అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గా. అచ్ఛా, అచ్ఛా. అట్లయిన మనము సుల్తానువారి దర్శనమునకే ముందుపోదము. దండోరా జమాదార్, నీవు ముందుగా పోయి సుల్తానువారికి మా సలాములు చెప్పి, ‘పాదుషావారు పంపిన జాబు చదువఁగల గుమాస్తాలు, ఇరువురు బ్రాహ్మణయువకులు ఓరుగంటి నుండి వచ్చియున్నారు. మా కొలువులో నున్నారు. వారిని మేమే సుల్తానువారి దర్శనమునకు తెచ్చుచున్నాము’ అని మనవి చేయుము. మేము, ఇదుగో ఇప్పడే వచ్చుచున్నాము.”

వెంటనే ఊరంతయు పుఖారేర్పడెను. చాల నేర్పరులైన గుమాస్తాలు ముజఫరుసాహేబువద్ద చేరియున్నారని అందఱును చెప్పుకొనసాగిరి. కబురందఁగానే సుల్తాను వెంటనే ఆయువకులను తోడితెమ్మని పరుగుబంట్రౌతును పంపెను. ఇఁక తప్పదని అక్కన్నమాదన్నలను వెంటబెట్టుకొని ముజఫరు దర్బారునకు పోయెను.


ప్రకరణము ౨ - తానాషా దర్బారు

గోలకొండ గొప్పపర్వతదుర్గము. కొండకు క్రింద మొదటి దర్వాజాకడనుండు తిన్నెలకడ దాదాఁపు తొంబది లేక వంద యడుగుల యెత్తు గోడలవిూఁద గండభేరుండపక్షులు చిత్రితములై యున్నవి. నేఁడును యాత్రికులు చూడవచ్చును. దర్వాజాకు ఆనుకొనియుండు తిన్నెలపై కూర్చుండి మాటలాడిన యెడల ఆశబ్దము పైకిపోయి కొన్నినిముసములు ప్రతిధ్వనించుచుండును. సింహద్వారము దాఁటగానే కొండ యడివారము మొదట మఱియొక దర్వాజా కలదు. దానికి ముందు పెద్దమంటపము; అందు కిటికీలులేవు గాని లోన వెలుతురు కలదు. అటనుండి మెట్లెక్కి పోవలయును. ఆకొండ యంతయు దుర్గాకృతిని రహస్యగృహముల చేతను వానికి వలసిన నీటి సదుపాయముల చేతను అమర్పఁబడి నేటికిని చూపరుల కాశ్చర్యము కలిగించుచున్నది. ఏచోటినుండి ఏ చోటికి పోవుటకు ఎచ్చటెచ్చట రహస్యమార్గము కలదో కొలఁది రక్షకులకు మాత్రమే తెలియును. నాలుగైదు అంతస్థులు దాఁటిన యనంతరము తానీషామందిరము కొండ నెత్తమున నున్నది. అచ్చట స్థలము కొంతవిశాలము. ఆమందిరమున నడుమ పెద్ద కొలువు మంటపమును, దాని కిరువైపుల రెండు గదులు, దీని కెక్కుటకు ముందు భాగమున రెండువైపుల ఎదురెదురుగా పదిమెట్లు మంటపమధ్యభాగమున కలసి సింహాసనమున కెదురుగానుండును. దీనికిపైన మరియొక మంటపము, దానికిపైన ఇరుకుమెట్లచే పోదగినది బోడిమేడ. అచ్చట మెట్లకుపైన నొక యెత్తునివేశమును దానిపై సుల్తాను కూర్చుండుటకుస్థలమును ఏర్పరుపఁబడియున్నవి, అచ్చట సుల్తాను కూర్పుండినయెడల గోలకోండ దుర్గమంతయు నాతనికి కనఁబడుటయే గాక చుట్టువైపుల పదిమైళ్ల దూరము వఱకు కనఁబడును. ఆ దృశ్యము చూచుటకు నేడే ఎంతో ఆనందకరముగా నుండఁగా నాఁడు సజీవమై యుండినప్పడు చూచినవారిదే భాగ్యము. నాఁడు తానాషాసుల్తాను మొదటి మంటపముననే దర్బారు తీరియుండెను. అవిూరులు, వజీరులు, ఉమ్రాలు, ఫౌజుదార్లు, వారివారి పరివారము, తెలుఁగుదొరలు, జోదులు, విదేశీయులు, ఎల్లవారును వారివారి స్థలములలో కూర్చుండియు నిలువఁబడియు నుండిరి, సిపాయీలు దర్వాజాలకడ విచ్చు కత్తులతోను ఈఁటెలతోను జాగరూకులై, వచ్చుచు పోవుచు నున్నవారిని నిదానించి చూచుచుండిరి. దర్బారులో సుల్తాను ప్రక్క మొగలాయీపాదుషా ఔరంగజేబు పంపిన రాయబారి కూర్చుండి యుండెను.

