అడవి శాంతిశ్రీ/నవమ భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నవమ భాగం

ప్రజాకంఠము

గ్రామగ్రామాలలో ప్రజలు సభలు చేసినారు. పంచసభ్యుల్ని తమ పక్షాన ధాన్య కటకానికి ప్రయాణం కమ్మన్నారు. ఒక్కసారిగా నేల ఉప్పెన పొంగినట్లు గ్రామగ్రామాలలో ఆబాలగోపాలములోనూ ఆవేశం పొంగులు వారింది.

ధనకసీమ, వజ్రభూమి, పూంగీయ విషయము, క్రముకరాష్ట్రం, వేంగీ విషయం, బృహత్పాలాయన విషయం, దక్షిణకళింగ, దక్షిణకోసల, చోడ విషయం, చాళుక్య విషయం, కొరవిరాష్ట్రాదులలోని వేలకొలదిగ్రామాల నుంచి గ్రామపెద్దలు బయలుదేరినారు. గుఱ్ఱపు బళ్ళమీద, ఎద్దులబళ్ళమీద, గుఱ్ఱాలపైన, ఏనుగులపైన, కాలినడకల బయలుదేరినారు. దారిలో భజనలు చేసుకుంటూ, ఇతర గ్రామాలవారిని సంప్రదిస్తూ, ధాన్యకటకం చేరవస్తున్నారు. నలవైపులనుండి వస్తున్నారు. శివుని, విష్ణుని, తథాగతుని, తీర్థంకరులను ప్రార్థిస్తూ వస్తున్నారు. కొందరు క్షద్రదేవతల భజనలు చేస్తున్నారు.

ఆ నడివేసవిలో ఎండనక, ఏరనక, కొండనక, అడవనక గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వస్తున్నారు. ధాన్యకటకానికి అప్పుడే కొన్ని గ్రామాలవారు చేరారు. మాళవికాదేవి అపరాజితయే అన్నారా ప్రజలు. ఆమె పేరున గుడి సంకల్పించినారు. ఆమె పేరున కృష్టఒడ్డున పూజలు చేయించినారు. ముత్తయిదువులకు వాయినాలిప్పించినారు. వేలకువేలు జనులు కోటలోనికిపోయి శాంతిమూలమహారాజు దర్శనం కోరినారు. మహారాజు, మంత్రులు, సేనాపతులు, బ్రహ్మదత్తప్రభువు, పూంగీయ మహారాజు, బృహత్పలాయన ప్రభువు, వేంగీపురసాలంకాయన ప్రభువు, పిష్టపుర వాసిష్టప్రభువు, చళుకనాటి చాళుక్యరాయనిక ప్రభువు మున్నగువారితో ఎడతెగని మంతనముంటున్నారు. ప్రజలందరూ ఏకకంఠంతో “జయ శాంతి మూలచక్రవర్తీ!” అని అరచినారు,

“జయ ఇక్ష్వాకుచక్రవర్తీ జయ”

“జయ విజయపుర సింహసనాధీశా!”

అన్న విజయ నాదాలు ఆశావిలసితాయై, ఉప్పొంగి దెసలావరించినవి. ప్రజల జయధ్వానాలు వినగానే శాంతిమూలుని మోము వైవర్ణ్యం పొందింది. పూంగీయ, ధనక, చళుక, సాలంకాయనాది ప్రభువుల మోములు పద్మాలులా వికసించాయి. ఆ గ్రామగ్రామాల ప్రజలు, పెద్దలు ముందుకు వచ్చినారు. ఆ పెద్దలలో ఒక ముదుసలి మహారాజులందరూ నిలుచుండి ఉన్న సభాప్రాంగణంలోనికి పోయినాడు. శాంతిమూలమహారాజుకు సాష్టాంగపడి నమస్కరించాడు, లేచి తక్కిన మహారాజులకు నమస్కరించాడు.

“మహాప్రభూ! తాము ఆంధ్రప్రభువులైన మీరందరు ఈ పెద్దవాని మాట వినండి. నా కంఠంలో నుంచి వచ్చే మాటలు కోట్లకొలది గొంతుకలలో నుంచి వచ్చినవే. శ్రీబుద్ధదేవులు భక్తులతో ఈ జంబూద్వీపం తిరిగే కాలం ముందునుంచీ, శ్రీరామచంద్రుడు ఈ దక్షిణాపథాల సంతరించినకాలం ముందునుంచీ ఈ భూమిలో ఉన్న ముఖ్యమైనదీ పవిత్రమైనది ధర్మం ఒకటి తమతో మనవి చేసుకుంటున్నాను. దేశం ప్రజలది; ప్రజలేదేశం. ఉత్తముడు, పవిత్రజీవి, వేదవేదాంగ సంపన్నుడు ధర్మం నాలుగు పాదాలా నడపగల అతిరథుడు బ్రహ్మర్షి సమానుడైన పురుషుణ్ణి ఆద్యసభలు రాజుగా ఎన్నుకోనేవి. రాజు భూమి రక్షణార్థం, ప్రజారక్షణార్థం ధర్మపాలనార్థం, దుష్టశిక్షణార్ధం. ఆలాంటి భూమీశుడు దేశంలో ధర్మమూ శాంతీ నెలకొల్పి ప్రజలను రక్షిస్తున్నందుకు మాకు వచ్చిన రాబడిలో ఆరోభాగం ఇస్తూ ఉంటిమి, ఇన్ని యుగాలు, ఇదంతా ప్రభువులకు మనవి ఎందుకు చేస్తున్నానంటే ఈ మహావిషమ స్థితిలో దేశదేశాలప్రజలు తమ పవిత్రకర్తవ్యము ఊహించి తమ ధర్మం నిర్వర్తించడానికి శాంతిమూలమహారాజు కడకు వేంచేశారు” అని కొంత విశ్రాంతి తీసుకొనడానికా అన్నట్లు ఆగినాడు. శాంతిమూలునికి బ్రహ్మదత్తునికి తక్కిన ప్రభువులకూ ఆ శతవృద్దు చెప్పబోయే మాటలు తెలుసును. అయినా బ్రహ్మదత్తుడు ఆ వృద్దుని వంక మందహాసంతో చూస్తూ.

