అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 23

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౨౩ - తానాషా కడపటివిందు

కోటయంతయు గందరగోళింపసాగెను. వెంటనే తానాషాకు ఈవార్త అందినది. తత్క్షణమే సుల్తాను కోటలోను అంతఃపురమందును ఏడ్చుచున్న స్త్రీలను పరివారమును ఓదార్చి వారికడ సెలవు తీసికొనసాగెను. తర్వాత ఆస్థానమునకు వచ్చి తన సింహాసనముమీఁద కూర్చుండెను. ఆవాహన లేని అతిథు లకై ఎదురుచూచు వానివలె దర్పముతో నుండెను. భోజన సమయమైనంతట త్వరగా అన్నపానముల కాజ్ఞాపించెను. ఇంతలోపల రుహుల్లాఖాౝ ముక్తారుఖానులు ఇద్దరుసర్దారులతోను కొందఱు గొప్పవారితోను వచ్చి తానాషాను చూచిరి. ఆ క్లిష్టపరిస్థితిలో కూడ ఆస్థానభోగమును వీడక సింహసనము మీఁదనుండిన యాప్రభువును చూచినంతనే వారిధైర్యము తగ్గెను. ఆతనితేజమే వారిని కొట్టున ట్లుండెను. ఇంకకొంత సేపటికి ఖైదుసేయఁబడువానివలె నాతఁ డుండలేదు. ఆచింత యే లేనివానివలె నుండెను. మొగలాయీ సర్దారులు ఆతనికి సలాములు చేసిరి. అతఁడు వారికి తనరాచఠీవి యంతయు కనఁబడునట్లు బదులు సలాముచేసెసు. వారినందఱను ప్రత్యేకముగా హెచ్చరించుకొని మర్యాదచేసి గంభీరముగ స్వాగతము పలికెను.

ఇంతలో నొక సేవకుఁడు వచ్చి తానాషాకు భోజనము సిద్ధమైయున్నదని విన్నవించెను. వెంటనే సుల్తాను తనకు భోజనమునకు వేళయైనదని వారితోచెప్పి వారినికూడ తనతో విందారగింప పిలిచెను. కొందఱు దుర్జనులు తానాషాను అటనుండి పోనీయరాదని పలికిరి. కాని మొగలాయీసర్దారులు ఆలోచించి ఇట్లుచేయుటలో తప్పులేదనితలంచి ఒప్పుకొనిరి. ముక్తార్ ఖానును మఱియొకఁడును తానాషాతో భోజనమునకు కూర్చుండిరి. రుహుల్లాఖాను ఆశ్చర్యపడి ‘ఇది భోజనానికి సమయమా’? అని యడిగెను. తానాషా ఆతనిహృదయమును గ్రహించి వెంటనే ఇట్లు జవాబిచ్చెను. ‘అవును, ఇదే భోజనానికి సమయము’ రుహుల్లాఖా ననెను. ‘అది నాకుతెలియును. ఇటువంటిసందర్భమున తమ కెట్లురుచించును?’

తానాషా గంభీరముగ నిట్లు బదులిడెను. ‘మీరు సాధారణజనులను మనస్సులో నుంచుకొని మాటలాడుచున్నారు. నాకు భగవంతునియందు సంపూర్ణవిశ్వాసము కలదు. ఆయన దయామయుఁడు, మహనీయుఁడు, ఈప్రపంచము నంతటిని సృజించి ధనికులు దరిద్రులు అను భేదములేక కాపాడువాఁడు. తన కృపాకటాక్షమును తనసేవకుడైన తానాషామీఁదినుండి ఎంతమాత్రము మరల్పఁడు. నాపితామహ మాతామహు లిరువురును తమజీవితకాలము నంతటిని ఐశ్వర్యములో గడపినారు. కాని నేను కొంతకాలము దారిద్ర్య మనుభవింపవలయునని భగవంతుని ఆజ్ఞ కాఁబోలు గడపినాను. మరల ఆమహామహుఁడు ఈ దీనునిమీఁద కనికరించి సకలైశ్వర్యములను ఇచ్చినాఁడు. నాకు ఆయన కుదిర్చినసన్నివేశములచేత ఒకగంటలో రాజనైతిని. నేను సుల్తానగుదునని ఎవరును తలంపలేదు. నేనుకూడ! భగవంతుని యనుగ్రహమువలన నాహృదయమున కోర్కెలేవియులేవు. లక్షలు దానమిచ్చితిని, కోట్లు ఖర్చుచేసితిని, ఇప్పుడు రాజ్యాధిపత్యమును భగవంతుఁడు నాకడనుండి లాగివేయఁ జూచుచున్నాఁడు. నేనేమైన నపరాధ మొనర్చితినేమో! దేవుఁడు ఈమాత్రము దయచూపుచున్నందులకు నేను కృతజ్ఞత చూపవలసినదేగాని చింతింపవలసినవాఁడనుగాను. నా కాలము ముగిసినవెంటనే ఈ రాజ్యాధికారమును ఆస్తికుఁడైన అలంఘీరుపాదుషాచేత ఉంచుచున్న భగవంతునికి వందనము లాచరించుచున్నాను. ఇదంతయు దైవచిత్రము! రండు భోజనమునకు.”