మొగలాయి రాయబారి ఇట్లు మాటలాడు చుండెను. - 'తానాషాసుల్తాన్‌బహద్దరుగారు, మా యేలినవారు ఔరంగజేబు అలంఘీరు పాదుషావారు మమ్ము గోలకొండకు పంపి కొన్ని నెల లైనవి గదా. మేము తెచ్చినజాబును ఇప్పటికి ఎవరును చదువలేదు గదా. దర్బారులోనే లేనప్పుడు దూరపు పరగణాలలోను గ్రామములలోను ఎవరుండఁగలరు ? మాకు సెల విప్పించిన మేము మరలి పోయి పాదుషావారికి ఈవిషయమును నివేదింపఁగలము - గోలకొండలో ఇట్టి జాబులు చదువఁగలవారు గాని వ్రాయఁగలవారు గాని లేరని.'

తానాషా – (ప్రశాంతముగా) రాయబారిభాయిగారు, తొందరపడ వలదు. మాదేశము పెద్దది. చాల దూరము వ్యాపించి యున్నది. అందువలన చక్కని ముసద్దీలను దూర ములలోనుండువారిని కనిపట్టుటకు కాలము పట్టుచున్నది. దొరకకపోరు; మేధావులున్నారు.

సభలో సుల్తానునకు చెంతనేయుండిన యొక ముసలి వజీరు అబ్దుల్ రజాక్ లారీ యనునతఁడు ఇట్లనెను, ‘సుల్తాన్బహద్దర్, మనకు కొంత నెమ్మది కావలెను. మనయీ యాంధ్రదేశము, సుల్తానువారు సెలవిచ్చినట్లుగా, చాల విస్తీర్ణమైనది. శ్రీకాకుళము మొదలు పుదుచ్చేరి వఱకు మూల మూలలకు, అన్ని ఠాణాలకు, మనుష్యులు పోయియున్నారు. తెలంగాణములో నిత్యము దండోరా వేయుచున్నాము. ఈదేశములో హిందువులు మహమ్మదీయులు అందఱును బుద్ధిమంతులు. ఎవరో దొరకక పోరు.'

ఇట్లు వీరు మాటలాడుచుండఁగానే పహరాజవాను వచ్చి మోకాళ్లమీఁద నిలిచి ఖుర్నీషుసలాములు చేసి, ముజఫరునేనాపతిగారును వారితో ఆజాబును చదువగల వారిగుమాస్తాలును వచ్చియున్నారని నివేదించును. సుల్తానువారి యుత్తరు వై నంతనే ప్రభువు కొలువునకు, ముజఫరుముందు నడచు చుండ ఆయాంధ్రయువకులు వెంటనంటి పోయిరి. కొలువు కూటము చేరి నంతనే అందఱ చూపులును ఆయువకుల విూఁదనే పడినవి. వీరేదో యాశ్చర్యకరమైన పని చేయఁబోవుచున్నారని సభ్యులును పరివారమును తలంచుచుండిరి.

