
త్తునకు బాంధవపీడ దోష మగునె
పాలించు ప్రభువు కపాయమెంచు దురాత్ము
నకు మిత్రఘాత మన్యాయ మగునె
తనయు పత్నిని రమియించు దారుణునకు
పరసతీసంగమాసక్తి పాప మగునె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
18
పుత్రికకే నల్లపూసఁ బెట్టనిమామ
గా రల్లునకు రత్నహార మిడునె
పెనిమిటికే కూడుఁ బెట్టని యిల్లాలు
శ్రితబంధులకు విందు సేయఁగలదె
తన తల్లిపట్లనె తప్పిన మూర్ఖు బిం
తల్లి యాజ్ఞరీతి మళ్ళఁగలడె
తమ్ములకే కీడు తలచెడు పాపాత్ముఁ
డొకరి బాగుకుఁ జింత యుంచఁగలడె
యిట్టి దుర్మార్గవర్తుల కెవరు చెప్పఁ
గలరు యమరాజు నొకఁడు దక్కంగ జగతి
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
17
తల్లిని వేరుంచి తమ్ముల విడఁదోలి
అక్కచెల్లెండ్ర సొ మ్మపహరించి
బంధువులను తృణప్రాయంబుగా నెంచి
యొరుల మాపగ మది నూహఁ జేసి
తనకన్నఁ దెలిసిన జనుఁ డెవ్వఁడని క్రొవ్వి
యించుకంతయు ధర్మ మెఱుగకుండి
లోపు బహు దురాలోచనంబులు జేసి
పైకి నీతులుఁ బెక్కు బలుకు చుండి
బుధులకొక కీడు సేయంగఁ బూనఁ జూచు
నిట్టి పురుషాధముని జన్మ మెందుకొఱకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
18
పరజన ద్రవ్యాపహరణత్వ మొక్కటి
అన్యసతి సంగమాప్తి యొకటి
పితృమాతృ సచ్ఛక్తి విముఖత్వ మొక్కటి
యాశ్రితజన పరిత్యాగ మొకటి
సాధు సజ్జన బంధుజన దూష్య మొక్కటి
స్వామి నిందాపరభావ మొకటి
వివిధ పండితవర్గ విద్వేష మొక్కటి
మిత్ర ఘాతృత్వ ప్రమేయ మొకటి
యిన్నియును గల్గి నర్తించుచున్న మోట
కొయ్యల కొకళ్ళు తీర్పులు చెయ్యగలరె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
19
తనవారు తలవంపుపనులు జేయసహించుఁ
బరులు చేసిన తప్పుపట్టఁ జూచు
దనయింటిలో కానిపని కమ్ముకో జూచుఁ
బొరిగింటి పని రవ్వపరుపఁదలఁచుఁ
దన పుత్త్రి జారవర్తన మాటుఁపడఁ జేయు
పరుల బిడ్డల ఱంకు బయలఁబెట్టు
తనదు చెల్లెలిదొంగతనము లోన వడంచు
లాఁతి వారైన హేళన మొనర్చు
యిట్టి దుర్మార్గులకు యమపట్టణమున
దీనికి ఫలంబు తథ్యమైఁగాన వచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
20
వ్యాఘ్రంబు లేళ్ళజంపక మళ్ళిపోవునె
పిల్లిమానునె కోడిపిల్ల బట్టఁ
దోఁడేలు మేఁకల దునుమాడకుండునె
పెనుఁబాము గప్పల దినకయున్నె
కొంగ చేపల గళుక్కున మ్రింగకుండునె
డేఁగ గువ్వలను పీడింపకున్నె
దుంత గుఱ్ఱములకు దొడరికొట్టక యున్నె
కాకిఁ గోరలఁదన్ని కఱువకున్నె
ఖలుఁడు సజ్జనులకుఁ గీడు దలఁపకున్నె
కూడదని యెందఱన్న నీక్షోణియందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
21
చూలింతరా లని తేలు మన్నించునె
ముసలిగోవని కాకి మొక్కులిడునె
ఫలవృక్షమని కదల్పకపోవునే గాడ్పు
భూసురుండని పులి పూజ లిడునె
పలుకు చిల్కని పిల్లి తలచి యూరకయున్నె
యీను చే నని మళ్ళి యెద్దు జనునె
ప్రజల బాధించు దుష్టవర్తనుఁ డొకండు
సుజనునకుఁ గీడు సేయంగఁజూడకున్నె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
22
కంటిలోపల పెద్దకాయ గాచినలాగు
కడుపులోపల బల్ల బొడిమి నట్లు
సరములపై గొప్పకురుపు పుట్టిన మాడ్కి
పెడతలనొక కంతె పెరిగినట్లు
కాలిలోపల కొఱ్ఱు గట్టిగా దిగి నట్లు
పొట్టలోపల శూల బొడిచి నట్లు
మూత్రరంధ్రములోన ముల్లు నాటిన యట్లు
గూఁబలోపల పుర్వుగొఱికి నట్లు
చెడుగు కొడు కొక్కరుఁడు బుట్టి చెడ్డహాని
వాని తలిదండ్రులకు సేయు వసుధ యందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
23
ప్రబల శత్రువుల...దెంచఁబోలేఁడు
బీదలఁ జంపంగ పెద్దమెకము
యెదిరించువారి నదేరా యనఁగలేడు
బుధుల మార్కొనఁ బెద్ద పోట్లగిత్త
తన్న వచ్చినవారి దరిఁజేరఁగా లేఁడు
సాధుల పైకి విస్తార బలుఁడు
తనయిల్లు పుచ్చుకోఁ దలచువారికి మ్రొక్కు
బరుల మాపఁగ బహూపాయవేత్త
హరిహరీ! యిట్టి పాపాత్ము లవనిలోన
మన్నుచున్నార లేమని విన్నవింతు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