“తాతగారూ! తామంతా నిర్వహించబోయే ఆ ధర్మం ఏమిటి? శ్రీరామచంద్రుడు ప్రజాభిప్రాయాన్ని తలదాల్చినట్లు శ్రీ శాంతిమూల మహారాజులున్నూ తమ అభిప్రాయాన్ని పరిపాలిస్తారు” అని తలవంచి, చేతులు జోడించి ప్రజలందరివైపు తిరిగి నెమ్మదిగా తెలిపినాడు. అక్కడి పెద్దలందరూ జయజయధ్వానాలు చేసినారు. అది విని ఆ అఖండ ప్రజాసమూహం అంతా జయజయధ్వానాలు చేసింది. ఆ జయధ్వానదుంధుభి లోకాలు నిండిపోయినది -

ఆ వృద్దుడు “స్వామీ, ధనకప్రభూ! తాము సెలవిచ్చినది ఎంతయినా సమంజసము. మా హృదయం తమ అందరికి మనవి చేసుకుంటున్నాను. శాతవాహనవంశం ధర్మం నాలుగుపాదాలా నడిపిస్తూ రాజ్యం చేసింది. ఆంధ్ర విష్ణువు వంశం నేటివరకు ఒక్క మహాప్రవాహంలాగా ప్రవహించి వచ్చింది. నేటికి మా దురదృష్టంవల్ల ఆ వంశంలో ఎవ్వరూ రాజగుటకు తగినవారు కనపడలేదు. మాకు శ్రీయజ్ఞశ్రీ సార్వభౌముని తర్వాత వారి పుత్రులు వారి మనుమలు నామమాత్ర సార్వభౌములు అయినారు. దేశం నిండా కుట్రలు, ధర్మక్షతి ప్రబలినవి. ధర్మం సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా తథాగతుని సాక్షిగా శ్రీ శాంతిమూల సార్వభౌముడు ఈ జంబూద్వీపానికి చక్రవర్తి కావాలి. “జయశ్రీ శాంతిమూల సార్వభౌమా జయ! విజయీభవ!” అని ఆ వృద్ధుడు వణికిపోతూ కేక వేసినాడు. ఆ ప్రజాసమూహం ఐక్యకంఠంతో భగవంతుని వాక్కుగా జయ జయ ధ్వానాలు సలిపింది.

(2)

శాంతిమూలునికి కొమరిత మాటలు వింటూంటే ఆశ్చర్యం అంతంతకు అధికం కాజొచ్చింది. కొమరిత తెచ్చిన రహస్య వార్తలమాట అలా ఉంచి, ఆమెలో కలిగిన ఈ మార్పు, వ్యవహారం పట్ల ఆమె శ్రద్ద పరమాద్భుతమై కనిపించింది. అన్నిటియందు విజ్ఞానంతో సంచరిస్తోంది. అదీకాక ఈ బాలిక ద్వారా వచ్చిన వార్తలు అపసర్పగణ నాయకులు తెచ్చిన వార్తలకన్న స్పష్టంగాను, అధికంగాను ఉన్నాయి. “తల్లీ! నీ వార్తలన్నీ చాలా ముఖ్యాంశాలను తెలుపుతున్నాయి. వాని విషయంలో నేను తగు శ్రద్ధవహిస్తాను.”

“నాన్నగారూ! ప్రజలందరూ ముక్త కంఠంతో తాము సర్వభారతానికీ ఏకచ్ఛత్రాధిపత్యం వహించకోరుచున్నారని నలుమూలలనుండి వార్తలు వస్తున్నాయి.”

“అవును తల్లీ! రాజపదవే ముళ్ళదారి, ఇంక సార్వభౌమపదవి కత్తుల దారే!”

“అయినా ఎవరో ఒకరు ఆ కత్తులదారి శుభ్రం చేస్తూ. ధర్మం నిలబెట్టవద్దా నాన్నగారూ?”

“బుద్ధభగవానుడు రాజ్యం వదిలివేసి ఎందుకు ధర్మపథం కనుక్కోవడానికి వెళ్ళినాడు తల్లీ!”

“ఈ ప్రపంచంలోని దుఃఖాలను నాశనం చేయడానికి సన్యాసమొక్కటే మార్గం కాదుకదా? జగజ్జీవులు ప్రపంచ వాసనలు వదులుకోలేరు. వాళ్ళకోసం, ఉత్తములు ధీరోదాత్తులు రాజ్యాధిభారాలు వహించి ధర్మం నాలుగుపాదాలా నడపేందుకు సిద్ధంకావాలి అని మా దేశికులు సెలవిచ్చారు.”

“ఎవరు? అర్హతాచార్యులా?”

“కాదు నాన్నగారూ! శ్రీ బ్రహ్మదత్తప్రభువులు!”

తండ్రికడ సెలవు పొంది, ఆ సౌందర్యనిధి, అద్భుత జ్ఞానసంపన్న శాంతిశ్రీకుమారి తన అంతిపురానికి వెళ్ళి తన గురువు బ్రహ్మదత్తుడు తనకై ఎదురుచూచే విద్యామందిరం చేరుకున్నది. బ్రహ్మదత్త ప్రభువు చిరునవ్వుతో "రాజకుమారీ! రాత్రి ఎన్నిసార్లు త్రిస్థాయిలూ, త్రికాలాలూ, అభ్యాసం చేశావు?” అని పృచ్ఛచేసినాడు. “వేయిసార్లు త్రిస్థాయిలూ, త్రికాలాలూ వీణమీద అభ్యాసం చేశాను. వేయిసార్లు కంఠంతో. వేయిసార్లు రెండూకలిపి చేసాను” అని ఆనందంతో వికసించిన మోముతో పలికింది.

“అలా కృషి చేసినట్లయితే ఏలాంటి విద్య అయినా నిముషంలో కరగతమైపోతుంది, రాకుజమారీ!”

“నాకు కొన్ని అనుమానాలున్నాయి గురుదేవా! మీరు నాట్యమూ నాట్యాను బంధాలయిన సంధితాదులూ యజ్ఞయాగాది క్రతువుల కాలంలో ప్రదర్శితమయ్యే ఉత్తమ విద్యలన్నారు....”

“అవును.”

“కాని మారదేవుడు తన కొమరితలను ఆ విద్యలలో ప్రజ్ఞాపూర్ణలుగాచేసి బుద్ధదేవుని తపస్సు విఘ్నం చేయడానికి వారిని ప్రయోగించినాడుకదా?”

“నీ అనుమానం సమంజసమైనదే. నాట్యమూ, గాంధర్వమూ, శిల్పమూ ఇవన్నీ ఉపవేదాలు అనే భావం ఋషులకాలంనుంచి ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు పశుహింసాత్మకాలని మహాశ్రవణకుడు సెలవిచ్చినాడు. ఛాగాదులను కుక్కుటాదులను, మీనాదులను అనేకులు భోజనానికై ఉపయోగిస్తున్నారు. యాగాదులు చేసేటప్పుడు బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు కూడా మేకను, గుఱ్ఱమును, చివరకు నరుణ్ణికూడా యాగపశువును చేశారు.” “చిత్తం.”

“అలా యజ్ఞపశువును చెయ్యడంలో హింస ఉండదని వారి మతం”

“యాగానికి చేసినా, భుక్తికోసం చేసినా హింస హింసే అవుతుంది గాని అహింస ఎలా అవుతుంది?”

“యజ్ఞకర్తలు పశువును ప్రాపంచిక వాంఛలకు ప్రతీకగా ఎంచి, దానిని హింసిస్తారు. అంతే.”

“మీరు ఎంత చెప్పినా నా హృదయంలోని అనుమానం పోవడం లేదు,

“ఆ వాదం అలా ఉంచు, అది ఉపమానం కోసం తీసుకువచ్చాను. యాగంలోని హింస ఎటువంటిదో, కళాప్రదర్శనమూ ఆలాంటిదే.”

“విపులం చేయరూ?”

“నాట్యాదులు ఆనందంకోసం ఉద్భవించాయి."

“ఏలాగు?”

“చిన్నబిడ్డల గంతులు, ఆనందంవల్ల వచ్చాయి. ఆ గంతుల్లోనుండి నాట్యం ఆవిర్భవించింది. జగల్లీల ఒక మహాదివ్యనాట్యం. భగవంతుడే ఆ మహానటుడు. ఆనందం సుందరమైన కదలికవల్ల వ్యక్తమవుతుంది. అట్టి కదలికే నాట్య ప్రారంభం.”

