అధిక్షేపశతకములు/కవి చౌడప్ప శతకము

వికీసోర్స్ నుండి

కవి చౌడప్ప శతకము

క.

శ్రీకారము పద్యాదిని
బ్రాకటముగ నుండెనేని బహుదోషములన్
బోకడఁచి శుభము లొసఁగును
గాకోదర కుందవరపు కవి చౌడప్పా.

1


క.

శ్రీపతి పుల్లురిపట్టణ
గోపాలుఁడు సదయుఁ డగుచుఁ గుంతీసుతులన్
గాపాడునటులు మమ్మును
గాపాడును కుందవరపు కవి చౌడప్పా.

2


క.

ఉండఁగ నిచ్చును నీపైఁ
బాండవమధ్యమునిమీఁది పక్షము గోపా
లుండవు పుల్లురివాసుఁడ
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

3


క.

ఎంతెంతో దీర్ఘాయు
ష్మంతుఁడవై మిగుల బుద్ధిమంతుఁడవై శ్రీ
మంతుఁడవై మను లక్ష్మీ
కాంతుని కృపఁ గుందవరపు కవి చౌడప్పా.

4


క.

వెయితల లొక వెయికన్నులు
వెయిచేతులు పదములొక్క వెయిగల పురుషుం
డియ వలయును దీర్ఘాయువు
గయికొమ్మని కుందవరపు కవి చౌడప్పా.

5

క.

మందరగిరిధర సనకస
నందన ప్రమదవరద నారదనుత గో
వింద యనువారు ముక్తినిఁ
గందురుఁగద కుందవరపు కవి చౌడప్పా.

6


క.

వనజభవాదులుఁ వారొక
పనిఁబూనిన వేళ మొదటి ప్రార్థన గణనా
థునిఁ జేయకున్న సాగుట
కనము వినము కుందవరపు కవి చౌడప్పా.

7


క.

పండితముఖ్యులు ధారుణి
దండియు భవభూతి కాళిదాసులు నుతి యె
వ్వండు నిడు కృతుల వారి క
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

8


క.

విను భారవి బిల్హణు నా
చనసోముని మాఘకవిని చతురుని శ్రీనా
ధు నుతింతు సుకవివరుఁ ది
క్కనఁ దలఁతును కుందవరపు కవి చౌడప్పా.

9


క.

పెద్దనవలెఁ గృతి సెప్పినఁ
బె ద్దనవలె నల్పకవినిఁ బె ద్దనవలెనా
యె ద్దనవలె మొ ద్దనవలె
గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా.

10


క.

అందములై వినవినఁ జెవి
కందములై మంచి నీతికుందములైతే
అందఱు చదువుదు రభినవ
కందర్పా కుందవరపు కవి చౌడప్పా.

11

క.

ముందటి దినములలోపల
గందమునకు సోమయోజి ఘనుఁ డందురు నే
డందురు ఘనుఁ లందఱు నను
కందానికిఁ గుందవరపు కవి చౌడప్పా.

12


క.

కందము నీవలెఁ జెప్పే
యందము మఱి గాన మెవరి యందును గవిసం
క్రందన యసదృశనూతన
కందర్పా కుందవరపు కవి చౌడప్పా.

13


క.

కందములఁ బ్రాససగణయతు
లందముగాఁ గవిత నెంద ఱల్లరు విను నీ
కందంబులు రసవన్మా
కందంబులు కుందవరపు కవి చౌడప్పా.

14


క.

కందంబులు సకల జనా
నందంబులు సరసమధుర నవరసఘటికా
బృందంబులు నీ కవితా
కందంబులు కుందవరపు కవి చౌడప్పా.

15


క.

మునుపటి సుకవుల నీతులు
జననుతములు కుందవరపు చౌడుని నీతుల్
వినవిన తేట తెనుంగై
కనపడుగద కుందవరపు కవి చౌడప్పా.

16


క.

నీతుల కేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా.

17

క.