24
వీరు పెద్ద లటంచు వీరు బంధువులంచు
వీరు సజ్జను లటంచు వీరు గురువు
లంచును వీరు ధరామరోత్తము లంచు
వీరు యోగ్యు లటంచు వీరు సుకవు
లంచును వీర లాచార్యులంచును వీరు
విద్వాంసు లంచును వీరు సద్వి
చారు లంచును వీరు సదమలాత్ములటంచు
వీరు పూజార్హ ప్రచారు లంచు
నించుకంతయు మదిలోఁ దలచఁబోడు
దుండగంబునఁ బలుగాకి మొండికొయ్య
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
25
పులిని జంపఁగ నక్కపోతు గాచినలాగు
జలధి యీదఁగఁ గుక్క జరుగు పగిది
గరుడుని గఱవ నీర్కట్టె పొంచిన మాడ్కి
కొండ ద్రోయఁగ గొఱ్ఱె కుదురు రీతి
దంతితోఁ బెనగంగ దుంత బోయినమాడ్కి
వృషభ మడ్డఁగఁ బిల్లి యెగిరి నట్లు
కాలసర్పము మ్రింగఁ గప్ప జూచిన రీతి
దీపమార్పఁగ నీఁగ దిరుగు భాతి
ధరణి నధమాధముం డొక్క నరుఁడు క్రొవ్వి
గొప్పవారలతో నెదుర్కొనఁ దలంచు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
26
ధర్మంబు వీసమంతయుఁ దల్పఁగా నాస్తి
దాన మన్నది కలలోన సున్న
అర్థపాలనము రవంతగానఁ గవట్టిఁ
సత్య వాక్యంబు లేశంబు లేమి
కారుణ్య భావంబు గోరంతయునుఁ గల్ల
శమద మాసక్తి కొంచెము హుళుక్కి
స్నాన సంధ్యాద్యనుష్ఠాన కర్మం బిల్ల
శైవ వైష్ణవభక్తి త్రోవజబ్బు
యిట్టి మూఢులఁ బుట్టించి నట్టి బ్రహ్మ
ననఁగవలె గాక వీండ్రఁ దిట్టను బనేమి
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
27
అన్యాపకృతి వాని కాధారభూతంబు
దుర్బుద్ధి వానికిఁ దోఁడునీడ
దారుణత్వము వాని తలపై కిరీటంబు
పరదూషణము వాని పంట చేను
అన్యాయవృత్తి వీడభ్యసించిన విద్య
బంధు వైరము వాని పట్టుకొమ్మ
ప్రాణి హింసాకర్మ వాని నిత్య జపంబు
పాప శీలము వాని పాలి సొమ్ము
అనుచు లోకుల తన్నాడుకొనుచు నుండ
బ్రతుకు మనుజునికన్న గౌరభము మేలు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
28
మహితోపకార ధర్మము వహించడు గాని
యసహాయ శూరుఁ డన్యాపకృతికి
సముచిత శాస్త్ర చర్చ సేయఁడుఁ గాని
మూర్ఖ వాదములకు మొదటి చెయ్యి
పుణ్య కార్యారంభ బుద్ధి గాంచఁడు గాని
పాప కర్మకు మత స్థాపకుండు
పరలోక చింతఁ దల్పఁడు ప్రాణి హిం
సాకర్మయందు నిష్ఠాగరిష్ఠుఁ
డనుచు భూజను లిట్లు దన్నాడు కొనఁగఁ
నుండు మనుజుండు జీవన్మృతుండు గాఁడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
29
పృథు శౌర్యమున్నఁ జూపింపగావలె శత్రు
సేనలపైకి వేంచేయు నాఁడు
దృఢ విద్య యవ్న వాదింపఁగావలె మహా
రాజ ధీర సభాంతరాళమునను
వర కవిత్వంబున్న బ్రకటింపవలే ద్రోహ
కారి మూర్ఖుల దిట్టు కాల మందు
అమిత ధైర్యం బున్న నగుపింపవలె మహా
ఘన విపద్దశ ప్రాప్త కాల మందు
నగుపఱుపకున్నఁ జచ్చు పీనుఁగులు గాక
వీరలోక పూజ్యులా పృథివీ స్థలమున
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
30
జారుఁడై దుష్ట ప్రచారుఁడై పాపవి
చారుఁడై బహు దురాచారుఁడగుచు
హీనుఁడై మూర్ఖ సంతానుఁడై త్యక్తాభి
మానుఁడై నిరతాప్రమాణుఁడగుచు
దుష్టుఁడై సజ్జన కష్టుఁడై కోప సం
దష్టుఁడై నిజకుల భ్రష్టుఁడగుచుఁ
గ్రోధియై బంధు విరోధియై బహుజన
బాధియై భుధమనో వ్యాధి యగుచుఁ
బరగుచున్నట్టి నిర్భాగ్యవరుఁడు తనదు
పాట్ల నిక్కడ యగునె యా పయిని గాక
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
31
యేపి నందలము పైకెక్కించినను గ్రింది
కురువడి పుల్లెల కురుక కున్నె
పిల్లిని గద్దియఁ బెట్టి పూజించిన
నుచ్ఛిష్ట భక్షణం బుడుగఁగలదె
బలు చక్కెరల యుక్కెరలఁ గాకిఁ బెంచిన
కారుకూఁతలు గూయఁ గణఁగకున్నె
దున్నపోతుకు నెన్ని వన్నెలు దిద్దిన
బురద గోతులలోనఁ బొరలకున్నె
నీచ మనుజుని బుధులు మన్నించి పేరఁ
బిలిచినను వాని గుణము జూపింప కున్నె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
32
కలిగిన మాత్ర మర్థుల కొసంగని వాఁడు
నొరుల కల్మికి దుఃఖ మొందు వాఁడు
సంతత దుర్ణయాచారుఁడై దగు వాఁడు
పరుల బాధింపఁ బాల్పడెడు వాఁడు