ఆయువకుల వేషము చాల వినీతముగా నుండెను, - దోవతియు, పొడుగుచొక్కాయయు పైన సన్నని యంగవస్త్ర మును నెత్తిన తిలక్ టోపీవంటి టోపియు, మొగమున గీరు నామములును, వారు దూరమునుండియే మోకాళ్లపై నిల్చి సుల్తానునకు సలాములు చేసిరి. ముజఫరు సలాము చేసి, 'జగద్రక్షకా, వీరే ఆతెలంగీ పంతుళ్లు ' అని విన్నవించెను. సుల్తానునకు వారినిచూడఁగనే ఏదో చెప్పరాని యానంద మేర్పడినట్లండెను; వారిని చెంతకు పిలిచెను. చూపులోనే భావము గ్రహించిన ఆసోదరులు సింహాసనము చెంతకు పోయి నిలిచిరి. మరల సలాములు చేసి వినమ్రులై నిలువఁబడిరి,

తానాషాసుల్తాను వారిని నిదానించి చూచి ఇట్లనెను-'మీసామర్ధ్యమును గుఱించి మేము ఇప్పడే విన్నాము. ఇంత చదివినవారు మాదర్బారులో ఉండవలెను, మంచిది. ఎవరురా, ఆ ఇనయత్ నామా తెండి.' అని పాదుషా పంపిన జాబును తెమ్మనెను. ఇంతలో "తానాషావారిని ‘విూ పేరేమి?' అని యడిగెసు,

యువకులు – మహాప్రభూ,క్షమింపవలెను, మాహిందువుల యాచారము, ఎవరును తమపేరు తామే చెప్పుకొనరాదు.

తానాషా - సెభాష్. అది మీసంప్రదాయము.

ముజఫరు - ఈయన అక్కన్న పంతులుగారు, ఈయన మాదన్న పంతులుగారు,

తానాషా – అచ్ఛా చాలసంతోషము, అన్నదమ్ములు ఒక్కపోలికగా ఉన్నారు.  అక్కన్న – మహాప్రభువులవారి యనుగ్రహము కలుగుట భగవంతుని యనుగ్రహము కలుగుటయే. ఏలినవారి దర్శనమైన సంతోషములో మాకు నోట మాటలుకూడ సరిగ వచ్చుట లేదు ప్రభూ.

మాదన్న - జగద్రక్షకా, తమయనుగ్రహము క్షలిగిన నేఁడే మాజన్మమునకు మంచిరోజు. ఏలినవారికి ప్రియముగా నౌకరిచేసి మా రక్తమాంసములు గోలకొండకును ఈయాంధ్ర సామ్రాజ్యమునకును ధారపోయుటకు సిద్ధముగా నున్నాము. ఏదినము ఆట్టి సందర్భముకలుగునో నాఁడే మాజన్మము పావనము అగును. మావలన పనిగొనుము మహాప్రభూ.'

అబ్దుల్‌రజాక్‌లారీ - అచ్ఛా, ఆచ్ఛా. చక్కఁగా చెప్పినారు మాచన్నపంతులుగారు. ఈగోలకొండకు విూరు రక్తమాంసములు ధారపోయుదురేని మేము మాప్రాణమును శరీరమును ఆర్పింపఁగలము. ఆల్లాకటాక్షము చక్కఁగా నుండునెడల ఇటువంటిరాజభక్తియు దేశభక్తియు గల రాజ్యమును ఆ రావణాసురుఁడు కూడ పట్టలేఁడు. విూ వంటివారు మాకు అవశ్యముగా న్నేహితులుగా నుండవలెను,

