Jump to content

అధిక్షేపశతకములు/కోలంక మదనగోపాలశతకము-పీఠిక

వికీసోర్స్ నుండి

వేంకటకవి

కోలంక మదనగోపాలశతకము

పోలిపెద్ది వేంకటరాయకవి సమకాలికులలో వంకాయలపాటి వేంకటకవి పేర్కొనదగినవాడు. ఈతడు రచించిన మదనగోపాలశతకము అనుకరణప్రధానమైనను కొన్ని విశిష్ట లక్షణములు కలది. బహుళ ప్రచారము నొందిన శతకములలో ఇది ఒకటి. వావిళ్ళవారు 1928లో ప్రకటించిన ఈ శతకములో 88 పద్యములు మాత్రమే కలవు. వేంకటకవి నియోగి బ్రాహ్మణుడు. గౌతమగోత్రుడు. పంచాక్షరీమంత్రోపాసకుడు. గోదావరి మండలము నందలి కోలంకనివాసి. పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధములో జీవించినట్లు శతకమునందలి వస్తువు ననుసరించి తదితరాధారముల ననుసరించి ఊహింపవచ్చును.

భక్తి, నీతి, శృంగార భావములు — సజ్జన దుర్జన లక్షణములు — రాజుల క్రూరవర్తనము — దుష్టచిత్తవృత్తి — కలియుగధర్మములు — సాంసారికజీవనము — కవుల మనస్తత్వము మున్నగు ఆంశము లీశతకమున అధిక్షేపధోరణిలో వ్యక్తీకరింపబడినవి. వ్యక్తీకరణవిధానము కూడ కొంతవరకు విశిష్టమైనది.

ప్రభువులకు అధికారులకు వ్యక్తులకు వారి దుర్వృత్తిని ఈ కవి ఆక్షేపించిన రీతుని పరిశీలించినపుడు ఆతడు వ్యక్తిగతముగ కొందరి వలన అనాదరము నొంది యుండునని అనుమానము కలుగును. వేంకటకవి ఎచటను ఆ వ్యక్తులను పేర్కొనలేదు. వారి దుశ్చర్యలను మాత్రమే సామాన్యీకరించి శతకము రచించెను.

సామాన్యనీతులను, సజ్జన లక్షణములకు వివరించు పట్ల కవి భక్తిభావముల నుద్బోధించెను. కోలంక మదనగోపాలుని అనుగ్రహము లభించిన వారికే, భగవద్భక్తి కలవారికే సకలైశ్వర్యములు భోగభాగ్యములు లభించునని సూచించెను. మానవులు ఉన్నతకళను సాధించి సుఖజీవనము గడుపుటకు భక్తి అవసరమని స్పష్టమొనర్చుట ఇట్టిది.

భర్తృహరి ననుసరించి వేంకటకవి సజ్జన దుర్జన లక్షణములను నిర్దేశించిన సందర్భములు పెక్కు కలవు — మూర్ఖులను దుర్జనులను వారి దుశ్చర్యల నీ కవి నిశితముగ విమర్శించెను. కొన్ని సందర్భములలో అన్యాపదేశరీతిలో నీతిబోధన మొనర్చబడినది. మూర్ఖుల చిత్తవృత్తిని సంస్కరించుట అసాధ్యమని వచించి, నానావిధములైన వారి కపటప్రవృత్తులను విపులముగా చిత్రించుటలో ఈ కవి ప్రత్యేకమార్గము ననుసరించెను — అప్పునెగగొట్టువాడు, గురుజనద్రవ్యము నపహరించువాడు — తలిదండ్రుల కష్టపెట్టువాడు, తనయపత్నిని కామించువారు, పరదోషముల నెన్నువారు, సజ్జనులకు హాని తలపెట్టువారు, ప్రజలను పీడించువారు, మాన్యములను హరించువారు — దానగుణహీనులు — అతిహీనవృత్తిని పాటించు వారు, మొదలగువారిని ఈ కవి అధిక్షేపించెను. సంఘమున ప్రబలిన అనాచారము — అధర్మము మున్నగువానిని కూడ వేంకటకవి సందర్భానుసారముగ తీవ్రదృష్టితో విమర్శించెను. చౌర్యము — జారగుణములను విమర్శించిన సందర్భము లిట్టివి.