బూతని నగుదురు తమ తమ
తాతలు ముత్తాత మొదలు తనతరములవా
రే తీరున జన్మించిరొ
ఖ్యాతిగ మరి కుందవరపు కవి చౌడప్పా.

18


క.

పదినీతులు పదిబూతులు
పదిశృంగారములుఁ గల్గు పద్యములు సభన్
జదివినవాఁడే యధికుఁడుఁ
గదరప్పా కుందవరపు కవి చౌడప్పా.

19


క.

లంజలు రాకుండిన గుడి
రంజిల్లదు ప్రజలమనసు రాజిల్లదురా
లంజల నేల సృజించెను
గంజజుఁ డిల కుందవరపు కవి చౌడప్పా.

20


క.

పడఁతుకయును వంకాయయు
నడరు సమూలంబు మధుర మందులలోఁగా
తొడమొదలుఁ దొడిమమొదలుం
గడు మధురము కుందవరపు కవి చౌడప్పా.

21


క.

వేయాఱు వగల కూరలుఁ
గాయ లనేకములు ధాత్రిఁ గల వందులలో
నాయకములురా కాఁకర
కాయలు మఱి కుందవరపు కవి చౌడప్పా.

22


క.

అంభోజాక్షులలోపల
రంభయె కడు నందగత్తె, రాగంబులలో
గాంభీర్యముఁ గల రాగము
కాంభోజియె కుందవరపు కవి చౌడప్పా.

23

క.

నా నీతి వినని వానిని
భానుని కిరణములు మీదఁ బాఱని వానిన్
వాననుఁ దడియని వానిని
గానమురా కుందవరపు కవి చౌడప్పా.

24


క.

కాకులు వేవేలొక్క తు
పాకిరవము విన్న నులికిపడవా మఱి నా
ఢాకకు నగు నాలాగే
కాకవులును కుందవరపు కవి చౌడప్పా.

25


క.

విద్దెల మే లెఱుఁగని నరుఁ
డెద్దే సరి గడ్డి దినెడి దెద్దా పశులం
దెద్దుకు కొంత వివేకము
గద్దప్పా కుందవరపు కవి చౌడప్పా.

26


క.

పెద్దల మనుచును రాజుల
వద్దనుఁ గూర్చుండి నీచవాక్కులుఁ బలికే
పెద్దలు భువిలో పీతిరి
గ్రద్దలురా కుందవరపు కవి చౌడప్పా.

27


క.

తా రాజసభల మెలగుట
తా రసికతఁ జెలగు టెల్ల తన బ్రతుకునకా
పూ రే డేఱుకఁ దినదా
కారడవుల కుందవరపు కవి చౌడప్పా.

28


క.

కుక్కుటము లూరపందులు
కుక్కలు తమకడుపు పెంచుకొనవా ధరలోఁ
బెక్కండ్ర మనుపఁ జాలమి
కక్కూరితి కుందవరపు కవి చౌడప్పా.

29

క.

ఉందురు నుపకారహీనులు
కొందరు దొరవద్ద, శివుని గుడిపై నుండే
నందులవలె బిగియించుక
కందములను కుందవరపు కవి చౌడప్పా.

30


క.

బుద్ధి కలుగు దొరయైతే
యిద్దరి కొక పారుపత్య మీదకద సుమీ
యిద్దరు యెడలకు కష్టము
కద్దప్పా కుందవరపు కవి చౌడప్పా.

31


క.

దొర వద్ద నెవఁడు చనవరి
నరు లతనికిఁ బ్రియము చేయ న్యాయము ధరలో
హరివాహన మని మ్రొక్కరె
గరుడునిఁ గని కుందవరపు కవి చౌడప్పా.

32


క.

దొర యెంత ప్రౌఢుఁ డైనను
సరసను నియ్యోగి లేక సాగదు వలదా
శరమెంత వాడియైనను
కరవైఖరి కుందవరపు కవి చౌడప్పా.

33


క.

కరణముఁ గావలె సరసుఁడు
కరణ మవశ్యంబు సకలకార్యంబులకున్
కరణము ముల్లోకవశీ
కరణము కద కుందవరపు కవి చౌడప్పా.