తమ్ముల జెరుప యత్నము దలంచెడు వాడు
బుధులలో వైరంబుఁ బూను వాఁడు
పదుగురు కాదన్న పనులు జేసెడి వాఁడు
పరధనంబుల కాసపడెడు వాడు
సుకవి జనములతోఁ జొరఁ జూచు వాఁడు
దుర్గతిని జెందు నిహపర దూరుఁడగుచు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
33
పరువుపాడై జను పౌరుష మణగారు
కులము గోదావరి కూల జరుగు
మహిమ మర్యాదలు మంటిలో గలియును
చదువులు సంధ్యలు చట్టువారు
ప్రజ్ఞలు బుద్ధులు పరలోక మేగును
గొప్పలు కీర్తులు తుప్పలెక్కు
ధర్మ మార్గము నీతి నిర్మూలమైయుండు
సకల ప్రతిష్ఠలు సన్నగిల్లు
వంశమందున నొక పాప వర్తనుండు
బుట్టుటను జేసి బుధుల కీ భూమియందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
34
గడియ లోపల పెక్కు కల్లలాడఁగ వచ్చు
నాడిన మాట లేదనఁగ వచ్చు
అప్పుల నెగదొబ్బి చెప్పుకొమ్మనవచ్చు
జుట్టలఁ జుల్కగాఁ జూడవచ్చు
తనవాడనక బాధలను బెట్టగా వచ్చు
మిత్రఘాతకవృత్తి మెలఁగ వచ్చు
నొరుల కొంపల మాప నూహ సేయఁగవచ్చు
తనయులనైనఁ బోఁదరమ వచ్చుఁ
గాని యమలోక బాధ యొక్కటియుఁ గడుపఁ
గఠినచిత్తుల కది చేతఁగాదు సుమ్ము
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
35
వ్రాసిన వ్రాతదా వ్రాయలేదన వచ్చుఁ
దప్పుజేసుక లోన దాఁచ వచ్చు
నీతిఁ దెల్పఁగఁబోయి బూతులాడఁగ వచ్చు
పెద్దలు కాదన్నఁ బెనఁగవచ్చు
నింటికేఁగిన వారి నెదిరికొట్టఁగవచ్చు
గానికూటికి నొడిగట్టవచ్చు
పలుగుకొయ్యలమాట పాటి సేయఁగ వచ్చు
బుధులవాక్యము త్రోసిపుచ్చ వచ్చుఁ
గాని క్రూరులు యమభటఘనగదాభి
హతుల బాల్గాక యుండ శక్యంబె తమకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
36
తల్లి బందెలమారి తండ్రి యప్పులముచ్చు
జ్ఞాతి బహుద్వేషి భ్రాత కోపి
మరదలు బహుదండి మామగా రవివేకి
యత్త దుర్గుణ గణాయత్త బావ
మరిఁది తంతరగొట్టుమనిషి కోడలు మంకు
భార్య గయ్యాళి నిర్భాగ్యురాలు
చెల్లెలు గడుదొంగ యల్లుఁడుకూళ పు
త్రుడు దుర్జయుండు కూఁతురు పిసాళి
అందరికి పెద్ద దుర్మార్గుఁడరయ తాను
యట్టి పురుషాధముని జన్మ మెందు కొఱకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
37
కన్నగానికి జూదగాఁడు మిత్రుఁడు మద్య
పానవృత్తికిఁ కులభ్రష్టు గురువు
పరమలోభికి మలభక్షకుం డధిపతి
గుణహీనునకుఁ బల్గుకొయ్య తండ్రి
ధర్మశూన్యునకుఁ గృతఘ్నుండు చుట్టంబు
మొండివానికి దుర్జయుఁడు కొడుకు
కర్మబాహ్యునకు సంకరకులుం డాప్తుండు
దొంగముండకు లంజ తోడునీడ
యగుచు నన్యోన్య సంబంధ మమరియున్న
యట్టి వారలె సిరిగాంచిరీ ధరిత్రి
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
38
తండ్రి దూషించి పెద్దల నుతింపఁగనేల
తమ్ములఁ జెరిపి సద్ధర్మమేల
తల్లిని దన్ని బాంధవ పూజనం బేల
మిత్రుని విడిచి పై మేళ్ళవేల
గురుని నిందించి భూసురుల వేఁడఁగ నేల
బిడ్డనమ్మి యొకండ్రఁ బెంచనేల
యాశ్రితు నటు దోలి యర్థి రక్షణమేల
పెనిమిటి దిట్టు దైవనుతియేల
యెఱుఁగ నేరని మూఢులకేమి చెప్పఁ
దెలియఁబడవచ్చు యమసభాస్థలము నందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
39
ఊళ్ళు దోఁచుక రాతిగుళ్ళు గట్టఁగనేల
యిళ్ళు బుచ్చుక తోఁట లేయనేల
ప్రజలఁ బీడించి ధర్మము సేయఁగా నేల
దార్లుగొట్టి సువర్ణదాన మేల
మాన్యముల్ కబళించి సుఖము సేయఁగ నేల
సాధులఁ జెరిపి పై శాంతు లేల
బుధుల సొమ్ము హరించి భూరి యివ్వఁగనేల
పురములు గూల్చి గోపురము లేల
యిందుకు ఫలంబు దేహాంతమందె తమకు
నెఱుఁక బడుగాక కూళల కేల చెప్ప
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
40
బురదగోతుల లోనఁ బొరలాడు దుంతకు
సారచందన గంధ చర్చయేల
పరగళ్ళ వెంబడి తిరుగు గాడిదికి వి
శాల మందిర నివాసంబు లేల
బయల పుల్లెలు నాకి బ్రతికెడు కుక్కకు
సరసాన్న భక్ష్య భక్షణము లేల
యడవుల చెట్టెక్కి యాడు కోతికి రత్న
సౌధాగ్రసీమ సంచార మేల
మూర్ఖ జనులకు సతత ప్రమోదకరణ
సాధు సజ్జన గోష్ఠి ప్రసంగ మేల