సాంఘికవ్యవస్థ అస్తవ్యస్త మగుటకు, అధర్మవృత్తి ప్రబలుటకు కలిప్రభావమే ప్రధానకారణమని కవి భావించెను. కొన్నింటిని బ్రహ్మసృష్టిలోని వైచిత్ర్యములుగను, మానవుల కర్మఫలజన్యముగను ఊహించెను. బ్రహ్మసృష్టిలోనే ఒక విధమైన వైపరీత్యము కలదని ఒక సందర్భమున చాటెను. సరససౌందర్యలక్షణకళావతికి ముష్కరరూపుని భర్తగా కూర్చుట, సంతతసాధునిశ్చలపుణ్యవర్తికి బలుగయ్యాళిని భార్యగా కూర్చుట ఇట్టిదని వేంకటకవి నిరూపించుటకు యత్నించెను. ఖలులకు కపటవర్తనము పుట్టుకతో వచ్చిన దనియు, అది అంతరించుట కష్టమని వారి స్వభావము నెన్ని, విసిగి, ఖలులను, మూఢులను బుట్టించిన వేధననవలె వారిని తిట్టి ఫల మేమి టని నిర్వేదము నొందెను. కలి పురుషుని ప్రభావమున పసులకాపరులు ప్రభువులై రనియు, మూలలు, తమ్మళ్ళు, మంగళ్ళు, సంబులు బలు వెజ్జు లైరి అనియు, యుగధర్మములే విస్మయకరములై యున్నవని కవి ఈ అంశములను వివిధోదాహరణములచే సమర్థించెను. ప్రభువుల ప్రసక్తి దుర్గుణ, దుర్జన ప్రస్తావవశమున వచ్చుట గమనింపదగినది. శార్యగుణమున్నచో రణరంగమున చూపవలయు ననియు, ప్రజల బాధించు దుష్టవర్తనుడు సుజనుల కుపకారము చేయలే డనియు, విప్రులమాన్యముల నపహరించువారికి అగ్రహారముల నొసంగువాడు అపకారి అనియు, రణభీరునకు వీరుడు దారుణచర్యుడై తోచుననియు చిత్రవిచిత్రవస్త్రాభరణములే వైభవచిహ్నములు కావనియు నానావిధములుగ పాలకులకు వలయు గుణములను నిర్దేశించెను.

దాన గుణ శౌర్య పౌరుషవిహీనులైన అల్పులకు, అతిశయోక్తులతో వర్ణించు కవులనుకూడ వేంకటకవి ఈ సందర్భమున మందలించెను. కవులు పూజ్యార్హులు, వారికి గల విశిష్ట స్థానమును గుర్తించవలయుననియు సూచించెను. కవి పండితులకు యాచకగుణము, పండితులకు పరస్పరమాత్సర్యము కల్పించనిచో నలువను కీర్తించవచ్చునని భంగ్యంతరముగ కవుల ప్రకృతిని వర్ణించి విమర్శించెను. సుకవిజనముతో పోరాడువారు దుర్గతిని చెందుదురని హెచ్చరించెను.

వివిధనీతులు సాధారణధోరణిలో వివరింపబడినను కొన్ని సందర్భములలో ఖండితదృష్టితో హెచ్చరికల రూపమున నున్నవి. కుటిల చిత్తునకు సద్గోష్ఠి లేదనియు, వచ్చిన అపకీర్తి పోదనియు వచించుట సామాన్యధోరణి — ఉభయసంధ్యల నిద్రించువానికి, బహుగుణాన్వితమైన భార్యను గూడనివారికి లక్ష్మీకటాక్షము లభించదనుటలో, అనయమెచ్చిన్యా నధికార మూడును, ద్రవ్యంబు పెల్ల్లెన ధర్మముడుగు అను సందర్భములందును ' హెచ్చరిక ' తొంగిచూచును — మాన్యములు హరించి ప్రజల పీడించి, బుధుల సొమ్ము హరించినవారికి, కపటప్రవృత్తులుగల వారికి, మృత్యు, పరలోక, యమపురి బాధలను గుర్తింపజేసి హెచ్చరించిన సండర్భములు మరికొన్ని కలవు.