34


క.

కరణంబని తన నడిగిన
కరుణఁ బిలచి యొక్క కాసు కవి కియ్యనిచో
కరణము పేరు సపిండీ
కరణమురా కుందవరపు కవి చౌడప్పా.

35

క.

ధరఁ గవి భట మాన్యంబులు
హరియింపఁగ లెక్క కవిలె నంటించెడి యా
కరణము పేరు సపిండీ
కరణమురా కుందవరపు కవి చౌడప్పా.

36


క.

దేవుఁడు దేవుం డనగా
దేవుం డా దివమునుండి దిగివచ్చేనా
ఈవి గలదొరయె దేవుఁడుఁ
కాపంగను భువి కుందవరపు కవి చౌడప్పా.

37


క.

సముఖము దొరకక దొరికిన
సుముఖుండై తమ్ము కండ్ల చూడని దొర తా
నమరునె బీదల మనవికి
గమకించట కుందవరపు కవి చౌడప్పా.

38


క.

రాచతనానకుఁ జందెపుఁ
బోచటరా గురుతు రిపుల బొరిఁ గొనుటయుఁ జేఁ
జాచిన నిచ్చుట శరణన
గాచుటరా కుందవరపు కవి చౌడప్పా.

39


క.

ఇయ్యఁగ నిప్పింపంగల
యయ్యలకే గాని మీస మందఱి కేలా
రొయ్యకు లేదా బారెడు
కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా.

40


క.

తగుపాటి కవుల కియ్యని
మగముండల కేలఁ గలిగె మూతిని మీసల్
దిగగొఱుగఁడాయె మంగలి
ఖగరాడ్బల కుందవరపు కవి చౌడప్పా.

41

క.

బండగులాములు యాచక
తండంబుల కివ్వలేరు తము దండించే
ముండల కిత్తురు ధగిడీ
గండలు మరి కుందవరపు కవి చౌడప్పా.

42


క.

బియ్యమున మెఱక యుండిన
వెయ్యాఱున్నట్టుఁ దోచు విను దాతలలోఁ
గొయ్యగులా మొం డుండను
గయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా.

43


క.

ఏమియ్యని దొర పద్యము
1నా మొడ్డక చదువు2టేల నాలుక తీటా
రామకథా భారతమా
కామింపగ కుందవరపు కవి చౌడప్పా.

44


క.

అత్తమొల కోకఁ దొలగిన
తత్తరపడ రాజు నీతి దప్పిన సుజనుం
డత్తరికడఁ దొలగును త్రిజ
గత్తున మరి కుందవరపు కవి చౌడప్పా.

45


క.

వేసరక యిచ్చు దాతకు
కాన సుమీ మేరువంత కనకం బైనన్
కాసే మేరువు లోభికి
వాసిర కవి చౌడ ధీరవర్ణచరిత్రా.

46


క.

అతిలుబ్ధు వేడబోయిన
వెలనొందుచు వాని మోము వెలవెలబారున్
అతిసార రోగపీడితు
గతినప్పా కుందవరపు కవి చౌడప్పా.

47

క.

ఆకొని వచ్చిన యతిథిని
వాకిట నిలుచుండబెట్టి వాఁ డశనము దా
నే కుడువ మన్ను గుడుచుటఁ
గా కేమిర కుందవరపు కవి చౌడప్పా.

48


క.

తినఁజాలక యే ధర్మముఁ
గనఁజాలక పరమలోభి కష్టుఁడుఁ గూర్చే
ధనమెల్ల నేలపాలనిఁ
గనుమప్పా కుందవరపు కవి చౌడప్పా.

49


క.

ముండాకొడుకుల సంపద
దండుగులకె గాని దానధర్మములకు రా
కుండు మహీమండలమున న
ఖండితముగ కుందవరపు కవి చౌడప్పా.

50


క.

కులశీలమానుషాదులు
గల నురలకుఁ గాని కీర్తి కత్తరికేలా
తలుపేల చాప గుడిసెకుఁ
గలదే భువి కుందవరపు కవి చౌడప్పా.