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
41
పదుగురు మెచ్చి శాబాసు నన్నది మాట
వడి మృగంబుల జిక్కువడిన మీట
వ్యాఘ్రసింహముల సుక్కణగించునది వేఁట
యఖిల ఫలోత్కీర్ణమైన తోఁట
నిండుగా బహుజను లుండునదే పేట
యిల్లాలు గల్గుట యింటి తేట
పరులచే సాఫంపఁ బడక యున్నదె కోట
పది మంది నడచు చున్నదియ బాట
విన్న వారికి హృద్యమై యున్న వాట
కన్న వారికిఁ జిత్రమై యున్న నాట
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
42
కలిమెంత గలిగిన దొలఁగ వాపత్తులు
తమ రెన్ని విధములఁ దన్నుకొన్న
తపమెంత గలిగిన తప్పదు కర్మంబు
తోఁచక తమరెంత దుఃఖ పడిన
చదువెంత గలిగిన వదలదు దారిద్ర్య
మూరకె తమ రెన్ని యూళ్ళుఁ జనిన
బలమెంత గలిగిన బాయవు వ్యాధులు
తమరు నెన్నో యుపాయముల నున్న
యనుభవంబులు దప్పించు కొనఁగ శక్తి
గల్గునే స్వామి నీ యనుగ్రహము దక్క
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
43
కలిమెంత యున్న బీదలఁదెప్పగా వద్దు
విద్య యెంతున్న గద్దింప వలదు
ధనమెంత యున్న మత్తత వహింపఁగ వద్దు
దొరతనం బెంతున్న త్రుళ్ళ వద్దు
వీర్యం బదెంతున్న విఱ్ఱవీఁగఁగ వద్దు
తపమెంత యున్న క్రోధింప వలదు
బలమెంతయున్న దుర్బలు నదెంతన వద్దు
ప్రజ్ఞ లెన్నున్నఁ జెప్పంగ వలదు
సాటిఁజెప్పిన యీమాట పాటి జేసి
యున్న మనుజులు బహుకీర్తి నొంద గలరు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
44
పరవంచనా బుద్ధి పాటిసేయఁగ వద్దు
విబుధులతో గోష్ఠి విడువ వద్దు
ఉపకారి కపకార మూహ సేయఁగ వద్దు
అన్యుల నిందోక్తు లాఁడవద్దు
పెద్దలు తగవుజెప్పినఁ ద్రోయగా వద్దు
పరుల బాగుకుఁ జింతపడఁగ వద్దు
పలుగు కొయ్యలను జేపట్టి యుండఁగ వద్దు
శివవిష్ణు దూషణల్ సేయ వద్దు
ఇది యెఱుంగని కూళల కేల చెప్పఁ
తెలియఁబడవచ్చు యమ సభాస్థలము నందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
45
అత్మకన్యా విక్రయాసక్తునకు మత
దూషకుండగు కూకుదుండు దలఁప
పదయుగ క్షాళనాభావభోజికి దురా
చారుడై తగు శిరస్నాన రతుఁడు
విప్రవర్గ క్షేత్ర విత్తహారికి యప
రాధియౌ నగ్రహార ప్రదాత
సతత సంధ్యాకర్మ సంత్యక్తునకు మహా
శఠుఁడునౌ యజ్ఞదీక్షాపరుండు
అహహ యీ కలికాల మహాత్మ్య మరయ
వింతయైఁ దోఁచెఁగద ధరాభ్యంతరమును
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
46
రణభీరునకు దారుణ చర్యుఁడై తోచు
ప్రబల సంగ్రామ ప్రవర్తకుండు
ననృత భాషికి ససహ్యాలాపుఁడై యుండు
ఘనతర సత్యవాక్య వ్రతుండు
జడమానసునకుఁ బ్రేలుడి గాయవలెనుండు
సరస తర్కోక్తి ప్రసంగశాలి
పాపకారికి దుష్ట భావనుఁడై తగు
పుణ్యకార్యారంభ బుద్ధిచరితుఁ
డహహ యీ యుగధర్మంబు లరయఁదరమె
యిట్టి కుమతులె సుజనుల నెన్నుచుండ్రు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
47
చందన గంథంబు చర్చ సేయుట దొడ్డె
బురద దాల్పదె దున్నపోతు మేన
బంగరు తగటి దుప్పటి గప్పగొప్పౌనే
గంగిరెద్దుకు లేదె రంగుబొంత
రమణీయ రత్నహారముఁ దాల్చ యొకనీటె
వేసగానికి లేవె వింతపేర్లు
ఘనతరంబగు సొమ్ము గణియించప్రతిభౌనె
వారకాంతకు లేదె భూరిధనము
వైభవంబున కవి గావు వరుస లరయ
అమిత దాసయశః ప్రతాపములుగాని
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
48
కన్నబిడ్డల జంపగడఁగఁ జూచినయది
తల్లి గా దొక విషవల్లిగాని
తలిదండ్రులకు హానిఁగలుగజేసినవాఁడు
కొడుకుగాడొక పెద్దపడుకుగాని
తనయుల నందందఁ దరమికొట్టెడివాఁడు
తాతగాఁడొక యమదూతగాని
తమ్ములఁ జెఱుప యత్నమ్ము జేసెడివాఁడు
నన్నగాఁడొక మోట దున్నగాని
తనదు దాయాదులను బ్రోవఁదలఁపఁడేని
నరుడు గాఁడతఁడు వానరుఁడుగాని
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
49
కాయంబు మృదుగతి కఁకటి యెఱుఁగునే
పుష్పవాసన చీడపుర్వు గనునె
పాయసరుచి తెడ్డుబద్ద గ్రహించునె
తేనెతీపిని సిద్ది తెలియఁగలదె
సాన చందనగంధ సౌరభ్య మెఱుఁగునె
సూత్రంబు మౌక్తిక శుద్ధి గనునె
