Jump to content

అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 1

వికీసోర్స్ నుండి

అక్కన్న మాదన్నల చరిత్ర

ప్రకరణము ౧ - దండోరా

“హిందువుగాని మహమ్మదీయుఁడుగాని, ఎవఁడైనను ఈ కాగితమును చదివి ఇందులోని విషయమును విశదీకరించు వానికి అబుల్‌హసౝ తానాషాసుల్తాౝబహద్దరువారు గొప్ప యుద్యోగమిచ్చి చాలగౌరవము చేయఁగలరు. ఎవరైనను చదువఁగలిగినవారు వచ్చి చదువవచ్చును.” అని గోలకొండ పట్టణము వీథులలో నొకదినము దండోరా వినవచ్చుచుండెను. వెట్టివాఁడొకఁడు డప్పువాయించు చుండఁగా, తెల్లని, అక్షరములు కనఁబడని, కాగితమును చూపుచు నతనివెంట రాజభటులును వారితో నొక యుద్యోగస్థుఁడును పోవుచుండిరి. ఆ కాగితమును చూచి అదేదోహాస్యమని కొందఱు నవ్వుచుండిరి. కొందఱు అందేమో వాస్తవముగా విశేషము కలదని చూచుచుండిరి. వీథులలో నిదియొక వేడుకగానుండెను.

ఈతెల్లని కాగితము ఔరంగజేబుపాదుషా గోలకొండ సుల్తానునకుపంపిన ‘ఇనయత్‌నామా’ అనఁగా కుశలప్రశ్నలు వేయుజాబు. పాదుషాయెుక్క రాయబారి అంతకు మూఁడు నెలలక్రింద దానినితెచ్చి గోలకొండసుల్తానైన తానీషా (తానాషా) గారికిచ్చి జవాబుకోరియుండెను. అది అక్షరములు లేని తెల్లని కాగితము. ఐనను చదువుఁడని తానాషా తన వజీ ర్లను ఉద్యోగులను అందఱను అడిగెను. ఎవరును చదువలేక పోయిరి. కాని అది వట్టి కాగితగమని ఎవరును సాహసించి చెప్పలేకపోయిరి. దర్బారులో నెవరును చదువలేక పోఁగా సుల్తాను ఊరిలో నెవరైన చదువఁగలరా విచారింపుమని కొత్వాలును నియమించెను. ఎవరును కనఁబడలేదు. తుదకు ఇంటింటి కడను డప్పువాయించుచు చౌబుదారులనఁబడు బంట్రౌతులు గోలకొండలోని పండ్రెండు పెద్దవీథులలో తుడుము కొట్టసాగిరి. మూఁడు నెలలుగా తాసా వాయించుచుండినను ఎవరును ముందునకు రాలేదు. వాడుక ప్రకారము వారు ప్రతిదినమును వాయించుచునే యుండిరి. అదియే నాటి దండోరా.

దండోరా ఒక గొప్ప భవనము కడకువచ్చి నిలిచినది. ఆయింటి యజమాని సయ్యదుముజఫరు అను నేనాపతి. దండోరా వినఁగానే ఆయింటినుండి యొకఁడు ఆ చౌబుదారుల నాయకుని లోపలికి పిలిచెను. నాయకుని జమాదారని అందురు. జమాదారు లోన వరాండాలో ప్రవేశింపఁగానే అచ్చటి తిన్నెల మీఁద కూర్చుండి లెక్కలు వ్రాయుచుండిన ఇరువురు బ్రాహ్మణ యువకులు నౌకరుమూలముగా నాకాగితమును అందుకొనిరి. ఒకరుమార్చి ఒకరు దానిని చూచి తమలో తామేదోచెప్పుకొని వెంటనే తమయజమానుని కడకు పోయిరి.

యువకులు ― సలాం దివాౝబహద్దర్‌గారికి. ఈ కాగితమును మేము చదువఁగలము వారి యజమాని ముజఫరుసేనాపతి ఆశ్చర్యపడెను. ‘మూఁడు నెలల నుండియు ఈజాబును ఎవరును ఈ గోలకొండలో చదువలేక వీరు దండోరా వాయించుచు తిరుగుచున్నారు గదా, మీరు ఇంత చిన్నవారుగా నున్నారు, నిన్న గాక మొన్న నౌకరిలో చేరినారు, అప్పడే ఇటువంటి జాబు చదువఁగలమని చెప్పచున్నారు, అటువంటి జ్ఞానమున్నదా మీకు, ఆశ్చర్యముగా నున్నదే!’ అని.