“ఆనందము తుచ్ఛమూ ఉత్తమమూ కూడా కావచ్చుకదా అంది?”

“అవును. కాబట్టే మనుష్యుడు ఉత్తమానందం కోరాలి. ఉత్తమానందమే మనుష్యునికి ముక్తిమార్గము. నీచానందము అధఃపతనానికి కారణం. కాబట్టి ఉత్తమానంద రూపమైన విద్యలు ఉత్తమ విద్యలు. ఈ ఉత్తమ విద్యలను మార్గంచేసుకొని ముందుకు పోయేవాడు మోక్షం పొందగలడు. సర్వజీవితమూ ఈ ఉత్తమానంద భావంలో నింపి కర్మ ఆచరించేవాడే తపస్వి.”

(3)

“సంగీతం పాడేవారు, నాట్యం చేసేవారూ కూడా తపస్వులేనా ప్రభూ?”

“అవును శాంతిశ్రీ! రసోన్ముఖులైన స్త్రీపురుషులలో హృదయార్ధ్రత సంపూర్ణంగా ఉంటుంది. ఆర్ద్రహృదయం నిర్మలంగా ఉంటుంది. కాని మనస్సు అతి చంచలమైనది. కాబట్టి ఏమాత్రం నిగ్రహం లేకపోయినా పతనం కలుగుతుంది.”

“అలాంటి విద్యను ఉపాసించకపోవడమే ఉచితం కదా?”

“అదే తప్పుభావం. ధర్మములన్నీ ఆనందజనీతములే, సత్యము, అహింస బ్రహ్మచర్యము, యోగము ఇవన్నీ. వీని కన్నిటికి నిగ్రహం అవసరమే. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా నిముషంలో పతనం కలుగుతుంది. అందుకని అవి మానుతామా?”

“చిత్తం."

"కాబట్టి మానవ కర్మలలో ఉత్తమోత్తములైన ఈ కర్మలు చతుర్విధ పురుషార్థాలకూ ఉపయోగిస్తున్నాము.

“ఆనందమాత్ర ప్రయోజనమైన విద్యలు చతుర్విధ పురుషార్థాలకూ ఏలా ఉపయోగించగలము ప్రభూ?” “మనుష్యునికి ఆనందం ఆ అనుభవంవల్ల వస్తుంది. ఆ అనుభవం వర్తమానం కావచ్చు, వెనుకటి అనుభవం స్మృతీకావచ్చు. ఇతరుల అనుభవ సందర్శనంవల్లగాని ఇతరులు ఆనందంవల్లగాని తమలో విజృంభించే ఆనందాన్ని ఉపయోగించి లలితవిద్యను ఉద్భవింపచేస్తే వానిని దర్శించడంవల్ల ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఉత్తమరూపమైనప్పుడు అది మనలోని కల్మషాలను కడిగివేస్తుంది. మనుష్యుడు నిర్మలుడై కళాసృజనవల్ల సంగీతాది విద్యలను ఉత్తమ స్వరూపాలనుగా చేస్తాడు. ఆనంద కారణం ఉత్తమమయితే దాని ఛాయలు సంగీత, శిల్ప, కావ్యాదివిద్యలోనూ ఉంటాయి. అందువల్లనే అవి చతుర్విధ పురుషార్ధ సాధనాలు అవుతాయి.”

“మనుష్యుడు తుచ్ఛభావాత్మకంగా ఈ కళలను సృష్టిస్తే అవి ఆనంద మీయవు అంటారా గురుదేవా?”

“రాజకుమారి!దైహికమైన తృప్తిని సూచించే ఆనందం ఉత్తమానందం కాదు. అంటే మన భోజనాన్ని గూర్చిన కవిత్వం ఉత్తమంకాదు.”

మీరు చెప్పినది అవగాహన అయింది. తమకు నా పాట ఒకటి వినిపించాలని కొన్ని దినాలనుండి వాంఛిస్తూ, లజ్జచేత ఊరుకొన్నాను.”

“నీకు లజ్జ ఏమిటి రాజకుమారీ! ఏవయినా లోట్లు ఉంటే నేను పరిష్కరింప ప్రయత్నింపవచ్చుగదా?”

“వినండి,”

ఆ బాలిక మోము త్రపచే అరుణమైనది. ఆ దివ్యసుందరి మోము చూచి బ్రహ్మదత్తుని హృదయము ఆర్ధ్రతవహించి కొట్టుకోజొచ్చినది. శాంతిశ్రీ తలవంచుకొనే, అతిమధురమైన కలకంఠంతో తోడిరాగణి ఆలపించింది. తోడిరాగణీ విరహాన్ని సూచిస్తుంది. ఆ రాగిణీదేవి విపంచి మీటుతూ, తన్నను సరించే పెంపుడులేడి తన కళ్ళలోకి దీనంగా చూస్తూ ఉండగా రమణీయ ప్రదేశంలో విరహాసనాసీనయై ఉంటుంది.

“మేఘమా ఎచటికే

మెరుములీనుచు యాత్ర

విద్యుల్లతాంగి నీ

వెలుగు లెవ్వరికొరకు?”

ఆమె కంఠము రుద్ధమైపోయినది. ఆమె కన్నులవెంట రెండు అమృత బిందువులు రాలినవి.

(4)

బ్రహ్మదత్తుడు శాంతిశ్రీ వైపు చూడకుండా ఏదో గ్రంథము చూస్తున్నట్లు నటించి “లలితవిద్యలు సాధారణప్రజలకు అర్ధం కావాలా వద్దా?” అని ప్రశ్నించినాడు.

“సాధారణ ప్రజలకు అన్నీ అర్థం కాగలవా? ధర్మసూక్ష్మాల వంటివి అందరికి ఏలా అర్థం అవుతవి?” “సాధారణ ప్రజలు ఆచరణలో పెట్టలేని ధర్మాలు కొద్ధిమందికే పనికి వస్తాయి. కాబట్టి సాధారణ ప్రజలు ఆచరించవలసిన ధర్మాలు వేరు. మేధావంతులు ఆచరించవలసిన ధర్మాలు వేరూనా.”

“ధర్మాలు వేరుగా ఉండవు ప్రభూ! ధర్మం ఒక్కటే! ఆచరణలో పెట్టే విధానంలోనే తేడాలుంటాయి. అన్నం తింటే కడుపు నిండి ఆకలితీరి, బలం పట్టుతుందని అందరికీ తెలుసును. కాని అన్నతత్వం ఎటువంటిదీ, అన్నంలో ఉండే ప్రాణశక్తి ఏలా వచ్చిందీ మొదలైన విషయాలు అందరికీ తెలియకపోవచ్చు.”

“అయితే అన్నం వండడం, దానిని తినడం అందరికీ ఒకటేకాదా?”

“ఆ రెండూ అన్నం తినడంలో భాగాలే. కాని కంచంలో, ఆకులో, మట్టిమూకుడులో తినడమనే భేదాలుంటాయి.”

“కాబట్టి?”

“కాబట్టి ఉత్తమ విద్యలు సాధారణ మనుష్యులు అర్థం చేసుకోలేరు.”