జలము మహాత్మ్యంబు దెలియనేర్చునె కప్ప
అడవి యోషధిసత్వ మరయఁగలదె
తులువమానిసి పెద్దలఁ గలసియున్న
గాని వారి గుణంబులుఁ గాంచగలడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
50
ఎలుకలఁజంపి పిల్లులకుఁ బెట్టించి గు
వ్వల దునుమాడి సాళ్వముల కొసగి
కప్పలబట్టి నీర్కట్టెల కొప్పించి
లేళ్ళ ఖండించి తోడేళ్ళ కిచ్చి
బలు దుప్పులను ద్రుంచి పులుల ముందటఁబెట్టి
బక్కల నక్కల పాలు చేసి
ఫలవృక్షవనము కట్టెల క్రింద జూరిచ్చి
పొట్టచేల్కోసి యాబోతుమేపి
వట్టి తమవంటి ధర్మాత్ము లవనిలోన
గలరెయని మోటుకొయ్యలుఁ బలుకు చుంద్రు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
51
గడుపిశాచమురీతి నెడపక భక్షించి
గ్రామ సూకర మట్లుఁ గడుపు పెంచి
గాడిదె యికిలించు గతిని పళ్ళికిలించి
గొప్ప యాఁబోతులాగున మదించి
ముదికోఁతి లాగున మొకము బిడాయించి
వరఁడు పోలికె యిక్కువలు గవించి
దున్న చొప్పున పెద్ద పిన్నల దొలగించి
తలపుచ్చు శునకంబువలె వరించి
మించి తాఁబెద్దనంచు గర్వించియున్న
హీనునకుఁ గీర్తి గల్గునా యెంచిచూడ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
52
కౌటిల్య మెక్కువ కార్పణ్య మధికంబు
మాత్సర మురవు దుర్మదము తరుచు
కోపంబుగాటంబు క్రూరత్వము ఘనంబు
గర్వంబులావు ముష్కరత దొడ్డ
దారుణత్వము పెల్లు దౌర్జన్య మతిగొప్ప
జారత్వ మెచ్చు దౌష్ట్యంబు పెక్కు
చాంచల్యగుణము విస్తారంబు చాపల్య
మతిమాత్ర మన్యాయగతి సమృద్ధి
గలిగి వర్తించు పాపచిత్తులు హసించి
యెగ్గులెన్నుదు రార్యుల సిగ్గుమాని
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
53
సదమల స్తుత్యవంశమునకు దౌర్జన్య
కారిహీనుని బెద్దగా నమర్చి
సంతత సాధు నిశ్చల పుణ్యవర్తికిఁ
బలుగు గయ్యాళిని భార్యగూర్చి
బహుధర్మ కీర్తితత్పరునకు దుర్ణయా
కరు మూర్ఖుఁదనయునిగా నొనర్చి
సరస సౌందర్య లక్షణ కళావతికి ము
ష్కరకురూపుని భర్తగాఁ గుదిర్చి
ఆబ్జభవుఁడు తదీయపూజ్యత్వ మెల్లఁ
బనికి రానియ్యఁడది యేమి పాప మొక్కొ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
54
కొండంత విత్తంబుఁగూడఁ బెట్టిన నేమి
దానహీనుండైన మానవుండు
నిఖిల విద్యాధ్యాస నిపుణుఁడైనను నేమి
యమిత దుర్గర్వాంధుఁడైన మనుజుఁ
డురుతర సంపత్తు లొదవియుండిన నేమి
దీనరక్షాశూన్యుఁడైన జనుఁడు
బహుకాల మాయువు బడసి యుండిన నేమి
యపకీర్తి భాజనుండైన నరుఁడు
యిట్టివారల గొప్పల నెన్నుచున్న
పురుషు నవివేక మెంతనిఁ బొగడవచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
55
చతురంగ బల సముధ్ధతిని గ్రాలిననేమి
యాపన్నరక్ష సేయని నికృష్టుఁ
డిద్ధరాతల మంత నేలుచుండిన నేమి
బుధులఁ బోషించని మూర్ఖ చిత్తుఁ
డన్య దేశంబులు నాక్రమించిన నేమి
ప్రజయార్తి వాపి బ్రోవని ఖలుండు
బిరుదు బెక్కెంబులు పెక్కు పూనిన నేమి
శరణాగతులను బెంచని దురాత్ముఁ
డిట్టివారల సౌభాగ్య మెంచుకొఱకు
వీరిఁ గొనియాడఁ బోఁ డపస్మారి గాని
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
56
ప్రభునాజ్ఞ కొలఁదియే ప్రజలమర్యాదలు
పతిశిక్ష కొలఁదియే సతిగుణమ్ము
భాగ్యంబు కొలఁదియే బంధు సన్మానంబు
పిండి కొలందియే దేహపుష్టి
మాత తీర్పు కొలంది కూతురు నడవళ్ళు
నేల మంచి కొలంది చేలపంట
గురుబోధనా ప్రౌఢికొలఁది శిష్యుల తెల్వి
తండ్రి నీతికొలఁది తనయువృత్తి
గాని యెక్కువ తృణమంత గలుగఁబోదు
తోఁచ కూఱకె చింతించి దుఃఖపడిన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
57
తిండిపోతుకుఁ గూటి కుండ యందునె భ్రాంతి
దురితాత్మునకు గురుద్రోహ చింత
కామాతురున కన్యకాంతా రతాసక్తి
పలుగు కొయ్యకుఁ గాని పనుల తలఁపు
పాపకారికి సజ్జనాపకార విచార
మతిహీనగుణుకి నీచానురకి
క్రూర చిత్తునకు సద్గోష్ఠి జన ద్వేష
మతి ధనాకాంక్షి కన్యాయబుద్ధి
బాయవెప్పుడు వారల పాలికర్మ