యువకులు ― సాహేబ్, తమ యనుగ్రహ ముండిన ఇంకను ఎన్నేనియు చేయఁగలము. నియోగులము. మాది ఓరుగల్లు. మాతండ్రిగారు మాకు ఎన్నియో విద్యలు నేర్పినారు. మామాతృభాషలగు సంస్కృతాంధ్రములే గాక అరబ్బీ ఫారసీభాషలను నానావిధములైన లిపులను నేర్పినారు. మన భారతదేశములో ఒక్కొక్కరును నాలుగైదు భాషలు నేర్చుకొన్నగాని రాజకీయోద్యోగములు దొరకవుగదా. తర్వాత, దర్బారులో ఎవరికిని సాధ్యముగాని లెక్కలన్నియు మేము తయారు చేయఁగలము. ఎటువంటి అసాధ్యమైన రాచకార్యమైనను తమవంటి ప్రభువులు దయదలఁచిన క్షణములో సాధింపగలము.

ముజఫరు ― అచ్ఛా, చాలసంతోషము. మీరు తెలుఁగువారు, నియోగులు. చాల బుద్ధిమంతులు. విూకు ఇంతటి సామర్థ్యము తల్లికడుపు నుండియే వచ్చును కాఁబోలు. మంచిది మఱి ఆజాబు చదువుఁడు, వినోదము చూతము. యువకులు ― ఇది చాల రహస్యమైన విషయము. సుల్తానువారి సన్నిధిలో చదువఁదగినది.

సేనాపతికి ఈజవాబు కొంత యతృప్తిని కలిగించినది. అతఁడొక క్షణము ఆలోచించి ‘అటులైన మనము రేపు సుల్తానువారి దర్శనమునకు పోదము. ఈ దినము మనకు ఇచ్చట తొందరపని యున్నది గదా’ అని యనెను.

ఆ యువకులకు ముజఫరు మాటలలో ఏదో సందేహము తోఁచినది. వారు ఒకరి నొకరు చూచుకొనిరి. ఆచూపులలోనే వారి యభిప్రాయము ‘ఈ మహానుభావుఁడేదో అడ్డుదారి తీయుచున్నాఁడే! ఈతని కప్పుడే మనమీఁద అసూయ జనించినది.’ అనున ట్లుండెను. ఆ యువకులు పైయెత్తు ఎత్తిరి. ‘సర్దారు చిత్తము. మరి దండోరావారు ఈ విషయము సుల్తానువారికి నివేదించిన వా రేమనుకొందురోగదా? అని దండోరా జమాదారును కనుగీటెను.

జమాదారు ― సర్దార్ సాహేబ్, సుల్తానువారి పనికన్న మనకు వేఱుపని యేమి ముఖ్యము. సుల్తానువారికి ఈ సంతోషవార్త మొదట నివేదించి తర్వాత మనపని చూచుకొనుట మంచిది. ఈ యాలస్యమునకు వారు సహింపలేరు సాహేబ్.

ముజఫరు ఆలోచించెను―‘ఈజమాదారు వదలఁడు. ఈ తెలుఁగు యువకులు అసాధ్యులుగా నున్నారు. ఏమిగతి? కానీ చూతము గాక,’ అని, వారితో నిట్లనెను ― “ఓహో! ఆలా గా. అచ్ఛా, అచ్ఛా. అట్లయిన మనము సుల్తానువారి దర్శనమునకే ముందుపోదము. దండోరా జమాదార్, నీవు ముందుగా పోయి సుల్తానువారికి మా సలాములు చెప్పి, ‘పాదుషావారు పంపిన జాబు చదువఁగల గుమాస్తాలు, ఇరువురు బ్రాహ్మణయువకులు ఓరుగంటి నుండి వచ్చియున్నారు. మా కొలువులో నున్నారు. వారిని మేమే సుల్తానువారి దర్శనమునకు తెచ్చుచున్నాము’ అని మనవి చేయుము. మేము, ఇదుగో ఇప్పడే వచ్చుచున్నాము.”

వెంటనే ఊరంతయు పుఖారేర్పడెను. చాల నేర్పరులైన గుమాస్తాలు ముజఫరుసాహేబువద్ద చేరియున్నారని అందఱును చెప్పుకొనసాగిరి. కబురందఁగానే సుల్తాను వెంటనే ఆయువకులను తోడితెమ్మని పరుగుబంట్రౌతును పంపెను. ఇఁక తప్పదని అక్కన్నమాదన్నలను వెంటబెట్టుకొని ముజఫరు దర్బారునకు పోయెను.