తానాషా - అచ్ఛా, అచ్ఛా. మనకు ఆందఱును న్నేహితులే. అందఱును అన్నలును తమ్ములును. మాదికూడ సామాన్యస్త్రాణమే. భగవంతుని వేడుక కొఱకు మేము ఇచ్చట సంహాసనముపై నున్నాము. ఈప్రపంచమంతయు ఒక ఆశ్చర్యము, సందేహము, మోసము, తమాషా, గమ్మత్తు. మన మెందులకు పుట్టితిమో, ఏమి కానున్నామో, ఎక్కడికిపోఁగలవెూ, ఎప్పడుపోఁగలమో, ఎట్లుపోఁగలమో, ప్రాణమేమి, ఆత్మయేమి - ఏమియు తెలియదు. ఇదంతయు తెలిసినట్లు కొందఅు అభినయము చేయుచుందురు. అదియొక టక్కు, అందుచేత మనము ప్రాణముతోనుండు నీనాలుగు దినములును సంతోషముగా నుందము. 'భాయి భాయి’గా సోదరస్నేహము నెఱపు కొందము. ఎవరికిని కష్టముండరాదు, సాధ్యమైనయెడల నలువురకు ఉపకారము చేయుదము. ఎవరికాలము వచ్చినప్పడు వాఁరు పోఁగలరు, మీఋషులు చెప్పనది అదే. మాసూఫీల వేదాంతమును అదే.

అక్కన్నమాదన్నలు ఆశ్చర్యపడిరి. 'తాము గొప్ప వేదాంతి మహాప్రభూ' అని పలికిరి. ఈసంభాషణయంతయు ముజఫరునకు అతని తోడివజీరును మహల్దారు ఉద్యోగియు నైన మూసాఖానునకును ప్రియముగా నుండలేదు. వారు, 'నౌకరు లింకను ఆ ఇనయత్‌నామూను తేలేదే' యని వేదనపడు చుండిరి. పాదుషావారి రాయబారి, తానాషా వాక్యములలో ఔరంగజేబుపై దూషణ ఏమైనను ధ్వనించుచున్నదా యని ఆలోచించుచుండెను. ఇంతలో నౌకరులు ఆజాబును తెచ్చిరి. ముజఫరు దాని నందుకొని సుల్తానుముందు నిలువఁబడెను.

తానాషా - దయచేసి చదువుఁడు

మాదన్న ఆ తెల్లని కాగితమును గ్రహించి, 'మహాప్రభూ ఇందలి విషయములు చాల రహస్యములు. తమకు మాత్రమే తెలియవలెను.' అనెను. తానాషా – అచ్ఛా, అటులైన మా'కులయత్ ఖానా' కు పోదము.' అని లేచెసు, కులయత్ ఖానా యనఁగా నాంతరంగిక గృహము. సుల్తాను అక్కన్నమాదన్నలు అంగరక్షకులును మాత్రమే మేడమీఁదికి పోయిరి. ముజఫరునకు నెత్తిన పిడుగు పడినట్లు ఆయెను. తన గుమాస్తాలేమి సుల్తానుతో అంతరంగిక గృహమున ముచ్చటించుటయేమి! ఈయువకులకు జరుగు ఈమర్యాదయంతయు నాతనికి కనుకుట్టుగా నుండెను. తనకుకూడ వెంటపోవలయునని కోరిక యున్నదిగాని సుల్తాను యొక్క ఆజ్ఞ లేనిదే పోరాదు. ఈయా వేగమునకు కారణము మున్ముందు తెలియును.

కులయత్ ఖానాలో ప్రవేశించిన వెంటనే మాదన్న 'జగత్ప్రభూ తమకొక వేడుక చూపెదము' అని, నౌకరును చూచి 'ఒక గళాసునీరు' అనెను. నీరు రాఁగా" ఆ కాగితముపై చల్లెను, వెంటనే నల్లనియక్షరములు కనఁబడసాగినవి,

తానాషా _ ఏమి యాశ్చర్యము! అక్షరములున్నవి, కనఁబడుచున్నవి.

మాదన్న - వట్టి క్షేమసమాచారము. ప్రభూ ఇది తెల్లసిరావ్రాఁత, అందుచేత తెలియలేదు. దీని రహస్యము మాతండ్రిగారు మాకు చిన్నప్పడే బోధించినారు. ఆలంఘిరు పాదుషా దీనిని పంపుటలో గోలకొండ దర్బారులో ఎటు వంటివా రున్నారని పరీక్షించు నట్లున్నది. మహాప్రభూ మన రాష్ట్రమునకు వారివలన ఉపద్రవము ఎన్నటికైన తప్పదు, బిజా పూరుమీఁద మొగలాయీలు బలముగ యుధ్ధసన్నాహములు చేయుచున్నారు. బిజాపూరు పడిపోయిన మనవంతు తప్పదు. చాల జాగ్రత్త వహింపవలయును.