మెట్టిదేయొకాని యెఱుఁగరా దెవరికైన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
58
దుర్బుద్ధి బలువైనఁ దొలగును సంపత్తి
కృపణత్వ మొదవినఁ గిర్తి మళ్ళు
నన్యాయ మెచ్చిన నధికార మూడును
మదముదట్టినఁ జను మార్దవంబు
జారత్వ మెచ్చిన సన్నగిలు ప్రతిష్ఠ
కుటిలత్య మురువైన గొప్ప చెడును
గర్వంబు తరుచైన గౌరవంబుఁ దొలంగు
ద్రవ్యాశ పెల్లైన ధర్మ ముడుగు
యివి యెఱుంగక వర్తించు హీనజనులు
పనికి రాకుండుదురు గడ్డి పరకకైన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
59
ప్రభువు దుర్ణయుఁడైన ప్రజలు చేసిన కర్మ
పతి విరక్తుండైన భార్య కర్మ
అర్థాధికుఁడు లోభియైన నర్థుల కర్మ
కరణము చెడుగైన కాపు కర్మ
తండ్రి కుత్సితుఁడైన తనయవర్గము కర్మ
తల్లి నిర్దయయైన పిల్ల కర్మ
క్షితి చిక్కఁదేరిన చేని యాతని కర్మ
కుటిలుఁడైన నరుండు కులము కర్మ
గానివారల దుష్కర్మ గాదు తలఁప
నెఱుఁగనేరక వారి నెగ్గెన్న రాదు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
60
కవిజనంబుల కుపద్రవముఁ దల్చుట ముప్పు
బలవంతుతో వైరపడుట ముప్పు
దేశాధిపతిని నిందించఁబూనుట ముప్పు
గ్రామాధికారితోఁ గక్ష ముప్పు
చెడి చుట్టమింటికిఁ జేరఁబోవుట ముప్పు
చెడుగులతోఁ బొందుచేత ముప్పు
భార్యకుఁ జనునిచ్చి పాటి సేయుట ముప్పు.
పదిమంది కాదన్న పనులు ముప్పు
మొండికొయ్యల మాట నమ్ముకొని బుధులు
పాడు తంటాల పని కడ్డపడుట ముప్పు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
61
పరమ మూర్ఖుండైన సరసాగ్రగణ్యుండు
శుద్ధ జడుడైన బుద్ధిశాలి
సంకరకులుఁడైన సంపూజనార్హుండు
అవివేకియైన ప్రజ్ఞాన్వితుండు
గడు పందయైన విక్రమశౌర్య ధుర్యుండు
మలభక్షకుండైన మాన్యగుణుఁడు
పరుష భాషణుఁడైన బహువాక్య చతురుండు
ధర్మశూన్యుండైన తగవు పెద్ద
యనుచు బొగడిక గాంతురీ యవని యెంత
హీనులైనను వ్యవహారమూని యున్న
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
62
సాహసౌదార్య పౌరుషశాలి యాతఁడు
పావనవంశ సంభవుఁ డతండు
నిఖిల విద్యాభ్యాస నిపుణుఁ డాతఁడు
దాన కళాధురంధరు డతండు
అంచిత చతురపాయజ్ఞుఁ డాతడు బుద్ధి
కుశలుఁ డాతఁడు పూజ్యగుణు డతండు
సదమలకీర్తి విస్తారుఁ డాతఁడు భవ్య
సరస సౌందర్య లక్షణు డతండు
ఎవ్వఁ డిద్ధాత్రిఁ బదిపల్లె లేలుచుండు
నతఁడు సర్వజనోత్తముం డనఁగ బరఁగు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
63
కుక్షింభరుని బుధ రక్షా పరుం డంచు
నతి నికృష్టుని మహాత్యాగి యనుచు
బహుబీజ సంభవుఁ బరమపావనుఁడంచుఁ
జంచలాత్ముని ధైర్యశాలియంచు
దౌర్జన్యకారిని ధార్మికోత్తముడంచుఁ
గఠిన చిత్తుని దయాకరుఁడటంచు
జారకర్ముని పరదార వర్జితుఁడంచు
నుత్త మూఢుని శాస్త్రవేత్తయంచు
గవులు కక్కూర్తి చేతను గడుపుకొఱకు
సన్నుతింతురు మదిలో విచారపడక
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
64
పండిత శ్రేణికి బ్రబలమాత్సర్యంబు
ఘన కవీంద్రులకు యాచక గుణంబు
భాగ్యవంతులకు వైభవ మదోద్రేకంబు
సత్కులోద్భవులకు జారవృత్తి
ధరణీసురులకు సత్కర్మానపేక్షత
విద్యాధికులకు దుర్వినయగరిమ
నరనాథులకు నీచపురుషసాంగత్యంబు
తాపసోత్తములకుఁ దామసంబు
నలువ కల్పింపఁడేని తన్మహిమఁబొగడఁ
దరమె యెవ్వరికైన యిద్ధాత్రియందు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
65
కలిపురుష ప్రతీకాశులై దగుమోటు
పశులగాపరులు భూపాలురైరి
చెడుగు కొంటెలకెల్ల బొడమిన గడుతొత్తు
కొడుకులు దొరలై రి గురుతు దనర
జారచోరులు దురాచారులన్యాయ ప్ర
చారులు ప్రబలులై గేరుచుండ్రి
మాలలు తమ్మళ్ళు మంగళ్ళు నంబులు
బలు వెజ్జులైరి భూతలమునందు
నౌర యీ యుగధర్మంబు లరయమదికి
విస్మయకరంబులై గనుపించుచుండె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
66
పలువురు ఛీ యన్న పనులు పెక్కొనరించి
పలుమరు పరుష భాషలు వచించి
పూట పూటకు మాంసపుంజముల్ కబళించి
తనవైభవమున మత్తత వహించి
పలుగు కొంటెను బెద్దలఁజేసి మన్నించి