51


క.

అనయము పేదలపట్లన్
వినయముఁ గలవాఁడె బ్రతుకు భువి నూరేండ్లున్
ముని నాయుష్యము వరమున్
కనుమప్పా కుందవరపు కవి చౌడప్పా.

52


క.

అతిథుల బంధుజనంబుల
యతులను తమ నడుగ వచ్చు యాచకతతికిన్
క్షితిఁ బూజించు నరుఁడు స
ద్గతిఁ బొందును కుందవరపు కవి చౌడప్పా.

53

క.

తన సతి యిడగా మనుమలు
తనయులు తలిఁదండ్రు లన్నదమ్ములు బంధుల్
దినదినమును భుజియుంచుట
ఘనవిభవము కుందవరపు కవి చౌడప్పా.

54


క.

తనయునికి పరదేశికి
పెనిమిటికి నొక్కరీతి భోజన మిడు నా
వనితను పుణ్యాంగన యని
ఘనులందురు కుందవరపు కవి చౌడప్పా.

55


క.

దొరకైనఁ బేదకైనను
వెరవరి యిల్లాలికైన వేశ్యకునైనన్
గరిగరికతనము బాగగుఁ
గరుణాంబుధి కుందవరపు కవి చౌడప్పా.

56


క.

మును పాడి వెనుక లేదను
పెనుగొంటె గులాము నోరు పీతిరిగుంటే
యని తలఁచి ఘనుఁడు సత్యము
కనవలెరా కుందవరపు కవి చౌడప్పా.

57


క.

మూలిక క్రియ కొదిగినదే
నాలుక సత్యంబుఁ గలిమి నాడినవాఁడే
యేలిక వర మిచ్చినదే
కాళికరా కుందవరపు కవి చౌడప్పా.

58


క.

పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లి యనుచు భావించిన యా
నరుఁడా నరుండా రెండవ
కరివరదుఁడె కుందవరపు కవి చౌడప్పా.

59

క.

కొండవలె పెనిమి టుండగ
మిండని చవి మరిగి కడల మీఱుఁచుఁ దిరిగే
రండను యమపురిఁ జీల్తురు
కండలుగా కుందవరపు కవి చౌడప్పా.

60


క.

వగలాడి చెంత నుండిన
మగవానికి నూరకుండ మన సయ్యేనా
తగుసరసమ్ముల నాడక
ఖగపతిబల కుందవరపు కవి చౌడప్పా.

61


క.

వగలాఁడికి ముసలాతఁడు
మగడయితే దాని చింత మఱి యింతంతా
జగదీశుఁడు తా నెరుగును
ఖగపతిబల కుందవరపు కవి చౌడప్పా.

62


క.

సారములెవి సంసారికి
భారములెవి గోపురంబు ప్రతిమకు పిప్పిన్
సారములెవి గుడిసెకు ప్రా
కారములెవి కుందవరపు కవి చౌడప్పా.

63


క.

పులి నాకి విడుచు దైవము
గలనాటికి దైవబలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కఱచును
గలియుగమునఁ గుందవరపు కవి చౌడప్పా.

64


క.

పాండవు లిడుములఁ బడరే
మాండవ్యుఁడు కొరతఁబడె మహి ప్రాకృత మె
వ్వండోపుమీఱి చనగన
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

65

క.

లంజకు ధన మీఁ దలతురు
రంజన గలదైన మూఢురాలే యైనన్
గింజలు పడెఁ డీ జాలడు
గంజికి మఱి కుందవరపు కవి చౌడప్పా.

66


క.

పొగఁ ద్రాగని నరు బ్రతుకును
పొగడంగా నియ్యలేని భూపతి బ్రతుకున్
మగఁ డొల్లని సతి బ్రతుకును
నగడు సుమీ కుందవరపు కవి చౌడప్పా.

67


క.

మారుని గేరెఁడు రూపము
సారస్యముఁ గల్గు విభులు సమకూఱుటకున్
వారిజగంధులపూజలు
కారణముర కుందవరపు కవి చౌడప్పా.