తానాషా - ఔను. విూమాట నిజమే. ఔరంగజేబు మనయాంధ్రదేశమును మ్రింగవలయునని యున్నాఁడు. మా సర్దారులు బుద్ధిలేక తమలో తాము జగడ మాడుచున్నారు. కానిండు ఆలోచింతము.

మాదన్న – మహాప్రభువు గారితో పదిమాటలేల? మేము తమ చిత్తమునకువచ్చునట్టి నౌకరులము.

తానాషా – అచ్ఛా. అదే మాకు కావలెను. ముందు ఆలోచింతము. ఇప్పుడు ఈజాబునకు బదులుజాబు తయారు చేయుఁడు.

మాదన్న వెంటనే తన చొక్కా జేబునుండి ఏదోపొడి తీసి నీటిలోరంగరించి ఆసిరాతో మఱియొక కాగితముపై వ్రాసి పాదుషాకు జవాబు తయారుచేసి సుల్తానునకు చూపెను. తానాషా సంతోషించి దర్బారులోనికి వచ్చెను. అక్కన్న మాదన్నలు పరమానందభరితులై ఒకరినొకరు చూపులతో మాత్రమే హెచ్చరించుకొనుచు సుల్తానువెంట దర్బారులోనికి పోయిరి.

మొగలాయి రాయబారిని చూచి, తానాషా - 'రాయబారిభాయి ఇదుగో తమకు జవాబు. విూరు దీనిని పాదుషా వారికి అందఁజేయుఁడు' అనెను,  సభలో నందఱు ఆశ్చర్యపడుచుండిరి. అక్కన్నమాదన్నలు సుల్తానునెదుట నిలువఁబడియే యుండిరి. తానాషా వెంటనే వారికి 'వసారత్‌' (అంతరంగిక కార్యదర్శి) అను నుద్యోగము నిచ్చి చాల గౌరవించెను. వారిని తెచ్చినందులకు ముజఫరుఖానునకును మర్యాదచేసెను.ప్రకరణము 3 - తానాషా పూర్వచరిత్ర


ఎవరీ యక్కన్న మాదన్నలు? వీరే సామ్రాజ్యాధి నాయకులై కొంతకాలము గోలకొండను పరిపాలించిన సుప్ర సిద్ధాంధ్రమంత్రులు అక్కన్నమాదన్నలు.*[1] వరంగల్లుఫర్గణాలో పింగళి భానూజీపంతులు ఒకానొక అమీలుక్రింద సుంకాధికారి. ఈయన భార్య భాగ్యమ్మ ఈదంపతుల భాగ్యముగా వారికి నలువురు కుమారులు జనించిరి. – అక్కన్న, మాదన్న, విశ్వనాథుడు, మృత్యంజయుఁడు నని. తండ్రియే కుమారులకు చదువు చెప్పెను. సకాలమున వివాహములంజేసి గృహస్థులనుగా నొనర్చెను. ఉత్సాహవంతులైన పెద్ద కుమారు లిరువురును ఒక శుభముహూర్తమున తండ్రియాజ్ఞనంది తమ పురోహితుని వెంటనిడుకొని రాజకీయోద్యోగములకై గోలకొండకు వచ్చి ముజఫరుఖానుకడ గుమాస్తాలుగా ప్రవేశించిరి.

  1. *వీరు కొందఱు తలంచినటు మహారాష్ట్రులుకారు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులలో వీరవైష్ణవులైనవారు గోలకొండ వ్యాపారులు. వీరి బంధుపరంపర నేటికిని ఆంధ్రదేశములో నున్నారు.