బుధసంగతి కహస్య బుద్ధిగాంచి
అన్యాయమున విత్తమార్జన గావించి
పెల్లుగాఁ దిండిచే యొళ్ళు బెంచి
యించుకంతయు సద్వృత్తి యెఱుగనట్టి
హీనునకుఁ బౌరుషము గద్దెయెంఛిచూడ
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
67
అంగడంగడ బిచ్చమడిగి వేసాల్ వేసి
జాబులు దెచ్చి పైజార్లు బట్టి
బాజార్లు దుడిచి సవారీలు మోసి గు
రాల మేపియు గుడిరాళ్లు ద్రవ్వి
పొగచుట్టలం బీల్చి బోగంపు చానల
యిండ్లు కావలియుండి యెఱుక చెప్పి
పశువుల గాసి తెప్పలు చేసి ముండల
దార్చి లంజలకుఁ బాదంబు లొత్తి
పాట్లుఁబడి మీఁద దొరయైనవాఁడు ధర్మ
నీతి మార్గంబు నడుపగా నేరగలడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
68
ప్రజలనందఱ బాధపఱచుటకై బుట్టి
యాచకాళులఁ దిట్టి యవలగొట్టి
సరస మహా కవీశ్వరుల కెగ్గులు గొట్టి
కొంటెల నలుగుర గూడగట్టి
పూర్వ ప్రతిష్ఠలు భూమిలోనికి మెట్టి
పండితోత్తముల రాకుండఁబట్టి
బీదల మనవి దెల్పిన మార్మొగమువెట్టి
ప్రబల సంపతి గర్వమున దొట్టి
నట్టి క్రూర నృపాలుఁడు గట్టిదనము
దిట్టముగ భవ్యకీర్తి చేపట్ట గలఁడె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
69
పలుగు గయ్యాళిదెబ్బల గండు పలుగాడి
మూలుగుబోతు బల్ మాయ లేడి
పిసినిగొట్టు పిసాళి పెంకె బొంకుల పుట్ట
చెడుగు నిక్కులయిక్క చెనఁటిమంకు
టకుబాజు కల్లరి టాటోటు గడుమోట
బందెల పుట్టిల్లు నందగత్తె
ఱంకుల రాట్టంబు రవ్వలమారి తం
టాకోరు రంతులరావు ముచ్చు
ఇట్టి బేర్జంపుఁ బెండ్లాము నేలుచున్న
నరుని దౌర్భాగ్య దశ యెన్న నొగులవశమె
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
70
దానధర్మ దయావిహీన మానసురాలు
సకల మాయా వాద జన్మురాలు
గురుతరానేక దుర్గుణ గణాన్వితురాలు
బహుజనోపద్రవ సహితురాలు
భూత భేతాళ ప్రభూత భీకరురాలు
సతతాన్యనిందా విచారురాలు
భూరి కోపవికార భార దారుణురాలు
పరజన ద్రవ్యాపహరణురాలు
యెన్న నిటువంటి పెండ్లాము నేలుచున్న
పురుషుని యభాగ్య మెంతని బొగడవచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
71
కులుకు మిటారి పూవిలుతు చేతి కటారి
బంగరు బొమ్మ కప్రంపు దిమ్మ
యన్నుల తలమిన్న చిన్న సంపెఁగ గున్న
గోముల నడుదీవి గుజ్జుమాలి
వన్నెలదొంతి మవ్వంపు పువ్వుల బంతి
రతనాల తేట వరాల మూట
పండు వెన్నెల సౌరు బలుమానికపుతీరు
వలపుల మొక్క మేల్ తలుపుచుక్క
యనఁగ దఁగియున్న చెలి గూడి యలరు చున్న
పురుషుని యదృష్ట మెంతని బొగడవచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
72
గమగమ వలచు చక్కని మల్లెపూచెండు
తమ్మి వాల్గొమ్మచే నిమ్మపండు
నిగనిగలాడు బల్ సొగసు కల్వ సరంబు
రంగారు బంగారు బొంగరంబు
చకచకలీను మానికపు తీరు సలాక
నీటొప్పు విప్పు పన్నీట వాఁక
మిలమిల మెఱయు క్రొమ్మించు మించుల తీరు
తలతలల్ జూపు ముత్యాల కోవ
యెన్న యిటువంటి లేయన్ను మిన్న దొరకు
మున్ను నిన్ను నుతుల్ గొన్న యన్నరునకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
73
చిరతర సౌభాగ్య గరిమ పార్వతిఁ బోలి
వర భోగముల శచీ తరుణిఁ బోలి
బహుతరోత్కృష్ట సంపద నిందిరను బోలి
చతుర మంజూక్తి భారతిని బోలి
రూప విభ్రమ కళాప్రౌఢిని రతిఁ బోలి
సంతతక్షమను భూకాంతఁ బోలి
భూరి పాతివ్రత్యమున నరుంధతినిఁ బోలి
ఖ్యాతి సంతానాప్తి నదితిఁ బోలి
చెలఁగుచున్నట్టి యిల్లాలు గలిగెనేని
పురుషమణి పుణ్య మెంతని పొగఁడవచ్చు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
74
సుదతుల ముదిపెంపు సొంపు పాపలకును
ననబోండ్ల చిన్నారి నగవులకును
మగువల గడితంపు సొగసు చెయ్వులకును
నువిదల గడు వింత యొప్పులకును
చిలుకల కొల్కుల చిన్నె వన్నెలకును
నతివల దద్ద యొయ్యారములకు
మెలఁతల నీటారు మేలుకోపులకును
జెలియల బలితంపుఁ జెలువములకు
బలునిరాబారి పెద్దలే వలచి తొల్లిఁ
జిక్కిరని వించు నొరులకుఁ జెప్పనేల