68


క.

గుడిసెయు మంచముఁ గుంపటి
విడియమును పొగాకు రతిని వెంపరలాడే
పడతియుఁ గలిగిన చలి యె
క్కడిదప్పా కుందవరపు కవి చౌడప్పా.

69


క.

మనుజుడు నేర్పరియైతే
కొనవలెరా మంచిముద్దుగుమ్మను లేదా
మునివృత్తినుండి మోక్షముఁ
గనవలెరా కుందవరపు కవి చౌడప్పా.

70


క.

అప్పయినఁ దీసి తినవలెఁ
బప్పును వరికూడు వయసుభామామణులన్
మెప్పింపగవలెఁ, జలువలె
గప్పగవలె కుందవరపు కవి చౌడప్పా.

71

క.

పండుగ పండుగ యందురు
పండుగదిన మేది వయసు పడుచుల ప్రక్కన్
పండిన దినమే పండగ
ఖండితయశ కుందవరపు కవి చౌడప్పా.

72


క.

దినములలోపల నుత్తమ
దినమే తద్దినమునాటి తిండికి సమమే
దినములకు వెదకి చూచినఁ
గనమప్పా కుందవరపు కవి చౌడప్పా.

73


క.

పప్పే పస బాపలకును
ఉప్పే పస రుచుల కెల్ల నువిదల కెల్లన్
గొప్పే పస దంతములకుఁ
గప్పే పస కుందవరపు కవి చౌడప్పా.

74


క.

బట్టలు పస తురకలకును
గిట్టలు పస గుఱ్ఱములకు వసుధీశులకున్
బొట్టలు పస చెరువులకును
గట్టలు పస కుందవరపు కవి చౌడప్పా.

75


క.

మాటలు పస నియ్యోగికిఁ
గోటలు పస దొరల కెల్ల ఘోటకములకున్
దాఁటులు పస బెబ్బులులకు
గాఁటులు పస కుందవరపు కవి చౌడప్పా.

76


క.

వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
గానలు పస కుందవరపు కవి చౌడప్పా.

77

క.

కొమ్ములు పస మదకరికి
సొమ్ములు పస వారసతికి నుదతికి వాగ్జా
లమ్ములు పస ధోవతులకు
గమ్ములు పస కుందవరపు కవి చౌడప్పా.

78


క.

వెన్నెల పస రాత్రులకును
కెన్నులు పస సస్యములకు వెలదుల కెల్లన్
చన్నులు పస యటు మీదట
కన్నులు పస కుందవరపు కవి చౌడప్పా.

79


క.

మీసము పస మగమూతికి
వాసము పస ఇండ్లకెల్ల వనితలకెల్లన్
వేసము పస బంట్రోతుకు
గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా.

80


క.

పయ్యెద పస చనుదోయికి
వియ్యము పస పెండ్లికెల్ల విందులకెల్లన్
నెయ్యము పస నెఱరౌతుకుఁ
గయ్యము పస కుందవరపు కవి చౌడప్పా.

81


క.

ఇంటికి పదిలము బీగము
వింటికిఁ బదిలంబు నారి వివరింపంగాఁ
జంటికిఁ బదిలము రవికయు
గంటికిఁ బదిలంబు ఱెప్ప కవి చౌడప్పా.

82


క.

ఎడ్డెల కొడుకులు కొందరు
బిడ్డల పెరుమాళ్ళపేరుఁ బిలువక వేఱే
యొడ్డారపుఁ బే రిడుదురు
గడ్డలు దినఁ గుందవరపు కవి చౌడప్పా.

83

క.

నారాయణ యని సుతునిం
జేర నజామీళుఁడు వేగ పిలిచిన ముక్తిం
జేరిచె నది హరినామము
గారవమున కుందవరపు కవి చౌడప్పా.

84


క.

చిత్తము శ్రీహరిపైకిం
చిత్తును నిలుపంగ లేచి చెడుగుల మడియన్
మొత్తి యమభటులు పొడుతురు
కత్తులతోఁ గుందవరపు కవి చౌడప్పా.

