అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 24
ప్రకరణము ౨౪ - అబ్దుల్‌రజాక్‌లారీ బ్రదుకుట
ఆనాఁ డట్లుపడిపోయిన అబ్దుల్‌రజాక్‌లారీని మరల కొందఱు రుహుల్లాఖాను కడకు కొనిపోయిరి. లెక్కలేని గాయములతో ఒడలు తెలియక లారీ పడియుండెను. షాఫ్‌షికౝఖాౝ ఆతనిని చూచి “ఆహా! ఆ పొగరుపోతు, పాపిలారీ! వీని తలకాయను తత్క్షణమేకొట్టి, పాదుషాకు చూపి, కోటదర్వాజాకు తగిలింపవలెను” అనెను. రుహుల్లాఖాౝ అడ్డుపడెను. ‘ఈవిధముగా ప్రాణముపోవునట్టి స్థితిలో నున్నను ఈతఁడు గొప్పవాఁడు. ఇట్టివాని తలను పాదుషాఆజ్ఞలేక కొట్టుట ఔదార్యముకాదు’ అని అతనివిషయము పాదుషాకు పోయి చెప్పెను. పాదుషా ఆతని ఆయద్భుత వీరవిహారమును స్వామిభక్తిని విని ఆతని గాయములను మాన్పుటకు ఇరువురు వైద్యులను నియమించెను. వారిలోనొకఁడు పాశ్చాత్యుఁడు, రెండవవాఁడు మహమ్మదీయుఁడు. వారిని ప్రతిదినము లారీయొక్క స్థితిని తనకు తెలుపుఁడని పాదుషా ఆజ్ఞాపించెను; “తానాషాకు అదృష్టముండి, రజాక్‌వంటి స్వామిభక్తిపరాయణుఁడు మఱి యొకఁడుండిన యెడల ఈకోటను పట్టుటకు మనకు ఇంకను చాలకాలము పట్టియుండును” అని ఆశ్చర్యపడెను. వైద్యులు రజాకును పరీక్షించి ఆతని శరీరమందు మొత్తము డెబ్బదిగాయములనియు గాయములమీఁద పడిన గాయములకు లెక్కలేదనియు చెప్పిరి. ఒకకన్ను పూర్తిగా పోయినను రెండవది గట్టిగానుండెను. ఆతఁడు బ్రతుకుట మాత్రము దైవాధీన మనిరి. పదమూఁడుదినములు వైద్యు లుపచరింపఁగా రజాక్ కన్నుతెఱచి ‘తానాషా’యని పలవరించెను. ఆతర్వాత నాతనికి నెమ్మదించునని వైద్యులకు ధైర్యమువచ్చినది. రజాకునకు స్పృహవచ్చినదని పాదుషాకు తెలియఁగానే ఆతఁడు రజాకునకిట్లు వ్రాసెను. “నిన్ను మేము క్షమించితిమి. నీ పెద్దకుమారుఁడు అబ్దుల్‌ఖాదర్‌ను, ఇంకను కొలువు చేయఁగల వారిని మాకడకు పంపుము. వారందఱును తమతండ్రి కొఱకును తమ కొఱకును మాక్షమను ప్రార్థించిన వారికి మర్యాదలిచ్చి ఉన్నతోద్యోగముల నీయగలము.”
ఈవిధముగా పాదుషా చెప్పిపంపఁగా రజాకు మర్యాదార్థము పాదుషాకు వందనములు చెప్పెనుగాని ఇట్లనెను “ఇంతవఱకు నాప్రాణములు పోక నేను బ్రతికియుండుట నిజమేకాని ఈప్రస్తుతదురవస్థలో నేను బ్రతికి పాదుషావారికి బానిస నగుదుననుట మాత్రము కల్ల. దయామయుఁడగు భగవంతుఁడు నాకు సంపూర్ణారోగ్యము నిచ్చి నాజీవితమును పొడిగించినను సర్వవిధముల చితికిపోయిన నేను ఇఁకను నౌకరీ చేయఁగలనను నమ్మకము మాత్రము లేదు. ఒకవేళ చేయఁగలిగినను అబుల్‌హసౝ తానాషాచేత వృద్ధికి తేఁబడినవాఁడు అలంఘీరు పాదుషాకు పాదాక్రాంతుఁడై నౌకరి చేయఁడని మాత్రము దృఢముగా నమ్ముఁడు” పాదుషాకు ఈవాక్యములు వ్యథ కలిగించెను. కాని కొంతకుకొంత ధార్మికుఁడుగాన రజాకునకు త్వరలో ఆరోగ్యము చేకూర్పుఁడని వైద్యులను హెచ్చరించెను. రజాక్‌యొక్క ఆస్తిలో కొల్లపోఁగా మిగిలిన దాని నంతయు నాతని కిప్పించెను. ఆతఁడు సంపూర్ణారోగ్యమునందినంతనే ఓదార్చి పాదుషాకడకు తెమ్మని హైదరాబాదు సుబేదారుని కుత్తరువాయెను. సుబేదారాతని చేతికి సంకిళ్లు తగిలించి కొనిపొమ్మనెను గాని ఖాౝబహదూర్ ఫిరోజ్‌జంగు అడ్డుపడి ఆయవమానమును నిలిపి తనకడ కొన్నిదినము లుంచుకొని నామకార్థమైనను పాదుషాకొలువును ఒప్పుకొమ్మనెను. రజాకు పాదుషాను దర్శించుటకు మాత్రమొప్పుకొనెను. పాదుషా రజాకును చాలగౌరవించెను.