“అవి ఆచరణలోనూ పెట్టలేరు.”

“వారి శక్తికి తగినట్లు ఆచరణలో పెట్టుకున్నారు కాదా ప్రభూ! పల్లెటూరి పదాలు, పల్లెటూరి ఇండ్ల అలంకరణలు. కావడి చిందు, గంగా యాత్ర మొదలైన పల్లెటూరి నాట్యాలు లేవా? అవీ అందమైనవే. వాటిలోనూ రసవత్తరఘట్టాలున్నాయి.”

“వారికి విద్య అక్కరలేదని వాదించగలవా?”

“ఏలా వాదించగలను? వారికే ముఖ్యంగా విద్య ఉండాలి. వారి కోసమే రాజ్యాలు. వారికోసమే ధర్మాలు, నీతులు. వారికోసమే గుళ్ళు, గోపురాలు, చైత్యాలు, గుహలు. వారికోసమే వైద్యం ఆచారం!”

“కాబట్టి ప్రజలే భగవంతుడని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఆ ప్రజలకోసం వివాహం ఉద్భవించింది. వివాహం అనే ఉత్తమ సంస్కారం లేకపోతే మనుష్యుడు పశువే!”

“సాధారణ మనుష్యులుకాక కొంచెం జ్ఞానవంతులైనవారు ఆ సంస్కారం మానివెయ్యవచ్చుకాదా గురుదేవా?”

“ఆ! ఎందుకు మానివేయకూడదు? కళ్ళుతెరచి అన్నీ తెలిసి నిప్పులో ఉరికే మనుష్యుణ్ణి అడ్డం పెట్టేవారున్నారా? మనస్సును దేహాన్ని వికలం కాకుండా కాపాడుకోవడం తోటే సరిపోతుంది సన్యాసంలో, ఇంక మార్గాష్టకము ఆచరణలో పెట్టేదెప్పుడు? అందుకని ఆర్షధర్మము సన్యాస ధర్మాన్ని చాలాదూరంగా ఉంచింది.”

శాంతిశ్రీ “గురుదేవా! మనం చాలాసేపు మాట్లాడినాము. ఇంక నేను సెలవు తీసుకుంటాను” అని తలవంచి నమస్కరించి ఆ బాలిక సెలవు పుచ్చుకొన్నది.”

తన గురువు ఈనాడు ఇటువంటి బోధ ఒనర్చినాడేమిటి అనుకుంటూ శాంతిశ్రీ తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. అచట పల్యంకాసనంపై మేనువాల్చి లోకాంతాలకు పరువులైతే ఆలోచనలను కూడతీసికొన ప్రయత్నించింది. ఇంతలో యశోదనాగనికా తారానికలు ఆమెకడకు వచ్చినారు. వారిరువురు ఇప్పుడు రాజకుమారికడకు రావడానికి అనుజ్ఞ వీడ అవనరం లేదు. అనుజ్ఞ ఇచ్చే వారే వారు. ఈ ఇరువురు రావడంతోనే శాంతిశ్రీకి ఏదో ఆనందం వచ్చింది. “యశోదా! ఏమిటీ వార్తలు? తారా! మీ నాయనగారు క్షేమమా?” అని వారిరువురను ప్రశ్నించింది. తారానికా, యశోదా మంచి అందాలు సేకరించుకొన్నారు. వారి మోములలో ప్రజ్ఞాకాంతులు ద్విగుణీకృతం పొందినాయి. ఆ యిరువురతో ముచ్చటలాడుచు కాలక్షేపంచేయడం శాంతిశ్రీకి అలవాటయిపోయింది.

(5)

విజయనాగుడు సార్థకనాముడు. బుద్ధదేవ సంతతారాధన తత్పరుడు. ప్రతిసంవత్సరమూ నాగార్జున సంఘారామము, విజయపుర సంఘారామాలు, ధాన్యకటక, ప్రతీపాలపుర, ఘంటకాశాల సంఘారామాలు, నాగశైల, శైలారామ సంఘారామాలు వెళ్ళి వస్తూంటాడు. తండ్రితో తల్లితో కలసి వారణాశి మృగవన సంఘారామాలు బోధిగయ మొదలయిన క్షేత్రాలు ఒక సంవత్సరము సందర్శించి వచ్చినాడు. జీమూతవాహననాగుడు ధాన్యకటక మహాచైత్యానికొక బుద్ధదేవ విగ్రహం చేయించి అర్పించినాడు.

అతని చుట్టు ఎందరో బౌద్ధులు. ఏధర్శం ఏచ్చినా మొదట పెద్దలలో వస్తుంది. వారిని అనుకరించేవారు సాధారణప్రజలు. ప్రజలు అనుసరించి భక్తితో ఆధర్మంలో పూర్తిగా స్నాతులయ్యేసరికి, పెద్దలలో కొత్తధర్మాలు వస్తూ ఉంటాయి. ఆంధ్రదేశంలో ఉన్నతవంశాల వారిలో మార్పులు వస్తున్నాయి. బౌద్దారాధన తత్పరతపోయి మళ్ళీ ఆర్షధర్మంలేచి హృదయ పీఠాలు అలంకరించింది. కాని ప్రజలలో బుద్ధారాధన ఇంకా చలింపలేదు. ప్రతిగ్రామం మధ్యా చిన్న చిన్న బుద్ధచైత్యాలున్నాయి. పెద్దగ్రామాలలో పెద్ద చైత్యాలు చిన్న సంఘారామాలు ఏర్పాటై ఉన్నాయి.