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
75
భామల చెలువంపు మోము దమ్ములకును
నబలల లే జెక్కుటద్దములకు
గాంతల సిబ్చెంపుఁ గబ్బిగుబ్బలకును
నంగనామణుల నూగారులకును
కలకంఠకంఠుల కమ్మ వా తెఱలకు
సుందరాంగుల వాలుఁ జూపులకును
బల్లవపాణుల మెల్లని నడలకు
మందయానల ముద్దు మూటలకును
గాంచి పులకించి ధృతి సంచలింపకుండ
నిలువఁగా శక్యమౌనె యానలువకైన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
76
ఒకమాఱు వాసంతపికవధూకాకలీ
ధ్వని సదృక్కంఠ నాదముల మించి
యొకమాఱు నిర్మల ప్రకటశరశ్చంద్ర
చంద్రికా రుచిర హాసముల నెఱపి
యొకమాఱు నిశిత దర్పక ధనుర్జ్యా ముక్త
శరజాలనిభ కటాక్షముల నించి
యొకమాఱు రత్నకందుక చారుకుచలన
త్కాంతు లొక్కించుక గానుపించి
తరుణు లెంతటి ధీరుల ధైర్యమెల్లఁ
జూరగొంచురు కన్నెత్తి జూచిరేని
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
77
ఒక మాటు కెమ్మోవి యొరపు రాణింపంగ
సూటిమీఱగ జిన్ని పాట పాడి
యొకమాఱు గుబ్బలయుబ్బున సడలిన
పయిట మెల్లనె పొందుపడగఁ దిద్ది
యొక మాఱు గడితంపు టొయ్యారములు దోఁప
గిలకిల మనుచు నవ్వులనుఁజొక్కి
యొక మాఱు తేనియ లుట్టి పడ్డటువలె
జిలిబలి ముద్దుపల్కుల దనర్చి
చెలియ లీ రీతి పురుషుల చిత్తములను
గరుఁగఁజేతురు భృత్యులుగాఁగ దమకు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
78
అన్నదమ్ములు కర్మమని మొత్తుకొందురు
అక్క చెల్లెండ్రు హా యనుచు నుంద్రు
చుట్టాలు పదుగురు చుల్కఁగాఁ జూతురు
తల్లి లోలోపల ద్రుళ్లుచుండు
జ్ఞాతవారలు చాల చప్పట్లు గొడుదురు
వదినెగారులు దెప్పి గదుముచుంద్రు
ఇరుగు పొరుగుల వార లిండ్లకు రానీరు
పెండ్లిండ్లకైనను బిలువ రెవరు
శ్రీహరీ! దొంగతనమెంత చెడ్డతప్పు
యెంచగా నీడు దానికి నేది లేదు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
79
తలక్రిందుగాను వేదము జెప్పగా వచ్చు
బహు మంత్ర సిద్ధులుఁ బడయవచ్చు
సకల శాస్త్రములు ప్రసంగింపఁగా వచ్చు
తీర్థయాత్రాసక్తిఁ దిరుగవచ్చు
సతతోపవాస నిష్ఠలు గాంచగా వచ్చు
సర్వ పురాణముల్ చదువ వచ్చు
నృత్త గీతాదులన్నియు నేరఁగావచ్చు
నఖిలగారుడ విద్య లాడవచ్చు
గాని దారిద్ర్య బాధ యొక్కటియుఁగడువ
శక్తిఁ గలుగదు నేలాటి జనునికైన
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
80
క్షితినాథు చేత తాజీము చెందఁగ వచ్చు
బుధులచే మన్ననఁ బొందవచ్చు
జనులలో బహుయోగ్యు డనిపించుకొనవచ్చు
బుధులలోపలఁ గొప్పఁ బొందవచ్చు
జ్ఞాతులచే మహాస్తవముఁ జెందగవచ్చు
కులములోఁ బెద్దయై మెలఁగ వచ్చు
బరులచేఁ బాదముల్ పట్టించు కొనవచ్చు
వీరులలో ఖ్యాతి వెలయవచ్చు
నవని లోపల యెట్టివాఁడైనఁ గాని
యంచితంబుగ పది కాసు లబ్బియున్న
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
81
ఉదయాస్తమయముల నొగి నిద్రగనువాని
బలుమారు కొండెముల్ బలుకువాని
సతతంబు పరుష భాషలు వచించెడివాని
యన్యాయ వర్తనుం డైన వాని
కోలంక మదనగోపాలశతకము/పుటలు 164-165
పెద్ద లెవ్వరు పేరఁబిలిచి మాటాడరు
భార్య యెప్పుడు తూల బలుకుచుండు
బంధువులు నలుగురు పాటి సేయఁగఁ బోరు
తనవార లంత ఛీ యనుచు నుండ్రు
పరమార్థ సాధనోపాయకర్మ మడంగు
నిల్లు నొళ్ళును గూడ గుల్ల యగును
అంది పొందిన వార లందఱు తేలిక
బట్టి బల్ గెగ్గీలు గొట్టుచుందు
రవనిలోపల జారత్వ మరయ హాని
యెంచి చూచిన బురుషుని కేది లేదు
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
87
పితృ మాతృలకు మనఃప్రీతిగా మెలగుచు
గురువులపై భక్తిఁ గుదురుకొలిపి
పెద్దలఁగని చాల ప్రేమ పూజింపుచు
దీనుల బోషించి తెఱ వెఱంగి
బంధు విధేయుఁడై బహు జన మిత్రుఁడై
సాధుసజ్జన గోష్ఠి సలుపుచుండి
పరకాంతలను మాతృ భావంబుగా జూచి
సంతత ధర్మ ప్రచారుఁడగుచు
మెలఁగు చున్నట్టి వాఁడె పో దలప భవద
ఖండ కారుణ్యమునకుఁ బాత్రుండు సుమ్ము
భూరిమయవాస! కోలంకపురనివాస
మదనగోపాల రాధికాహృదయలోల!
88