పూర్వనీతిశతకకర్తల ధోరణిలో వచించిన నీతులు ఈ శతకమునందును కొన్ని కలవు. భావమును మలచి మలచి వ్యక్తీకరించిన సందర్భములందు దీనిని గమనించవచ్చును. “యథా రాజా తథా ప్రజా" అను సూక్తి “కూతురు ప్రకటించు మాత గుణము" అను నీతి ఈ శతకమున ప్రభువాజ్ఞ కొలదియే ప్రజల మర్యాదలు, మాత తీర్చుకొలది కూతురు నడవళ్ళు' అను భాగము లందు అనుకరణ ప్రాయమై కనిపించును.

అధిక్షేప శతకకర్తలలో కొందరు పురుషుల మనస్తత్వమును విశ్లేషించి సుఖకరమైన సాంసారికజీవనమునకు ఆదర్శదంపతులు మూలస్తంభములవంటివారని ఈ కవి ప్రస్తుతించి దుర్భరజీవనమును గడపువారిని కూర్చి విచారించెను. పరాత్పరుని పాదపంకజముల సేవించి ఆతని అనుగ్రహమునకు నోచుకొనినవారికి పన్నెలదొంతి, వరాలమూట, బంగరుబొమ్మ, గమగమ వలచు చక్కని మల్లెపూచెండు వంటి చెలి లభించుననియు, సుగుణవతి ఇల్లాలుగల పురుషమణిభాగ్యమే భాగ్యమని ప్రస్తుతించెను. గయ్యాళి, టకుబాజి — కల్లరి — తంటాకోరుల వంటి పెండ్లాము నేలుట మగని దౌర్భాగ్యముగ భావించెను. కొన్ని సందర్భములలో వేంకటకవి స్త్రీల ప్రవృత్తిని భర్తృహరి ననుసరించి వివరించెను. చెలియలు పురుషుల చిత్తము హరింతురనియు, ధీరులైన మగవారి మనసు చూరగొందు రనియు, వారి చెలువమునకు తాళజాల రనియు వచించిన సందర్భము లిట్టివి.

సుగుణదుర్గుణములను, సుజనదుర్జనులను తారతమ్యదృష్టితో పరిశీలించుట ఈ శతకములో ప్రత్యేకముగ గమనిపగిన అంశము. భిన్నదృక్పథములను చూపి అధిక్షేపించు విధాన మీ సందర్భములందు చూడవచ్చును. కలియుగమున పదయుగళక్షాళనాభోజికి దురాచారుడై తగు శిరస్నానరతుండు — రణభీరువునకు దారుణచర్యుడై తోచు ప్రబలసంగ్రామప్రవర్తకుండు — అను పద్యములలో ఈ ధోరణి కలదు. అనృతము, సత్యము; పాపపుణ్యకార్యములు; సంధ్యాకర్మసంత్యక్తుడు — యజ్ఞదీక్షాపరుడు; అగ్రహారప్రదాత, క్షేత్రాపహరుడు; మున్నగువానిని తారతమ్యదృష్టితో పరిశీలించి శఠులను, వారి చర్యల నధిక్షేపించెను.

దుర్గుణములను నిషేధరూపమున వివరించి సద్గుణములను కర్తవ్యము నుపదేశించు విధాన మీ శతకమున గలదు. విబుధుల గోష్ఠి విడువవద్దు కలిమెంత యున్న బీదల దెప్పగావద్దు — అను పద్యభాగము లిట్టివి.

ఈ శతకమున నానావిధములుగనున్న అధిక్షేపధోరణులలో సౌమ్యతతో పాటు తీవ్రదృష్టి కూడ ఉన్నది. ప్రతి పద్యపాదము సూక్తిప్రాయమైనది. అడిదము సూరకవి ముద్ర ఈ సందర్భములలో ప్రస్ఫుటముగా నున్నది. ఊళ్లు దోచుక రాతి గుళ్ళు గట్టగ నేల — మాన్యముల్ కబళించి మఖము సేయగ నేల — యడవుల చెట్లెక్కి యాడు కోతికి రత్నసౌధాగ్రసీమ సంచార మేల—” అని అన్యాపదేశముగ నధిక్షేపించిన సందర్భములలో కవి దృష్టికి వచ్చిన వ్యక్తులు వారి దుర్గుణములే స్ఫురించుచున్నవి. భావోన్నతికి అనుగుణమైన భాష, నిశితమును హృదయస్పర్శిగను సాగిన వ్యక్తీకరణవిధానము శతకము బహుళజనాదరణము నొందుటకు తోడ్పడినది. సమకాలికవ్యవస్థకు దర్పణరూపమైన ప్రశస్తశతకముగా రాణించినది.