శాంతిమూలుని కాలంనాటికి ధాన్యకటకంలో మహాసంఘారామంలో ఇతర సంఘారామాలలో పదివేలకుపైన భిక్కులున్నారు. ఈ భిక్కులు దేశాలు తిరుగుతూంటారు. ఎందరో భిక్కువేషం మాత్రంవేసి సంసార సుఖాలు అనుభవిస్తున్నారు పతితులైన ఈలాంటి భిక్కుల జీవితాలవల్ల బౌద్ధధర్మం అంటే యువకులలో నిరసన బయలుదేరి వారు పెద్దలను ఆక్షేపింప నారంభించారు. నాగదత్తు డాలాంటి యువకులలో ఒకడు. అతడు పట్టణవాసి, చదువుకున్నాడు. “ఏమిటీ భిక్కుధర్మం! కాషాయవస్త్రాలు కట్టితే కామం పోతుందటయ్యా బావగారూ?” అని సంక్రాంతి పండుగకు ఇంటికి చెల్లెలితో చేరిన నాగదత్తుడు కృష్ణాతీరమైన వినయనాగుని రాళ్ళరేవుగ్రామం వెళ్ళినప్పుడన్నాడు. వినయనాగుని తన ఇంటికి తీసుకొని పోయి తన అందాల చెల్లెలిని చూపించాలని అతని తలపు. వినయనాగుడు అందమయినవాడే. అతని చదువు పల్లెటూరి చదువు; ఛాందసుడు, బౌద్ధధర్మం అంటే ప్రాణం ఇస్తాడు. ఇవన్నీ చూచి యశోద ఏమనుకుంటుందో అని అతని భయం. అయినా యశోద చిన్నతనాన్నుంచీ బందుగులయిన ఈ రెండు కుటుంబాలూ వియ్యమొంద పెద్దలు జీమూతవాహన నాగుడూ నాగదత్తుని తండ్రి నిశ్చయించుకొన్నారు. అయినా నాగదత్తుని వల్లనే వివాహమహోత్సవం ఆగింది. యశోద విజయపురం రాజకుమారి చెలికత్తెగా వెళ్ళింది. పెద్దలు ప్రేమలూ గీమలూ నమ్మరు. నాగరికులయిన చిన్నలు ప్రేమే వివాహానికి గట్టిపునాది అంటారు. నాగదత్తుడు ఈ విషయం పెద్దలతో అంతగా వాదించ దలచుకోలేదుగాని చెల్లెలినీ వినయనాగునీ యాదాలాభంగా కలుసుకొనేటట్లు చేసి చెల్లెలి హృదయం ఏలా ఉంటుందో కనుక్కోదలచు కొన్నాడు. నాగదత్తుడూ, వినయనాగుడూ రెండెడ్లబండి ఎక్కి సాలగ్రామం వచ్చినారు. వినయనాగుడు సంక్రాంతి పండుగకు సాలగ్రామంలో నాగదత్తుని ఇంటనే విందులు ఆరగించుటకు వచ్చాడు. వినయనాగుణ్ణి చూచినకొద్దీ నాగదత్తునికి ఆనందము ఇనుమడిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాకృతంలో బాగా చదువుకున్న ఆ బాలునికి ప్రకృతే గురుపీఠం వహించింది. తెలుసుకోవాలని ఉండాలి గాని, లేకపోతే బృహస్పతి పూనుకున్నా చదువు గోరుతం దూరంలోనే ఉండి పోతుంది జిజ్ఞాసకలవానికి ప్రతిరాయీ, ప్రతి ముళ్ళపొద చదువు చెప్పే గ్రంథంగా ప్రత్యక్షమవుతుంది.

వినయనాగుడు ఆలోచనాపరుడు. ఎప్పుడూ ప్రతి విషయాన్నిగూర్చి ఏదో తర్కించు కొంటూనే ఉంటాడు. కనుకనే గురువులయిన భిక్కులు అతని విద్యాపారంగతునిగా ఒనర్చి వదిలారు. ఈ విషయాలన్నీ నాగదత్తుడు గ్రహించాడు. తాను నాగరుడూ, గడుసరీ అయినా వినయనాగునితో జ్ఞానం విషయంలో వెనుకంజే!

వినయనాగుడు కొంచెం సిగ్గుపడ్డాడు మొదట. మౌనంగా కూర్చుండేవాడు. సంక్రాంతి పండుగనాడు భోజనాలయి కూర్చున్నారు. తాంబూలాలు వేసుకుంటున్నారు మగవాళ్ళంతా. సావడిలో దక్షిణభాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఆ భాగం అంతా చక్కని రత్నకంబళ్లు పరిచి ఉన్నాయి. గోడల పొడుగునా కృష్ణాముఖద్వార బృహత్పలాయన రాష్ట్రపు రంగులబొమ్మల దుప్పట్లు వేసి కుట్టినవి ఉన్నాయి. మధ్య, తాంబూలరజిత కరండాలు, లక్కపళ్ళేలు ఉన్నవి. పల్లవభోగాన్నుంచి వచ్చిన వెన్నలాంటి రాతిసున్నపు డబ్బీలు ఉన్నవి.

అందరు తాంబూలాలు వేసుకున్నారు. ఇంకా ఆకులు కావాలేమోనని నాగదత్తుడు చెల్లెలు యశోదను ఇంకా మరి రెండు నాగులేటి తమలపాకు బొత్తులు తెమ్మని పిలిచాడు. యశోదా తారానికలు భోజనానికి పోబోతున్నారు. అన్నగారి మాటలు విని, యశోద ఏమీ ఆలోచించుకోకుండానే తమలపాకుల కట్టలు రెండు పట్టుకువచ్చి అక్కడ పళ్ళెంలో పెట్టింది. ఆమె వినయనాగుని, వినయనాగుడు ఆమెను ఒక్క క్షణికం చూచుకున్నారు. యశోదకు మోము లజ్జారుణితమైపోయింది. వినయనాగుని మోము ఎరుపెక్కింది మొదటిచూపులోనే వారిరువురకూ ప్రణయజ్వరం ఆవహించలేదు. కాని వారిరువురూ ఒకరినొకరు ఏదో గౌరవంతో చూచుకొన్నారు.

యశోదతో నాగదత్తుడు వినయనాగుణ్ణి పొగడుతూ మాట్లాడాడు. అది యశోదకు ఓ విధంగా నచ్చినది. ఎంత రాచనగళ్ళలో నివసించనా హృదయంలో యశోద పల్లెటూరి పిల్ల! సంక్రాంతి రోజులలో బంతిపూలు పొలం నుండి పుణుకుకొని వచ్చి తలలో తురుముకొనుట ఆ బాలికకు ఇష్టము. చెరువులలో నీలి కలవలంటే ప్రాణం యశోదకు. అడవి మొల్లలు, తంగేటిపూవులు, జపాకుసుమాలు, మొగలిపూలు తానూ పొదలలోనికి ఎగబడి తీసుకొని అలంకరించుకొనేది చిన్నతనంలో. ఆ నీలికలువలు గుబాళించినవి నేడు.... వినయనాగుని చూపులలో అతని స్నిగ్ధసౌందర్యంలో కృష్ణా జలాలలోతు యశోద హృదయంలో ప్రతిఫలించింది.

(6)

వినయనాగుడు పండుగ అనంతరం తాను వెళ్ళిపోవ సంసిద్ధుడైనాడు. కాని నాగదత్తుడూ, అతని తండ్రీ కదలడానికి వీలులేదని పట్టుబట్టారు. తారానిక వినయనాగుని “అన్నగారూ! మీరు ఇంకా నాలుగు రోజులపాటు ఇక్కడ ఉండండి. నా ఉద్యోగం ఇక్ష్వాకు రాజకుమారికడ. వారంతా ధాన్యకటకంలో ఉన్నారు. అయినా వారి అనుమతిమీద మేము ఇంతదూరం వచ్చాము, అని ప్రార్ధించింది” వినయనాగుడు మెత్తబడినాడు.

ఆమె హృదయాంతరంలో ఒక ఆలోచన ఉంది. ఇంతవరకూ యశోదా వినయులు విడిగా కలుసుకోలేదు. వారిని మాయచేసి ఒకచోట కలపాలి. అప్పుడు ఇద్దరూ. ఒకరిమీద ఒకరికి ఉద్భవించి పెరుగుతూన్న ప్రేమను వ్యక్తం చేసుకునేటట్లు చేయాలని నిశ్చయించు కొన్నది. తనకూ నాగదత్తునికీ వివాహం కావడానికి ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయి? ముఖ్యమైంది రాజకుమారీ బ్రహ్మదత్తుల అనుజ్ఞ కావలసి ఉన్నది. ఉన్న పరిస్థితులపై తానుగాని, తన ప్రియుడుగాని రాజకుమారినీ, ధనకప్రభువునూ అనుజ్ఞలు వేయడానికి వీలులేకపోతున్నది. తారానిక రాజకుమారికడ ఉన్నప్పుడు నాగదత్తుడు ఆమెను కలుసుకొన కూడదు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ నాగదత్తుడు కలుసుకొనవచ్చును.

విజయపురంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి మాత్రము తండ్రిగారి ఇంటికిపోయి చూడవచ్చును. కృష్ణచతుర్దశి, అమావాస్య, శుక్లపాడ్యమి, శుక్ల చతుర్దశి, పూర్ణిమ, కృష్ణపాడ్యమి-ఈ దినములు వారికి పని విడుపు. తారానికా యశోదలు పూర్ణిమ దినాలు మూడూ ఉపయోగించు కొనేవారు. ఆ మూడు దినాలు నాగదత్తుడు తారానిక యింటివద్దకు వచ్చేవాడు. ఆ మూడుదినాలు వారు మువ్వురు తోటలలోనికిపోయి వంటలు చేసుకొని, భుజించి, కృష్ణానదిలో విహారానికిపోయి, వర్షం కురుస్తూ ఉంటే ఇంటికడనే కూర్చుండి చదరంగమాడుకొని, పాటలు పాడుకొని ఉప్పొంగిపోయేవారు. నాగదత్తుడు రసికుడు, తారానిక ఆనందపూర్ణ, వారిరువురకు ప్రణయశ్రుతి యశోద, నాగదత్తుడు -

“వన్నె చిన్నె పిన్నదాన చిన్నారి వయసుదాన

నన్ను చూచినవ్వవే పొన్నపూల సొబగుదాన

మల్లె మొగ్గ పన్ను దాన

నల్లకల్వ కనులదాన

మేలమాడి పోవకేవన్నె చిన్నె

చుక్కమినుకు ఒడలిదాన

అక్కున ఒదుగురూపుదాన

మక్కువలనుచూపవే జిక్కవలజంటదాన”వన్నె చిన్నె

అని పాడినాడు. ఆమె తిప్పుకుంటూ నడచి వచ్చి,

“తగదోయీ, తగదోయీ ఒగలమారి చిన్నవాడ

నగిపోరా విన్న కన్న నలుగురు ఊరూవాడా?

సెగలు పొగలు చిమ్ముకుంటు

రగిలే చూపులకోపులు

మగవారల ఆగడాలు

పగటివేళ కాగడాలు”తగదోయీ

అతని ధూర్తత నివారించింది. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తనలో తాను మురిసిపోతూ తారానిక కుట్ర ప్రారంభించింది. వినయనాగుడు మెత్తబడి సరేనన్నాడు. వినయనాగుడు ఆగిపోయినాడని యశోదకు తెలిసి సిగ్గూ పడింది, ఆనందమూ చెందింది. తారానికతో “వదినా! మనం ధాన్యకటకం త్వరగా పోవద్దా?” అన్నది. “త్వరగానే వెళ్ళాలి. ఈ రోజు కనుము, రేపు ముక్కనుము ఆ తర్వాత మామయ్యగారు మంచిరోజు చూచి పంపుతారు” అన్నది.

(7)

కనుమునాడు బాలికలందరూ కలిసి సౌందర్యపారమితను పూజించడానికి, బళ్ళు కట్టుకొని కృష్ణ ఒడ్డున "రాళ్ళరేవు"కు తెల్ల వారగట్లనే బయలుదేరినారు. నదీతీరపు ఊళ్ళ నుంచి ఈ పూజకు బాలికలు కృష్ణ ఒడ్డుకు వస్తారు. సెలయేళ్ళకు, నదులకు, చెరువులకు బాలికలు తెల్లవారగట్లనే చేరి స్నానాలుచేసి, చక్కని ఉడుపులు ధరించి, తలలు దువ్వుకొని, కేశసౌభాగ్యం వివిధ రూపాలుగా అలంకరించుకొని నగలు ధరించి పూవులు పత్రాలు ధరించి, పళ్ళను నైవేద్యంగా పట్టుకు వెళ్లుతారు. చుట్టుప్రక్కల అశ్వద్ద వృక్షం ఉంటేసరి. లేకపోతే అశ్వద్ధశాఖను కృష్ణ ఒడ్డునే పాతి చుట్టూ అలికి ముగ్గులు పెట్టి పూజలు చేస్తారు. షోడశోపచారాలు సలిపి, చుట్టూ పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. రాళ్ల రేవుకుపోయి కృష్ణలో స్నానం చేసి యశోదా తారానికల ఇతర బాలికలు పూజలు పూర్తిచేసి, పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు.

“సౌందర్యదేవతా!

అంద వే మాపూజ

మాబ్రతుకులోచేరు

మధురమగు అందాలు

సౌందర్యదేవతా!

సౌందర్యదేవతా

మందారపూవలై నందనోద్యానమై

అమ్లాన సుమములై

అలరు మాబ్రదుకులు

సౌందర్యదేవతా!

సౌందర్యదేవతా

మారూపు వెన్నెలై మాసొబగు తారలై

అమృతకలశము ప్రేమ

ఆనందమై బ్రతుకు

సౌందర్యదేవతా!

సౌందర్యదేవతా

జలజలా ప్రవహించు

సెలయేరు మావిద్య
కలలోని పురుషుడే

నిలుచు మా ఎదుట నే

సౌందర్యదేవతా!”

అని పాడినారు. కంకణాల గలగలలు తాళమై కాళ్ళ మంజీరాల గజ్జెల చప్పుడు మృదంగనాదమై వారి నాట్యానికి హంగు చేసినవి.

ఇంతలో ఒక చిన్న బాలుడు యశోదకొంగులాగి “అత్తా నిన్ను తొందరగా... ఎవరికో జబ్బుచేసిందట.... రమ్మన్నారు” అని చెప్పినాడు. యశోద చకితయై కళవళపడుచు గబగబ ఆ బాలుని వెంట పరుగిడి, నులివెచ్చ ఉదయపు టెండలో పోయినది. ఆతడు ఒక మామిడి తోపులోనికి యశోదను తీసుకువెళ్ళి అక్కడ ఆమెకు కనబడకుండా మాయమైనాడు. యశోద “విజయా! విజయా! ఏడమ్మావాడు? ఈ తోటలోనికివచ్చి ఎక్కడ మాయమయ్యాడు?” అని కేకవేస్తూ ఉండగా అక్కడకు వినయనాగుడు పరుగున వచ్చి “ఏలా ఉంది కాలు నీకు” అంటూ రోజుకుంటూ అడిగినాడు.

“నాకు కాలు ఏలా ఉండడమేమిటి?” అని యశోద భయపడుతూ, సిగ్గుపడుతూ అన్నది.

“నువ్వు పడడం కాలు విరగడం?”

“నేను పడలేదే!”

నేను నమ్మను! నవ్వు నన్ను చూచి సిగ్గుపడుతున్నావు!” అంటూ వినయనాగుడు వంగి ఆమె ముందు మోకరించి “ఎక్కడ కాలు దెబ్బతిన్నది?” అని ప్రశ్నించినాడు.