85


క.

తులసీదళముల హరిపద
జలజంబులు పూజ సేయు సరసుల యమదూ
తలుఁ జూచి యేమి సేయం
గలరప్పా కుందవరపు కవి చౌడప్పా.

86


క.

ముంతెడు చమురున హరి
కత్యంతమనసిద్ధి దీప మనుదిన మిడువాఁ
డంతమున జేరు లక్ష్మీ
కాంతుని పురి కుందవరపు కవి చౌడప్పా.

87


క.

అలసట వేసటనయినం
గలయికనన్ నగుచునయిన గరుడధ్వజునిన్
దలచినవారలఁ జేరవు
కలుషంబులు కుందవరపు కవి చౌడప్పా.

88


క.

తనమదిలోపల దశరథ
తనయులలోఁ బెద్దవాని తలచిన జన్మం
బనయంబు పావనంబని
ఘనులందురు కుందవరపు కవి చౌడప్పా.

89

క.

దశమి నొకపూట నేకా
దశి రేపగ లుపవసించు ద్వాదశి నొకపూ
టశనము గొను పుణ్యుడు లో
కశరణ్యుఁడు కుందవరపు కవి చౌడప్పా.

90


క.

పరగడుపున సభలోపల
తరుణులయెడ భుక్తమైన తరి నొక విడెముం
దొరకని వరునకు సౌఖ్యము
కరువప్పా కుందవరపు కవి చౌడప్పా.

91


క.

ఏపాటిదయిన ప్రక్కకు
దాపొక్కటి లేకపోతె తరమటరా యీ
పాపపుదినములు గడువగ
కాపాడుము కుందవరపు కవి చౌడప్పా.

92


క.

యతికి మఱి బ్రహ్మచారికి
అతులితముగ విధవముండ కశ్వంబులకున్
సతతము మైథునచింతయె
దతిఁ దోపదు కుందవరపు కవి చౌడప్పా.

93


క.

ముదిత చను మెత్తనయినను
యధికారము మెత్తనయిన నాటికి దొరకున్
మది మెత్తనయిన రోతురుఁ
గదరప్పా కుందవరపు కవి చౌడప్పా.

94


క.

అంభోజాక్షులలోపల
రంభే కడుచక్కనిది రాగంబులలో
గాంభీర్యమైన రాగము
కాంభోజే కుందవరపు కవి చౌడప్పా.

95

క.

తలవెండ్రుక లందఱురా
యిలలో నిచ్చేటివారు యియ్యనివారో
మొలవెండ్రుక లందఱురా
కలియుగమున కుందవరపు కవి చౌడప్పా.

96


క.

లంజెయును బీఱకాయయు
ముంజెయు బాల్యమునఁ జాలమోహము గొలుపున్
రంజనచెడి ముదిరిన వెను
కం జూడరు కుందవరపు కవి చౌడప్పా.

97


క.

ప్రస్తావోచిత పద్యము
యిస్తే ఎవఁడైన చదువు మేదినిమీదం
బ్రస్తుతి బద్యము చదువుట
కస్తి గదా కుందవరపు కవి చౌడప్పా.

98


క.

దొరగావలె ధర్మాత్ముడు
సిరిగావలెఁ బ్రజకుఁ బేరుసీమల నెఱుగం
గురి గావలెఁ గులసతి సి
గ్గరికావలె కుందవరపు కవి చౌడప్పా.

99


క.

పరసతిఁ గవయగఁ జనుచో
వరుణోదయవేళ స్నాన మాడం జనుచో
బొరిఁబొరి వణకు నశక్తుడు
కరుణాంబుధి కుందవరపు కవి చౌడప్పా.

100


క.

కొట్టగవలెఁ బరదళములఁ
గట్టగవలె భూమి దానకర్ణుని వలెనే
పెట్టగవలె నిల రాజుకు
కట్టడి యల కుందవరపు కవి చౌడప్పా.

101