పాదుషా ― అబ్దుల్‌రజాక్‌సాహెబ్, మీరు చాల గొప్పవారు. ఇంత స్వామిభక్తి, సాహసము, మత గౌరవమును చూపినవారిని మేము ఎక్కడను చూడలేదు. మీకు ఏమి కావలెనో కోరుఁడు, మేము చేయఁగలము.
రజాక్ ― భగవంతుని దయవలన నాకు చావు ఒకటే మిగిలియున్నది. ఇఁక నేమియు నక్కఱలేదు.
పాదుషా ― పోయినదేవెూ పోయినదిగదా. మాతరఫున ఈగోలకొండలో నవాబుగా నుండుఁడు. రజాక్ ― అల్లా! అల్లా! మహాత్ముఁడు తానాషా. ఆయన ఉప్పుతిన్న ఎటువంటి పాపికూడ ఆపని చేయఁడు. అబ్దుల్‌రజాక్‌లారీ చేయనే చేయఁడు.
పాదుషా ― మాకడ సేనాపతిగా నుండుఁడు సాహేబ్.
రజాక్ ― తానాషాసుల్తాౝబహద్దర్ నౌకరి చేసినవాఁడు ముసల్మాౝ ఐనయెడల మఱియొకనికి నౌకరిచేయఁడు జహాపనా.
చుట్టునుండినవారు, అందును గోలకొండనుండి వచ్చిన ద్రోహులు హడలిపోయిరి. పాదుషా ఆశ్చర్యపడెను. తమకు నౌకరి ఇష్టము కాకపోయిన తమకొమారులకు ఇవ్వనిండు’
రజాక్ ― వా రెట్లు పోయిన నాకేమి. బుద్ధిమంతులైనచో వృద్ధికి రాఁగలరు. వారికిని నాకును ఏమి ఇలాఖా?
పాదుషా కేమియు తోఁపక ఇట్లనెను ― ‘అచ్ఛా! అచ్ఛా! తమవంటివారు ఈగోలకొండలో ఇంకొక రుండియుండిన మేము కోటను పట్టియుండఁజాలము. తాము చాల గొప్పవారు. తమ యిష్టమేమి?’
రజాక్ దుఃఖము పట్టలేక ఇట్లనెను. “జహాపనా, నాకు ఇఁకనేమి ఇష్టముండును. మాసుల్తాౝ బంది. మావజీర్లు అక్కన్నమాదన్నలు తమ ద్రోహమువలన ఖూనీ చేయఁబడినారు. మాకోట చెడిపోయినది. ఎక్కడ చూచినను ద్రోహులు కనఁబడుచున్నారు. నాముసలి ప్రాణము ఈశ్మశానమును చూచుచు ఇఁకను ఉండదు. దేవుఁడు దయఁదలచిన తానాషాకే నౌకరి చేసెదను. లేకపోయిన మెల్లగా బయలుదేరి మ క్కాకు పోయెదను; ప్రభూ మక్కాకు పోయెదను. మక్కా, మక్కా.” అని పలుకుచునే దుఃఖాతి రేకమున వెడలిపోయెను. పాదుషా ఆజ్ఞచే ఎవరును ఆతని నడ్డగింపలేదు. రజాక్ మక్కా చేరలేదు. పర్షియాదేశమునకు పోయి అచ్చట తనజన్మస్థలమగు ‘లార్’ లో కొన్ని దినములుండి తర్వాత మక్కాకు పోవుచు దారిలో చనిపోయెను.