“నాకు దెబ్బతగులలేదండీ!” అంటూ యశోద పరుగెత్తింది. ఆ అందమైన రూపంతో ఆ ఉదయకాలంలో ఆ బాలిక లేడిలా పరుగెత్తుతూ ఉంటే వినయనాగుడు తెల్లబోయి ఒక్కనిముషం నిలుచుండి తనకోసం ఆ బాలిక వంకబెట్టి అన్న కొమరుని పంపినదని ఊహించుకొని, ఆనందంతో మోము వికసించగా “ఆగు! నీ కాలు విరగడం నిజం! నిజం!” అంటూ వేగంగా పరుగెత్తి యశోదను అందుకొని పువ్వున చేతుల్లోకి ఎత్తుకుని.... “కాలు ఎక్కడ విరిగిందో చూపు దొంగా?” అన్నాడు.

మాయచేసి వినయనాగుడు తన్ను రప్పించుకొన్నాడని యశోద ఆనంద పూర్ణమైకూడా, మాయచేసినందుకు కొంచెం అంటే కొంచమే కోపం తెప్పించుకొని, “మీరే దొంగలు, మా అన్నయ్యగారి చిన్నబ్బాయిని ఎవరికో జబ్బు చేసిందని చెప్పమని పంపి నన్నిక్కడకు రప్పిస్తారా? ఎవరయినా చూస్తే ఏమనుకుంటారు?” అని మొగం తిప్పుకుంది. అతడు ఆమెను క్రిందికి దింపకుండా “నేనా దొంగను?” అన్నాడు. “మీరే!” “కాదు నువ్వే!” ఇద్దరూ పకపక నవ్వుకొన్నారు. ఇదంతా తారానిక నాగదత్తులు వేసిన ఎత్తు అని ఇద్దరూ అనుకొన్నారు. ఈ అదను దొరికిన దేలాగు దొరికింది అని అంతత్రపాపూర్ణ హృదయంగల వినయనాగుడు యశోదను ఒక గున్నమామిడి నీడలోనికి తీసుకొనిపోయి కూర్చుండబెట్టెను. ఆమె ప్రక్కనే అతడధివసించి,

“యశోదా! నేను వట్టిపల్లెటూరివాణ్ణి” అన్నాడు.

“నేనూ అంతే!”

“నువ్వు రాజకుమారికకు చెలికత్తెవు.”

“ఎవరైనా వివాహంకాగానే....” ఆమె సిగ్గుతో కళవిళపడి మందహాసంచేసి తల వాల్చుకుంది. అతడూ నవ్వుతూ “అవును యశోదా! పెళ్ళి అయిన వెనుక అత్తవారింటికి పంపిస్తారన్నమాట నిశ్చయమే. అయితే నువ్వు ఎంత చిన్నతనంనుంచో పట్టణవాసంలో రాచనగళ్ళలో పెరిగిన దానవూ, నువ్వు బాగా చదువుకొన్నావూ, నాగరికతలో మునిగి తేలినదానవు నేను పల్లెటూరి మొరకుమానిసిని నేను నీ కలవపూవు చేతిని ఆశించడం ఆకాశంలోని చంద్రుని కోరటమే!” అని మనవి చేసుకొన్నాడు.

“నేను పల్లెటూరిదాన్ని, మీరు బాగా చదువుకున్నవారు. మీ బోటులు ఎక్కడ ఉన్నా జ్ఞానవంతులే!”

“ఇంతకూ....?”

“మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం.”

“మీ అన్నయ్య మనసారా మన దాంపత్యం కోరుతున్నాడు.”

“అయితే మా అన్నయ్య ఇష్టమే!”

ఎంత సిగ్గుతో కుంగిపోయేవారికైనా ప్రేమ విషయం వచ్చే సమయానికి ఎక్కడి సిగ్గు అక్కడే మాయమౌతుంది. వినయనాగుడు “యశోదా, నేను కృష్ణ ఒడ్డున కూర్చుండి ఆ నీలపులోతులో నీ కళ్ళు చూచేవాడిని!” అని ఆమె వంక తమితోకూడిన చూపులతో చూస్తూ అన్నాడు. యశోద తలవంచి గడ్డి మొక్కలు పీకుతున్నది.

“మా పొలాలగట్ల వసంత ప్రారంభంలో వికసించే మోదుగ పూలల్లో నీ పెదవులు దర్శించాను!”

ఆ బాలిక దీర్ఘవినీల పక్ష్మాల నెత్తి వినయనాగుని చూచి చిరునవ్వు నవ్వుకొని కన్నుల మూసికొన్నది. ఒకసారి తన ప్రియురాలిని ఎత్తుకొని హృదయాని కదుముకొన వినయనాగునికి ధైర్యమూ రసికతా... వానాకాలం నాటి సెలయేళ్ళలా... ఎందుకు పొంగదూ!

“యశోదా! నువ్వు మా రాళ్లరేవుగ్రామంలో ఎలా కాపరం చేయగలవు?”

“కృష్ణాతీరం అద్భుతం, రాళ్లరేవు అందమైన గ్రామం!”

వినయనాగుడు ఒక్కసారిగా యశోదను హృదయానకు హత్తుకొన్నాడు. ఆమె మోమెత్తి ఇటుచూచి, అటుచూచి, మొదట సిగ్గుపడుతూ, ఆ వెనుక ధైర్యంతో ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకొన్నాడు. యశోద చేతులూ ఆప్రయత్నంగా ఆ యువకుని మెడచుట్టూ చుట్టివేశాయి. ఇంతట్లో వీరిద్దరూ కూర్చున్న గున్నమామిడి వెనక కొంతదూరంలో “పక పక”మని నవ్వు వినబడింది. చటుక్కున ఇద్దరూ లేచి ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోయినారు. యశోద గున్నమామిడి నీడనుంచి తుర్రున పిట్టలా ఎగిరి పోయింది.

వినయనాగుడు ఎంత చూచినా ఎవ్వరూ కనబడలేదు. అయ్యయ్యో మంచి రసకందాయపు పట్టులో విఘ్నేశ్వరుడు చూచినాడురా అనుకుంటూ, అయినా నయమే. తనవారి కళ్ళపడితే తన్నేమి అనుకుంటారో అనుకుంటూ హృదయం పూలపాటలు పాడుతూండగా తోటపైకి వచ్చి, కృష్ణ ఒడ్డునే కట్టివేసి ఉన్న బళ్ళ దగ్గరకు వెళ్లినాడు. ఆ బళ్లు తోలుకు వచ్చిన వారిలో నాగదత్తుడు కూర్చుండి వంటలు చేయిస్తున్నాడు. అడపిల్లలందరూ వంటపనులలో గడబిడలు చేస్తున్నారు.

అందరూ వంటకు సిద్ధం. అందరూ కూరలు తరిగేవారే! అందరూ బియ్యం కడిగేవారే. ఒకరికొకరు అడ్డం. నాగదత్తుడు వాళ్ల అల్లరి హంగామా చూచి, “అందరూ వంటకు సిద్ధమయితే మాకు ఈ పూట భోజనం వచ్చిందన్నమాటే!” అన్నాడు తారానిక అందుకుని “మీకు భోజనం లేదులెండి” అన్నది.

ఎక్కడనుంచి వచ్చిందో యశోద “మా అన్నయ్యకు ఇప్పుడే వండిపెట్టనంటున్నావు! పెళ్లయితే వరస ఉపోషాలు కాబోలు” అంది.