భోజనానంతరము తానాషా తనగుఱ్ఱమున కాజ్ఞాపించెను. శరీరమున విశేషవస్తువు లేవియు ధరింపక మెడలోనొక ముత్యాలహారమును మాత్రము ధరించి మొగలాయీ సర్దారులతో బయలుదేరెను. ఆతఁడు ముందుపోవుచుండఁగా వారు ఆతనివెనుక వచ్చుచుండిరి. ఆదృశ్యము చంద్రుని చుట్టు ప్రభ గుడికట్టిన ట్లుండెను. ఆమహనీయుఁడు పెండ్లినాఁడు కూడ ఇంత నెమ్మదిగా నడచియుండఁడు. ఆతని మొగమున నెట్టి భావమును లేదు, శాంతి తాండవించుచుండెను. పాదుషా పుత్రుఁడు మహమ్మద్ ఆజాం కోటకు బయట నొక గుడారమున నుండెను. తానాషా వచ్చుచున్నాఁడని సేవకులువచ్చి చెప్పఁగానే లేచి గుడారము వాకిట నిలిచి ఎదురుచూచు చుండెను. తానాషావచ్చి గుఱ్ఱముదిగి ఆజామునకు తనమెడలోని హారమునువేసి బహుమానించెను. రాజకుమారుఁడు దానిని గ్రహించి తానాషాను కౌఁగలించుకొని చాలదయతో ఓదార్పు పలికి పాదుషా కడకు కొనిపోయెను. ఎల్లవారిని క్షమించునట్టి ఔదార్యమును ప్రకటించుచు పాదుషా తానాషాను చాల మర్యాదతో చూచి ఆతఁడు తనసభలోనికి తన సర్దారులవలె వచ్చి నిలిచి యుండవలసిన యక్కఱ లేదనియు స్వేచ్ఛగా నుండవచ్చుననియు పలికి గౌరవించెను. రుహుల్లాఖాౝ మొదలైనవారు తమకు దొరకినంత ధనము సేకరించుకొనిరి. బంగారము, నగలు, వెదకి స్వాధీనము చేసికొనసాగిరి. గోలకొండలోని ధనికులయొక్కయు సర్దారుల యొక్కయు వస్తువిశేషములను సోదావేయించుటకు మనుష్యుల నేర్పాటుచేసిరి. ఈదోపిడి యైన తర్వాత మొగలాయీసర్దారులు అపహరించినది పోఁగా పాదుషావారి ఖజానాకు చెల్లించినదిమాత్రము ఎంతవిలువ యనఁగా ఆఱుకోటుల ఎనుబదియైదు లక్షల హొన్నులు, రెండుకోటుల ఏబదిమూఁడువేల రూపాయలు, నూటపదునైదుకోటుల పదమూఁడులక్షల దమ్ములు. ఇవిగాక బంగారు వెండి పాత్రలు, నగిషీవస్తువులు ఎన్నియో! హైదరాబాదును పాదుషా దార్ – ఉల్ – జిహాద్ (మతమునకై పోరాడిన స్థలము) అని పేర్కొనెను. హైదరాబాదును పాలించుటకు ఏర్పాటులుచేసి 1689 సం॥ జనవరినెల పాదుషా గోలకొండను వదలి బీదరువైపు బయలుదేరెను. తానాషాను తనతోకూడ పాదుషా జాఫరాబాదు వఱకు కొనిపోయి అచటికి చేరఁగానే దౌలతాబాదు కోటకు పంపెను. ఆతనికి ఏకొఱఁతయులేక జరుపవలసినదని ఆజ్ఞాపించెను.

మొగలాయీరాయబారి సాదత్‌ఖాను తానాషా పంపిన నగలను పాదుషాకు చేర్పలేదు. తానాషాతో నాతఁడు చెప్పినదంతయు నబద్ధము. ఇప్పు డానగలను పాదుషాకిచ్చుటకు ధైర్యములేక పాదుషావారి ముసద్దీలను గ్రహింపుఁడని కోరెసు. వారు భయపడి మెల్లగా పాదుషాకు తెలిపి ఆతని యాజ్ఞచే గ్రహించిరి. సాదత్‌ఖానునకు తానాషాపై నభిమాన ముండెను గాని ఆతఁ డేమియు చేయలేకపోయెను.