“ఆ! నువ్వు మీ ఆయనకు నిత్య వనసంతర్పణలు గున్నమామిడి క్రింద వండిపెడిదువుగానిలే!” అంది.

యశోద చూచిందిరా బుద్ధదేవుడా అని తెల్లబోయి వెలి మందహాసంతో నవ్వుకుంది. వినయనాగుడు తనకేసి చిరునవ్వుతో తారానికా నాగదత్తులు చూడడం గమనించాడు.

“గున్నమామిడి చెట్టుక్రింద చిన్నదీ

నన్ను మేలమాడి తియ్యంగ నవ్వినాదీ!”

అని పాడినాడు వినయనాగుడు ఏమైతే అయిందని తెగించి. అందరూ గొల్లు మన్నారు.

(8)

ఆ రాత్రి నాగదత్తుడూ, అతని తండ్రీ, వినయనాగుడూ, నాగదత్తుని అన్నగారూ అందరూ కూర్చుండి మాట్లాకుంటున్నారు.

వినయనాగుడు: సంపూర్ణవిద్యావంతులూ, అతిరథులూ అయినా మహారాజుకు నాగదత్తుడు ఆంతరంగికుడయ్యాడు. నేను పల్లెటూరివాడను మామగారూ.

గ్రామాణి (నాగదత్తుని తండ్రి): అవునయ్యా ఎవరు ఈ మహారాజులు, భూమీశులు, భూపతులూను? నువ్వూ భూమీశుడవూ భూపతివే ! అయితే నీకూ భూమికీ సర్వకాల సంబంధం, మహారాజుకూ భూమికీ నీ వ్యాజాన సంబంధం!

వినయ: వారి చదువు?

గ్రామాణి: మహారాజులకు కాకుండా చదువుకున్న వారు వేలకొలది లేరా? గ్రామాణి: నీ బలమూ, నా బలమూ మనబోటి ఇతరుల బలమూ కలిసి అతిరథత్వం అవుతుంది. నాగదత్తుడు ధనకమహారాజుకు ఆంతరంగికుడు కావడమంటే ఇంతే.

మినయ: మీ మాటలు పరమాశ్చర్యకరంగా ఉన్నవి.

గ్రామాణి: ఆశ్చర్యం ఏమిటి వినయా! మీనాన్నా నేనూ ఈ చుట్టు ప్రక్కల గ్రామాలలో పెద్దల పంచాయితీలలో సభ్యులం. మాకు తెలియదా? రాజు ప్రజాబలానికి చిహ్నం, ప్రజాధర్మానికి సేవకుడు.

వినయ: వారు ప్రతిభావంతులూ ప్రతాపవంతులూను.

గ్రామాణి: ప్రతిభేకాదు, వారిజన్నే పూర్వజన్మ సుకృతం. యజ్ఞం చేసే మహర్ని ఉద్ధండ పండితుడు కావచ్చు. కాని ఆయన యజ్ఞం చేయడానికి ఋత్విజూలూ, బ్రహ్మాకావాలి. అలాగే రాజ్యపాలనచేసే రాజుకు మనమందరం బలమూ, శక్తీ ఇస్తాము.

నాగదత్తుడు: అయితే నాన్నా! బ్రహ్మదత్తప్రభువు ఉత్తమ విద్యావంతుడైన బ్రాహ్మణుడు.

గ్రామాణి: కారని అన్నానురా, ఆయన దేశానికి రాజయి చదువుకోకుండా ఉంటే ధర్మపరుడెలా అవుతాడు? రేపు నువ్వు ప్రభువైనా అంతే. చదువు ఎక్కకపోతే గద్దె ఎక్కటం మానాలి.

'ప్రజాకంఠం మహారాజు కంఠం' అని వినయనాగుడు అనుకున్నాడు. ప్రజాబలమే మహారాజుశక్తి “మనం ఈ కాలపువాళ్లము. భవిష్యత్తు ఎల్లా ఉంటుందో బావగారూ!” అన్నాడు వినయనాగుడు నాగదత్తునితో.

“ఉత్తమభావాలు మనస్సులో ఉంచుకొని జీవితం సాగించేవారికి ఎప్పుడూ భయంలేదు బావగారూ!”

“ఎక్కడిదీ వేదాంతం బావా!”

“మా ధనకమహారాజు మహాపండితుడు, మహాకవి, వేదాంతి. ఆయన జీవితం తలచుకుంటే ఏ రామచంద్రప్రభువో జ్ఞాపకం వస్తాడు.”

“బుద్ధధర్మం యావత్తూ మరచిపోయాడు బావా!”

“శ్రీరామచంద్రుడు ఆంధ్రదైవం అంటారు మాప్రభువులు బ్రహ్మదత్తులవారు.”

“బుద్ధదేవుడు శ్రీరామచంద్రుని వంశమేనట కాదూ?”

“అవును. మనకూ ఇక్ష్వాకులకూ సంబంధం ఉంది, ఆ వంశంవారు ఇక మనకు చక్రవర్తులు కావాలి బావగారూ!”

“మీ ఆలోచన చాలా బాగుంది. 'శ్రీ శాంతిమూల మహాప్రభువును చక్రవర్తిగా ఉండుడు' అని ప్రార్థిస్తూ ప్రజలు అందరూ ఐక్యకంఠంతో కోరినారు. మహారాజు ఏమీ మాట్లాడరు.”

“శాంతిమూల సార్వభౌములకు రాజ్యక్షాంక్ష లేదు. ఎవరు చెప్పినా ఎవరు ప్రార్ధించినా వారిలో ఉన్న అనుమానం వీడటంలేదు.”

వినయనాగుడూ యశోదా తారానిక పుణ్యమా అని అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. యశోద వినయనాగుని హృదయానికి మత్తు ఎక్కిస్తోంది. ఋష్యశృంగుడైనామనస్సు హరించగల మానిని వస్తే-వెన్నలా కరిగిపోతాడు. వినయనాగుడు భోజనంచేసి గదిలో కూర్చుండి వినయపీఠికం చదువు కుంటున్నాడు. పదిక్షణికాలు మంచముపై మేనువాల్చి నిదురకూరినాడు. లేచి మోము కడుగుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి పరీమళముల లందుకొని, తల దువ్వుకొని, చీనాంబరము తలకు జుట్టుకొని మంజీర కంకణ కేయూరహారమేఖలాది భూషలు ధరించి, తిలకం తీర్చి నాగదత్తునితో కలిసి పొలం వెడదామని గదిలోనుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ సమయంలో యశోదలోనికి వచ్చి “మీకేదో కావాలన్నారట, తారానిక పంపింది” అని తలవాల్చికొని తెలిపింది. అతడు ఆనందహృదయంతో,

“అవును వావాలి!"

“ఏమి కావాలి?”

“నువ్వే కావాలి!”

“నేనా! అమ్మో! ఇది కుట్రా!”

“ఉండు ఉండు వెళ్ళిపోకు! నిజంగా పని ఉంది. కాసిని మంచి నీళ్ళు కావాలి యశోదా!”

“వట్టినీళ్ళేందుకు. ఉపహారం పట్టుకువస్తాను వెళ్ళి!”

“త్వరగా!”

“ఏమంత త్వర?”

“షుడియలు ఘడియలు నిన్ను ఒదలి ఒంటిగా ఉండనా?”


★ ★ ★